గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2023, మంగళవారం

తెలుఁగు భాషా దినోత్సవము సందర్భముగా తెలుఁగువారికందరికీ నా శుభాకాంక్షలు.

0 comments

తెలుఁగుతల్లికి కైమోడ్పులు.

తెలుఁగు భాషా దినోత్సవము సందర్భముగా తెలుఁగు భాషామతల్లి సంసేవనా

పునీత జన్ములయిన తెలుఁగువారికందరికీ నా శుభాకాంక్షలు.

సీ.  తెల్లవారెడివేళ చల్లగా నెదనింపు 

వెలుఁగౌను జగతిని తెలుఁగు పలుకు,

మల్లెల సొగసుతో మరిపించు క్రొత్తావి 

వెలయించి మురిపించు తెలుఁగు పలుకు,

సెలయేటి కెరటాల గలగల పొలకువన్ 

గలిగిన పలుకుల తెలుఁగు పలుకు,

కల్లలెఱుంగని పల్లెజనులయొక్క 

తెలినుడి పొంకమ్ము తెలుఁగు పలుకు,

తే.గీ.  తెలుఁగు గెడ్డను మెట్టిన తెల్లవాడు

బ్రౌను డెందమున్ దోచిన జాణ తెలుఁగు,

తీయనౌ మన తెలుఁగును తెలివి మాలి

పలుకనేర్వక చెడిపోకు తెలుఁగువాడ!

చింతా రామకృష్ణారావు.

తల్లి భారతికి కైమోడ్పులు.

28, ఆగస్టు 2023, సోమవారం

తెలుగుసాహిత్య గ్రంథోత్సవం / TELUGU SAHITYA GRANDHOTSAVAM / तेलुगु साहित्...

0 comments

jజైశ్రీరామ్.
జైహింద్.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్.

0 comments

 

జైశ్రీరామ్.

జైహింద్.

అష్టావధానం భళిరా భరతా ! / Ashtavadhanam Bhalira Bharata

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సర్వత్ర గుణవాన్ దేశే శోభతే ..... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో. సర్వత్ర గుణవాన్ దేశే శోభతే ప్రథినో నరః ౹

మణి: శీర్షే గలే బాహౌయత్ర కుత్రాపి శోభతే ౹౹

కం.  గుణవంతులు శోభింతురు

ఘనముగ నెచ్చోటనైన గౌరవమొప్పన్,

మణి యే నగలో నున్నను

ఘనతరశోభలను చిందు కరణిని ధరణిన్.

భావము. గుణవంతులు ఏ దేశంలో ఉన్నా శోభిస్తూ ఉంటారు.ఎలాగంటే,

మణిని శిరస్సులో కానీ,కంఠంలో కానీ,భుజాల పైన కానీ ఇలా ఎక్కడ 

ధరించినా ఎలా ప్రకాశిస్తూ ఉంటుంది,అలాగే మంచి గుణాలున్న వారు 

ఎక్కడున్నా అలా కాంతితో ఉంటారు.

జైహింద్.

దానేన తుల్యో నిధిరస్తి నాన్యో...... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  దానేన తుల్యో నిధిరస్తి నాన్యో

లోభాచ్చ నాన్యోఽస్తి రిపుః పృథివ్యామ్।

విభూషణం శీలసమం నచాన్యత్

సన్తోషతుల్యం ధనమస్తి నాన్యత్॥ (పఞ్చతన్త్రమ్)

తే.గీ. దానమునకు మించెడి నిధి  ధరను లేదు,

లేదు లోభమునకు మించు రిపువు కనఁగ,

శీలమును మించు భూష నీ మ్రోల లేదు,

సంతసమును మించు ధనము సఖుఁడ! లేదు.  

భావము. ఈ భూమిపై దానముతో సమానమైన ఇతర నిధి లేదు. 

లోభముతో సమానమయిన శత్రువు లేడు. శీలముతో సమానమైన 

ఇతర ఆభరణము లేదు. సంతోషముతో సమానమైన వేరే ధనము లేదు.

