గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, అక్టోబర్ 2008, బుధవారం

నక్క నాగ లోకము ..... కాదు కాదు నాక లోకము.

1 comments

మనం సాధారణంగా వింటుంటాం. నక్క ఎక్కడ... నాగలోక మెక్కడ. ... అని. . మనకనిపిస్తుంది నక్కకి, నాగ లోకానికి, సంబంధమేమిటని.
మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నాగ లోకం కాదు. నాకలోకం. అన్న విషయం తెలుస్తుంది.
మనం నక్క ఎక్కడ....నాకలోకమెక్కడ. అని అంటే విన్నవారు మనమే తప్పు చెప్పుతున్నామని అనుకొంటారు కూడాను. ఐతే అర్థం తెలిస్తే అలాగనకపోవచ్చుననుకొంటాను. ఇప్పుడర్థాన్ని పరిశీలిద్దామా?

కం = సుఖము.
న + కం = అకం = సుఖము కానిది = దుఃఖము.
న + అ కం = నాకం = దుఃఖమన్నదే లేనిది.
నాక = దుఃఖమన్నదే లేని
నాక లోకము = దుఃఖమన్నదే లేని లోకము అని అర్థము.
దుఃఖమన్నదే లేని లోకము స్వర్గ లోకము.
జుత్తులమారి నక్క ఎక్కడ, స్వర్గ లోక మెక్కడ. అని అర్థము.
ఇంతుందండీ యీ కథ.
మరొక మారు సమయం చిక్కి నప్పుడుమరొక విషయాన్ని గూర్చి పరిశీలిద్దాం.
జైహింద్.

ప్రత్యహం ప్రత్యవేక్షేత, మేలిమి బంగారం మన సంస్కృతి 1

0 comments

ప్రాచీన సంస్కృతి మేలిమి బంగారం:-

శ్రీమన్మహా దేవుడైన పరమాత్మ సృష్టిలో గడచిన కాలం అనంతమైనది. ఈ అనంత కాలంలో అనంత విశ్వంలో సత్ శాస్వితం. అసత్ అశాశ్వితం.


ఈ సత్ స్వరూపాన్ని మన పురాణాలు ఇతిహాసాలు, వేదాలు, ఇంకా అనంతమైన గ్రంథ రాజము మన ప్రాచీన సంస్కృతి పేర తెలియ జేస్తున్నాయి. మానవ మనుగడకు ఆసూక్తులే సన్మార్గ దర్శకాలు. వాటిని మనం మననం చేసుకోవడమే కాకుండా ముందు తరాల వారికి కూడా అందించాలి. వాటిని పొడి పొడి మాటలతో చెప్పినచో అవి గాలిలో కలిసిపోతాయి. మంచి మాటలెందరో చెప్పారు. ఐనా వేమన పద్య రూపంలో నున్న నీతులు అందరి నోళ్ళలోను నానుతున్న మాట మనకు తెలియనిది కాదు. అందుకే మనం శ్లోకాల రూపంలోనూ, పద్యాల రూపంలోను కంఠస్థం చేసి అనర్గళంగా సమయానుకూలంగా ఎక్కడపడితే అక్కడ చెప్పేలాగ సాధన చేయాలి. ఇట్టి సాధన చేసేవారికుపకరిస్తుందనే ఆశతో కొన్నైనా మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.ఈ ప్రయత్నం సహృదయుల మన్ననను తప్పక పొంద గలుగుతుందనుకొంటున్నాను. ఇక విషయానికి వెళ్దాము.

శ్లో:-
ప్రత్యహం ప్రత్యవేక్షేత, నరశ్చరిత మాత్మనః.
కిం ను మే పశుభిస్తుల్యం? కిం ను సత్ పురుషైరివ?----{మహాభారతం.--అరణ్య పర్వం---29 వ శ్లోకం.}
తే:-
పశువు వోలె ప్రవర్తించు పాపినా! సు
జనుని వలె నడచు కొను సుజనుడినా!
ని యను దినము ప్రశ్నించుకొని.మన నగును.
మానవాళికి తగునిది. మహితులార.
భావము:-
మానవుడు తాను సత్ పురుషుని వలే ప్రవర్తిస్తున్నాడా, లేక పసువు వలె ప్రవర్తిస్తున్నాడా అని ప్రతీ దినము ఆత్మ అరిశీలన చేసుకొంటూ ఉండాలి.
తప్పక అలాగే చేద్దాం కదూ?


జైహింద్.


28, అక్టోబర్ 2008, మంగళవారం

కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత 4

1 comments

శ్రీమద్ రామాయణ కల్ప వృక్షంలో శ్రీ విశ్వనాధ భావుకతను కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాసం నుండి యింతవరకు మూడు పద్యాలను గూర్చి మీముందుంచగలిగాను. ఇప్పుడు నాల్గవ పద్యం చూద్దాం.

ఉ:- ఇంత మయూర రాజునకు ఏమి పొనర్చెనొ దుష్ట పాము దు
ర్దాంత గళోగ్ర సారణ విదారిత షట్జము గాగ నేగుచున్
దాంత పదాభిఘట్టిత పథంబున నర్ధ వికీర్ణ పింఛమై
ప్రాంత మహోగ్రనాకు వివరాంత ప్రవిష్టము జూచి రోజెడున్.
ఇది రామయణ కల్ప వృక్షము నందలి - నూపుర ఖండము లోని - 4.వ పద్యము.

సీతావియుక్తుడైన శ్రీ రామునికి పంపా సరోవర పరిసర అరణ్యంలో కనిపించిన ఒక దృశ్యం యిది. ఇక్కడ విశ్వనాధ ఒక మయూరమును వర్ణిస్తాడు.
ఒక నెమలి పెద్దగా అడుగులు వేస్తూ కోపంతో మెడ వెనుకకూ ముందుకూ ఊగుతుండగా రౌద్రము వలన పింఛము సగము విప్పుకొని ఒక పామును తరుముతున్నదట. కాని......కొద్ది లిప్తల కాలంలో ఆ పాము నెమలిని తప్పించుకొని ఒక నేల బొరియలోనికి పోయి అదృశ్యము కాగా మయూర రాజు శతృవు తప్పించుకొనగా ఏమీ చేయలేక నస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తూ రోజుతున్నదట. ఇందలి విశ్వనాధ భావుకతను పరిశీలిద్దాం.

" ఇంత మయూర రాజు " అనడం వల్ల గొప్ప వీరుడైన శ్రీ రాముడు మనకు స్ఫురణకు రాక మానడు రావణునికి ఒక దుష్ట సర్పముతో పోలిక ఇస్తూ వర్ణించడంలో అతని భావుకత మనకు ఆహా యనిపించక మానదు.పద్యంలో ప్రయోగించిన సమాసం నెమలి యొక్క పరుగులోని క్రమాన్నీ ఆయాసమునూ సూచిస్తున్నాయి.

మాయ లేడి కోసం వెళ్ళిన శ్రీ రాముడు లక్ష్మణ స్వామి మాటల వల్ల ఒంటరిగా ఉన్న సీతకు ఏ ఆపద వచ్చి పడుతుందో అని చాలా వేగంగా పర్ణ శాలకు వస్తాడు. కాని యింతలోనే రావణుడు సీతను అపహరించడం లంకాపురికి తీసుకొని వెళ్ళడం జరిగిపోయింది. అప్పటి శ్రీ రాముని నిస్సహాయత యీ పద్యంలో ప్రతి బింబితమగుచున్నది.

రావణ స్మరణము శ్రీ రామునిలో క్రోధోద్దీపకము కాగా జానకీ స్మరణము శృంగారోద్దీపకము అగు చున్నది.ఈ మహాకవి ఇక్కడ వర్ణనల యందు ఈ రెండు పార్శ్వములను వదలకుండా వర్ణించాడు. ఇదీ కవి సామ్రాట్ విశ్వనాధుని భావుకత.

చూచారు కదా కవి వతంసులగు శ్రీ బులుసు వేంకటేశ్వర్లువారి ఉపన్యాస గాంభీర్యతను, విశ్వనాధుని భావుకతను?. మరొక పర్యాయం మరొకపద్యం గురించి వారి నోట విన్నది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
వారితో నేరుగా మాటాడ దలచుకొనేవారి కొరకు వారి సెల్ నెంబరు...99491 75899. అందరికీ మరొక్క మారు దీపావళి శుభాకాంక్షలు. జైహింద్.

* దీ పా వ ళి *

0 comments

దీపావళి శుభా కాంక్షలు

చ:-
నరకు లనేకులీ జగతి నర్తన జేయుచు నుండె. వారి సం
హరణము జేయ నేర్చిన మహాత్ములు సత్ కవులొక్కరే. కృపన్
కరమున ఖడ్గమట్లు తమ గంటము దాల్చి లిఖించి పద్యముల్
నరకుల బారి బ్రోవుడయ! నాకముగా యొనరింపుడీ భువిన్.

ఆ:-
క్రొత్త పాళి కలదు. ఘోరా త్ములను జంప.
గిరిధరుండు కలడసురుల ద్రోల.
చదువరి కలడు మన బుధలోక మును బ్రోవ.
చంద్ర మోహనుండు సదయ గాచు.

చ:-
కలములు పట్టి మీరు " కలి కల్మష బద్ధుల దుష్ట చిత్తులన్
మలమల మాడ్చగా, దురభిమానము పూడ్చగ" దీక్ష బూని మీ
ప్రళయ హుతాశనాన్విత, ప్రబుద్ధ గుణాన్విత సత్ కవిత్వముల్
వెలయగ జేయుడీ. భువిని వేల్పులనన్ మిము., బ్రోచుడీ ధరన్.

చ:-
కవి వరులార! మీకవిత కాల్పగ జాలును దుష్ట చిత్తులన్
భువినిట సత్యభామయన { సత్య, భా, మయ, అన,= యదార్ధమైన కాంతితో కూడుకొనినది యనునటులుగా }
పుష్కల పద్య మహాగ్ని జ్వాలలో
భువిని రహించు దుష్టులను పూర్తిగ నాశము జేయుడయ్య. ఆ
దివిజుల దీవనల్ బడసి. దివ్వెల పండుగ తీపి గొల్పుడీ..

