జైశ్రీరామ్.
102. ఓం పరతత్త్వాయ నమః.
నవమాలిని వృత్త గర్భ సీసము.
నరహరి! చూచితే నరుల బాధల్? మదిన్ - కలిచివేయును కన్న కమల నయన!
మురహర! తీర్చవే భువిని క్షోభల్. సదా - శోభిలం జేయవే సుందరాంగ.
నిరుపమ! నిత్యమై నిలుతువీవే మదిన్ - శోభిల్లఁ జేసినన్ సుజనులందు
చరణము పట్టనీ సదయ నన్నున్. నీదు - పద ధూళి కైవల్య పథము చేర్చు.
గీ. విదిత నవమాలినీ గర్భ వినుత సీస - దీప్త *పరతత్వ*! నిన్ గొల్తు దేవదేవ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
102వ సీస గర్భస్థ నవమాలిని. (న జ భ య .. యతి 8)
నరహరి! చూచితే నరుల బాధల్?
మురహర! తీర్చవే భువిని క్షోభల్.
నిరుపమ! నిత్యమై నిలుతువీవే.
చరణము పట్టనీ సదయ నన్నున్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ కమల నయనా! నరుల బాధలు చూచినచో మనసును
కలిచివేయును. నీవు చూడుము. ఓ మురహరా! ఓ సుందరాంగా! మమ్ములను శోభిల్లఁ జేయుటకు నీవు ఈ క్షోభలను
నశింపఁ జేయుము. ఓ నిరుపమా! నీ వావిధముగ చేసినచో సుజనుల మనస్సులలో నీవే శోభిల్లుచుందువు కదా.నీ
పదములను నన్ను పట్టనీ, నీ పాద ధూళి కైవల్య పథమును చేర్చును.నవమాలినీ వృత్త గర్భ సీసమున ప్రకాశించు ఓ
పరతత్వమా! ఓ దేవదేవా! నిన్ను నేను కొలిచెదను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.