గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2014, గురువారం

యది నాత్మని పుత్రేషు ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. యది నాత్మని పుత్రేషు నచేత్పౌత్రేషు,నప్తృషు
నత్వేవ తు కృతోధర్మః కర్తుర్భవతి నిష్ఫలః. 

గీ. కర్తయె యధర్మఫలభోక్త. కాని నాడు,  
కొడుకులో, కాక మనుమలో కుడువ కుండ 
సమసి పోవదధర్మము. సరళిఁ గనుఁడు. 
ధర్మవైరుధ్య  పాపిష్టి కర్మవిడుడు.
భావము. ఒకడు తాను చేసిన అధర్మఫలం తాను అనుభవించకపోతే, దానిని అతని కుమారుడో, అతని మనుమడో, మునిమనుమడో అనుభవించక తప్పదు. అధర్మఫలకర్తృత్వం ఎప్పటికీ సమసిపోయేదికాదు. 
జైహింద్.

30, జులై 2014, బుధవారం

మృషావాదం పరిహరేత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. మృషావాదం పరిహరేత్ కుర్యాత్ ప్రియమయాచితః
న చ కామాన్న సంరంభాన్న ద్వేషాద్ధర్మముత్సృజేత్.
క. చేయకుమసత్యవాదము.
చేయుము హితమాశవీడి, చేయకహితముల్. 
చేయుము ధర్మము వీడకు 
మాయవలన, ద్వేషమునను, మతి త్వరపడుటన్,
భావము. అసత్యవాదాలు మానుకోవాలి. దేనినీ ఆశించక ఇతరులకు హితం చేయాలి. కావాలనిగానీ, వేగిరపాటుతో గానీ, ద్వేషంతోగానీ ధర్మాన్ని వదలకూడదు. 
జైహింద్.

29, జులై 2014, మంగళవారం

బలవాన ప్యశక్తో உసౌ ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. బలవాన ప్యశక్తో సౌ, ధనవానపి నిర్ధనః
శ్రుతవానపి మూర్ఖశ్చ యో ధర్మ విముఖో జనః.
గీ. ఎవఁ డధర్మాతిరిక్తుఁడో యిలనతండు 
బలసుసంపన్నుఁడయ్యు నబలుఁడె కనఁగ, 
ధనికుఁడయ్యును చూడ నిర్ధనుఁడతండు. 
విద్య కల్గుయుహీనుఁడే విద్య చేత.
భావము. ఎవడు ధర్మానికి ప్రతికూలుడో , వాడు బలవంతుడైనా శక్తిహీనుడే. ధనవంతుడైనా దరిద్రుడే, చదువుకొన్న వాడైనా మూర్ఖుడే. 
జైహింద్.

28, జులై 2014, సోమవారం

రథస్యైకం చక్రం భుజగయమితాః ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. రథస్యైకం చక్రం భుజగయమితాః సప్తతురగాః
నిరాలంబో మార్గశ్చరణవికలో సారథిరపి 
రవిర్యాత్యంతం ప్రతిదినమపారస్య నభసః
క్రియాసిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే. 
గీ. చక్ర మొక్కటే. పూన్చును సర్పమునను.
తురగసప్తకంబాధారమరయ లేదు. 
సారధియనూరుఁ డా కర్మసాక్షికైన 
లోకహితుడయ్యె. పనిముట్లు లేకయ్తున్న.
భావము. రథానికి ఉన్నది ఒకే చక్రం, పాములతో పూన్చబడిన ఏడు గుఱ్ఱాలు, మార్గమా – ఆధారం లేనిది, సారథియా – పాదములు లేనివాడు ,అయినప్పటికీ సూర్యుడు ప్రతిదినమూ అనంతమైన ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. మహాత్ములకు కార్యసిద్ధి వారి బలము వల్లనే చేకూరుతుందిగానీ ఉపకరణముల (పనిముట్ల) వల్ల కాదు. 
జైహింద్.

27, జులై 2014, ఆదివారం

అపరాధం సహేతాల్పం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అపరాధం సహేతాల్పం తుష్యేదల్పేపి చోదయే
మహోపకారాంశ్చాధ్యక్షాన్ ప్రగ్రహేణాభిపూజయేత్. 
గీ. అల్ప దోషంబు మన్నింపనగును కనుమ, 
అభ్యుదయమల్పమున్నచో నరసి పొగడు, 
మేలు చేసిన వారిని మెచ్చుకొనుచు 
గౌరవించుము. పొందుము గౌరవంబు.
భావము. చిన్న పొరపాటును క్షమించాలి. అల్పమైన అభ్యుదయానికైనా సంతోషించాలి. మహోపకారం చేసిన వారిని గౌరవించాలి. 
జైహింద్.

