గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జులై 2009, గురువారం

చక్కని మన యింట శ్రావణ మహా లక్ష్మి.

0 comments

చ:-

ముసిరిన కర్మదుష్ఫలము పూజలుచేయఁగ బుద్ధిఁ బాపగా,
కసురుకొనేటి కర్మమును కాంచుటకైనను లేకఁ జేయు నా
బిసరుహనేత్ర లక్ష్మి సుమపేశలమానస, కొల్చు వారికిన్.
పసుపునుకుంకుమన్ పరమభక్తినొసంగుడు పేరటాండ్రకున్.

ఉ:-

శ్రావణమాసమందు సువిశాలహృదంతరవాసి యౌచు పల్

ధీవరులింటనిల్చు"సిరి" తృప్తిగ సంపద లందఁ జేయుచున్.
సేవలు చేసి యామె కృప చేకొనుడందరు. స్త్రీ జనంబులన్
యా వరలక్ష్మిగా తలచి యాదరమొప్పగఁ గొల్చుటొప్పెడిన్.

శా:-

అమ్మా!శ్రీహరి రాణి!నీదు కృపతో అష్టస్వరూపాత్మవై
నెమ్మిన్ మా గృహమందు నుండ తగునో యమ్మా! కృపాంభోనిధీ!
మమ్మున్ గావగ నెవ్వరమ్మ కలుగున్ మాయమ్మనీకన్న?నిన్
సమ్మాన్యంబుగ నందరందు కనుటన్ సత్ కృత్యమున్ గొల్పుమా!


జైహింద్.

29, జులై 2009, బుధవారం

రాంగు గోయింగు యీ మోడరన్ లివింగు.

2 comments

అజ్ఞాత కవి రచించిన మణి ప్రవాళం మీ ముందుంచుతున్నాను.

సీ:-

సందులో స్టాండింగు, సతులకై వెయ్ టింగు, - మోడరన్ డ్రస్సింగు, ఫోజ్ గివింగు.

సిగరెట్స్ స్మోకింగు, సినిమాస్కు గోయింగు, - ఫ్రెండ్సుతో మూవింగు వాండరింగు,

ఇరిటేటు మైండింగు, హిప్పీసు క్రాఫింగు - రెక్లెస్సు టాకింగు రీజనింగు,

కోయన్స్ స్పెండింగు, గుడ్ నైట్టు హియరింగు, - రెఛడుగా హెడ్ ష్ట్రాంగు, రిప్లయింగు.

తే:- విలను ఫోజింగు, తండ్రికి వేవరింగు, - తల్లి ఫియరింగు కార్య సాధన నథింగు.

భవ్య వైఖరి తమ్మిళ్ళు ఫాలొయింగు, - రాంగు గోయింగు, మోడరన్ లివింగు.

జైహింద్.

28, జులై 2009, మంగళవారం

స్త్రీలు వర్తించునట్టివౌ సీకిరేట్సు. ( మణిప్రవాళము. )

9 comments

సీ:-హజ్బెండు తెచ్చిన అన్ వేల్యు థింగైన - మోష్టు బ్యూటీ యంచు మురిసికొనుము.

రిక్వెష్టు చేయగా రెఫ్యూజు చేయక - థేంక్సని యద్దాని తీసుకొనుము.

సిల్లీగ యెపుడైన చిలిపి చేష్టలు చేయ - సీరియస్ కాబోకు చెల్లి ! నీవు.

రోడ్డుపై గర్ల్సును బేడ్డుగా చూచిన - యెక్స్యూజు చేయక యెగిరి తన్ను.

తే.గీ:-

ఆంగ్ల భాషకు అలవడ్డ అయ్యవార్ల

తోడి కాపురము చేయు జాడ లెఱిగి

స్త్రీలు వర్తించునట్టివౌ సీకిరేట్సు

యెఱిగి మసలిన వారికి హెవెను మెట్లు.

జైహింద్.

27, జులై 2009, సోమవారం

ఎవరు గొప్ప? శివుడా? బసవడా?

6 comments

సీ:-

ఆతడంబకు మగం డీత డమ్మకే మగం డెలమి నాతని కంటె నితడె ఘనుడు.

అతడు శూలము త్రిప్పు నితడు వాలము త్రిప్పు - నెలమి నాతని కన్న నితడె ఘనుడు.

అతడు అమ్మున వ్రేయు నితడు కొమ్మున దూయు - నెలమి నాతని కన్న నితడె ఘనుడు.

అతడు సృష్టిని మోయు నితడతనినె మోయు - నెలమి నాతని కన్న నితడె ఘనుడు.

తే.గీ:-

శూలి యాతడు కాపుల కూలి ఇతడు. దేవూడాతడు కుడితంత దేవు నితడు

ఈశ్వరుని యన్నిటను మించు నెద్దు గాదె? - ఎద్దు లేకున్న కదలలే డీశ్వరుండు.

జైహింద్.

26, జులై 2009, ఆదివారం

ఆదిభట్ల నారాయణ దాసు గారి పరమేశ్వర ప్రార్థన.మణిప్రవాళము

5 comments

హరి కథా పితా మహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు చేసిన పరమ శివుని గూర్చిన ప్రార్థన.ఇది మణిప్రవాళంలో సాగింది. తమాషాగా వుందనిపించి, మీ ముందుంచుతున్నాను.

ఉ:-హెడ్డున మూను, స్కిన్నుపయి హెచ్చుగ డష్టును, ఫైరు నేత్రమున్,

గుడ్డగు గ్రేటు బుల్లు, వెరి గుడ్డగు గాంజెసు హెయ్ రు లోపలన్,

పడ్డది హాఫె యౌచు నల పార్వతి మేను నలంకరింప,

షుడ్డు డివోటు దండములు సోకగ ప్రేయరు సేతు నెప్పుడున్.

జైహింద్.

25, జులై 2009, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 57.

0 comments

మంచిచెడ్డల సమ్మేళనంనుండి మంచినే గ్రహించాలని ఎంతచక్కగా చెప్పారో పూర్వీకులు. చూడండి.

శ్లో:-
అనంత శాస్త్రం బహు వేదితవ్యం
అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః !
యత్ సార భూతం తదుపాసితవ్యం
హంసో యథా క్షీరమివాంబు మిశ్రం !!

