గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2011, శనివారం

మేలిమిబంగారం మన సంస్కృతి 109.

1 comments

శ్లో:-
దుర్జనేన సమం వైరం - ప్రీతించాపి నకారయేత్.
ఉష్ణో దహతిచాంగారః - శీతః కృష్ణాయతే కరమ్.
గీ:-
దుర్జనుల తోడ స్నేహము దుష్ఫలంబు
దుర్జనుల తోడ వైరము దుష్టఫలము.
బొగ్గు తాకిన వేడిని బొబ్బలెక్కు.
చల్లనౌ బొగ్గు మసి చేత నల్ల బరచు.
భావము:-
దుర్జనునితో విరోధమూ వలదు, స్నేహమూ వలదు. బొగ్గులు వేడిగా ఉన్నపుడు చేతులను కాలుస్తాయి. చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతులను మసి చేస్తాయి.
జై శ్రీరాం.
జైహింద్.

24, ఏప్రిల్ 2011, ఆదివారం

భక్తుల ఆత్మలలో స్థిర నివాసుఁడైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా.

3 comments

కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్య సాయి బాబా.
జ్ఞాన దీప్తి ప్రసరింప చేయటం ద్వారా అజ్ఞాన మూఢుల లోని మాయా చీకటులను  పార ద్రోలి, ప్రశాంత జీవనానికి కారకులైన మన సాయిబాబా తననే నమ్ముకొన్న భక్తుల హృదయాలలో స్థిర నివాసం ఏర్పరచుకొని తన భౌతిక జీర్ణ పాంచ భౌతిక దేహాన్ని పరిత్యజించారు.  
జీవాత్మయే తానైన బాబాకు మృత్యువెక్కడిది. 
భక్తకోటి తమకు దివ్య దర్శనం యిచ్చే బాబా ఇక లేరనే భావంతో అజ్ఞానంలో ఉండక తమ భక్తికి ప్రతిఫలంగా తమలొ జీవమై అక్లిసిపోయాడనే దివ్య భావన కలిగి ప్రశాంత చిత్తులై బాబాను తమ ఆత్మలలోనే దర్శించుతూ, బాబాగారి ఆశయ సాధనలో నిమగ్నులవాలని ఆశిస్తున్నాను.
దివ్య జ్యోతిస్స్వరూపులైన భగవాన్ శ్రీ సత్య సాయిబాబాకు ప్రణతులు.
లోకాః సమస్తాః సుఖినో భవంతు.

ఒక్క సీస పద్యంలో కంద, గీత, చంపక, ఆటవెలదులు ఈ విధంగా వ్రాయవచ్చు.

0 comments


సీ:-
ధర కరుణాపరా! పరమ తత్వ రమాశ్రయ ప్రార్థనీయ!  భాను ప్రతాప!
వర! రమణా! సదా కరుణ వర్ధిలఁ జిందెడు క్రాంత దర్శివేడుదునునిన్ను.
వర కరుణా నిధిన్, వర విభావ రమానిధిఁ, బ్రజ్ఞఁ గొల్పవా! దివ్య తేజ!
వర చరణాబ్జముల్ పరమ భక్తిని గొల్తును, ప్రస్తుతింతు నేను దినకరుఁడ!
తే.గీ:-
జగతి కొలుపగ విధి. జగమగణితముగ
నడపగ హరి, జగతినడప డమర ధర
హరుగ, నొనరుచు ననయము జరుపు జగతి
పితవు, కొలుపు మాకు సతము హితము నెలమి.

చ:-
ధర కరుణాపరా! పరమ తత్వ రమాశ్రయ ప్రార్థనీయ!  భా
వర! రమణా! సదా కరుణ వర్ధిలఁ జిందెడు క్రాంత దర్శివే.
వర కరుణా నిధిన్, వర విభావ రమానిధిఁ, బ్రజ్ఞఁ గొల్పవా! 
వర చరణాబ్జముల్ పరమ భక్తిని గొల్తును, ప్రస్తుతింతు నే!

క:-
కరుణాపరా! పరమ త
త్వ రమాశ్రయ ప్రార్థనీయ!  భాను ప్రతాప!వర! రమణా!
కరుణా నిధిన్, వర విభా
వ రమానిధిఁ, బ్రజ్ఞఁ గొల్పవా! దివ్య తేజ!వర చరణా!

తే.గీ:-
పరమ తత్వ రమాశ్రయ ప్రార్థనీయ!  
కరుణ వర్ధిలఁ జిందెడు క్రాంత దర్శి!
వర విభావ రమానిధిఁ, బ్రజ్ఞఁ గొల్ప
పరమ భక్తిని గొల్తును, ప్రస్తుతింతు!

