గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2009, శనివారం

చెప్పుకోండి చూద్దాం 11.

0 comments

చెప్పుకోండి చూద్దాం 7

ఈ క్రింద ఒక ఆటవెలది పద్యంలో మూడు ప్రశ్నలివ్వ బడ్డాయి. సమాధానం మూడింటికీ ఒకే ఒక్క మాటలో చెప్పమని వుంది. చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఈ పద్యాన్ని మీ ముందుంచుతున్నను.

ఆ:-
మామిడేల పూచు మండు వేసంగిని?
బాలు డేల పోవు పసుల వెంట?
రాజు సేన నేల రహి జేర్చు చుండును?
మూడునొక్క మాట తోడ చెపుమ.

మీ రూహించిన సమాధానాన్ని కామెంట్ ద్వారా పంపడం ద్వారా మన ఉభ్యులకే కాక చదువరులందరి ఆనంద కారకులవగలరు.

సమాధానం తెలియకపోయినా, లేదా తెలుసుకోవాలనివున్నా క్రింద వ్రాశాను.
మౌస్ ద్వారా తెలుసుకొన వలసినదిగా మనవి.

సమా ధానం:
కాయడం కోసం. లేదా కాపు కొఱకు.

మీకానందం కలిగించిన ఇటువంటి పద్యములు కాని, చమత్కార శోభిత గద్యలుకాని మరే ప్రక్రియలోగాని మన సాహిత్యంలోనివి మీ దృష్టిలో వుంటే తప్పక పంపండి. తద్వారా పదిమందికీ నాబ్లాగు ద్వరా పంచినవారవతారు.. మరొక సారి మరో ప్రశ్న మీముందుంచగలనని మనవి చేయుచున్నాను.

జైహింద్.

29, జనవరి 2009, గురువారం

చెప్పుకోండి చూద్దాం 1 టు 6 కి నా సమాధానాలు.

4 comments

sembah సమాధానం కనుక్కోండి చూద్దాం 1 టు 6 / కి / నా సమాధానాలు.

1) సమాధానం కనుక్కోండి చూద్దాం.
Wednesday, January 14, 2009
కందము:-
అంచిత చతుర్థ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్
గాంచి, తృతీయంబప్పురి
నించి, ద్వితీయంబు దాటి, నృపు కడ కరిగెన్.
దీనికి సమాధానం:- హనుమంతుడు.

2) సమాధానం కనుక్కోండి చూద్దాం - 2.
Sunday, January 18, 2009
కందము:-
పండినదెండినదొక్కటి.
ఖండించిన పచ్చిదొకటి. కాలినదొకటై
తిండికి రుచియైయుండును.
ఖండితముగ దీని దెల్పు కవియున్ గలడే
దీనికి సమాధానం:- తాంబూలం.

3) సమాధానం కనుక్కోండి చూద్దాం. 3.
Tuesday, January 20, 2009
ఆటవెలది:-
దేహమెల్ల కనులు దేవేంద్రుడా కాదు.
భుజము పైన నుండు బుడుత కాడు.
తాను ప్రాణి కాదు తగిలి జీవుల జంపు.
దీని భావమేమి తిరుమలేశ?
దీనికి సమాధానం:- వల.

4) సమాధానం కనుక్కోండి చూద్దాం 4
Monday, January 26, 2009
ఆటవెలది:-
చలన శక్తి కలదు. జంతువు కాదది.
చేతులెపుడు త్రిప్పు శివుడు కాదు.
కాళ్ళు లేవు సర్వ కాలంబు నడచును
దీని భావమేమి తిరుమలేశ?
దీనికి సమాధానం:- గడియారము.

5) సమాధానం కనుక్కోండి చూద్దాం 5.
Tuesday, January 27, 2009
ఆటవెలది:-
(1) భారతంబులోని భవ్యత్వమే కాదు
(2)
ఇక్షు ఖండ మహిమ, (3) తృప్తిగొలుపు
అబ్ధి మహిమ తెలుపు మది ఒక్క పాదాన?
__________________________. ( ఈ 4 వ పాదం మీరు పూరిచడం కోసం ఖాళీగా వుంచ బడింది. )
దీనికి సమాధానం:-
పర్వ పర్వమందు ప్రబలు రసము.

6) సమాధానం కనుక్కోండి చూద్దాం 6.
Thursday, January 29, 2009
ఆటవెలది:-
చెప్పు లోని రాయి చెవులోను జోరీగ
కాలి లోనిముల్లు. కంటి నలుసు.
ఇంటి లోని పోరు యింతంత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ.

ఈ పద్యంలో
వేదాంతార్థం వున్నట్టుగా నాకు అనిపిస్తోంది.
దీనికి సమాధానం:-
వివరణ:-
నా మదిలో మెదులుతున్న భావన వివరిస్తున్నాను. ఇదే ప్రమాణంగా తీసుకో వలసిన అవసరం లేదు. చూడండి.

ఒక గురువుకు శిష్యునకు మధ్య జరుగు చున్న సంభాషణ యిది.
శిష్యుడు:-
లోని = మనలో వుండే,
రాయి = బరువైన పదార్థమును గూర్చి,
చెవులోను = నా చెవులలో
జోరీగన్ = గింగిరు పెట్టేలాగున
చెప్పు = తెలియజేయండి.

గురువు బోధించారు. శిష్యుడు శ్రద్ధగా ఆలకించాడు.మళ్ళీ యిలాగంటున్నాడు.

లోని = నా మనసులో వుండేటు వంటి,
ముల్లు = సందేహమనే ముల్లు,
కాలి = కాలిపోగా
నలుసు = సూక్ష్మమైన ఆ పరమాత్మ స్వరూపమును,
కంటి = చూచితిని.
యింటిలోని = నా యీ శరీరమనే యింటిలోని
పోరు = జీవాత్మ పరమాత్మలకు జరిగే సంఘర్షణా రూపమైన పోరు
ఇంతంత కాదయా = ఇంతటిది, అంతటిది అని చెప్పుటకు శక్యము కానిది సుమా!

భావము:-
గురువుగారూ! మనలో వుండేటువంటి ఆబరువైన పదార్థమగు పరమాత్మ స్వరూపమును గూర్చి దయతో చెప్పండి. అని శ్శిష్యుడడుగగా గురువు వివరించి చెప్పడంతో శిష్యుని సందేహంతీరి ఇలాగంటున్నాడు.
నా మనసులో వుండే సందేహమనే ముల్లు మీ మాటల వలన కలిగిన జ్ఞానమనే అగ్నిలో కాలిపోయింది. నాలో ఆసూక్ష్మరూపముననున్న పరమాత్మ స్వరూపాన్ని చూచాను. నా శరీరమనే యింటిలో జీవాత్మకు పరమాత్మకు జరిగే పోరు యింత అంత అని చెప్పనలవికానిది.

