గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని - మేలిమి బంగారం మన సంస్కృతి 160.

2 comments

జైశ్రీరాం.
శ్లో. ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం
దారిద్ర్య దుఃఖ రోగాణి బంధన వ్యసనాని చ.
గీ. దేహికపరాధతరులబ్ధ దీన ఫలము
లిలను దారిద్ర్య దుఃఖములేల్చు రోగ
బంధనములువ్యసనములుబాధఁ గొలుపు.
దేహి యపరాధ దూరుడై తిరుగ వలయు.
భావము. జీవులయొక్క "స్వయం కృతాపరాధం" అనే వృక్షానికి - దారిద్ర్యం,దుఃఖం , రోగాలు , బంధన ప్రాప్తి , వ్యసనాలు అనేవి ఫలాలు.

జైహింద్

27, ఫిబ్రవరి 2014, గురువారం

శ్రీమన్మహాశివరాత్రి సందర్భముగా మీ అందరికీ ఆ పార్వతీపరమేశ్వరుల కటాక్షము లభించునుగాక.

2 comments

జైశ్రీరామ్. 
ఆర్యులారా! 
శ్రీమన్మహాశివరాత్రి సందర్భముగా  యావద్భక్త జనావళికి ఆ పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షవీక్షణలు మంగళ ప్రదముగా లభించాలని మనసారా కోరుకొంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.
సహృదయ పూర్ణ భక్తతతి సాగిలి మ్రొక్కుచు నీ కటాక్షముల్
మహిమను గొల్పునంచు నసమాన మహద్వ్రత దీక్ష పూని, నీ
నిహితమునందు దృష్టినిడి నిన్ను భజించుట గాంచవా హరా!
సహృదయ భక్తపాళిఁ గని చక్కగ బ్రోవుమ పారవతీశ్వరా!
http://andhraamrutham.blogspot.in/search/label/%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81#.Uw6k1eO1bDk
జైహింద్.

26, ఫిబ్రవరి 2014, బుధవారం

భోజన విధానం - విద్వాన్ కాశీభట్ల సుబ్బరామశర్మ

2 comments

జైశ్రీరాం. 
ఆర్యులారా! విద్వాన్ కాశీభట్ల సుబ్బరామ శర్మ గారు బోజన విధానమును ఎంత వివరణాత్మకంగా చెప్పారో చూడండి.
భోజన విధానం.  
భగవంతుడిని ఉపాసించే సమయంలో కాళ్ళూ చేతులూ కడుక్కుని, పరిశుద్ద వస్త్రాన్ని కట్టుకుని, సావధాన చిత్తంతో వ్యవహరిమ్చినట్లుగానే, భోజనం చేసే సమయంలో కూడా అంత శుచిగానూ, శాంతం గానూ వ్యవహరించాలని మన శాస్త్రాలు నిర్దేశించాయి.  అవి చెప్పిన భోజన నియమాల ప్రకారం తలమీద కప్పుకుని, లేదా టోపీ పెట్టుకుని, పాగా చుట్టుకుని భుజించ కూడదు.  కుర్చీ మీద కూచుని భుజించకూడదు.  భుజించే సమయంలో చెప్పులు, బూట్లు వేసుకుని ఉండకూడదు.  తోలు మీద కుర్చుని గానీ, బెల్ట్ పెట్టుకుని గానీ, బెల్ట్ వాచీని చేతిలో ధరించి కానీ భుజించ కూడదు. 

