జైశ్రీరామ్.
56. ఓం శర్వాయ నమః.
ఫలసదన వృత్త గర్భ సీసము.
కుమదము నణచు సుగుణ మహితుఁడవు నీ - వే దేవ! నీవె మా వేల్పువయ్య.
సుమధుర వచన కుసుమ మహతిఁ గొనుమీ - వే, పూజ నేఁ జేయు వేళలందు.
కుముదమున నిను మిగులఁ బొలయఁగను, గొ - ల్తున్ సదా, మహనీయ! తోయజాక్ష!
సహృదయమునఁ గను, జయహిత సుఫల దా - తా! హరీ! నిల్చి చిత్తంబులోన.
గీ.
ఫలసదనవృత్త గర్భిత లలిత సీస - సరస
సంభాస *శర్వా*! ప్రశాంతమిమ్ము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
56వ సీసగర్భస్థ ఫలసదనవృత్తము. (న న న న స గ .. యతి 10)
మదము నణచు సుగుణ మహితుఁడవు నీవే. - మధుర వచన కుసుమ మహతిఁ గొనుమీవే.
ముదమున నిను మిగులఁ బొలయఁగను గొల్తున్. - హృదయమునఁ గను జయ హిత సుఫల దాతా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత
జనమున ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! కుత్సిత మదమును అణచెడి
మంచిగుణములతో ప్రకాశించు గొప్పవాఁడవు నీవే. ఓ దేవా ! నీవే మా దైవము.మేము పూజనాచరించే వేళలలో.మిక్కిలి
మధురమయిన మా వాక్కులనెడిపూల గొప్పదనమును స్వీకరించు. మహనీయుఁడవయిన ఓ పద్మనేత్రా! భూమిపై నీవు
మిక్కిలి ప్రకాశించు విధముగా నేను నిన్ను కొలిచెదను..జయమును హితముని కలిగించు మంచి ఫలమునొసగు ఓ హరీ!
నా హృదయమున నిలిచి నామన్సులోనుండియే నన్ను చూడుము.ఫలసదన వృత్తగర్భిత సీసమున సరసముగా
సంభాసించువాఁడా! ఓ శర్వా! మాకు మిక్కిలి శాంతిని కలుగఁజేయుము..
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.