గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2024, ఆదివారం

పయస్వినీనాం ధేనూనాం .. చెప్పుకోండి చూద్దాం

0 comments

జైశ్రీరామ్.

శ్లో .  పయస్వినీనాం ధేనూనాం 

బ్రాహ్మణః ప్రాప్య వింశతిం 

తాభ్యోష్టాదశ విక్రీయ 

గృహేత్వైకాం గృహంగతః !

భావము. 

ఇరవై ఆవులను బ్రాహ్మణుఁడు తీసుకొని అందు పద్దెనిమిది అమ్మివేసి, 

ఒక్క ఆవుతో యింటికి వెళ్ళెను.

ఎలాసరిపోతుంది?  ఇది చెప్పుకోండి చూద్దాం.(ధేను ఊనాం)

జైహింద్.

మామను సంహరించి, యొక మామకు గర్వమడంచి .. ప్రాచీన తెలుఁగు కవుల రచనలు Part 2.

0 comments

జైశ్రీరామ్
చం.  మామను సంహరించి, యొక మామకు గర్వమడంచి, యన్నిశా 
మామను రాజుచేసి, యొకమామ తనుజునకాత్మ బంధువై 
మామకు గన్నులిచ్చి, సుతు మన్మథ పత్నికి తానే మామయై, 
మామకు మామయైన P పరమాత్ముడు మాకు ప్రసన్నండయ్యైన్ ||
మామను సంహరించి,
విష్ణువు అవతారాలలో ఒకటైన కృష్ణుని కంసుడనే మామను సంహరించినాడు కదా!
యొకమామకు గర్వమడంచి
విష్ణుమూర్తికి సముద్రుడు మామ, రామావతారంలో సముద్రుడనే మామకు గర్వం భంగం చేస్తాడు కదా!
యాన్నిశా మామను రాజు చేసి,
యా నిషా, అంటే రాత్రికి, మామ అనే శబ్దమునకు చంద్రుడు కూడా వస్తాడు, ( చందమామ) పార్వతీదేవి శాపం వలన క్షీణుడైన చంద్రున్ని రాత్రికి రాజు ని చేస్తాడు
యొకమామ తనుజునకు ఆత్మ బంధువై,
అర్జునుడు కృష్ణుని కి ఆత్మ బంధువు, అర్జునుని తండ్రి వీరికి మామయ్య కదా!
మామకు గన్నులిచ్చి
రాయబారం లో ధృతరాష్ట్రునికి కన్నులు ప్రసాదిస్తారు శ్రీకృష్ణుల వారు,,
సుతు మన్మధ పత్నికి తానే మామయై, కృష్ణుని కుమారుడే కదా మన్మధుడు, ఆ మన్మధుని పత్ని రతీదేవి, రతీదేవికి వీరు మామే కదా!
మామకు మామయైన పరమాత్ముడు మాకు ప్రసన్నుడయ్యెన్
విష్ణుమూర్తికి సముద్రుడు మామ, లక్ష్మీదేవి సముద్రుని కూతురు గనుక, అయితే (మధ్యగంగ) విష్ణుమూర్తి పాదముల నుండి ఉద్భవించినది, అన్ని నదులు సముద్రంలోనే సంగమిస్తాయి కదా!
జైహింద్.

తేనియల్ చిందు నా భాష తెలుగుభాష .. ... జాతీయ తెలుగు సాహితీ పీఠము … డా. నలవోలు నరసింహా రెడ్డి గారు నాపై కురిసిన పద్యపీయూషము. ౨౬ - ౬ - ౨౦౨౩

0 comments

జైశ్రీరామ్.     


కవి శిఖామణి చింతా రామకృష్ణారావు గారికి 

పంచ పద్యసుమాలు


... జాతీయ తెలుగు సాహితీ పీఠము …

తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

డా. నలవోలు నరసింహా రెడ్డి 

ఉ. ఆతడు నిండుకుండ, మరియాదకు తెల్లని మంచు కొండ, ప్ర 

ఖ్యాతికి పూల దండ, గగనంబున నెత్తిన ఝండ పాండితిన్,    

భూతలమంత నిండ విర బూచిన మండ తెలుంగు  పద్యపుం 

రాతల  లోన గండ, తన లాస్యము శిష్యుల కండ,  నుండెడిన్ 


ఉ . మెత్తని వాడవీవు, సుతి మెత్తని భావము నీది, అన్యులన్   

మొత్తగ బోవు , గుండియలు మోసులు వారగ పండితాళురన్    

చిత్తములోన  మెచ్చు కొను చిత్తము  నీది, నీదు సేవయే 

పొత్తము నందు వ్రాసికొన బోలును ఓ కవి రామకృష్ణుడా! 


ఉ. అందరి వాడు, స్నేహమున హద్దులెరుంగని వాడు, కైతలో 

ముందరి వాడు, నెల్లరకు మోదము గూర్చెడు వాడు, చల్లనౌ

డెందము వాడు, నెయ్యెడల టెక్కులు జేయనివాడు, దర్పమున్ 

జెందని వాడు, సాదు గుణ శీలుడు  మాకవి రామకృష్ణుడున్ 


ఉ. మంచికి మారు పేరు, అభి మానుడు పెద్దల పట్ల, యెన్నడున్వం

చన సేయ నేరడు, వివాదము లందున దూరబోడు, దీ  

పించెడు  సౌమ్య శీలుడయి యెల్లరి  గుండెల  కొల్ల గొట్టు ని 

ర్వంచిత  బుద్ధి శీలునకు రంజిల నా యభినందనంబులున్    


మ. చిర కాలంబును గల్గు గావుత ! శుభాశీస్సుల్ సిరుల్ సంపదల్ ! 

కొరతేమాత్రము లేక జీవితమునన్ కొంగ్రొత్త భాగ్యంబులున్ 

వరలున్  గాత! ధరాతలంబునను దివ్యంబై యశో వల్లికల్ 

విరియున్ గాత! నిరంతరంబు మిము దీవించంగ వాగ్దేవి తాన్.

జైహింద్.

శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్నిభూ.. | ప్రాచీన తెలుఁగు కవుల రచనలు. .. చెప్పుకోండి చూద్దాం...

0 comments

జైశ్రీరామ్.
వివరణ.
శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్నిభూ 
ధర గగనాబ్ది వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరమగు రెట్టి రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్.

శర, సాయక అనే పదాలకు సూచన..
మన్మథుని పంచసాయకములు 5

గగన, వియత్ అనే పదాలకు సూచన..
గగనం అంటే ఆకాశం
అంటే శూన్యం..

శశి, చంద్ర, తుహినాంశు అనే పదాలకు సూచన..
1
ఈ భూమికి చంద్రుడు
ఒక్కడే కదా....

షట్కము అనే పదమునకు సూచన 6

రంధ్ర - అనే పదమునకు సూచన..9
అంటే నవరంధ్రాలు
ఒక్కడే కదా....

నగ, గిరి, భూధర అనే పదాలకు సూచన..7
సప్త కుల పర్వతాలు సప్త గిరులు...

అగ్ని అనే పదానికి సూచన..
గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అనునవి

అబ్ది, పయోనిధి అనే పదాలకు సూచన. 4

తర్క - అనే పదమునకు సూచన..6
షట్ తర్కములు..
ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద అర్ధాపత్తి, అనుపలబ్ది అనునవి -6

పద్మజాస్య - అనే పదమునకు సూచన..4

పద్మజుడు అనగా బ్రహ్మ
బ్రహ్మ 4 ముఖములు అలిగినవాడు 

కుంజర - అనే పదమునకు సూచన..8
అష్ట దిగ్గజాలు - ఈ భూమికి ఆధారం అయినవి ఇవే

శర, శశి,, షట్క, చంద్ర, శర
5 -  1 -  6  -  1  -  5
సాయక, రంధ్ర, వియత్, నగాగ్ని, భూ
5-9-0-3-7
ధర, గగన, అబ్ది, వేద, గిరి
7-0-4-4-7
తర్క, పయోనిధి, పద్మజాస్య అనే పదాలకు 6-4-4
కుంజర హిమాంశు 8 -  1
అంకానాం వామతో గతి:
లెక్కించేటప్పుడుమన పూర్వికుల సాంప్రదాయ సూత్రం వచ్చిన సంఖ్యను కుడి నుంచి ఎడమకు చేసి చదువుకోవాలి.
చివరగా తేలిన సంఖ్య :-
1,84,46,74,40,73,70,95,51,615
ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40లక్షల 73వేల 70కోట్ల 95లక్షల 51వేల 615

ఒక ఘన మీటరు సుమారు
ఒకటిన్నర కోట్ల గింజలు దాచవచ్చు..

4మీటర్ల ఎత్తు, 10మీటర్ల నిడివి ఉన్న గాదెలు దాదాపు 12 వేల ఘన కిలోమీటర్లు విస్తీర్ణం , అలా పేర్చుకొంటూ వెళ్తే 30 కోట్ల కిలోమీటర్లు అనగా భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరానికి రెట్టింపునకు రెట్టింపు ధాన్యం ఇవ్వవలసి ఉంది.
ఇవి లెక్కపెట్టడానికి పట్టే కాలం 58వేల 495కోట్ల సంవత్సరాలు.
జైహింద్.

29, జూన్ 2024, శనివారం

వేదాంత దేశికులవారి అపునర్యుక్త వ్యంజనం. "చిత్రపద్ధతి" శ్లోకమ్.

0 comments

జైశ్రీరామ్. 

వేదాంత దేశికులవారి అపునర్యుక్త వ్యంజనం. "చిత్రపద్ధతి" శ్లోకమ్.   

శ్లో. బాఢాఘాళీ ఝాటతుచ్చే గాధాభానా యపుల్లఖే | 

సమాధిశఠ జిచ్చూడాం వృణోషి హరి పాదుకే ||

వివరణ.

ఓ భగవత్పాదుకా, దృఢమైన పాప సముదాయ మనే అడవి లేనట్టి, వికసించిన 

మనస్సు గల సమాధి యోగ మందు దివ్య ప్రబంధాన్ని ప్రకాశింప చేయడానికి 

నీవు శరగోప సూరి శిరస్సును వరిస్తున్నావు.

శబ్దాలంకార ప్రకరణం  అపునర్యుక్త వ్యంజనం

శ్లో.  హతచ్చండోఢాఘ ఝాటా వేల్లిదోషా మిళచ్ఛరం | 

ఫణిశయ్యం రంగనాథం భజే బుధ సుఖావకం ||

వివరణ.