గీ:-
{ దీ } దీవనలనిచ్చి బ్రోచుత! దేవుడు మిము.
{ పా } పాపములు బాపి మీలోన భక్తి పెంచు.
{ వ } వందనీయపు శ్రీలక్ష్మి అందెల రవ.
{ ళి } ళి ఘలు ఘల్లను మీయింట. కృపను గాచు.

మీ అందరికీ దీపావళి శుభా కాంక్షలు.

0 comments

శ్రీ జ్ఞాన గుణ సాగరులయిన యావద్భారతీయ సహోదరీ సహోదరులకందరికీ ఆనందమయ దీపావళి శుభాకాంక్షలు. మీరంతా యెల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆంధ్రామృతాన్ని గ్రోలుతూ నిరంతరం సదసత్ వివేచనాపరులై నయ వర్తులై ప్రపంచానికే ఆదర్శం కావాలని కోరుకొంటూ
భవదీయుడు
చింతా రామ కృష్ణా రావు.

27, అక్టోబర్ 2008, సోమవారం

కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత ౩.

0 comments

చే జారిన తేనె బొట్టు
కవి సమ్రాట్ విశ్వనాధ భావుకతను వివరిస్తున్న కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ఉపన్యాసం నుండి మరొక పద్యాన్ని మీ ముందుంచుచున్నాను.
శా:-కంబళ్ళన్ మెయినిండ గప్పుకొని యాగండైన భల్లూక రా
జంబేదల్ తమి తేంట్లు చేయునది లేకల్లాడి గగ్గోలుగా
సంబాధంబగు తేనె సీత్కృతుల బీల్చన్ జూచు నాకాశ శా
ఖంబట్టూడక యుండ గాలదిమి చక్ర భ్రామ్య దక్షంబుగన్.
కల్ప వృక్షం - కిష్కింధ కాండ - నూపుర ఖండము - 3 వ పద్యము
సీతా వియోగి యైన శ్రీ రాముడు పంపా సరోవర పరిసర అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు.ఆయన ప్రతి చెట్టు పుట్ట పరిశీలిస్తున్నాడు. శ్రీ రాముని కంట బడిన ప్రతి దృశ్యము జరిగిన సీతాపహరణ వృత్తాంతాన్ని రాముని దఃఖాన్ని తెలుపుతూ కథా గతిలో రస నిర్వహణకు దోహదం అగునట్లు వర్ణించడం విశ్వనాధ విశిష్టత.
నిజానికి యే మనిషి యైనా దుఃఖితుడైన సమయంలో తనకు జగత్తు దుఃఖ మయంగాను, సౌఖ్యావహుడైన కాలంలో సుఖ మయంగాను భావించడం సహజం. ఈ మానవ సహజమైన భావన చేత కూడా శ్రీ రామునికి వసంత ఋతువు లోని ప్రకృతి దృశ్యాలు ఉద్వేగం విచారం మోహం భ్రాంతి దఃఖం మొదలైన స్పందనల్ని కల్గించడం ఎంతో సహజం గాను రమణీయంగాను మనకు కనిపిస్తాయి. ఇది విశ్వనాధ యీ ఘట్టంలో సాధించిన కవితాత్మకమైన మహా శిల్పం.

పద్య భావాన్ని పరిశీలిద్దాం.
కంబళ్ళు వంటి దట్టమైన వెంట్రుకలు శరీరం పై గల ఎలుగుబంటి చాల ఎత్తైన వృక్షాన్ని ఎక్కి పడిపోకుండా దృఢంగా చెట్టును కాళ్ళతో నొక్కి వింత ధ్వనులు చేస్తూ తేనె పట్టులోని తేనెను త్రాగుతున్నది. పాపము అంబేదలు అయిన తేనె టీగలు ( అంబేద = దిట్టతనం లేని వాడు, చేతకాని వాడు ) గగ్గోలు పెడుతున్నాయి.
ఈ వర్ణన ద్వారా మహాకవి సాధించిన విశేషార్థస్ఫురణము ఏమిటో చూద్దాం.
" సీత " రాముడు జన్మ జన్మాంతర పుణ్య పరపాకంగా సాధించిన తేనెఊట . మధు ప్రవాహం. భార్యగా ప్రేమ రాశిగా అనుసరణ శీలిగా . అద్వైత మూర్తిగా . పరిచర్యా శీలగా ఇలా " అద్వైతం సుఖ దఃఖయోః " అని భవ భూతి చెప్పిన రీతిని నిలిచిన స్త్రీ ఆమె. అటువంటి తేనెపట్టు వంటి ఆ సాధ్వి రావణుడు వంటి భల్లూకం చేతిలో పడడం శ్రీరాముని ద్యురదృష్టం. అంబేదయైన తేనె టీగ వలెరాముని హృదయం పరియపిస్తున్నది.
కంబళ్ళు కప్పుకొన్న దొంగలా భల్లూక రాజును పోల్చి చెప్పడం - సీతాపహరణ సమయంలో రావణుని వేషం సన్యాసి వేషాన్ని స్ఫురిస్తుంది. ఆకాశ శాఖ అనే పద ప్రయోగం వల్ల రావణుడు సీతను ఆకాశ మార్గాన కొనిపోయాడనే విషయం మనకు అవగతమవుతుంది.
యిలా వాచ్యంగా కాకుండా వ్యంగ్యాన్ని ఆశ్రయించి పాఠకుల హృదయంలో వర్ణనీయ వస్తువును - తదనుభూతిని సృష్టించే కవిత్వము ఉత్తమమైనదని ఆలంకారికులు చుప్తారు. పరమ మనోహరమైన ఈ వ్యంగ్య కవితకు రామాయణ కల్ప వృక్క్షం పుట్టినిల్లు.

విశ్వనాధ హృదయాన్ని బులుసు వేంకటేశ్వర్లు గారు ఎలా బహిర్గతం చేసారో చూచారు కదా. వీరి సెల్ నెంబరు 9949175899.
మళ్ళీ సమయం చిక్కినప్పుడు మరో పద్య రత్నాన్ని గ్రహిద్దాం. జైహింద్.

26, అక్టోబర్ 2008, ఆదివారం

పద్య రచనకుపయోగించు ప్రాసలు

1 comments

"ఛందో బద్ధ పద్య రచనకు ఉపకరించు ప్రాసలు
ఇంత వరకు మనం పద్యములలో ప్రయోగింప దగిన యతులను గూర్చి తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు ప్రాసలను గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేద్దామా మరి?

అసలు ప్రాస అంటే ఏమిటి ?
పద్య పాదమునందలి ప్రథమాక్షరాన్ని యతి అంటారని ముందుగా తెలుసుకొన్నాం కదా! రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. పద్యంలో మొదటి పాదంలో యే అక్షరం రెండవాక్షరంగా ప్రాస స్ఠానంలో ఉంచారో ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోనూ అదే అక్షరం ప్రయోగించాలి.
ప్రాసాక్షరంలో అచ్ సామ్యమక్కరలేదు.
ప్రాస పూర్వాక్షరం గురువైతే గురువు, లఘువైతే లఘువు అన్ని పాదాల లోను ఉండాలి.
ఇక ప్రాసలను గూర్చి తెలుసుకొందాం.

1) అర్థ బిందు సమప్రాస:-
ప్రాసాక్షరానికి ముందు అర సున్న అన్ని పాదాలలో నుంచుట. " వీఁక - తాఁకి "

2) పూర్ణ బిందు సమప్రాస :-
మొదటి పాదంలో ప్రాసాక్షరం పూర్ణ బిందు పూర్వక మైనట్లైతే ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రాసాక్షరం బిందు పూర్వకమే అవాలి. " పొందు - బృంద "

3)ఖండాఖండ ప్రాస:-
అర సున్న కలిగి యున్న ప్రాసాక్షరంతో అరసున్న లేని ప్రాసాక్షరాన్ని ఆ పద్యంలో ప్రాసగా ప్రయోగించ వచ్చును."బో( టి - పాట "

4) సమ్యుక్తాక్షర ప్రాస:-
ఏ సమ్యుక్త హల్లు ప్రాస స్థానంలో ఉంటుందో అదే సమ్యుక్త హల్లు ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రయోగించాలి. " అక్ష - కుక్షి "

5) సమ్యుతాసమ్యుత ప్రాస :-
రేఫ యుత సమ్యుక్తాక్షరముతో రేఫ రహితమైన అదే అక్షరమునకు ప్రాస చెల్లును. " శ్రీకర - ఈ క్రియ "

6) లఘు ద్విత్వ ప్రాస :-
సమ్యుక్త పూర్వాక్షరము లఘువయితే మిగిలిన అన్ని పాదాలలోనూ అటులనే రావాలి. "విద్రుచు - అద్రువ"

7)వికల్ప ప్రాస :-
అనునాసిక వికల్ప సంధ్యక్షరములకు ప్రాస. " దిఙ్మహిత - యుగ్మ "

8) ఉభయ ప్రాస :-
" న - ణ " లకు,
" స - ష " లకు, ప్రాస. " ప్రాణ - దాన " "వసుధ - విషమ "

9) అను నాసిక ప్రాస:-
భ/ క్తిమ్ముర < భ/ క్తిన్ + ముర = భ/ క్తిం ముర > తో - తమ్ములు. కు ప్రాస.

10) ప్రాస మైత్రి ప్రాస :-
" మ్మ - ం బ " లకు ప్రాస చెల్లును.

11) ప్రాస వైరము :-
" ర - ఱ ' లకు ప్రాస పనికి రాదు.

12) స్వ వర్గజ ప్రాస :-
" థ - ధ " లకు,ప్రాస చెల్లును.
" ద - ధ " లకు ప్రాస చెల్లును.

