గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఏప్రిల్ 2012, సోమవారం

విజయ భావన (విజయనగరం) 388 వ సభ - "కవితా చమత్కృతి"

8 comments

జై శ్రీరామ్.
సాహితీ ప్రియ బంధువులారా! ఆత్మీయులు, అభిమానులు, సాహితీ ప్రియులు, అవకాశమున్న వారు విజయ భావన సాహితీ సభకు వచ్చి ప్రోత్సాహ కారకులవగలరని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని గూర్చిన వివరాలు ఈ ఆహ్వాన పత్రం ద్వారా మీ ముందుంచుతున్నాను. 
నమస్తే.
జైహింద్.

17, ఏప్రిల్ 2012, మంగళవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 7 / 14

0 comments

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
వః-
అటులననివారిత మోహావేశముఁజూపి, తాను ౩౧.
అటుల అనివారిత మోహావేశముఁజూపి, తాను ఆ వసు రాజు,
కః-
ఎంత తపోధనులగుచున్ - సంతతముఁ జరించినను యశం బలవడునే
కాంత ననురూప లసితం - గాంతగఁ గైకొనక దూరఁగా నెవ్వరికిన్. ౩౨.
ఎంత(మిక్కిలి)తపోధనులగుచును, ఎల్లప్పుడును చరించినను, ఎవ్వరికినైనను అనురూప(తగిన రూపము కలది) లసిత(ప్రకాశించునది)యు నైన, కాంతను, గైకొనక, దూరఁగా(తిరస్కరించినచో) యశంబు అలవడునా? 
వః-
అనిన విని, ౩౩.
ఆ విధముగ రాజు పలుకగా విని, 
గీః-
నేన యతి మార్గమును బూని నియత వృత్తి - నాకె యుండిన గృహమున కేకతంబు
గాఁగఁ జనియెద సంతోష గరిమ మెఱయ - ననుచు శుచి వేడి చనిన నయ్యతివ యంత. ౩౪.
నేన యతి మార్గమును బూని, నియత వృత్తిని(దైవ వర్తనుఁడనై) ఆకె(ఆచిన్నది) ఉండిన గృహమునకు ఏకతంబు కాఁగ, సంతోష గరిమ మెఱయ, చనియెద. అనుచు శుచియైన ఆ మంత్రి రాజుగారి అనుమతి వేడి, చనగా, అయ్యతివ అంతట,
గీః-
ప్రియ సఖులతోడ మిక్కిలి ప్రేమ మీఱ - నతనిఁ గనుఁగొనఁ జని కనకాసన మర
గతిని గొనివెట్ట, వసియింపఁ గని ప్రియాళి - తోడ సేవింపఁ, గొనినట్టు గూడఁ జేసి. ౩౫. 
ప్రియ సఖుల తోడ మిక్కిలి ప్రేమ మీఱగా ఆ వసురాజును కనుగొనుటకుచని, కనక ఆసనముఅరగతిని కొని పెట్ట(తెచ్చి యుంచగా)దానిపై ఆముని కూర్చుండగా,  కని, ప్రియాళి తోడ సేవింప అతడు  కొనినట్టు(స్వీకరించినట్టు కూడ(వెంటనే) జేసి(నటించి), 
(సశేషం)
జైహింద్.

16, ఏప్రిల్ 2012, సోమవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 6 / 14