క్రూర పాపులు అయిన రాక్షసులను హతమార్చిన వానిని, నాగేంద్రున్ని పాన్పుగా 

కలిగిన వానిని, దేవతలకు జ్ఞానమును, సుఖములను కూర్చు వానిని అయినట్టి 

శ్రీరంగనాథుని సేవిస్తాను.

జైహింద్.

గోమూత్రికాబంధ శ్లోకము. శివ కర్ణామృతంBest Sanskrit Slokas In Telugu With meaning @SWADHARMAM

0 comments

జైశ్రీరామ్.
శ్లో॥ నందివాహం నతాశేషం దేవం దేవేశ్వరం పరం 
నిందితాహం కృతాశ్లేషం శివం సేవే నిరంతరమ్.
వివరణ.
నంది వాహం - నందివాహనము గల, నతాశేషమ్ - నమస్కరింప బడిన శేషుడు (సర్పరాజు) మొదలైన అందరిచే నమస్కరింపబడిన, దేవేశ్వరం - దేవతా ప్రభువైన, పరమ్- ఉత్కృష్టమైన, దేవం- దేవుడైన, నిందితా + అహం కృతా శ్లేషం - నిందింపబడిన అహంకృతియైన కౌగిలింతగల, శివం- శివుని నిరంతరం - ఎల్లప్పుడూ, సేవే- సేవించెదను.
జైహింద్.

28, జూన్ 2024, శుక్రవారం

బ్రహ్మశ్రీ రాచాలపల్లి బాబు దేవిదాస్ రావు ఆత్మకూరు కవి వరులకు తెలంగాణా సారస్వత పరిషత్ అవార్డ్.

0 comments

జైశ్రీరామ్.

బ్రహ్మశ్రీ రాచాలపల్లి బాబు దేవిదాస్రావు మహోదయులుఆంధ్ర సంస్కృత మరాఠీ భాషలలో అసమాన ప్రతిభులు. అనేక గ్రంథములకు వ్రాసిన గొప్ప కవి. నా శ్రీమన్నారాయణ శతకము వంటి గ్రంథములను అచ్చొత్తించిన మహోన్నత ఉదారగుణసంపన్నులు. అట్టి వీరి ప్రజ్ఞకు తగినట్టులుగా ఇన్నాళ్ళకు తెలంగాణా సారస్వతపరిషత్ అవార్డ్ రావడమనునది సాహిత్య లోకమునకే ఆనందదాయకమైన విషయము.

ఈ మహోన్నత గురుమూర్తికి ఆంధ్రామృతం అభినందనలు తెలియఁజేస్తోంది.

ఆత్మకూరు, జూన్ 27 : తెలుగు సంస్కృతి సాహిత్యంలోని వివిధ ప్రక్రియలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు ఈ ఏడాదికి గాను తెలంగాణ సారస్వత వరిష్ట పురస్కారాలను బుధవారం ప్రక టించింది. అందులో భాగంగా ఆత్మకూరు వాసి, రి టైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు బాబు దేవిదాస్ రావు శ్రీరామాయణో పనిషత్తు పద్య కవిత్వం సా హిత్య రూపంలో రాసినందుకు గాను తెలంగాణ సారస్వత పరిషత్ అవార్డు వరించింది. సంస్కృతి సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్న ఆయనను ఎంపిక చేయడం గర్వకారణం అని పట్టణ ప్రము ఖులు అంటున్నారు. వీరి పూర్వీకులు మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాంతంలో స్థిరపడ్డా రు. కల్వకుర్తి పట్టణంలో పెరిగి పెద్దవాడైన బా బు దేవిదాస్ రావు 1969లో మొదటగా కల్వకుర్తి లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1970నుంచి సాహి త్య రచన ప్రా రంభించి ప ద్య, గద్య, వచనములలో, తెలుగు సంస్కృతం, మరాఠి, హిందీ మొదలగుభాషల్లో రచనలు చేసి ఉభయ రాష్ట్రాల్లో అనేక సత్కారాలు, సన్మానాలు పొందారు.
• ఆత్మకూరులో స్థిర నివాసం రాచాలపల్లి బాబు దేవిదాస్రావు ఉద్యోగ రీత్యా ఆత్మకూరు సంస్థానం చేరినా ఆయన ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరి మాతృభాష మ రాఠీ. అయినా తెలుగుభాషా పండితుడిగా, కవిగా
పేరుగాంచారు. అంతేకాకుండా వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో ఉపాధ్యా య వృత్తిని కొనసాగించి 1986లో ఉత్తమ ఉపా ధ్యాయుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఎందరి నో విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేర్చిన వారిలో ప్రముఖుడు. వేద శాస్త్ర రక్షణ పరిషత్తు ఉమ్మడి పాలమూరు జిల్లా కార్యదర్శిగా ఉండి 16 సభలు ఆత్మకూరు పట్టణంలోనే నిర్వహించి ఎందరో కవులకు ఆదర్శప్రాయుడ య్యారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ప్రతీయేటా తెలంగాణ సారస్వత పరిషత్ వరిష్ట పురస్కారాలు అందిస్తోంది. అందు లో భాగంగా ఈ సంవత్సరం మన ఆత్మకూరు పట్టణవాసి ఎంపికైనందుకు గాను పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు, కవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరిన్ని సాహిత్య కళా సంపుటిలను అందించాలని ఆత్మకూరు పట్టణ ప్రముఖులు కోరుతున్నారు.
జైహింద్.

చిత్ర కవిత్వం - బంధకవిత్వం bhandhakavitwam/chitra kavitwam

0 comments

జైశ్రీరామ్
జైహైంద్

శిష్యుడు గురువుకు వేసిన ప్రశ్న.... చెప్పుకోంది చూద్దాం.

0 comments

జైశ్రీరామ్.
ప్రశ్నలతో కూడిన శ్లోకం
సముద్యతే కుత్ర న యాతి పాంశులా?
సముద్యతే కుత్ర భయం భవేజ్జలాత్?
సముద్యతే కుత్ర తవా పయాత్యరి?
ప్రహేణ సంబోధన వాచికం పదం
నిబంధనలు..
మొదటి ప్రశ్నకు సమాధానం నాలుగు అక్షరాలు ఉండాలి, అందులోని మూడు అక్షరాలు రెండవ ప్రశ్నకు, అందులోని రెండక్షరాలు మూడవ ప్రశ్నకు, ఆఖరి అక్షరం నాలుగవ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

ప్రశ్న అర్థం- జవాబులు
*1 వ ప్రశ్న:
* ఎవరు ఉదయిస్తే వ్యభిచారులు తిరగడం మానేస్తారు? 
సమాధానం *'హిమకరః'* అంటే (చంద్రుడు), ఈ శ్లోకంలోని ప్రశ్నలన్నీ సతి సప్తమిలో వున్నాయి. కనుక సమాధానాలు కూడా సతి సప్తమిలోనే ఉండాలి. కనుక సమాధానం 'హిమకరే'*

*2వ ప్రశ్న:
* ఏ జంతువు నీటినుండి బయటకు వస్తే భయం కలుగుతుంది? 
మొసళ్ళు సమాధానం సంస్కృతంలో మొసలిని "మకరః'* అంటారు. సతి సప్తమి కనుక *"మకరే* సమాధానం.

*3వ ప్రశ్న:
* నీవు ఏది ఎత్తితే నీ శత్రువులు పారిపోతారు?
 *'కరః'* అంటే చేయి. సతి సప్తమి కనుక
*"కరే* నీవు చేయి ఎత్తితే శత్రువులు పారిపోతారు.

*నాల్గవ ప్రశ్న:* హీన కర్మల నాచరించే వాడిని యేమని పిలుస్తారు? 
*'ఒరే'* అని పిలుస్తారు. దీన్ని సంస్కృతములో *"రే'' అంటారు. *"రే'* అని నాల్గవ సమాధానం.
జైహింద్.

26, జూన్ 2024, బుధవారం

కం స జఘాన కృష్ణః ? .. చెప్పుకోండి చూద్దాం.

0 comments

జైశ్రీరామ్.

 శ్లో.  కంస జఘాన కృష్ణః ? 

కాశీతల వాహినీ గంగాః ? 

కేదార పోషణ రతాః? 

కం బలవంతం న బాధతే శీతం?

ప్రశ్నలోనే జవాబు ఉండే శ్లోకం - అర్థం

1 కం స జఘాన కృష్ణః?=కృష్ణుడు ఎవరిని చంపెను?అని ప్రశ్న

కృష్ణః కంస జఘాన .=కృష్ణుడు కంసుని చంపెను అది సమాధానము

2. కా శీతల వాహినీ గంగాః? ?=ఏది శీతల ప్రవాహము కలిగినది?

కాశీ తలవహినీ గంగాః=కాశీ లో ప్రవహించే నది గంగ అది సమాధానం.

3. కే దార పోషణ రతాః ?కే =ఎవరు? దార పోషణ రతాః? =భార్యా బిడ్డలను 

పోషించు వారు?

కేదారము అంటే పొలము, పోషణ రతాః అంటే పొలము దున్నడం 

తెలిసినవారు .పొలము దున్ని పంటలు పండించ గల వారు.

భార్యా బిడ్డల్ని పోషించ గలరు. 

4. కం =ఏ, బలవంతం=బలవంతుని, న బాధతే శీతం=చలి బాధించదు

కంబల వంతం= కంబళి కప్పుకున్న వాడిని చలి బాధించదు.

జైహింద్.

రాజా వేశ్యా యమశ్చాగ్నిః .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  రాజా వేశ్యా యమశ్చాగ్నిః - చోరాః బాలక యాచకః 

పరదుఃఖం సజానంతి - అష్టమో గ్రామ కంటకాః!  (చాణక్య నీతి)  

తే.గీ.  రాజు, వేశ్య, యముండగ్ని, గ్రామకరణ,

ము కన, పిల్లలున్, యాచకుల్, పురిని చోరు

లునెడి యెనిమిదిమందియు కనరు పరుల

బాధలను, దైవ ప్రార్థనన్ బాధలుడుగు

భావము.

"రాజు, వేశ్య, యముడు, అగ్ని, దొంగ, బాలకులు, యాచకులు, గ్రామకరణము, 

ఈ ఎనిమిది మందికి ఇతరులు ఏ పరిస్థితులలో ఉన్నారనే ఆలోచన ఉండదు.. 

ఎదుటివారి బాధ అర్థము చేసుకో లేరు.

జైహింద్.


25, జూన్ 2024, మంగళవారం

స్వరము,భీజము,క్షీరోధి,నిరవద్య,నిర్వాణ.ద్యోతక,నిధాన,సదానంద,సర్వోదయ,పంచభూత, పర్వం,వదాన్యం,సుమంతం,వసంతం"స్వర తేజ"-వృత్తము, రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

0 comments

జైశ్రీరామ్.

