గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, అక్టోబర్ 2010, మంగళవారం

పండిత నేమాని వారికి ఘన సత్కృతి.

1 comments

ప్రియ పాఠకులారా! శ్రీమదధ్యాత్మ రామాయణమును పద్య కావ్యముగా రచించిన శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు అశ్టావధానియే కాక సుప్రసిద్ధ కవులు అన్న సంగతి మనకు తెలిసిన విషయమే కదా! 
అట్టి కవి వరేణ్యుల కలమునుండి జాలువారిన శ్రీమదధ్యాత్మ రామాయణము అనే కావ్యము 23-10-2010 వ తేదీన విశాఖ పట్టణంలో ఆవిష్కరింపఁ బడింది.
తత్ సందర్భముగా ఈ సుకవి పుంగవుని వారి ఆత్మీయ బృందము ఘనంగా సత్కరించిన విషయం సహృదయులందరికీ ఆనమ్ద దాయకమే కదా! అట్టి ఆ కవి వరులనుద్దేశించి ఆత్మీయ బృందము అభినందన మందార మాలలో తమ భావనామృతాన్ని ఎలా తొణికిసలాడించారో మీరూ చదివి తెలుసుకొనేటందుకు వీలుగా ఆ పత్రాన్ని యథాతథంగా మీ ముందుంచుతున్నందుకు సంతోషంగా ఉంది.
ఇక మ్నీరు చదవాలని ఎదురు చూస్తున్న ఆ పత్రం ఇదే.

చూచారు కదండీ! ధన్యవాదములు.
శ్రీ నేమానివంశజులైన రామ జోగి సన్యాసి రావుగారికి మనం కూడా మన అభినందనలు తెలియఁ జేద్దాం.
పరమేశ్వరుఁడు ఈ కవి వరులకు దీర్ఘాయురారోగ్య ఐశ్వర్య ములను; కవితా పుష్టిని ద్విగుణీకృతంగా అమితంగా కలుగఁ జేయాలని క్తోరుకొంటూ అభినందనలు తెలియఁ జేస్తున్నాను.
జై శ్రీరాం.
జైహింద్

24, అక్టోబర్ 2010, ఆదివారం

ఆ కాంత ఏ కాంతయో?

3 comments

తమ 'శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి  తిరుపతి వేంకట కవులు  ఎంత విలువ కట్టారో చూడండి.
సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు
వాలు చూపులు రెండు వేలు సేయు
నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు
విర్రవీగుట లారువేలు సేయు
పదమొక్కటియె సేయు పదివేల వరహాలు
లావణ్యమది యొక లక్ష సేయు
బలుసోయగమె సేయు పది లక్షల వరాలు
కులుకు నడక తీరు కోటి సేయు
ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు
నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు
నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు
నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!

అసాధారణ కవితావేశ సంపన్నులైన శ్రీ తిరుపతి వేంకట కవులిరువురూ ఒకే కాంతను ఇంతగా మెచ్చుకున్నారూ అంటే ఆ కాంత ఏ కాంతయో?
జైశ్రీరాం.
జైహింద్.

20, అక్టోబర్ 2010, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 105.

2 comments

శ్లోll
శ్రుతివిప్రతిపన్నా తే
యదా స్థాస్యతి నిశ్చలా
సమాధా వచలా బుద్ధి
స్తదా యోగ మవాప్స్యసి.
కll
నానావిధ శ్రవణాదుల
మానని కలతను వహించు మతి కలగక తా
ధ్యానము తిరముగ నిలిపిన
కానంబడు దైవమపుడు కరుణను మనకున్.
భావము:-
నానావిధములగు శ్రవణాదులచే కలత జెందియున్న నీ బుద్ధి యెపుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగ నిలిచియుండునో, అపుడు నీవాత్మసాక్షాత్కారమును బొందగలవు.
జై శ్రీరామ్.
జైహింద్.

19, అక్టోబర్ 2010, మంగళవారం

Sreemadadhyaatma Ramayanam book release.

0 comments

Venugopal... 4x2..jpg
I am very happy to inform you all that Sreemadadhyaatma Ramayanam book Written by AshTaavadhaani SrI Nemaani rama jogi Sanyasi Rao; will be release at Visakha public library on 23rd evening. 
ఔత్సాహికులు  తప్పక ఆవిష్కరణోత్సవాన్ని కనులారా తిలకించుటకు వీలుగా ఆంధ్రామృతం ఈ విషయాన్ని ప్రకటించింది.
జైశ్రీరాం.
జైహింద్.