గీ:-
శాస్త్ర మెఱుగ ననంతము సమయ మల్ప
మధిక మాటంకములు కాన హంస యెట్లు
పాలుమాత్రమె గ్రహియించి ప్రబలు? నట్ల
మంచి మాత్రమె గ్రహియించి మహిమ గనుడు.

భావము:-
తెలిసికొన వలసిన శాస్త్ర మనంతముగా నున్నది. కాలము అల్పముగా నున్నది. ఆటంకములు అధికముగా నున్నవి. కావున హంస ఏ విధముగా నీటిని విడిచి పాలనే గ్రహించునో అదే విధముగా చెడ్డను విడిచి మంచినే గ్రహింపుము.

జైహింద్.

23, జులై 2009, గురువారం

కనుక్కోండి చూద్దాం 2.

6 comments

ఆంధ్ర జ్యోతులు ప్రకాశింప చేస్తున్నది మన సహోదరి జ్యోతిగారు.

సమాధానం కనుక్కోండి చూద్దాం. అనే శీర్షికతో నేను ప్రచురించినది చూచి, చక్కని సమాధానం చెప్ప గలగడమే కాక ఒక చక్కని ప్రశ్నను కూడా మనముందుంచారు. మీరూ ఆ పద్య రూపంలో నున్న ప్రశ్నను చూచి, మీ సమాధామంతో పాఠకులకుల్లాసం కలిగించండి.

ఇక జ్యోతి గారు వ్రాసినది చూడండి.

అపారమైన తెలివితేటలుండి, పైకి అమాయకంగా ఉండే ఓ ఇల్లాలిని ఆమె భర్త పేరడిగితే ఏకంగా సవాలు విసిరింది..

సీ:-
విపులాక్షి ! "నీ విభు పేరేమి?" యన్నను
చాతుర్య మెసగ నా నాతిబలికె
నక్రంబు హేమంబు నగధాము పుప్పొడి
యబ్బురం బేనుగు యాజి పడవ
అన్నిటి మూడేసి అక్షరంబులు గల
మారు నామంబుల తీరు జూచి
నాధు పేరునకును నడిమ వర్ణంబులు
సరియని జెపితి నెరిగి కొనుము
యుచు నానాతి బల్కె, తా నతిశయముగ
ఇట్టి నామంబు గలవాడే యీతడనుచు
వంచనలులేక బుధులెరింగించిరేని
వారికే నాచరించెద వందనములు.

దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా???


మీ సమాధానలకై ఎదురుచూడనా?

జైహింద్.


22, జులై 2009, బుధవారం

చెప్పుకోడి చూద్దాం 12.

4 comments

సమాధానం కనుక్కోండి చూద్దాం.
స్త్రీలు తమ భర్త పేరు నుచ్చరించరాదని ఒక లతాంగి తన భర్త పేరు చెప్పిన తీరు చూడండి.

చ:-
సరసిజ నేత్ర నీ విభుని చక్కని పేరు వచింపుమన్న, యా
పరమ పతివ్రతా మణియు భావమునన్ ఘనమైన సిగ్గునన్
కరియును - రక్కసుండు - హరు కార్ముకమున్ - శర - మద్దమున్ - శుకం
బరయగ వీని లోని నడి యక్కరముల్ గణుతింప పేరగున్.

సమాధానము:- BLOCKED.

కరియు ---------= ద్విరద
రక్కసుండు------ = అఘుడు.
హరు కార్ముకమున్ = పినాకి.
శరము----------= సాయక.
అద్దమున్ -------=ముకురం.
శుకంబు ---------= చిలుక
జైహింద్.

న గాయత్ర్యాః పరం మంత్రం

4 comments

http://4.bp.blogspot.com/_9vPNlqoYUtY/SVTBWweGyII/AAAAAAAABYQ/D8aGOOCWp5w/s400/Gayatri+Devi.jpg
న గాయత్ర్యాః పరంమంత్రం అనే విషయం తెలిసిన వారం కాబట్టే మనం ఆ మంత్రాన్ని నిత్యం యాంత్రిక పరికరాల ద్వారా వింటూ వుంటాం.

ఐతే వేద విదులు ఈ మంత్రంలో దేవతామూర్తుల బీజాక్షరాలున్నాయనీ, ఆయా దేవతా మూర్తులు ధ్యానం చేయబడతారనీ, ఉదాత్త అనుదాత్త స్వరాలను భంగం వాటిల్ల కుండా చదవడం వలన ప్రయోజనం చేకూర గలదనీ చెప్పడం మనకు తెలుసు. ఐతే ఆ స్వరాలు మనం గురు ముఖతః మాత్రమే నేర్వ గలమనీ వారి నుడి.

కొందరైతే అర్థ రహితంగా చదివే దేదైనా సరే వ్యర్థమే అంటారు. అలాగని మనం అర్థ సంగ్రహం చేద్దామంటే చాలా కష్ట సాధ్యమైన పని అనడంలో సందేహం లేదు. తెలుసుకొనినా అభ్యాసం చేసేటంతటి తీరిక మనకెక్కడిది?

అది దృష్టిలో పెట్టుకొని, నాకర్థమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ గాయత్రీ మహా మంత్రమును, దానిలోని అర్థాన్ని తనలో ఇముడ్చుకొన్న శ్లోకాన్ని, తేట తేట తెలుగులో అందరికీ పఠన యోగ్యమయే విధంగా నిత్య పారాయణకు అనుకూలంగా పద్యంగా వ్రాసి, భావాన్ని పొందు పరచుచున్నాను.

విజ్ఞులు గుణగ్రహణ పారీణులు అయినట్టి మీరు గుణములను గ్రహించడంతో పాటు దోష కలుషితమైన అంశ మనిపించిన విషయాన్ని ఇందు గమనించినట్లయితే తప్పక సరిజేయ , తెలియ జేయ మనవి.

గాయత్రీ మంత్రము:-
ఓం, భూర్భువస్సువః , తత్ సవితుర్ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్. ఓం.

శ్లోకము:-
ఓం. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః .
ప్రేరయేత్ తస్య యత్ భర్గ తద్ వరేణ్య ముపాస్మహే.

