జైశ్రీరామ్.
64. ఓం అనఘాస్త్రాయ నమః.
మణిరంగ వృత్త గర్భ సీసము.
రమణీయుఁడా! శ్రీధరా! నిలు చిత్తము - నందున్ బ్రపూర్ణశాంతాక్షియుగళ!
వరణీయ! మా మాధవా! నయ మార్గముఁ - జూపన్, గనంజాలు చూడ్కులిడుము.
లక్ష్యమున్ గన బాధలన్ విడి భావము - నందున్ నినుం గొల్చు హాయి నిడుము.
హరినామ సద్ బోధనందినఁ బూజ్యత - కల్గున్ గదా! మాకుఁ గల్గనిమ్ము.
గీ. శ్రీశ! మణిరంగ గర్భ సచ్చీస వాస! - కరుణ ననుఁ జూచి *యనఘాస్త్ర*! కావ రమ్ము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
64వ సీస గర్భస్థ మణిరంగ వృత్తము. (ర స స గ .. యతి 6)
శ్రీధరా! నిలు చిత్తమునందున్. - మాధవా! నయ మార్గముఁజూపన్,
బాధలన్ విడి భావమునందున్. - బోధనందినఁ బూజ్యత కల్గున్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా! ఓ అనఘాస్త్ర! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! శాంతపూర్ణాక్షిద్వయా! ఓ రమణీయమైన
పరమేశ్వరా! వరణీయమైన నయమార్గము చూపుటకొఱకై నా మనసున నిలువుము! మా లక్ష్యము సాధించుటకై బాధలను
విడిచి
భావమున నిన్ను గొలుచు హాయిని ప్రసాదింపుము. హరి నామ బోధ కలిగినచో గౌరవము లభించును
కదా.అందులకై మాకు ప్రసాదించుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.