స్వరమే భీజం శక్తి మంతమ్!సర్వార్ధ ధ్యోతకం బుధమ్!సదా పంచ భూతా వసంతమ్!
వర క్షేరోధిం శేష తల్పమ్!పర్వంబు స్తోత్రకా న్వితమి!సదానంద సందోహ చిత్రమ్!
నిర వధ్యం బుద్ధిం దదామ్యమ్!నిర్వాణ శోభకామృతమ్!నిదానం వదాన్యం సుమంతమ్!
చరితం కారుణ్యాశ్రి తత్వమ్!సర్వోదయం సు భాషితమ్!సదానంద ధేయంవరీయమ్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,'అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,18,అక్షరములకు చెల్లును,

భావము:-స్వరము,భీజము(ప్రాణము).శక్తి మంతమైనది,నానార్ధ ప్రబోధకమైనది,బుధ గ్రాహ్య
మైనది,ఎల్లప్పుడు పంచ భూత సమన్వితమై(పృధి ర్వప స్తేజో వాయు రాకాశాత్)విరాజిల్లు
నది,శ్రేష్ట మైన పాల్కడలి శేష తల్ప తుల్య మైనది,పవిత్రమైన స్తోత్రములతో కూడినది,
సదా జ్ఞాన దాయిని,శోభ కామృత నిర్వాణము,నిధానమైనది,వదాన్య మైనది,కరుణాన్విత
చరితా తత్వము గలది,సమస్త జనుల అజ్ఞానమును తొలగించి జ్ఞానోదయము కలిగించు
సుభాషిత రత్నా కరం,సదా నంద మొసగునది, వరీయమైనది,
[ప్రాణాత్మక భీజం  పంచ భూతాత్మకము,స్తుతి పాత్రము,చీకటులు తొలగించి వెలుగు
నింపునది,నడిపించు నది,మంత్ర తంత్రాత్మిక మైనది,శాసించు నది,].

1.గర్భగత"-స్వరము"వృత్తము,

స్వరమే భీజం శక్తిమంతఘ్!
వర క్షీరోధిం శేష తల్పమ్!
నిరవధ్యం బుద్ధిం దదామ్యమ్!
చరితం కరుణాశ్రి తత్వమ్!

అభిజ్ఞా ఛందము నందలి "బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు'9'అక్షరము లుండును,

2.గర్భగత"'భీజము"వృత్తము,

సర్వార్ధ ధ్యోతకం బుధమ్!
పర్వంబు స్తోత్ర కాన్వితమ్!
నిర్వాణ శోభకామృతమ్!
సర్వోదయం సుభాషితమ్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

3.గర్భగత"క్షీరోధి"వృత్తము,

సదా పంచ భూతా వసంతమ్!
సదానంద సందోహ చిత్రమ్.
నిదానం వదాన్యం సుమంతమ్!
సదానంద ధేయం వరీయమ్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"నిరవద్య"వృత్తము,

స్వరమే భీజం శక్తి మంతమ్?సర్వార్ధ ధ్యోతకం బుధమ్!
వర క్షీరోధిం శేషతల్పమ్!సర్వంబు స్తోత్ర కాన్వితమ్!
నిరవధ్యం బుద్ధిం దదామ్యమ్!నిర్వాణ శోభకామృతమ్!
చరితం కారుణ్యాశ్రి తత్వమ్!సర్వోదయం సు భాషితమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"నిర్వాణ"వృత్తము,

సర్వార్ధ ధ్యోతకం బుధమ్!స్వరమే భీజం శక్తి మంతమ్!
సర్వంబు స్తోత్ర కాన్వితమ్!వర క్షీరోధిం శేష తల్పమ్!
నిర్వాణ శోభకామృతమ్!నిరవధ్యం బుద్ధిం దదామ్యమ్!
సర్వోదయం సు భాషితమ్!చరితం కారుణ్యాశ్రితత్వమ్!

అణిమా ఛందము నందలి "అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు, పాదమునకు"17"అక్షరము లుండును,
యతి9"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"ధ్యోతక"వృత్తము,

స్వరమే భీజం శక్తిమంతమ్!సదా పంచ భూతా వసంతమ్!
వర క్షీరోధిం శేష తల్పమ్!సదా పదానంద సందోహ చిత్రమ్!
నిరవద్యం బుద్ధిం దదామ్యమ్!నిదానం వదాన్యం సుమంతమ్!
చరితం కరుణాశ్రి తత్వమ్!సదానంద దేయం వరీయమ్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును
యతి'"10"వ యక్షరమునకు చెల్లును,

7,గర్భగత"నిదానం"వృత్తము,

సదా పంచ భూతా వసంతమ్!స్వరమే భీజం శక్తిమంతమ్!
పదానంద సందోహ చిత్రమ్!వర క్షీరోధిం శేష తల్పమ్!
నిదానం వదాన్యం సుమంతమ్!నిరవద్యమ్ బుద్థిం దదామ్యమ్!
సదానంద దేయం వరీయమ్!చరితం కరుణాశ్రి తత్వమ్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు'"18"అక్షరములుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"సదానంద"వృత్తము,

సర్వార్ధ శోధకం బుధమ్!సదా పంచ భూతా వసంతమ్!
పర్వంబు స్తోత్ర కాన్వితమ్!పదానంద సందోహ చిత్రమ్!
నిర్వాణ శోభకామృతమ్!నిదానం వదాన్యం సుమంతమ్!
సర్వోదయం సు భాషితమ్!సదానంద దేయం సరీయమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"సర్వోదయ"వృత్తము,

సదా పంచ భూతా వసంతమ్!సర్వార్ధ శోధకం బుధమ్!
పదానంద సందోహ చిత్రమ్!పర్వంబు స్తోత్రకాన్వితమ్!
నిదానం వధాన్యం సుమంతమ్!నిర్వాణ శోభకామృతమ్!
సదానంద ధేయం వరీయమ్!సర్వోదయం సుభాషితమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17,అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"భూత పంచక"వృత్తము,

సర్వార్ధ ధ్యోతకం బుధమ్!స్వరమే భీజం శక్తిమంతమ్!సదా పంచ భూతా వసంతమ్!
పర్వం స్తోత్రకాన్వితమ్! వర క్షీరోధిం శేష తల్పమ్!పదానంద సందోహ చిత్రమ్!
నిర్వాణ శోభకామృతమ్!నిరవద్యం బుద్ధిం దదామ్యమ్!నిదావం వదాన్యం సుమంతమ్!
సర్వోదయం సు భాషీతమ్!చరితం కారుణ్యాశ్రి తత్వమ్!సదానంద ధేయం వరీయమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరము లుండును,
యతులు.9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"పర్వం"వృత్తము,

స్వరమే భీజం శక్తి మంతమ్!సదా పంచ భూతా వసంతమ్!సర్వార్ధ శోధకం బుధమ్!
వర క్షీరోధిం శేషతల్పమ్!పదానంద సందోహ చిత్రమ్!పర్వంబు స్తోత్రకాన్వితమ్!
నిర వద్యం బుద్ధిం దదామ్యమ్!నిదానం వదాన్యం సుమంతమ్!.  నిర్వాణ శోభకామృతమ్! 
చరితం కారుణ్యాశ్రితత్వమ్!సదానంద దేయం వరీయమ్!సర్వోదయం సుభాషితమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"వదాన్య"వృత్తము,

సదా పంచ భూతా వసంతమ్!స్వరమే భీజం శక్తిమంతమ్!సర్వార్ధ శోధకం బుధమ్!
పదానంద సందోహ చిత్రం!వర క్షీరోధిం శేష తల్పమ్!పర్వంబు స్తోత్రకాన్వితమ్!
నిదానం వదాన్యం సుమంతమ్!నిర వద్యం బుద్ధిం దదామ్యమ్!నిర్వాణ శోభకామృతమ్!
సదానంద ధేయం వరీయమ్!చరితం కారుణ్యాశ్రితత్వమ్!సర్వోదయం సుభాషితమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

13,గర్భగత"సుమంత"వృత్తము,

సర్వార్ధ శోధకం బుధమ్!సదా పంచ భూతా వసంతమ్!స్వరమే భీజం శక్తిమంతమ్!
పర్వంబు స్తోత్రకాన్వితమ్!పదానంద సందోహ చిత్రమ్!వర క్షీరోధిం శేషతల్పమ్!
నిర్వాణ శోభకామృతమ్!నిదానం వదాన్యం సుమంతమ్!నిర వద్యం బుద్ధిం దదామ్యమ్!
సర్వోదయం సుభాషితమ్!సదానంద ధేయం వరీయమ్!చరితం కారుణ్యాశ్రి తత్వమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"వసంత"వృత్తము,

సదా పంచ భూతా వసంతమ్!సర్వార్ధ ధ్యోతకం బుధమ్!స్వరమే భీజం శక్తిమంతమ్!
పదాసంద సందోహ చిత్రమ్!పర్వంబు స్తోత్ర కాన్వితమ్!వర క్షీరోధిన్ శేష తల్పమ్!
నిదానం వదాన్యం సుమంతమ్!నిర్వాణ శోభకామృతమ్!నిరవధ్యం బుద్ధిం దదామ్యమ్!
సదానంద ధేయం వరేయమ్!సర్వోదయం సుభాషితమ్!చరితం కారుణ్యాశ్రి తత్వమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనెయమము కలదు.పాదమునకు 26"అక్షరము లుండును,
యతులు.10,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.

ఆకతాయి,కాకిలెక్క,ఖర్మమేమి,రూకలాశ,నిమ్ముల,మాయల,చీకుచింత,తాకట్టు ,కమ్మదనం,,శక్తియుక్తి,నిప్పులాంటి,కప్పి మంచి,అప్పు ముప్పు,నేరమి,"గర్భ"స్వచ్ఛ నీతి"వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,,

0 comments

జైశ్రీరామ్.

ఆకతాయి రూక లాశలన్!అమ్మను తాకట్టు పెట్టెరే!అప్పు ముప్పు తప్పు నెట్లో?
కాకి లెక్క జూపి మాయలన్!కమ్మ దనం బేడ గానకన్?కప్పి మంచి నైచ్య తత్వమ్!
నీక దేమి ఖర్మ మాతరో?నిమ్ముల స్వాతంత్ర్య మేమయెన్?నిప్పు లాంటి  నీతి మాసెన్!
చీకు చింత తీరు నెన్నడో?చిమ్ముమి నీ శక్తి యుక్తులన్! చెప్పు చెప్పు.నీతి నెట్లో?