చూచారు కదా!.
ఎంత సామాన్యంగా ఎంత అద్భుతంగా ఆడుతూ పాడుకొనేలా ఆటవెలదిలో వ్రాశాడో వేమన. ఎంతటి రచనా కౌశలము?

సరదాగా చదువుకొనే సందర్భంలో ఈ తలపోటేంటి? అని మీ రనుకోకపోవచ్చుననుకోండి. ఐనా సమాధానం సరైనది నా అభిప్రాయాన్ని మీ ముందుంచడం నా కనీస కర్తవ్యంగా భావించి యీ రోజు ఆ ఆరింటికీ సమాధానాలు మీముందుంచాను.

మీ అభిప్రాయం తెలియజేసి ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను.

జైహింద్.


babai

చెప్పుకోండి చూద్దాం.10.

0 comments

sembah
మనలో వేమన శతకం గూర్చి తెలియవారుండరు. ఐతే
వేమన శతకంలో ని పద్యాలు మనకు తెలిసిన అర్థాలే కలిగున్నాయా?
లేక ఒక
ప్రత్యేకమైన అర్థాలేమైనా కలిగుండవచ్చా!
ఈ క్రింది పద్యం చూడండి.

ఆ:-
చెప్పు లోని రాయి చెవులోను జోరీగ
కాలి లోనిముల్లు. కంటి నలుసు.
ఇంటి లోని పోరు యింతంత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ.

ఈ పద్యంలో
వేదాంతార్థం వున్నట్టుగా నాకు అనిపిస్తోంది.

మీరు ఊహించి చెప్పే ప్రయత్నం చేసేందుకు వీలుగా దీని
వివరణను తెల్ల రంగు పులిమి నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తాను.
మీరు ప్రయత్నించి కామెంట్ ద్వారా పంప గలందులకు మనవి. ఆలస్యం సహించలేనివారు వివరణ చూడ దలచుకొంటే మౌస్ సహాయంతో తెల్ల రంగు పులుముకొని ఈ క్రిందనే దాగి వున్న వివరణ చూడగలందులకు మనవి.

వివరణ:-
నా మదిలో మెదులుతున్న భావన వివరిస్తున్నాను. ఇదే ప్రమాణంగా తీసుకో వలసిన అవసరం లేదు. చూడండి.

ఒక గురువుకు శిష్యునకు మధ్య జరుగు చున్న సంభాషణ యిది.
శిష్యుడు:-
లోని = మనలో వుండే,
రాయి = బరువైన పదార్థమును గూర్చి,
చెవులోను = నా చెవులలో
జోరీగన్ = గింగిరు పెట్టేలాగున
చెప్పు = తెలియజేయండి.

గురువు బోధించారు. శిష్యుడు శ్రద్ధగా ఆలకించాడు.మళ్ళీ యిలా గంటున్నాడు.

లోని = నా మనసులో వుండేటు వంటి,
ముల్లు = సందేహమనే ముల్లు,
కాలి = కాలిపోగా
నలుసు = సూక్ష్మమైన ఆ పరమాత్మ స్వరూపమును,
కంటి = చూచితిని.
యింటిలోని = నా యీ శరీరమనే యింటిలోని
పోరు = జీవాత్మ పరమాత్మలకు జరిగే సంఘర్షణా రూపమైన పోరు
ఇంతంత కాదయా = ఇంతటిది, అంతటిది అని చెప్పుటకు శక్యము కానిది సుమా!

భావము:-
గురువుగారూ! మనలో వుండేటువంటి ఆబరువైన పదార్థమగు పరమాత్మ స్వరూపమును గూర్చి దయతో చెప్పండి. అని శ్శిష్యుడడుగగా గురువు వివరించి చెప్పడంతో శిష్యుని సందేహంతీరి ఇలాగంటున్నాడు.
నా మనసులో వుండే సందేహమనే ముల్లు మీ మాటల వలన కలిగిన జ్ఞానమనే అగ్నిలో కాలిపోయింది. నాలో ఆసూక్ష్మరూపముననున్న పరమాత్మ స్వరూపాన్ని చూచాను. నా శరీరమనే యింటిలో జీవాత్మకు పరమాత్మకు జరిగే పోరు యింత అంత అని చెప్పనలవికానిది.

చూచారు కదా!.
ఎంత సామాన్యంగా ఎంత అద్భుతంగా ఆడుతూ పాడుకొనేలా ఆటవెలదిలో వ్రాశాడో వేమన. ఎంతటి రచనా కౌశలము?

మీ దృష్టిలో వుండే పద్యాలు మీరు కామెంట్స్ ద్వారా పంపినట్లయితే విజ్ఞానం పదిమందికీ పంచవచ్చునని నా భావన.

జైహింద్.
babai

27, జనవరి 2009, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం 9.

5 comments

tension
పూజ్య పాఠక మహాశయులారా!
మనం చాలా సాధన చేస్తూ వుంటాం. వ్యాసాలు వ్రాస్తున్నాం. వ్యాఖ్యానాలు వ్రాస్తున్నాం. పద్యాలు వ్రాసున్నాం. మనం పొందిన విజ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం కూడా సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేయగలిగితే మన మేధాశక్తి క్షణ క్షణాభివృద్ధి అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రస్తుతం క్రిందనొక పద్యంలో
1) భారత మహిమను.
2) ఇక్షు ఖండ మహిమ.
3) సముద్ర మహిమ.

మూడింటినీ వర్ణిస్తూ ఒకే పాదంలో
అంటే
నాల్గవ పాదంగా మనం పూరించాలన్న మాట.
అన్నింటికీ సమాధానం ఒకటే అవాలి. సరిపోవాలి.
మనం చెప్పలేకపోవడమేమిటి?
ప్రయత్నం చేస్తే తప్పక సమాధానం వ్రాయగలం.
ఆ నమ్మకంతోనే ఈ పద్యం వ్రాశాను.
మీ మనసుకు ఆనందం కలిగిస్తుందనే నమ్మకంతో మీ ముందుంచుతున్నాను.

సమాధానాన్ని మీ వ్యాఖ్యల ద్వారా పంప వలసినదిగా మనవి.
పద్యంలాగ పూరించలేమనుకొంటే వచనరూపంలో వ్రాసి పంపండి.
ఆ పద్యాన్ని చూడండి.