26, జులై 2014, శనివారం

సాధురేవార్థిభిర్యాచ్యః ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. సాధురేవార్థిభిర్యాచ్యః క్షీణవిత్తోపి సర్వదా 
శుష్కోపి హి నదీమార్గః ఖన్యతే సలిలార్థిభిః. 
గీ. సంపదంతయు వ్యయమయ్యు సజ్జనుండు 
కోరఁ బడుచునుండర్థిచే. నీర మిచ్చు 
నదులు భువి నెండిపోయినన్ వదలరు కద 
చెలమలను త్రవ్వుచుందురు సలిలములకు.
భావము. తమ సంపదలను తాము కోల్పోయినా, సజ్జనులు అర్థులచే ఎల్లప్పుడూ యాచింపబడుతూనే ఉంటారు. నది ఎండిపోయినా, జలార్థులు ఆ నదీ మార్గాన్నే నీటికోసం త్రవ్వుతూ ఉంటారుకదా. 
జైహింద్.

25, జులై 2014, శుక్రవారం

లోభాత్క్రోధః ప్రభవతి ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో లోభాత్క్రోధః ప్రభవతి క్రోధాద్ద్రోహః ప్రవర్తతే
ద్రోహేణ నరకం యాతి శాస్త్రజ్ఞోపి విచక్షణః. 
క. కోపముఁ గొలుపును లోభము. 
కోపంబది ద్రోహ చింతఁ గొలుపును తలపన్.
ప్రాపించునరక యాతన 
దీపించెడి ద్రోహమునను తెలియగ మనకున్.
భావము. ఎంతటి శాస్త్రజ్ఞునకైనా, నేర్పరికైనా లోభం వలన కోపం పుడుతుంది. కోపం వలన ద్రోహచింతన కలుగుతుంది. ద్రోహం చేస్తే నరకలోకం ప్రాప్తిస్తుంది. 
జైహింద్.

24, జులై 2014, గురువారం

ప్రస్తావ సదృశం వాక్యం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ప్రస్తావ సదృశం వాక్యం, స్వభావ సదృశీం క్రియాం 
ఆత్మశక్తి సమం కోపం, యో జానాతి స పండితః.

క. సమయోచిత భాషణమును, 
తమ బుద్ధికి తగిన పనిని, తమ కొలదిని క్రో
ధము నెఱిగి మెలగు వారలె 
సమవర్తులు, పండితులును, సద్గుణ వరులౌన్.
భావము. సందర్భానికి తగిన సంభాషణం, తన స్వభావానికి తగిన పని, తనశక్తికి తగిన కోపం ఏవియో బాగుగా గ్రహించినవాడే పండితుడు. 
జైహింద్.

23, జులై 2014, బుధవారం

అల్పాక్షర రమణీయం యః కథయతి ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీ
బహువచన మల్పసారం యః కథయతి విప్రలాపీ సః.
క. తేలిక పదముల తోడనె 
మేలుగ భావంబు తెలుపు మేధావి కనన్. 
చాలగ పలుకును, భావము 
తేలదు కన వదరుబోతు. తెలియఁ బలుకుడీ!
భావము. కొద్దిపాటి తేలికమాటలతో ఎవడు అందంగా మాట్లాడుతాడో వాడే నిశ్చయంగా మాట్లాడటం తెలిసినవాడు. ఎవడు సారహీన విషయాలను అతిగా మాట్లాడుతూ చెప్తాడో వాడు వదరుబోతు. 
జైహింద్.

22, జులై 2014, మంగళవారం

అంజలిస్థాని పుష్పాణి ...మేలిమి బంగారం మన సంస్కృతి,

2 comments

జైశ్రీరామ్.
శ్లో. అంజలిస్థాని పుష్పాణి వాస్యంతి హి కరద్వయం
అహో సుమనసాం ప్రీతిర్వామదక్షిణయోః సమా. 
ఆ. దోసిటగల పూలు వాసన కలిగించు 
రెండు చేతులకును నిండుగాను. 
సుజనులట్టులుండు, చూపరు భేదంబు. 
కుడిని యెడమ నొకటె కూర్మి చూపు.
భావము. దోసిలిలో ఉన్న పువ్వులు , రెండు చేతులను సుగంధంతో వాసింపజేస్తాయి. ఆహా! సజ్జనులు కుడి ఎడమల యందు సమమైన ప్రీతిని కలిగి ఉంటారుకదా! 
జైహింద్.