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది, ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,

1,గర్భగత"ఆకతాయి"వృత్తము,

ఆకతాయి రూక లాశలన్!
కాకి లెక్క జుపి మాయలన్!
నీకదేమి?ఖర్మ మాతరో!
చీకు చింత తీరు నెన్నడో?

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2,గర్భగత"కాకి లెక్క"వృత్తము,

అమ్మను తాకట్టు పెట్టిరీ!
కమ్మ దనం బేడ గానకన్?
నిమ్ముల స్వా తంత్ర్య మేమయెన్?
చిమ్ముమి నీ శక్తి యుక్తులన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లండును,

3.గర్భగత"ఖర్మ మేమి?వృత్తము,

అప్పు ముప్పు తప్పు నెట్లో?
కప్పి మంచి నైచ్య తత్వమ్!
నిప్పు లాంటి నీతి మాసెన్!
చెప్పు చెప్పు నీతి నెట్లో?

అభిజ్ఞా ఛందము నందలి"అను ష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు 8"అక్షరము లుండును,

4.గర్భగత"రూక లాశ"వృత్తము,

అమ్మను తాకట్టు పెట్టిరే?ఆకతాయి రూక లాశలన్!
కమ్మదనం బేడ గానకన్?కాకి లెక్క జూపి మాయలన్!!
నిమ్ముల స్వాతంత్ర్య మేమయెన్?నీ కదేమి ఖర్మ మాతరో?
చిమ్ముమి నీ శక్తి యుక్తులన్!చీకు చింత తీరు నెన్నడో?

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత""నిమ్ముల"వృత్తము,

ఆకతాయి రూక లాశలన్!అమ్మను తాకట్టు పెట్టినే?
కాకి లెక్క జూపి మాయలన్!కమ్మదనం బేడ గానకన్?
నీ కదేమి ఖర్మ మాతరో?నిమ్ముల స్వాతంత్ర్య మేమయెన్?
చీకు చింత తీరు నెన్నడో?చిమ్ముమి నీ శక్తి యుక్తులన్!

అణిమా ఛందము నందబి"ధృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు "18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరము నకు చెల్లును,

6.గర్భగత"మాయల"నృత్తము,

ఆకతాయి రూక లాశలన్!అప్పు ముప్పు తప్పు నెట్లో?
కాకి లెక్క జూపి మాయలన్!కప్పి మంచి నైచ్య తత్వమ్!
నీ కదేమి ఖర్మ మాతరో?నిప్పు లాంటి నీతి మాసెన్!
చీకు చింత తీరు నెన్నడో?చెప్పు చెప్పు నీతి నెట్లో?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు17,అక్షరము లుండును,
యతి10,వ యక్షరమునకు చెల్లును,

7.,గర్భగత"చీకు చింత"వృత్తము,

అప్పు ముప్పు తప్పు నెట్లో?ఆకతాయి రూక లాశలన్!
కప్పి మంచి నైచ్య తత్వమ్!కాకి లెక్క జూపి మాయలన్!
నిప్పు లాంటి నీతి మాసెన్!నీ కదేమి ఖర్మ మాతరో?
చెప్పు చెప్పు నీతి నెట్లో?చీకు చింత తీరు నెన్నడో?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

8..గర్భగత"తాకట్టు"వృత్తము,

అమ్మను తాకట్టు పెట్టిరే?అప్పు ముప్పు తప్పు నెట్లో?
కమ్మదనం బేడ గానకన్?కప్పి మంచి నైచ్య తత్వమ్!
నిమ్ముల స్వాతంత్ర్య మేమయెన్?నిప్పు లాంటి నీతి మాసిన్!
చిమ్ముమి నీ శక్తి యుక్తులన్!చెప్పు చెప్పు నీతి నెట్లో?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17అక్షరములుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

9.,గర్భగత"కమ్మదనం"వృత్తము,

అప్పు ముప్పు తప్పు నెట్లో?అమ్మను తాకట్టు పెట్టిరే?
కప్పి మంచి నైచ్య తత్వమ్!కమ్మ దనం బేడగానకన్?
నిప్పు లాంటి నీతి మాసెన్!నిమ్ముల స్వాతంత్ర్య మీమయెన్?
చెప్పు చెప్పు నీతి నెట్లో?చిమ్ముమి నీ శక్తి యుక్తులన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుంఅండును,
యతి,"9"వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత""శక్తి యుక్తి"వృత్తము,


అమ్మను తాకట్టు పెట్టిరే?ఆకతాయి రూక లాశలన్!అప్పు ముప్పు తప్పు నెట్లో?
కమ్మదనం బేడ గానకన్?కాకి లెక్క జూపి మాయలన్!కప్పి మంచి నైచ్య తత్వమ్!
నిమ్ముల స్వాతంత్ప్య మేమయెన్?నీ కదేమి ఖర్మ మాతరో?నిప్పు లాంటి నీతి మాసెన్!
చిమ్ముమి నీ శక్తి యుక్తులన్!చీకు చింత తీరు నెన్నడో?చెప్పు చెప్పు నీతి నెట్లో?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19;అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-నిప్పు లాంటి"వృత్తము,

ఆకతాయి రూక లాశలన్!అప్పు ముప్పు తప్పు నెట్లో?అమ్మను తాకట్టు పెట్టిరే?
కాకి లెక్క జూపి మాయలన్!కప్పి మంచి నైచ్యతత్వమ్!కమ్మదనం బేడ గానకన్?
నీ కదేమి ఖర్మ మాతరో?నిప్పులాంటి నీతి మాసెన్!నిమ్ముల స్వాతంత్ర్య మేమయెన్?
చీకు చింత తీరు నెన్నడో?చెప్పు చెప్పు నీతి నెట్లో?చిమ్ముమి నీ శక్తియుక్తులన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"కప్పి మంచి"వృత్తము,

అప్పు ముప్పు తప్పు నెట్లో?ఆకతాయి రూక లాశలన్!అమ్మను తాకట్టు పెట్టిరే?
కప్పి మంచి నైచ్య తత్వమ్!కాకి లెక్క జూపి మాయలన్!కమ్మదనం బేడ గానకన్?
నిప్పు లాంటి నీతి మాసెన్!నీ కదేమి ఖర్మ మాతరో?నిమ్ముల స్వాతంత్ర్య మేమయెన్?
చెప్పు చెప్పు నీతి నెట్లో?చీకు చింత తీరు నెన్నడో??చిమ్ముమి నీ శక్తి యుక్తులన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"అప్పు ముప్పు"వృత్తము,

అమ్మను తాకట్టు పెట్టిరే?అప్పు ముప్పు తప్పు నెట్లో?ఆకతాయి రూక లాశలన్!
కమ్మదనం బేడ గానకన్?కప్పి మంచి నైచ్య తత్వమ్!కాకి లెక్క జూపి మాయలన్!
నిమ్ముల స్వాతంత్ర్య మేమయెన్?నిప్పు లాంటి నీతి మాసెన్!నీ కదేమి ఖర్మ మాతరో?
చిమ్ముమి నీ శక్తి యుక్తులన్!చెప్పు చెప్పు నీతి నెట్లో?చీకు చింత తీరు నెన్నడో?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"నేరమి"వృత్తము,

అప్పు ముప్పు తప్పు నెట్లో?అమ్మను తాకట్టు పెట్టిరే?ఆకతాయి రూక లాశలన్!
కప్పి మంచి నైచ్య తత్వమ్!కమ్మ దనం బేడ గానకన్?కాకి లెక్క జూపి మాయలన్!
నిప్పు లాంటి నీతి మాసెన్!నిమ్ముల స్వాతంత్ర్య మేమయెన్?నీ కదేమి ఖర్మ మాతరో?
చెప్పు చెప్పు నీతి నెట్లో?చిమ్ముమి నీ శక్తి యుక్తులన్!చీకు చింత తీరు నెన్నడో?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.

ప్రాతః కాలాన్నే నిద్దురమేల్కోగానే మనం ఏమిచెయ్యాలి? ఓం నమో భగవతే వాసుదేవాయ.

0 comments

జైశ్రీరామ్.

 ఓం శ్రీమాత్రే నమః.

ఆత్మస్వరూపులారా!శుభాకాంక్షలతో వందనములు.

మన దినచర్య ప్రాతః కాలాన్నే శయ్యపైనుండి లేచినదగ్గరనుండి ప్రారంభమై మరల రాత్రి సమయమున శారీరక మానసిక అలసట పోవుటకొఱకు శయ్యపైకి చేరేవరకు అనేక విధములుగా అవసరమైన, అత్యవసరమైన, అనవసరమైన, పనులను మన ఇంద్రియముల ప్రేరణతో, ఆత్మేంద్రియప్రేరణతో చేస్తూ ఉంటాము. అంతేకాని మన ప్రమేయం యేదీకూడా ఇందులో ఉండదని గ్రహించాలి.

మనకనిపిస్తుంది మంచిగానే జీవించాలనుకొంటున్నాను. మరి నన్ను మంచిగా నడుచుకోడానికి మన ఇంద్రియప్రేరణ జ్ఞానేంద్రియ ప్రేరణ బాగా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని.

ఆలోచిద్దాం.

ప్రాతః కాలాన్నే ప్రకృతి చాలా చల్లగా హాయిగా ప్రారంభమవుతుంది.చల్లని పిల్లగాలులు, పక్షుల కిలకిలారావములు, చిఱువెచ్చని బాలభానుని కిరణాలు మనసునకెంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. 

ఈ సజ ప్రకృతి సిద్ధమయిన ఆనందం మనం అనుభవించాలంటే మనంకూడా ప్రకృతితోపాటు ఆహ్లాదజనకంగా ఉండాలి. ఇదెలాసాధ్యం? అన నవసరం లేదు. మనం లేస్తూనే చేసే పనులతోనే ఇదంతా ముడిపడి ఉంది.

మనము అంటే 

ఐదు కర్మేంద్రియములు, 

ఐదు జ్ఞానేంద్రియములు, 

ఐదు కర్మేంద్రియములు, 

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు సమాన అనే ఐదు ప్రాణవాయువులు,  

1అన్నమయము 2ప్రాణమయము 3మనోమయము 4విఙ్ఞానమయము 5ఆనందమయము అనెడి 5కోశములు, 

వీటితో పాటు మనలో ఉండే ఒక ప్రాణము. 

వీటన్నింటితో కూడిన ఒక యంత్రము యీ శరీరము. దీనినే మనము మనముగా భావిస్తాము.

