గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2010, శనివారం

(ఆంధ్ర) ప్రథానోపాధ్యాయులు డా.మెఱుగుమిల్లి కి CMRపురస్కారం.

3 comments

(ఫొటోలపై క్లిక్ చేసి చూడండి)

CMR Pratibha Awards, instituted by CMR Charitable Trust, were presented to school and district toppers from Visakhapatnam, Srikakulam, Vizainagaram. Union minister of State for Human Resources Development, D.Purandeswari, Who was the Chief guest, underlined the role of teachers in moulding students into good citizens. Minister for school Education Manikya Vara Prasada Rao, Minister for Tribal Welfare P.Balaraju, CMR group chairman Mavuri Venkata Ramana, District Collector J.Syamala Rao, Visakhapatnam Port Trust Chairman Ajeya Kallam and GVMC Commissioner V.N.Vishnu are other honorable guests on this occasion.
Dr' Merugumilli Venkateswara Rao Received Award  on 24-07-2010, Saturday.

శ్రీయుత పాఠకులారా!
విశాఖపట్టణం జిల్లా లోని మునగపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథానోపాధ్యాయులు
( ఇంతకు ముందు  ప్రథమాంధ్రోపాధ్యాయులు) ; విశాఖపట్టణం జిల్లా పద్య కవితా సదస్సు కార్య దర్శి ఐన  డా. మెఱుగుమిల్లి వేంకటేశ్వర రావు గారికి ప్రతిష్ఠాత్మకమైన CMR పురస్కారాన్ని కేంద్ర మత్రి శ్రీమతి డీ. పురందేశ్వరి అంద జేసారు.
ఉత్తములైన ఉపాధ్యాయులు సమాజంలో తప్పక గుర్తింపఁబడి గౌరవింపఁబడతారనడానికి ఈ సన్నివేశమే మనకు ప్రమాణము. 
శ్రీ వేంకటేశ్వర రావు చక్కని ఉపాధ్యాయులే కాదు; మంచి ఆర్ద్రత కల చక్కని కవి అని అనే కంటే  ఆశుకవి అనడమే సముచితంగా ఉంటుంది.
వీరు ప్రథమాంధ్రోపాధ్యాయులుగా ఉన్నప్పుడు అనకా పల్లి సమీపందు కల సీతా నగరంలో హైస్కూలు బాల బాలికలచేత అష్టావధానం చేయించారు.
విద్యార్థులలో అంతర్గతంగా ఉండే అనంత శక్తిని బైటకు తీయ గలిగిన వాడే ఉత్తమ ఉపాధ్యాయుడు అని మనం అనుకుంటే మాత్రం ఇతడు నూటికి నూరుపాళ్ళూ ఉత్తమ ఉపాధ్యాయుఁడే.
CMRపురస్కారం వీరందుకోవడమే ఆ విషయాన్ని రుజువు చేస్తోంది.
మహాత్ములు పరమాత్మ కృప గలిగి గౌరవింపఁ బడుదురు గాక! 
ఈ సందర్భంగా డా.వేంకటేశ్వర రావు గారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.
జైశ్రీరామ్.
జైహింద్.  

30, జులై 2010, శుక్రవారం

పుంభావ సంగీత సాహిత్య సరస్వతీ మూర్తులు

1 comments

పుంభావ సంగీత సాహిత్య సరస్వతీ మూర్తులు శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ; మా గురు దేవులు బ్రహ్మశ్రీ మానాప్రగడ శేషశాయి గారు ఆశీనులై యుండగా వెనుకనున్నది మన " అసంఖ్య " బ్లాగ్ మిత్రుఁడు చిరంజీవి సోమశేఖరుని పూజ్య మాతా పితలు; ఈ చిత్రంలో ఉన్నారు. శ్రీమాన్ శేషశాయి గారి ఇంటి వద్ద వీరంతా సమావేశమైన సందర్భంగా వారు ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పటి చిత్రము.
శ్రీ మానా ప్రగడ శేషశాయి గురు దేవుల కడ ( ౧౯౬౯ -౧౯౭౨ ) విద్య నభ్యసించిన శిష్య కోటిలో  నేనూ ఒకడిని. 
మా గురువు గారు రచించిన ప్రసన్న భాస్కరం అనే మకుటం లేని మహాశతకాన్ని " ఆంధ్రామృతం "లో మీరు చూడ వచ్చును.
ప్రస్తుతం మా గురువు దేవులు శ్రీమద్వాల్మీకి రామాయణాన్ని తనదైనశైలిలో  పద్యకావ్యంగా వ్రాస్తున్న పనిలో నిమగ్నులై యున్న వార్త సాహితీ ప్రియులందరి ఆనందానికీ కారణమౌతోంది. ఆ పరమాత్మ మా గురుదేవులకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రసాదించి వారి వాంఛితార్థం నెరవేర్చాలని మనసారా కోరుకొంటున్నాను.
వారిశిష్యుడుగా చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంటుంది. వారి ఆశీర్వాదంతోనే మేము బ్రతికేస్తున్నాము. ఆ పుంభావ సరస్వతీ మూర్తి ద్వయమునకు బ్లాగ్ ముఖంగా నమస్సులు తెలియఁ జేసుకొంటున్నాను.
జై శ్రీరామ్.
జైహింద్.

కప్పను గన్నట్టి పాము గడగడ వణికెన్

4 comments

29, జులై 2010, గురువారం

శ్రీ వల్లభ వఝల వారి చతుర్ముఖ విరాజిత తేటగీతి ద్వయము.