ఆటవెలది:-
(1) భారతంబులోని భవ్యత్వమునుదెల్పు.
(2) ఇక్షు ఖండ మహిమ, కుక్షి యెఱుగు.
(3) అబ్ధి మహిమ తెలుపు మది ఒక్క పాదాన?
________________________. ( ఈ 4 వ పాదం మీరు పూరిచడం కోసం ఖాళీగా వుంచ బడింది. )

( నేను వ్రాసిన సమాధానము)BLOCKED.
పర్వ పర్వమందు ప్రబలు రసము. ( 4 వ పాదం )

ఓపికగా ఆలోచించే సమయం మీకు లేకపోతే సమాధానం వెంటనే తెలుసుకోవాలనుకొంటే నన్ను నిందించనక్కర లేకుండా నేను తెల్ల రంగు పులిమి పైన భద్ర పరచిన సమాదానిని మౌస్ సహాయంతో చూడగలందులకు మనవి.

జైహింద్.

26, జనవరి 2009, సోమవారం

చెప్పుకోండి చూద్దాం 8

8 comments

tensionసమాధానం కనుక్కోండి చూద్దాం 4 వ భాగంలో యిచ్చిన పద్యం మీకు తెలియని దేమీ కాదు కాని ఒక్క సారి కొంచెం ఆలోచించే అవకాశం కల్పిస్తుందని నేననుకొంటున్నాను. చదివి సమాధానం పంపగలరని నా నమ్మకం.

ఆ:-
చలన శక్తి కలదు. జంతువు కాదది.
చేతులెపుడు త్రిప్పు శివుడు కాదు.
కాళ్ళు లేవు సర్వ కాలంబు నడచును

దీని భావమేమి తిరుమలేశ?


పై పద్యంలో ప్రశ్నకు సమాధానం తెలియదనుకొంటే దీని దిగువనే తెలుపు రంగులో కలిసిపోయివున్న సమాధానం మౌస్ సహాయంతో మీరు తెలుసుకో వచ్చునని మనవి చేయుచున్నాను.

సమాధానం:-
గడియారము.

ఇంతకు మించిన అత్యద్భుతమైన కొంటె ప్రశ్నలపద్యాలు మీ దృష్టిలో కూడా వుండకపోవు. మీరు
కామెంట్ ద్వారా పంపినట్లయితే ప్రచురించగలనని మనవిచేయుచున్నాను.

జైహింద్.

babaibabaibabaibabaibabai

జయ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

ప్రియ పాఠకులకు, యావత్ భరతీయ సహోదర సహోదరీ మణులకు భారత దేశ గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు.

మన భరత మాత పాడి పం టలతో సమస్త శుభప్రద వనరులతో వర్ధిల్లుతూ, యావత్ భారతీయులకు ఆయు రారోగ్య ఆనంద ఐశ్వర్యాలకు మూలమై విరాజిల్లేలా చేయాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను.

ఉత్పలమాల:-
భారత మాత సద్వినుత. భాగ్య నిధానముగా స్థిరంబుకాన్,
శ్రీ రమణీయమై సతము శ్రేయము గూర్చెడి కల్పవల్లిగాన్ ,
ధారుణి నగ్ర దేశముగ, తప్పక వర్ధిల జేయుమయ్య! యీ
ధారుణి నున్న మానవులు ధర్మప్రవరుల జేయు మీశ్వరా!

జైహింద్.

24, జనవరి 2009, శనివారం

దేశమునకీ యరిష్టము తీరిపో----? (వు - దు ).

6 comments

మధు సేవ నాటకమున దేశారిష్ట కారణములను వివరించించిన సీసపద్యమును చూచినట్లయితే మనకాశ్చర్యం కలిగిస్తుంది. కవి నిర్మొహమాటంగా ఎంత స్పష్టంగా వ్రాశాడో చూడండి.

సీసము:-
కొంపలు తెగనమ్మి కోర్టుల, రైళ్ళ, కా
ఫీ హొటేళ్ళ, వకీళ్ళ, పెంచువారు.
పండిన సరు కెల్ల పర దేశముల కంపి
కరవున కిర వేర్పరచు వారు
మూడు ప్రొద్దులు ముష్టి మున్సిపల్ పదవి లో
పలనుండి కనులు కన్ పడనివారు.
ఆస్తి భార్య పేర అప్పులు తమ పేర
పెంచి ఐ.పీ.లను పెట్టువారు.
తేటగీతి:-
బట్ట కొఱకు, జుట్టు కొఱకు, బ్రాంది కొఱకు,
సిరులు పర దేశముల పాలు చేయువారు.
పూర్తిగా నెల్లెడల వట్టిపోవు దనుక
దేశమునకీ యరిష్టము తీరిపోదు.

నిరంకుశాః కవయః అన్నరుకదా పెద్దలు. అందుకే అంత నిర్మొహమాటంగా వ్రాయగలిగాడు.
పద్య రచన కాని, గద్య రచన కాని, యదార్థానికి దర్పణం పట్టాలంటారు పెద్దలు. అతిశయోక్తులు, కవిచమత్కారాలు లాంటి వన్నీ కూడా యదార్థాన్ని ప్రతిపాదించిన పిదపనే చూపించాలి.
మనం కూడా యదార్థానికి ప్రతి బింబంలా పద్య రచన చేయగలిగితే ఆదరణీయం కాకపొతుందా!

జైహింద్.

23, జనవరి 2009, శుక్రవారం

గం మత్తు మందు పద్యం. .

5 comments

మధు సేవ నాటకంలో ఆంగ్లాంధ్రసీసము సొగసును చూచిన మీరు ఇప్పుడు మందు బాబుల మనో గతాన్ని చూడబోతున్నారు. ఇక ఆలస్యమెందుకు? చూడండి.

సీసము:-
బ్రాంది సీసా కంట పడగానె వరహాల
పాతు కాన్ పించిన పగిది తోచు.
ఠప్పు మంచును కార్కు చప్పుడైనంతనె
జయభేరి విన్నంత సంభ్ర మొదవు.
దొడదొడ గ్లాసులో తొలికించు సమయాన
అమృతంబు పడుచున్న యట్టులుండు.
చురచుర గొంతులో చొచ్చెడి తరి పోయి
నట్టి ప్రాణము వచ్చినట్టులుండు.
తేటగీతి:-
అవల నానంద వార్ధి నోలాడునట్లు
స్వర్గ భూమి విహారము సలుపునట్లు
రంభ వడిలొన నిద్దుర క్రమ్మి నట్లు
తన్మయావస్తలోన చిత్తము సుఖించు.