ఆ.వె:-
జగతి కొలుపగ విధి. జగమగణితముగ
నడపగ హరి, జగతినడప డమర 
హరుగ, నొనరుచు ననయము జరుపు జగతి
పితవు, కొలుపు మాకు సతము హితము.  

జై శ్రీరాం.
జైహింద్.

23, ఏప్రిల్ 2011, శనివారం

ఈ క్రింది పద్యంలో ఎన్ని ఛందస్సులు ఇమిడి యున్నాయంటే .....

0 comments

ఈ క్రింది పద్యంలో ఎన్ని ఛందస్సులు ఇమిడి యున్నాయో గమనించే ప్రయత్నం చెయ్యండి.
అని క్రీదటి టపాలో మీ ముందుంచాను. ఆపద్యం గమనించండి.
సీ:- ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ సత్ కవివై భువిన్ కావ్య కర్తవగుము.
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి నీ కృతి గాంచగాను, సన్నుతులతోఁడ
చేరి, గాంచి, పఠించి   చిత్తము చేర్చి, పొంగి ముదంబుతో నీకు కీర్తి కొలుప  
వారి భావన తెల్పి, భాగ్యము పంచునట్టుల నుండుగా సదా! లలిత హృదయ!
గీ:- సుమ పరిమళంబు తోపగ, విమల గతిని
కావ్య మమర, విజ్ఞులు పలుకంగ మహిత
గతిని సలుపుమా! కమనీయ కవిత లొలుక
గ, గమకము తోడ నలరంగ గౌరవంబు.

దీనికి స్పందించిన చిరంజీవి ముక్కు రాఘవ కిరణ్ సమాధానం చెప్పారు.

రాఘవ చెప్పారు...
మదించిన కోకిల రసాలాన్ని కాక కంద తింటూ కనబడిందండీ. :) నేను మన రాఘవను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
మరికొంచెం లోతుగా పరిశీలిస్తే
వ్రాయఁబడిన సీసము+తేటగీతులలో
సీసము, 
గీతము తో పాటు
ద్విపద
మత్త కోకిల,
కందము,
ఉన్నట్టుగా అర్థమౌతుంది. అంటే మొత్తం మీద ఈ సీస పద్యం ఐదు ఛందస్సంయుతమై ఉందన్నమాట. విడి విడిగా చూద్దాం.
ద్విపద:-
ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ 
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి 
చేరి, గాంచి, పఠించి   చిత్తము చేర్చి,
వారి భావన తెల్పి, భాగ్యము పంచు.

మత్త కోకిల:-
ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ సత్ కవివై భువిన్ 
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి నీ కృతి గాంచగా
చేరి, గాంచి, పఠించి   చిత్తము చేర్చి, పొంగి ముదంబుతో 
వారి భావన తెల్పి, భాగ్యము పంచునట్టుల నుండుగా!

కందము:-
సుమ పరిమళంబు తోపగ
విమల గతిని కావ్య మమర, విజ్ఞులు పలుకం
గ మహితగతిని సలుపుమా!
కమనీయ కవిత లొలుకగ, గమకము తోడన్.
మీరూ ప్రయత్నించి కృతకృత్యులవాలనే నా ఆశ. 
యత్నే కృతే యది న సిద్ధ్యతి కో೭త్ర దోషః?
అందుచేత ప్రయత్ని స్తారు కదూ?
ధన్యవాదములు.
జైశ్రీరాం.
జైహింద్.

21, ఏప్రిల్ 2011, గురువారం

ఈ పద్యంలో ఎన్ని ఛందస్సులు ఇమిడున్నాయో చెప్పండి చూద్దాం

2 comments


పాఠక మహాశయా! 
ఈ క్రింది పద్యంలో ఎన్ని ఛందస్సులు ఇమిడి యున్నాయో గమనించే ప్రయత్నం చెయ్యండి.
సీ:- ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ సత్ కవివై భువిన్ కావ్య కర్తవగుము.
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి నీ కృతి గాంచగాను, సన్నుతులతోఁడ
చేరి, గాంచి, పఠించి   చిత్తము చేర్చి, పొంగి ముదంబుతో నీకు కీర్తి కొలుప  
వారి భావన తెల్పి, భాగ్యము పంచునట్టుల నుండుగా సదా! లలిత హృదయ!
గీ:- సుమ పరిమళంబు తోపగ, విమల గతిని
కావ్య మమర, విజ్ఞులు పలుకంగ మహిత
గతిని సలుపుమా! కమనీయ కవిత లొలుక
గ, గమకము తోడ నలరంగ గౌరవంబు.
గమనించారా? ఐతే పై పద్యాన్ని మీరు గమనించినన్ని ఛందస్సులలోను విడివిడిగా వ్రాసి తెలియ జేయండి.
అంతే కాదండోయ్. మీరూ ప్రయత్నించి అద్భుతమైన ఈ బంధ కవితా ప్రక్రియలో మీ నైపుణ్యం ఉట్టిపడేలా పద్య రచన చేసి వ్యాఖ్య ద్వారా పంపండి.
మీరు ఉత్సహం చూపడమే కాక మీ రచనలతో నన్ను ఉత్సాహ పరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీకు నా ధన్యవాదములు.