ఈ ఇరువదొక్కింటిని పరిశుభ్రముగా ఉంచుకో గలిగితే మన కోరిక సాధ్యమౌతుంది.

అదెలాగో మాకు తెలియదే అని చింతించే పని లేదు. 

వృక్షం గొప్పగా ఉండాలంటే మనం విత్తు వేసినప్పుడే శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మనం మనంగా ఆత్మతేజంతో ప్రకాశించాలంటే అది ప్రాతఃకాలాన్నే మనం అన్నిటికీ మూలమయిన శక్తి ఏదో ఆశక్తియే అన్నిటికీ ప్రారంభంలో ప్రార్థింపఁబడుతుంది. 

ఉదాహరణకు 

మనం పూజకు కూర్చున్నప్పుడు ఏమంటాము? ఓం శ్రీగురుభ్యో నమః అనికదా అంటాము. ఆచమనమప్పుడు కూడా మనం ఓం కేశవాయ నమః అనే కదా అంటున్నాము. గణపతిని ప్రార్థించాలన్నా మనం ఓం గం గణపతయే నమః అనే కాదా అంటున్నాము? దీనిని బట్టి మనకేమి అర్థమౌతోంది? ఓం కారం లేకుండా మనకేదీ లేదనే కదా అర్థమౌతుంది? మనం చెవులు మూసుకొంటే మనకు వినిపించేదేమిటి? ఓం కారమే కదా? సాగర ఘోష ఓంకారమే కదా? శంఖనాదం ఓంకారమేదా? 

అసలు ఈ ఓం కారం ఏమిటి అని మనం తెలుసుకుంటే ఓం ప్రాధాన్యత అర్థమౌతుంది.

అ+ఉ+మ్=ఓం ఈ మూడుస్వరములూ సృష్టి స్థితి లయ లకు మూలములు. ఆమూలమయినది శ్రీ లలితాపరాభట్టారికయే కదా. ఇందులో మొదటి వర్ణము అ యే కదా? సృష్టికి మూలము ఇదే కదా? అమ్మ లేకుండా సృష్టి లేదు కదా? అందుకే మూలమయినదానిని అమ్మగా గౌరవిస్తాము.అమ్మేకదా సృష్టికి మూలము? అమ్మలేకుండా సృష్టియే ఉండదు కదా?

కావున ఈ ఓంకారం మనం నిద్దుర లేస్తూనే పైన చెప్పిన ఇరువదొక్కింటిని పవిత్రముగానడుపుటకు ఇరువదొక్కపర్యాయములు స్పష్టంగా పలికి లేచుట అలవాటు చేసుకో గలిగితే మనం ఆత్మప్రేరణ కలిగి కోరుకొన్న స్థాయిలో మనం జీవించుచు రాణించగలుగుతాం.

ఓం హరిః అని కాని, ఓంశ్రీమన్నారాయణా అని కాని, ఓం నమో వాసుదేవా అనికాని, ఓం శ్రీమాత్రే నమః అనికాని ఇరువదొక్కపర్యాయములు జపించి, 

కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కర దర్శనమ్. అని చేతులలో కొలువై ఉన్న ముగ్గురమ్మలకీ నమస్కరించుకొని, 

అమ్మా భూమాతా నిద్దురలేచినదొ మొదలు నిన్ను నా పాదములతో త్రొక్కుతున్నాను. నన్ను క్షమించమ్మా అని భూమికి నమస్కరించె పాదం భూమిపై పెట్టి మనం మన పనులకుపక్రమించాలి. 

మరి మీరేమంటారు? 

ఓం నమో భగవతే వాసుదేవాయ.

సజ్జనవిధేయుఁడు

చింతా రామకృష్ణారావు.తే.౨౫ - ౬ - ౨౦౨౪.

జైహింద్.

23, జూన్ 2024, ఆదివారం

ఓం త్రయంబకం యజామహే .. మేలిమి బంగారం మన సంస్కృతి .. మృత్యుంజయ మంత్రమునకు ప్రతిపదార్థము.

0 comments

 జైశ్రీరామ్.

ఓం నమశ్శివాయ.

మహా మృత్యుంజయ మంత్రమునకు ప్రతిపదార్థము.

మృత్యుంజయ మంత్రము

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మాzమృతాత్.

చం.  ప్రణవము పల్కి మున్నుగను, త్ర్యంబకు నే భజియించుచుంటి, నా 

ఘనుఁడు సుగంధ సంభరిత గణ్యుఁడు, పుష్టిని పెంచువాఁడు, తా

ననుదితమైన బంధనల నంతము చేయుచు దోసతీరునన్

ఘనముగ నా కొసంగుత సుఖప్రద ముక్తిని సన్నుతాత్ముఁడై.

ప్రతి పదార్ధం: 

ఓం = ఓంకారనాద పూర్వకముగా, (శ్లోకమునకు గాని,

మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము;) 

త్రయంబకం = మూడు కన్నులు గలవానిని; 

యజామహే = పూజించు చున్నాము; 

సుగంధిం = సుగంధ భరితుడు; 

పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తిని ; 

వర్ధనం = (అధికము / పెరుగునట్లు చేయువాడు /) పెంపొందించు వాడు; 

ఉర్వారుకం = దోస పండు;

ఇవ = వలె; 

బంధనాత్ = బంధమును తొలగించు; 

మృత్యోః = మృత్యువు నుండి: 

అమృతాత్ =  అమృతత్త్వము కొఱకు

మాం = నన్ను; 

ముక్షీయ = విడిపించుఁగాక.

భావము.

ప్రణవనాదపూర్వకముగా త్ర్యంబకునిపూజించుచున్నాను. సుగంధభరితుఁడు, పోషణనిచ్చి పెంచువాఁడు, 

జైహింద్.

21, జూన్ 2024, శుక్రవారం

శ్రీ చంద్రమౌళీశ్వర శతకము నేను ఒక్కరోజులో వ్రాసిన శతకము. గానం అవధాని శ్రీ బండకాడి అంజయ్యగౌడు.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

20, జూన్ 2024, గురువారం

అశ్వధాటి స్తోత్రం .. Ashwadhati Stotram with Telugu Lyrics.

0 comments

జైశ్రీరామ్.
జైశ్రీరామ్.

అక్షర విన్యాసము. Sanskrit, Telugu, Kannada A Triad of Monosyllabic Poetry |

0 comments

జైశ్రీరామ్.
ఏకాక్షర పద విన్యాస
కంII  నన్నన్నను నిన్నన్నను, 
నిన్నేనని నేనన. నినునేనెన్నను, 
ని న్నెన్నను నిన్నే. న
న్నె న్నెన్నా నన్నే నను.నినునేనననన్నా.
ప్రతి పదార్థం:
నన్ను+అన్నను=నన్నన్నను (నన్ను అన్నా)
నిన్ను+అన్నను=నిన్నన్నను (నిన్ను అన్నా)
నిన్నేను+అని=నిన్నేనని (నిన్నేను అని)
నేను+అన=నేనన (నేను అనగా)
నిను=నిన్ను
నేను+ఎన్నను=నేనెన్నను (నేను అంగీకరించను)
నిన్ను+ఎన్ని+అన్నను=నిన్నెన్నను (నిన్ను ఎన్ని అన్నప్పటికీ)
నిన్నే=నీకే చెందును
నన్ను+ఎన్ని+ఎన్ని+అన్నా= నన్నెన్నెన్నా (నన్ను ఎన్ని ఎన్ని అన్నప్పటికీ)
నన్నేను+అను=నన్నేనను (నాకే చెందును అనిచెప్పు)
నిను=నిన్ను
నేను+అనను+అన్నా=నేనననన్నా (నేను ఏమీ అనను అన్నయ్యా)
భావము:
నన్ను విమర్శించినా, నిన్ను విమర్శించినా, ఆ విమర్శలు అన్నగా నీకే చెందుతాయని నేననగా, నీతో ఏకీభవించను, నీకు వచ్చిన విమర్శలు నీకే, నాకు ఎన్ని విమర్శలు వచ్చినా నాకే అన్న నిన్ను ఏమీ అనక అంగీకరిస్తాను అన్నయ్యా.
ఏకాక్షర పదవిన్యాసము సంస్కృతశ్లోకము.
నిన్ను నిను నెన్న నీనే.
నెన్నిన నన్నన్న ననన నిన నానేనా 
నిన్నూని నా న నూనున్ 
నన్నూ నన్నాను నేననా నున్నానా
(శ్రీ వేంకటేశ్వర చిత్ర రత్నాకరం లోనిది)
ప్రతి పదార్థం
అనిన = నీకుపైన ప్రభువులులేని, నానా =
సర్వమునకు, ఇనా = ప్రభువైనవాడా, ఇనున్ =
సర్వేశ్వరుడవైన, నిన్నున్, ఎన్నన్ =
స్తుతించుటకొరకు, ఈనేను, ఎన్నినన్ =
ఆలోచించినచో, ననను = చిగురును, (అల్పుడని
అర్థం), అన్నన్న= చోద్యం, అనూనున్ = గొప్పవాడవైన,
నినున్ = నిన్ను, ఊనినాను = ఆశ్రయించినాను,
నున్న = త్రోసివేయబడిన, అనా =
శకటముగలవాడవైన, అనా = తండ్రీ, నేను, నన్ను+
ఊను = ఆదుకొనుము,
అన్నాను = అంటిని.
భావం
దీని భావం ఏమిటంటే.. నీకు పైన ప్రభువులు లేని, ఈ సర్వమునకు ప్రభువైన వాడా, సర్వేశ్వరుడవైన నిన్ను, గొప్పవాడైన నిన్ను, స్తుతించుట కొరకు ఆలోచించి ఆశ్రయించినాను. అల్పుడని త్రోయబడిన నన్ను శకటము గలవాడవైన తండ్రి నీవే నన్ను ఆదుకొనుము అని అన్నాను.
ఏకాక్షర పద విన్యాస
కనడ పద్యం
నిన్న నీనిన్న నానన్న
నిన్ననెన్న ననూననం 
నిన్ననైనన్న నై నేనే
నెన్నిన్నం నిన్నెనానునన్.
జైహింద్.

19, జూన్ 2024, బుధవారం

శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారి దివ్య జ్ఞానామృతమ్. దర్శనం శర్మగారి ద్వారా...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

రామ కృష్ణ నీతి శతకము. రచన - చింతా రామ కృష్ణ రావు. తేదీ. 01- 01- 2012. ని రచించినది.

0 comments

 జైశ్రీరామ్

రామ కృష్ణ నీతి శతకము. 