21, జులై 2014, సోమవారం

న వినా పరవాదేన ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. న వినా పరవాదేన రమతే దుర్జనో జనః
కాకః సర్వరసాన్భుక్త్వా వినామేధ్యం న తృప్యతి. 
ఆ. వ్యర్థ వాదనలననర్థంబు కలిగించు 
దురితుడితరులకు వదరుచు సతము.
మంచి తిండి తినియు మలినము తినునట్టి 
కాకి వోలె బుద్ధి లేక మెలగు.
భావము. దుర్జనుడు ప్రతిరోజూ ఇతరులతో వాదన పెట్టుకుంటేనేగానీ సంతృప్తి చెందడు. కాకి ఎంతో రుచికరమైన పదార్థాలను ఎన్ని తిన్నా, అపవిత్ర పదార్థం తింటేనేగానీ తృప్తి చెందదుకదా! 
జైహింద్.

20, జులై 2014, ఆదివారం

ఖలః సర్షపమాత్రాణి ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఖలః సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి 
ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యతి.
ఆ. పరుల దోషములను దురితుండు చూపించు  
ల్పమైన యది యనల్పముగను. 
తన యనల్ప దోష మరయంగ నేరడే! 
దుష్ట చిత్ప్రవృత్తి శ్రేష్టమగునె? 
భావము. దుర్జనుడు పరదోషం ఆవగింజంత మాత్రమే ఉన్నా, దానినే ప్రత్యేకించి చూస్తాడు. తనదోషం మారేడు కాయంతగా ఉన్నా,తెలిసి కూడా చూడడు. 
జైహింద్.

19, జులై 2014, శనివారం

మితం భుంక్తే సంవిభజ్యా ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. మితం భుంక్తే సంవిభజ్యాశ్రితేభ్యః.,మితం స్వపిత్యమితం కర్మ కృత్వా , 
దదాత్యమిత్రేష్వపి యాచితః సన్,తమాత్మవంతం ప్రజహత్యనర్థాః. 

గీ. ఆశ్రితులఁ గూడి మితముగ నారగించి, 
శ్రమను చేయుచు నల్పవిశ్రాంతినుండి, 
యాచకులకిచ్చి తృప్తిగ యలరువాని 
చేరబోవనర్థముల్ ధీరులార!
భావము. ఉన్న ఆహారాన్ని ఆశ్రితులతో కలిసి విభజించుకొని మితంగా భుజించాలి. పని ఎంత ఎక్కువచేసినా మితంగానే నిద్రించాలి.యాచించినవాడు శత్రువైనా ఆనందంగా ఇవ్వాలి.ఈ లక్షణాలున్నవానికి ఏ అనర్థాలూ రానేరావు.
జైహింద్.

18, జులై 2014, శుక్రవారం

అద్రోహః సర్వభూతేషు ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా 
అనుగ్రహశ్చ దానంచ శీలమేతద్ విదుర్బుధాః 

గీ. జీవ కోటిపై విద్రోహ చింత లేక, 
దయకు రూపముగా నిల్చి, దాన విరతి 
కలిగియుండుట శీలంబుగా గణింత్రు 
బుధులు. కనుడయ్య విజ్ఞాన పూర్ణులార!
భావము. మనోవాక్కాయ కర్మల ద్వారా అన్ని జీవులయందు ద్రోహచింతన లేకుండుట, దయాస్వభావము, దాన గుణము కలిగి యుండుట అనే లక్షణాలను ఉత్తమశీలంగా జ్ఞానులు పేర్కొంటారు. 
జైహింద్.

17, జులై 2014, గురువారం

గణితావధానము. ( వైదిక గణితము )

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! గణితావధానాన్ని తిలకించండి. ప్రోత్సహించండి.
గణితావధానమును ప్రోత్సహించుతున్న గురువులకు నమశ్శతములు. చిరంజీవికి శుభాశీస్సులు.
జైహింద్.