13) ఋ ప్రాస :-
" ఋ - ర " లకు ప్రాస చెల్లును. ఉ:- " ఆఋషి - చీరలు "

14) లఘు యకార ప్రాస :-
" ఆయజు < ఆ + అజు > - శాయికి "

15) అ భేద ప్రాస :-
" ల -ళ " లకు ప్రాసచెల్లును.
" ల - డ " లకు ప్రాస.చెల్లును.

16) సంధి గత ప్రాస :-
వ/ చ్చెంగుంతి < వ/ చ్చెన్ + కుంతి > - సింగము.
మొదలగునవి.

తెలుసుకొన్నాం కదా ! ఇంకెందుకు ఆలస్యం? పద్యాలు వ్రాసే ప్రయత్నం చెద్దామా మరి ?

జైహింద్.

25, అక్టోబర్ 2008, శనివారం

కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత 2.

1 comments

" అంతస్సంఘర్షణలో శ్రీరాముని హృదయ కుసుమం "
శ్రీ విశ్వనాధ సత్య నారాయణ రామాయణ కల్ప వృక్ష మహా కావ్యంలో వారి భావుకతను గూర్చి కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ప్రసంగ సారాంశాన్ని 21-10-2008వ తెదీన కొంత చూచాం. ఇప్పుడు మరొక పద్యం లోని భావుకతను తెలుసుకొందాం.
రామాయణ కల్ప వృక్షం కిష్కింధ కాండ- నూపుర ఖండం -2వ పద్యం.
చ:-మరియు మతంగ మౌని మహిమ స్పృశముల్ పరమానుకూల శాం
తరసము మాన లేవు రతి నాయక సాయక తీవ్ర రూప బం
ధురత త్యజింప లేవు సుమనోవ్రజ మల్లల పంప నీటి తుం
పురులను చల్ల గాలులను మోచి సుమావళి మాత్రమైనవై.

మహా కవి భావనకు అంతు అనేది ఉండదు.ఊహాశాలిత్వం మహాకవుల బుద్ధి వైభవం మన ప్రాచీన కవుల వర్ణనల్లో దర్శన మిచ్చినట్లే రామాయయణ కల్ప వ్రృక్షంలోనూ దర్శన మిస్తుంది.

శ్రీరాముడు సీతావిరహియై పంపా సరోవర పరిసర అరణ్యంలో లక్ష్మణ సమేతుడై సంచరిస్తున్న ఘట్టం యిది.
పంపా సరోవర ప్రాంతం మతంగ మహర్షి మహిమ చేత విలసితం అయినది. ఆ మహర్షి తపః ప్రభావం వల్ల ఆ పుణ్య ప్రదేశంలోని పూవులు శాంత రసమును వెలి గ్రక్కు తున్నాయి. మఱి వాటి జన్మ సిద్ధమైన, సహజమైన మన్మధ బాణ గుణమును వదలకుండా ఉన్నాయి. ఈ రకమైన రెండు పరస్పర గుణ సంఘర్షణలచేత పంపా సరస్సు నుండి గాలిలో తేలి వచ్చిన నీటి తుంపురులకు తడిసి వట్టి పువ్వులుగానే మిగిలిపోయాయి. అనుకొంటాడు శ్రీ రాముడు.

సీతా వియోగంలో దఃఖితుడైన శ్రీరాముడు - వసంత ఋతు శోభలో సీతా విరహియై మన్మధప్రభావితుడైన శ్రీరాముడు. ఇద్దరు శ్రీరామచంద్రులు మనకిక్కడ కనిపిస్తారు.
కవి శ్రీరాముని అంతస్సంఘర్షణను పూవులపై మిషగా ఉంచి మన మనస్సుకు కనిపింప చెస్తాడు. వాల్మీకి రామాయణంలో సీత లేని యీ సమయంలో యీ పూల సౌందర్యం నాకు నిష్ఫలంగా తోస్తోంది. అంటాడు శ్రీరాముడు. వాల్మీకి సూచించిన పూల సౌందర్యం అనే మాటను గ్రహించి విశ్వనాధ అనితర సాధ్యంగా ఇంత వర్ణన చేసారు.

శ్రీరాముని ప్రస్తుత దుఃఖానికి రెండు కారణాలు కనబడతాయి. అరణ్య వాసంలో నిన్ను సేవిస్తూ వసంత సౌందర్య విరాజితములైన వనాలను చూసి ఆనందిస్తానని సీత ఇదివరకు రామునితో పలికింది. అట్టీ సీత ఇప్పుడు లేదు. కనుల ముందు వట్టి వసంతం మాత్రమే ఉంది. ఇది శ్రీరాముని దఃఖానికి మొదటి కారణం. రెండవది రస సంబంధి. విప్రలంభ శృంగార నాయకుడైన శ్రీరాముని యందు ప్రస్తుతము ప్రియావిరహము దఃఖ కారణము అగుచున్నది.

మతంగ మహర్షి ఆశ్రమ ప్రాంత మందలి పూవులు శాంత గుణమును వదలలేకుండుట - తమ జన్మకు సహజ గుణమైన { పూవులు మన్మధాస్త్రములు కదా } తీవ్ర రూపమును వీడ లేకపోవుటను విశ్వనాధుడు వాడడం అత్యద్భుతము. పూవులు కేవలము పుష్పములుగా మిగిలిపోయినవని చెప్పడం శ్రీరాముని మనస్సులోని ఒకానొక నిర్వికార దశకు సూచకము. కావ్యములో ప్రవేశించే కొలదీ కవి భావుకతా సీమలు పరమ రమణీయముగా దర్శనమిస్తాయి.
చూచారూకదా బులుసువెంకటేశ్వర్లు గారు బహిర్గతం చేసిన విశ్వనాధ కృతిలోనిభావుకత.ఈ కవి వతంసుని సెల్ నెంబర్:-99491 75899.
మరికొన్ని విషయాలను త్వరలో మీముందుంచగలందులకు యత్నింతును. జైహింద్.

యతులకోసం మతులెందుకు పోకొట్టుకోవడం ? నేర్చుకొందాం రండి . ౩ వ భాగం.

1 comments

"యతుల కోసం మతులెందుకు పోకొట్టుకోవడం. నేర్చుకొందాం రండి " శీర్షికతో యిది వరకు 2 భాగాలలో కొన్ని యతులను గూర్చి తెలుసుకొన్నాం.
ఇప్పుడు ఉభయ యతులు :-

1) యుష్మ దస్మచ్ఛబ్ద యతులు :-
యుష్మదాగమనము < యుష్మత్ + ఆగమనము > ఇందులో " ద - అ " లు పూర్వ పదాంత, పరపదాది వర్ణాలు. వీటిలో దేనికైనా యతి వేయ జెల్లును.

2) పర రూప యతి :-
వేదండ < వెద + అండ > అఖండ శబ్దము వలె గాన వచ్చుటచే యిట్టి పదములలో ఉభయ యతి. అనగా " ద - అ " అను రెందింటిలో ఏ వొక్క అక్షరంతోనైనా యతివేయ జెల్లును.

3) ప్రాది యతి :-
ప్రాప్తి < ప్ర + ఆప్తి > యిందు " ప్ర - ఆ " అనే 2 వర్ణములలో ఏ వొక్క దానితో నైనను యతి గూర్ప జెల్లును.

4) అ ఖండ యతి ( లేదా ) నిత్య సమాస యతి :-
కర్ణాట < కర్ణ + అట > ఇది పద విభాగము తోపని నిత్య సమాసము గావున యిట్టి పదములలో " ర్ణ - అ "అను 2 వర్ణములలో ఏ వొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.

5) దేశ్య నిత్య సమాస యతి :-
క్రిక్కిఱియుట < క్రిక్కు + ఇఱియుట > అచ్ సంధి అయి యేక పదముగా కనిపించుచున్న దేశ్య పదములందు " క్కు - ఇ " వంటి 2 వర్ణములలో ఏ వొక్క వర్ణముతో నయనను యతి గూర్ప జెల్లును.

6) నిత్య యతులు :-
క్రూర కర్ముడేనియు < క్రూరకర్ముడు + ఏనియు > యిందు " ఐనాసరే అనే అర్ధంలో ఏనియు అనేపదంతో కూడిన మొదటిపదం నిత్య సమాసంగా కనిపిస్తున్నందున యీ పదంలో " డు - ఏ " అనే 2 వర్ణాలలో ఏవొక్కవర్ణంతోనైనను యతి వేయ జెల్లును.


7) రాగమ సంధి యతి :-
జవరాలు < జవ + ఆలు > ఇందు { ర్ + ఆగమ } (ర్) ర ఆగమంగా వచ్చినందున యిట్టి చోట " ర - అ " అను 2 వర్ణములలో ఏ వొక్క దానికైనను యతి గూర్ప జెల్లును.

8) విభాగ యతి :-
గంపెడేసి < గంపెడు + ఏసి > ఇట్టివి నిత్య సంధులు. ఇట్టిపదములలో " డు - ఏ " అను 2 వర్ణములలో ఏవొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.

9) నామాఖండ యతి :-
రామయ్య < రామ + అయ్య > ఇట్టి అఖండ నామములలో " మ - అ " అను 2 వర్ణములలో ఏవొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును

10) పంచమీ విభక్తి యతి :-
రామునికన్న < రామునికి + అన్న > < రామునకు + అన్న >
రామునికంటే < రామునికి + అంటే >
ఇట్టి పదాలలో ఏ వొక్క వర్ణమునకైనను యతి వేయ జెల్లును.

11) కాకు స్వర యతి:-
లేరో < లేరు + ఓ > ఇట్టి పదములందు " రు - ఓ " అనునటువంటి 2 వర్ణములలో ఏ వొక్క వర్ణమునకైనను యతి వేయ జెల్లును.