4 comments

నమస్తే.ప్రియ ఆంధ్రామృత పాన; సుందర హృదయారవింద పాఠక సోదరీ సోదరులారా! అమృతహృదయులైన మీకు నా అభినందనలు.
సాహిత్యామృతము;  అందునా మన ఆంధ్రామృతము గ్రీలిన కొద్దీ గ్రోలాలనీ; ఆనందామృతాన్ని నిరంతరాయంగా; నిరంతరం అనుభవించాలనీ సహృదయుల మనస్సుకు అనిపించే విధంగా  నిత్యమూ ననవోన్మీషమై యీ సాహితీ జగత్తులో అలరారుతూనే ఉంటుంది.
అట్టి  మన సాహిత్యమనే ఆకాశంలో అద్భుతమైన రెండు తారలు వెలిసాయి. అవి తారా పథంలో ఉండే విధంగా రచించిన కవి మరెవరో కాదు. మనకు ఈమధ్యనే మన ఆంధ్రామృత పాఠకులకు నా చే పరిచయం చేయఁ బడిన జ్యోతిశ్శాస్త్రజ్ఞులైన శ్రీ వల్లభవఝల నరసింహమూర్తి కవి పుంగవులు.
ఇంతకు ముందు మనం తెలుసుకొనిన అవధాని శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరావు కృత శ్రీమదధ్యాత్మ రామాయణము నుండి ఉదాహరణ ప్రాయముగా గ్రహించఁ బడిన చతుర్ముఖ విరాజితమును చూచి; స్పందించి; వ్రాసిన పద్య ద్వయమును మీ అందరికీ అందుబాటులో ఉండి చదివి ఆనందించడం కోసము; ప్రయత్నించి ఇట్టి రచనా జిజ్ఞాస కలవారికి ఆధారంగా గైకొనుడం కోసం ఇక్కడ ఉంచుతున్నాను.
ఎంత అద్భుతంగా వ్రాసారో ఇక చూడండి.
చూచారు కదా! ఎంత అవలీలగా వ్రాసారో.
మీరూ ప్రయత్నించండి.
"యత్నే కృతే యది న సిద్ధ్యతి కోzత్ర దోషః?"
నమస్తే.
జై శ్రీరామ్.
జైహింద్.

28, జులై 2010, బుధవారం

శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు గారి అధ్యాత్మ రామాయణము నుండి చతుర్ముఖ విరాజితము

1 comments


సద్గుణ సంపన్నులారా!
శ్రీ నేమాని రామజోగి సన్యాసి రావు అవధాని ప్రవరుల శ్రీ చక్ర భూషణమును ఇంతకు ముందే యెలుసుకొన్నాం కదా!
ఇప్పుడు వారి శ్రీమదధ్యాత్మ రామాయణములోని మరొక ఆణి ముత్యము చతుర్ముఖ విరాజితము అనెడి బంధ తేట గీతమును  చూచే భాగ్యం మనకు కలిగింది.
పై చిత్తరువులో మనకా తేట గీతి పద్యమ్ వ్రాసి యున్నది కనిపిస్తున్నప్పటికీ స్పష్టత కోసం ఈ క్రింద వ్రాస్తున్నాను.
పరిశీలింప మనవి.
తే.గీll
రామ శుభ నామ శ్రీరామ రామ రామ
రాజ కుల సోమ శ్రీరామ రామ రామ
రాక్షస విరామ శ్రీరామ రామ రామ
రామ జయ ధామ శ్రీరామ రామ రామ.
(శ్రీమదధ్యాత్మ రామాయణము - యుద్ధ కాండ - ౧౩ వ సర్గ - ౭ వ పద్యము)
ఇంత సునాయాసంగా చతుర్ముఖ విరాజితంగా శ్రీరాముని స్తుతించారో మన అవధానిగారు.
ప్రయత్నిస్తే మనం కూడా ఇటువంటి పద్యాన్ని వ్రాయలేకపోతామా? ప్రయత్నించి వ్రాసి మీరు తప్పక పంపే విధంగా ఆశారదా మాత మిమ్ములను కటాక్షించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.

27, జులై 2010, మంగళవారం

శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు గారి అధ్యాత్మ రామాయణము నుండి శ్రీ చక్ర భూషణం.

1 comments

అధ్యాత్మ రామాయణం.యుద్ధ కాండ.15వ సర్గ.32 వ పద్యము. 
ప్రియ పాఠకులారా! 
అసాధారణ భక్తి సమన్వితులైన శ్రీ నేమాని రామ జోగి  సన్యాసి రావు  అవధాని చక్కని సుప్రసిద్ధ కవి. వారు రచించిన అధ్యాత్మ రామాయణము నుండి మనము సర్వ లఘు సీసమును కూడా చూచి మనలో చాలామంది అట్టి సీసపద్యాలను వ్రాయడం కూడా జరిగింది కదా!
ఆ మహాకవి  శ్రీ చక్ర భూషణము అనే పేర వెలయించిన బంధ కవితను మీ ముందుంచడానికి చాలా ఆనందంగా ఉంది.
పైన గల పటములో శ్రీచక్రభూషణము పటముతో పాటు దాని క్రింద తేటగీతి పద్యము కూడా ఉంది. 
ఐనా గాని స్పష్టముగా తెలియుట కొఱకు  మరల అదే పద్యము ఈ క్రింద వ్రాయు చున్నాను.చూడుడు.
తే.గీ.ll
జగ దదీశ్వర! శ్రీరామ! సర్వ రక్ష!
కమల లోచన! శ్రీశ! రక్షః ప్రణాశ!
వరద! కాకుత్స్థ! శ్రీద! కృపా నిధాన!
జనకజావర! క్షత్రేశ! జ్ఞాన తేజ!
ఇది ఈ మహాకవి రచించిన శ్రీమదధ్యాత్మ రామాయణము అను తెలుగు పద్య కావ్యమునందలి యుద్ధ కాండమున 15 వ సర్గలో 32 వ పద్యము. 
చూచారు కదా! ఎంత అలవోకగా పద్యాన్ని సర్వ హృద్యంగా వ్రాసారో! వారి రచనలోని మరికొన్ని ఆణిముత్యాలను మళ్ళీ సమయం దొరికినప్పుడు తప్పకుండా  గ్రహిద్దాం.
జైశ్రీరామ్.
జైహింద్.

26, జులై 2010, సోమవారం

ఆర్యులారా! ఈ దత్త పదిని మత్తేభంలో పూరించ వలసినదిగా మనవి.