0 comments

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
కః-
మును వచ్చిన దారిని - నే - వినుత చరిత! చనఁగ వచ్చు, వేఱె యొరులు దా
రిని చూప వలెనె? పోవం - గను జూపెద, నంటి వచ్చి కనుఁగొనెదు గదా! ౨౬.
నే మును వచ్చిన దారిని చనగ వచ్చును. వినుత చరితుఁడా! వేఱె ఒరులు దారి చూప వలెనా? పోవంగను చూపెదను. అంటి వచ్చి, నీవే రా కనుగొనెదు కదా!అని వసువుతో నర్మ సచివుఁడు పలికెను.
గీః-
అనుచుఁ దా వరూధిని నిల్వ నతని "ననఘ! - కొంత తడవోపి యుండినఁ గుతుక మొప్ప
నశ్రమంబున నేఁగంగ నగును గాదె?" - యంచుఁ గోరఁగ బోవఁగా నెంచి యతఁడు. ౨౭.
అని పలుకుచు, ఆ నర్మ సచివుఁడు వరూధిని (సేన అంతయు) నిల్వ (ఆగిపోఁ) గా,  అతనిని (ఆ వసువును) అనఘ! కొంత తడవు ఓపి యుండిన కుతుకమొప్ప ఆశ్రమంబునకు ఏగంగనగును కదా! అంచు కోరఁగా అతఁడు(ఆ వసురాజు) పోవగా నెంచి,.....
గీః-
పోవలయు వేగ, నా యింటి పువ్వుబోడిఁ - జూడవలె, నిత్య కృత్యముల్ చొప్పు దప్పి,
యుండె, నా మది దానిపై నొనర - నెపుడు  -  గాంతునని హిత! కార్య సంహటన కొఱకు. ౨౮.
ఓ హిత!(స్నేహితుఁడా)! వేగన్ పో వలయు, ఆ ఇంటి పువ్వుఁ బోడిని చూడ వలెను. నా మది దానిపైన ఒనర(ఒప్పి యుండ)గా, నిత్య కృత్యములు చొప్పు(క్రమము) తప్పి,  కార్య సంఘటన కొఱకు ఎప్పుడు కాంతును? అని ఉండెను. 
కః-
అన, నను గూడఁగ నీకున్ - గననగు సౌఖ్యంబటంచుఁ గైకొని యాలిం
గన మును జేయఁదగ, దనియుఁ - జను పొమ్మని గెంటని హిత సంభ్రమ మొలయన్. ౨౯.
అని వసు రాజు అనగా, (నర్మ సచివుఁడు) నను కూడఁగ(నన్ను అనుసరించి) వచ్చినచో, ఓ రాజా నీకు సౌఖ్యంబు కన నగును. అటంచు (అనుచు) కైకొని (పూని), ఆలిని(కాంతను) తగు విధముగ కనునట్లు చేయగా, తనియును.  చను(ఇది చేయనొప్పును) పొమ్మని, గెంటని(తొలగింప సాధ్యము కానిదగు) హిత  (మిత్రుని యొక్క)  సంభ్రమము ఒలయగా(ప్రకాశింపగా).......
గీః-
పిలిచికొని పోయి చూపినఁ బ్రేమ మీఱ - నంగనను పెద్ద సేయఁగ నాత్మ - మాటు
సేసి కనుఁ బురుషవరుండు చిత్తమలరఁ - గా మముల నువిదల మించు కామ మున్నె! ౩౦.
పిలిచి, కొనిపోయి, ఆకన్యను చూపిన, ప్రేమ మీఱ ఆత్మ యందు ఆ అంగనను పెద్ద సేయగను(గౌరవించుటకై) మాటు సేసి (చాటున ఉండి) పురుష వరుండగు  వసురాజు చిత్తము అలరునట్లు చూచును. కామము లన్నింటను ఉవిదలకు మించిన కామము ఉన్నె?
(సశేషం)
జైహింద్.

15, ఏప్రిల్ 2012, ఆదివారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 5 / 14

0 comments

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
వః-
అంతఁ జని దానిం గనుంగొనుమన మున. ౨౧.
అంతట ఆ వసురాజు ఆ పాట యొక్క సంగతిని కనుఁగొనుము అనగానేసచివుఁడు మునుగా చని,......
చః-
కనె నవరత్న భాసితముఁ, గాంచన శోభిత, మార ఘట్ల మం
డన కదళీ వనాంతము, ఘన స్వన బంభరవా సిత ప్రఫు
ల్ల నవ సుమాతిగంధి మృదులచ్ఛదరాజి లతా ప్రతాన నీ
కనదురు కాయమాన పరి కల్పిత శీత మనోజ్ఞ హర్మ్యముల్. ౨౨.
నవరత్న భాసితము, కాంచన శోభితము, ఆరఘట్ట(ఏతము) మండన(అలంకారముగాఁగల) కదళీ వనాంతమున, ఘన స్వననమిక్కిలి రొద చేయుచున్న)   బంభర(తుమ్మెదలకు, వాసిత(నివాస యోగ్యమై యున్న)  ప్రఫుల్ల(చక్కగా వికసించిన) నవ సుమ(ములయొక్క), అతి గంధ(గొప్ప సువాసన చేత) మృదుల ఛద రాజి(లేత యాకు జొంపము చేత), లతా ప్రతాననీ(అల్లుకొనిన తీగల గుబురుల చేత), కనత్(విలసిల్లుచున్న) ఉరు(విశాలమైన) కాయమాన(పందిళ్ళచే)పరికల్పితమైనశీత మనోజ్ఞ హర్మ్యమును కనెను.   
కః-
కనుఁగొని హర్మ్యోపాంతం - బునకుం జని లోనికేఁగఁ బొలఁతి యొకతె వీ
ణను బూని కంఠ నాదం - బును మేళము సేసి గానము సలుపఁ జూచెన్. ౨౩.
ఈ విధముగ నర్మసచివుఁడు కనుఁగొని, హర్మ్యోపాంతమునకు చని, లోనికి ఏగఁగా, పొలతి యొకతె వీణను పూని, కంఠ నాదంబును వీణా నాదముతో మేళన చేసి, గానము సలుపు చుండగా చూచెను. 
ఆః-
అంత నాకె యంద మారసి వేవేగ - వచ్చి విభుని చాయ భావమంచు,
మెచ్చి మనుజ వర్య! మీర లేలిన నన్ను - మిన్న యంచు జనము నెన్నకుంద్రె? ౨౪.
అంతట ఆకె (ఆచిన్నదాని యొక్క) అందము ఆరసి, వేవేగ (రాజు కడకు) వచ్చి, తన భావము నందు మెచ్చి, విభుని చాయను (వసురాజు చెంగట) మనుజ వర్య! మీరలు ఈమెను పరిణయమాడి ఏలినచో ఆమెను అన్నుల మిన్న యంచు జనులెన్నకుందురా? అనెను.
కః-
అనిన నేకతంబుగను వనంబున నీవు - వచ్చి యుంటివ! బల!! యిచ్చటికిని
దారిఁదప్పిపోక నేరక యుంటి, మా - ర్గమ్ముఁ జూపుమన్న నెమ్మి ద్విజుఁడు. ౨౫.
సచివుఁడు ఆ విధముగా అనగా, ద్విజుఁడు(క్షత్రియుఁడైన వసురాజు) నీవు వనంబునందు ఏకతంబుగను,  ఇచ్చటికిని వచ్చియుంటివా! బల!(భళీ)దారి తప్పి, పోక(పోవుట)యనునది, నేరకఉంటివి.నెమ్మి మార్గమ్మును చూపుము.అని అనగా.