12) ప్లుత యుగ యతి :-
ఏ గతి కాచెదో రఘుపతీ < ఏ గతి కాచెదు + ఓ > మొదటి వర్ణమునందు, యతి స్థానమునందు ప్లుతవర్ణములున్నందున ఈ 2 ప్లుత వర్ణములకు యతి వేయ జెల్లును.

13) ప్రాస యతి :-
సీసము. తేటగీతి. ఆటవెలది.పద్యములందు యతికి బదులు ప్రాస యతి వేయ జెల్లును.
ఉ :- తే.గీ:- తెలుగు భాషయె జగతిని వెలుగు నిజము. < తెలు - వెలు > తె మొదటి అక్షరము. యతి స్థానమున యతి వేయ బడక దాని తరువాత గల ప్రాసాక్షరమునకు యతివేయబడినందున యిది ప్రాసయతికి ఉదాహరణ యగుచున్నది.

యతులను గూర్చి నేర్చుకొన్నాం కదా ! ఇక సాధ్యమైనంత వరకూ మన రచనలలో నియమాన్ని అతిక్రమించకుండా యతులు ప్రయోగించడానికి ప్రయత్నిద్దామా మరి ? ప్రాస విషయం కూడా సమయం చిక్కినప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

జైహింద్.

24, అక్టోబర్ 2008, శుక్రవారం

యతుల కోసం మతులు పోకోట్టుకోవడంఎందుకు మనం? నేర్సుకొందాంరండి. ౨ వ భాగము.

0 comments

యతుల విషయాలు క్రిందటి సారి కొన్ని తెలుసుకొన్నాంకదా! ఇప్పుడు మరికొన్ని తెలుసుకొందామా?
వ్యంజన యతులు :-

1) వర్గజ యతులు :- కవర్గాదులలో పంచమాక్షరం మినహ మిగిలిన 4 హల్లులూలకూ పరస్పరం యతి చెల్లును.
క. ఖ. గ. ఘ. { క } వర్గజ యతి
చ. ఛ. జ. ఝ. { చ } వర్గజ యతి.
ట. ఠ. డ. ఢ. { ట } వర్గజ యతి
త. థ. ద. ధ. { త } వర్గజ యతి.
ప. ఫ. బ. భ. { ప } వర్గజ యతి.
ఏ వర్గక్షరములకా వర్గాక్షరములు తమలో తాము యతిచెల్లును.

2) బిందు యతి :-
" ఙ " తో > ంక. ంఖ. ంగ. ంఘ.
" ఞ " తో > ంచ. ంఛ. ంజ. ంఝ.
" ణ " తో >ంట. ంఠ. ండ. ంఢ.
" న " తో > ంత. ంథ. ంద. ంధ.
"మ " తో >ంప.ంఫ. ంబ. ంభ. లు బిందు యతిపేరుతో పరస్పరము చెల్లును.

3) తద్ భవ వ్యాజ యతి:-
" జ్ఞ - న - ణ " లు పరస్పరము చెల్లును.

4) విశేష యతి:-
" జ్ఞ " - క - ఖ - గ - ఘ. లు పరస్పరము చెల్లును.

5) అనుస్వార సంబంధ యతి :-
" ంట - ంఠ - ండ - ంఢ - ంత - ంథ - ంద - ంధ -లు పరస్పరము చెల్లును.

6) అను నాసికాక్షర యతి :-
" న " తో > ంట - ంఠ - ండ - ంఢ. చెల్లును.
" ణ " తో > ంత - ంథ - ంద - ంధ. చెల్లును.

7) ము కార యతి :-
"పు - ఫు - బు - భు - ము ' లు చెల్లును.

8) మ వర్ణ యతి :-
" మ - ం య - ం ర - ం ల - ం వ - ం శ - ం ష - ం స - ం హ " లు చెల్లును.

9) సరస యతి :-
" అ - య - హ " లు చెల్లును.
" చ - ఛ - జ - ఝ - శ - ష - స " లు చెల్లును.
" న - ణ " లు చెల్లును.


10) అ భేద యతి :-
" వ - బ " లు చెల్లును.
" ల - ళ " లు చెల్లును.
" ల - డ " లు చెల్లును.


11) అ భేద వర్గ యతి :-
" ప - ఫ - బ - భ - వ " లు చెల్లును.

12) సం యుక్త యతి :-
" క్ష్మ " వంటి సం యుక్త హల్లులో గల " క - ష - మ "లలో యేదో వొక దానికి యతి వేయ జెల్లును.

13) అంత్యోష్మ సంధి యతి :-
" వాక్ + హరి = వాగ్ఘరి " ఇందు " క ' తో గాని " హ " తో గాని యతి వేయ జెల్లును.

14) వికల్ప యతి :-
" సత్ + మతి = సన్మతి. " ఇందు " త " తో గాని " న " తో గాని యతి వేయ జెల్లును.

పైన వివరించినవన్నీ పరస్పరమూ చెల్లునని గ్రహింప గలము.
ఇప్పటికే మీరు బాగ అలిసిపోయినట్లున్నారు. మరికొన్ని యతులను గూర్చి మరొకనాడు కలుసుకొన్నాప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

జైహింద్

23, అక్టోబర్ 2008, గురువారం

యతులను గూర్చి మతులెందుకు పోకొట్టుకోవడం? నేర్చుకొందాం రండి.

1 comments

ఆంధ్ర భాషకు అమర భాషకన్నా అమృత భాషగా కీర్తి కారకమైనది అనితర దుర్లభమైన ఛందో బద్ధ సాహితీ సంపత్తియే. మనం సాధించ దల్చుకొంటే ఆఛందస్సు, మనకు దుర్లభమైనదేమీ కాదు. సులభ సాధ్యమే.ఐతే మనకది కరతలామలకం కావాలంటేమాత్రం కొంచెం దృష్టి పెట్టి నేర్చుకొంటే క్షణాలమీద నేర్చుకో వచ్చు. మీరు చాలా వుత్సాహంగా నేర్చుకోవాలనుకొంటున్నారు కాబట్టి మీకు గుర్తుండే విధంగా యతులను తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
మనం హుషారుగా ఒక పద్యం వ్రాసి ఏపండితునికో చూపిస్తే......... యిక్కడ ప్రాస తప్పింది.... అక్కడ యతి తప్పింది... అనేసరికి మన వుత్సాహం కాస్తా నీరు కారిపోయి యిహ జీవితంలో పద్యాల జోలికి పోకూడదనే స్థాయికి మనకు కలిగిన నిస్పృహ మనల్ని చేరుస్తుంది. అంతే. పుస్తకం మూసెస్తాం. అంత నిస్పృహ చెందనవసరం లేదు.ముందుగా యతులను చూడండి.

యతి అంటే విచ్ఛేదము అని అర్థం. " యతిర్విచ్చేద సంజ్ఞకః " .
మొదటి అక్షరానికి యతి అని పేరు.
మొదటి అక్షరం యే అక్షరం వుంచామో అదే అక్షరం కాని, లేదా దాని మిత్రాక్షరం కాని యతిస్థానంలో వాడాలి.
ఇప్పుడు అక్షరం అనే పదంలో చిన్న విషయం తేలుసుకోవాలి.
అచ్చులతో కలిస్తేనే హల్లైనా సమ్యుక్త హల్లైనా పలుక బడుతుంది.
అంటే యతి స్థానంలో 1.అచ్చూ 2. హల్లూ ఉన్న మాట మనం మరువ కూడదు.

యతి నియమం అంటే మోదటి అక్షరంలో యే హల్లు., ఏ అచ్చు వాడామో ఆ అచ్చుతో గాని లేదా ఆచ్చుకు మిత్రాక్షరమైన అచ్చుతో గాని కూడిన హల్లుకుగాని లేదా దాని మిత్ర హల్లుకు గాని యతి వేయాలని గుర్తుంచుకోవాలి.
మనకొక సందేహం వస్తుంది. ఏ అచ్చుకి ఏఅచ్చు మైత్రి కలిగివుంది. ఏ హల్లుకి యా హల్లు మైత్రి కలిగి వుంది అని.
అందుకే ముందుగా అచ్చులకు గల మైత్రిని తెలుసుకుందాం.వీటినే స్వర యతులు అంటారు.
స్వర యతులు:-

1) స్వరమైత్రి వళి;-
అ ఆ ఐ ఔ . {ఫ్రెండ్స్}
ఇ ఈ ఋ ౠ ఎ ఏ {ఫ్రెండ్స్}
ఉ ఊ ఒ ఓ {ఫ్రెండ్స్}
పైన తెలిపిన క్రమంలోనే అచ్చులకు యతి మైత్రి చెల్లుతుంది. హల్లులలో వుండే అచ్చులు పై క్రమంలోనే ప్రయోగించాలి

2) స్వర ప్రధాన వళి:-
అచ్చులకు సంధి అయిన చోట పర పదంలోని మొదటి అచ్{వంశ్+అ = వంశ + అబ్ధి} దీనిలో అబ్ధి అనే పదంలోని " అ " అనే అచ్చుకే యతి వేయాలి.
3) లుప్త విసర్గక స్వర వళి;- తమః + అర్క > తమోర్క. ఇలాగ విసర్గ మీద అకారము ఓ కారంగా మారిపోతున్నప్పుడు అందులోగల " అ " కారానికే యతి వేయాలి.

4) ఋ వళి:-
"ఋ" తో గాని, ఋ నే వట్రసుడిగా కలిగి యున్న హల్లులోగల వట్రసుడితో గాని రి రీ రె రే లకు యతి కుదురుతుంది.

5) ఋత్వ సంబంధ వళి:-
వట్రసుడి తో ఇ ఈ ఋ ౠ ఎ ఏ లకు యతి చెల్లు తుంది

6) ఋత్వ సామ్య వళి:-
వట్రసుడి గలిగిన హల్లులు అవి యేవైనాసరే హల్ల్ సామ్యంతో నిమిత్తం లేకుండా వట్రసుడులు కలిగివుంటే చా;లు యతి చెల్లును.