ఆ.వె.:-
ప్రణవ మంత్రముగను, వర "భూః - భువః - సువః"
వ్యాహృతులుగ నున్న భవ్యుడెవడు
మనకు బుద్ధి ప్రేరణను జేయు, సకలంబు
సృష్టి జేయు నట్టి , శ్రేష్ఠమైన,
దైవ దివ్య దీప్త తత్వ స్వరూపమున్
ధ్యాన మొనర జేయుదము సతంబు.

భావము:-
ప్రణవ మంత్రము గాను, " భూః - భువః - సువః "అనే వ్యాహృతులు గాను, ఉంటున్న ఏ దైవము మన బుద్ధిని ప్రేరేపిస్తాడో, సకలాన్ని సృష్టించే వాడైన ఆ దైవము యొక్క ప్రశస్తమైన జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం.

ఈ నా సాహసాన్ని మన్నించి, గుణ గ్రహణ చేయ మనవి. ఇది సామాజిక ప్రయోజన కరంగా వుంటే ధన్యుడను.
జైహింద్.

20, జులై 2009, సోమవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 56.

0 comments

పంచ మాతలు:-

రాజు భార్య, అన్న భార్య, గురుని భార్య, భార్యను కన్న తల్లి, తనను కన్న తల్లి, ఈ ఐదుగురినీ పంచ మాతలందురు.

ఈ నాడు సంఘములో వావి వరసలు మృగ్యమై అనేక వైపరీత్యాలు మన కెదురౌతున్నాయంటే కారణం సౌశీల్యాన్ని ప్రసాదించ గలిగే సంస్కార వంతమైన విద్య అందకపోవడమే అనక తప్పదు.

రామాయణంలో మనం సీతాన్వేషణ ఘట్టంలో ఒక చక్కని శ్లోకాన్ని చూస్తాము.

సుగ్రీవుడు తమకు దొరికిన ఆభరణముల మూటను సీతవేమో చూడమని రామునకు చూపగా ఆతనికి సీతా వియోగ దుఃఖము కారణముగా కన్నుల నీరు నిండగా వస్తువుల రూపము స్పష్టము కాకపోవుటచే లక్ష్మణుని ఆ ఆభరనములు సీతవేమో చూడమనెను. అప్పుడు ఆ లక్ష్మణుడు చెప్పిన మాటలు ఆనాటి మానవాళికి గల సభ్యతా సంస్కారములకు అద్దంపడతాయి. చూడండి.

శ్లో:-
నాహం జానామి కేయూరే, నాహం జానమి కుండలే.
నూపురేత్వభి జానామి, నిత్యం పాదాభి వందనాత్!!

తే.గీ:-
ఉండు గావుత కేయూర కుండలములు
తల్లి నాయమ సీతకు. తలప నెఱుగ.
అందెలాతల్లివే. కందు ననవరతము
వందనంబులు చేసెడె వాడనగుట.

భావము:-
అన్నా! ఈ కేయూర కుండలములను నే నెఱుగను. ఈ అందెలు మాత్రము నే నెఱుగుదును. నిత్యమూ నా తల్లి సీతమ్మకు పాదాభి వందనము చేయు సమయమున వీటిని కనెడి వాడను కాన ఇవి సీతమ్మవే అని ఎఱుగుదును.!

చూచారా! ఆనాడు మాతృ సమాన యైన అన్న గారి భార్య అయిన వదిన గారి పాదములు తప్ప మరేమియూ లక్ష్మణునకు తెలియదు. ఎంతటి ఘనతరమైన సంస్కృతి?

ఈ నాడు కనీసం ఆ గ్రంథాలతో మనకు గల పరిచయాన్ని, ఆ గ్రంథాలపై మనకు గల పఠనాసక్తిని, మనకు గల అవగాహననీ పరిశీలించుకొంటే మనం సిగ్గుతో కుంచితులమవ వలసి వస్తుందేమో! మరి నైతిక విలువలు మానవాళిలోవికసించేదెలా? మీరూ ఆలోచించండి.

జైహింద్.

19, జులై 2009, ఆదివారం

సమస్యా పూరణ చేసి చూద్దాం.

6 comments


సాహితీ బంధువులారా!

మనమీ మధ్య సమస్యాపూరణములను చేయాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ అలసులమై ఉన్నామనిపిస్తోంది కదా! ప్రస్తుతం ఒక సమస్య మన ముందుకొస్తోంది. పరిశీలించండి.

కృపణుని తోడ దానమున గెల్వగ నెవ్వరు గల్గు నిద్ధరన్!

చంపక మాల వృత్తంలో నున్న ఈ సమస్యను మనం ప్రయత్నిస్తే సునాయాసంగానే పూరించ వచ్చేమో ప్రయత్నించి చూద్దామా? మరెందు కలస్యం? వెంటనే ప్రయత్నించి పూరించి, పంపండి.
జైహింద్.

దారిద్ర్యన్ని రూపు మాప గలిగేదెవరో! ఎప్పుడొస్తారో!

4 comments

ప్రజా జీవితాలకు చుట్టు ముట్టిన యీ దారిద్ర్యాన్ని మాపే దెవరు?

శ్లో:-
దగ్ధం ఖాండవ మర్జునేనచ వృథా దివ్యౌషధైర్భూషితం!
దగ్ధా వాయు సుతేన హేమ రచితా లంకా పురీ స్వర్గ భూః!
దగ్ధః సర్వ సుఖాస్పదశ్చ మదనో హాహా! వృథా శంభునా!
దారిద్ర్యం ఘన తాప దం భువి నృణాం కేనాపి నో దగ్ధ్యతే!

ఉ:-
దగ్ధము చేసె ఖాండవము దర్పము జూపుచు నర్జునుండు. తా
దగ్ధము చేసె లంక నల దండన జేయుచు నాంజనేయుడున్.
దగ్ధము చేసె మన్మధుని తా పరమేశుడు. ధాత్రిపై నిటన్
దగ్ధము జేయ నేర్వరుగదా! పురి విప్పెడి యీ దరిద్రమున్.

