జైశ్రీరామ్.
శ్రీ లలితా సహస్రనామాంచిత పద్యసహస్రదళపద్మార్చన.
రచన. చింతా రామకృష్ణారావు.
శ్లో. శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ,
చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా. ॥ 1 ॥
1. ఓం శ్రీమాత్రే నమః.
నామ వివరణ.
సృష్టి మొత్తమునకే మంగళప్రదమయిన జనని శ్రీమాత మన అమ్మ లలితాంబయే.
శ్రీ మాత మాతృవాత్సల్యమే రూపముగా కలది. సర్వ మంగళప్రద కావున శ్రీమాత అయినది. సృష్టి
స్థితి లయలకు మూలమైన తల్లి. శ్రీమాత వేదత్రయ స్వరూపిణి. అట్టిశ్రీమాతకు నమస్కారము.
శా. శ్రీమన్మంగళ దేవతా! శుభతతిన్ శీఘ్రంబుగా గొల్పుమా,
*శ్రీమాతా!* వర భాగ్య దాత!, దయతోఁ జేకొమ్మ నీ భక్తులన్,
బ్రేమోద్భాస ముఖప్రదీప్త జననీ! విజ్ఞాన సంవర్ధినీ!
నీమంబొప్పగ నిన్నుఁ గొల్తును సదా నీ సత్ కృపన్ బ్రోవుమా.
2. ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః.
నామ వివరణ.
మంగళప్రదముగా లోకములనేలెడి జనని మన *శ్రీ మహారాజ్ఞి* లలితాంబ.
ఈ చరాచర జగత్తులో ప్రాణి కోటికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కర్మానుసారం
భవిష్యజ్జన్మల్నిచ్చుచు లోకాలను పాలించు మంగళప్రదయైన మహారాజ్ఞి.
తే.గీ. ప్రాణులను గాచు *శ్రీమహారాజ్ఞి*! మాదు
జ్ఞాన సంపత్తియే నిన్నుఁ గనగఁ జేయు,
కలుగఁ జేయుము మాకది కనగ నిన్ను,
వందనము లందుకొనుమమ్మ భక్త సులభ!
3. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.
నామ వివరణ.
మంగళప్రదమయిన సింహాసనమును అధిష్టించు జనని మన శ్రీమత్సింహాసనేశ్వరిఅయిన
లలితాంబ.
త్రిపుర సుందరియైన లలితాంబ పంచసింహాసనాసీన. పంచప్రణవాసనములు, పంచ
కలాసనములు, పంచ దిగాసనములు, పంచ భూతాసనములు, పంచ ముఖాసనములు
అధిష్టించియుండునది. కావున శ్రీమత్ సింహాసనేశ్వరి.
కం. శ్రీమత్ పంచ దిగాసన!
ధీమంతులుగా జనులను దీర్చుము తల్లీ!
ప్రేమన్ మము గరుణించెడి
*శ్రీమత్ సింహాసనేశ్వరీ!* వందనముల్.
4. ఓం చిదగ్నికుండ సంభూతాయైనమః.
నామ వివరణ.
జ్ఞానమనెడి అగ్నికుండమునుండి ప్రభవించిన తల్లి ఈ జగన్మాత.
చిత్ అనగా జ్ఞానము జ్ఞానమనెడి అగ్ని చిదగ్ని, రూపక సమాసము. జ్ఞానమనెడి అగ్ని కుండము
నుండి పుట్టునది. అవిద్య, అజ్ఞానము మున్నగువాటిని తొలగించు శక్తియే చిదగ్నికుండ సంభూత.
ఉ. మాత! చిదగ్ని సంభవ సమంచిత ధీ వర తేజ! నీవు వి
ఖ్యాతిగఁ దామసమ్మును బ్రకాశము సేత నశింపఁ జేసి, మా
కాతత భక్తి నిచ్చెద వనంత దయాబ్ధి! *చిదగ్నికుండ సం
భూత!* నమస్కరించెదము, బోధను గొల్పి రహింపఁ జేయుమా.
5. ఓం దేవకార్య సముద్యతాయై నమః.
నామ వివరణ.
దేవకార్యములు పూర్తిచేయుట కొఱకు ఉద్భవించిన జనని లలితాంబ.
దేవతల కార్యములు పూర్తి చేయుట కొఱకు భూలోకమున అవతరించునది.
మత్త కో. దేవకార్యము దీర్చగా గణుతింప పృథ్వి జనింతువా,
కావగా సుజనాళి నంచిత గౌరవంబును గొల్పుచున్,
జీవ కోటినిఁ గాచు తల్లివి చేర రమ్మికఁ బ్రోవ నన్
*దేవకార్య సముద్యతా!* వర దీక్షతో నిను గొల్చెదన్.
శ్లో. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా,
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్వలా. ॥ 2 ॥
6. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః.
నామ వివరణ.
ఉదయించుచున్న వేయిమంది సూర్యుల ప్రకాశమును గల తల్లి ఈ లలితాంబ.