20, ఏప్రిల్ 2011, బుధవారం

PSLV 16 ప్రయోగం విజయవంతమైనందుకు అభినందనలు.

1 comments

శ్రీకరమైన మన భారత మాత ముద్దు బిడ్డలైన శాస్త్ర వేత్తల అకుంఠిత దీక్షా ఫలితంగా సిద్ధమైన అంతరిక్షనౌక PSLV16 యావత్ భారతీయుల హృదయాలను రంజింప చేస్తూ అత్యద్భుతంగా నిరాటంకంగా గగన తలంలో ప్రయాణించి, తన గమ్యాన్ని చేరుకొంటూ మూడు ఉపగ్రహాలను తమ కక్ష్యలలోకి చేర్చి, శాస్త్రజ్ఞులను యావద్భార జాతినీ ఆనంద పారవశ్యంలో ముంచిందంటే అది మన శాస్త్రవేత్తల నైపుణ్యానికీ, దేశ భక్తిభావానికీ నిదర్శనం.
ఇస్రో చైర్మన్ శ్రీ రాధా కృష్ణన్ గారిని, వారి సూచనలను పొల్లువోవకుండా అనుసరిస్తూ, తమ జ్ఞాన నైపుణ్యాలను జోడించి,ఐక్యతతో పనిచేసి,ఈ విజయానికి కారకులైన, భారతాంబకు ముద్దుబిడ్డలైన శాస్త్రవేత్తలను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన ప్రతీ ఒక్కరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
ఈ సందర్భంగా మన ప్రియతమ భారత రాష్ట్రపతికీ, కేంద్ర రాష్ట్ర పభుత్వాలకు, మహోన్నత భావ ప్రపూర్ణులైన యావద్భారతీయులకు నాహృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను.
మన శాస్త్రీయ పురోగతి ప్రపంచాన్నే ఆశ్చర్యపరచేలా దినదినాభి వృద్ధి చెందుతూ, యావత్సృష్టికీ మంగళప్రదంగా అకుంఠితంగా కొనసాగేలా చేయాలని ఆ పరమాత్మను మనసారా ప్రార్థిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

19, ఏప్రిల్ 2011, మంగళవారం

పండిత నేమాని చేసిన శ్రీ మానా ప్రగడ శేషశాయి గురు స్తుతి.

0 comments

గురు స్తుతి
శా. శ్రీనిష్ఠానిధి, వాగ్విభూషణుడు, రాశీభూత కారుణ్యమున్
జ్ఞానానంద మహాబ్ధి, శిష్యగణ విజ్ఞానానుసంధాయి, శ్రీ
మానాప్రగ్గడ శేషశాయి, బుధ సమ్మాన్యుండు, సద్భక్తితో
నేనా సద్గురు పాదపద్మ యుగళిన్ సేవింతు నశ్రాంతమున్

మ. నను సౌహార్దము నిండు దెందమున సన్మానించె, వాణీ స్వరూ
పునిగా జెప్పుచు గూర్చె గౌరవము, నా పొత్తమ్ములో పద్యముల్
మనమారన్ విని చాల మెచ్చుకొనె, నా మానాప్రగడ్వంశ చం
ద్రుని, చంద్రాతప కీర్తిమంతు వినుతింతున్ వాగ్లతాంతాళితోన్

తే.గీ. అతని తలపులు లోక శ్రేయస్కరములు
అతని పలుకులు ప్రథిత విద్యాంకురములు
అతని కృతులు సాహిత్య లోకాధ్బుతములు
శ్రిత హితార్థ ప్రదాయి శ్రీ శేషసాయి
ఇట్లు 
నేమాని రామజోగి సన్యాసి రావు

14, ఏప్రిల్ 2011, గురువారం

శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీగురుచరణారవిందాభ్యాంనమోనమః.