భావము:-
దివ్యౌషధ స్థావరమైన ఖాండవ వనమును అర్జునుడు దగ్ధము చేసెను. భూలోక స్వర్గమైన లంకను హనుమంతుడు దగ్ధము చేసెను. సర్వ సుఖాస్పదుడగు మన్మధుని ఆ పరమేశ్వరుడు దగ్ధము చేసెను. లోకములో అత్యంత బాధాకరమగు దరిద్రమును మాత్రము ఎవ్వరునూ దగ్ధము చేయు జాలకుండిరి కదా!

రోజు రోజుకూ పెరిగి పోతున్న నిత్యావసర వస్తువులు కొన జాలక దరిద్ర దేవత చేజిక్కి బాధ పడుచున్న దీన జన జీవన యానము మిక్కిలి కష్ట తరము. అత్యంత బాధా కరము. ఈ దారిద్ర్యమును బాపగల దైవాంశ సంభూతులు ఎప్పుడు ముందునకు వచ్చి కార్యోన్ముఖులగుదురో యని, తమ దారిద్ర్యమెప్పుడు బాపుదురో యని దీన జనులు ఉపేక్షించుచున్నారు.

జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 55.

1 comments

సత్ కావ్య పఠన ప్రయోజనము:-

శ్లో:-
ధర్మార్థ కామ మోక్షేషు వైచక్షణ్యం కళాసుచ
కరోతి కీర్తిం ప్రీతించ సాధు కావ్య నిషేవణం.

తే.గీ:-
కావ్యపఠనము ధర్మార్థ కామమోక్ష
జ్ఞాన మొసగును. కలిగించు కళల మహిమ
నరయు శక్తి. పాఠకులకు నసదృశమగు
కీర్తి ప్రదమిది. చదువుడు స్ఫూర్తి నొంది.

భావము:-
మనము కావ్య పఠనము చేయుచుంటిమేని అది మనకు ధర్మార్థ కామ మోక్ష సాధనమే కాక, కళలలోని మహిమ నరయు శక్తిని కలిగించుటతో పాటు మనకు కీర్తి ప్రదమగును.

" కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతాం " అనే శ్లోకం లో కూడా మనం పూర్వమీ వీషయం గ్రహించి యున్నాము. కావున మనం మన అమూల్యమైన దైవదత్తమైన సమయాన్ని సత్కావ్య పఠనాదులతో సద్వినియోగ పరచుకొందామా!

జైహింద్.

15, జులై 2009, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 54.

0 comments

కలి విడంబన శతకంలో ఒక శ్లోకమున్నది. అది చమత్కమో లేక కొందరి విషయంలో నైనా యదార్థమో మీరే ఆలోచించెదరు గాక. ముందు శ్లోకమును, అనువాదమును, భావమును చూడండి.

శ్లో:-
వైద్య రాజ నమస్తుభ్యమ్. యమ రాజ సహోదరా!
యమస్తు హరతి ప్రాణాన్. వైద్యః ప్రాణాన్ ధనానిచ!!

ఆ:-
వైద్య రాజ! నీకు వందనంబులు సేతు.
యముని సోదరుండ! అందుకొనుమ!
యముడు ప్రాణముగొను. యమ సోదరుండ! మా
ధనము, ప్రాణములను గొనుదు వీవు.

భావము:-
యముని సోదరుడవైన ఓ వైద్య రాజా! నీకు నమస్కారము. ఎందుకన - యముడు ప్రాణాలనే తోడును. వైద్యుడవైన నీవు మా ప్రాణాలనీ, ధనాన్నీ కూడా హరిస్తావు కదా! కాన మా జోలికి నీవు రాకుండా ఉండడానికి నీకు నమస్కరిస్తున్నాను సుమా!

పూర్వం ప్రజానీకానికి "వైద్యో నారయణా" అని కీర్తింప బడే విధంగా వైద్యులు తమ వైద్యాన్నందించి ప్రాణాలు కాపాడేవారు. కాని నేటి పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనిపిస్తోంది. వైద్యం కోసం రోగి వెళ్ళితే దీనినే అవకాశంగా తీసుకొనే వైద్యులు తద్వారా అత్యవసరం అనుకొని కోదరైతే, అవసరమని కొందరైతే, అనవసరంగా కూడా అక్కలేని వైద్య పరీక్షలతో రోగి జేబు ఖాళీ చేయిస్తున్న వారు కొందరు ఉండడం నీటి డాక్టర్లలో మనం చూస్తుంటాం.

మానవ జన్మ చాలా గొప్పది. అందులోనూ వైద్య శాస్త్రం అధ్యయనం చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టం. అలా వైద్యులైన వారు చాలా మంది తమ స్వార్థానికి దూరంగా ఉంటూ అత్యవసర వైద్య సేవలో తమ జన్మ ధన్యం చేసుకొనే పుణ్య మూర్తులు సాక్షాత్తు మానవాకృతిలోనుండు మహనీయ పరమాత్మలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్టి మహనీయ మనీషులే మానవాళికి ప్రథమ పూజ్యులు.

ఉ:-
వైద్యము నభ్యసించి, తన వారికి కూడ సుదూరమౌచు, " నా
బాధ్యత" వైద్య సేవ యని, భక్తిగ రోగికి సేవ చేయుచున్,
సద్యశ మందుచున్న మిము సర్వ విధంబుల దైవ మెప్పుడున్
హృద్యముగా కనుంగొనుత! సృష్టిని ముఖ్యుడ! వైద్య పుంగవా!!

అని మహాత్ములైన భిషగ్వరులకు పాదాభి వందనం చేస్తున్నాను.

వైద్యాన్ని అసరాగా చేసుకొని, ధన మాన ప్రాణాలతో చెలగాటమాడే వైద్యులు మాత్రం అంతకు అంతా పరిహారం చెల్లింపక తప్పదన్న విషయం మాత్రం యదార్థం. అది దైవ శాసనం.

జైహింద్.


11, జులై 2009, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 53.