ఉదయించుచున్న వేయిమంది సూర్యుల కాంతితో ప్రకశించునది. సహస్రారమున పతితోకూడి
ప్రకాశించు ఆ జగజ్జననిని సాధకుడు చూడగలిగినచో కనిపించు ప్రకాశమది.. బ్రహ్మాండమంతటను
వ్యాపించునట్టి తేజస్సు ఈ తల్లియే,.
కం. ముసిరిన మాయను బాపగ,
నసమంబగు కాంతివగుదు వనుపమ! కన నీ
కస లెవరీ *డుద్యద్భా
ను సహస్రాభా*? ననుం గనుమ మహిత కృపన్.
కం. మసలుదువీ*వుద్యద్భా
ను సహస్రాభా* తపోధనులటుల మేమున్
ముసిరిన మాయను వీడుచు
నసమాన నినున్ గనుగొన నాత్మల వెలుగై..
7. ఓం చతుర్బాహు సమన్వితాయై నమః.
నామ వివరణ.
నాలుగు భుజములు ఉన్న జనని మన లలితాంబ.
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు భుజములతో ప్రకాశించు జనని.
చతుర్వేదబాహుచతుష్టయముతో ప్రకాశించునది. .
ఉ. మోహ విదూర! మా దురితముల్ విడఁ బాపుమ సత్కృపన్. *చతుర్
బాహు సమన్వితా*! నతులు, భక్తుల బాధలఁ బాప నీ చతుర్
బాహువులందు గాంచగ ప్రభావమునొప్పెడి యాయుధాళి, సం
దేహములార్పు, నీ కృప మదిన్ గని పొంగుదు మమ్మ నిత్యమున్.
8. ఓం రాగ స్వరూప పాశాఢ్యాయై నమః.
నామ వివరణ.
అనురాగస్వరూప పాశముతో నిండుగా ఉన్నతల్లి లలితాంబ.
ప్రేమస్వరూపమయిన పాశము ఈ జనని ఎడమ పైచేతితో ధరించి యుండునది.
ప్రాణులలో అనురాగబంధములు కలుగ జేయుచు పుట్టుకలు కలుగ జేయునది.
సీ. రాజీవ లోచనా! *రాగ స్వరూప పా శాఢ్యా*! మదిన్ నీవు సదయ నిలువు
మనురాగ పాశంబు లలము కొనెను మదిన్ నీ పైన ధ్యాసనే నిలువ నిచ్చి,
యానందముగ నిన్ను నందరిలో కను సుందరమైనట్టి బంధమిమ్ము,
బంధమేదైనను ప్రబలఁ జేయుము కాని మన మధ్య బంధమ్ము మాపకమ్మ
తే.గీ. జీవినే నేను నీవు నా జీవమమ్మ!
రాగ పాశంబులన్ బాపి రమ్య! నీదు
నామ సాహస్రకంబును నయము తనర
పద్యములఁ నిల్పి వ్రాయనీ హృద్యముగను.
9. ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః.
నామ వివరణ.
కోపమును స్వరూపముగా కలిగిన అంకుశముతో ప్రకాశిచు తల్లి మన లలితామాత.
కుడివైపు పై చేతిలో క్రోధమనెడి అంకుశమును ధరించిన తల్లి. ప్రాణి కోటిలో అనురాగమునకు
కారణమయిన జననియే అది మితి మీరినప్పుడు క్రోధమును కలిగించు జనని.
కం. దిశవై *క్రోధాకారాం
కుశోజ్వలా!* నడుపు నన్ను కూర్మిని సతమున్,
ప్రశమన కోప వగుచు నీ
దిశగా నడిపించు మమ్మ, దిక్కగు జననీ!
శ్లో. మనోరూపేక్షు కోదండా, పంచతన్మాత్రసాయకా,
నిజారుణప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా. ॥ 3 ॥
10. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః.
నామ వివరణ.
మనో రూపమైన చెరకు విల్లును ఎడమవైపు క్రింది చేతిలో ధరించునది. ఇది క్రియాశక్తి
శా. ప్రోవంగా ననుఁ గోరుదున్ నిను *మనోరూపేక్షుకోదండ*! సం
సేవాసక్తిని నాకు గొల్పుము, నినున్ సేవింతు భక్తిన్ సదా,
భావావేశము గొల్పి సత్కవితలో వర్ణింపనిమ్మా నినున్.
శ్రీవాణీగిరిజా స్వరూపిణివి నిన్ శ్రీమాతగా కొల్చెదన్.
11. ఓం పంచతన్మాత్ర సాయకాయై నమః.
నామ వివరణ.
పంచ భూతముల సూక్ష్మ రూపములయిన శబ్ద స్పర్శ రూప రస గంధ ములు యీ పంచతన్మాత్రలే
సాయకములు..
తే.గీ. *పంచతన్మాత్ర సాయకా*! భవ్య తేజ!
పాంచభౌతిక దేహాన వాసముండి
జీవనము నీవె నడుపుదే దేవి! నీవె
ముక్తి మార్గము సూపుము భక్తిఁ గొలిపి.
12. ఓం నిజారుణ ప్రభాపూరమజ్జద్భ్రహ్మాండ మండలాయై నమః.
నామ వివరణ.