జైహింద్.

25, ఆగస్టు 2023, శుక్రవారం

శ్రీమన్నారాయణ శతకమునందలి 6 నుండి 10 వ పద్యము వరకు ఆలపించిన బ్రహ్మశ్రీ అందుకూరి చిన్నపున్నయ్యశాస్త్రిగారు.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీమన్నారాయణ శతకము

.(అష్టోత్తర శత ద్విత్వ నకార  ప్రాస శార్దూలావళి)

రచనచింతా రామకృష్ణారావు.

6. శా. నిన్నుం గాంచిరి ధీనిధుల్ జగమునన్ నిత్యాత్ముఁగా నేర్పుతోన్

గన్నుల్ వేయిగ, కాళ్ళు వేయి, శిరముల్ గాంచంగ వేయుండుటన్,

సున్నాయౌ పరి పూర్ణమందు నిను దాసుల్గాంచినారయ్య! శ్రీ

మన్నారాయణ! చూతునన్నిట నినున్ మన్నించి నిన్ గాంచనీ.  

భావము.

శ్రీమన్నారాయణా! ధీ నిధులు నిన్ను నిత్యాత్మునిగా లోకములో వేయి కన్నులుగ, పాదములు

వేయిగా వేయి శిరములుగా నీకు ఉండుట. శూన్యమయిన ఆకారములో పరిపూర్ణ స్వరూపుడుగా నీ

దాసులు నిన్ను నైపుణ్యముతో చూడఁగలిగిరి. నిన్ను నేను అన్నింటియందును చూతును. నన్ను

మన్నించి  నిన్ను చూడనిమ్ము.

 

7. శా. కన్నా మంటిని దిన్న నిన్ జనని వేగన్ నోరు చూపించుమో

యన్నా యంచును దిట్టినంతటనె మోహబ్రాంతులన్ బాపుచున్

నిన్నున్నట్టి జగమ్ము చూపితివిగా నీవేను కృష్ణుండ! శ్రీ

మన్నారాయణ! మేము కూడ కనలే మా చూపరావేలరా?

భావము.

శ్రీమన్నారాయణా! నేవు కృష్ణుఁడుగా ఉన్నప్పుడు నీ తల్లి నీవు మన్ను తింటివని ప్రేమను కూడా

విడిచిపెట్టి నిన్ను ఏదీ నీ నోరు చూపించు అని కోపగించి పలుకగా ఆమెలో ఉన్న

మోహభ్రాంతులను పోగొట్టుచు నీలో ఉన్న సమస్త విశ్వమును చూపితివికదా. మేము మాత్రము నీవు

ఆవిధముగా చూపినచో చూడలేమా యేమి. మై మాకు చూపుటకు నీవేలరాకుంటివి?

 

8. శా. మున్నే నిన్ను మనమ్మునన్ మననమున్ మున్నుంచి మన్నించు నీ

నన్నున్, నా నిను నెన్నునాన్నను ననూనా! మున్నె మన్నించు నో

కన్నా! రక్షకు డీవె కాదె. మనమున్ గాంచన్ మహోదార! శ్రీ

మన్నారాయణ! కావుమయ్య.  జగతిన్ మంచిన్ గృపన్ గావుమా. !

భావము.

పరిపూర్ణుఁడవైన శ్రీమన్నారాయణాఇతః పూర్వమే నిన్ను మనసులో ముందుగా నిలిపి

మన్నించు నీవాడినైన నన్ను, నాకు సంబంధించిన నిన్ను గుర్తించెడి నా యొక్క అన్నను

ముందుగానే మన్నించునటువంటి నీకన్నారక్షకులింకెవరు? మనసుపెట్టి చూచెడి మహోదారగుణ

సంపన్నుఁడా! కాపాడుము. లోకమున మంచిని కృపతో కాపాడుము..

 

9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,

బిన్నన్, నేఁ గనఁ జాలనయ్య నిను గోపీనాథ! యంతర్ముఖుం

డెన్నంజాలు నినున్, శుభాస్పదుఁడ! నీవే నాకు కన్పించు. శ్రీ

మన్నారాయణ పూజ్య పాద జలజా! మాం పాహి. సర్వేశ్వరా!