(సశేషం)
జైహింద్.

14, ఏప్రిల్ 2012, శనివారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 4 / 14

0 comments

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
ఆః-
అతని రాకఁ జూచి, హర్షంబుతో నెదు - రేగి, గౌరవింప నెంచి తోడి
తెచ్చి యిష్ట వస్తు దృప్తిని దేలించి - మెలఁగు నా సమీర మెలసి యంత.౧౬
అంత అత (ఆ వసంతు) ని రాకఁ జూచి, గౌరవింప (ఋతు శోభను వృద్ధి చేయ) నెంచి, హర్షంబుతో నెదురేగి, తోడి తెచ్చి, ఇష్ట  (సుగంధాది)  వస్తు(వులచే) తృప్తినిఁ దేలించి, ఎలసి(ప్రవర్తించి) ఆ సమీర (మలయ మారుత) ము మెలఁగును. 
గీః-
చెలఁగ నీ రెందుఁ బోవుచు క్షితిని నిందు - రాక యయ్యెను సిద్ధ మహా కుతుకము,
తీర్థములఁ జూచు వేడుక దీర్ఘమయ్యె. - ననఁ బసరు పూసెనంతట ఘనము గాఁగ . ౧౭.
ఎందు ఐనను నీరు ఇంకి పోవుచు (ఉన్నందున), క్షితిని ఇందు(ని)రాక సిద్ధ(చేకూర్చిన)  మహా కుతుకము(గొప్ప సంతోషముకలది)అయ్యెను.(నిర్జలము వలన కలిగిన తాపమును చంద్రాగమనము తీర్చి భూమిని సంటోష పెట్టు చున్నది) తీర్థ (ఉదక) ములఁ జూచు వేడుక(కోరిక)దీర్ఘ్మయ్యెను.అంతటను ఘనము గాఁగ ననన్ (చిగురు తాకుల యొక్క) బసరు(పచ్చ దనము)  పూసెను, (పొటమరించెను.)
గీః-
వేఁడి వేలుపు మహిమంబు విపులమైన - హిమ నగము పాద లేపనముమిషగాఁగఁ
జేరె సంతోషమున మంచు, చేతఁ బాసి - యొండు చోటికిఁ బోలేక యుండు నచట. ౧౮.
వేడి వేలుపు అయిన సూర్యుని యొక్క ప్రభ విస్తారము కాగా, మంచు తన చేతనమును  పాసి,ఒండు(మరియొక)  చోటికి పోలేక, పాద (ప్రత్యంత పర్వతముల యందు) లేపనముకొండకు పులుముకొని వ్యాపించుత యను మిష, కాగా కుతూహలముతో హిమ నగమును చేరెను.అచట నుండును.
మః-
పువులం బండ్లను, బల్లవంబులను నొప్పుల్ గుల్కి రంజిల్లఁగాఁ
దవు తీవల్ పొదలున్ దరుల్ బహుళమై దౌదౌల నేత్రోత్సవం
బవుచున్, దేటులుఁ జిల్కులున్ బికము లాహ్లాదంబుగా నంతటన్
రవళిన్ బల్కులఁ గూతలం జెవులకున్ రమ్యంబు గావింపఁగన్.౧౯.
అంతటను ఆహ్లాదంబుగా తవు (ఒప్పిదమైన) తీవలు, పొదలు, తరులు, పూవుల చేతను, పండ్ల చేతను, పల్లవంబుల చేతనుఒప్పులు గులుకుచు, బహుళమై దౌదౌల(సమీపప్రదేశములలో)నేత్రోత్సవము అవుచు,రంజిల్లగా, తేటులు, చిల్కలు, పికములు, రవళులు, పల్కులు, కూతలతో, చెవులకు రమ్యము గావింపగా.....
గీః-
అటవి రక్షక చిత్తుఁడై యతఁడు తేరు - కొని కడుం ద్రిమ్మరుచుఁ జెంత గొనబు మీఱు
పాట నొప్పెడు కోనను బాఱఁ జూచి - తన ప్రధాన వర హృదయ మనుగమింప.౨౦.
ఆ వసురాజు తేరు  (రథము) కొని (గ్రహించి) అటవిని రక్షించ వలెననేది చిత్తము కలవాఁడై, కడు మిక్కిలి) త్రిమ్మరు (తిరుగు) చు, ఆ చెంతనే గొనబు (సౌందర్యము) మీఱు (అతిశయించు) పాటతో నొప్పెడు కోనను బాఱఁ జూచి, తన ప్రథాన (సచివుని) వర (శ్రేష్టమైన) హృదయమును అనుగమింపగా....
(సశేషం)
జైహింద్

