గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 72వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్

72. ఓం వజ్రనఖాయ నమః

అశ్వగతి వృత్త గర్భ సీసము.

జీవితమంతయు సేవలు చేసితి. - శ్రీహరి రావావసింప మదిని.

భావనఁ జేయుచు భక్తిగఁ బ్రార్థనఁ - జేసితి నిన్ నే విశేషముగను.

నీవిఁక నేనని. నేనన నీవని, - నేఁ గనుదున్ మహనీయ చరిత!

నీవిల నాకిఁక నిత్యము నేర్పుము - నీ స్థితి నేర్వ సునేత్ర భాస!

గీ. అశ్వ గతినెన్ని కల్కివై యవతరించి - ఖలులఁ జీల్చు *వజ్రనఖా*! సుఖంబు నిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

72 సీస గర్భస్థ అశ్వగతి వృత్తము. ( .. యతి 10)

జీవితమంతయు సేవలు చేసితిశ్రీహరి రా! - భావనఁ జేయుచు భక్తిగఁ బ్రార్థనఁ జేసితి నిన్.

నీవిఁక నేనని, నేనన నీవనినేఁ గనుదున్. - నీవిల నాకిఁక నిత్యము నేర్పుము నీ స్థితినే.

 

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నా జీవితమంతా నీకు సేవలు చేసితిని, నిన్ను భావన

చేయుచు భక్తిగా ప్రార్థన చేసితిని. నా మనసున నివసించుటకు రమ్ము. ఇక నీవూ నేనూ ఒకటేననిభావింతును.

సునయనా! నీ స్థితిని నేర్చుటను నాకు నేర్పుము. అశ్వగతిని కల్కివై ఖలులను చీల్చు వజ్రనఖా! నాకు

సుఖమునిమ్ము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.