9 comments

ఆంధ్రామృతమును నిరంతము గ్రోలే ప్రియ సాహితీ ప్రియులారా! మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు.
ఇప్పుడు  మన సాహితీ బంధువయిన  శ్రీ ధవళ సోమశేఖర్ ఇచ్చిన ఒక చక్కని పూరణ నిమిత్తము ఇచ్చిన దత్త పదిని ; దానిని పూరించడానికి చేసిన నా ప్రయత్న ఫలమును మీ ముందుంచుతున్నాను. 
ముందుగా వారి లేఖను చూడండి. 
ఆచార్యా!
అంశం:- దత్త పది 
ఇడ్లీ,      పూరీ,      ఉప్మా,      కాఫీ,
ఈ పదాలాతో, ముంబయి మారణ కాండని, గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ, మత్తేభంలో పద్యం చెప్పాలి
ఈ సమస్య అడగదగినదేనా? ఒక వేళ అయినచో మీరు పూరించగలరా? నేను ఏవో చిన్న చిన్న కంద పద్యాలు వ్రాయగలను గానీ, వృత్తాలు కష్టం. దయచేసి సహాయము జేయఁ గలరు.  ఒకవేళ ఇది కష్టతరమైనచో, కొన్ని మార్పులు చేసి, పద్యమునందించగలరు. 
This mattebhamu, does not permit the avadhani to use any of these words to begin the poem as all of them start with a guruvu and to my knowledge, there are no words that star with డ్లీ and ప్మా.
So, it will be interesting to see how the avadhani can crack this?
Any thought? Please let me know at your earliest. I am consulting some people to see if this is possible.
కృతజ్ఞలతో,
ధవళ సోమశేఖర్.
శారదాంబ నా చేత చేయించిన పూరణ గమనింప మనవి.
మll 
కసభుక్కీల దురంత నక్ర మిచటన్ "కాల్చుండిదిడ్లీ యనన్"
ముసుగుల్ దాలిచి పట్టె మమ్ము గనుడీ! పూరీ జగన్నాయకా!
ఉసురుల్ తీయగ నుండె కావు డిలలో ఉప్మాక దేవా మమున్!
విషమంబియ్యది. ఇట్టి చిన్న పనికా ఫిర్యాదటం చెంచకన్!
(ఇక్కడ నా మనోగతమును మీకు కొంచెం వివరిస్తున్నాను.  కాల్చుండు + ఇది + ఈ + ఢిల్లీ + అనన్ > కల్చుండిది +ఇడ్డిల్లీ + అనన్ >  కాల్చుండిదిడ్లీ యనన్ = ఇదే ఢిల్లీ; కాల్చేయండి అని సందేశమివ్వగానే)
భావము:-
టెఱ్ఱరిష్టులు వేసే గడ్డి తినే కసబ్ అనెడి పేరు గల అగ్ని జ్వాల యనెడి మొసలి ఇక్కడ " ఇది ఈ ధిల్లీయే; కాల్చుఁడు " అని పలుకగానే చెలరేగిన పొగ యనెడి ముసుగులు ధరించి మమ్ము పట్టుకొనెను. ఓ పూరీ జగన్నాయకా! ఓ ఉప్మాక వెంకటేశ్వరా! ఇది చూడండి. మాప్రాణములు తీయుటకు సిద్ధముగా నుండెను. ఇది మాకు మిక్కిలి విషమ మయిన సమయము. " ఇటువంటి చిన్న పనికేనా ఇలా ఈ మానవకుంజరములు పిర్యాదు చేయుచున్నవి " అని మాత్రము భావించక భూలోకములో మమ్ములను కాపాడండి.
ఇదండీ నామెదడుకు తోచిన ముంబాయ్ కాల్పుల గజేంద్ర మోక్షం. ఇది గొప్పగా ఉందని నేననుకోను. ఆ విషయంలో లోపాలోపాలను సూచించే పాఠకులే నా కవితకు మెఱుగులు దిద్దే నిపుణులు.  
ఏది యేమైనా సరే ఒకటి యదార్థమండి నావిషయంలో. ఆశారదామాత కనికరించిందా. పద్య రచన ; పూరణ; పెద్ద పనికాదు. ఆమె కటాక్షమే లేకుంటే చాలా చిన్న పదమైనా;  తప్పే వ్రాయడం జరుగుతుంది. అంతా ఆ సరస్వతీదేవి కటాక్షం చేతనేనండీ యీ జరుగుతున్న దంతా.
ఇక మీరూ ప్రయత్నించారంటే ఈమాత్రం పద్యం రచించ లేకపోతారా! ఇంతకన్నా అద్భుతంగా పూరించ గలరని నా ప్రగాఢ విశ్వాసం. నా నమ్మకం ఒమ్ము కాదని నా విశ్వాసం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ప్రయత్నించండి. మీ పూరణలను కామెంట్ ద్వారా అందఁ జేయమని నా మనవి.
జైశ్రీరామ్.
జైహింద్.

25, జులై 2010, ఆదివారం

వల్లభ వజ్ఝల వారి చ"తురంగ" గతి (చదరంగ) బంధ సర్వ లఘు కందము.

3 comments

జైశ్రీరాం
ప్రియ సాహితీ బంధువులారా!
బ్రహ్మశ్రీ వల్లభవఝల ఆప్పల నరసింహముర్తి, జుత్తాడ.విశాఖపట్టణం జిల్లా.
 రచించిన చ"తురంగ" గతి బంధ సర్వ లఘు కందము మీ ముందుంచుతున్నాను. ఈ మహానుభావులు. నేను వ్రాస్తున్న చిత్ర , బంధ కవితల కాకర్షితులై తానూ స్వయంగా వ్రాసి నాకు పంపియున్నారు. నేను వ్రాసినవి ఆదర్శంగా తీసుకొని మిగిలినవారూ అలా వ్రాయ గలగాలని  నేనాశించినవిధంగా ఈ కవి ఈ విధంగా వ్రాయడం నాకెంతో ఆనందం కలిగించింది.
ఇప్పుడా పద్యం చూడండి.
చూచారు కదండి. ఎంతో శ్రద్ధతో; ఎంతో ఆసక్తితో బంధ కవిత్వాన్ని సహితం సాధన చేసి; అద్భుతమైన పద్యం వ్రాసారు. 
ప్రయత్నిస్తే మీరు మాత్రం వ్రాయలేరా యేమి? తప్పక ప్రయత్నించండి.
బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవిగారికి నా అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

వ్యాస పూర్ణిమ సందర్భంగా గురు దేవులకు వందనములు.