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 3 / 14

0 comments

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శిక్తిమతిని అడ్డగించుట.
వః-
ఆ ద్విజ రాజ వంశజుఁడు దిగంతములఁ గను కీర్తిఁ గల్గి యుండునంత. ౧౧.
ఆద్విజ రాజ (చంద్ర) వంశజుఁడైన వసు రాజు దిగంత వ్యాప్త కీర్తుఁడై యుండగా,
గీః-
అమర నాథానుమతి స్వస్థలమున కొకట -వచ్చి యుండినఁ బల్వురు పాక శాస
నత్వమునఁ బవిత్రప సదనమునఁ బొగడ - నాతి మోదానఁ బతి వసు నేతఁ గనును. ౧౨.
అమర నాథానుమతిచే స్వ(ర్గ)స్థలమునకు ఒకపర్యాయము వసురాజు వచ్చి యుండగా పల్వురు పాకశాసనత్వము (ఇంద్రపదవి)కారణముగా ఇంద్ర సదనమున పొగడగా, పవి (వజ్రాయుధము) వలని త్రప (సిగ్గుచే) ఆతి మోదాన (తగ్గిన సంతోషముతో) వసునేతను  గనును.
కః-
అతఁడీ విధమున నభ్యా - గత సేవాభిరతిఁ గొంత కాలము భాగ్యో
న్నతి నుండు నంత నభ్యా- గత వేళం గౌతుకంబు గడలు కొనంగన్. ౧౩.
అతఁడు (వసురాజు) ఈ విధమున అభ్యాగత సేవాభిరతిచే కొంత కాలము భాగ్యోన్నతి నుండగా, అభ్యాగత (రాబోయే) వేళలో కౌతుకము కడలు కొనగా,
సీ:-
ఎఱ్ఱని జటలతో నెసఁగు జొంపము గల - వి లసితమగు క మండలువు తోడ,
భస్మ గర్భామోద బంధుర రుద్రాక్ష - మాలికా సత్ కదంబముల తోడఁ
దళతళ ద్యుతులతో దళమెత్తు పోల్కి నెం - తయు వన్నె గల మృదు త్వక్కు తోడ,
నందమై కొనసాగు యర్జునంబున నొప్పు - కమనీయ మౌ తిలకంబు తోడ,
గీః-
ఎంతయును జెన్ను మీఱి వసంతుఁడనఁగఁ - బరగు నౌషధ సిద్ధుండు ప్రజల కెల్ల
నయన పర్వంబుగా మహోన్నతిని గాంచి - మించి యతని కొలమున కేతెంచె నొకట. ౧౪.
(వసంత ఋతువర్ణనము.)
ఎఱ్ఱని జట (ఊడ) లతో, ఎసగు (ఒప్పెడు) జొంపము (చివురు) గలిగిన, వి (పక్షులచే) లసిత (ప్రకాశమాన) మగు కమండలువు (జువ్విచెట్టు) తోడ, భస్మగర్భ (ఇరుగుడు చెట్టు) తోను, ఆమోద (పరిమళముతోఁగూడిన) బంధుర (మనోహర) మైన రుద్రాక్ష మాలికలతోను, సత్ కదంబ వృక్షముల తోడను, 
తళతళ ద్యుతులతోదళమెత్తు (చివురులెత్తు) టకు పోల్కిని, ఎంతయు వన్నె గలిగిన, మృదు త్వక్కు (భుజపత్రపు చెట్టు) తోడను, 
అందమై కొనసా (ఎది) గి, అర్జునంబు (ఏరు మద్ది చెట్టు) న, ఒప్పుచున్న ఎంతయు చెన్ను మీఱి, ఒకట (ఒక్క సారిగా) ప్రజలకెల్ల నయన పర్వంబుగావసంతుఁడనగఁ బరగు సమస్త అఒషద్గములను సిద్ధింపఁ జేసిన వాఁడగు వసంతుఁడుమహోన్నతిని గాంచి (అతిశయించి) మించి పోవుచు అతని (ఆ వసురాజు యొక్క) కుల (జనపద) మునకు, ఏతెంచెను.
వః-
ఇట్లుండునంత నతి బలాధికుండు.౧౫.
ఈ విధముగా వసంత ఋత్వు వచ్చి యుండగా, అతిబల(పవనుఁడు అను) అధికుఁడు,
(సశేషం)