ఎంత అద్భుతంగా మందు బాబుల మనో గతాన్ని వ్రాశాడో చూచారు కదా!
మరొక పర్యాయం మరో హృద్యమైన పద్యాన్ని మీముందుంచే ప్రయత్నం చేయ గలనని మనవిచేయు చున్నాను.
జైహింద్.

babaibabaibabaibabai

22, జనవరి 2009, గురువారం

మధు సేవా ప్రభావం.

4 comments

మధు సేవ అనే నాటకంలో ఓక తమాషాగా వుండే సీసపద్యాన్ని చూచానండి. మీరన్నీ ఇలాగే చెపుతారు అని అనకండి. కావాలంటే మీరూ చూడబోతున్నారుకదా!.
ఆపద్యంలో మధుసేవ చేసేవారి ప్రవృత్తిని ఎంత యదార్థంగా వివరించాడంటే ఆ పద్యాన్ని మనం కూడా కంఠస్థం చేసి
" మధు "రమైన ఆ మత్తులో తేలని జన్మ జన్మ కదేమో అనిపించేటంతటి గొప్పగా వుంది.
మధువే కాదు. దానిని గూర్చిన సంభాషణ, దాని మహత్యం తెలిపే పద్యాలు, అంతెందుకు. దాని ప్రస్తావన వస్తే చాలు మనకు కూడా మత్తెక్కిస్తుందనడానికి యీ పద్యమే తార్కాణం. ఇక చూడండా పద్యమెలాంటి మత్తిస్తుందో.

సీ:-
మోర్నింగు కాగానె మంచము లీవింగు.
మొగము వాషింగు. చక్కగ సిటింగు.
కార్కు రిమూవింగు. గ్లాసులో ఫిల్లింగు.
గడగడ డ్రింకింగు. గ్రంబులింగు.
భార్యతో ఫైటింగు. బైటకు మార్చింగు.
క్లబ్బును రీచింగు. గేంబులింగు.
విత్తము లూజింగు. చిత్తము రేవింగు.
వెంటనే డ్రింకింగు. వేవరింగు.
తేటగీతి:-
మరల మరల రిపీటింగు. మట్టరింగు.
బసకు ష్టార్టింగు. జేబులు ప్లండరింగు.
దారి పొడవున డేన్ సింగు. థండరింగు.
సారె సారెకు రోలింగు, స్లంబరింగు.

చదివిరి కదా! గం "మత్తు" గావుందికదూ! ఇప్పుడు చెప్పండి. నేను పైన చెప్పినవి యదార్థమో, కాదో.
ఇలాంటి తమాషా పద్యాలు మన సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా వున్నాయంటే ఆశ్చర్యపోయే పని లేదు. మీరే చూస్తారికదా ముందు ముందు. ప్రసుతానికి

జైహింద్.

నరసింహ: తెలుగు భాషాభివృద్ధిఅంశంపై నాసూచనలు.

2 comments

నరసింహ: తెలుగు భాషాభివృద్ధిమాలతీ మాధవం లో నరసిం హ గారు తెలుగు భాషాభివృద్ధిని గూర్చి తీసుకోవలసిన చర్యలను సూచించారు. ఆ సూచనలు 12.
అందులో మూడవ సూచన మినహాయిస్తే అన్నీ అనుసరణీయమే.

వారి బ్లాగులో వ్యాఖ్యానం వ్రాయడానికి అవకాశము దోరకక వారితో ఎలా లింకవాలో తెలియక ఈ బ్లాగ్ ద్వారా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను.

మనకు కావలసింది జ్ఞాన సంపద.
జ్ఞానమనేది భాషతో నిమిత్తం లేనిది.
ప్రపంచంలో జ్ఞాన దూరమైన భాష వుంటుందని నేననుకోను.
నేటి కాలమాన పరిస్తితుల కనుకూలంగా మనం కూడా ముందడుగు వేయకుండా ఇది నాభాషలో లేదు, నేను నేర్వను అని అనుకొంటే ఈ రోజు ఈ బ్లాగులద్వారా స్వేచ్ఛగా బ్లాగే ప్రవృత్తి మనకు లభించేదా?
మన కోరిక ముఖ్యమైనది ఏమిటంటే
ఏ భాష నేర్పడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొన్నా మనకు అభ్యంతరం కాదు.
ఐతే మన మాతృ భష తేలుగును నిర్లక్ష్యం చేయవద్దు. మనకు గల అనంత సాహితీ సంపదకు మనలను దూరము చేయకుండా పాఠ్యభాగాలలో నరసిం గారు సూచించిన సూచనలన్నీ గ్రహించి అనుసరించాలి
అదీ మన ఆకాంక్ష.


తేటగీతి:-
తెలుగు భాషాభివృద్ధికి తెలిపినట్టి
పదియు రెండింట మూడును వదిలిపెట్టి
తక్కుగలవన్ని తప్పక నిక్కవముగ
చేర్చి చర్చింప నర్హమౌన్ శ్రీ నరహరి!

కందము:-
లోకముతోపాటుగ మరి
పోకుండుట నెఱుగమేని పూర్ణ జ్ఞానం
బేకరణి పొందగానగు?
శ్రీకరమగు తెలుగుకూడ చేర్పగ వలయున్.

కందము:-
ఆంగ్లము వలదన తగదయ.
ఆంగ్లముతో పాటు మనకునాంధ్రము వలయున్.
ఆంగ్లము నాంధ్రమువలెనూ.
ఆంగ్లముమువలె నాంధ్రభాష నరసిన శుభమౌన్.

కందము:-
తప్పుగ భావింపకుడీ.
యిప్పట్టున లోక గతులనెరుగకయున్నన్
ముప్పని తలతును.మనకిక
తప్పెడిదేముండె?కనుక తప్పదు నేర్వన్.

{ ఆంధ్రామృతము బ్లాగ్ }

21, జనవరి 2009, బుధవారం

ఈ నాటి పరిస్థితుల కానాడే అద్దం పట్టాయి మన కావ్యాలు.

6 comments

మిత్ర వరులారా!
1920 వ సంవత్సరం ఇప్పటికెన్నాళ్ళ క్రితందంటారు! రమారమి తొంభై సంవత్సరాలైందికదూ.

ఆనాటి
ధర్మవరపు గోపాలాచార్యులవారు రచించిన రామదాసు నాటకంలో చూపించిన ఆ నాటి సాంఘిక దుస్థితి మనమిప్పుడు పరిశీలిస్తే మనకు మతి పోతుంది
మారింది కాలమే కాని పరిస్థితులు కావు అని మనకి అర్థమైపోతుంది.
చూడండి అతడు రచించిన ఒక పద్యం.

