గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 52వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

52. ఓం అచ్యుతాయ నమః.

 ప్రమితాక్షర వృత్త గర్భ సీసము.

అనుపముఁడున్ సుజనాభిరామ శుభ శో - భితుఁడాశ్రిత సువర్ణ పేటి యంద్రు.   

రక్తితోడను నిజ భక్తపాళి మది ని - ల్పు నినున్ బ్రసిద్ధుఁడా! భోగశయన!

సంతోషముగ భజియింతురయ్య వర భా - వనతోడ, కనుమయ్య పరమ పురుష!

అల లక్ష్మితో ప్రజలందు నీ యునికి భా - వ్యమయా. స్వభక్త సేవ్యా! నిలుమయ.

గీ. *అచ్యుతా*! ప్రమితాక్షర హరివి నీవు. - ప్రముద ప్రమితాక్షర సుసీస భావ భాగ్య!  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

52 సీస గర్భస్థ ప్రమితాక్షర వృత్తము. ( .. యతి 9)

సుజనాభిరామ శుభ శోభితుఁడా! - నిజ భక్తపాళి మది నిల్పు నినున్.

భజియింతురయ్య వర భావనతో, - ప్రజలందు నీ యునికి భావ్యమయా.        

భావము.  భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత

జనమున ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓశేషశాయీ! సాటి లేనివాఁడును,

సుజనమనోహర శుభ శోభితుండును, ఆశ్రితులకు స్వర్ణపేటి అని నీ భక్తుల సమూహము అనురాగముతో

నిన్నే మదిని నిలుపును..ఉత్సాహముతో నిన్ను భజించును. పరమ పురుషా! వరభావనతో నీవు వారిని

చూడుము. స్వభక్తులచే సేవింపబడువాఁడా! లక్ష్మీసమేతుఁడవై ప్రజలలో నీవుండుట భావ్యము. కావున వారి మధ్య లక్ష్మీ

సమేతుఁడవై ఉండుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.