గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2009, ఆదివారం

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

శ్రీ మన్మహనీయ భావనా పటిమా ప్రకాశితులైన సహృదయ శిరో మణు లైన ఆంధ్ర పాఠక మహాశయులకు, తెలుగు భాషాభిమానులకు, ఆంధ్రామృతాస్వాదనాభిలాషులకు
  " తె లు గు భా షా ది నో త్స వ శు భా కాం క్ష లు "

ఉ:- శారద, సర్వ సద్గుణ విశారదగా మన తెల్గు భాషలో
కోరుచు కావ్య రూపమున కూర్మిని దర్శన మిచ్చుఁ  గాదె! యె
వ్వారలు గాంచ కుండెదరు? వాఙ్మయ రాశిగ నాంధ్ర మాతయై
చేరువయై తెనుంగులకుఁ  క్షేమముఁ  గూర్చెడు నెల్ల వేళలన్.

చ:- తెలుగు కవిత్వమన్న యల తేనెల సోనయటంచు మెచ్చగా,
సలలిత భావగుంభనల సత్ కవి కావ్య మనోజ్ఞ రూప సం
కలిత కవిత్వ తత్వ గుణ గణ్యముగా మదులందు వెల్గుచున్
తెలుగు పఠించు వారలకు తేనెల వాగయి సంతసంబిడున్.

ఉ:- తేనెల తెల్గు భాషకును, దివ్యుల బోలు తెలుంగు వారికిన్,
జాలము నందు కావ్య గుణ జాలము చాలగ చూపు వారికిన్,
మేలగు తెల్గు వెల్గులను మెచ్చుచు వ్రాసెడి పాఠకాళికిన్,
మేలగుఁ గాత! తెల్గుల కమేయ మహోద్ధతి కల్గుఁ  గావుతన్.

జైహింద్.

29, ఆగస్టు 2009, శనివారం

సరస సంభాషణ లో సాహితీ రస పోషణ.

0 comments

ఒక శృంగార పురుషుడు - ఒక జాణ ల సంభాషణా చాతుర్యము:-

సీ:-
(పురు):-సతులు మాయా ధుర్య చతురలౌదురు గదే్!
( స్త్రీ):-ఔర!"యా"మాట మేలగునటోయి!
(పురు):-జవరాండ్రు కుటిల ప్రచారులౌదురు గదే!
(స్త్రీ):-ఔర! - "టి"మాట మానవు గదోయి!
(పురు):-జవ్వనుల్ శోక భాజనులె యౌదురు గదే!
(స్త్రీ):- "క"లగించి పల్క మేల్ కాదటోయి!
(పురు):-పోడియల్ విష వృద్ధి పొంచి చేతురు గదే!
(స్త్రీ):-కలు"ష"ము వీడుచు కనగదో్యి!
గీ:-
(పురు):-నన్ను" నీవాని " పల్కుట న్యాయమటవె?
(స్త్రీ):-మేలు "వా - ద"గ చేసి నన్నేలు సామి.
యనుచు ఆగగ లేక కాముని తరింపఁ
జేయ నిరువురు నొక శయ్య జేరినారు.

తాత్పర్యము:-
పురుషుడు:- సతులు మాయా ధుర్య చతురులు
స్త్రీ:- { యా తీసివేయాలి. } మాధుర్య చతురులు.
పురుషుడు:- సతులు కుటిల ప్రచారకులు.
స్త్రీ:- { టి తీసివేయాలి. } కుల ప్రచారకులు.
పురుషుడు:- స్త్రీలు శోక భాజనులు.
స్త్రీ:- {క తీసివేయాలి } శోభా గనులు.
పురుషుడు:- స్త్రీలు విష వృద్ధి చేస్తారు.
స్త్రీ:- {ష తీసివేయాలి } వివృద్ధి చేయుదురు.
పురుషుడు:- నీ వాని నైన నన్ను ఆ విధముగ పలుక రాదు.
స్త్రీ:- { వాను ద అనే అక్షరంగా మార్చు కొనవలెను } నన్ను నీదానిగా చేసుకొని ఏలుకొనుము.