10 comments

శ్రీ మంగళంపల్లిని తన చూపులతో మంగళప్రదునిగా చేస్తున్న శ్రీశేషశాయి
శ్రీరస్తు.                         శుభమస్తు.                    అవిఘ్నమస్తు.
శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీ గురు చరణములకు
మీ శిష్య పరమాణువు చింతా రామ కృష్ణా రావు
భక్తి పారవశ్యముతో చేయుచున్న
పాదాభివందనములు.

శా:- శ్రీనాధాది కవుల్ ధరా తలమునన్ శ్రీ శేషశాయే యనన్
మానాప్రగ్గడ శేష శాయి గురుసమ్మాన్యా! కృపన్ గల్గిరే!
జ్ఞానాంభోధి ప్రసన్నభాస్కర! మహా జ్ఞానామృతాంశల్ సదా
ప్రాణంబై ప్రణవంబునౌచు వెలయన్ భాగ్యంబుగాఁ గొల్పిరే!

చ:- గురువర! మీ మహాద్భుత సుగోచర మయ్యెడి జ్ఞాన దీప్తి మా
వరగుణ వృద్ధి కారణము. భాగ్య నిధానము. భవ్య బోధయున్.
సరి యెవరయ్య మీకిలను సద్గుణ గణ్యులలోన నెన్నగా.
కరములు మోడ్చి మ్రొక్కెదను గౌరవమొప్పగ, జ్ఞాన భాస్కరా!

చ:- మధుర వచస్వి! మీ మృదుల మంజుల గాత్ర విశేషమేమొ! మా
యెదలును పల్లవించినవి. ఏమని చెప్పుదు మీదు ప్రేమ! వా
ఙ్నిధి లభియించె మాకు. మహనీయుల దర్శన భాగ్యమబ్బె. మీ
సదమల దివ్య మానసము సారథియై నడిపించె మమ్ములన్.

కంద గీత గర్భ చంపక మాల:-
వర మధుస్రావమై, అమృత వారిధియై, శుభమై రహించు శ్రీ
చరణ నుతిన్ సదా సకల సత్పరివర్తనఁ జక్క జేయుచున్,
పర సుధనంబు గా కవిత పార, ధరన్ నను గౌరవించ్రి. ప్రాక్
సరస కవీ! సదా తమరి సన్నుత దీవన తప్పదెందునన్!

చంపక గర్భస్థ గీతము:-
అమృత వారిధియై, శుభమై రహించు
సకల సత్పరివర్తనఁ జక్క జేయు
కవిత పార, ధరన్ నను గౌరవించ్రి.
తమరి సన్నుత దీవన తప్పదెందు.

చంపక గర్భస్థ కందము:-
మధుస్రావమై, అమృత వా
రిధియై, శుభమై రహించు శ్రీచరణ నుతిన్
సుధనంబుగా కవిత పా
ర, ధరన్ నను గౌరవించ్రి, ప్రాక్ సరస కవీ!

శ్రీ చక్ర బంధ తేటగీతి:-
వరద పాండిత్య! శ్రీ యుత! వాఙ్నిధాన!
లక్ష్య వరదుఁడ! శ్రీ కర! లక్షణాది
సిద్ధిఁ గొలిపితే! శ్రీ వరసిద్ధి రామ
వరలఁ జేసితి నన్నంది వామ దేవ!

చ"తురంగ"గతి బంధ కందము:- ( గురువరు - వదనము - భవభయ హరణము )
సునిశిత పదముల తగు వివ
రణముగ గురువుల శరణు నర వరులు మహతిన్
కనవలె నుయభ సుఫలదము
లనవరతము నయము శుభము లది యిడును తగన్. 


నక్షత్ర బంధ కందము:- ( సుజనవర - శేషశయన )
సుధ నభిషవ వశ వర! జ్ఞా
న ధనా! నయ బోధనను తనర కొలుపన్ శే
షి ధిషణ! భూమిజ దేవ! వి
శదమయ సుకవివర గణన. జన శేఖరుఁడా!

చ:- శుభమగు గాక దివ్య పరిశోభిత మూర్తికి జ్ఞాన దీప్తికిన్,
శుభమగు గాక పూజ్య రవి శోభలు గాంచిన పుణ్య మూర్తికిన్,
శుభమగు గాక శిష్య గణ శోభిత సద్గురు భవ్య కీర్తికిన్, 
శుభమగు గాక పుణ్య పరిశోభిత సత్కవి శేష శాయికిన్.
  