7) వృద్ధి వళి:-
అ కరమునకు ఎ ఏ ఐ లు పరమైన ఐ కారమూ, ఒ ఓ ఔ లు పరమైన ఔ కారమూ సంధిలో వచ్చిన వృద్ధి సంధి అంటారుకదా! అలాంటి చోట సంధి కాక ముందున్న అచ్చుతోనైనా, సంధి అయిన తరువాత వచ్చిన అచ్చుతోనైనా యతి వేయ వచ్చును.
ఇవే స్వర యతులు.
వ్యంజనాక్షర యతుల్ని గూర్చి మరొకమారు కలుసుకొన్నప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

జైహింద్.

22, అక్టోబర్ 2008, బుధవారం

ఒక కంద పద్యం లో ఒకటా, రెండా, మూడా కాదు నాలుగు కంద పద్యాలు.

2 comments

కందంలో కందం, అందులోనే మరో కందం, మరో కందం కూడా. చూడాలనుందా? ఐతే యీ క్రింది పద్యాన్ని గమనించండి.

క:-
శంకర! ఉమాధిపా! వృష
భాంకా! కరుణార్ద్ర హృదయ! అభవా! గిరిశా!
సంకటము బాపి, కృప గన
నింకన్ శరణంబు వేడ నేలవు. భరమా? ఇది 1 వ కంద పద్యము.

క:-
కరుణార్ద్ర హృదయ! అభవా!
గిరిశా! సంకటము బాపి, కృప గన నింకన్
శరణంబు వేడ నేలవు.
భరమా! శంకర! ఉమాధిపా! వృషభాంకా! ఇది 2 వ కంద పద్యము.

క:-
సంకటము బాపి కృపగన
నింకన్ శరణంబు వేడ నేలవు. భరమా?
శంకర ! ఉమాధిపా !వృష
భాంకా! కరుణార్ద్ర హృదయ! అభవా! గిరిశా! ఇది 3 వ కంద పద్యము.

క:-
శరణంబు వేడ నేలవు.
భరమా! శంకర! ఉమాధిపా! వృషభాంకా!
కరుణార్ద్ర !హృదయ ! అభవా!
గిరిశా! సంకటము బాపి, కృప గన నింకన్. ఇది 4 వ కంద పద్యము.

చూచారుకదా! తమాషాగాలేదూ? ప్రయత్నం చేయాలేకాని బోలెడన్ని తమాషాలు చేయవచ్చు. ఐతే మీ వుత్సాహాన్ని తెలుసుకొన్న తరువాతే మరి కొన్ని విషయాల్ని గూర్చి తెలియ జేసే ప్రయత్నం చేయగలను.

జై హింద్.

21, అక్టోబర్ 2008, మంగళవారం

కవిసమ్రాట్ విశ్వనాధ భావుకత 1

7 comments

పాల సముద్రం వంటి తమ విజ్ఞాన సాగరాన్ని మథించి, అందుండి యుద్భవించిన జ్ఞానామృతాన్ని లోకాని కందించిన తెలుగు కవులు లెక్కకు మించి వున్నారు. మన దురదృష్ట వశాత్తు వారందించిన జ్ఞానామృతాన్ని మనం ఆస్వాదించ లేకపోతున్నాము.మనలో విషయ పరిజ్ఞాన లోపమే యిందుకు కారణం.మన పాఠ్య ప్రణాళికలలో భాషా పరిజ్ఞానాన్ని కలిగించే అంశాలపై తగిన శ్రద్ధ తీసుకోకపోవడమే మన యీ దుస్థితికి మూల కారణం.
కారణం యేదైనా మనకు కలిగిన నష్టాన్ని మనం పూడ్చుకోడానికి లోకంలో పెక్కు మార్గాలున్నాయి. కవి పండిత శిఖామణులనేకమందున్నారు. ఈ నాటి వారి పరిశోధనాత్మక వ్యాసాలనూ, వారి ఉపన్యాసాలనూ, వారి రచనలనూ, మనం లక్ష్యంతో గ్రహించే ప్రయత్నం చేయగలిగితే ఆ లోపం మనకు దూరమౌతుంది.
నాకు లభించిన మహనీయుల సాహితీ కృషి ఆంధ్ర పాఠక లోకానికందిచే యీ నా ప్రయత్నం ఆంధ్రామృతాన్నాసక్తితో గ్రోలదలచుకొన్నవారందరికీ ఆనందప్రదం కాగలదని ఆశిస్తున్నాను. ఈ పరంపరలో భాగంగా కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి " రామాయణ కల్ప వృక్షం" కావ్యంలోగల {కావ్యాత్మని}ధ్వనిని " కవి వతంస" బిరుదాంకితులయిన శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గావించిన ఉపన్యాస సారాన్ని మీకందించే ప్రయత్నం చేయడానికి సాహసిస్తున్నాను. సహృదయంతో గ్రహింతురు గాక.

కవి సామ్రాట్ విశ్వనాథ భావుకత.:-
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి " రామాయణ కల్ప వృక్షం"లో కిష్కింధా కాండలోని కొన్ని పద్యాలలో గల ధ్వనిని పరిశీలిద్దాం. శ్రీ రాముడు సీత జాడ తెలుసుకో దలచి లక్ష్మణ సమేతుడై పంపా సరోవర పరిసర అరణ్యంలోకి ప్రవేశిస్తాడు.అక్కడి దృశ్యాలను కవివర్ణిస్తూ యిలాగంటాడు.
శా:-ఆకుల్ పూవులు, తప్త కుంభ శిఖర వ్యాకీర్ణముల్గా దృశాం
తాకుల్యాకృతి దైన్య ధైర్య రమణీయంబై విడంబింపగా
ఆకూతిన్ జనెడున్ ప్రియా విరహితా మత్తానేకపంబొండు. పం
పా కేళీ వన మంద్ర ఘీంకృతి రవ వ్యాహార సాహస్రియై.
ఈ పద్యంలో కవి ప్రియురాలి విరహాన్ని పొందిన మదగజం పంపా నదీ తీరాన విహరించడం వర్ణిస్తాడు.చూడండెలా వర్ణించాడో.
"పంపా సరోవర అరణ్య ప్రాంతంలో ఓక ప్రియురాలి విరహాన్ని పొందిన మదగజం విహరిస్తోంది. దాని కుంభ స్థలంపై ఆకులూ పూవులూ పడివున్నాయి. అది క్రీగంటి చూపులతో దైన్య, ధైర్య, రమణీయంగా వుంది.పైగా మంద్ర స్వరంలో తనలో తాను ఏదో గొణుగుకుంటున్నట్లు ధ్వని చేస్తూ ముందుకు పోతున్నది."
ఇదీ యీ పద్య భావం.
సాధారణంగా మన సాహిత్యంలో ఋతు వర్ణనలు కథాగతికి తోడ్పడే విధంగా కాకుండా ప్రకృతి వర్ణనలతో నాయికా నాయకుల విరహాన్ని ఉద్దీపింప జేసే విధంగా వుంటాయి. సంస్కృత కావ్యాలలోనయితే నాందీ ప్రస్థావనాదులలో భావి కథా సూచిగా ఆ కవులు వ్రశారు.
ఇక్కడ మనం విశ్వనాధ వారి ధ్వని ప్రయోగ వైశిష్యాన్ని పరిశీలిద్దాం.
శ్రీ రామునికి సీత దూరమయింది.ఆమె కొరకు వెదుకుతున్నాడు.ప్రియా విరహంతో దందహ్యమాన హృదయుడై యున్నాడతడు. కవి ప్రియావిరహితుడైన గజరాజును వర్ణిస్తున్నాడా! లేక రాముని వర్ణిస్తున్నాడా! గమనిస్తే శ్రీరాముని పరిస్థితికి అనుకూలమైన విధంగా ప్రకృతి వర్ణన జోడించిచేసినాడనడమే సముచితం. ఏలనంటారా!
శ్రీరాముని తలపై అంటుకొన్న ఆకులూ పూలూ ఒక దారీ తెన్నూ లేకుండా అతడు తిరగడం తెలియజేస్తోంది. భార్య దొంగిలింపబడడంతో అవమాన మగ్నుడైన అతనికి క్రీగంటి చూపులే మిగిలాయి." ఆకూతి " అంటే మనసులోనే ఏదో అభిప్రాయం పెట్టుకొని వుండడం. ప్రస్థుతం రాముని స్థితి అదేకదా! అటు మద గజానికైన, ఇటు రామునికైనా దైన్య, ధైర్య, రమణీయ మైన స్థితే గదా! సీతను కోల్పోయిన దీనత్వము, సహజ ముగానున్న ధైర్యత్వము, ఈ రెండు భావాలూ సమ్మిళితమై అందగిస్తున్నాడు రాముడు. మంద్ర స్వరంలో ఏదో గొణుగుకోవడం తన దురవస్థని తలచుకొవడమో, ఆత్మ నిందో, లేక గీత దటినసీతను నిందించడమో,ఆవిషయంలో పాఠకుల భావనా పటిమకే తోచేలా వ్రాశాడీకవి.
సారాంశమేమిటంటే .....ప్రకృతి వర్ణనలో ప్రస్తుతము శ్రీరాముని ప్రకృతి ధ్వనించే విధంగా వ్రాసిన విశ్వనాధ హృదయాన్ని గ్రహించ గలగడం పాఠకుని జ్ఞాన పటిమకొద్దీ వుంటుంది. ఇలాంటివి ఈ సందర్భంలో నలభై దాక పద్యాలున్నాయి మరో పర్యాయం మరో పద్యం తెలుసుకుందాం.

మంచి చేయగ నేర్చుడీ ! మించి మీరు.