జైహింద్.

12, ఏప్రిల్ 2012, గురువారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 2 / 14

0 comments

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శిక్తిమతిని అడ్డగించుట.
గీః-
అనఘ వర్తనఁ బరమ వంశావతంస - మగుచు నిచ్చలుఁ దగు ప్రవరాఖ్యుఁడైన
వసు విభుం డార్య నుత శతాధ్వర గృహీత - భవ్య లక్షణుఁడగుచు శోభను వహించు. ౬.
ప్ర వర ఆఖ్యుఁ (ప్రసిద్ధ నామము కలవా) డైన వసు విభుఁడు అనఘ (ప్ర)వర్తనచే పరమ (గొప్ప)వంశ అవతంసము(శ్రేష్టము) అగుచు నిచ్చలు(నిత్యము)నూ తగి యుండును.ఆర్యులచే పొనుతింపఁ బడిన భవ్యమైన లక్షణములు కలవాఁడగుచు, శోభను వహించును.
గీః-
అందమల పద్మ సంతతి నలవరించి - దివ్య గుణమణులందు శుక్తిమతి నాఁగఁ!
గర్మ పావన మూర్తియై ఘనత నొప్పు - నది విబుధ హర్షమై మహోన్నతిని గాంచు. ౭.
ఆ అధిష్ఠానపురమున్ అందు అమల పద్మ సంతతి(సముదాయము)తో అలవరించి(ఒప్పి), దివ్య (దైవ సంబంధ) గుణము గల మణులను అందు(కలుగు)శుక్తిమతి నాఁగన్(అనఁబడెడి పేరుతో), కర్మప (కర్మాధికారులను) అవన (రక్షించునట్టి) మూర్తి (ఆకృతి కలది) యై ఘనతను, ఒప్పు,  నది విబుధ హర్ష(యోగ్య)మై మహోన్నతిని గాంచును.     
గీః-
ఆత్మ భార్యానురాగుఁడై యవ్వ, సుప్ర - భుండు నాయన మిత మతిఁ బొరసి యుండ,
ఘన సమితిఁ బొంగు గాంచుచు ఘనత నెసఁగఁ - బారువాఁడెంత వాఁడైన వరలఁ గలఁడు? ౮.
ఆత్మభా (తన కాంతి) చేత ఆర్యులయెడ అనురాగము కలవాఁడై, ఆ వసు ప్రభుండు నాయ (నీతి చేత), నమిత (నమ్రమైన) బుద్ధిని, పొరసి (పొంది) యుండఁగా, ఘన సమితి (గొప్ప రణము) నందు పొంగుఁగాంచుచు (గర్వించుచు)ఘనతను ఎసగగా (గర్వముననొప్పఁగా) ఎంత (గొప్పబలము కల) వాఁడైనను పాఱు (పఱుగిడు) వాడు అగును.వఱలఁ (ప్రకాశించ) గలఁడా?
వః-
ఆ ప్రవరాఖ్యుండగు వసురాజు. ౯.
ఆ ప్రసిద్ధ నామము గల వసు రాజు,
గీః-
పాడి పంటలఁ దనరు జీవనము గల్గి - యింబడర, ఘన కోలాహలంబు పెఱిగి,
పైనఁ బడి శుక్తిమతి నాగ, దాని పని మ - దిని దలఁచి సచ్చరణ భవ ఘనత నెట్టె. ౧౦.
సమస్తమైన పంటలను ఫలింపఁ జేయుట యందు తనరుచున్నజీ(జీవనాధారమైన)వనము(నీరు)కలిగి, ఇంబు (చక్కదనముతో)అడరు (ఒప్పు) చుండగా , శుక్తిమతీ నదిని,ఘనమైన కోలాహల పర్వతము పెఱిగి, పైనఁ బడి అగన్ (ఆగిపోవు విధముగ) అడ్డగింపగా, దాని (ఆ కోలాహలుని) పనిని మదిఁదలచి, సత్ (యోగ్యమైన) చరణభవము (గోటి) యొక్క ఘనత చేత పాడియని భావించి, నెట్టెను.ఇది 2 / 14 వ భాగము .(సశేషం)
జైహింద్.

