గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 80వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్.

80. ఓం భక్తవత్సలాయ నమః.

మధురాక్కర గర్భ సీసము

నరహరి చరణముల్నయనంబులకు వినో - దంబు సదా శాశ్వతంబుగాను.

సిరిపతి తలపులే చిద్వశీకర శుభ - ముల్ ధాత్రి పైనున్న పూజ్యులకును.

గురువు హరియె కదా! కోరుకో నొసఁగు - మస్తంబు మదినెంచి మాకు నృహరి!

హరి యను పదమదే యక్షయంబయ నర - సింహంబ! చెడుఁ బాపి, చేవఁ జూపు.  

గీ. సీస మధురాక్కరలలోనఁ జెలఁగు శ్రీశ! - ప్రవర నిజ *భక్త వత్సలా*! పద్మ నయన!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

80 సీస గర్భస్థ మధురాక్కర. (1సూ.. 3ఇం.. 1చం. .. యతి 4 గణము 1 అక్షరము)

నరహరి చరణముల్నయనంబులకు వినోదంబు.

సిరిపతి తలపులే చిద్వశీకర శుభముల్ ధాత్రి.

గురువు హరియె కదా! కోరుకో నొసఁగు సమస్తంబు.

హరి యను పదమదే యక్షయంబయ నరసింహంబ

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నరహరి పాదపద్మములు కనులకు విందు. సిరిపతి

తలపులే పూజ్యులకు చిద్విలాసములు. గురువన అశ్రీహరియే కదా. కోరుకొనగనే సమస్తము మాకొసగును. హరి పదమే

అక్షయము. కావున నరసింహా! మధురాక్కర గర్భసీసపద్యమున చెలగువాఁడా! ప్రవరా! నిజభక్త వత్సలా! పద్మ

నయనా! చెడును బాపు నీ సమర్థత చూపుము

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.