భావము.

శ్రీమన్నారాయణా! నీవు నా హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభతో కొలువై యున్నావు.

నేను  చిన్నవాడిని. నిన్ను విధముగనూ నిన్ను చూచుటకు సరిపోను. అంతర్ముఖుఁడైనావాడి

నిన్ను గుర్తించగలడు. శుభాస్పదుఁడా! నీవే నాకు కన్పించుము. పూజ్య పాదపద్మములు

కలవాడా! సర్వేశ్వరా! నన్ను రక్షించుము.

 

 10. శా. మిన్నున్ గాంచిన నీవె నిండితివటన్ మిధ్యా స్వరూపుండవై!

మన్నున్ గాంచిననుంటివీవె యచటన్  మాదేవరా! యెట్లు నీ

వున్నావన్నిట నెల్ల వేళలను ? నేనున్నా నిటన్, జూడు.  శ్రీ

మన్నారాయణ! నీదు పాదములె సమ్మాన్యుండ! నన్ జూడనీ.

భావము.

శ్రీమన్నారాయణా! జగత్కారకుడవైన శ్రీకృష్ణా! ఆకాశమును చూచినచో అక్కడ

మిధ్యాస్వరూపుఁడవై నీవే  నిండియున్నావు. భూమిని చూచినను అక్కడ కూడా నీవే నిండియున్నావు.

మా దైవమా! అన్ని సమయములందును అన్ని ప్రదేశములయందునుఏ విధముగా నీవుంటివి?

ఇక్కడ నేనుంటిని. నన్ను చూడుమునీ పాదద్వయమును నా మనమున గౌరవముతో గాంచునట్లు చేయుము.

జైహింద్.

శ్రీమన్నారాయణ శతకమునందలి 1 నుండి 5 వ పద్యము వరకు ఆలపించిన బ్రహ్మశ్రీ అందుకూరి చిన్నపున్నయ్యశాస్త్రిగారు.

0 comments

 

జైశ్రీరామ్.

శ్రీమన్నారాయణ శతకము

.(అష్టోత్తర శత ద్విత్వ నకార  ప్రాస శార్దూలావళి)

రచన. చింతా రామకృష్ణారావు.

1. శా. శ్రీన్నీవక్షమునందు నిల్పి, సుజన శ్రేయంబుఁ జేకూర్చు నీ     

వన్నన్ మాకుఁ బ్ర మోదమే. సుగుణ సౌహార్ద్రంబులన్ మాకు మే

మున్నన్నాళ్ళునుఁ దక్కఁ జేయుదువు,  దీనోద్ధారకా! దేవ! శ్రీ

మన్నారాయణ! సత్య సన్నుత గుణా! మద్భాగ్య సంవర్ధనా

భావము.

దీనోద్ధారకా! దేవాది దేవా! సత్యము కారణముగా సన్నుతింప బడెడి గుణములు కలవాడానా

భాగ్యమును ప్రవృద్ధి చేయువాఁడా! శ్రీమన్నారాయణా! మేమున్నన్నాళ్ళును సుగుణ

సౌహార్ద్రంబులను మాకు కలుగ చేతువని లక్ష్మీదేవిని నీ వక్షస్థలముపై నిలిపి, మంచివారికి

శ్రేయస్సును చేయించెడి నీవన్నచో మాకు చాలా యిష్టమే సుమా.

 

2. శా. నిన్నున్నే ధర నెంచఁగాఁ దగుదునా? నీరేజపత్రేక్షణా!

పున్నామాదులనుండి కాచెదవుగా, పూజ్యుండ! నన్నెంచుచున్.

మన్నింతున్ మది నిన్ను నేను. గనుమా మర్యాదనే నిల్పి, శ్రీ

మన్నారాయణ! కావుమీజగతిఁ బ్రేమన్ మీ రమాసాధ్వితోన్.

భావము.