మంగళం                                                                   మహత్
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
ఇట్లు,
మీ శిష్య పరమాణువు
చింతా రామ కృష్ణా రావు.
హైదరాబాదు.
తేదీ.౧౪ - ౦౪ - ౨౦౧౧.
http://andhraamrutham.blogspot.com
సెల్.నెంబరు:- 9247238537.

10, ఏప్రిల్ 2011, ఆదివారం

కూప బంధ ఆట వెలది. చిత్ర కవిత.

1 comments


భరత మాత ముద్దు బిడ్డ శ్రీమాన్ అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం చేత జన లోక్ పాల్ బిల్లుసు పెట్టడానికి ఆమోదింప చేసారు.
వారి నుద్దేశించి వ్రాసిన కూపస్థ బంధ ఆట వెలది.















(వృత్తం మీద క్లిక్ చెయ్యండి)
ఖ్య భాగ్య తేద్యోగ సంధా
న్మనోజ్ఞ భాకల విను!
న్మ ధన్య మగు సత్యంబు గెలుచు   
ర్ణకలిత భా భరిత భువి!
సాహితీ మిత్రమా! మీరూ ప్రయత్నిస్తే ఇటువంటి పద్యం సునాయాసంగా వ్రాయ గలరు.
జైశ్రీరామ్.
జైహింద్.

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఓ భారతీయ ఆదర్శ యువతీ యువకులారా! మేల్కోండి.

0 comments


ఓ భారతీయ ఆదర్శ యువతీ యువకులారా!  మేల్కోండి. 
మంచి సమయం ఆసన్నమైంది. 
అవినీతి భరతం పట్ట గల జన లోక్ పాల్ బిల్లు కొఱకై అలుపెఱుగని పోరాటం చేస్తున్న అపర గాంధీ మన అన్నా హజారే చేస్తున్న నిజమైన సత్యాగ్రహాన్ని మనసారా అభినందించండి. 
మీ నిష్కళంకమైన హృదయ పూర్వకమైన మద్దత్తును తెలియ జేయండి. 
నేను సహితం అంటూ ఈ ఉద్యమంలో భాగస్వాములై ముందడుగు వేయండి. 
అలుపెఱుగని పోరాటానికి మీరూ శక్తినివ్వండి. 
భావి భారత పౌరులలో నీతి బీజాలు నాటే నైతికమార్గదర్శులవండి. 
ఎన్నాళ్ళని ఈ దురంతదౌష్ట్యాలను మీలో మీరే తిట్టుకొంటూ, ఏమీ చేయలేని అసహాయులులాగా జీవచ్ఛవాలలాగా జీవించాలని మీరు కోరుకొంటున్నారు? 
వద్దు. పిరికితనం మీకు వద్దు. 
యావద్భారత దేశంలోను అవినీతి రాబందులు సంఖ్యకంటే 
వారి అవినీతి కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధా సర్ప దష్టుల సంఖ్యే ఎక్కువ అన్న మాట మరువకండి. 
అంతా ఒక్కటైతే అవినీతిని రూపు మాప గలిగే జన లోక్ పాల్ బిల్లు తేవటం చాలా సులభమన్న విషయం మరువకండి. 
అన్నా హజారే అకుంఠిత దీక్షనొక్కమారు మనసారా తిలకించండి. 
అకళంక లోక కల్యాణకరమైన  హజారే దీక్షకు కారణం అతని ప్రగాఢ ఆత్మ విశ్వాసమే కదా! మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మీరూ సాఘిక సంస్కరణకుద్యుక్తులయేవారికి తోడ్పడండి.
మీదే విశాల భారతం, మీకే సొంతం, మీదే ఈ విశాల స్వతత్ర్య స్వేచ్ఛా సామ్రాజ్యం, సమైక్యతతో నడప గలిగే మీకే దేశ క్షేమం కూర్చడం సాధ్యమౌతుంది. 
విజయోస్తు.
అన్నాహజారే సహృదయతను మీరూ అలవరచుకొన గలిగితే మీరుద్యమించిన నాడు స్వార్థపూరితులకు , వారి రాజకీయ జీవనానికీ నూకలు చెల్లక మానవు.
అన్నా హజారే సత్యాగ్రహ ఫలంగా  అన్నా హజారే కోరిన విధంగా జన లోక్ పాల్ బిల్లు అతి త్వరలో నెలకొల్పబడునని మనసారా ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

శ్రీ పం.జో.జన్మ దిన సందర్భంగా 1971లోరచించిన నామ గోపన చిత్రము.