0 comments

శ్లోll
ఈశ్వరే నిశ్చలా బుద్ధిః దేశార్థం జీవన స్థితిః.
పృథివ్యాం బంధువద్వృత్తిః ఇతి కర్తవ్యతా సతమ్. 70( నేపల చరిత్రమ్ )
తే.గీ.ll
దట్టమైనట్టి నిశ్చల దైవ భక్తి;
దేశ హితమయ జీవన దీక్ష కలిగి;
లోకులందరు తనవారుగా కనుటయు;
సజ్జనాళికి కర్తవ్య మిజ్జగమున.  
భావము:-
అచంచలమైన ఈశ్వర విశ్వాసము కలిగి యుండుట; తన జీవితమును దేశ హితార్థమైయే గడుపుచుండుట; లోకమందరి యెడలను బంధు సమాన దృష్టి కలిగి యుండుట; ఇవన్నీ సత్పురుషులైనవారికి కర్తవ్యములు.
ఈ క్రింది శ్లోకాదులు మేలిమి బంగారం మన సంస్కృతి 50 లో వ్రాసినదే పునరుక్తమైనది. 

మనం మన సమాజంలో జరుగుతున్న అనైతిక లజాబాహ్య ప్రవృత్తులకు చాలా చింతిస్తున్నామే కాని వాటికి గల మూలాలు తెలుసుకో లేకపోవడమే కాక విరుగుడు కూడా కనుగొనాలనే ఆలోచన కూడా చేయ లేకపోతున్నాం.
నిజానికి జన్మతః మానవుడు స్వేత పత్రం లాంటివాడనడంలో సందేహం లేదుకదా! ఐతే ఎదిగే కొద్దీ పుట్టుకతో సంక్రమించిన లక్షణాలు బైట పడుతున్నకొద్దీ మంచి వాడిగానో చెడ్డ వాడిగానో గుర్తింప బడుతుంటాడు.
భగవంతుడు జీవులన్నింటికంటే కూడా మానవునకు ఒక ప్రత్యేకమైన మేధాశక్తిని సమకూర్చాడు. దాని ద్వారా మనవుడు తన నైజాన్ని కప్పి పుచ్చుకోవడం కాని, తనలో లేని గుణాల్ని అలవరచు కోవడం గాని చేస్తూ సమాజంలో మంచి వాడిగానో చెడ్డ వాడిగానో జీవనం సాగిస్తుంటాడు.
మానవుని వ్యక్తిత్వ వికాసానికి అతని కుటుంబము, అతడు నివసించే పరిసరములు, అతడు అభ్యసించే విద్య, అతనితో సన్నిహితంగా ఉండే వ్యక్తులు, అతనికి బోధించే బోధకులు, ముఖ్యముగా అతని తల్లిదండ్రులు తమ ప్రభావం చూపడం మనకు తెలియ కుండానే జరిగిపోతుంటుంది.
చిఱుత ప్రయం నుంచీ కూడా సద్గుణ సౌశీల్యాలు కలిగించ గలిగే వాతావరణంలో పెరిగిన వ్యక్తి సద్గుణుడై యుండడం మనకు అనుభవైక వేద్యం. ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డలు చెడిపోవాలనే కోరికతో ఉండరు. ఐతే బిడ్డలు మంచిగా పెరిగేలా చేయడంలో వారి కర్తవ్యం మాత్రం అనేక కారణాలవల్ల నిర్వర్తించ లేకపోతున్నారనే మనం అనుకో వలసి ఉంటుంది.
ఇక సామాజికులైతే అనేక కారణాల వల్ల చెడు వర్తనుల్ని చూస్తూ కూడా పెదవి విప్పి యదార్థం చెప్పడానికి
సాహసం చేయ లేకపోతున్నారు భారతంలో భీష్ముడులాగా.
భగవద్గీతలో ఒక చక్కని అనుసరణీయమైన శ్లోకముంది. చూద్దాం.
శ్లో:-
యద్యదా చరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. {అ. 3. శ్లో.21. }
తే:-
శ్రేష్ఠులెయ్యవి చేయునో శ్రేష్ఠమనుచు
జనులు చేసెదరయ్యవి సరస మతిని.
శ్రేష్ఠులెద్దాని నిల్పిన చేయు. కాన
శ్రేష్ఠులితరములెన్నడు చేయ రాదు.
భావం:-
లోకంలో శ్రేష్ఠులుగా గుర్తింపబడి గౌరవింప బడుతున్నవారిని జను లనుసరింతురు. వారి ప్రతిపాదనలనే శ్రేష్ఠమైనవిగా భావించి ప్రమాణముగా స్వీకరింతురు. గాన లోకులచే శ్రేష్టులుగా భావింప బడే వారికి సమాజంలో గురుతరమైన బాధ్యత ఉందనడంలో ఏమాత్రం విప్రతిపత్తి లేదు. నిస్వార్థంగా సామాజిక శ్రేయమే లక్ష్యంగా వారి ప్రవర్తనను తీర్చి దిద్దుకొంటూ మార్గ దర్శి కావాలి.
ఇట్టి సామాజిక శ్రేయాన్ని బాధ్యతా యుతంగా నిర్వహించ వలసిన గురుతర బాధ్యత పిల్లలకు చిఱుత ప్రాయం నుండీ బోధన చేసే గురువులకుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
నైతిక బోధన నందించదానికి వీలుగా పాఠ్య ప్రణాళికను పకట్బందీగా ప్రభుత్వం నిర్మాణం చేయడంలో నిపుణులైన వారి కప్పగించి, వారిచే సంసిద్ధం చేయించాలి.
ఇందు నిమిత్తం ప్రజాభిప్రాయాన్ని ముందుగ స్వీకరించి పరిశీలించాలి. తరువాత ఏమి చేయవచ్చో మీరే సెలవివ్వండి.
జైహింద్.

10, జులై 2009, శుక్రవారం

ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు

0 comments

పౌష్టికాహారం తీసుకోవాలి. మీ పిల్లలకు పరివారానికి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడపండి అని ప్రభుత్వము, వైద్యులు నిత్యం సెలవిస్తూ వుంటారు. ఐతే ఆహార సంపాదనే చాలా కష్టంగ వుంటే ఇక పౌష్టికాహారం ఎలా తీసుకో గలం? అత్యవసరమైన బియ్యం కనీసం ఖరీదు ౩౦ రూపాయలు. కాగా ఇక మిగిలిన సంభారాలు మేమేం తక్కువ కాదన్నట్టు విపరీతమైన వెలలతో మధ్య తరగతి కుటింబీకులకు సహితం అందుబాటులో లేకుండా పోయాయంటే ఇక సామాన్యుని జీవనం గడిచే దెలాగ?