11, ఏప్రిల్ 2012, బుధవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 1 / 14

2 comments

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శిక్తిమతిని అడ్డగించుట.
ఆః-
ఆట పట్టు సిరికి న్యాయంబునకు, నధి - ష్ఠాన మనఁగ దనరి సౌధ వినిహి
తాబ్జ రాగ కాంతి నరుణాస్పదంబనఁ - బురము దనరు లోక భూషణంబు. ౧.
సిరికి, న్యాయమునకు, ఆటపట్టై, సౌధము లందు వినిహితమైన ( తాపఁబడిన) అబ్జ (పద్మ) రాగమణుల యొక్కకాంతిచే అరుణ కాంతికి ఆస్పదము అను విధముగా  తనరి యుండి, లోకము లన్నింటికీ భూషణమై అధిష్ఠానము అను పేరు గల పురము తనరుచుండెను. 
చః-
పురి ద్విజ కోటి ధాత, నృప పుంగవు లర్జును, వైశ్య పాళి కి
న్నరవరు, నంఘ్రిజుల్ హలిని, నట్టువకత్తెలు రంభ, నాగముల్
తురగములున్, మహీరుహతతుల్ సుర సింధుర సైంధవాద్రులన్
నిరతముఁ గ్రిందు సేయఁ దగు నేర్పున రంజిలు మంజు వైఖరిన్. ౨.
ఆ అధిష్ఠాన పురము నందలి ద్విజ కోటి ధాతను, నృప పుంగవులు అర్జునుని, వైశ్య పాళి కిన్నర వరులను, అంఘ్రిజులు హలి(బలరాము)నినట్టువ కత్తెలు రంభను, నాగములు, తురగములు, మహీరుహ తతులు - సుర సింధుర(ఐరావతము), సైంధ, అద్రులను (క్రమాలంకారము)నిరతమూ క్రిందు చేయుటకు తగిన నేర్పుతో, మంజు వైఖరితో రంజిలి యుండును. 
గీః-
పచ్చడాల్ పూని సకలార్థ భవ్య సాధ - నాత్మ పౌరుష వాగ్జాల మతిశయింప,
నతి ముదంబున వీర పండితు లనంగ - వెలయు చుందురు వీఁటఁ బ్రవీణులెపుడు. ౩.
ఆ అధిష్ఠానము అను వీఁటను ఎప్పుడూ పచ్చలు పొదగ బడిన డాలు ధరించి సకల అర్హముల భవ్యమైన సాధన వలన కలిగిన ఆత్మ పౌరుష వాగ్జాలము అతిశయించుచుండగా,  ప్రవీణులు వీర పండితులు అని అతి ముదంబున అనంగా (పలికేవిధముగా) యుద్ధ కుశలురు వెలయుచుందురు.
ఆః-
భూమి దేవుఁడందుఁ బొల్చును ప్రవరాఖ్య - నుపరిచరుడనంగ నొప్పి వసువు
న్యాయ రీతి మిగుల నార్జించిన ఘనుండు - తేజ మొప్పఁగ ద్విజ రాజ కులము. ౪.
ఆ అధిష్ఠాన పట్టణ మందు ప్ర-వర- ఆఖ్యన్ (మిక్కిలి శ్రేష్ఠమైన నామముతో) ఉపరిచరుఁడు (ఆకాశ గమనము కలవాఁడు) అనంగ, ఒప్పి, వసువు ద్విజ రాజ కులము (చంద్ర వంశము) తేజ మొప్పునట్లుగా న్యాయ రీతిలో మిక్కిలి ఆర్జించిన ఘనుఁడు.భూమిపై దేవుఁడు అను విధముగా ఒప్పును.
కః-
ఆర్యావర్తన రహితుఁ, డ - శీర్యత్సుగుణ ప్రవృత్తి, చేది వినుతుఁడై
ధైర్య గుణ మొప్ప నాతని - చర్యన్ వినుతింప వశమె! శత ధృతికైనన్. ౫.
ఆర్యుల యెడ అవర్తన రహితుఁడు, అశీర్యత్(తక్కువ కాని) సుగుణ ప్రవృత్తి కలవాఁడును, చేది దేశమున వినుతుఁడై, ధైర్య గుణముతో ఒప్పు ఆ వసు రాజు యొక్క చర్యను శరధృతి(బ్రహ్మ)కైనను వినుతింప వశమా! 