4 comments

18 . 11 . 1971 వ తేదీన నా మిత్రులు శ్రీ పంతుల జోగారావు జన్మ దినం సందర్భంగా ఆనాడు రచించిన పద్యం.
సీ:-
శ్రీమంత మగునట్టి కృతికి పుట్టిన రోజు...... శ్రీకాంతుడొచ్చి చరించు రోజు.
చింతలన్నియు కూడ చితిని కాల్చిన రోజు. పంత మొప్పగ కైత పలుకు రోజు.
తారతమ్యమొకింత తరలించు యీ రోజు... తుల లేని యనురక్తి వెలయు రోజు.
రారాజు చిన్నెల రహి పెంచు యీ రోజు...... లిత గాన మదేదొ వెలయు రోజు.
లయ మారుతమది మదిం బాడె ..........జోల.
కృపను కాల మొకింత సత్కృతులఁ...........గా
ష్ణాక్షరంబటు మమ్ముంచ నయత............. రావు
రావు దుస్థితుల్ మా మధ్య రావటంచు.
ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల విద్యాథిగా భాషాప్రవీణ చదువుకొనే ఆ రోజుల్లో గురువుల, మిత్రుల ప్రేరణతో చిన్న చిన్న పద్య కవితలు చేసే ఉత్సాహంతో వ్రాసిన నామగోపన చిత్రము అనే చిత్ర కవిత్వాన్ని పైనగల సీసపద్యంలో చూడ వచ్చును.
ఐతే బాల్య చాపల్యంతో ఆనాడు వ్రాసేటప్పుడు నా పేరుకు ముందు శ్రీకారం చేర్చుకోవడం అనుచుతం అన్న చిన్న విషయపరిజ్ఞానం కూడా ఆ నాడు నాకు లేదనే విషయాన్ని పై పద్యం స్పష్టం చేస్తోంది. అన్యధా భావించకండీ?
వీలైతే మీరూ ఒక చిన్న ప్రయత్నం చేసి చక్కని పద్యరచన చేసి మీ వ్యాఖ్యద్వారా పంపడం ద్వారా మీరు ప్రేరణపొందడంతో పాటు తోటి పాఠకులకూ ప్రేరణ నిచ్చినవారవగలరని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

4, ఏప్రిల్ 2011, సోమవారం

శ్రీ ఖర ఉగాది శుభాకాంక్షలు. వత్సర ఫలం వీక్షించండి.

5 comments


స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక ఖర నామ సంవత్సర చైత్ర శుద్ధ పడ్యమీ సోమవారం వత్సరాది సందర్భంగా ఆంధ్రామృత పాఠకులందరికీ, యావదాంధ్రులకూ, యావద్భారతీయులకూ, యావజ్జనానీకానికీ శుభాకాంక్షలు తెలియ జేసుకొంటున్నాను.
శ్రీకల్యాణ మనోజ్ఞ భావ విలసత్ శ్రీమత్ ఖరాఖ్యాబ్ధిలో
శోకాతీత విశిష్ట సౌఖ్య ఫలముల్ శోభిల్లఁ జేయున్ మిమున్.
లోకేశుండు మదిన్ వసించు కుమతిన్, లోలత్వమున్ బాపుచున్.
శ్రీకారంబును జుట్టఁ జేయు తమచే శ్రేయంబులన్ జేయగా.
ఉగాది సందర్భముగా పంచాంగ  పఠన శ్రవణ ఫలము లసాధారణమైనవి.
తిథించ శ్రియమాప్నోతి
వారా దాయుష్య వర్థనం,
నక్షత్రం హరతే పాపం,
యోగాద్రోగ నివారణం,
కరణం కార్య సిద్ధిశ్చ.
పంచాంగ మాకర్ణ్యతాం.
తిథియ శ్రీలను కలిగించుదివ్యముగను
వారమాయువు నొసగును, ప్రగణితముగ
పాపహరణము నక్షత్ర మోపి చేయు
యోగమది రోగములు బాపి యోగములిడు,
కరణ మది కార్య సిద్ధిని కలుగఁ జేయు.
ఇట్టి పంచాంగమును విను దిట్టలకును.