చ:-
కఱువొకవంక, జాతి మత కక్ష లొకానొక వంక, హత్యలున్
మరణములొక్క వంక, దయ మాలిన ధర్మ విరుద్ధ చర్యలున్,
చెఱలొకవంక, నోటికిని చేతికి కట్టడు లొక్కవంక, యి
త్తెఱగున దే శమెల్ల అతి దీన దశా వశమయ్యె నేమనన్.

ఆ నాటి సాంఘిక పరిస్థితులకా లేక ఈ నాటి సాంఘిక పరిస్థితులకా ఈ పద్యం అద్దం పడుతోంది.
ఆ నాటి కవులే కాదు ఈ నాటి కవులు కూడా ఋషులే.
నాన్ ఋషిః కురుతే కావ్యం అన్నారు కదండీ.
ఋషులు కాబట్టే త్రి కాలజ్ఞత కలిగి వారు రచించిన కావ్యాంశాలు నిత్యనూతనమై సర్వ కాలాల్లోనూ ఆదరణీయమౌతున్నాయి. వారివి వేదవాక్కులవుతున్నాయి. యదార్థమేనంటారా?

జైహింద్.

20, జనవరి 2009, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం. 7.

4 comments

సుహృన్మిత్రులారా! సహృదయ పాఠకులారా!
ఈ దిగువనొక ప్రశ్న మీకోసం పద్య రూపంలో సిద్ధంగా వుంది. సమాధానం మీరు పద్యరూపంలో చెప్పగలిగితే నాకు కలిగే ఆనందం అపారం. ఎందుకంటే పద్యాలు వ్రాసేవారి సంఖ్య దిగజారిపోవడాన్ని నేను జీర్ణించుకో లేకపోతున్నాను.
తెలుగు మాటాడే ప్రతీవారూ ఛందో భాషణం చేయగలిగి వుండాలని నా కోరిక. అది సాధ్యమా? అని మీరనుకో వచ్చు. ఎందుకు సాధ్యం కాదు?

భోజ మహారాజు కాలంలో ప్రజలు సంస్కృతంలో సంభాషించడమే కాక ఛందో భాషణం చిన్నవీరితో సహా చేసేవారట. అందుకు చిన్న ఉదాహరణ మీకు తెలియందేమీ కాకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుతున్నాను.

ఒక అమ్మాయి తాళ పత్రంపై ఏదో వ్రాస్తూ వుండగా కాళిదాసు చూచి ఆ అమ్మాయితో సంభాషించాడు. ఆ యిరువురి మధ్యా జరిగిన సంభాషణ ఒక శ్లోక రూపంలో వుంది. చూడండి.

శ్లోకము:-
కాళి దాసు అడుగుతున్నాడు:-
కావా బాలా?
ఆప్రశ్నకి సమాధానంగా యిలా చెప్పింది:-
కాంచన మాలా.
మళ్ళీ అదుగుతున్నాడు;-
కస్యాః పుత్రీ?
ఆ అమ్మయి చెప్పుతోంది;-
కనకలతాయ.
మళ్ళి అడుగుతున్నాడు;-
కింవా హస్తే?
ఆ అమ్మాయి చెప్పుతోంది:-
తాళజ పత్రం.
అతడు మళ్ళీ ఇలాగడిగాడు ;-
కావా లేఖా?
ఆ అమ్మాయి ఇలా చెప్పింది;-
కాఖాగాఘా.
అదే సంభాషణని శ్లోకరూపంలో చూడండి.

కావా బాలా? కాంచనమాలా.
కస్యాః పుత్రీ? కనకలతాయ.
కింవా హస్తే? తాళజ పత్రం.
కావా లేఖా? కాఖాగాఘా.

కాళిదాసు:-
ఎవరివమ్మాయ్ నీవు?
అమ్మాయి:- కాంచన
 మాలను.
కాళిదాసు:-
ఎవరి కుమార్తెవి?
అమ్మాయి;- కనకలత కుమార్తెను.
కాళిదాసు:-
చేతిలోనిదేమిటి?
అమ్మాయి;-
తాటాకు పత్రము.
కాళిదాసు:-
ఏమిటి వ్రాస్తున్నావు?
అమ్మాయి:-
క ఖ గ ఘ లు వ్రాస్తున్నాను.

చూచారుకదా.
మనం మాత్రం ఎందుకు ప్రయత్నించ కూడదు?
తప్పక ఛందో భాషణానికి ప్రయత్నిద్దాం.

ఇక ఇప్పుడు మీముందుకొస్తున్న
ప్రశ్న.

ఆ:-
దేహమెల్ల కనులు దేవేంద్రుడా కాదు.
భుజము పైన నుండు బుడుత కాడు.
తాను ప్రాణి కాదు తగిలి జీవుల జంపు.
దీని భావమేమి తిరుమలేశ?

సమాధానం తెల్ల రంగుతో వుంది. అవసరమనుకొంటే మౌస్ సహాయంతో చూడ మనవి.

సమాధానం;-
వల.


మీరు కూడా మీ స్ఫందనను కామెంట్ రూపంలో తెలియ జేయ గలందులకు మనవి.


జైహింద్.

19, జనవరి 2009, సోమవారం

మీతో మనసు విప్పి మాటాడాలనివుంది.

8 comments

ఈ రోజు మీతో నా స్వ విషయం మనసు విప్పి మాటాడాలని వుంది.
నేను సాధారణంగా సాహితీ సభలకు ఎక్కడ జరిగినా ఆహ్వానిస్తే కాదనకుండా హాజరవుతాను. ఐతే ఈ విషయం ఇంటిలో తెలియ జేసి నా కార్యక్రమాన్ని వివరించి మరీ వెళ్తాను.

ఒక నాడు మాత్రం అనుకోకుండా ఒక కార్య క్రమంలో హాజరవ వలసి వచ్చింది. ఇంటిలో చెప్పేటంతటి అవకాశం దొరకక పోవడంతో చెప్పలేకపోయాను. ఇంటికి వచ్చేసరికి రోజూ కన్నా బాగా ఆలస్యమయింది. ఈ లోగా నేను సాహితీ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం ఒక విద్యార్థి ద్వారా మా యింటిలో తెలిసింది.

తలుపు తట్టాను. బైట లైటు వెలిగించారు. తలుపు తీస్తారని నేననుకొన్నాను. తీయలేదు. సరికదా అనుకోని సంఘటన నాకెదురయింది. అదేమిటంటారా? వినండి చెపుతున్నాను.