పగిలి పోయిన పళ్ళాల్లో భుజించ కూడదు.  
కలసి భోజనం చేయాల్సిన సందర్భాలలో ఇతరులు తనకోసం నిరీక్షించేలా చేయకూడదు.  
కలసి భోజనం చేస్తున్నపుడు ముందస్తుగానే ముగించి, ఇతరుల భోజన విధానాన్ని ఆబగా చూడరాదు.
ఏక వస్రంతో భుజిమ్చారాదని అంటుంది దేవల స్మృతి.  
ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరి చూపులూ పడేట్లుగా భుజించ కూడదు.  తలుపులు వేసుకోవాలి.  కనీసం పరదాలు వేసుకోవాలి. దృష్టి దోషం ఎంతటి వారిని అయినా కుంగదీస్తుంది.  
బజార్లలో అమ్మే ఆహార పదార్థాలను కొని తినకూడదు.  వాటిపై ఆకలిగొన్న మనుషులు, పశువులు మొదలైన వాటి దృష్టి పడి ఉండవచ్చు.  పడవలో, భుజించ రాదనీ ఆపస్తంబ మహర్షి రాశారు.  
అలాగే చాప మీద కూచుని కూడా భుజించ కూడదు.  అరచేతిలో ఆహారం పెట్టుకుని, వేళ్ళన్నీ తెరచి ఉంచి, ఉఫ్, ఉఫ్ అని ఊదుకుంటూ ఎన్నడూ తినరాదని బ్రహ్మ పురాణం పేర్కొంది.
చెరకు, క్యారట్, పండ్లు మొదలైన ఏ పదార్థమైనా సరే పండ్లతో కొరికి, బయటకు తీసి తిరిగి తినరాదు.
ఆవు నెయ్యితో తడప కుండా ఆహారాన్ని తినకూడదు. 
విక్రయాన్నం తినకూడదని శంకలిఖిత స్మృతి శాసించింది.  నేడు హోటళ్ళలో తినేవన్నీ విక్రయాన్నాల కిందకే వస్తాయి.  ఒకసారి వండిన దాన్ని, కొంతసేపటి తర్వాత తిరిగి వేడి చేసి, వడ్డించడం లాంటివి ఈ హోటళ్ళలో పరిపాటి. 
మౌనంగా, సుఖంగా భుజించాలని శాస్త్రం చెబుతోంది.  ప్రశాంత చిత్తంతో భుజించాలి.  భుజించేటప్పుడు కామ క్రోధాదులు, హింసా వైరాల వంటి వాటికి మనసులో చోటుండ కూడదు.  
భుజించేటప్పుడు మాట్లాడ కూడదు.  అయితే ముద్ద ముద్దకూ భగవన్నామం చెబుతూ తినాలని పెద్దలు చెప్పారు.
భుజించడానికి ముందే అన్నం నుంచి కొంత భాగాన్ని తీసి, వేరుగా పెట్టాలి.  దానిని ఆవుకో, పక్షికో తినిపించాలి.  అలాగే కుక్కలకు కూడా అన్నం పెట్టాలి.  
మొదటగా ప్రాణులకు పెట్టె భుజించాలి.  భూతబలి వేయాలి.  
అతిథులకు, అభ్యాగతులకు ఆహారమిచ్చి సంతృప్తి పరచాలి.
సన్న్యాసులకూ, సాదువులకూ ఆహారమివ్వాలి.
పసిపిల్లలకు, వృద్ధులకు, అనాథ లకు, దీనులకు భోజనం పెట్టాలి.
ఆకలే అర్హత.  ఆకలి గొని వచ్చిన వారెవరికైనా ఆకలిని తీర్చి, కడపట భుజించడమే గృహస్తు ధర్మం. 