0 comments

సీ:- ఆంధ్ర పాఠకులార! అ సదృశ ప్రతిభ మీ - ఆస్తిగానొందిన ఆర్యులార!
దివ్య విజ్ఞానమున్ భవ్య తేజంబునున్ - సువ్యక్త మొనరించు సుజనులార!
రవ్యాదులీ సృష్టి రహియించు నెన్నాళ్ళు - రహియింతురన్నాళ్ళు యిహమునందు.
దేవతా మూర్తులే దివ్యాంధ్ర జనులుగా - యీ లోకమున కీర్తి నెదుగు, సతము.
గీ:- సద్గుణాలకు ప్రతిరూపు, సాధు జనులు, - సన్నుతాత్ములు ఆంధ్రులు సరస మతులు.
అనగ వర్ధిల్ల నేర్చిన ఆర్యులీరు. - గనుడు ఆంధ్రామృతము మీరు సునిసితముగ.
ఉ:- ఏమియు చేయ నేరనని, యేదియు చేయగ రాదు నాకనీ,
మీ మది చింతనొందుటది మేలని భావన చేయకుండ, మీ
ధీ మహనీయ శక్తి గని, తేజమునొంది, ప్రయత్నమున్ సదా
ప్రేమగ చేయనేర్చిన సుహృజ్జన మెప్పుగ చేయ నేర్వరే?
ఉ;-మంచిని చెడ్డయున్ గనుడు. మంచిని చూచి గ్రహింప నేర్చుడీ.
మంచి రహించు, నిశ్చయము. మంచిని మీ రొనరించిరేని, యా
మంచిని గాంచినట్టి ప్రజ మానసమందు ప్రియంబు తోడ మి
మ్ముంచెదరయ్య! నమ్ముడయ! యుత్సుకతన్ యొనరింపుడీ! కృషిన్.

20, అక్టోబర్ 2008, సోమవారం

ఏడు కొండల వాడా ! నీ కెగనామాలే. .

0 comments

ఏడు కొండల వాడికే యెగనామాలు:- ఇది చాలా హేయం. పిల్లి కళ్లు మూసుకొని పాలు త్రాగినట్లు ఏడు కొండలపైన క్రింద అధికారులు , అనధికారులు, ఉద్యోగులు, పెక్కు మంది అనైతికముగా ప్రవర్తిస్తున్నారన్న విషయం ఓపెన్ సీక్రెట్. మంచి వారు, చెడ్డ వారు, భక్తులు, భుక్తులు, ఎందఱో నీదగ్గరకివసున్న వారు . వారందరూ నీకు తెలియని వారేం కాదు.భక్త రక్షణ దుష్ట శిక్షణ చేయడానికి ఉపేక్ష ఎందుకు స్వామీ? ఇంకా నీవు వుపేక్ష చేస్తే నీకు మిగిలేవి పంగానామాలే సుమా!
సీ:-ఏడు కొండల వాని కెగనామమును పెట్టి. - భక్తి భావన జూపు పాపులుండె.
నామామృతముతోడ ప్రేమస్వరూపుని - కభిషేక మొనరించు శుభులు నుండె.
అకళంక సుకవిత్వ మందించ గల్గిన - శ్రీ యన్నమయ వంటి సిద్ధు లుండె.
భజియించు వారుండె భక్తితో గోవిందు. - భుజియించు వారుండె పూజ లనుచు.
గీ:- సంకట హర ! గనవదేల? వేంకటేశ ! - నీదు సంపత్తి హరియించు నీచులకును
శిక్షణము సేయ వేలనో? శ్రీనివాస? - భక్తి మార్గాన నడుపుమా ! భయము గొలిపి.

18, అక్టోబర్ 2008, శనివారం

ఒక సభలో గరికిపాటిని గూర్చి నా నిర్వచనం

2 comments

ఆర్యా! నమస్తే !
నేను ఆంధ్రామృతంలో వ్రాసిన దత్తపదిని మీరు చూచారనుకుంటాను. దానిపైన మీ అభిప్రాయం వ్రాయగలరు.
ఆంధ్ర జ్యోతిలో ప్రకటించిన శ్రీమాన్ గరికపాటి నరసిమ్హం గారి దత్తపది తో వర్ణన అత్యద్భుతంగా వుంది.ఐతే దానిలో ఆశ్చర్య పోవలసిందేమీలేదు. ఎందుకలా అన్నానని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోకండి. ఎందుకంటారా. అతడేమైనా సామాన్యుడా? వ్రాయలేకపోవడానికి? వారి శక్తి యుక్తులు తెలియనివారు ఆశ్చర్యపోవచ్చు. ఆంధ్ర భాషా సేవలో నిమగ్నమై వారు ఆంధ్రుల జీవనాడిగా మారారు.అతని సేవకు ఆంధ్ర మాత పులకరించిపోతోంది. వారితో పాటు నేనూ 30-11-2007 వ తేదీన సర్వసిద్ధి రాయవరం గ్రామంలో గురజాడ వర్ధంతి సందర్భంగా ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించినపుడు వారిని గూర్చి నే నొక సీస పద్యం ఆశువుగా చెప్పాను.మీరూ దానిని అవధరించండి.

సీ:-
శ్రీ కరం బైనట్టి చిన్మూర్తి యీనాటి, - కవి కులంబున మేటి గరికిపాటి.
సుజ్ఞాన సంపన్న సుందరంబుల సాటి - కనరాని ఘన మేటి గరికిపాటి.
అవధాన ప్రక్రియ నరయ లేరిల పోటి. - కమల సంభవు సాటి గరికిపాటి.
ఆంధ్ర మాతకు సేవ లందించు. యీనాటి - కల్యాణ గుణ వాటి గరికిపాటి.
తే:-
నవ్య రుచిరార్థ కవితల నరుడనంగ.
సిం హ గాంభీర్య వాగ్ ధాటి సిమ్హమనగ
నార సిమ్హుగ వెలుగొందె గారవముగ.
గరికి పాటిని గనుటీ నగరికి పాటి.


చూచారు కదా! గరికిపాటివారిని గూర్చిన నా నిర్వచనాన్ని. ఆ సభలో వారి తేజస్సే నాలోనుండి ఆశువుగా ప్రవహించింది.
వారివలె ఆంధ్రులైన వారు పెక్కురీ యాంధ్ర మాతకు సేవలందించాలని వారి ఆశయం. మీరూ ప్రయత్నిచండి. శుభమస్తు.

జైహింద్.

17, అక్టోబర్ 2008, శుక్రవారం

దత్త పదులతో వర్ణన సులభమేనా?

0 comments

ప్రియ సాహితీ బంధువులారా! నిత్య శుభాకాంక్షలు.
మన ఆంధ్ర సాహిత్యంలో అసదృశమైన సాహితీ ప్రక్రియలున్నాయి. ముఖ్యంగా అవధాన ప్రక్రియలో మనం దత్తపదిని చాలా చమత్కారంగా వుండేలాగ పృచ్ఛకులివ్వడం చూస్తుంటాము. వాటిని మనం కూడా పూరించ గలిగితే చాలా బాగుండుననిపిస్తుంది. ఆలోచిస్తే అది పెద్ద కష్టమైన పనెమీ కాదుకూడాను.
ఒక సారి నేను కళాశాలలో విద్యార్థులకు అవధానం గురించి వివరిస్తుండగా అందులో ఒక తెలివైన విద్యార్థి మాస్టారూ! మనం 1. అన్న, 2. అక్క, 3 చెల్లె, 4 బావ. దత్త పదాలుగా యివ్వవచ్చా? అని అడిగాడు. ఇవ్వొచ్చన్నాను. సీతాన్వేషణను గూర్చి వర్ణించమనొచ్చా? అని అడిగాడు. ఔనన్నాను.ఐతే మీరిప్పుడు వర్ణించి వ్రాయగలరా? అని పదిమందిలోవుండగా అడిగాడు. ఈ పరిణామాన్ని నేనూహించలేదు. ఏం చెప్పాలో అర్థం కాకపోయినా వెంటనే ఎందుకు వ్రాయలేను? అని అన్నాను. ఐతే వ్రాయండిసార్! చూస్తామన్నాడు. అందరూ నావైపే ఎలా వ్రాస్తానో అని చూస్తున్నారు. వాళ్ళందరినీ 2 నిమిషాలు మాటల్లో పెట్టి ఆలోచించేసరికి కొంత అవగాహన వచ్చింది. వ్రాయడమ్మొదలు పెట్టాను. 2 నిమెషాల్లో వ్రాయడం పూర్తి చేశాను. దత్త పదులతో నేనువ్రాశిన ఆ వర్ణన చూడండి.
ఉ:-జానకి యేడనున్నదియొ? జాడ కనుంగొను " మన్న " రాముడా
యానతి విన్న మారుతియె " అక్క " డ, యిక్కడ, లేక, లంకలో
జానకి గాంచు " చెల్లె " డల , చాటుగ " బావ " ని గాంచె.నద్దిరా!
జ్ఞాని కసాధ్య మెద్దియొకొ? చక్కని భక్తి ప్రపత్తి గల్గినన్.
చూచారుకదా! నేను చేసిన పూరణని. నేను పడిన టెంక్షనంతా పద్యం వ్రాయడం పూర్తవడంతో వదిలింది. చాలా భయపడ్డాను .ఐతే ఈ సంఘటన నాకు కొండంత ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది. ఎప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు ఎదుర్కొనే ముందుకష్టంగా అనిపించినా దానిని పూర్తి చేయగానే కొండంత ధైర్యం, ఆత్మ విశ్వాసం మనలోతప్పక కలుగుతుంది. మీరూ ప్రయత్నించండి. పద్య రచనాభిలాషాభివృద్ధిరస్తు .

కళా పీఠం లో కార్యక్రమం.వక్త డా.యన్.రాజేశ్వరి.