3 comments

[Vyasa.jpg]

శ్లోll
వ్యాసమ్ ; వశిష్ఠ నప్తారమ్; శక్తేః పౌత్రమకల్మషమ్;
పరాశరాత్మజమ్ వందే శుకతాతమ్  తపోనిధిమ్.
గీll
మునివరేణ్య వశిష్ఠుని మునిమనుఁడును.
శక్తి పౌత్రుండు నకళంక భక్తి యుతుఁడు;
వర పరాశరాత్మజుఁడును; ధర శుకునకు
తండ్రి; యగువ్యాస గురువును తలతు భక్తి.
భావము:-
వశిష్ఠుని ముని మనుమఁడును; శక్తి మహర్షి  యొక్క పౌత్రుఁడును; నిష్కల్మషుఁడును;  పరాశర ముని కుమారుఁడును; శుక మహర్షికి తండ్రియును; తపోనిధియును;  అగు ఆది గురువయిన వ్యాస భగవానులవారికి నమస్కరింతును. 
వ్యాస పౌర్ణిమ సందర్భంగా గురు దేవులకు వందనములు.
జై శ్రీరామ్. 
జైహింద్.

24, జులై 2010, శనివారం

శ్రీ చక్ర బంధ తేట గీతము 2

3 comments

శ్రీ చక్ర బంధ తేట గీతము.
వనజ నాభుఁడ! శ్రీయుత! భావ్యమౌన? 
లఁక్ష్మిఁ గలిగియు శ్రీఁ గొల్ప రాదె? యే ది. 
యు మన నీకున్న శ్రీశుండ! యుందు నేడ?
జేయున్నంది వా దేవ!
భావము:-
ఓ పద్మ నాభుఁడా! లక్ష్మీ సమేతుఁడా!నీకిది భావ్యమగునా?
నీవు లక్ష్మిని కలిగి యుండియు మాకు ధనమును కలుగునట్లు చేయరాదా?ఓ లక్శ్మీపతీ! నేను (ఏదియు; మనన్ + ఈకున్న ) మనుట కొఱకు ఏదియూ నీ వీయనిచో నేనెందుండువాఁడను? ఓ దేవా! వీధిలో గల నన్ను అందుకొని వరలునట్లు చేయుము. (నాకు"వలయునది+ఇడవ?"= "వలయునదిడవ(వా)?" = నాకు కావలసినది నీవు ఈయవా యేమి? తప్పక ఇమ్ము అని భావము).ఈ చివరిది వివిధ పద గోపనము అనెడి బంధ కవిత.
సాహితీ ప్రియులారా! వందనములు.
శ్రీ చక్రమును ఇంకా పెద్దదిదా చూడాలనుకొంటే ఆ చక్రంపై మౌస్ తో ఏరో మార్కు ఉంచి లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఆంధ్రామృతాన్ని ఆరగిస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు.
దయ చేసి మీరు కూడా సముత్తేజితులై వినూతన ప్రక్రియలో రచన చేసి పంపగలందులకు మనవి. అవి ఆంధ్రామృతం ద్వారా పాఠకుల కందించే ప్రయత్నం చేయగలను.
జై శ్రీరామ్,
జైహింద్. 

22, జులై 2010, గురువారం

చక్ర బంధ తేట గీతము.

10 comments


చక్ర బంధ తేట గీతము.
సభల లోపల నన్ గాంచు సౌమ్య! భావి
లఘుత మాపి; మనన్ జేయు రమ్య ధీశ !
క్షితిని నీ వాఁడ! ; నన్ దేల్చు శ్రీ సుధామ!
సకల సాక్షివి విశ్వేశ! సామ భాస!
భావము:-
మంచి మాటలలో ప్రకాశించు వాఁడా! ఓ లోకేశ్వరా! పండిత సభలలో నన్ను కరుణతో చూచెడి ఓ సౌమ్య స్వభావుఁడా!భవిష్యత్తులో తక్కువ తనము లేకుండా చేసి; నన్ను మనునట్లుగా చేసెడి ఓ రమ్యమైన జ్ఞాన మూర్తివైన ఓ ప్రభూ! భూమిపై నేను నీ వాడను సుమా! ఓ మంచికి నిలయమైన వాఁడా! నన్ను ఈ సంసార బంధనములనుండి తేల్చి; రక్షింపుము. 
జై శ్రీరామ్.
జైహింద్.

21, జులై 2010, బుధవారం

చ"తురంగ" గతి (చదరంగ) బంధ సర్వ లఘు కందము ౩.

5 comments


చ‘తురంగ’గతి బంధ కందము:-
సుమధుర  కవితల చతుర ప
దము లురు తురగ గతిఁ దనరి; తగ మునుగ పడున్.
భ్రమ పడ నిడుపుగ  చెలగిన 
యిమడవు. విని; దిగులు గొనక యెఱుగుడు రచనల్.
భావము:-
మంచి మధురమైన కవిత్వములలో  చతురమైన పదములు గొప్ప చతురంగమున తురంగ గమనముతో నొప్పి; తగిన రీతిలో ముందుగానే ప్రయోగింపఁ బడును. భ్రాంతి గొలిపే విధముగా హ్రస్వాక్షరములు పదమునకు నాలుగు కంటే ఎక్కువగా పెరిగి శబ్దించినచో యీ చతురంగ గతిని యిమడవు సుమా!  ఈ విషయమునాలకించి; దిగులు పడక రచించు విధానమును తెలుసుకొనుడు.(రచింపుడు)

సు  మ  ధు   ర     క      వి     త     ల 
చ    తు  ర     ప    ద     ము  లు   రు 
తు  ర    గ     గ     తిఁ    ద     న     రి; 
త      ము   ను    గ     ప    డు    న్.
భ్ర   మ   ప    డ     ని     డు   పు    గ  
చె    ల    గి    న;    యి   మ   డ    వు.
వి   ని;   ది    గు    లు     గొ   న     క
యె ఱు  గు   డు    ర      చ    న     ల్

ఆ శారదాంబ నుపాసించే సుజన మనో రంజకులగు మీరు  కూడా చతురంగ బంధ ఛందములో పద్య రచన కుపక్రమింప గలందులకు ఆశించు చున్నాను.  నా ఆశ వమ్ము కాదని నా నమ్మకము.
జై శ్రీరామ్.
జైహింద్.

19, జులై 2010, సోమవారం

చాలా ఆశ్చర్యకరంగా నిజమైన శ్రీ వల్లభవజ్ఝల వారు చెప్పిన జ్యోతిష్యం.

