ప్రకృతి - సీత.
పంపా సరోవర పరిసర అరణ్య భూములు శ్రీరామునకు విభ్రాంతిని కలిగిస్తున్నవి. ముఖ్యంగా ఆ అడవి చెట్లు పెరిగిన తీరు ఆయనకు వింతగా ఉంది. లక్ష్మణునితో శ్రీరాముడు ఇలాఅన్నాడు. కొన్ని చెట్లు వాలు కొమ్మలతో భూమి పైనే పూస్తున్నవి. కొన్ని చెట్లో పెరిగి పెరిగి గాలికి పోయినట్లు హద్దులు మీరి ఎక్కడికో పోయినవి. ఆ అడవి చెట్లను ఒకరు పెంచిరా? అవి యధేచ్ఛగా పెరిగినవి.
రాముని మనస్సు బహిర్విషయములపై లగ్నం అయిన క్షణమే ఆయనకు ఊరట. సీతా వియోగ స్థితి యందు ఆ చిత్త శాంతి ఆయనకు కరువైనది. ప్రకృతిని ప్రకృతిగా గమనించుట, ప్రకృతి యందు సీతను దర్శించుట, అను మనో వ్యాపారము శ్రీరామునకు క్షణ క్షణ పర్యాయముగా సాగుతున్నది. ప్రకృతిని ప్రకృతిగా దర్శించు నప్పుడు
ఆ:-
కొన్ని చెట్లు వాలు కొమ్మల ధాత్రిని
గదిసి ఇచటె పూచు గాచు నిచటె.
కొన్ని పెరిగి పెరిగి మిన్నుల గాలికి
బోయి హద్దు మీరి పోవు నెచటొ. ( వి.రా. క. వృ. కిష్. నూపుర. 18 )
అని ఆశ్చర్య కరముగా అరణ్యము కనిపించినది. ఆ మరు క్షణమే ప్రకృతి యందు సీతను దర్శించినది ఆ శ్రీరాముని హృదయం.
శా:-
మత్తానేకప హంస యానను పికీ , మంజు ప్రియాలాపనున్,
నృత్య ప్రౌఢ మయూర పింఛక బరిన్ నిర్వ్యాజ ముగ్ధాకృతిన్.
చిత్తంబందున నూహ చేసెదను నా సీతన్ సరః కాననా
యత్తోద్యన్ మధు మూర్తి స స్పృహముగానై నిస్పృహన్ జెందుచున్ . ( వి.రా. క. వృ. కిష్. నూపుర. 19 )
మదించిన ఏనుగు వలె హంస వలె నడిచెడు సీతను కోకిల వలె,ప్రియ మధుర స్వరం గల సీతను నట్యమాడే నెమలి యొక్క పింఛముల వంటి జుత్తు గల సీతను , నిసర్గ రమణీయ అయిన సీతను నా సీతను ఇప్పుడు నేను భావిస్తున్నాను. పంపా సరోవర అరణ్య మునందు కొలువు తీరిన వసంత శోభ యందు నిస్పృహతో నిస్పృహుడనై సీతను దర్శిస్తున్నాను.
పంపాతీర కాననము నందలి వసంత మూర్తిలో సర్వత్ర శ్రీరామునకు సీతయే ప్రత్యక్ష మగు చున్నది. ఆ క్షణమున అతడు నిస్పృహుడై ఊరట చెందు చున్నాడు. మరు క్షణమున ఇది ఊహ కదా అని నిస్పృహుడగు చున్నాడు. అద్భుతమైన ఈ భావన శ్రీరాముని మనస్సులో పుట్టుచుండిన భావ తరంగిత పర్యాయ క్షణికము లైన చిత్త ప్రశాంత అశాంతుల యందలి స్థితికి దర్పణము.
సామాన్య కవులు ఇట్టి రచన చేయలేరు. సరస్వతిని భావించిన భ్రమర కీట న్యాయమున తానే సరస్వతిగా మారిపోయినాడు కాళిదాసు అన్నాడు భట్టుమూర్తి. ఆ విధముగానే విశ్వనాధ కావ్య సృజన యందు ఇచ్ఛా మాత్రం విభో సృష్టిః. అన్నట్లు కన్పించును. ఆయన ఒక బ్రహ్మ. ఆయనే సరస్వతి.
పాఠకులకు గుర్తుండినయెడల ఏదవ పద్యములో ఏ ఘట్టము లోనే గాలికి రాలి పడిన ముదురు వెలగ పండ్ల నుండి బయల్ వెడలుతున్న కమ్మని తావికి తుమ్మెదలు స్పృహా నిస్పృహల నడుమ తత్తర పడినవి అని కవి వర్ణించెను. స్పృహ + అస్పృహల నడుమ తత్తర పడుతున్న శ్రీరామ హృదయము నందు రేగిన ఆలోచనలు కవిత యందు ధ్వనించు చున్నది. అని అక్కడ చెప్పుకొన్నాము.
కావ్య ధ్వని ఊరికే పుట్టదు. ఒక రసవత్ ప్రణాళిక ప్రకారము కవి ఖండికనో కావ్యమునో రచించిన యెడల మాత్రమే అట్టి పరమ వ్యంగ్య సంభరిత వాకు ఆవిష్కృత మగును.
ఇంత వరకు తెలిసింది కదండీ! శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాస భాగం మరొక పర్యాయం మరి కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దం.
జైహింద్.
సప్త చిరంజీవులు.
-
జైశ్రీరామ్.
సప్త చిరంజీవులు.
*శ్లో. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।*
*కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥*
*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మ...
6 రోజుల క్రితం