చెప్పుకోండి చూద్దాం 39.

5 comments

ప్రియ పాఠకులారా! 
మనం; మనకి మనంగా; మన ఆలోచనలతో ఏ సమస్యలనైనా; జీవిత సమస్యలనైనా సమర్థవంతంగా పరిష్కరించుకో గలిగామనే ఆత్మ విశ్వాసం పొందగలిగితే మన హృదయం నిత్యం వికాసవంతంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరెష్టును అధిరోహించినవా రెంతటి సంతోషం పొందుతారో అంతటి సంతోషం మనం సమస్యాపరిష్కారం చేయ గలిగిన క్షణంలో మనకీ కలుగుతుంది. 
ఒక్క చిన్న పొడుపుకథే అవవచ్చు. దానికి మనం సమాధానం చెప్పగలిగితేనే సంతోషం పొందే మన మనస్సు కొంచెం క్లిష్టమైన సమస్యా పరిష్కారం చేయ గలిగితే ఉత్తేజితమౌతుందనడంలో సందేహం లేదు. 
ఈ ఉద్దేశ్యం తోనే ఆంధ్రామృతం చెప్పుకోండి చూద్దాం అనే శీర్షికతో మీ ముందుంచుతోంది. మీ సమాధానాలు సరైనవవడం ఒక ఎత్తైతే; ఆ సమాధానం చెప్పే నిపుణత మరొక ఎత్తు. వచనరూపంలో చెప్పడ ఒక పద్ధతైతే; పద్య రూపంలో చమత్కారంగా ప్రతిస్ప్ందించడం ఒక పద్ధతి.
మీ మార్గమేమిటన్నది మీ సమాధానం ద్వారా పాఠకాళి గ్రహించడమే కాదు; ఉత్తమమైనదిగా భావించితే అనుసరించే ప్రయత్నం కూడా చేయక మానరు. తద్వారా మీరు మార్గదర్శకులగుదురు. ఈ క్రింది పద్యంలో గల పొడుపు కథకు మీ సమాధానం ఏమిటో గ్రహించడం కోసం పద్యం ఇంక చదవండి
ఆll
పదము లారు కలవు బంభరంబా? కాదు. 
తొండముండుఁ; గాని దోమ కాదు. 
రెక్కలుండుఁ; గాని పక్షి గా నేరదు. 
దీని భావ మేమి తెలిసి కొనుడు. 
చదివిరి కదా? ఆలస్యమెందుకు? సమాధానం మీదైన విశిష్ట శైలిలొ పంపగలరు కదూ? ధన్యవాదములు.
జై శ్రీరామ్.
జైహింద్.

18, అక్టోబర్ 2010, సోమవారం

అనంత సద్గుణ సంపన్న ఆంధ్రామృత పాఠకులారా!

0 comments

అనంత సద్గుణ సంపన్నులారా! 
అసాధారణ భక్తిభావంతో ఆ దుర్గాంబను మీ హృదయపు కోవెలలో గాంచి; అపురూపమైన సేవానిరతితో కొలిచి; 
ఆ జగన్మాత కరుణకు పాత్రులైన మీ అందరినీ మనసారా అభినందిస్తూ; పుణ్యాత్ములైన మీకు నాహృదయ పూర్వక నమస్సులు  తెలియఁ జేస్తున్నాను.
మll
నవదుర్గాకరుణార్ద్ర దృష్టి కిరవై; నవ్యాద్భుత స్వాంతులై;
భువనైకామృత మూర్తులై పరగుచున్ పూర్ణత్వముం గాంచుచున్
దివిజుల్ మెచ్చగ నుందునట్టి కరుణా తేజంబు నొప్పారు మీ
రవి తేజంబున కంజలింతుఁ గొనుఁడీ! క్రాంతిన్ బ్రసాదింపుఁడీ!
పునర్ నమస్సులతో
మీ 
రామ కృష్ణా రావు.
జైశ్రీరాం.
జైహింద్.

17, అక్టోబర్ 2010, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం 38.