ఈ రోజు తిథ్యాది పంచాగములం గూర్చి తెలుసుకొందము.
శ్రీ ఖర నామ సంవత్సరం 
తిథి: చైత్ర శుద్ధ పాడ్యమి గం.౧౦.౨౪ ని.ల వరకు,
వారము: సోమ వారము.
నక్షత్రం ; రేవతి నక్షత్రము. సాయంత్రం గం. ౫.౧౫.ని. వరకు.
యోగము: ఐంద్ర యోగము పగలు గం.౧౦.౨౫ ని. వరకు.
కరణము: కింస్తు కరణము. పగలు గం. ౯.౧౩ ని. వరకు.
ఈ ఖర సంవత్సర ఫలము
నవ నాయకులు:
చంద్రుఁడు: రాజు, రసాధిపతి: 
మంచి వానలు కురియును. భూమిసుభిక్షమై సుఖ క్షేమములతో కూడి యుండును.
షడ్రసములు పుష్కలముగా ఫలించును. 
గురుఁడు : మంత్రి.
సువృష్టి.నానా విధ వృక్షములు, సస్యములు పుష్కలముగా ఫలించును.ప్రజలు ఆరోగ్య సుఖ సంతోషములతో ఉందురు.
బుధుఁడు : సేనాధిపతి. అర్ఘాధిపతి, మేఘాధిపతి.
మేఘములు గాలిచే ఎగురగొట్టబడుచుండును. అప్పుడప్పుడు అక్కడక్కడ వర్షించు చుండును. సస్యములు మంచిగా ఫలించును. ప్రజలు కామ వాంఛా పీడ్తులగుదురు.
పంటలు పుష్కలముగా పండి మంచి ధర కలిగి యుండును. 
మధ్య ప్రదేశ్ నందు మంచి వర్షములు కురియును.
రవి : సస్యాధిపతి, నీరసాధిపతి.
పొట్టు ధాన్యములు, మెట్ట పంటలు అదికముగా ఫలించును.
రాగి, చందనము. పగడము మాణిక్యములు, ముత్యములు, ఎక్కువ లభించును.
శుక్రుఁడు : ధాన్యాధిపతి.
వర్షము లధికముగా కురియును. సస్యము లన్నియు బాగుగా ఫలించును. ప్రజలు  ఆరోగ్యవంతులై ఉందురు.
నవ నాయకులలో ఏడుగురు శుభులు.
ఉప నాయకులు ముప్పదిమందిలో ఇరువదిరెండు మంది శుభులు.
కావున ఈ సంవత్సరము కాలము మంచి అనుకూలముగ నుండి శుభప్రదముగ నుండును.
పదునారింట పదకొండు భాగములు ఫలించును.
పశు పాలకుఁడు శ్రీ కృష్ణుఁడు.
దొడ్డి పెట్టు వాఁడు, విడిపించు వాఁడు బలరాముఁడు.
పశువులు వృద్ధి చెందును.ధరలు అందుబాటులో ఉండును.
సమస్త దేశములందు చక్కని పంటలు పండును.
మధ్య ప్రదేశ్ లో వర్ష భీతి కలుగు చుండును.
ఆఢక నిర్ణయము:
రాజు చంద్రుఁడగుటచే మూడు కుంచముల వాన. సుభిక్షము.
కుంచము ౨౦.౮.౨౦౧౧ వరకు యుక్త బ్రాహ్మణుని చెతియందు,
౧౫.౧౧.౨౦౧౧ వరకు ముదుసలి బ్రాహ్మణుని చేతియందు, వత్సరాంతము వరకుబాల గోపాలుని చేతియందు కుంచమున్నది.
దుర్భిక్శము సస్య నాశనము.౧౫.౧౧.౨౦౧౧ నుండి సుభిక్షము.
గంగా పుష్కర్తములు.: ౮.౫.౨౦౦౧౧ నుందెఇ ౧౯.౫.౨౦౧౧ వరకు.ఆ ప్రాంతము వారికి శుభ కార్యములు నిషిద్ధము.
మూఢము:
చైత్ర బ.నవమీ మంగళ వారము వరకు గురు మూఢము.
కొందరి మతమున ౨౩.౪.౨౦౧౧తో మూఢము పోవుచున్నది.
౨౧.౭.౨౦౧౧ నుండి ౧౭.౯.౨౦౧౧ వరకు శుక్ర మూఢము.
వివాహాది శుభ కార్యములు నిషిద్ధము.
మకర సంక్రాంతి: ౧౪.౧.౨౦౧౨ ఉత్తర నక్శత్రమున తులా లగ్నమున రాత్రి ఒంటి గంటకు రవి మకరమున ప్రవేశించును.
గ్రహణములు:
జ్యేష్ట శు. పూర్ణిమా బుధవారంఅనగా తే. ౧౫.౬.౨౦౧౧.దీని సంపూర్ణ చంద్ర గ్రహనము.
ఈ గ్రహణము జ్యేష్ట, మూల నక్షత్రములందు అనగా వృశ్చిక ధనుస్సు రాసులయందు ఏర్పడు చున్నది.
రాత్రి గం.౧౧.౫౨ ని.ల నుండి రాత్రి గం.౩.౩౬ ని.ల వరకు..