నేను నాలుగు పదాలిస్తాను. రామాయణ పరంగా పద్యమొకటి ఆశువుగా చెప్పితేనే ఈ గృహం మీకు స్వాగతం పలుకుతుంది. అని నా గృహిణి అనే మాటలు వినే సరికి నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.
నేనెప్పుడూ వూహించనైనా లేదు. నన్నీవిధంగా ఆమె ప్రశ్నిస్తుందని.
సరే ఏమిటా పదాలు నాలుగూ సెలవివ్వండి అన్నాను.
చెప్పలేపోతే అలాగొప్పుకోండి అంది ఆమె.
మీతో చెప్పకపోవడమేం. ఆమె అలా అనే సరికి నాకు చిన్నపాటి పౌరుషంకూడా వచ్చిందండోయ్.

ఆ పదాలేవో ముందు దేవిగారు సెలవిస్తే అప్పుడు చూసుకో వచ్చు. అన్నాను. అంతే ఆమె నాలుగు పదాలూ చెప్పడం జరిగింది.. నా దగ్గరేవున్న సంచీలోంచి పుస్తకం తీసి పెన్ను పట్టుకొని నాలుగు పదాలూ ఆమె లోపలి నుండి చెప్పుతుండగా బైటే అక్కడున్న కుర్చీలో కూర్చొని వ్రాశాను.
ఆ పదాలేమిటొ పద్య మెలా పూరించానో తెలుసుకోవాలని ఆత్రుతగా వుందికదూ? చూడండి క్రింద వ్రాస్తున్నాను.

దత్త పది:-
1) అన్న.
2) అక్క.
3) చెల్లె.
4) బావ.
ఇవండీ ఆ నాలుగు పదాలూను.
రామాయణ పరంగా పద్యం వ్రాయాలి.అదృస్టం కొద్దీ స్వేచ్ఛా వృత్తంలోనే వ్రాయ వచ్చునని సెలవిచ్చారు.

ఇక్కడ నాకో ఆలోచన వచ్చింది. ఇదే పరిస్థితి మీకెదురైతే మీరేమిటి వ్రాస్తారా అని.
అందుకనే నేను వ్రాసిన పద్యం క్రింద తెల్ల రంగులో నిక్షిప్తం చేస్తున్నాను.
మౌస్ ను కుడిచేతి చూపుడు వ్రేలుతో నొక్కి పట్టి దానిపైనుండి పద్యమంతా కనిపించేంత వరకు లాగితే బ్లూబేగ్రౌండొచ్చి మధ్యలో పద్యం కనిపిస్తుంది.
ఇదంతా చదివిన మీరు కూడా ఉత్సాహంతో పద్యం వ్రాయ గలగాలనే దురాశతో ఈ పని చేస్తున్న నేను మీకు కష్టం కలిగిచి వుంటే క్షంతవ్యుడను.
ఇక నేను శారదామాత దయచే వ్రాసిన పద్యం చూడండి.
పద్యము:-
ఉత్పలమాల:-
జానకి యేడనున్నదియొ? జాడ కనుంగొను మన్న రాముడా
యానతి విన్న మారుతియె అక్కడ యిక్కడ లేక లంకలో
జానకి గాంచు చెల్లెడల చాటుగ బావని గాంచె. నద్దిరా!
జ్ఞాని కసాధ్యమెద్దియొకొ? చక్కని భక్తి ప్రపత్తి గల్గినన్.

ఈ విధంగా పూరించి చదివి వినిపించానండి. నేను స్వాగతింపబడ్డాను. చెప్పకపోవడమేం. నాకైతే ఎప్పుడూ కలుగనంతానందం కలిగిందండా సమయంలో.
అందుకే అన్నారు పెద్దలు. భార్యంటే భగవద్దత్త ప్రసాదమని. నిజమేకదండీ?

అన్నట్టు చెప్పడం మరిచాను. మాయింటికి నిజం గానే మా అన్నయ్య, మా అక్క, చెల్లెలు, మా బావగారూ వచ్చి ఈ నాటకమంతా ఆడించారండి. ఆశారదాంబ పద్యం పలికించింది కాబట్టి సరిపోయింది కాని, లేకపోతే మావాళ్ళందరిలోనూ ఎంత చిన్నబోయుండేవాణ్ణో.

ఉత్సాహవంతులైన మీరూ దత్త పది పూరణ చేస్తే మీ కామెంట్ ద్వారా పంప గలందులకు మనవి.
జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 51.

0 comments

మన పెద్దలు ఏం చెప్పినా మన మంచిని కోరే చెప్పుదురు. అవి పాటించినట్లయితే మనకు మేలు జరుగుతుంది.
ఈ క్రింది శ్లోకంలో ఒక చక్కని నగ్న సత్యాన్ని చెప్పారు. చూద్దాం.

శ్లో:-
మహానదీ ప్రతరణం
మహా పురుష నిగ్రహం
మహా జన విరోధంచ
దూరతః పరి వర్జయేత్.

తే:-
ఆదరువు లేక నది దాట నమరు ముప్పు.
అధికు లకుభిన్నముగనుమాటాడరాదు.
పూన రాదు విరోధము జ్ఞానులయెడ.
నాశనంబగు వినకున్న నాదు మాట.

భావము:-
మహా ప్రవాహములను నిరాధారుడై దాట యత్నించ రాదు. మహా పురుషులతో నిగ్రహించి మాటలాడరాదు. మహాత్ములతో విరొధము పూన రాదు. ఇవి వినాశకరములు సుమా.

మనసుని అదుపులో పెట్టుకోవడానికి యిటువంటి శ్లోకాల్ని, పద్యాల్ని మనం మననం చేస్తూ వుంటే మన జీవన గమనం ఒడుదొడుకులు లేకుండా, అవాంఛిత అనార్థాలకు గురి కాకుండా జీవించ వచ్చునేమో మీరూ ఆలోచించండి.

జైహింద్.

18, జనవరి 2009, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం 6.

2 comments

మెదడుకు మేత:-

మన సాహితీ జగత్తులో తత్ సృష్టి కర్తలైన మహా కవులెందరో అత్యద్భుతమైన రత్నాల్లాంటి పద్యాలను నిక్షిప్తం చేశారు. ఆ జగత్తులో సంచరిస్తూ కూడా మనమా రత్న కాంతులను జ్ఞాన చక్షువులతో గాంచ లేకపోతే, మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకో లేకపోతే మనమెంతటి నష్టాన్ని పొందుతున్నామో ఆ రత్నాలను చూచినప్పుడు, తద్వారా ఆనందానుభూతిని పొందినప్పుడు తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు నా దృష్టిలో పడిన ఏ రత్నమూ నా బ్లాగు ద్వారా మీకందింప బడక మానదు.
ప్రస్తుతం ఒక తమాషా పద్యాన్ని మీ ముందుంచుతున్నాను.