11 comments

ప్రియ పాఠకులారా! 
ఈ రోజు మీకు ఒక నమ్మ లేని నిజాన్ని నేను చెప్ప బోతున్నాను. అదేంటంటారా! ఖంగారు పడకండి; చెప్తాను.
ఈ పై చిత్రంలో మీరు చూస్తున్న; సన్మానింప బడుతున్న వ్యక్తి అతి సామాన్యంగా అందరికీ కనిపించే గొప్ప మేధావి. వీరి పేరు శ్రీ వల్లభవజ్ఝల నరసింహ మూర్తి. రిటైర్డ్ టీచరు. వీరి నివాసం విశాఖ పట్టణం జిల్లా; చోడవరం మండలం; జుత్తాడ అనే ఒక పక్కా పల్లెటూరు. ప్రస్తుతం వీరు తమ గ్రామంలో గల నిరు పేద శివాలయంలో అర్చనలు భక్తుల కొఱకు చేస్తూ ఆ ప్రజాసేవలో పునీత జీవితం గడుపుతున్న పవిత్ర మూర్తి. అంతే కాదు వీరు సామాన్యులుగా పైకి కనిపించే అసామాన్యులు. మంచి కవి. అలవోకగా ఆశువుగా పద్యం చెప్పగల దిట్ట. అనేక శతకాలు వ్రాసి ఆ పుట్టపర్తి సాయిబాబాయొక్క ప్రశంసలే అందుకొనిన మహా మనీషి.
ఇంత వరకూ ఇదంతా అందరి దృష్టిలోను సామాన్య విషయమే  ఐ ఉండ వచ్చు.
అసలు ప్రత్యేకమైన విషయం నేను చెప్ప దలచుకొన్నది చెప్పుతున్నాను వినండి. 
వీరు నాకు సాహితీ మిత్రులు. నాపై గల అవ్యాజమైన ప్రేమతో చోడవరంలో మాయింటికి తరచూ వస్తూ ఉండేవారు. ఏవో సాహిత్య పరమైన చర్చ మా మధ్య సాగుతూ ఉండేది. ప్రసంగ వశాత్తు మా అబ్బాయికి (ఇప్పుడు కాదు; ముందటేడు సుమండీ)వివాహ ప్రయత్నంలో మేము ఉన్న సంగతి గ్రహించిన శ్రీ వల్లభవజ్ఝల నరసింహ మూర్తి గారు మా అబ్బాయి పుట్టిన తేదీ; పుట్టిన ప్రదేశము అడిగి తీసుకొని; అక్కడే  కూర్చొని; ఒక్క పది నిమిషాల సేపు ఏవో లెక్ఖలు వేసి; మా అబ్బాయి దశను; అంతర్దశను చూచి; ఈ మీ అబ్బాయికి 2009 అక్టోబరు 28 వ తేదీన వివాహమౌతుందని ఆలెక్ఖ కట్టిన కాగితం మీదే వ్రాసి నాకు ఆవిషయాన్ని చెప్పారు. ఐతే వారి మాటలు విన్న నేను  ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకో లేదు.
ఏవో సంబంధాలు వచ్చేవి; ఏదో కారణంగా తప్పేవి.
మేమైతే ఆ సంవత్సరం ఈ వివాహ ప్రయత్నం విరమిద్దామనే నిర్ణయానికి వచ్చేసాము. నేను రిటైరైపోయిన కారణంగా మా అబ్బాయి దగ్గరకి హైదరాబాదుకు మకాం మార్చాము. ఐతే  మూడు సంవత్సరాల క్రితమే వచ్చిన  సంబంధమే మేం హైదరాబాదు వచ్చినట్టుగా తెలుసుకొని మాయింటికి వచ్చి;   మేమిదివరకు రమ్మన్నాం. మీరు దూరంగా ఉన్న కారణంగా రాలేకపోయారు. ఇప్పుడు మీరున్న యింటికి దగ్గరే మాయిల్లు. మీతో సంబంధం కలుపుకోదలిచాం. తప్పక మాయింటికి వచ్చి చూడండి అని ఒక పెళ్ళివారు ఆహ్వానించారు. సరే ఇంటికొచ్చి పిలిచారు. వెళ్ళడం మర్యాద. అనుకొని వెళ్ళాము. ఆ దైవ సంకల్పం కారణంగా ఆ సంబంధం ఖాయ పడింది.  కొన్ని ఆటంకాలేవో అడ్డొస్తాయనే కారణంగా  సెప్టెంబరు నెలలో మానివేసి తేదీ 01-11-2009 ని వివాహం చేద్దామని నిర్ణయించాము.
ఐతే కొందరు సిద్ధాంతులు ఏవో సరిగా నప్ప లేదంటూ 
30-10-2009 కి మార్చారు. మా తమ్ముడు ఆముహూర్తం చూసి అంతకంటే 28-10-2009. చాలా బాగుందని చెప్పడంతో అదే ఖాయ పరచక తప్ప లేదు. ఆ దైవ కృప వల్ల  28-10-2009 వ తేదీనే అనుకున్న విధంగా జరిగింది..
ఇక్కడే మీకు నేను చెప్పదలచుకొన్న విషయం ఉంది.
నిన్నను ఏ దో కాగితం కోసం పుస్తకాలు తిరగేస్తూ ఉంటే నా మిత్రులు శ్రీ వల్లభవజ్ఝల నరసింహమూర్తిగారు స్వయముగా వ్రాసి చోడవరంలో నాకిచ్చిన కాగితం కనిపించింది. అది చదివాను. ఇంకేముంది వారు ఏ తేదీనైతే వివాహం మా అబ్బాయికి ఔతుందని వ్రాసేరో సరిగ్గా అదే తేదీన జరిగిందనే విషయం ఇప్పుడు గ్రహించి చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను.
ఆ కాగితాన్ని నేనిప్పుడు గుర్తించి భద్రపరిచాను.
చూచారా! ఎంత వింతో? అతి సామాన్యంగా కనిపించే శ్రీ వఝల నరసింహ మూర్తిగారు చెప్పిన తేదీకే వివాహం జరగడం నిజంగా చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందిప్పటికీ కూడా. 
నే నెంత ప్రయత్నించి 01-11-2009 వ తేదీని జరిపిద్దా మనుకున్నా గాని; రక రకాలుగా తిరిగి తిరిగి ఏ ముహూర్తాన వివాహమౌతుందని శ్రీ వల్లభవజ్ఝల నరసింహమూర్తిగారు కాగితంపై వ్రాసి యిచ్చారో ఆ తేదీకే ఖాయమై; జరిగింది. అది మేం భయపడిన ఆటంకం తేదీ . ఐనా కాని ఏ ఆటంకమూ లేకుండా చాలా హృదయాహ్లాదకరంగా జరిగింది. 
ఏంటండీ వింత? ఆ సిద్ధాంతి గారు కళ్ళతో జరగబోయేది చూసినట్టు ఎలా వ్రాయ గలిగారు? ఇప్పటికీ నాకు దీని అంతు చిక్కటం లేదు. వారికి ఫోన్ చేసి విషయం చెప్పితే ఆ దైవం వ్రాసిందే  నేను లెక్ఖ కట్టి చెప్పాను. అదే జరగడంలో ఆశ్చర్యమేముంది? అంటూ ఇది సర్వ  సామాన్యమే అన్నట్టుగా మాటాడారు.
కొందరు జాతకాలు లేవు; అన్నీ మన మూఢనమ్మకమే అంటూంటారు. నేనైతే పెద్దగా పట్టించుకోను. ఐనా చెప్పింది చెప్పినట్టూ మన నిర్ణయాన్ని కూడా మార్చేసి జరగడంలో గల కారణం ఏంటంటారు?
మీరు నమ్మరా? నమ్మ మని నేనెప్పుడూ ఎవరికీ చెప్పను. ఐతే జరిగిన యదార్థాన్ని చెప్పడానికి కూడా వెనుకాడను. అందుకే ఈ విషయం చెప్పాను.
మీకు ఈ మహనీయునితో మాటాడాలని ఉంటే  ఈ టపాలో వ్యాఖ్య ద్వారా తెలియ జేస్తే మీకు వారి వివరములు తెలియ జేయగలను.
నమస్తే.
జైహింద్. 