0 comments

శ్రీ అన్న మాచార్య సంగీత పీఠం, చోడవరం లో ప్రతీ నెలా ఆఖరి ఆదివారం జరుపుకొనే సాహితీ కార్యక్రమం కవితా వైశిష్యం కార్యక్రమం ఈ నెల 26-10-2008 వ తేదీ ఆది వారం నాడు జరుప బడును. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా విశాఖపట్టణ నివాసి అయిన డాక్టర్ యన్. రాజేశ్వరీ శంకరన్ గారు వచ్చి, పాల్కురికి సోమ నాథుడు అనే కవిని గూర్చి ఉపన్యసించబోతున్నారని పీఠం అధ్యక్షులు శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మిగారు ప్రకటించారు.
శ్రీమతి డాక్టర్ యన్.రాజేశ్వరి గారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ద్వారా " పోతన - అతని సాహితీ శిల్పం " అనే అంశంపై పరిశోధనా గ్రంథం వ్రాశి డాక్టరేటు పొందారు.తెలుగు దిపార్టుమెంట్ లో మొట్టమొదటగా డాక్టరేట్ సాధించిన మహిళామణి యీమెయే. మరో ప్రత్యేకత యేమిటంటే ఆ పరిశోధనా వ్యాసానికి బంగారు పథకం కూడా వచ్చింది.
ప్రస్తుతం వీరి వయసు 80 సంవత్సరాలుంటాయి. ఈమె ఆంధ్ర యూనివర్సిటీలో బీయే ఆనర్స్ చేసి రిసిపిఎంటాఫ్ శ్రీమతి ఈశ్వరీదేవి సహానీ మెమోరియల్ ప్రైజ్ సాధించారు.
అలంకార శాస్త్రంలో ఎమ్మే ఆనర్స్ చేశారు. డెక్కన్ పీజీ కాలేజ్ పూనే ద్వారా డిప్లమో యిన్ లింగుఇస్టిక్ సాధించారు.
తెలుగు విజ్ఞాన సర్వస్వానికి కల్చరల్ వాల్యూం కు రచన లందించారు.
ఈమె 6 గ్రంధాలు వ్రాయడమే కాక అత్యున్నత ప్రమాణాలు గల తెలుగు పత్రికలద్వారా పెక్కు వ్యాసాలను సమాజానికందించారు.
నేషనల్ ఎండ్ ఇంటర్ నేషనల్ ఫొక్ లోర్ అనే గ్రంథాన్ని ప్రచురించారు. నేషనల్ బుక్ ట్రష్టాఫ్ యిండియా సంస్త కొరకు 2 ఆంగ్ల గ్రంథాలను తెలుగు లోనికి అనువదించారు.
ఒరిస్సా ఉత్కళ యూనివర్సిటీలో తెలుగు డిపార్టుమెంట్ హెడ్డు గా 6 సంవత్సరాలు పనిచేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ కి సంబంధిచిన వెంకటేశ్వరా కాలేజ్ లో ప్రొఫెసర్ గా 8 సంవత్సరాలు పనిచేశారు.
జమ్మూకాశ్మీర్లో రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్గా 6 సంవత్సరాలు పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున జె.కె.లోని మారుమూల ప్రాంతాలలో అనేక సేవా కార్య క్రమాలు చేశారు.
ఒరిస్సా పబ్లిక్సర్వీస్ కమిషన్ మరియు ఎడ్మినిష్టేటివ్ సర్వీసెస్లో 12 సంవత్సరాలు పని చేశారు.
పాండుచ్చేరి శ్రీ అరబిందో సొసైటీ వ్రైటర్స్ క్లబ్ మెంబర్ గా పని చేశారు.
ఇంతటి బహు ముఖ ప్రజ్ఞా శాలి అయిన వీరి ఉపన్యాసం విని తీరవలసిందే.

15, అక్టోబర్ 2008, బుధవారం

తమాషా శ్లోకం - అంబలి ద్వేషణం వందే !

3 comments

తమాషా శ్లోకం :

మనం నిత్య జీవితంలో ఎన్నో కష్ట సుఖాలకు లోనవుతూ కూడా కొంత మానసిక ఉప శాంతిని " సంగీత సాహిత్యాల" వల్ల పొంద గలుగుతున్నాం. అందుకే పెద్దలన్నారు
" సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తన ద్వయం.
ఏక మాపాత మధురం, ద్వితీయం చింతనామృతం."
ఈ మాటలు ఎంత యదార్థము?
కొన్ని కొన్ని తెలుగు పద్యాలు, కొన్ని కొన్ని సంస్కృత శ్లోకాలూ అత్యద్భుతమైన ఆనందాన్ని కలుగ జేస్తాయి.
ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.

శ్లో:-
అంబలి ద్వేషిణం వందే.
చింతకాయ శుభ ప్రదం.
కూరగాయ కృత త్రాసం
పాలనేతి ప్రియం గవాం.


గమనించారుకదా యీ శ్లోకాన్ని.
ఈ శ్లోకం లో " అంబలి, చింత కాయ, కూరగాయ, పాల, నేతి, " యిత్యాది పదాలు మనకి తెలుగు పదాల్లాగా కనిపించి, తెలుగు పదాలతో కూడిన సంస్కృత శ్లోకం లాగా తోస్తుంది. ఐతే కొంచెం ఆలోచించి చూస్తే ఆ పదాలు తెలుగు పదాలు కావు. సంస్కృత పదాలే.ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం.

బలి ద్వేషిణం =బలిని ద్వేషించు వాడును,
చింతకాయ=చింతించు వారికి,
శుభ ప్రదం=శుభములు కలిగించు వాడును,
కు + ఉరగాయ= చెడ్డవాడయిన ఉరగమునకు {కాళీయునకు} ,త్రాసం=కష్టమును,
కృత= కలిగించిన వాడును,
గవాం= గోవులను,
పాలన+ఇతి= పరి పాలించుట యనిన,
ప్రియం= యిష్టము గల వాడును అగు,
అం= విష్ణువునకు,
వందే= నమస్కరించు చున్నాను.


తాత్పర్యాన్ని చూచినట్లయితే " బలి చక్రవర్తికి శత్రువూ,, తనను గూర్చి చింతించు వారికి శుభము లిచ్చువాడునూ,దుష్టుడయిన కాళీయునకు కష్టమును కలిగించిన వాడును , గోవులను పరిపాలించుటయందు ఇష్టం గల వాడును అగు విష్ణువునకు నమస్కరించుచున్నాను.
గమనించారు కదా! మీకు తెలిసిన క్రొత్త విషయాలతో వచ్చి మాకు, మా బ్లాగు ద్వారా పాఠకులకు ఆనందాన్ని పంచండి.

జైహింద్.

14, అక్టోబర్ 2008, మంగళవారం

తాతా! అన్నందుకేనట బాధంతా.

0 comments

తాతా! అన్నందుకేనట బాధంతా.

సామాన్య మానవుడు మనిషిగా, సత్ సాంగత్యం వల్ల , సద్గ్రంథ పఠనం వల్ల మనీషిగా ,అతడు కృషి చేసి ఋషిగా, కఠోర దీక్ష వల్ల మహర్షిగా పరిణతి చెందుతాడు. ఐతే ఒక్కొక్క సారి మానవుడు ఆశాపాశ బద్ధుడై సంచరిస్తూ దురహంకారంతో విర్రవీగుతుంటాడు. ఈ క్రమంలో తనమనసుతో పాటు వయస్సుని కూడా మభ్యపెట్టుతుంటాడు. తాను నిత్య యౌవనుడినని అనుకొంటుంటాడు. ఎవరి పలకరింపులోనైనా తన పెరిగిన వయసు స్ఫృశింప బడితేమాత్రం తట్టుకోలేడు.
ఈ విషయాన్నే సూచిస్తూ ఒక చమత్కారంతో కూడిన చాటువు వుంది. మీరూ గమనించండి.

శ్లో:-
ఆపాండురాశ్శిరజాః, త్రివళీ కపోలే
దంతావళీ విగళితో నచ మే విషాదః.
ఏణీదృశో యువతయః పథి మాం విలోక్య
తాతేతి భాషణ పరాః ఖలు వజ్ర పాతః.


చూచారు కదండే? ఒక వ్యక్తి అంటున్న మాటలివి.అతని జుత్తు తెల్లగా అయిపోయినందుకు అతనికి బాధగా లేదట. చెక్కిళ్ళు ముడతలు పడినందుకూ బాధగా లేదట. పండ్లు వూడిపోయినందుకు కూడా అతనికి బాధగా లేదట. అతడు వెళ్ళిపోతూవుండగ మార్గ మధ్యలో కొందరు యువతులు అతనిని చూచి " తాతా " అని పిలిచారట. అంతే అతని మనస్సుకి ఆ మాట వజ్రపు దెబ్బలాగా తగిలిందని వాపోతున్నాడు. మీరూ విన్నారుకదా. ముసిలి తనం పైన పడినా అతని మనసు అంగీకరిచడం లేదు పాపం.అందుకే యుక్త వయసులోనున్న అమ్మాయిలు తాతా అని నడి బజారులో పిలిచేసరికి తట్టుకో లేక పోయాడు. మరి మీరేమంటారు?

జైహింద్.