16, జులై 2014, బుధవారం

భద్రం కృతం కృతం మౌనం...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. భద్రం కృతం కృతం మౌనం కోకిలైర్జలదాగమే
దుర్దురా యత్ర వక్తారః తత్ర మౌనం హి శోభనమ్.
క. కప్పలు వక్తలగుతరిన్ 
దప్పక కోకిలలు మౌన ధారణ చేయున్. 
గొప్పలు పల్కెడి కుకవులు 
చెప్పునచట పండితులిక చెప్పకునికి మేల్.
భావము. వానకాలము రాగానే కప్పలే వక్తలౌతాయి కనుక, కోకిలలు మౌనాన్ని ఆశ్రయించటమే శోభిస్తుంది !
జైహింద్.

15, జులై 2014, మంగళవారం

దుఃఖే దుఃఖాధికాన్ పశ్యేత్... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. దుఃఖే దుఃఖాధికాన్ పశ్యేత్సుఖే పశ్యేత్సుఖాదికాన్ 
ఆత్మానం సుఖదుఃఖాభ్యాం శత్రుభ్యామివ నార్పయేత్.

గీ. దుఃఖమందున నీకంటె దుఃఖితులను,
సుఖములందున నీకంటె సుఖపరులను
చూచి, సంయమనంబున సుఖము గనుము.
నిక్కమెఱుఁగుచు వాటికి చిక్కఁబోకు.
భావము. నువ్వు దుఃఖంలో ఉంటే, నీ కంటే ఎక్కువ దుఃఖం కలవాళ్ళను చూడు.సుఖంలో ఉంటే, నిన్ను సుఖంలో మించినవాళ్ళను చూడు. అంతేగానీ శత్రువులకు లొంగినట్టు సుఖ దుఃఖాలకు లొంగకు.
జైహింద్.

14, జులై 2014, సోమవారం

యచ్ఛ్రుతం న విరాగాయ...మేలిమి బంగారం మన సంస్కృతి,

2 comments

జైశ్రీరామ్.
శ్లో. యచ్ఛ్రుతం న విరాగాయ, న ధర్మాయ, న శాంతయే
సుశబ్దమపి శబ్దేన కాకవాశితమేవ తత్.

గీ. విన్న శబ్దాన జ్ఞానంబు పెరుగ వలయు. 
విన్న శబ్దాన ధర్మంబు పెరుగ వలయు. 
విన్న శబ్దాన శాంతియు పెరుగ వలయు. 
అట్టి శబ్దంబు కానిది వట్టి గోల.
భావము. విన్నదేదో వైరాగ్యాన్ని కలిగించకపోతే, ధర్మాచరణకు ప్రోత్సహించకపోతే, శాంతిదాయిని కాకుంటే – అది ఎంత గొప్ప సుశబ్ద మైనా , కేవలం కాకి అరుపుగానే భావించాలి.
జైహింద్.

13, జులై 2014, ఆదివారం

ధర్మం, ధనం చ , ధాన్యం చ , ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ధర్మం, ధనం చ , ధాన్యం చ , గురోర్వచన , మౌషధం
సుగృహీతం చ కర్తవ్య మన్యథా తు న జీవతి. 
గీ. ధర్మ, ధన, ధాన్య, గురు వాక్య తత్వ, మౌష 
ధములమరినప్పుడే యిల తడయకుండ 
ననుసరించిన జీవింపనగును మనకు
నమృత పంచకమీయైదునరయుఁడయ్య.
భావము. ధర్మం, ధనం , ధాన్యం , గురువాక్యం , ఔషధం చక్కగా గ్రహించి వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే జీవించలేం. 
జైహింద్.


12, జులై 2014, శనివారం

జనితా చోపనేతా చ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. జనితా చోపనేతా చ యస్తు విద్యాం ప్రయచ్ఛతి
అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః. 
గీ. కన్నతండ్ర్యుపనేతయు, జ్ఞాన విద్య 
కరపునాతడు నన్నంబు కడుపునిండ
బెట్టునాతఁడు,భయము పోగొట్టునతడు 
తండ్రులౌదురీయేవురు తలచి చూడ.
భావము. కన్నవాడు , ఉపనయనం చేసినవాడు , విద్య నేర్పినవాడు ,అన్నం పెట్టినవాడు , భయం పోగొట్టినవాడు ఐదుగురూతండ్రులే.
జైహింద్.

11, జులై 2014, శుక్రవారం

పాత్రాపాత్ర వివేకోస్తి...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. పాత్రాపాత్ర వివేకోస్తి ధేను పన్నగయోరివ
తృణాత్సంజాయతే క్షీరం క్షీరాత్సంజాయతే విషమ్.