మార్గశిర శుద్ధ పూర్ణిమా శని వారం అనగా తే.౧౦.౧౨.౨౦౧౧సంపూర్ణ చంద్ర గ్రహణము.
రోహిణి, మృగశిర నక్షత్రములందు వృషభ రాశిలో సంభవించును.
సాయంత్రం గం. ౬.౧౩ని. నుండి  రాత్రి గం. ౯.౫౦. ని.ల వరకు.
ఆదాయ వ్యయములు:
మేష . వృశ్చికములకు ఆదాయము 14 వ్యయము 2. 
వృషభ. తులలకు ఆదాయము 8 వ్యయము11 
మిధున. కన్యలకు ఆదాయము 11 వ్యయము 8. 
కర్కాటకమునకు ఆదాయము 5 వ్యయము8. 
సింహమునకు ఆదాయము 8 వ్యయము 2. 
ధనుస్సు, మీనములకు ఆదాయము 2వ్యయము11 
మకర కుంభములకు ఆదాయము 5 వ్యయము 5. 
రాజ పూజ్య అవమానములు: 
మేషం . రాజపూజ్యము 4 అవమానము 5
వృషభం రాజపూజ్యము 7 అవమానము 5
మిధునం. రాజపూజ్యము 3 అవమానము 1
కర్కాటకం రాజపూజ్యము 6 అవమానము 1
సింహం రాజపూజ్యము 2 అవమానము 4
కన్య రాజపూజ్యము 5 అవమానము 4
తుల రాజపూజ్యము 1 అవమానము 7
వృశ్చికం రాజపూజ్యము 4 అవమానము 7 
ధనుస్సు రాజపూజ్యము 7 అవమానము 7
మకరం రాజపూజ్యము 3 అవమానము 3
కుంభం రాజపూజ్యము 6 అవమానము ౩ 
మీనం రాజపూజ్యము 2 అవమానము 6
కందాయ ఫలములు: 
అశ్విని         4   .   2  .    1.
భరణి           7   .  0   .   3.
కృత్తిక          2   .  1   .    0.
రోహిణి         5   .   2   .   2.
మృగశిర       0   .   0   .   4.
ఆరుద్ర          3   .   1   .   1.
పునర్వసు    6  .    2   .   3.
పుష్యమి       1  .     0   .    0.
ఆశ్లేష           4   .     2   .    1.
మఖ            7    .    2  .    4.
పుబ్బ          2   .    0   .    1.
ఉత్తర            5  .     1   .    3.
హస్త              0   .    2   .    0.
చిత్త              3  .     0   .   2.
స్వాతి           6   .   1   .    4.
విశాఖ          1  .    2    .    1.
అనూరాధ     4  .     0   .    3.
జ్యేష్త             7   .   1   .     0.
మూల          2   .   2   .    2.
పూర్వాషాఢ   5    .   0    .   4.
ఉత్తరాషాఢ     0   .    1    .   1.
శ్రావణం        3    .    2    .   3.
ధనిష్ట          6    .    0    .   0.
శతభి            1    .    1    .   2.
పూర్వాభాద్ర   4    .    2    .   4.
ఉత్తరాభాద్ర    7    .    0   .    1.
రేవతి.              2    .    1   .    3.
బేసి సంఖ్య ధన లాభము
సమ సంఖ్య సమ లాభము.
సున్న సూన్య ఫలము.
ఒకటి, రెండు సున్నలు భయము.
మూడవ సున్న  హాని.
సంవత్సర ఫలము:
అశ్విని . పుష్యమి . స్వాతి . అభిజిత్తు వారలకు రోగ భయము.
భరణి . ఆశ్రేష . విశాఖ .  శ్రవణం వారలకు ఆయుర్వృద్ధి.
కృత్తిక . మఘ . అనూ . ధనిష్ఠ వారలకు అర్థ లాభము.
రోహిణి . పుబ్బ . జ్యేష్ఠ . శతభిషం వారలకు మనస్తాపం.
మృగశిర . ఉత్తర . మూల . పూర్వాభాద్ర వారలకు రాజ పూజ్యం.
ఆర్ద్ర . హస్త . పూర్వాషాఢ . ఉత్తరాభాద్ర వారలకు యుద్ధ భయం.
పునర్వసు . చిత్ర . ఉత్తరాషాఢ . రేవతి వారలకు అలంకార ప్రాప్తి.
సర్వాణి సన్మంగళాని భవంతు.
స్వస్తి