రచన - చింతా రామ కృష్ణ రావు

రామ కృష్ణ మాట రాచ బాట 

అంకితము

శ్రీ సాధు శ్యాం ప్రసాద్ గారికి,

శా.  శ్రీమన్మంగళ సాధువంశజుఁడు శ్రీ సీతాకుమారీ పతిన్

ప్రేమోదారుని, శ్యాంప్రసాదు మహితున్ విఖ్యాతుఁడంచెంచి నే

శ్రీమంతంబగు రామకృష్ణశతకశ్రీకన్యనే యంకితం

బోమాతా! యొనరించుచుంటి, కృపతోనొప్పార రక్షింపుమా.


రామ కృష్ణ నీతి శతకము

:- శ్రీల నిచ్చు దైవ చింతన యనుచు, నిన్ 

దలతు నయ్య! రామ! కొలుతునయ్య,

ముక్తిఁ గొల్పి, నీదు భక్తులఁ గాపాడు

రామ కృష్ణ మాట రాచ బాట.1.


:- సజ్జనాళి జూచి, సద్వర్తనము నేర్చు 

సరస మతులు, కాన, సర్వ జనులు

మంచి నడత కలిగి, మాన్యులై మెలఁగుత

రామ కృష్ణ మాట రాచ బాట.2.


:- బాల్యమందు దుష్ట భావంబు లెఱుఁగక 

యనుభవంబు నేర్పనరయు చుంద్రు,

దౌష్ట్య హీన లోక ధర్మంబు వెలయుత!

రామ కృష్ణ మాట రాచ బాట. 3.


:- శిష్ట వర్తనంబు శివుని జేర్చునటంచు

మంచి మాటలాడి మహిమ చూపు,

శిష్టులట్లు మెలఁగ శిష్టులా? తెలియుఁడు,

రామ కృష్ణ మాట రాచ బాట. 4.


:- తెలియనపుడు చెడ్డ తీరున నడచినన్ 

దెలిసి చెడ్డ చేయ వలదు మనము,

మంచి చేయు జనులు మహనీయు లిలలోన, 

రామ కృష్ణ మాట రాచ బాట. 5.


:- ధర్మ వర్తనంబు, దానంబు, శీలమున్ 

గలిగి యున్న వారు ఘనులు భువిని,

మనసు పరిమళించి మహనీయు లగుదురు, 

రామ కృష్ణ మాట రాచ బాట. 6.


:- నీటిపైని వ్రాత నియమ హీనుని మాట, 

చిత్త శుద్ధి లేక చెరిగి పోవు,

మనసు వశము నున్న మాట నిలుపుటబ్బు

రామ కృష్ణ మాట రాచ బాట. 7.


:- ప్రజల మధ్య నుండు పరమాత్మ నెఱుఁగక 

పరుగు తీయుటేల భక్తి తోడ

కొండ లెక్కి చూడ కోనేటి రాయునిన్

రామ కృష్ణ మాట రాచ బాట. 8.


:- గో మయంబు, సులభ గో మూత్ర, గో క్షీర

గోవు దధియు, మరియు గో ఘృతంబు

వైద్య గుణము కలిగి వరలించు సేవింప

రామ కృష్ణ మాట రాచ బాట. 9.


:- సాధు గుణము కలిగి సత్పూజ్యమైనట్టి 

గోవులిహము పరము కొలుపు నిజము,

గోప బాలకుండె గోసేవ చేసెను

రామ కృష్ణ మాట రాచ బాట. 10.


:- జీవమున్న మనిషి చేసిన పాపంబు  

జీవి యనుభవించు చెడిన పిదప,

చేయనట్టి తనకు చెందుట ధర్మమా

రామ కృష్ణ మాట రాచ బాట. 11.


:- శాశ్వతమ్ము కాదు విశ్వమే తలపోయ,

బ్రతుకు శాశ్వతమను భావ మేల?

శాశ్వతుండు హరియె, సాక్షి యీ జగతికి

రామ కృష్ణ మాట రాచ బాట. 12.


:- పాఠశాలలోని పంతుళ్ళ మాటకు

పరవశింత్రు, పిల్ల లరయు విద్య,

పాఠశాలలోని పంతుళ్ళు దేవుళ్ళు

రామ కృష్ణ మాట రాచ బాట. 13.


:- బుద్ధి చెప్ప దగిన పూజ్యులే దౌష్ట్యంబు 

చేయుచున్న నేమి చేయ నగును?

బుద్ధి నేర్చునట్టి బుడుతలే దండింత్రు

రామ కృష్ణ మాట రాచ బాట. 14.


:- ఆకలికి తిననగు నధికంబు తిన రాదు

పారవేయరాదు, బ్రహ్మ మదియె,

ఆక లన్నవాని కది కాస్త పెట్టుడు

రామ కృష్ణ మాట రాచ బాట. 15.


:- విత్త మమరి యున్న మత్తిల్ల బోకుండ 

మంచి పనులు చేసి మసలఁ దగును,

మత్తు డబ్బు, మనను చిత్తు చేయును కదా

రామ కృష్ణ మాట రాచ బాట. 16.


:- అన్న వస్త్రములకు నారాట పడఁదగు,  

నధిక ధనము కొఱకు నాశ పడకు,

పేదవాని కొఱకు ప్రాధేయ పడఁదగు

రామ కృష్ణ మాట రాచ బాట. 17.


:- రామ రామ యనుచు రమ్యంబుగా పల్కఁ

బ్రేమతోడఁ గాచు రామ విభుఁడు,

వట్టి మాటలాడి వదరుట మేల్కాదు

రామ కృష్ణ మాట రాచ బాట. 18.


:- పత్నికన్న హితులు పరికింపఁగా లేరు

పత్ని దైవ దత్త రత్నమయ్య,

నీతి తప్పనట్టి నెలతయే దేవత

రామ కృష్ణ మాట రాచ బాట. 19.


:- భర్త సాటి వాడు భార్యకెన్నగ లేడు

భర్త ధర్మ బద్ధ వర్తనమున

భార్య జీవితంబు ప్రాశస్త్యమును పొందు

రామ కృష్ణ మాట రాచ బాట. 20.


:- పెద్దలైన వారు ప్రీతితో బుద్ధులు  

చెప్ప వలయు నెపుడు గొప్పగాను,

పిన్న లెన్న వలెను పెద్దల మాటలు

రామ కృష్ణ మాట రాచ బాట. 21.


:- శాశ్వతమ్ము కాని సౌందర్య కాంక్షతో

పరుగు తీయ తగదు, ప్రజ్ఞ కలిగి

శాశ్వతు హరి సేవ చక్కగా చేయుఁడు

రామ కృష్ణ మాట రాచ బాట. 22.


:- జ్ఞాన ధనము కలుగ సర్వంబు సమకూరు, 

జ్ఞాన ధనము సర్వ శక్తి కరము,

జ్ఞాన హీనులకిల సౌఖ్యంబు కలుగదు

రామ కృష్ణ మాట రాచ బాట. 23.


:- మత్తుమందు ధనము, మత్తురా మదిరాక్షి,

మత్తు స్వార్థ బుద్ధి మనుజులకును,

మత్తు వీడ వలయు మహనీయ భక్తిచే

రామ కృష్ణ మాట రాచ బాట. 24.


:- తండ్రి చెప్పు నట్టి తత్వంబు కనఁ దగు 

తండ్రి కన్న గురువు తలప లేడు,

తండ్రి సేవ చేసి తరియింప తగునుగా

రామ కృష్ణ మాట రాచ బాట. 25.


:- తల్లి ప్రేమ ముందు తండ్రి ప్రేమయు కూడ 

నిలువ జాలదెపుడు, నిరుపమమది,

తల్లి దండ్రి మించు దైవంబు లేదుగా,

రామ కృష్ణ మాట రాచ బాట. 26.


:- తల్లి మనసు కన్న చల్లనైనది లేదు

తండ్రి కన్న గొప్ప దాత లేడు,

పిల్లలెపుడు గనుత ప్రేమతో వారిని

రామ కృష్ణ మాట రాచ బాట. 27.


:- బుద్ధి నిచ్చినట్టి పూజ్యుండు దైవంబు

దైవ భక్తి తోడఁ దనియ వలయు,

బుద్ధి హీనమైన పోకడ తగదిల

రామ కృష్ణ మాట రాచ బాట. 28.


:- దైవ భక్తి కల్గి దైవ శక్తియు కల్గి 

లోక సేవ చేయు శ్రీకరులను

గౌరవించ వలయు, కల్యాణకరమది

రామ కృష్ణ మాట రాచ బాట. 29.


:- దివ్యులందు మెలగు భవ్యుఁ డా దైవంబు

మానవాళి నుండు మాధవుండు,

మనుజ సేవ చేయ మాధవ సేవయౌ

రామ కృష్ణ మాట రాచ బాట. 30.


:- సత్వ భావముండి సన్మార్గ వర్తియౌ 

ధైర్య వర్తనుండు ధక్షుఁడిలకు,

దక్షులైనవారిఁ దనుపుట ధర్మంబు

రామ కృష్ణ మాట రాచ బాట. 31.


:- కామ క్రోధ లోభ ఘన మద మాత్సర్య 

మోహ వర్తులు ధర మూర్ఖులెన్న,

ధర్మ బద్ధులైన దైవాంశు లటు కారు

రామ కృష్ణ మాట రాచ బాట. 32.


:- రామ పాద ధూళి రాతినే నాతిగా  

చేసె, ధర్మ మదియె వాసి గొల్పె,

ధర్మ బద్ధుల కిల దక్కును సత్కీర్తి

రామ కృష్ణ మాట రాచ బాట. 33.


:- శిష్ట జనుల మనసు దుష్టులు బాధింప 

సృష్టి కర్త కలఁడు, చూచు నతఁడు,

దుష్ట శిక్షణంబు తొడరక యొనరించు

రామ కృష్ణ మాట రాచ బాట. 34.


:- పాప వర్తనమున పరవశించుచునుండి

పాప కూపమందు పడగ నేల?

కోప తాప జనిత పాపంబు మనకేల?  

రామ కృష్ణ మాట రాచ బాట. 35.


:- జీవ హింస చేసి జీవింపగా నేల?

జీవి యన్నఁ గాదె దేవుఁ డిలను?

జీవులందు దైవ భావంబు కలుగుత

రామ కృష్ణ మాట రాచ బాట. 36.


:- వృక్ష జాతి మనకు భృతి కొల్పి కాపాడు

వృక్ష మెన్న జీవ రక్ష భువిని,

వృక్ష నాశనంబు శిక్షార్హ నేరంబు

రామ కృష్ణ మాట రాచ బాట. 37.