మాంసాహారం తమోగుణాన్ని కలిగిస్తుంది. తమోగుణం రాక్షసులది.  మనం మానవులుగా ప్రవర్తించాలి.  క్రమంగా దేవతలం కావాలి.  
ప్రాణులను హింసించడం వల్ల మాత్రమె మాంసం లభిస్తుంది.  ఇది మహా పాపం.  ఏ ప్రాణినీ హింసించ వద్దని వేదం, పురాణాలు చెబుతున్నాయి.  అహింసే ధర్మాలన్నిటిలోకీ ఉత్తమమైన ధర్మం.
ప్రాణులకు ఏ విధంగానూ కష్టం కలిగించక పోవడమే అహింస అని శంకర భగవత్పాదుల నిర్వచనం.  సమస్త జీవులకూ అభయమివ్వడమే అహింస అని మరొక భాష్యం.
హింసింపరాని ప్రాణులను తన జిహ్వ చాపల్యం తీర్చుకునేందుకు, తన శరీరాన్ని పుష్టిగా చేసుకోవడానికీ, తన సుఖాన్ని పెంచుకోవడానికీ హింసించే వాడు బ్రతికి ఉండి కూడా చచ్చిన వాడితో సమానం.  అటువంటి వానికి సుఖం ఎప్పటికీ కలుగదు అంటుంది మనుస్మృతి (5-45).  
ప్రాణిని చంపడానికి అనుమతినిచ్చేవాడు, చంపబడిన ప్రాణి శరీరాలను ముక్కలు ముక్కలు చేసే వాడు, మాంసాన్ని అమ్మేవాడు, కొనేవాడు, వండే  వాడు, వడ్డించే వాడు, తెచ్చే వాడు, భుజించే వాడు వీరంతా ఘాతకులే, మహాపాపం చేసే వారే అని కూడా అంటుంది మనుస్మృతి (5-51). 
"
పశువులను నేను బరువులు మోయదానికీ, భూమి దున్నడానికీ సృష్టించాను.  వాటితో ఆ పనులను చేయించుకొంది.  నేల నుండి పుట్టిన వాటినే భుజించండి.  వరి, గోధుమలు, ఇత్యాదులను, కాయగూరలను, కంద మూలాలను, పండ్లను భుజించండి.  భుజించడానికి అల్లా ఇచ్చిన పదార్థాలు ఇవే" - అని షేక్ షాదీ ఆజ్ఞాపిస్తున్నారు.
ఏ జీవికీ దుఃఖం కలిగించరాదు.  జీవహింసను మించిన పాపం ఏదీ లేదు.  
దేనిని నువ్వు బలి పేరుతొ చంపుతున్నావో, ఆ జీవుల మాంసం, రక్తం భగవంతుని సమీపానికి పోజాలవు.  అతని దగ్గరికి పోయేది హత్య వలన కలిగే పాపం మాత్రమె.  అహింసను సంపూర్ణంగా పాటించడమే అతని స్వీకారం, అంగీకారం అంటుంది ఓ ఆయత్.
"
మాంస భక్షణం, మదిరా పానం మంచి పనులు కావు.  అట్టి పనులు ఎన్నడూ చేయవద్దు" అంటుంది మరో మతం.  
ఇలాంటివి చాలా చూపవచ్చు.  భోజన నియమాలను పాటించడం వల్ల ఆయుషు పెరుగుతుంది.  ఆరోగ్యం కలుగుతుంది.  సమస్త శ్రేయస్సులూ కలుగుతాయి.
విద్వాన్ కాశీభట్ల సుబ్బరామశర్మగారికి ధన్యవాదములు. 
జైహింద్

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఆశా యేషాం దాసీ, తేషాం దాసాయతే లోకః. మేలిమి బంగారం మన సంస్కృతి. 159

1 comments

జైశ్రీరాం.
శ్లో.  ఆశాయాః యే దాసాః , తే దాసాః సర్వలోకస్య 
ఆశా యేషాం దాసీ ,తేషాం దాసాయతే లోకః.

గీ. ఆస కలవారు జగతకి దాసులయ్య.
ఆస వీడిన జగతియే దాసియగును.
ఆస గొలుపును దైన్యము నరసి చూడ.
ఆస వీడిన సుఖమబ్బునసదృశమది.
భావముఎవరు ఆశకు దాసులౌతారో , వారు లోకానికంతటికీ దాసులౌతారు. ఎవరికి ఆశ దాసిగా ఉంటుందో , వారికి లోకమే దాస్యం చేస్తుంది!                                                                   
జైహింద్

24, ఫిబ్రవరి 2014, సోమవారం

అమిత్రస్య కుతస్సుఖమ్ ? మేలిమి బంగారం మన సంస్కృతి 158.

1 comments

జైశ్రీరాం.
శ్లో. అలసస్య కుతో విద్యా ? అవిద్యస్య కుతో ధనం ?
అధనస్య కుతో మిత్రం ?అమిత్రస్య కుతస్సుఖమ్ ?
గీ. బద్ధకిష్టికి సద్విద్య పట్టువడదు.
విద్య లేకున్న ధనమెట్లు పెరుగు మనకు?
ధనము లేకున్న మిత్రులు దరికి రారు.
మిత్ర తతి లేక సుఖమెట్లు మిగులు మనకు?
భావము. బద్ధకము కలవానికి విద్య ఎక్కడిది ? విద్య లేని వానికి ధనం ఎక్కడిది ? ధనం లేని వానికి మిత్రుడెక్కడ ? మిత్రుడు లేని వానికిసుఖమెక్కడ ?

జైహింద్

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

గుణ దోషౌ బుధో గృహ్ణన్. మేలిమి బంగారం మన సంస్కృతి157.