క:-
పండినదెండినదొక్కటి.
ఖండించిన పచ్చిదొకటి. కాలినదొకటై
తిండికి రుచియైయుండును.
ఖండితముగ దీని దెల్పు కవియున్ గలడే

ఈ పద్యంలో గల భావాన్ని మీరూహించి మీ కామెంట్ ద్వారా పంపండి.

ఒకవేళ అంత ఓపిక లేకపోతే
దీని క్రిందనే వివరణను తెలుపు రంగులో ఉంచాను.
అది మామూలుగా చదివినపుడు మనకు కన పడదు.
మనం
తెలుసుకోవాలనుకొన్నప్పుడు మౌస్ ను వివరణ అనే భాగం నుండి లెఫ్ట్ క్లిక్ నొక్కి పట్టుకొని క్రింద పూర్తయే వరకు జరిపినట్లయితే వివరణ కనిపిస్తుంది. ఉత్సాహవంతులు సమాధానాన్ని చెప్పడానికి అవకాశం కలుగుతుందనీ, అత్యుత్సాహం ఆపుకోలేక సమాధానం వెంటనే తెలిసేసుకోవాలనుకొనే వారి కొఱకు తెలుపు తంగులో ఉంటే గోప్యంగా ఉంటుందని వివరణను అలా వ్రాశాను. కష్టం కలిగించాననుకొంటే మన్నించగలరు.

వివరణ:-
పండినదెండిన దొక్కటి = వక్క.{ పోక చెక్క }
ఖండించిన పచ్చిదొకటి = తమలపాకు.
కాలినది = సున్నము
ఒకటై = ఒకటిగా అయి { తాంబూలమై }
తిండికి = తినిటకు.
రుచియై యుండును = తినుటకు మన నోటికి రుచికరముగ నుండును.

తాత్పర్యము:-
చెట్టుకు కాసి, పండి, ఎండినటువంటి చెక్క, తమల పాకు, సున్నము ఒకటిగా తాంబూలమై మనౌ తినుటకు రుచికరముగ నుండును.

చూచారుకదా! మరొక పర్యాయం మరొక పద్యాన్నో శ్లోకాన్నో తెలుసుకొందాం.

జైహింద్.

16, జనవరి 2009, శుక్రవారం

పింగళి సూరన ప్రదర్శించిన అత్యద్భుత రచనా ప్రక్రియ

7 comments

ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ పూర్వ జన్మ తపః ఫలం. అన్న మాట లెంత యదార్థము.
మన తెలుగు భాషామతల్లికి తమ అనిర్వచనీయమైన సేవలందించిన మహనీయులు సార్థక జన్ములెందరో వున్నారు.
అష్ట దిగ్గజ కవులలో సుప్రసిద్ధుడైన పింగళి సూరనార్యుడు రాఘవ పాండవీయము అనే ద్వ్యర్థి కావ్యమే కాక కళా పూర్ణోదయము అనే మహా కావ్యాన్ని కూడా వ్రాసి తన అప్రతిమాన ప్రతిభా పాటవాల్ని పాఠకలోకాని కందించి కావ్య జగత్తులో అజరామరుడయ్యాడు.

ఇంతకు ముందే " ఈ పద్యం సంస్కృతమా? తెలుగా? చెప్పుకోండి చూద్దాం. " అనే శీర్షికతో రెండు భాషలలోనూ అన్వయం గల పద్యం ఈ బ్లాగులో వుంచడం జారిగింది.
ఇప్పుడు మరొక తమాషా ప్రక్రియతో మన ఊహకే అందని అత్యంత ఆశ్చర్య జనకమైన పద్యాన్ని మీ ముందుంచుతున్నందుకు చాలా ఆనందంగా వుంది.

ఆ పద్యంలో ప్రారంభం నుండి చివరి దాకా చదివితే తెలుగు పద్యమై తెలుగు పదాల పొందిక గలిగి తెలుగు లో అర్థ స్ఫూర్తి కలిగిస్తుంది.
మరి అదే పద్యాన్ని చివరి పాదంలో చివరి అక్షరం నుండి మొదటి పాదంలో మొదటి అక్షరం దాకా { వెనుకనుండి ముందుకు } చదివితే అత్యంత ఆశ్చర్య జనకంగా సంస్కృతపద భూయిష్ఠమై చక్కని భావ స్ఫూర్తిని కలిగిస్తుంది. వింతగా వుంది కదూ? ఐతే ఆ పద్యమేమిటో చూద్దామా?

కందము:-
తా వినువారికి సరవిగ
భావనతో నానునతివిభావిసు తెజా
దేవర గౌరవ మహిమన
మావలసిన కవిత మరిగి మాకునధీశా.

ముందుగా తెలుగులో చూద్దాం.
ప్రతిపదార్థము:-
అతి విభావిసు తేజా = మిక్కిలి ప్రకాశించు పరాక్రమము కల
అధీశా = ఓ మహారాజా!
దేవర గౌరవ మహిమన = మీ ఘనత యొక్క మహిమ చేతనే
మా వలసిన కవిత = మా ప్రియమైన కవిత్వము
తాన్ = అది
వినువారికి సరవిగన్ = వినెడి వారికి యుక్తముగా
భావనతోన్ = భావించుటతో { ఆలకించు వారు సముచితముగా నున్నదని తలచినట్లు }
మాకు మరిగి = మాకు అలవడి { మరుగు రూపాంతరము మరిగి }
ఆనున్ = కనిపించును

భావము:-
మిక్కిలి ప్రకాశించు పరాక్రమము గల ఓ మహారాజా! మీ ఘనత యొక్క మహిమ చేతనే మా ప్రియమైన కవిత్వము ఆలకించువారు అది యుక్తముగా భావించుటతో మాకు అలవడి వ్యక్తమగుచున్నది.
{ఓరాజా! మేమాశ్రయించిన మీ మహత్వము వలననే శ్రోతల కానందకరమైన కవిత్వము మా కబ్బినది.అని భావము.}

అదే పద్యాన్ని తలక్రిందుగా వ్రాసి చూస్తే సంస్కృతం. చూద్దామా?
సంస్కృతం లో పద చ్ఛేదము:-
శాధి - ఇన - కుం - ఆగిరి - మత - వికనసి - లవమాన - మహిమవరగౌరవదే - జాతే - సువిభౌ - ఇతి - నను - నా - అతః - నవభాః - గవి - రసకిరి - వా - అనువితా.