గీ. గడ్డిని తిని పాలిచ్చును గంగి గోవు.
పాలు త్రావి విషము చిందు పన్నగమ్ము. 
పాత్రతాపాత్రములఁబట్టి వర్థిలునిల 
మంచి చెడ్డలు మనలోన మహితులార!
భావము. వివేకం పాత్రాపాత్రతలను బట్టి ఉత్పన్నమౌతుంది. గడ్డి వల్ల గోవులో పాలు ఏర్పడితే, పాలవల్ల పాములో విషం ఉద్భవిస్తుంది.
జైహింద్.

10, జులై 2014, గురువారం

క్షుధ్, తృట్, ఆశా: కుటుంబిన్యో...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. క్షుధ్, తృట్, ఆశా: కుటుంబిన్యో మయి జీవతి నాన్యగా: 
తాసాం‌ ఆశా మహాసాధ్వీ కదాచిత్‌ మాం న ముంచతి . 
క. ఆకలి దాహము నాశయు  
నాకగుయిల్లాండ్రు సతులునను విడువరిలన్
ఆకలి, దాహము విడనగు, 
నాకున్నదురాశభార్య ననువిడి పోదే!
భావము. నాకు(సంసారికి) – ఆకలి, దాహము, ఆశ అనే ముగ్గురు - ఎన్నడూ వదలని ఇల్లాండ్రు. వారిలో అప్పుడప్పుడు మొదటి ఇద్దరూ (ఆకలి,దాహము) కొంతసేపు దూరమైనా, మూడవదైన ఆశ మాత్రం మహాసాధ్వి. నన్ను(సంసారిని) ఎప్పుడూ వదిలిపెట్టదు!
జైహింద్.

9, జులై 2014, బుధవారం

వృద్ధత్వానలదగ్ధస్య సార...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. వృద్ధత్వానలదగ్ధస్య సారయౌవనవస్తునః
దృశ్యతే దేహగేహేషు భస్మైవ పలితచ్ఛలాత్. 
క. వృద్ధాగ్ని దగ్ధ యౌవన 
సిద్ధ మహావస్తు చయము చెడి బూడిదయై 
యుద్ధతి నెరసిన జుత్తుగ 
నిద్దేహ గృహంబునమరె నిది కన వలదా!
భావము. ముసలితనము అనే అగ్నితో దహింపబడిన సారవంతమైన యౌవన సామగ్రి అంతా - దేహమనే లోగిళ్ళలో నెరసిన వెంట్రుకలనే నెపంతో బూడిదలా రాలుతోంది.
జైహింద్.

8, జులై 2014, మంగళవారం

శ్రీవల్లభ కృత గళంతికా బంధ ఆట వెలది.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!శ్రీవల్లభ కృత గళంతికా బంధ ఆట వెలదిని చూడండి. 

జైహింద్.

7, జులై 2014, సోమవారం

అపరాధో న మే உస్తీతి...మేలిమి బంగారం మన సంస్కృతి, 121.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అపరాధో న మే స్తీతి నైతద్విశ్వాస కారణం 
విద్యతే హి నృశంసేభ్యో భయం గుణవతామపి. 

క. అపరాధము చేయని నా 
కపరాధము చేయరితరులనుకొనఁ దగదోయ్. 
నెపమెన్నక చేతురు మీ 
కపరాధముదుశ్చరితులహర్నిశలు కనన్.
భావము. నాయందు అపరాధమేమియు లేదు, నాకేమి భయమని సజ్జనుడు ఏమరుపాటుగా ఉండుట తగదు. గుణవంతులకైనా క్రూరులవల్ల భయం కలుగుతుంది.
జైహింద్.

6, జులై 2014, ఆదివారం

అయమేవ పరోధర్మః...మేలిమి బంగారం మన సంస్కృతి, 220

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అయమేవ పరోధర్మః, ఇయమేవ విదగ్ధతా 
ఇదమేవ హి పాండిత్యం, యదాయాన్నాధికో వ్యయః. 
క. మితముగ వ్యయమును చేయుటె 
యతులిత సద్ధర్మమును, మహన్నిపుణతయున్.
క్షితి పాండిత్యమునదియే 
సతత మితవ్యయపరులకు సౌఖ్యంబబ్బున్.
భావము. ఆదాయాన్ని మించి వ్యయం చేయకూడదు అనేదే శ్రేష్ఠధర్మం. అదే నైపుణ్యం.అదే పాండిత్యం.
జైహింద్.

