గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 59వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

59. ఓం విశ్వంభరాయ నమః

తోదక వృత్త గర్భ సీసము.

నిరుపమ! నరహరి! నిల్చితె నామది - నిత్యాత్మవై నిలు. నిలుపు నన్ను.

మహితుఁడా! పరహిత మార్గము భద్రత - నిమ్మా! కృపం జూపు నెమ్మితోడ.

వినుతాత్మ! పరిణతి వేడుదు భవ్యుఁడ! - ముక్తిన్ మహా భక్తి పూర్వకముఁగ.

నిన్ గొల్తు, సిరిపతి నీవికఁ జేకొను - మయ్యా నృసింహా! మహానుభావ.

గీ. శ్రీశ! తోదక గర్భ సత్సీస వాస! - వినుత *విశ్వంభరా*! నాదు ఘనత నీవె.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

59 సీస గర్భస్థ తోదకము. ( .. యతి 8)

నరహరి! నిల్చితె నామది, నిత్యా! - పరహిత మార్గము భద్రతనిమ్మా!

పరిణతి వేడుదు భవ్యుఁడ! ముక్తిన్ - సిరిపతి నీవికఁ జేకొనుమయ్యా!  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సాటిలేనివాడా! నా మదిలో నిలిచితివా, నిత్యాత్మవై నిలిచి,

నన్ను నిలుపుము. పరహితమార్గమును ఇచ్చుచు నాకు భద్రతను ప్రసాదించుము.నన్ను కృపతో చూడుము. వినుతాత్మా!

నా విజ్ఞానమునకు పరిణతిని, నాకు ముక్తిని కల్పించుమని భక్తిగ నిన్ను ప్రార్థించుచున్నాను.. శ్రీపతీ! నిన్ను

ఆరాధింతును. మహానుభావా నీవు నన్నింక చేకొనుము..తోదక వృత్తగర్భ సీసస్థుఁడవైన శ్రీశా! విశ్వంభరా! నాకు

సంప్రాప్తమగుచున్న కీర్తి యనునదున్నచో అది నీవే సుమా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.