0 comments

జైశ్రీరాం
శ్లో. గుణదోషౌ బుధో గృహ్ణన్ , ఇందుక్ష్వేడావివేశ్వర: 
శిరసా శ్లాఘతే పూర్వం , పరం కంఠే నియచ్ఛతి.
గీ. బుధుఁడు గుణ దోషము లరసి మూర్ధముననె
గుణము నుంచుచు నణచు దుర్గుణమునతఁడు.
శివుఁడు చంద్రుని శిరమున చేర్చుకొనుచు,
విషము కంఠాన నిలిపిన విధముగాను.
భావము. పండితుఁడు గుణ, దోషాలను రెండిటినీ గ్రహించి, గుణాన్ని నెత్తినపెట్టుకుంటాడు. దోషాన్ని నియంత్రిస్తాడు. శివుడు చంద్రుణ్ణి శిరస్సు మీద ఉంచుకున్నాడు. విషాన్ని గొంతులోనే నిలిపి ఉంచాడుకదా !     
జైహింద్
                                                                                                            

22, ఫిబ్రవరి 2014, శనివారం

ఈ క్రింది షడ్బంధ విధ కందమును ఆయా చిత్రములందు బధించి, పంపగలందులకు విన్నవించుచున్నాను.

0 comments

జైశ్రీరామ్. 
ఆర్యులారా! 
విశాఖపట్టణము జిల్లా సర్వసిద్ధి గ్రామ వాసి యైన వద్దిపర్తి కోనమ రాజు (1754 - 1834) ప్రణీతంబైన వేంకటేశ్వరోపాఖ్యానంబను నాలుగాశ్వాసంబుల శృంగార ప్రబంధంబునందు చతుర్ధాశ్వాసంబున 156 పద్యమును గమనింప మనవి.
(చామరబంధము, శకటబంధము, శార్ఙ్గబంధము, పుష్పమాలికాబంధము, మృదంగబంధము, గోమూత్రికాబంధము
షడ్బంధ విధ కందము.
హారదర హీర కీర్తీ 
సారస వర పురహర శర శర దర మూర్తీ!
సౌర ధర ధీర శౌరీ 
నారద గరళ దర ఖచర నర సుర వంద్యా.  
కందమును చామరాది షద్విధ బంధములుగా చిత్రాకృతిని అందించు మహనీయులకు నేను కైమోడ్తును.
chinta.vijaya123@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి పంప గలందులకు మనవి.

జైహింద్.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

విష్ణుర్జయతి నాసురః. మేలిమి బంగారం మన సంస్కృతి. 156.

3 comments

జైశ్రీరాం
శ్లోధర్మో జయతి నాధర్మః , సత్యం జయతి నానృతం
క్షమా జయతి న క్రోధో, విష్ణుర్జయతి నాసురః.
గీ. ధర్మముజయించు నోడు నధర్మమెపుడు
సత్యముజయించు నోడునసత్యమెపుడు
క్షమ జయించును క్రోధము కాదు జగతి.
విష్ణుఁడు జయించునసురుల వినుతగతిని.

భావము. ధర్మమే జయిస్తుంది , అధర్మం కాదు. సత్యం జయిస్తుంది ,అసత్యం కాదు. క్షమ జయిస్తుంది , క్రోధం కాదు, విష్ణువు జయిస్తాడు , రాక్షసుడు కాదు.
జైహింద్

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఈ క్రింది శ్లోకాలను ఆయా చెప్పఁబడిన చిత్రములందు చిత్రీకరించి పంప వలసినదిగా మనవి.

0 comments

జైశ్రీరాం. 
ఆర్యులారా! ఈ క్రింది శ్లోకాలను ఆయా చెప్పఁబడిన బంధాలలో చిత్రీకరించి, దయతో పంప గలవారు పంపవలసినదిగా మనవి.
జైహింద్

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

మిమిక్రీ శ్రీనివాస్ కు అభినందనలు.