5, జులై 2014, శనివారం

ఆమరణాంతాః ప్రణయాః...మేలిమి బంగారం మన సంస్కృతి, 219.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఆమరణాంతాః ప్రణయాః, కోపాః తక్షణ భంగురాః
పరిత్యాగాశ్చ నిశ్శంకాః భవంతి హి మహాత్మనామ్.

క. మహితుల ప్రణయమనంతము. 
మహితుల కుపితము క్షణంబె మాయును పిదపన్. 
మహితుల త్యాగమశంకిత 
మహితులకును హితులు వారలమరులు తెలియన్.
భావము. మహాత్ముల స్నేహాలు మరణపర్యంతాలు. కోపాలు తక్షణమే నశించి పోతాయి. వారి త్యాగాలు ఏమాత్రమూ శంకలేనివిగా ఉంటాయి.
జైహింద్.

4, జులై 2014, శుక్రవారం

పరద్రవ్యేష్వభిధ్యానం...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. పరద్రవ్యేష్వభిధ్యానం, మనసానిష్ట చింతనం
వితతాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసమ్. 
గీ. పరుల సంపదపై ధ్యాస ప్రబలుటయును, 
పరులకహితము కోరుట, దరియ రాని 
దగు యసత్యదుర్మార్గాన నడరుటయును 
మానసికపాప కర్మలు. మహితులార!
భావము. పరుల సంపదయందు తదేకధ్యాస,మనస్సులో ఇతరులకు అహితం కోరుకోవటం, అసత్యమునందు ఆసక్తి అనే మూడూ మానసిక పాపాలు. 
జైహింద్.

3, జులై 2014, గురువారం

సా శ్రీర్యా న మదం కుర్యాత్... మేలిమి బంగారం మన సంస్కృతి, 218.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. సా శ్రీర్యా న మదం కుర్యాత్స సుఖీ తృష్ణయోజ్ఝితః 
తన్మిత్రం యత్ర విశ్వాసః పురుషః స జితేంద్రియః.  
                                                            గీ. గర్వమును చేర నీయని కలిమి కలిమి.                                                                          
ఆశనెడఁ బాసి పొందెడి హాయి హాయి,                                                                           ఇలను విశ్వాసపాతృఁడౌ హితుఁడు హితుఁడు.                                             మహిజితేంద్రియుఁడైనట్టి మనిషి మనిషి.
భావము. గర్వాన్ని కలుగజేయనిదే అసలైన సంపద.ఆశను జయించినవాడే సుఖవంతుడు. విశ్వాసపాత్రుడే నిజమైన మిత్రుడు.ఇంద్రియాలను జయించినవాడే ఉత్తమపురుషుడు.
జైహింద్.

2, జులై 2014, బుధవారం

యథా పరోపకారేషు....మేలిమి బంగారం మన సంస్కృతి, 217.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. యథా పరోపకారేషు నిత్యం జాగర్తి సజ్జనః
తథా పరాపకారేషు జాగర్తి సతతం ఖలః.

గీ. నిత్యముపకారమును చేయు నియతి తోడ 
మెలగు సజ్జనుండెపుడును వెలుగు జగతి. 
నిత్యమపకారమును చేయు నియతితోడ 
మెలగు దుర్జనుండెపుడును మిడిసి పడుచు.
భావము. ఏ విధంగా సజ్జనుడు పరోపకారం చేయటానికి ఎల్లప్పుడూ జాగరూకుడై ఉంటాడో, అలాగే దుష్టుడు ఇతరులకు అపకారం చేయటానికి నిత్యం మేల్కొని ఉంటాడు!
జైహింద్.

1, జులై 2014, మంగళవారం

దుఃఖం దదాతియోஉన్యస్య...మేలిమి బంగారం మన సంస్కృతి, 217.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. దుఃఖం దదాతియోన్యస్య ధ్రువం దుఃఖం స విందతి
తస్మా న్న కస్యచిత్ దుఃఖం దాతవ్యం దుఃఖ భీరుణా. 

క. దుఃఖమితరులకుఁ గొలిపిన, 
దుఃఖంబతనికిని కలుగు తోడనె, కానన్ 
దుఃఖముగొలుపడొరులకిల 
దుఖమునకు వెఱయు వాడు తోయజ నేత్రా.
భావము. ఇతరులకు ఎవడు దుఃఖం కలిగిస్తాడో అతడు నిశ్చయంగా దుఃఖాన్ని పొందుతాడు.అందువల్ల దుఃఖానికి భయపడే వాడెవ్వడూ ఎవరికీ దుఃఖం కలిగించకూడదు.
జైహింద్.