18, జులై 2010, ఆదివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 100.

6 comments


శ్లో:
బ్రహ్మ నిష్ఠో గృహస్థః స్యాత్; బ్రహ్మ జ్ఞాన పరాయణః
యద్యత్ కర్మ ప్రకుర్వంతి తద్బ్రహ్మణి సమర్పయేత్.
తే.గీ.
బ్రహ్మ నిష్ఠయు; జ్ఞానము; భక్తియు; మది
కలిగి యుండి; గృహస్థుఁడు కర్మములను
చేయ వలయును. అతఁడవి చేయు చుండి;
ఫలము కృష్ణార్పణము చేయ వలయు సతము. 
భావము:-
గృహస్థు బ్రహ్మ జ్ఞాన పరాయణుఁడై; బ్రహ్మ నిష్ఠుఁడై; ఈశ్వరార్పన బుద్ధితోనే సర్వ కర్మలను చేస్తూ ఉండ వలెను.



ఈ క్రింది శ్లోకము మేలిమి బంగారం మన సంస్కృతి 96 గా వ్రాయఁ బడినది. మరల నిచట పునరుక్తమైనది.

శ్లోll
భీతేభ్యశ్చాభయం దేయం. వ్యాధితేభ్యస్తథౌషధం.
దేయ విద్యార్థినాం విద్యా. దేయమన్నం క్షుథార్తినాం
తే.గీll
భీతునకు గొల్పుమభయంబు ప్రీతి తోడ.
వ్యాధికౌషధ మిడుమయ్య! భక్తి తోడ.
విద్య కోరిన గరపుమా హృద్యముగను;
ఆకలన్నట్టి వారికినన్న మిడుము.
భావము:-
భయము చెందిన వానికభయ దానము; రోగ పీడితులకు ఔషధ దానము; విద్యార్థులకు విద్యా దానము; ఆకొన్న వారికి అన్న దానము చేయుట ఉచితము.
జైహింద్.

17, జులై 2010, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 99.

2 comments

మృత్యువు అమృతము మనలోనే ఉంటాయి.
See full size image
శ్లోll
అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం
మృత్యురాపద్యతే మోహాత్ సత్యేనాపద్యతేzమృతం.
తే.గీll
నిత్యమమృ తము మృత్యువు నిశ్చితముగ
దేహమున నుండు దేహికి. దేహికుండు
మోహమునమృత్యువబ్బును.మోహి కాక
సత్యదర్శికి యమృతంబు సంభవించు.
భావము:-
అమృతము మృత్యువు అనే రెండూ దేహమునందే కలవు. మోహము కారణముగా మృత్యువును సత్య దర్శనము కారణముగా అమృతమును మానవులు పొంద గలరు.
జైహింద్.

15, జులై 2010, గురువారం

జయ రామ స్తోత్రము.( అధ్యాత్మ రామాయణము నుండి )

