గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 103వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

103. ఓం పరంధామ్నే నమః.

చంద్రలేఖ వృత్త గర్భ సీసము

అరయ ఘన విజయమగు మహేశా! ప్రశాం - స్వరూపా! మహోద్భాస! శ్రీశ

కూర్మినొప్పెడి నయగుణ నిధానా! ప్రణా - మంబు దేవా! వివేకంబు నిమ్ము.

కృష్ణుఁడా! సుప్రియ హృదయ శౌరీ! నిజం - బీవె సత్యాశ్రయా! శ్రీవిభాస!

మనమున విస్మయమునణగించన్ రా - రా మనోజ్ఞా! సుధీరా ముకుంద!

గీ. చంద్రలేఖా సముద్ద్భాస సరస సీస - విభవ! ఘన *పరంధామ*! మా వెలుఁగు నీవె.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

103 సీస గర్భిత చంద్రలేఖ. ( .. యతి 7)

జయమగు మహేశా! ప్రశాంత స్వరూపా  -  నయగుణ నిధానా! ప్రణామంబు దేవా!

ప్రియ హృదయ శౌరీ! నిజం బీవె సత్యా! -  స్మయమునణగించంగ రారా మనోజ్ఞా!!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! అరయగా ఘనవిజయస్వరూపమగు మహేశా! ప్రశాంత

స్వరూపా! గొప్పగా ప్రకాశించు శ్రీశా! ప్రేమతో ఒప్పియుండెడి నయగుణ నిధానమా! దేవా! నీకు వందనములు. నాకు

వివేకమునిమ్ము.. కృష్ణా! సుప్రియ హృదయ శౌరీ! శ్రీ విభాసా! సత్యాశ్రయా! నిజమన్నది నీవు మాత్రమే. సుధీరా!

ముకుందా! మనోజ్ఞుఁడా! నా మనస్సునందలి విస్మయమునురూపుమాపుటకు వేగముగా రమ్ము. చంద్రలేఖావృత్తగర్భ

సీసప్రకాశా! పరంధామా! మా వెలుగువు నీవే సుమా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.