గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 45వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

45. ఓం శింశుమారాయ నమః.

రుచిర వృత్త గర్భ సీసము.

ఆత్మస్థుఁడ! దయామయా! కరుణను దారిఁ - జూపవా? మాకిల ప్రాపు నీవె.

శ్రీకరుఁడ! ప్రయాసనే కనవొకొ? ప్రాణ - నాథుఁడా! మాకిట్టి బాధలేల?

నా దేవుఁడ! ప్రియంబునన్ గన నిను వేడు - కొందునే. నన్ను నీవందలేవ?

దీనబంధు! జయాన్వితా! నరహరి! సత్య - శోభితా! కొలుపుమా ప్రాభవంబు.

గీ. చిత్తహీనులనణచెడి *శింశుమార*! - భక్తపాళిని మదిఁగాంచి శక్తినిడుము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

45 సీస గర్భస్థ రుచిరవృత్తము. ( .. యతి 9)

దయామయా! కరుణను దారిఁ జూపవా?

ప్రయాసనే కనవొకొ? ప్రాణ నాథుఁడా!

ప్రియంబునన్ గన నిను వేడుకొందునే.

జయాన్వితా! నరహరి సత్య శోభితా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఆత్మలో నున్నవాడా! దయాపూర్ణుఁడా! ఇలలో నీవే

మాకు దిక్కు. దారి చూపుము.. ప్రాణనాథుఁడా! శ్రీకరా! మా శ్రమను గమనింపవేల? మాకీ బాధలెందులకు? నా

దైవమా! నన్ను ప్రేమతో చూడుమని వేడుకొనుచున్నాను. నన్ను నీవు అందుకొనలేవా? దీనబాంధవా! జయాన్వితా!

నరహరీ! సత్యమునందు ప్రకాశించువాడా!మాకు ప్రాభవమును కొలుపుము. హృదయము లేనివారినణచెడి

శింశుమారా! భక్తులను నీ మనసునందు చూచి శక్తిని ప్రసాదించుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.