1 comments

జైశ్రీరాం
ఆర్యులారా! నిన్న సాయంత్రము జరిగిన మా మనుమరాలి పుట్టిన రోజు శుభ సందర్భముగా విచ్చేసిన స్వ మాంత్రికుఁడు  శ్రీ శ్రీనివాస్ ను అభినందిస్తూ అందఁ జేసిన పంచరత్నావళిని చూడండి.
శ్రీరస్తు                             శుభమస్తు                      అవిఘ్నమస్తు.                
తే.15-0215-2014 ని మియాపూర్ లోని మా నివాస గృహమున చిరంజీవులైన చింతా వేంకట సన్యాసి రామ శర్మ లక్ష్మీ శైలజల ఏకైక పుత్రిక చిరంజీవి శ్రీ విజయ లహరి యొక్క 3వ పుట్టినరోజు సందర్భముగా మా ఆహ్వానమును మన్నించి, మా ఆతిథ్యమును స్వీకరించ విచ్చేసిన శ్రీ చించపట్టణగోమఠం శ్రీనివాసు చిరంజీవిని దీవించి, తనకుఁ గల శబ్దానుకరణ విద్యా నైపుణ్యమును ప్రదర్శించి, మమ్ములను, ఈ కార్యక్రమమునకు విచ్చేసిన అందరినీ అలరింపఁ జేసినందులకు మా ఆనందమును తెలియఁ జేసుకొనుచు అందఁ జేసిన

పంచ రత్నావళి
శబ్దానుకరణ విద్యా ప్రకాశా! శ్రీనివాసా

శ్రీ మృదు వాఙ్మనోజ్ఞతకు శ్రీధవుఁడే వివశుండు నీకు. యాం
ధ్రామృతవాక్ప్రసార సుమహాద్భుత తత్వవివేకపూర్ణ! భా
షామృత పూర్ణ శబ్దము లహా! యని మెచ్చఁగ భిన్న రీతులౌ
నీ మృదు కంఠ సుస్వరమనేకుల సంతస హేతువిద్ధరన్!

స్వరములు నీ గులాములుఁగ సర్దుకు పోవును నీదు పల్కులన్,
సురుచిర మాధురీ భరిత సుస్వరముల్ మహిమాన్వితంబులై
మరువఁగ రాని వింతలయి, మామది దోచు, ననన్య సాధ్యమౌ
నిరుపమ శబ్దమాంత్రికుఁడ! నిన్ను గణింపఁగ నాకు సాధ్యమా?

శబ్దంబుల్ జనియించు కంఠమున, నిశ్శబ్దార్హమౌ చేతిలో
శబ్దంబెట్లు జనింప చేయుదువు? భాషామాత నీ తల్లియా?
శబ్దబ్రహ్మవొ? కానిచో, కలుగు నే శబ్దంబు నీ జేబులో?
శబ్దోద్భాసిత మాంత్రికా! జగతిలో సత్కీర్తినార్జించితే!

భౌతిక శాస్త్ర పాఠమున పన్నుఁగ నీ మహనీయ నైపుణిన్,
ఖ్యాతిని, తెల్పి, నేర్వమని, గౌరవమొప్పఁగ వ్రాసినారు. నీ
వాతెఱ చేయు గారడినవ్వాక్కులమౌదుమదేమి చిత్రమో!
ఖ్యాతిని జాతికిన్ గొలిపఁ గల్గితివద్దిర! శ్రీనివాసుఁడా!

మంగళ వాగ్వరా! శుభము. మంగళ సంస్కృతి మార్గదర్శివై
మంగళ భావనా చయమమంగళముల్ తొలఁగింప బూని,
న్మంగళ వాక్సుధారసము మాన్యులు మెచ్చగ నందఁ జేయుమా
మంగళ శబ్ద మాంత్రికుఁడ! మాన్య గుణాస్పద! శ్రీనివాసుఁడా!

అభినందనలతో చింతా రామ కృష్ణా రావు మరియు, కుటుంబ సభ్యులు.
మంగళం              మహత్             శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
    జైహింద్

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఛిద్ర మాసాద్య, దోషశ్చిత్తే ప్రసర్పతి. మేలిమి బంగారం మన సంస్కృతి. 155.

2 comments

జైశ్రీరామ్.
శ్లో. విషం రుధిర మాసాద్య, ప్రసర్పతి యథా తనౌ
తథైవ ఛిద్ర మాసాద్య, దోషశ్చిత్తే ప్రసర్పతి
.   
క. నెత్తురు వెంబడి విషమటు
లెత్తరి బలహీనతఁ గొని జ్యేష్ఠోద్భవముల్
మత్తును గొలుపుచు మది నిలు.
మత్తగు బలహీనత విడి మసలుఁడు మహితుల్.        
భావము. రక్తాన్ని ఆధారంగా చేసికొని విషం ఏరీతిగా శరీరమంతటాప్రసరిస్తుందో , అలాగే ఒక్క బలహీనతను సాధనంగా చేసికొనిదుష్టసంస్కారం మనస్సులో వ్యాపిస్తుంది.
జైహింద్

సంతోషం జనయేత్ప్రాజ్ఞ: మేలిమి బంగారం మన సంస్కృతి. 154.