4 comments

పాఠకులార! చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఐతే ఇదిగో చూడండి ఈ క్రింది పద్యం.
ఆ.వెll
ఒడలి నిండ కన్నులుండు నింద్రుడు కాడు; 
కంఠమందు నలుపు. కాడు శివుడు !
ఫణుల బట్టి చంపు. పక్షీంద్రు డా? కాదు.
దీని భావ మేమి తెలిసి కొనుడు
.

చూచారు కదా! మరింకెందుకాలస్యం? చెప్పుకోండ్శి చూద్దాం?
జై శ్రీరామ్.
జైహింద్.

16, అక్టోబర్ 2010, శనివారం

ఆంధ్రామృత పాన శీలురకు దసరా శుభాకాంక్షలు.

3 comments

బర్మాలో హంసవాహినియైన సరస్వతి "తూయతాడి" అన్న పేరుతో. త్రిపిటకాలను చేత ధరించినది
అమృత హృదయులైన ఆంధ్రామృత పాఠకులకు; నిరంతర జగన్మాతార్చనా పునీత  హృదయులకు; భారతమాత పవిత్ర సంతతియై అలరారుచున్న భారతీయులకూ; దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.
మానవ జాతికి నిరంతర సన్మంగళములతో ప్రవర్ధిల్లును గాక.
జైశ్రీరామ్.
జైహింద్.

13, అక్టోబర్ 2010, బుధవారం

డా.గణపతిరావు కవి భిషజుల నాగబంధం తిలకిద్దాం.

4 comments

జై శ్రీరాం.
జైహింద్.

4, అక్టోబర్ 2010, సోమవారం

శారదా దరహాసం.(అంతర్జాల భువన విజయం)

1 comments

ప్రియ పాఠకులారా! 
తే.02 - 10 - 2010నశ్రీ భైరవభట్ల కామేశ్వర రావుగారి అధ్యక్షతన శారదా దరహాసము పేరుతో అంతర్జాల భువన విజయము జరిగినది. అందు పూరణలకై 12 సమస్యలు; 11 దత్తపదులు; వర్ణనలకై 7 అంశములు అధ్యక్షులవారు ఇచ్చి యుండిరి. అనేకమంది ఆసక్తిపరులైన కవి పండితులు; కవితాభిమానులు పాల్గొని యుండిరి. తమ వాక్ చమత్కారముతో రచనా సామర్థ్యముతో సభను రంజింపఁ జేసిరి. 
అధ్యక్షుల వారికి; ప్రత్యక్షముగాను; పరోక్షముగాను పాల్గొనిన కవి పండితులకు ఆసక్తితో పాల్గొని; చూచి; ఆనందించినవారికీ; ఈ కార్యక్రమమును నిర్వహించుటకు మూలమైన ప్రొద్దు పత్రికా నిర్వాహకులకు; ముఖ్యముగా యఱ్ఱపురెడ్డి రామనాథ రెడ్డి గారికీ ఆంధ్రామృతం తరపున పాఠకుల తరపున అభినందన పూర్వక ధన్యవాదములు చ్తెలియఁ జేస్తున్నాను. 
ప్రస్తుతం మనం ఆ సభలోప్రస్తావింపఁబడిన సమస్యలను; దత్తపదులను; వర్ణనీయాంశములను ఒక్కొక్కటిగా చూచి పూరించడానికై ప్రయత్నిస్తే ఆ ఆనందం మనమూ పొందవచ్చునని భావిస్తూ అందలి మొదటి సమస్యను మీ ముందుంచుతున్నాను.
బాకులు క్రుమ్మినట్లగును భారతపౌర! వచింప సిగ్గగున్
ఈ సమస్యకు నా పూరణ చూడండి.
భీకరమైన యుద్ధములు విశ్వ జనీనత, నీతి, నిల్పగా
శ్రీకరమైన భావనలఁ జేసిరొకప్పుడు. నేడు గాంచితే?
లోక విరుద్ధ దుష్కృతులు లుబ్ధతఁ జేయుచు నుండె నెందరో!
బాకులు క్రుమ్మినట్లగును భారతపౌర! వచింప సిగ్గగున్!
చూచితిరి కదా? మీ అభిప్రాయములను  తెలియఁ జేస్తూ; మీ పూరణలను కూడా వ్యాఖుఅగా పంపంపగలరని ఆశిస్తున్నాను.
జై శ్రీరాం.
జైహింద్.