7 comments

శ్రీ నేమాని రామ జోగి  సన్యాసి రావు అత్యాధునిక ఆంధ్ర మహాకవిగా నెల్లరి మన్ననలందఁ దగిన కవితా సామర్ధ్య సంపన్నులు. 
వీరు ప్రస్తుతము విశాఖపట్టణ నివాసి. వీరు ఈ మధ్యనే రచించిన "అధ్యాత్మ రామాయణము" అను పద్య కావ్యము నేటి ఆంధ్ర భాషాభిమానులకు అవశ్య పఠనీయ గ్రంథము.   
వీరు చేసిన జయ రామ స్తోత్రము అను  రామ స్తుతి లో కేవలము ఎనిమిది చిన్న చిన్న పద్యములలో కాండల వారీగా శ్రీరాముని వృత్తమును అత్యంత  నైపుణ్యముతో రచించి; అధ్యాత్మ రామాయణమును సంగ్రహముగా  తెలియఁ జేసిరి. ఈ ఎనిమిది పద్యములు పఠించినంత మాత్రమున శ్రీమద్రామాయణము పారాయణము చేసిన ఫలితము తప్పక కలుగునన్నట్లున్నవి. ఇంత నిపుణత కనబరచిన ఆధునిక కవి పుంగవులైన శ్రీ సన్యాసిరావు గారి ఈ రచన భక్తుల కందరికీ ఎంతో ప్రయోజన కరముగ నుండు ననుటలో ఏ మాత్రము సందేహము లేదు. 
ఈ గ్రంథము ఆవిష్కరణము అమెరికాలో శ్రీరామ చంద్రుని దేవాలయమున ప్రముఖుల సమక్షంలో జరిగినప్పటికీ ప్రతులు అందరికీ అందుబాటుకు రావడానికింకొంత సమయం పట్ట వచ్చును.
ఆ జయరామ స్తోత్రము మీరూ పఠించేటందులకందుబాటుగా మన ఆంధ్రామృతంలో ప్రచురించితిని. చూడ గలందులకు మనవి.
బాల కాండ.
పుడమి భరము బాపు పురుషోత్తమా! దేవ!
యజ్ఞ రక్షకా! మహర్షి  వినుత!
క్షత్రవార్ధి  సోమ! కల్యాణ గుణ ధామ!
జనకజాభిరామ! జయము రామ!
అయోధ్యా కాండ.
విపినములకు నేగి పిత్రాజ్ఞ పాలించి;
భ్రాతృ వినతి కొలది పాదుకలిడి;
మునుల వలె చెలగిన యిన వంశ శేఖరా!
జనకజాభిరామ! జయము రామ!
అరణ్య కాండ.
అసుర తతులనెల్ల నంతమొందించుచు
అఖిల ముని జనముల కండ వగుచు
నపహరింపఁ బడిన యవనిజకై పొక్కు
జనకజాభిరామ! జయము రామ!
కిష్కింధా కాండ.
వాలిని బరిమార్చి వాని తమ్ముని బ్రోచి
కపుల సాయ మంది క్ష్మా తనయను
వెతుక బట్టినట్టి విశ్వ నటాధిపా!
జనకజాభిరామ! జయము రామ!
సుందర కాండ.
అంజనా తనయున కంగుళీయకమిడి
ఆశిషములనిచ్చి యనిపి వాని
వలన సీత యునికి వార్త నెఱింగిన
జనకజాభిరామ! జయము రామ!
యుద్ధ కాండ.
వారిధి పయి యొక్క వారధి నిర్మించి
పంక్తి ముఖు వధించి వాని యనుజు
బ్రోచి; జనక సుతను బొందిన జయ రామ!
జనకజాభిరామ! జయము రామ!
ఉత్తర కాండ.
చేరుకొని యయోధ్య క్షితి నేలినాడవు.
శాంతి సుఖములు గని; జను లలరగ.
రామ రాజ్యమవని రాజిల్ల స్థిరముగా.
నకజాభిరామ! జయము రామ!
తత్వ సంగ్రహము.
సకల లోకములకు సంతతాధారమై
బయట లోన నుండు పరమ పురుష!
ఆత్మ వీవు సచ్చిదానంద మూర్తివి.
జనకజాభిరామ! జయము రామ!
చూచారు కదండీ! సంతోషం.
వారితో మాటాడాలని మీకుందా? ఐతే ఆలస్యమెందుకు? 
ఇదిగో వారి ఫోన్ నెంబరు.  08912565944.
ఆ మహా కవి మిత్రులకు ఆంధ్రామృతం తరపున  అభినందన పూర్వక ధన్యవాదములు తెలియఁ జేస్తున్నాను.
జై శ్రీరాం 
జైహింద్.

14, జులై 2010, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 98.

1 comments

శ్లోll
సతాం ధనం సాధుభిరేవ భుజ్యతే; 
దురాత్మభిర్దుశ్చరితాత్మనాం ధనం 
శుకాదయః చూతఫలాని భుంజతే. 
భవంతి నింబాః ఖలు కాక భోజనాః.
తే.గీll
మంచిగలవారి సంపద మంచి వారి;
చెడ్డ గలవారి సంపద చెడ్డ వారి;
యనుభవంబగు. చిలుకకు నమర ఫలము
కాకికిని నింబ ఫలమును; గలుగు తినగ.
భావము:
మంచి వారి సంపదలు మంచి వారికే అనుభవానికి వస్తాయి. దురాత్ముల ధనములు దుష్ట చరిత్రులకే వినియోగ పడుతాయి. మామిడి పండ్లు చిలుకలకే భుక్తం అవతాయి. వేప పండ్లు కాకులకే భుక్తం అవతాయి. ఇది లోకంలో జరుగుతున్నదే కదా!
మనము మంచి మార్గమున సంపాదించిన సొమ్ము అనుభవించే మన వారు కూడా మంచివారు గానే తీర్చి దిద్దఁ బడుదురు. చెడ్డ మార్గమున సంపాదించిన మన ధనము ననుభవించు మన కుటుంబీకులు చెడ్డగనే దిద్దఁ బడుదురు. కావున ఋజు మార్గముననే సంపాదించాలని మనము మరువ రాదు.
జైహింద్.

12, జులై 2010, సోమవారం

ఆంధ్రామృత హితులకు ప్రణతులు.

15 comments

సీll
ఆంధ్రభాషకు మించి యానంద మందించి
. . . . . . . . . హితముఁ గూర్చెడు భాష వెతక; లేదు.
ధ్రావిడ భాషల తలమానికమ్మిది. 
. . . . . . . . . తుహిన కరునివోలె మహిమ కలది. 
మృదువైన పదములు మదులనాకర్షించు.
. . . . . . . . . య యుక్త శబ్ద నిలయ సుధాబ్ధి. 
త్వస్వరూపమహత్వమ్ముఁ జూపెడు;
. . . . . . . . . కుముదినీ పతి మెచ్చు ప్రముఖ భాష.
తే.గీ.ll
ప్రథిత కవివరు లీభాష ప్రాణమగు ప్ర 
వ మని పొగడు. విద్వజ్జన వరు లెన్ను.
తుదయె లేనట్టి యానంద మధువు నొసగు.
లుబ్ధ కవియైనఁ బొగిడెడు శబ్ద కలిత.
భావము:-
ఆంధ్ర భాష కంటే అధికమగు ఆనందమును; క్షేమమును కలిగించెడి భాష ఎంత వెతకినను మరి యొకటి కానరాదు. ఈ మన ఆంధ్ర భాష ద్రావిడ భాషలకే తలమానికము. చంద్రునివలె సహజ మ‘హిమా’న్వితమైన భాష. ఈ ఆంధ్ర భాష యందుగల మృదువైన పద సంపద పఠితల; శ్రోతల హృదయములను ఆకర్షించును. లయాన్వితమైన శబ్దములకు స్థానమైన అమృత సాగరమీ భాష. ఆత్మ స్వరూపమునకు గల గొప్పఁ దనమును చూపగలిగిన భాష మన యాంధ్రము. ఆ శ్రీమన్నారాయణుఁడే ప్రశంసించెడి ప్రముఖమైన భాష యిది. ప్రఖ్యాతులైన కవీశ్వరులు ఈ మన యాంధ్ర భాషను జీవ కోటిలో ప్రాణమై యొప్పెడి ప్రణవ స్వరూపమగు ఓంకార నాదముగా పొగడుదురు. పండిత శ్రేష్టులు ఈ మన యాంధ్రమును ప్రత్యేకించి గుర్తింతురు. అంతే లేని ఆనందమనెడి అమృతమునొసగు భాష మన యాంధ్రము. ఆది కవి వాల్వీకియైనను పొగడే విధముగ నుండెడు చక్కని శబ్ద సముదాయము కలది మన అమృతోపమానమైన యాంధ్ర భాష.
మిత్రులారా! 
ఈ పద్యమున మీ కేదైనా ప్రత్యేకత గోచర మగు చున్నదా? శొధించి చూడుడు.
జైశ్రీరాం.
జైహింద్.

