జైశ్రీరామ్.
44. ఓం సర్వకర్తృకాయ నమః.
అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము.
కూర్మితోడ సిరులు కురిపించునట్టి శ్రీన్ - జేరి కూర్మి వరలఁ జిత్ప్రభాస!
చిత్రమైన వర నృసింహంబుగా నీవ - ప్రభవమొందఁగ ఘన ప్రభలతోడ.
శ్రీధరుండ! ధరను యాదాద్రి వర నుత - ధామమయ్యెను కద! తండ్రివీవె.
ధుర్య వర్య! కరుణతో భక్త వరులను - కను నృసింహ! సదయ వినుము మనవి.
గీ. విశ్వ భర *సర్వకర్తృకా*! శాశ్వితమగు - శుభసుచరితంబు కొల్పి నన్ జూడుమయ్య!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
44వ సీస గర్భస్థ తేటగీతి - అంతరాక్కర. (1సూ.గణము, 2ఇం.గణములు, 1చం.గణము ..
యతి 3వ గణము చివరి అక్షరము)
సిరులు కురిపించునట్టి శ్రీన్ జేరి కూర్మి - వర నృసింహంబుగా నీవ ప్రభవమొంద,
ధరను యాదాద్రి వర నుత ధామమయ్యె. - కరుణతో భక్త వరులను కను నృసింహ!
44వ సీస గర్భస్థ ఆటవెలదిద్వయము.
1.కూర్మితోడ సిరులు కురిపించునట్టి శ్రీన్ - జేరి కూర్మి వరలఁ జిత్ప్రభాస!
చిత్రమైన వర నృసింహంబుగా నీవ - ప్రభవమొందఁగ ఘన ప్రభలతోడ.
2.శ్రీధరుండ! ధరను యాదాద్రి వర నుత - ధామమయ్యెను కద! తండ్రివీవె.
ధుర్య వర్య! కరుణతో భక్త వరులను - కను నృసింహ! సదయ! వినుము మనవి.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! ఓ శ్రీధరా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత
జనమున ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ చిత్ప్రభాసా! ప్రేమతో సిరులను
కురిపించునటువంటి లక్ష్మీ దేవిని చేరి వరలుట కొఱకు చిత్రమైన నరసింహ రూపముతో గొప్ప కాంతులతో నీవు
ప్రభవింపగా ఈ యాదాద్రి శ్రేష్ఠమైన పొగడఁబడెడి ప్రదేశమయ్యెను. మమ్ములను భరించెడివాడవైన తండ్రివి నీవే.
కరుణతో భక్తులను చూడుము దయతో మా మనవి వినుము.. విశ్వభరుడవైన ఓ సర్వకర్త్రుకా! శాశ్వితమైన శుభప్రదమైన
మంచి ప్రవర్తన నాకు ప్రసాదించుచు నన్ను చూడుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.