చూచారా సరస సంభాషణా చతురులైన యీ యువ జంట సంభాషణ లోని సహితీ సంపద?
మన సాహితీ సాగరంలో ఇటువంటి ఆణిముత్యాలు ఏరుకొన్న కొద్దీ లభిస్తూనే ఉంటాయి. ఆసక్తి ఉండాలే కాని ఆ ఆణిముత్యాలను అందుకోలేనివారెవరు?

ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరో తెలియదు. ఇది నాకు లభించిన చాటువు. ఇందు సీసంలో నాల్గవ పాదాన్ని, గీతంలో మూడు, నాలుగు పాదాలను మాత్రమే నేను పూరించాను. ఛందస్సులో గల దోషాల్ని సరిచేసి ప్రకటించాను.

జైహింద్.

28, ఆగస్టు 2009, శుక్రవారం

365 రోజుల ప్రాయం సంతరించుకొన్న ఆంధ్రామృతం.

9 comments

ప్రియ సాహితీ బంధువులారా ! సుమనర్నమస్సులు. నిన్నటితో ఆంధ్రామృతం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొన్నదని తెలియ జేయుటకు సంతోషంగా ఉంది.

ఉ:-
శ్రీ మహనీయ శక్తి యుత శ్రీకర పాఠక బాంధవాళికిన్,
క్షేమము యోగమున్ గొలుపు కేశవు సన్నిభ పండితాళికిన్,
ప్రేమ దలిర్పగా పిలుచు, ప్రేమను పంచెడు సోదరాళికిన్,
నే మనసార వందనలు నీమముతో చరియింతు భక్తితోన్.

ఉ:-
నేటికి వత్సరంబయె. వినీతులు సద్గుణ పుణ్య మూర్తు లే
పాటి మనోజ్ఞభావనలు ప్రస్ఫుటమొప్పగ గుమ్మరించిరో !
మేటిగ తీర్చి దిద్ది, కడు మేలగు బ్లాగని పల్కుచుండి, యీ
నాటి మనోజ్ఞ భావకులు నన్ గణుతింపగ జేసి రందరున్.

ఉ:-
నమ్రత తోడ పల్కెదను. నాదగు శక్తికి మీర హేతువై
కమ్ర కవిత్వ వాహినిని గౌరవ మొప్పగ కల్గ జేయ, నాం
ధ్రామృత నామ ధేయ మది యద్భుత సార్థక నామమై, సతం
బామ్రపు తోరణమ్ములలరారగ జేసిన దాంధ్ర వాకిటన్.

ఉ:-
ఇందరు పాఠకోత్తములు, యెంతటి ప్రేమను, జ్ఞాన తేజమున్,
ఇందరి లోన నాపయిన యేలికలట్టుల గ్రుమ్మరింపగా
సుందరమైన సత్ కవిత సొంపుగ చెప్పితి. వింత కాదు. మీ
రందరు ప్రోత్సహింప కడు హాయిగ నిన్నియు వ్రాయ గల్గితిన్.

మత్త:-
ఇన్ని నాళ్ళును నన్ను మీ దయ నెన్న జేయుచు బ్లాగుకున్
మన్నికన్ కలిగించుచున్ తల మానికమ్మను నట్లుగా
నున్న మీ కృప నెల్ల వేళల నొప్పిదంబుగ గొల్పు మీ
రున్న చాలును చేయ జాలుదు నుజ్వలంబగు సత్కృతుల్.

