జైశ్రీరామ్.
101. ఓం నృకేసరిణే నమః.
చంద్రవర్త్మ వృత్త గర్భ సీసము.
పరమేశ్వరా! నీదు పాదపద్మములు ప - ట్టి విడువ, నిన్నే వడిన్ గొలిచెద.
బాధలన్ దీర్చెడి నీదు రూపమును నే - ను కనవలెన్. గాంచ సుకరమదియె.
శ్రీకరంబైనట్టి శ్రీధరా! కృపను చే - దుకొనుమయా! చేరుదు, నను కనుమ!
బాధఁ బాపెడి, వర బోధఁ గొల్పి ననుఁ బ్రో - చు నరహరీ! నన్నుఁ జూచి ప్రోచు.
గీ. చంద్రవర్త్మ సద్ గర్భిత సత్ప్రకాశ - సీస వాస *నృకేసరి*! శ్రీహృదీశ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
101వ సీస గర్భస్థ చంద్రవర్త్మ వృత్తము. (ర న భ స .. యతి 7)
పాదపద్మములు పట్టి విడువ నిన్. - నీదు రూపమును నేను కనవలెన్.
శ్రీధరా కృపను చేదుకొనుమయా! - బోధఁ గొల్పి ననుఁ బ్రోచు నరహరీ!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ పరమేశ్వరా! నీ పాదపద్మములను విడువను, వడివడిగా
నిన్నే నేను కొలిచెదను. బాధలను బాపు నీ ముఖము చూచెదను. అదియే సులభము. శ్రీకరుఁడవయిన శ్రీధరా! కృపతో
నన్ను చేదుకొనుము. నేను నిన్ను చేరెదను. నన్ను చూడుము. బాధలను పోగొట్టెడి మంచి బోధను నాకు కలిగించు ఓ
శ్రీనరహరీ! చం ద్రవర్త్మవృత్తగర్భ సీసపద్యమున ప్రకాశించు ఓ నృకేసరీ! ఓ శ్రీహృదీశా! ! నన్ను చూచి కాపాడుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.