8, ఏప్రిల్ 2012, ఆదివారం

పండిత నేమానివారు ఆంధ్రీకరొంచిన శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రము

2 comments

జైశ్రీరామ్
శంకరు నవతారంబగు 
శంకర గురువర్యు దలతు సకలభయ వినా
శంకరు సర్వజ్ఞుని పద
పంకజముల గొలుతు జ్ఞాన వైభవ నిధులన్
శ్రీశ క్షీరాబ్ధివాస యోగీశ చక్రి
భోగివర భోగ మణి దీప్త పుణ్యమూర్తి
జన్మ వారిధి పోత శాశ్వత శరణ్య
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ  
కమలభవ శక్రముఖ దేవ గణ కిరీట
చయ విఘట్టిత పద సారసరుచిమంత
శ్రీరమా కుచసరసిజ శ్రీమరాళ
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ  
ఘోర సంసార జలధిలో క్రూర వక్ర
నక్ర దంష్ట్రలకున్ జిక్కి నలుగుచుంటి
వ్యగ్రుడను రాగ రసనోర్మి బాధితుడను
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ  
భవ మహా ఘోరవనమున పంచబాణ
దుష్ట మృగ బాధలొందు నార్తుడను దేవ
మత్సర నిదాఘమున నిట మాడుచుంటి
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ  
భవ గభీర కూపమ్మున బడితి దుఃఖ 
సర్పశత బాధలకిట వేసారుచుంటి
దీనుడను నన్ను బ్రోవుమా దేవ దేవ
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ  
ఘోర సంసార సింధుర కుటిల హస్త
ఘాత నిష్పిష్టితాంగుడ నైతి దేవ
ప్రాణభీతిని బాపుమా భయవినాశ
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ 
జన్మ సర్ప మహోగ్ర దంష్ట్రా కరాళ
గరళ దగ్ధాంగుడను నేను గరుడ వాహ
అమృతసాగరావాస దయాలవాల
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ 
భవమహా జాలమున జిక్కు వడితి నింద్రి
యములనెడు గాలమునకు నేనగుదు నెరగ
తలయు దౌడలు వ్రక్కలౌ దయతలంచి
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ 
భవము బీజమ్ము సంసార పాదపమున
కర్మములు బహుశాఖలు కాముడు విరి
ఫలము దుఃఖమా చెట్టెక్కి పడితి దేవ
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ 
అతుల భయద సంసార దావానలంపు
జ్వాలలకు నూరువుల దాక కాలె దేవ
శరణు నాకింక నీ పాద సరసి యొకటె
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ 
యమభటులు కంఠమునకు పాశమును వేసి 
లాగుచుండిన విధము దలంప గలమె
మృత్యుభయనాశ నిన్ను స్మరింతు నీశ
చేతిసాయము నీవె లక్ష్మీనృసింహ 
శ్రీమదిందిరాసేవిత శ్రీ పదాబ్జ
కరకమలముల శంఖచక్రములు నభయ
వరద ముద్రలు నలరునో భద్ర రూప
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ  
ప్రథిత ప్రహ్లాద నారద ప్రముఖ నైక
భాగవత భవ్య మానస పద్మవాస
భక్తజన పరిపాలన పారిజాత
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
అంధుడ హృతవివేక మహాధనుడను
దొంగలింద్రియములు నన్ను ద్రోసిరిందు
మోహకూపమ్మునన్ వ్యథల్ పొందుచుంటి
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ
శ్రీశ వారిజనాభ సురేశ విష్ణు
ముక్తిదా మధుసూదన పుష్కరాక్ష
కేశవా వాసుదేవ శ్రీకృష్ణ వరద
చేతి సాయము నీవె లక్ష్మీనృసింహ 
మాయచేత భవప్రవాహ మగ్నుడయ్యు
నే విభుని సాయమంది రక్షింపబడెనొ
అట్టి లక్ష్మీనృసింహ పాదాబ్జ భృంగ
మనెడు శంకరుడీ స్తోత్రమును రచించె
ఫలశ్రుతి
అమిత భక్తి భావమ్ముతో హరిని దలచి
ఈ స్తవమును పఠించు వారీ ధరిత్రి
నఖిల భోగభాగ్యమ్ముల ననుభవించి
జీవితాంతమునన్ హరిన్ జేరగలరు.
జైహింద్.