:- నిత్య పూజ్యులైరి నిరుపమ సత్కవుల్

సత్య బోధ సేయు సరస మతిని,

సత్య శోధకులకు సత్కవిత్వ మమరు

రామ కృష్ణ మాట రాచ బాట. 38.


:- పంట పొలము లెల్ల ప్రాణ రక్షణ చేయు 

పంట లిచ్చుచుండు, బ్రతుకు నిచ్చు,

అట్టి పొలము లిండ్ల కట్టడంబులవేల

రామ కృష్ణ మాట రాచ బాట. 39.


:- కూర్మి తోడ గురువు పేర్మిని విద్యను 

నేర్పు మనకు తనదు నేర్పు చూపి,

అట్టి గురువు ఋణము నరసి తీర్చగనౌనె

రామ కృష్ణ మాట రాచ బాట. 40.


:- భక్తి తోడ గురువు పాద సేవలు చేసి 

శిష్య కోటి మురియు శ్రీకరమని,

పాద సేవకు తగు ప్రతిభులే గురువులు

రామ కృష్ణ మాట రాచ బాట. 41.


:- కూడు పెట్టు వారు, గూడు కొల్పెడి వారు 

విద్య నేర్పువారు వేల్పులిలను,

వీరి ఋణము తీర్చనేరికి సాధ్యమౌ?

రామ కృష్ణ మాట రాచ బాట.  42.


:- కూడు గూడు లేక కుములు పేదల గాంచి 

సాయ పడగ తగును సజ్జనులకు,

తోటివారి యార్తి తొలగింప శుభమౌను

రామ కృష్ణ మాట రాచ బాట. 43.


:- తల్లి దండ్రి వీడి, తన సోదరుల వీడి

భర్త సర్వ మనుచు భార్య వచ్చు.

అట్టి భార్య మనసు నరసి కావగ తగు

రామ కృష్ణ మాట రాచ బాట. 44.


:- క్రొత్త కాపురమున యత్త మామల మధ్య 

భర్త తోడ, యాడ పడుచు మధ్య

బావ, మరిది మధ్య, బ్రతుక నేర్చును సాధ్వి,

రామ కృష్ణ మాట రాచ బాట. 45.


:- మాటలాడునపుడు మన్నించు మితరులన్,

జేటు రాదు మంచి మాటలాడ.

మాటకారి యెపుడు మన్నన లందును

రామ కృష్ణ మాట రాచ బాట. 46.


:- మంచి చెడ్డలకును మాటయే మూలము

మంచి మాటకారి మహితుఁడిలను,

మంచి చెడ్డలరసి మంచినే పలుకుఁడు

రామ కృష్ణ మాట రాచ బాట. 47.


:- పుట్టినపుడు మనకు పుణ్య పాపము లేమి 

తెలియ కుండు, కొంత తెలివి కలుగ

మంచి చెడ్డ తెలియు, మర్యాద తెలియును

రామ కృష్ణ మాట రాచ బాట. 48.


:- వంట యింటి లోన నొంటిగా పని చేసి

భుక్తి నిడెడి స్త్రీలు శక్తి మనకు,

అట్టి స్త్రీల మనసు కానందమందించు

రామ కృష్ణ మాట రాచ బాట. 49.


:- అన్నదమ్ముల యెడ ననురాగ మొలికించు

యాడపడచులున్న నఖిల మమరు,

ఆడపడచు మనసు నరసి వర్తించుడు

రామ కృష్ణ మాట రాచ బాట. 50.


:- బాల్యమందు బుద్ధి బలమును పెంచిన 

పెద్దయైన పిదప పేరు పొందు,

బుద్ధి బలము తోడ పూజ్యులై నిలుతురు

రామ కృష్ణ మాట రాచ బాట. 51.


:- నీతి పాఠములను నేర్పిన పిననాడు 

జాతి కీర్తి పెంచు నీతి నిలిపి,

నీతిమంతు లిలను జాతికి మూలము

రామ కృష్ణ మాట రాచ బాట. 52.


:- స్వార్థ రహితమైన సత్సేవ శుభమగు

స్వార్థ రహితుఁడెన్ను సర్వ జగతి,

స్వార్థ రహిత జీవి సర్వాత్ముఁడగు హరి

రామ కృష్ణ మాట రాచ బాట. 53.


:- భూమిపైన పుట్టి బుద్ధి జీవులమయి 

పుణ్య పాపములకు మూల మెఱిగి,

మంచి చేయకుంట మర్యాద కాదుగా

రామ కృష్ణ మాట రాచ బాట. 54.


:- రావణాదులెల్ల రాక్షస వృత్తిచే 

నేమి లాభ పడిరి భూమిపైన?

రాక్షసత్వ మెపుడు రాణింపు నీయదు,

రామ కృష్ణ మాట రాచ బాట. 55.


:- పాఠశాలలోన ప్రఖ్యాతమైనట్టి 

పలుకుబళ్ళు నేర్ప ప్రతిభులగుచు,

భావి జీవితమున పరువుగా మనుదురు

రామ కృష్ణ మాట రాచ బాట. 56.


:- జ్ఞాన సాధనమున ప్రాణంబులను కూడ 

లెక్క చేయరాదు, స్రుక్క రాదు,

జ్ఞానమబ్బినంత కన్పించు సత్యంబు,

రామ కృష్ణ మాట రాచ బాట. 57.


:- తప్పు చేయఁ బూన నొప్పును చెప్పెడు 

నంతరాత్మ, దాని నరయ రేల?

ఆత్మ చెప్పుదాని నాచరించుట మేలు

రామ కృష్ణ మాట రాచ బాట. 58.


:- ప్రాప్తమైన దాని పరవశించుచుఁ బొందు 

బద్ధకిష్టి, ఘనులు పట్టు పట్టి

కోరుకొన్న ఫలము గొనకుండ వీడరు

రామ కృష్ణ మాట రాచ బాట. 59.


:- సరస గుణము కలిగి, సభ్యత పాటించి,

సుజన పాళి మెచ్చ సుగుణులుంద్రు,

స్వజన పాళి మెచ్చ సుజనులై మెలఁగుడు,  

రామ కృష్ణ మాట రాచ బాట. 60.


:- ఆర్తి తోడ తీర్థ యాత్రలు చేయుచు 

క్షేత్ర దర్శనంబు చేయుచుంద్రు.

క్షేత్ర వర్తి దేహి గాత్రస్థుఁ డరయుఁడీ

రామ కృష్ణ మాట రాచ బాట. 61.


:- భక్తి తోడ కొలిచి, పరమాత్మునకు మ్రొక్కి

చెత్త కోర్కెలడిగి చెడుటదేల?

వరలఁ జేయునట్టి వర్తనం బడుగుఁడు.

రామ కృష్ణ మాట రాచ బాట. 62.


:- జీవ కోటి లోని జీవంబు దైవంబు

జీవులెల్ల కనగ దైవమయ్యె,

జీవ కోటిని తిని జీవింప న్యాయమా

రామ కృష్ణ మాట రాచ బాట. 63.


:- కన్నులిచ్చె తనను కనుగొన దైవంబు

కన్నులున్న మనము కనునదేమి?

మాయ గొల్పునట్టి మట్టి బొమ్మలె కదా

రామ కృష్ణ మాట రాచ బాట. 64.


:- కంటి ముందు మనకు కనబడునది యెల్ల 

కలుగ దెల్ల వేళ, కలుగు నొకటి

జ్ఞాన నేత్రమునకుఁ గనఁబడు దైవంబు, 

రామ కృష్ణ మాట రాచ బాట.  65.


:- బాల్యమందు మనము పాట లాటల తోడ

యౌవనమున భ్రాంతు లలమి బ్రతుక,

వృద్ధత నల జ్ఞాన వృద్ధిఁ బొంద తగదె

రామ కృష్ణ మాట రాచ బాట. 66.


:- త్రికరణ పరిశుద్ధ దివ్య వర్తనులకు 

నాత్మ తృప్తి కలిగి యలరుదు రిల,

ఆత్మ తృప్తి పొంది, హాయిగా బ్రతుకుడీ

రామ కృష్ణ మాట రాచ బాట. 67.


:- తనివి కల్గి యున్న తృణమైన ఘనమౌను

తనివి లేని వానిఁ దనుపు నెద్ది?

తనివి పొంద సుఖము దక్కును నిజముగా

రామ కృష్ణ మాట రాచ బాట. 68.


:- నగర జీవనంబు నరక కూపంబని 

పలుక నేల నీకు పాలు లేదె?

శుచిగ శుభ్ర మొనరఁ జూడుము నీవును

రామ కృష్ణ మాట రాచ బాట. 69.


:- ఆత్మ శక్తి యున్న నపురూప తత్వంబు 

మదికిఁ గాన వచ్చు మానవులకు,

ఘన త్రికాలవేది కాగల మరయగా

రామ కృష్ణ మాట రాచ బాట. 70.


:- దేశ భక్తి యనెడి దివ్య భావులు భువి 

త్యాగరాజులయిరి దానములిడి.

దేశ భుక్తు లిపుడు తినుచుండ్రి సర్వమ్ము

రామ కృష్ణ మాట రాచ బాట. 71.


:- మాన ధనము కల్గ మానవు లనఁబడు

మానహీన జనులు మానవులొకొ?

మాన ధనము నకును ప్రాణంబు సరి కాదు

రామ కృష్ణ మాట రాచ బాట. 72.


:- మాటలాడునపుడు మంచిగా చింతించి

మంచి మాటలాడు మంచివారు,

మంచి మాటలాడ మర్యాద పెరుగును

రామ కృష్ణ మాట రాచ బాట. 73.


:- దుష్ట భావనంబు, దుష్ట భాషణయును, 

దుష్ట చేష్ట యెన్న దురిత మొసగు,

శిష్ట వర్తనంబు చిత్స్వరూపంబెంచ

రామ కృష్ణ మాట రాచ బాట. 74.


:- దురిత గతులు వీడి పరువిడు మార్గాన 

సత్య వర్తి నడచు సరస మతిని,

పుణ్య మార్గమెంచి పోవుట ధర్మంబు,

రామ కృష్ణ మాట రాచ బాట. 75.


:- పూల యందు మధువు పొలుపొందు చందాన

పుణ్యులందు సుగతి పొర్లుచుండు,

పుణ్యు ననుసరించి పోవుట ధర్మంబు

రామ కృష్ణ మాట రాచ బాట. 76.


:- పాపి ననుసరించ పాప కూపమునందు

పాతుకొనుచు పోవు భవ్యుఁడయిన,

పుణ్యు ననుసరించ పూజింపఁబడు కదా

రామ కృష్ణ మాట రాచ బాట. 77.