13, అక్టోబర్ 2008, సోమవారం

ఆంద్ర పద్య కవితా సదస్సు. విశాఖ జిల్లా విభాగము

0 comments

ఆంధ్ర పద్య కవితా సదస్సు విశాఖ జిల్లా మాసే మాసే కవన విజయం
ప్రతీ ఆంగ్ల మాసం ౨వ ఆది వారం జరుపుకొనే కార్యక్రమంలో భాగంగా నిన్న అనకాపల్లిలో విజయా రెసిడెన్సీలో కవి పండిత గోష్టి జరిగింది. జిల్లా అధ్యక్షులు శ్రీ కే. కోటారావుసభాధ్యక్షులు కాగా డాక్టర్ మిడుసుమిల్లి వెంకటేశ్వరరావు కవుల స్వీయ కవితా గానం నిర్వహించారు.దీపావళి అనే అంశం మీద కవులు వారి వారి కవితలు వినిపించారు.శ్రీ యుతులు బద్ది నాగేశ్వర రావు, భమిడిపాటి ప్రసాద రావు, యివటూరి పార్వతీశం, శ్రీమతి గాయత్రి, డాక్టర్ యల్లెస్వైవి శర్మ, డాక్టర్ రామ చంద్ర రావు,వర లోచన శ్రీరామ మూర్తి, చింతా రామ కృష్ణా రావు, మున్నగు వారి స్వీయ కవితా గానాలతో దీపావళి సాక్షాత్కరించింది.
ఈ కార్యక్రమం రిటైర్డ్ యింజనీర్ శ్రీ జి.యస్.ఆర్. శేషగిరి రావుగారి ఆర్ధిక సహాయంతో నిర్వహంపబడింది. ఒక ముఖ్య విషయం యేమిటంటే కవి వతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి " " కవి సామ్రాట్ విశ్వనాధ - భావుకత " " అనే అంశంపై అమృత ప్రవాహం లాగా సాగిన ప్రసంగం.
కిష్కింధా కాండలో సీతాన్వేషణ చేయుచున్నాడు రాముడు.అక్కడ పంపా తీరాన గల ప్రకృతి సౌందర్యం వర్ణనలో విస్వనాధుని ప్రత్ర్యేకతను చాటే పద్యాలలో కవిప్రయోగించిన ఛందస్సులలో కనబరిచిన ఔచిత్యం, దళ సార్ధక్యం, వర్ణనలో అంతర్ లీనమై సాగుతున్న కథకు సంబంధించిన యదార్థ వృత్తాంతం, ధ్వని గాంభీర్యం, మున్నగు అంశాలు సోదాహరణంగా వివరించారు. విశనాధవారే ఆ వుపన్యాసం వింటే నిజంగా తాను ప్రయత్న పూర్వకంగా అంతటి అర్థ గాంభీర్యాని వుంచానా! అని ఆశ్చర్యపోయి వుండేవారు. ఆ వుపన్యాసం అంత బాగుంది.
అవకాశం కుదిరినప్పుడు తప్పకుండా ఆఉపన్యాసాన్ని సోదాహరణంగా మీకందించగలను.
నమస్తే.




....

9, అక్టోబర్ 2008, గురువారం

" ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ పూర్వ జన్మ తపః ఫలం "

2 comments

" ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ పూర్వ జన్మ తపః ఫలం "
ఈ మాటలెంత యదార్థము! ఆంధ్రుడై పుట్టిన ప్రతీ వానికీ జన్మతః ప్రాప్తించే వారసత్వ సంపద " అమృతోపమానమైన ఆంధ్ర వాఙ్మయము".
సీ:-అమృతోపమానమై యలరారు చున్నట్టి - యసదృశ భాష యీ యాంధ్ర భాష.
అనితర సాధ్యమౌ సునిశిత పదయుక్తి - నద్భుత భాష యీ యాంధ్ర భాష.
అమర భాషకు లేని యవాధాన ప్రక్రియ - నలరార దొడగెనీ యాంధ్ర భాష.
ఆంధ్ర కావ్యామృత మందించె కవివరుల్ - హాయి గొల్పెడు దాన నాంధ్రభాష.
గీ:-చదువ నెంచిన యాంధ్రమ్మె చదివి చూడు
డెంద మానంద సందోహ మందు నిజము.
సుందరమ్మైన భావాల సొగసు జూడ
యాంధ్ర భాషకు మించెడి దవని గలదె?
ఔనో కాదో మీరూ ఆలోచించండి.

పద్య విపంచి

0 comments

8, అక్టోబర్ 2008, బుధవారం

సమస్యా పూరణము కష్టమా?

0 comments

సమస్యా పూరణ కష్టమా ?

ప్రియ పాఠక మహాశయులారా! పఠనాభిలాషులారా! పద్య రచనాభిలాషులారా!
సమస్యా పూరణ మీకు ఒక సమస్యగా తోస్తోందా? ఉత్సాహాతిశయులకు తొందరలో అలాగనిపించినా, కొంచెం నిదానంగా ఆలోచిస్తే పూరణ చాలా సులభం అనిపించక మానదు.మీరేచూడండి.
చోడవరంలో అన్నమాచార్య సంగీతపీఠంలో నాకు సత్కారం ఏర్పాటు చేసి ఆ సందర్భంలో కార్యదర్శి రామయ్యరెడ్డి నాకొక సమస్య పూరించమని యిచ్చారు. చూడండి.
" అన్నను గూడె చెల్లి తన యందము లార్చుచు హాయినొందగాన్."
చూచారుగా సమస్య యెలాంటిదిచ్చారో.
ఈ సమస్యను చూచి నేను ఖంగారు పడతాననుకొన్నారందరూ.సత్కరిస్తున్నప్పుడు అలా యిరకాటంలో పెట్టకూడదని అతనిని వారించబోయారు. ఐతే నేను " ఇదీ ఒక సమస్యేనా? అని అనే సరికి అందరూ కూడా యే రకంగా పూరిస్తానో అని చాలా ఆసక్తితో చూడసాగారు. నిజానికి నాకూ చాలా ఖంగారు పుట్టిన మాట వాస్తవం. ఐతే నాలో ఖంగారు బైట పడ కుండా కొంచెం మాటలలో పెట్టి ఆలోచించే సరికి ఆ శారదాంబ కటాక్షించింది . వ్రాసుకోమని యిలా చెప్పుట ప్రారంభించాను. అతడు వ్రాస్తున్నాడు.సునాయాసంగా పూరించినట్లు వారు గమనించేలా చేయగలిగాను.ఆ పూరణ చూడండి.
ఉ:-అన్నయు తమ్ముడున్ కలిసి యత్త కుమార్తెల నక్క చెల్లెలన్
తిన్నగ పెండ్లి యాడిరయ. తీరుగ నందరు మెచ్చనక్క తా
నన్నను గూడె. చెల్లి తన యందములార్చుచు హాయినొందగా
నన్నుల మిన్నయై తనరె, యాతని తమ్ముని గూడి . నిక్కమే.
చూచారా ఎలా పూరింప బడిందో. పూరణ కొరకు యిచ్చిన సమస్యని ఏకంగా మనం చూడకూడదు. పదాలు వేటికి వాటిని విడిగా చూసి దానికి అనుకూలమయే విధంగా ఆలోచిస్తే పూరణ అంత కష్టమేమీ కాదని మీరే గ్రహించగలరు. మిడి మిడి జ్ఞానినయిన నేనే పూరించగలిగినప్పుడు మీరు పూరించ లేకపోవడమేమిటి? మీరూ ప్రయత్నించి చూడండి. శుభమస్తు.
నమస్తే
చింతా రామ కృష్ణా రావు.

అమ్మా జగజ్జననీ!

0 comments

శ్లోకము:-
యాదేవీ సర్వ భూతేషు
శక్తి రూపేణ సంస్థితః
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః.

పద్మనాభ:-
అమ్మా! సదా నీ మహా తేజమున్ నీ బృహద్ రూపమున్ గాంచ గాసాధ్యమౌనా
సమ్మాన్యతన్ నీదు సద్ రూపు వర్ణించు సద్ బుద్ధి మాకిచ్చి రక్షించు మమ్మా!
సమ్మౌనులే నీ లసద్ రూపు వర్ణించె, సాక్షాత్తు శ్రీ జ్ఞాన సంపన్నులైరే?
సమ్మోదమున్నాకు సద్ జ్ఞానమున్ గొల్పి, సాక్షాత్కరింపంగదే శంభు రాణీ!

తోటకము:-
మహిషాసురు డే గన మాన్యుడుగా
మహిమాన్విత! నిన్ గనె. మాన్యతతో.
మహిషాసుర మర్దిని ! మమ్ము గృపన్
మహిమన్ గని, పాపము మాపగదే!

శార్దూలము:-
దేవీ నీ మహనీయ భావ గరిమన్ దేదీప్యమనంబుగా
భావించున్ నిను సజ్జనాళి మదులన్. ప్రఖ్యాతమైనట్టి నీ
భావంబే మము గాచునమ్మ! కరుణన్ భాస్వంతమై మామదిన్
నీవే నిల్చిన చాలునమ్మ. యిలపై నీకన్న లేరెవ్వరున్.
చింతా రామ కృష్ణా రావు

5, అక్టోబర్ 2008, ఆదివారం

అంతర్జాల భువన విజయం

2 comments

ప్రియ సాహితీ బంధువులారా! అంతర్ జాల భువన విజయము నిర్వహణలో కృతకృత్యులయినందుకు మీ అందరికీ నా అభినందనలు.నిర్వహణ దీక్షా దక్షులయిన రాయల వారికి కూడా కృతకృత్యులయినందుకు నా హృదయ పూర్వక అభినందనలు. మీరంతా నాపద్యాలకు చక్కని వ్యాఖ్యానం చేసి ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు.
సీ:-కృష్ణ రాయలు పద్య తృష్ణ తోడ కవుల - నష్టా దశా2ధిక మలర నుంచి,
భువన మంతయు సభా భవన మట్టుల జేసి - పెద్దనాదులు తమ ప్రతిభ జూప
పద్యము లెన్నియో హృద్యమౌ రీతిలో - పలుకు నట్టుల జేసి, వెలయ జేసి
భువన విజయమును కవన విజయమన - కవులకు సన్నుతి కలుగ జేసి.
గీ:-ఆంధ్ర సాహితీ వేత్తలు హర్ష మునను - పొంగ, భువన మంతర్జాల భువనవిజయ
కవుల కల్పనా పటిమను కాంక్ష తోడ - చూడ, జేసిరి . తానె మన తోడ నుండి.

చ:- కవులను కోరుచుంటి. తమ కమ్మని సత్ కవితా ప్రవాహమున్
భువిని ప్రశస్థమౌనటుల ముచ్చటతో ప్రవహింప జేయుచున్
భువనమె కృష్ణ రాయకవి పుణ్య ప్రదంబగు కొల్వుగా, సభా
భవనమునమునందు సత్ కవిగ పన్నుగ మీరు రహింప. నెల్లెడన్.
సజ్జన విధేయుడు
చింతా రామ కృష్ణా రావు.
{ ఆంధ్రామృతం బ్లాగ్}