11, జులై 2010, ఆదివారం

శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి కృతజ్ఞతాభివందనములు.

0 comments



శ్రీమదాంధ్రామృతమును గ్రోల నేర్చిన సహృదయులు పరమానంద సంభరితహృదయులై నిత్య నూతనోత్తేజ భాసుర ముఖు లగుదురన్న నగ్న సత్యమును అనుభవ పూర్వకముగా గ్రహించిన నేను;  ఆంధ్ర భాషాభిమానులకు నేను పొందుతున్న ఆనందమును  పంచ వలెననెడి భావముతో " ఆంధ్రామృతం "  అనెడి బ్లాగును ఆంధ్ర భాషలో ప్రారంభించి యుంటిని.
ఇంత వరకు అనేక సాహిత్యాంశములను వివిధ రీతులలో ప్రచురించి యుంటిని. 
ముఖ్యముగా పద్య రచనా విధానమును; రచనా వైవిధ్యములను; పద్య రూపమున గల చమత్కార ప్రశ్నలను; బంధ చిత్ర కవిత్వ రీతులను; పద్య రచనలో గుణ దోష వివరణను తెలుపుటయే కాక; మహా కవుల రచనా విశేషములను;  ఆటి విషయమై కవి పండితుల ఉపన్యాస సారాంశములను వ్రాసి యుంటిని. అందు ముఖ్యముగా కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్య నారయణ గారి రామాయణ కల్ప వృక్షముపై  కవి వతంస బిరుదాంకితులగు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు చేసిన పరిశోధనాత్మక ఉపన్యాసములను "కవి సమ్రాట్ విశ్వనాథ భావుకత" అనే శీర్షికతోసుమారు 50 వ్యాసాలుగా ప్రచురించి యుంటిని.
చ:- 
కవియును పండితుండునయి కావ్య విశిషిష్టత గాంచ నేర్చు స
ద్భవునకు సాధ్యమైన పని భవ్యుల భావుకతల్ గణించుటల్.
పవలును రేయి  భావుకత వ్రాసిరి సత్కవి విశ్వనాథ ప్రా
భవము గణించి యీ బులుసు వంశ మహోద్భవ వేంకటేశ్వరుల్.
మిత్రులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఆంధ్రామృతం ద్వారా నేను చేయుచున్న ప్రయత్నమునకు స్పందించి తమ ఉపన్యాసములనుండి " కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత " అను పేర దాదాపు ఏబది వ్యాసములను  శ్రమ దమాదుల కోర్చి; లిఖిత పూర్వకముగా నాకు నిరంతరాయముగా పంపియున్నందున నేను ఆయా వ్యాసములను ఆంధ్రామృత పాఠకులకు అదించి తద్వారా వారి ప్రశంసలకు పాత్రుఁడనైతిని. ప్రపంచ వ్యాప్తముగానున్న ఆంధ్రుల కందుబాటులో నున్న ఈ వ్యాసములను అనేకులగు ఆంధ్రామృతాభిమానులు పఠించి అమిత కావ్యానంద పారవశ్యమును పొందిరి. ఈ విధముగ విశ్వనాథ భావుకతను పరిశీలనాత్మక వ్యాసములుగా నాకందఁ జేసిన కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి నామనః పూర్వక ధన్యవాదములు ఆంధ్రామృతం తరపున తెలియఁ జేసుకొను చున్నాను.
ఇట్టి సాహిత్య కృషి నిరంతరాయముగా చేస్తూ ఇంకా మధురాతి మధురమైన అనేకులైన మహ కవుల కావ్యాలలో నిబిడీ కృతమైయున్న వారి భావ వైశిష్ఠ్యములను; కవితా వైవిధ్యములను; తమ ఆలోచనల ద్వారా వెలికి తీసి ఉపన్యాసాలుగా ఆంధ్ర ప్రజానీకమునకందించుటయే కాక ; ఆయా వ్యాసములను మన ఆంధ్రామృతం ద్వారా పాఠకాళికి అందించెడి అవకాశము కల్పించ గలరని ఆశించు చుంటిని.
-:చ`తురంగ'గతి బంధ కందము:-
సొగసులు తెలుపగను బులుసు 
తగును వసుధను. ఘనులును; నుత జనములు కనన్ 

దగు హితములు;  మునుల తతులు 

తగ భరత కులజుఁడని శుభ తతి నిడు కవికిన్. 
సొ  గ   సు  లు   తె    లు   ప      గ 
ను బు లు  సు   త     గు  ను      
సు   ను.  ఘ  ను    లు  ను;   ను 
 .   న    ము లు               న్
ద   గు హి   త    ము  లు ము   ను
ల   త  తు  లు   త     గ      భ     
   కు ల  జుఁ   డ     ని    శు     
త   తి   ని    డు   క     వి     కి     న్. 
స్వస్త్యస్తు.
జై శ్రీరాం. 
జైహింద్.
చింతా రామ కృష్ణా రావు.
తే.౦౮ - ౭ - ౨౦౧౦.
(ఆంధ్రామృతం బ్లాగరు)
చోడవరం.
http://andhraamrutham.blogspot.com
Cell No. 9247272960.