గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2023, గురువారం

కవయిత్రి శ్రీమతి కటకం విజయలక్ష్మీవేంకటరామశర్మ కృత శ్రీ సూక్త పద్యానువాదము పై నా అభిప్రాయము.

 ఓం శ్రీమాత్రే నమః.

శ్రీ సూక్త పద్యానువాదము

కవయిత్రి శ్రీమతి కటకం విజయలక్ష్మీవేంకటరామశర్మ.

శా.  శ్రీమన్మంగళభావనాభరితమౌ శ్రీసూక్తమాంధ్రమ్మునన్

క్షేమంబున్ గననెంచుచున్ విజయలక్ష్మీ మాత చే పట్టె తా

శ్రీమాతృకృపఁజేసి వ్రాయుటకునై,  సిద్ధించెనాకోర్కె,  యీ

స్త్రీమూర్తిన్ శుభసంహతుల్ వడయుతన్, శ్రీమాత దీవించుతన్.

     శ్రీమాత అనుగ్రహ ఫలముగా బ్రహ్మశ్రీ కటకం వేంకటరామశర్మ మహోదయుల అర్థాంగలక్ష్మి శ్రీమతి విజయలక్ష్మీ మాతకు శ్రీసూక్తమున కాంధ్రపద్యానువాదము చేయవలెనను తలంపు కలుగుట లోకకల్యాణకారణమయినది. వైదికవాఙ్మయమున ప్రసిద్ధమయిన శ్రీ సూక్తమును భావన చేయుచూ చదువుటకు కష్టమగుటచే మాతృభాషలోనికి అనువదించి సులభతరము చేయుటకు పూనుకొని, చక్కని తెలుఁగు ఛందస్సులయిన సీసము తేటగీతి మున్నగు వాటిలో భావస్పోరకముగా విరచించి తన జన్మను చరితార్థము చేసుకొనగలిగిన పుణ్యమూర్తి యీ కవయిత్రి.

     వీరి అనువాదము మూలమునకు అద్దముపట్టుచున్నట్లొప్పియున్నది. ఈ విధముగా వ్రాయుట బహు క్లిష్టతరము. ఎంతయో అవగాహన చేసుకొనినగాని యీ విధముగా వ్రాయుట సులభము కాదు.

మనము పరికించినచో ఈ విషయము అవగతమగును.

.సూక్తము.  

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

అను సూక్తమునకు

ఓ అగ్నిదేవా! బంగారపు రంగుకలిగిన పాపాలను హరించేది, బంగారము మరియు వెండి ఆభరణాలతోఅలంకరించబడినది,చంద్రునిలా చల్లగా ఉండేది, బంగారముతో కూడినది అయిన లక్ష్మీదేవిని ( ఎవరిచేత సర్వము చూడబడునో ఆమె లక్ష్మి)నా కొరకు ఆవాహన చేయుము .అను భావమును గ్రహించిన కవయిత్రి

సీస పద్యములో

బంగారు ఛాయతో బంగారు వెండియా

భరణములు ధరియింపబడి లక్ష్మి

హరిపత్ని పూర్ణ చంద్రాంశు హిరణ్మయీ

పిలువ సన్నిధినిమ్ము పీఠమంది

వేదములగురించి విశదీకరించిన

హుతవాహ! మాధవ సతిని యావ

హించు మా కొఱకు మా యింటిలో మంత్రబ

లముచేతనే విగ్రహముల నిలుపు,

తే.గీ.

ఎవరిచూపుతో సంపదలివ్వబడునొ

యామె నన్వీడదెన్నడు నమ్మ లక్ష్మి

పైడియావులు హయములు బంధువుల సు

భిక్షముగ పొందుపరచుము విజయరూప 

అని పద్యమున పఠన్ యోగ్యముగా ఉండునటుల వ్రాసిరి.

ఇందు మూల సూక్తమున ఉన్న భావము ప్రతిబింబించు విధముగ, ఛందో బద్ధముగ, 

పఠనానుకూలముగ వ్రాయుట వీరి సాధనా పటిమ పట్టుదల భక్తి చాటుచున్నవి.

ఈ విధముగా ఫలశృతితో కలిపి మొత్తం 22 పద్యములలో వ్రాసి ఆ శ్రీమాత అనుగ్రహపాత్రులయిరి. 

    ఆద్యంతమూ ఇదే విధముగా భక్తులగు పాఠకులకు అర్థముచేసుకొనుచు చదువుటకవకాశము కలుగ జేసిన ఈకవయిత్రి ఇంకనూ ఎన్నియో రచనలు చేసి పాఠకులకానందము చేకూర్చగలరని నా ప్రగాఢ విశ్వాసము.

మహనీయంబగు దైవమంత్రతతి, సన్మాన్యంబుగా నీమెచే

నిహమున్ సత్పర సాధనార్థమికపై హృద్యంబుగా వెల్వడున్

స్పృహనే గొల్పుచు సాధకాళికిలపై, క్షేమంబుగా వీర లీ

మహిపై వర్ధిలు దీర్ఘకాలము, సదా సమ్మానముల్ పొందుచున్. 

కవయిత్రికి అభినందనలతో

సద్విధేయుఁడు

చింతా రామకృష్ణారావు.

తే. 14 - 10 - 2022.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.