ఎక్కడుంది లోపం? ఎవరిలో ఉంది ఈ దోషం? నిజంగా సరకు లేకపోతే మనం బాధ పడ్డా అర్థముంది. కాని డబ్బు కోరినంత యిస్తే మనం కోరినంత దినుసు లభ్యమౌతోందే!

అన్ని విధాలా పకట్బందీగా పరిపాలనా యంత్రాంగాన్ని నిర్మించుకోగలిగిన మనం ఎక్కడ చేతకానివారిమై భవిష్యత్తును ప్రస్తుతాన్ని అంధకార బంధురం చేసుకొంటున్నాం?

కమ్యూనిష్టులు ప్రతిఘటనను చేస్తున్నారు. ఒక్క పిసరైనా ప్రయోజనం చేకూరే అవకాశం కలిగిందా? ఎందరు తమ నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఎన్నాళ్ళని ఈ సామాన్యులు తమ జీవన నౌకను నడప గలరు?

ఎన్నాళ్ళని మనం మౌన జీవనం సాగించ గలుగుతాం?
మనం ఎదుర్కొంటున్న ఈ గడ్డు సమస్యలను, సామాజిక దృష్టితో ఆలోచించి, మన బ్లాగుల ద్వారా ప్రభుత్వ దృష్టికి వెళ్ళేలాగ మన అభిప్రాయాల్ని వ్రాయగలిగితే మన వంతు కర్తవ్యాన్ని చేయడంలో మనం నిర్లిప్తంగా లేమనే ఆత్మానందం మనకు మిగలడమే కాక ఒక్కొక్కరి రచన ప్రభుత్వానికి కను విప్పు కలిగించే అవకాశం లేకపో లేదనీ నా నమ్మకం. మరి మన అభిప్రాయాల్ని రచనలద్వారా మన బ్లాగులలో నిక్షిప్తం చేసి, మనం చేయ గలిగినంత మనం చేస్తే బాగుంటుందని మనవి.
జైహింద్.

ఓ ఆంధ్ర భాషాభిమానీ! మరి మీరేమంటారు?

2 comments

ఆంధ్రామృతాస్వాదనాలోలురందరికీ వందనం అభివందనం.
ఆంధ్ర రాష్ట్రానికే కేంద్రమైన భాగ్యనగరంలో ఆంధ్ర భాషలో మాటాడేవారి శాతం ప్రక్కన పెట్టి, మాటాడే వారిలోనైనా భాషాభిమానం గలవారి శాతమెంతుంటుందో ప్రశ్నించుకొంటే మనకు సంతృప్తినే యిస్తుందో, లేక అసంతృప్తినే కలిగిస్తుందో తెలియదు. కారణం బహుశా జీవన గమనంలో అనివార్య పరిస్తితులే అయి వుండ వచ్చు. ఐనప్పటికీ నేడు మన భాషనీ, రాబోయే కాలంలో మన చిఱునామానే మరచిపోయే స్థితి ఉంటుందనే యదార్థం మనం జీర్ణించుకో లేని నిజం కాదంటారా?

సౌజన్య మూర్తులనేక మంది తమకు గల భాషాభిమానం తమ బ్లాగుల ద్వారా భాషకు జీవం పోస్తూ తమ మాతృభాషాభిమానాన్ని చాట గలుగు తున్నారు. ఆ పుణ్య మూర్తులందరికీ అభినందనలు.

మాతృ భాష లోనే మహనీయమైన స్ఫూర్తిని కలిగించడం సులభతరం. అది కూడా ప్రాచీన మహాకవులాశ్రయించిన పద్య రచనలో చేసినట్లయితే అది పటిష్ఠమై శాశ్వితప్రయోజనకారి కాగలదేమో ఆలోచించ వలసి వుంది. మానసిక ఉల్లాసం మనకి ఉన్నప్పుడు మనం సునిశితమైన జ్ఞానాన్ని ప్రదర్శించే అవకాశం చాలా ఎక్కువ. మనకి మనంగా పద్యం వ్రాయ గలిగిన నాడు మనకి మానసిక మైన విశ్వాసంతో పాటు, మనో వికాసం కూడాకలుగు తుందని మనం భావించ వచ్చు ననుకొంటాను.

గద్య రచన చాలా చక్కని మార్గం మన భావం యితరులకు తెలియ జేయడానికి. ఐతే అది తాత్కాలిక ప్రయోజన కారి మాత్రమే. అదే మనం పద్య రూపంలో ఉన్న మహా కవుల భావావేశ పూరిత బోధనలు నిత్య నూతనోత్తేజకాలనడంలో సందేహం ఉండదనుకొంటాను. అందుచేత మనం సులభ పద్ధతిలో పద్య రచన చేసిన వేమన లాంటి మహాకవుల జాడలో నడవడం ద్వారా ఉడుతా భక్తిగా నైనా మనం భాషాభిమానాన్ని చాట గలమేమో ఆలోచించుకొంటే కొంతైనా చేయగలమేమో.

ఇప్పుడు మనం సులభ తరంగా వుండే ఆట వెలదిలో గాని, తేటగీతిలో గాని మన భావాలను తెలిపే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు. ఆలోచించి -- -- --
మీ అభిప్రాయాన్ని ఛందోబద్ధం చేసి వ్యాఖ్యగా పంపే ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా మన శక్తి మనకు తెలియడమే కాక, మనకు తెలియని అనేక విషయాలు తెలుసుకొనే అవకాశం మనకు కలుగుతుంది. అనేక మంది మనభావాలను అర్థం చేసుకోవడంతో పాటు, వారి అమూల్యమైన అభిప్రాయాలతో మనకు జ్ఞాన ప్రబోధ కూడా చేస్తారు. మరైతే ఆలస్యమెందుకు? మీరు మీ అభిప్రాయాల్ని పోష్టు చేయండి. ధన్య వాదాలు నమస్తే.
జైహింద్.

7, జులై 2009, మంగళవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 28

0 comments

ప్రియ సాహితీ బంధువులారా! విశ్వనాధ భావుకతను శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు వివరించిన 28వభాగాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

దిగంతమువరకు వ్యాపించి యున్న పంపా సరోవర సౌందర్యము శ్రీరాముని మనస్సును లోగొని - కొన్ని క్షణములు సీతా వియోగము దుఃఖమును మరపింప జేసినది. పంపా సరస్సు ఎట్లున్నది?