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

సారస్వతచూడామణి శ్రీ కొట్టే కోటారావు తో ముఖాముఖీ.

6 comments

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ మిత్రులారా! నేడు హనుమజ్జయంతి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఈ రోజు  విశాఖపట్టణం జిల్లా పద్య కవితా సదస్సు అధ్యక్షులు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు శ్రీ కొట్టే కోటారావు మా ఆహ్వానం మేరకు మా యింటికి సపత్నీకులై  వచ్చి మాకు ఎంతో ఆనందం కలిగించారు.
వీరు తన జీవిత కాలంలో ఒక తెలుగు భాషా బోధకులుగా పని చేసినందుకు  తాను ఆశించిన విధంగా తన విధ్యార్థులనెందరినో కవులుగా, అవధానులుగా  మంచి బోధకులుగా అయేలాగ తీర్చి దిద్ద గలిగారు. ఈక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్ప వలసి ఉంది. అదేమిటంటే, సాధారణంగా ఉద్యోగులలో కొందరు డిశంబరి మాసంలో ఎక్కువ సెలవులు పెట్టెస్తారు. డిశంబరు దాటితే ఆసెలవులు మురిగి పోతాయని అది తమకెంతో నష్టం అని భావిసూ అలా చేస్తారు.
ఐతే కోటా రావుగారు మాత్రం అల కాదు. ఈ కోటారావుగారు తన ఉద్యోగ జీవితంలో ఏనాడూ సెలవు పెట్టలేదు. ఆవిధంగా  ఉండే ఆనాటి ఆ ప్రవర్తన ద్వారా ఎందరో శిష్యులకు ఆదర్శవంతులయ్యారు. నేటికీ తన ఆశయాలను నెరవేర్చుకొంటూనే ఉన్నారు.
 జిల్లా పద్య కవితా శాఖ అధ్యక్షులుగా  బాధ్యతలు చేపట్టుతూ,  ప్రతీ మాసమునందూ రెండవ ఆదివారం జిల్లా స్థాయిలో పద్య కవితా సదస్సు నిర్వహించుతూ, ఆ సదస్సులో ఒకశీర్షికను ముందుగా యిచ్చి, దానికి కవులు వ్రాసిన  పద్యాలు సభలో చదివిన పిదప వారిని గౌరవించడం, ఆతరువాత ఒక ప్రత్యేక అతిథిచే సాహిత్యోపన్యాసం ఇప్పించుట ద్వారా శ్రోతలలో సాహిత్యాభిలాష పెంపొందింప జేయటం చేస్తూ ఉంటారు. 
అటువంటి కోటా రావు గార్తో ముఖాముఖీ యు ట్యూబ్ ద్వారా చూడండి.

సుమారు పదద్ధెనిమిది నిమిషాల నిడివి గల కార్యక్రమంలో కేవలం తొమ్మిది నిమిషాలు మాత్రమే వస్తోంది. అందుకని మొత్తం సంభాషణను కేవలం వాగ్రూపంలో నిక్షిప్తం చేసి మీ ముందుంచడానికి  ప్రయత్నించఁ గలను. 
జైహింద్.

1, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీ రామ నవమి సందర్భంగాయావజ్జనావళికీ శుభాకాంక్షలు.

5 comments

జైశ్రీరామ్.
శ్రీ రామ నవమి సందర్భంగాయావజ్జనావళికీ శుభాకాంక్షలు.
శాః-
శ్రీరామా! శ్రీత పారిజాత! సుగుణ శ్రీ  ధామ! సీతా పతీ!
కారుణ్యంబున కావుమయ్య జనులన్! కల్యాణ రామా సదా!
శ్రీ రామా మణి సీతనెట్లు కనెదో చేపట్టి, యట్లే మమున్
ధీరరోదాత్తుఁడ! పట్టి వీడకు మిలన్! దివ్యత్వమున్ గొల్పుమా!
చః-
ప్రియ మహనీయులార! వినిపించుఁడు రామునకుద్ధతిన్ మహో
దయమది మీహృదాంబుధిని తప్పక  చేయుఁడటంచు. నిత్యమున్
జయ పథమందు సంచరిల సద్గుణ మార్గప్రవర్తనాదులన్
ప్రియమున గొల్పి కావుమని శ్రీరఘునందను నండ నొందగన్.
జైహింద్.