అన్వయ క్రమము:-
ఇన - ఆగిరి - కుం - శాధి - మత - వికనసి - లవమాన - నను - మహిమవరగౌరవదే - సువిభౌ - ఇతి - జాతే - నా - అతః - నవభాః - రసకిరి - గవి - అనువితా వా.

ప్రతిపదార్థము:-
ఇన =ఓ రాజా!
ఆగిరి = పర్వతములున్నంత కాలము
కుం = భూమిని
శాధి = శాసింపుము
మత = సర్వ సమ్మతుడా!
వికనసి = మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లుచున్నావు.
లవమాన = లవుని యొక్క మానము వంటి మానము కలిగిన
నను = ఓ భూవరా!
మహిమవరగౌరవదే = గొప్పతనముచే శ్రేష్ఠమైన గౌరవమునిచ్చునట్టి
సువిభౌ = నీ వంటి మంచి రాజు
ఇతి = ఈ విధముగా
జాతే = కలిగి యుండగా
నా = పండితుడైన, మనుష్యుడు
అతః = ఇట్టి గౌరవము వల్ల
నవభాః = క్రొత్త వికాసముగలవాడై
రసకిరి = రసము చిమ్మునట్టి
గవి = భాషయందు
అనువితా వా = స్తుతింపనివాడగునా! { తప్పక నుతించువాడగునని యర్థము. }

భావము:-
-ఓ రాజా పర్వతములున్నంత కాలము భూమిని శాసింపుము. సర్వ సమ్మతుడా! మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లు చున్నావు. లవుని యొక్క మానము వంటి మానము కలిగిన ఓ భూ వరా! గొప్పతనముచే శ్రేష్ఠమైనట్టి నీ వంటి మంచి రాజు యీ విధముగా కలిగి యుండగా పండితుడైన మనుష్యుడు ఇట్టి గౌరవము వల్ల క్రొత్త వికాసము కలవాడై రసము చిమ్మునట్టి భాష యందు స్తుతింపనివాడగునా. స్తుతింపబడును.

చూచారు కదా! ఎంత అద్భుతంగా వుందో.
మన సాహిత్యంలో వున్న చిత్ర విచిత్ర కవిత్వాలను గూర్చి తెలుసుకోవాలంటే బహుశా మన జీవితం చాలదేమో.
మీరు కూడా మీ దృష్టిలో యిటువంటి కవితలుంటే కామెంటు ద్వారా పంపినట్లయితే తప్పక పదిమందికీ పంచినవారవతారు.
జైహింద్.

15, జనవరి 2009, గురువారం

దత్తపదితో వర్ణన - మేడసాని పూరణ.

4 comments

2007 ఏప్రెల్ 23వ తేదీన మేడసాని మోహన్ గారు చేసిన సహస్రావధానంలో ఒక తమాషా అయిన దత్త పది యిచ్చారు.
దానిని ఆ అవధాన పుంగవుడెంత తమాషాగా పూరించారో మీరే చూడండి.

దత్తపది:
1) పంచరు
2) టించరు
3) వెంచరు
4) లాంచరు.
యీ నాలుగు పదాలతో భారతీయసంస్కృతి వర్ణన.
అవధానిగారి పూరణ చూడండి.

ఉత్పలమాల:-
పంచరు ద్వేషభావనలు భారత వీరులు, కల్మి లేమి పా
టించరు, అందరున్ కలిసి డీకొని శత్రు సమూహ శక్తి లా
వెంచరు, పోరులోని అరిభీకరమూర్తులు భారతాంబ చే
లాంచరుచి ప్రతీకలు భళా! మన సంస్కృతి సంస్తుతంబగున్

భావము:-
భారత వీరులు ద్వేష భావమును తమ ప్రవర్తన ద్వారా ఎవరికీ పంచిపెట్టరు. అంటే భారత వీరులకు ద్వేష భావ మసలుండనే యుండదని తెలియవలసి వుంది.
ఆదాన ప్రదానాలలో భేద భావానికి తావివ్వక అంతా సమానమనే భావంతో కలిమి లేములను పరిగణింపరు.
సమైక్యంగానుండి శత్రువులనెదుర్కొందురే తప్ప శత్రువు బలాబలాలను ఆలోచించనే ఆలోచించరు.
యుద్ధ రంగంలోని శత్రువులకు భయాన్ని పుట్టించే భారత వీరులు నిజముగా భారతమాత కొంగు బంగరు కాంతికి నిదర్శనములు సుమా!
మన భారతీయ సంస్కృతి పొగడబడునదియేసుమా!


చూచారా ఎంతచక్కగా చెప్పారో. మనం కూడా ప్రయత్నించి కనీసం కొంచెమైనా వ్రాసే ప్రయత్నం చేస్తే ఈ మన ప్రయత్నం సార్థకమౌతుంది.

జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 50.

1 comments

శ్రేష్ఠుల్లాగా ప్రవర్తిద్దాం.

మానవుడు
అనుకరణ శీలి. పరిసరాల ప్రభావం ప్రతీ మానవునిపైనా వుంటుంది. పెద్దలను అనుసరించి పిన్నలు ప్రవర్తిస్తుంటారు. ప్రతీ వ్యక్తి ప్రవర్తన యొక్క ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షం గానూ సమాజం మీద పడక మానదు. అందుకే మన ప్రవర్తన మనకోసమే ఐనప్పటికీ దాని ప్రభావం సంఘంపై చెడుగా పడకూడదు. అందుకె భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేస్తూ ఒక చక్కని శ్లోకం చెప్పాడు. చూడండి.

శ్లో:-
యద్యదా చరతి శ్రేష్ఠః
తత్తదేవేతరో జనః
స యత్ ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే.

క:-
ఉత్తముడు నడచు మార్గమె
యుత్తమమని తలచి నడచుచుండెద రితరుల్.
ఉత్తమమని దేనిని గొను
నుత్తము డదెగొనెదరయ్య.! యుర్విని లోకుల్.

భావము:-
లోకములో ఉత్తమ వ్యక్తి ఎట్లు నడచుచున్నాడో ఇతర జనులునూ అట్లే నడుస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం కూడా అనుసరిస్తుంది.

చాలా చక్కని బోధ. సందేహం లేదు.
మనమందరంకూడా మనల ననుసరించే వారికోసమైనా మంచిగా ప్రవర్తించడం ద్వారా ఉత్తమ వర్గానికి చెందిన వారిగా ఋజువు చేసుకొందామా?

జైహింద్.