జైశ్రీరామ్
71. ఓం వజ్రదంష్ట్రాయ నమః.
అపరాజిత వృత్త గర్భ సీసము.
జయము జయము దేవ! జాగృతిఁ గొల్పరా! - జగమున నిన్ గని జయము పలుక.
జయము జయము. నాకు సద్గుణ మీయరా! - యసహాయులకు నే సహాయపడఁగ.
జయము జయము శ్రీవశంకర దేవరా! - చిత్తమందున నిన్నుఁ జేర్చి కొలుతు.
జయము జయము సత్య సాంద్ర సుధీవరా! - సత్య సంధతఁ గొల్పి శాంతినిమ్ము.
గీ. చిద్భవాపరాజిత గర్భ సీస వాస! - *వజ్ర దంష్ట్రా* దురాత్ములఁ బాపుమిలను.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
71వ సీస గర్భస్థ అపరాజిత వృత్తము. (న న ర స వ .. యతి 9)
జయము జయము దేవ! జాగృతిఁ గొల్పరా! - జయము జయము. నాకు సద్గుణ మీయరా!
జయము జయము శ్రీవశంకర దేవరా! - జయము జయము సత్య సాంద్ర సుధీవరా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! లోకము నిన్ను చూచి జయమును పలుకునట్లు జాగృతిని
గొలుపుము. అసహాయులకు నేను సహాయపడుటకు వీలుగా నాకు సద్గుణములనిమ్ము.. శ్రీవశంకరా! నీకు జయము. నిన్ను
నా మనసున చేర్చి కొలిచెదను. సత్య సాంద్రా! ఓ సుధీవరా! సత్యసంధతను నాకు కలిగించి శాంతినిమ్ము. అపరాజిత
వృత్త గర్భ సీసపద్య స్వరూపా! ఓ వజ్ర దంష్ట్రా! లోకమునందలి దురాత్ములను నశింపఁ జేయుము,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.