పంపా సరస్సు నందలి నీరు స్వచ్ఛమై నీలి వర్ణమున ప్రకాశించు చున్నది. దానిపై తెల్లని హంసలు తమ ఎఱ్ఱని కాళ్ళతో బంగారు రంగు ఱెక్కలతో నీటిని కదుపుచూ ఎగురు చున్నవి. గుంపులుగా ఎగురు చున్న హంసల ఱెక్కలు, కాళ్ళు తగిలి నీటి బిందువులు (తుమ్పరలు) వ్యాపింపగా వానిపై బాల సూర్య కిరణములు ప్రతిఫలించు చున్నవి. రాత్రి అంతయు ముకుళిత పద్మములందు బందీలైపోయిన తుమ్మెదలు తమ నల్లని రెక్కలపై పద్మ పరాగములను పూసుకొని, పైకి ఎగురుచున్నవి. రామణీయకతా వారి రాశి. (అందాల నీటి నెలవు) యైన పంప అమృత వీధులకు ప్రాణములు "పంప"గా చూచు చున్నాను.

నీటి నీల వర్ణము ఆకాశము కాగా హంసల కాళ్ళు ఎఱుపు రంగు రెక్కల చివరల పసిడి రంగు తుంపురులపై లేయెండ తుమ్మెదలపైని పుష్ప రాగపు పసుపు రంగులు ఇవి అన్నియు వివర్తతములై క్షణ కషణావర్తిత అర్థ వృత్త సందర్శనములై రామునకు పంపా సరస్సుపై విరిసిన అనిర్వచనీయ సౌందర్యమైన ఇంద్ర ధనుస్సు కనిపించినది.

హంసలు ఒక చోటు నుండి మరొక చోటునకు ఎగురునప్పుడు ఱెక్కలు సాచి అర్థ వృత్తాకారమున నీటి ఉపరి తలమున నడచినట్లే నడచి సరోవర జలమును కల్లోలము చేయుచు లేచు చున్నవి. ఆ సందర్భమున ఎక్కడి కక్కడ అవి జల బిందువుల యందు చిన్న చిన్న హరివిల్లులను సృష్టించుచునే మొత్తముగా సరస్సును చూచునప్పుడు మనోజ్ఞమైన పంపా సరస్సుపై ఇటు నుండి అటు ఇంద్ర ధనుః ఖండమును సృష్టించు చున్నవి.

ఇంత మనోహర దృశ్యము శ్రీరామునకు సీతా వియోగ దుఃఖమును మరపించినది.

ఈ చక్కని విషయాన్ని నిక్షిప్తం చేసిన విశ్వనాధ వారి పద్యం ఇదీ.
సీ:-
నీటి మట్టము గాగ నీలముల్ పరి లఘుల్ - జలముల ఱెక్కల చరణములను,
కదుపుచు నెగురు నీ మద మరాళంబులు - కాళ్ళ యెఱ్ఱనయు ఱెక్కల చివళ్ళ
పసిడి కాంతియు పరిప్లవమాన శీకర - గత బాల మార్తాండ కర నివహము,
పంపైక దేశంబు పాకారి నవ చాప - ఖండ మనోజ్ఞ రేఖన్ దనర్చు.
గీ:-
వారిజాంతరోచ్చలిత బంభర గరుత్ ప - రాగ సాధు కిర్శీర వర్ణములు కలసి
రామణీయ కతా వారి రాశి పంప - అమృత వీధుల యందు ప్రాణములు పంప. { వి.రా.క.వృ.కి.కాం.నూ.౨౮}

రామాయణ కల్ప వృక్షములో ఇది అద్భుత పద్యము అన వచ్చును. లోకోత్తర పద్య రచన అన వచ్చును. అపూర్వ భావ నిర్మాణ నైపుణ్యమని చేతులు జోడించ వచ్చును. అనిదం పూర్వ భావుకత అని మూదలించ వచ్చును. అనితర సాధ్యమైన కవిసమ్రాట్ కావ్య సృష్టిగా నిరూపించ వచ్చును.

మనం సాహిత్యంలోని సౌందర్య భావ బంధురమైన ఒక్క పద్యం స్మృతికి తెచ్చుకొని మనం జీవితమున ఆనందింప దలచినచో తత్ క్షణమే కంఠస్థము చేయ దగిన పద్యం ఇది.

చూచాం గదండీ! ఇక ఆలస్యమెందుకు ఈ పద్యాన్ని మనం ఇప్పుడే కంఠస్థం చేసేద్దాం.
జైహింద్.

2, జులై 2009, గురువారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 26-27

4 comments

ప్రియ సాహితీ బంధువులారా! విశ్వనాధ సాహితీ జగత్తులో కలికి తురాయి అయిన శ్రీ రామాయణ కల్ప వృక్షంలోని భావుకతను తెలుసుకొంటున్నాం కదా! ఇప్పుడు ౨౬ వ భాగం మరియు ౨౭ వ భాగం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కవివతంస శ్రీ బులుసు గళం నుండి నాకలం ద్వారా మీకందుతున్న మాట మీకు తెలియనిది కాదు. ఇక విషయం లోనికి వెళ్దాం.

తనను పెండ్లియాడి అయోధ్యకు వచ్చినప్పటి తొలినాటి సీతయొక్క గుణ గణాలను స్మరిస్తున్నాడు శ్రీరాముడు.

క:-
తెలిసిన వయసున నన్నున్
గొలుచుట యబ్రమ్ము గాదు క్షోణీ సుతకున్.
తెలియని వయసున నన్నున్
కొలిచిన యది సర్వ దైవ కూటమ్ము వలెన్. { వి.రా.క.వృ.కి.నూ. ౨౬ }

తెలిసిన వయసులో నన్ను సేవించుటలో ఆశ్చర్య మేమున్నది? తెలియని వయసున అనగా బాల్యము నందే నన్ను సీత సకల దైవములను నాలోనే దర్శించి నట్లు సేవించినది.