మహనీయులతో మహిమాన్విత స్నేహ భావము, సంభాషణా భాగ్యము, సదసద్జ్ఞాన సముపార్జన, సత్సంగము, నిరుపమానందము, అవ్యాజానురాగ సంపన్నత, ప్రాశస్త్యము, ఆనంద సామ్రాజ్యాధిపత్యము, మున్నగునవి దైవ దత్త మై సంప్రాప్తించిన వన్న కేవలము మీ అందరి రూపములో వ్యాఖ్యా ప్రవాహమై అందిన ఆంధ్రామృతము నాకు లభించినందుననే కాని వేరు కారణము కాదని సవినయముగా మనవి చేసుకొను చున్నాను. సరస్వతీ మూర్తులు, పుంభావ సరస్వతీ మూర్తులు ఐన మీ అందరికీ నా కృతజ్ఞతాభివందము లర్పించుకొనుచున్నాను. మీ అందరి అండదండలతో ఆంధ్రామృతము నిరంతర వాహినిగా ఆంధ్రులకానందామృత సాగరమై భవిష్యత్తులో కూడా ఒప్పార గలదని ఆశిస్తూ అవ్యాజానురాగము చూపుచు, అనన్య సామాన్య జ్ఞాన జ్యోతి ప్రసరణ నాకు కలుగ జేయుచు, అశక్తుడనైన నన్ను సహితం నడిపిన మీ అందరి ఆదరాభిమానాలకూ మనస్పూర్తిగా ధన్యవాదములు తెలుపుకొంటూ అనితర సాధ్యమైన జ్ఞానము మీ వాదోడుతో మైత్రితో పొందగలననే ఆకాంక్షతో మీ ఆదరణకై అర్థిస్తున్నాను.
జైహింద్.


27, ఆగస్టు 2009, గురువారం

" రాభణో " నతు రావణః.

0 comments

ఒక పామరునకు భోజ మహారాజును చూడాలనే కోరిక కలుగగా అతడెన్ని విధముల ప్రయత్నించిననూ అది నెరవేరకపోయే సరికి అతడు కాళిదాస మహా కవికి తన కోరికను తెలియ జేయగా ఆ మహాకవి ఆ పామరునకు పండితుడిలా వేషము వేయించి, అతనిని ఒక గొప్ప పండితుడని పేర్కొంటూ భోజరాజు వద్దకు తీసుకొని వెళ్ళాడు.

భోజరాజు ఆతనిని చూచి చాలా సంతోషించి ఏదైనా చక్కని వీషయాన్నిఆ పండితుని తెలుపమనగా అతడు " రాభణాసుర ’ అని అన్నాడట రావణాసురుడు అనే మాట కూడా ప్లుకుట తెలియ నంతటి పామరుడైన ఆ పండితభ్రువుడు.
అంతే ఆ మహా రాజు ఆ పండితుని గొని వచ్చిన కాళిదాసువైపు ప్రశ్నార్థకంగా చూడగా ఆ కాళిదాస మహాకవి ఈ క్రింది శ్లోకం ఆశువుగా చెప్పాడట.

శ్లో:-
కుంభకర్ణే భకారోస్తి. భకారోస్తి విభీషణే.
రాక్షసానాం కుల శ్రేష్ఠః " రాభణో " నతు రావణః.

భావము:-
అన్నదమ్ములు ఒకడు విభీషణుడు, ఒకడు కుంభ కర్ణుడు కాగా వారికి అన్న అయిన రాక్షసరాజు రాభణుడే సుమా. రావణుడు అనుట అయుక్తమని ఈ మహా పండితుని అభిప్రాయమము అని వివరించెను.
మనం ఆసక్తి కలిగి చదువగలగాలే కాని మన సంస్కృ తాంధ్ర సాహిత్యాలలో ఇలాంటి సాహితీ సంపదకు అంతన్నదే కానరాదుకదా !
జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 58.

0 comments

చాలా కాలంగా ప్రియ పాఠకులకు నిరాశా జనకంగా ఏ విషయ వివరణను వివరించనందుకు అనివార్య కారణములు ఆటంక కరమైనందున క్షాంతవ్యుడను.
ఆత్మ శుద్ధి.

శ్లో:-
న శరీర మల త్యాగాత్ నరో భవతి నిర్మలః.
మానసేతు మలే త్యక్తే తతో భవతి నిర్మలః !!

కం:-
శారీరక మలినములను
దూరము గావించినంత తొలగదు మలినం
బేరీతినైన మది గల
ఘోరపుమలినంబు బాపు కొన నిర్మలుడౌన్.

భావము:-
మనుజుడు స్నానాదులతో శారీరక మలినము బాపుకొనినంత మాత్రాన నిర్మలుడు కాజాలడు. మానసమున స్థిరమైయుండు ఘోరమైన మలినమును సాధన చేసి బాపుకొన గలిగిన నాడే నిర్మలుడవగలడు.

జైహింద్.