శ్రీమన్నారాయణా! పద్మనేత్రుఁడా! భూమిపై నిన్ను నేను ఎంచుటకు సరిపోదునా?

పూజ్యుఁడా! నన్ను గుర్తించుచు పున్నామాది నరకముల నుండి మమ్ము కాపాడుదువు కదా. నిన్ను

గుర్తించి నేను గౌరవింతును. నామర్యాద నిలిపుచు, లోకమున ప్రేమతో కూడిన దైవ గాథలతో నన్ను

కాపాడుము.

 

3. శా. క్రన్నన్ గావఁగ వచ్చి ప్రోతు వనుచున్, గన్పింతువీవంచు నో

కన్నా! చిత్త కవాటమున్ దెఱచి, నిన్ గాంచంగ నేనుంటి, నా

కన్నుల్ కాయలు కాచుచుండె, నయినన్ గన్పింప రావేల? శ్రీ

మన్నారాయణ! గాంచ నేరనయితో మాన్యా! మదిన్ వెల్గు నిన్.

భావము.

శ్రీమన్నారాయణా! కన్నతండ్రీ! వేగమే కాపాడుటకు వచ్చి నన్ను కాపాడుదువనియు, నీవు నాకు

కనిపింతువనియు, నా హృదయ కవాటమును తెరచి యుంచితిని. నా కన్నులు కాయలు

కాచుచుండెను అయినప్పటికీ నీవు నాకు కనిపించగా రావేమి? నా హృదయముననే నీవు

ప్రకాశించుచున్నప్పటికీ నిన్ను చూచుట నే నెఱుఁగకుంటినా?

 

4. శా. అన్నా కేశవ! మాధవా! నృహరి! మోహాతీత! గోవింద! రా

మన్నా! కృష్ణుఁడ! వామనా! సకల ప్రేమాధార! విశ్వేశ! యే

మన్నన్ నీదు ప్రశస్తనామమగు. మోహాంధంబునే బాపు. శ్రీ

మన్నారాయణ! నీదు నామ మహిమన్ మమ్మున్ సుఖంబందనీ. 

భావము.

ఓ అన్నా. శ్రీమన్నారాయణా! కేశవా! మాధవా ! నరహరీ ! మోహాతీతుడా ! గోవిందుడా!

రామన్నా ! కృష్ణుడా! వామనా! సమస్తమైన ప్రేమాధారమైనవాడా! లోకేశా!

మేము ఏది పలికినప్పటికీ అది నీ యొక్క.పేరే యగును. మోహాంధకారమును

పోగొట్టును. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.

పోగొట్టెడివాడా. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.

 

5. శా. ఎన్నం జాలుదె? దేవ! నీదు పద సంస్పృశ్యంబు నా చిత్తమం

దెన్నెన్నో మహిమల్ కనం బరచునే! దృష్టాంతముల్ పెక్కులో

కన్నా! నా కనులారఁ జూచుటకు నేఁ గాంక్షించుదున్. నీవె శ్రీ

మన్నారాయణ! నీదు పాద వరపద్మమ్ముల్ కనం జేయుమా.

భావము.

దేవా! శ్రీమన్నారాయణా! నీ పాద స్పర్శను కనీసము నేను మనసున ఊహించుటకైనను

సరిపోదునా? కన్నతండ్రీ! ఎన్నెన్నో మహిమలను నీ పాదములు కనఁబరిచెననుటకు పెక్కు

ఉదాహరణలు కలవు. అట్టి నీ పాద పద్మములను నా కనులారా చూడవలెనని నేను కోరుకొందును.

నీవే నీ పాద పద్మములు నాకు చూచునట్లుగా చేయుము.

జైహింద్.

24, ఆగస్టు 2023, గురువారం

తెలుఁగు సాహిత్య గ్రంథోత్సవము తే.26 - 8 - 2023 మరియు 27 - 8 - 2023. లలో..... నిర్వహణ...బ్రహ్మశ్రీ తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్యశర్మ.

0 comments

 

జైశ్రీరామ్.

జైహింద్.