కాపురమునకు వచ్చినప్పటి సీత ఇంకా బాల్యావస్థలో నున్నది. భార్యకు భర్త అనగా ఎట్టివాడో, ఎట్టి వానిగా సృతులు చెప్పుచున్నవో తెలియదు. కానీ ఆ చిన్న తనపు దినములలోనే ఆమె రాముని సకల దేవత స్వరూపునిగ భావించినది. సేవించినది. ఇప్పుడు సీతా ఆదర్శమునందు రామునకు ఆయా స్మృతులు హృదయమునందు కదిలి వేదన కలిగించు చున్నవి.

ఉ:-
భార్యకు నంచు ప్రా చదువు బాటల నేమి గుణాళి యున్నదో?
భార్యకు ధారుణీ సుతకు బంధురమా గుణ పాళి యున్నదీ
అర్యమ వంశ నూత్న వధు వామెకు నాకు వియోగ కల్పనా
ధుర్యము దైవమే గుణము తోచని యంధముగా కనంబడున్. { వి.రా.క.వృ.కి.నూ. ౨౭ }

భార్య ఎట్లుండ వలెనని వేదమార్గములందు చెప్ప బడినదో నా సీతకు ఆ సుగుణము లన్నియు ఉన్నవి. సూర్య వంశమునకు కోడలుగా వచ్చిన ఆమెకు, నాకు, ఈ విధమైన ఎడబాటు కల్గుటకు ఏ కారణమూ కనబడదు. దైవము గ్రుడ్డిదేమో బహుశ!

ఆశ్రమములలో గృహస్థాశ్రమము గొప్పదని వేదము కీర్తించినది. భార్యకు సహ ధర్మ చరి, సహ ధర్మ చారిణి యని పేర్లు. అందుకే ఆమె ద్వితీయ అని పేరు పొందినది. పురుషుని యజ్ఞాధికార ఫలమున ఆమెకు రెండవ స్థానము. పురుషుడు ఆమెకు పుత్ర రూపమున జన్మించును. కనుక ఆమె జాయా అని పిలువ బడినది. సకల లోక ప్రస్తరణకు మూల కందము గృహస్థశ్రమము కాగా ఆ ఆశ్రమమునకు ఆలవాలము స్త్రీ - గృహిణి. భార్యా విహీనునకు యజ్ఞాధికారము లేదనగా ఆమె ప్రాముఖ్యతను ఎంతని చెప్ప నగును!

భర్త కష్టమును తన కష్టముగా - ఆయన సంతోషమును తన సంతోషముగా భావించుచు, పతిదూరస్థుడైనచో అలంకారములు విసర్జించుచు, భర్త మరణించగా తానును ప్రాణములు వీడునది పతివ్రత అని శాస్త్ర వచనము.

{ ఆర్తార్తే ముదితే హృష్టా - ప్రోషితే మలినాకృశా - మృతే మ్రియేత యేనారీ - సా స్త్రీ జ్ఞేయా పతివ్రతా. }

ఇప్పటికీ మన వారు సంకల్పము చెప్పుకొను నప్పుడు " ధర్మ పత్నీ సమేతస్య " అని చెప్పుకొనుచునే యున్నారు కదా!

పెండ్లి నాడు తన కూతురును రామునికి అప్పగించుచు " ఇయం సీతా మమ సుతా - సహ ధర్మ చారీ తవ - ప్రతీచ్ఛచైనాం భద్రంతే. - పాణిం గృహ్ణీష్వ పాణినా " అన్న జనక మహర్షి నీకు నా కుమార్తె యైన సీత సహ ధర్మ చారియై యుండగలదు అనినాడు. శ్రీరాముడు పితృ వాక్య పరి పాలకుడై వన వాసమునకు ఏగునప్పుడు సీత తానును భోగ భాగ్యములను తృణీకరించి, ‘ వన వాసి ’ ఐనది. అద్వైతం సుఖ దుఃఖయోః. అన్నట్లు చరించినది.

సీత గుణ బంధురత ఆమె వియోగమున శ్రీరామునకు దుఃఖ హేతు వగు చున్నది.

వివాహము ఒక ఒప్పందముగా కాక పవిత్ర బంధముగా చూడ వలెను. భర్తచే భార్య బానిసగా కాక స్నేహితురాలిగా ఆధ్యాత్మిక భాగ స్వామిగా చూడబడుతుంది. అని ఐతరేయ బ్రాహ్మణము పేర్కొంది. " స్త్రీ లక్ష్మీ దేవికి ప్రతీక " అని శతపథ బ్రాహ్మణము చెప్పినది.
" సుఖా సప్త పదీ భవ సఖ్యంతే గమేయం
సఖ్యంతే మా యేషాః సఖ్యంతే మా యోష్ఠ్యాః. "

{ఓ కన్యకా! నీవు నాతో అన్ని కర్మల్లో సమానాధికారం పొందుతూ, నాతో ఏడడుగులూ నడచి రా! నేను కూడా నీ సఖ్యాన్ని పొందుతాను. మనమిద్దరం ఒకరి స్నేహాన్ని మరొకరు విడువ కుండా పరమానురాగంతో మెలగుదాం. } అని ఛాంద్యోగ బ్రాహ్మణం దాంపత్యము నందు స్త్రీ పాత్రను శ్లాఘించు చున్నది.

ఋగ్వేదము నందలి దశమ మండలమున స్త్రీ తన అత్తవారింట ఎట్లు నడచుకొన వలెనో వివరింప బడినది.

" ప్రా చదువు బాటల - " అంటే వేద మార్గముల యందు అని అర్థం. అనగా వేద ధర్మోచితంగా ప్రవర్తించిన సీతకు ఇట్టి కష్టములు {అపహరణము} సంభవించి నందుకు రాముడు విధిని పై పద్యమున నిందించినాడు.

రాముని కిం కర్తవ్యతా మూఢతను విశ్వనాధ ఈ విధముగా నిరూపించు చున్నాడు. కవిత్వమున అవస్థా నిరూపణము అనునది వర్ణనలో ఒక శిల్పము. విశ్వనాధ మహా శిల్ప వేత్త అని మనకు అర్థమవక మానదు.

చూచాం కదండి. సమయం కుదిరినప్పుడు మరొక పద్యం తెలుసుకొందాం.
జైహింద్.