2 comments

జైశ్రీరామ్.
శ్లో.  యేన కేన ప్రకారేణ, యస్య కస్యాపి దేహినః
సంతోషం జనయేత్ప్రాజ్ఞః తదేవేశ్వర పూజనమ్.
గీ. మార్గ మేదైన, ప్రాణులమంచి చేసి
సంతసముఁ గొల్ప నొప్పును సజ్జనునకు.
ప్రాజ్ఞుఁడొనరించు తత్ పూజ భవ్య మెన్న. 
ఈశ్వరార్చనమద్దియే ప్రేమనుగన.
భావము. ప్రాజ్ఞుడైనవాడు ఏదోఒక విధంగా, ఏదో ఒక ప్రాణికి ఒక మంచి పనితోసంతోషం కలిగించాలి. అదే ఈశ్వర పూజ.
జైహింద్

10, ఫిబ్రవరి 2014, సోమవారం

రాజ్యస్థః స్వర్గమీహతే మేలిమి బంగారం మన సంస్కృతి. 153.

2 comments

జైశ్రీరామ్.
శ్లో. ఇచ్ఛతి శతీ సహస్రం, సహస్రీ లక్షమీహతే
లక్షాధిపస్తథా రాజ్యం, రాజ్యస్థః స్వర్గమీహతే.                                        
గీ. నూరు కలవాడు వేయిని కోరుచుండు. 
వేయికలవాడు లక్షల వేలు కోరు.
లక్ష కలవాడు రాజ్యసల్లక్మిఁో్ గోరు.
రాజ్యవంతుఁడు స్వర్గసామ్రాజ్యమడుగు
భావము. వంద ఉన్నవాడు వెయ్యి కోరుకుంటాడు. వెయ్యి ఉన్నవాడు లక్షకావాలంటాడు. లక్షాధికారి రాజ్యంకావాలంటాడు. రాజు స్వర్గంకోరుతాడు.(ఆశకు హద్దు లేదు).
జైహింద్

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

సంధిమిచ్ఛంతి పండితాః. మేలిమి బంగారం మన సంస్కృతి152

1 comments

జైశ్రీరామ్.
శ్లో. మక్షికా వ్రణమిచ్ఛంతి , ధనమిచ్ఛంతి పార్థివాః
నీచాః కలహమిచ్ఛంతి , సంధిమిచ్ఛంతి పండితాః.  
గీ. చెడిన చోటు కోరి చేరుచుండును యీగ 
ధరణి పతులు కోరు ధనము భువిని..         
నీచ కలహ వాంఛ నీచులకుండును.  
వరలు సంధి కోరు పండితుండు.                                  
భావము. ఈగలు పుండ్లను , రాజులు ధనమును , నీచులు కలహమును ,పండితులు సంధిని కోరుకుంటారు. 
జైహింద్.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ముత్యాల పల్యంకిక బంధ షడ్లఘు సీసము. శ్రీవల్లభ కృతము.

2 comments

జైశ్రీరాం.
ఆర్యులారా! 
శ్రీ వల్లభ కృత ముత్యాల పల్యంకిక బంధ షడ్లఘు సీసమును తిలకించండి. 
జైహింద్.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఈనెల3నుండి14వరకు.ఉదయం6.5 నుండి6.10 వరకు ETV లో శ్రీ అనంత భాస్కర శతక ప్రాశస్త్యం. శ్రీ జొన్నవిత్తుల వివరణ

3 comments

జైశ్రీరాం. 
ఆర్యులారా! 
శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి విరచిత శ్రీ అనంత భాస్కర శతకము
నందలి ఆణి ముత్యములను పన్నెండింటిని 
శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు
03-02-2014 వ తేదీ నుండి 15-02-2014 వ తేదీ వరకు 
12 రోజులపాటు
ఈటీవీ లో 
ఉదయం వేళలో 06 గంటల 05 నిమిషముల నుండి 06 గంటల10 నిమిషముల వరకు 
వివరించి చెప్పనున్నారు. 
అవకాశమున్నవారందరు  ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, 
అనంత భాస్కరశతక వైశిష్యన్ని గ్రహించ కలరని  ఆశిస్తున్నాను.    
జైహింద్