:- మార్గదర్శి యైన మాతృమూర్తి గుణము 

ధనము పగిది వచ్చు తనయులకును,

మాతృ మూర్తి సతము మంచిగా వరలుత

రామ కృష్ణ మాట రాచ బాట. 78.


:- భావమందు మంచి ప్రబలిన సతతము 

భాష యందు కూడ ప్రబలు. సుకర

భావ భాషణములు ప్రఖ్యాతి నొడఁగూర్చు,

రామ కృష్ణ మాట రాచ బాట. 79.


:- యుగము పేరు చెప్పి తెగిపోదు ధర్మంబు 

యుగములెల్ల మనలఁ దగిలి యుండు,

      ధర్మ వర్తికి కృత ధర్మమే కలియును

రామ కృష్ణ మాట రాచ బాట. 80.


:- సూర్య కాంతి చూచి శోభిల్లు పద్మము

చలువ రేని కాంతి కలువ వలచు,

సత్య తేజసంబు సన్మార్గి వలచును

రామ కృష్ణ మాట రాచ బాట. 81.


:- వేద సారమెల్ల విశ్వంబునకు చాటి,

సృష్టి మూల మెల్ల చెప్పినట్టి

భారతమ్మబిడ్డ లారయ ఘనులుగా

రామ కృష్ణ మాట రాచ బాట. 82.


:- సృష్టి కర్త నెఱిగి, సృష్టి మూల మెఱిగి 

కష్ట కారణములు కనుచు, సతము

నిష్ట తోడ బ్రతుక నేర్చుట ధర్మంబు

రామ కృష్ణ మాట రాచ బాట. 83.


:- భారతాంబ తనయ భారతీ దేవియు

పార్వతమ్మ మరియు. భాగ్య లక్ష్మి,

ముగ్గురమ్మల సరి మురిపాల స్త్రీ మూర్తి

రామ కృష్ణ మాట రాచ బాట. 84.


:- అక్క యన్న మాట చక్కని కావ్యంబు

తమ్ము కుఱ్ఱలకును ధర్మ దర్శి

నక్క యమ్మ కంటె చక్కని తల్లిరా

రామ కృష్ణ మాట రాచ బాట. 85.


:- శక్తి చూపి పంట చక్కగా పండించి

ప్రజలఁ గాచు రైతు వామనుండు,

రైతుబిడ్డ జన్మ రాణింపగా వలె,  

రామ కృష్ణ మాట రాచ బాట. 86.


:- మాయ మాటలాడి మర్యాద మీరెడి 

మాన హీనులున్న మహిని, మహిళ

ప్రాణ సంకటంబు పడకుండ కాచుడు,

రామ కృష్ణ మాట రాచ బాట. 87.


:- కవుల కలము ఘనత కవితలఁ గననగు,

కవుల మనసు వెన్న, కరుణకు నిధి,

సుకృత కవుల నరసి సుజనులు మన్నింత్రు,  

రామ కృష్ణ మాట రాచ బాట. 88.


:- ప్రజల జీవ నాడి పట్టును సత్కవి

ప్రజల కవిగ భువిని పరిఢవిల్లు,

ప్రజల మేలు కోరి  పండించు కృతులను

రామ కృష్ణ మాట రాచ బాట. 89.


:- పాఠములను చెప్పు బాపడు గుణ హీన 

పాంశుడైన చెరచు బాల లనట,

బాల లందు గుణము వరలింప గురువౌను,

రామ కృష్ణ మాట రాచ బాట. 90.


:- మానవులకు నెంత మహిమ లున్నను గాని 

జీవ శక్తి పరిధి చేర్చు తుదికి,

తుదికి చేరనట్టి ధుర్యుండు దేవుండు,

రామ కృష్ణ మాట రాచ బాట. 91.


:- శాశ్వతమ్ము కాని స్వశరీర వాంఛలు 

తీర్చ కోరుటెల్ల తెలివి లేక,

శాశ్వతాత్మ ముక్తి చక్కని కోరిక,

రామ కృష్ణ మాట రాచ బాట. 92.


:- ఆకలున్న వారి కన్నంబు కడుపార

ప్రేమతోడ పెట్ట ప్రీతి నొందు,

ప్రీతి నొంద వారు ఖ్యాతి మీ కమరును,

రామ కృష్ణ మాట రాచ బాట. 93.


:- గుడుల కేగి మనము కొలిచి దేవుని కోరు

పెక్కు కోరికలకు భీతి నొంది

కఠిన శిలగ మారె కాంచుడీ దేవుని

రామ కృష్ణ మాట రాచ బాట. 94.


:- పుస్తకమ్ము పట్టి, బుద్ధి నావలఁ బెట్టి 

చదువ నేమి ఫలము? మదికి పోదు.

శ్రద్ధ తోడ చదువ చక్కగా మదికెక్కు

రామ కృష్ణ మాట రాచ బాట. 95.


:- కాల గతిని నిలిచి కాలుని చేరక 

యున్న వారు లేరు పన్నిదముగ,

దైవ శక్తి కల్గు ధన్యాత్ము లుందురు

రామ కృష్ణ మాట రాచ బాట. 96.


:- విద్య నేర్పు నపుడు విజ్ఞానమును గొల్పు

శాస్త్ర పద్ధతిఁ గని జరుప వలయు,

నేర్చునట్లు చేయు నేర్పుతో సాధ్యము

రామ కృష్ణ మాట రాచ బాట. 97.


:- చదువుడనుచు చెప్ప, చదివింప, చదువరు

చదువుచున్న గాని మదికి పోదు,

చదువ దగిన దాని చర్చింప చదువబ్బు 

రామ కృష్ణ మాట రాచ బాట. 98.


:- గ్రామ సభల లోన ప్రేమగా పలికెడి

గ్రామ పెద్ద మనము కలువ బోవ

కానఁడు మనవైపు, కరుణఁ జూడడదేలొ

రామ కృష్ణ మాట రాచ బాట. 99.


:- చిత్ర దర్శకాళి పాత్రలే మారెను

చూడ రానివన్ని చూపుచుండు,

చూడ తగిన నీతి చూపిన మేలౌను

రామ కృష్ణ మాట రాచ బాట. 100.


:- పుట్టినట్టివారు పుణ్యాత్ములైనచో 

పూజనీయు లవరె బుద్ధి కలిగి?

పాప కర్ముఁడెపుడు కోపాగ్నితో నొప్పు

రామ కృష్ణ మాట రాచ బాట. 101.


:- భాగ్యమున్న వారు భాగ్య హీనులఁ గని 

సాయపడు టనునది సరస గుణము,

పాడినెక్కునాడు భాగ్యంబు రాదుగా

రామ కృష్ణ మాట రాచ బాట. 102.


:- దీన బంధు వగుచు దీపించు నెవ్వారు 

వారు బ్రతికి యున్న వారు భువిని,

దీన జనులఁ గనని జ్ఞానియు నజ్ఞాని

రామ కృష్ణ మాట రాచ బాట. 103.


:- శత్రు షట్కమునకు మిత్రులై చెడుటయో

శత్రువగుచు నాత్మ శక్తి గనుటొ?

ఎంచి చూడ రెంట నేది మేలందురు

రామ కృష్ణ మాట రాచ బాట. 104.


:- మిత్రులార! సుగుణ పాత్రులారా! నను 

శత్రు వనుచుఁ దలపఁ జక్క కాదు,

ధర్మ వర్తనమును దర్శింపఁ జేసితి

రామ కృష్ణ మాట రాచ బాట. 105.


:- పద్యమందు కాని, భావమందున కాని 

దోష లేశమున్న దూర వలదు,

మంచి గాంచి మీరు మంచినే గొనఁ దగు

రామ కృష్ణ మాట రాచ బాట. 106.


:- నీతి శతక రచన ఖ్యాతి చింతా రామ 

కృష్ణ రావు చేసె తృష్ణ తోడ,

వాణి కృపను జేసి పన్నుగ నొక నాడె

రామ కృష్ణ మాట రాచ బాట. 107.


:- మంగళంబు కలుగు మహనీయులగు మీకు

మంగళంబు సుకవి మాన్యులకును,

మంగళంబు హరికి, మహనీయ లక్ష్మికి

రామ కృష్ణ మాట రాచ బాట. 108.


శ్రీమత్కాణ్వశాఖీయులై కౌశికగోత్రులయిన చింతా వేంకట రత్నం, సన్యాసి రామా రావు 

పుణ్య దంపతుల పుత్రుండును,

శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల వారి ప్రియ శిష్యుండును,

శ్రీ షిరిడీశ దేవ శతక, శ్రీ వేణు గోప ( కంద - గీత - గర్భ చంపకోత్పల ) శతకశ్రీ శివాష్టోత్తర శత పంచ చామరావళి నామంబునంబరగు శివ శతక, వృద్ధ బాల శిక్ష శతక, సుందర ( రామాన్వయ కంద - సీతాన్వయ గీత గర్భ హనుమదన్వయ ఉత్పల) నక్షత్రమాలాద్యనేక గ్రంథ కర్తయు, ఆంధ్రామృతం http://andhraamrutham.blogspot.com బ్లాగు నిర్వాహకుండునగు చింతా రామ కృష్ణా రావు తేదీ. 01- 01- 2012. ని విరచించిన

రామ కృష్ణ శతకము సంపూర్ణము.

స్వస్తి.

కవిపరిచయము

భాషాప్రవీణ

చింతా రామ కృష్ణా రావు. P.O.L., M.A., (Telugu)

పుట్టిన తేదీ:- 06 - 10 - 1051 ( తూర్పు గోదావరి జిల్లా - వేట్లపాలెంలో )

తల్లి దండ్రులు:- చింతా వేంకట రత్నం, చింతా సన్యాసి రామా రావు.

స్వగ్రామం:- విశాఖపట్టణం జిల్లా - సర్వసిద్ధి.

తేదీ 01 - 03 - 1974 నుండి తేదీ 30 - 6 - 2008 వరకు ఉద్యోగం చేసిన గ్రామాలు.

ప్రథమాంధ్రోపాధ్యాయునిగా:- దిమిలి, యస్.రాయవరం, పాయకరావు పేట.

జూనియర్ లెక్చరర్ గా:-  మక్కువ, రాజాం, కొత్తకోట, వడ్డాది, చోడవరం,

సీనియర్ లెక్చరర్ గా:- చోడవరం.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా మూడు    

     ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు.

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత

      118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున

      మూడు మకుటములతో మూడు శతకములు.)

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి

      పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద   

      ఉత్పలమాలిక.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)