తన అరుణ కాంతులతో ముంచఁ బడిన బ్రహ్మాండ మండలములు కలది అమ్మ. ఆత్మ జ్ఞాని తనను
తాను బ్రహ్మముగా నెఱుఁగుచు తనలోననే గల బ్రహ్మాండమండలమున వ్యాపించిన అమ్మవారి
అరుణారుణ ప్రభను అత్మ శక్తితో చూడగలుఁగును. అట్టి వ్యాప్తి కలది అమ్మ.
స్వయం కల్పిత
అరుణ ప్రభాపూర్ణ వృత్తము
గణములు స జ త మ ర వ....
యతి 10 వ అక్షరము.
ప్రాసనియమము కలదు|
నిను నే కవిత్వమందున్ గణింపన్ సాధ్యంబొకో సుధా
మ! *నిజారుణ ప్రభాపూరమజ్జద్భ్రహ్మాండ మండలా*!
నిను నంతటన్ గణింతున్ మనీషాళిన్ వెల్గుచుందువే
వనితాకృతుల్ గనంగన్ భవానీ! నీవే వెలుంగుదే.
శ్లో. చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్ కచా,
కురువింద మణిశ్రేణీ, కనత్ కోటీర మండితా. ॥ 4 ॥
13. ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః.
నామ వివరణ.
సంపంగి, అశోకము, పున్నాగము, మొదలగు పూవుల వాసనలతో నలరారుచున్న కేశసంపదతో
నొప్పు జనని లలితాంబ.
స్వయం కల్పిత
పున్నాగ వృత్తము
గణములు ర ర ర భ జ గ....
యతి 9 వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
*చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా*!
చంపకంబుల్ నినుం జేరఁ జక్కంగ నిట పద్యముల్
సొంపు నీతీరునన్ గోరి చూచున్ గరుణతో సతీ!
యింపుగా సౌరభంబున్ గ్రహించన్ దగును నీవిఁకన్.
14. ఓం కురువింద మణిశ్రేణీ కనత్ కోటీరమండితాయై నమః
నామ వివరణ.
కురువిందములనుండి పుట్టిన మణులవరుసచే ప్రకాశించుచున్న కిరీటము కలది జగన్మాత..
స్వయం కల్పిత కురువింద వృత్తము.
గణములు. స స త మ జ గ..
యతి 11వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
*కురువింద మణిశ్రేణీ కనత్ కోటీరమండితా*!
తెరవేది నినున్ గొల్వన్ సుబుద్ధిన్ నీవు గొల్పమిన్?
వర సేవలు నేఁ జేయంగ సద్భక్తిన్ మనన్ వలెన్,
వర భక్తిని నాకిమ్మింక నే వర్ధిల్లగా సతీ!
శ్లో. అష్టమీ చంద్ర వుభ్రాజ, దళికస్థల శోభితా,
ముఖచంద్ర కళంకాభ, మృగనాభివిశేషకా, ॥ 5 ॥
15. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థలశోభితాయై నమః.
నామ వివరణ.
అష్టమి నాటి అర్థచంద్రాకరమయిన నొసటి ప్రదేశంతో ప్రకాశించునది జనని.
స్వయం కల్పిత అష్టమీ చంద్ర కళ వృత్తము.
గణములు. ర ర భ జ జ ర గ.
యతి 16 వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
*అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభితా*! నమస్తే,
కష్టముల్ వాపి మమ్మేలుమ పరాత్పర! మమ్ము కావుమీవే,
నిష్టతో నేను నిన్ గొల్తును శుభాస్పద! కావు నీవె నన్నున్
నష్టపోనీయ కీజన్మను గుణాలయ! కాపు నాకు నీవే .
16. ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషకాయై నమః.
నామ వివరణ.
కస్తూరీ తిలక మను మచ్చతో కూడిన విశేషమైన ముఖచంద్రయే శ్రీమాత.
స్వయం కల్పిత మృగనాభి వృత్తము.
గణములు. భ భ త స స వ. యతి 1౦ వ అక్షరము. ప్రాస నియమము కలదు.
శ్రీ *ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషకా*!
నీ ముఖ శోభయె జీవంబు నియతిన్ బ్రబలించగా
మేమిట నీదరి వర్ధిల్లమె సనాతనని! శాంభవీ!
నీ మనమందున మేముండ నిరపాయము మాకిటన్.
శ్లో. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక,
వక్త్రలక్ష్మీపరీవాహ, చలన్మీనాభలోచనా. ॥ 6 ॥
17. ఓం వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లికాయై నమః.
నామ వివరణ.
ముఖమనెడి మన్మథ గృహమునకు కట్టఁబడిన మాంగళ్య తోరణము వలెనున్న కనుబొమ్మలు కలది
జగన్మాత.
స్వయం కల్పిత మృగ నాభి వృత్తము.
గణములు.. భ భ త స స వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
శ్రీ *వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లికా*!
దీవనలన్ వర తేజంబు స్థిరమౌ సుఖమిమ్మికన్,
నీవె కృపన్ వర మోక్షంబు నిజశక్తి నొసంగుమా,
భావనలో నిను నిత్యంబు వరలింప తలంచెదన్
18. ఓం వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనాయై నమః.
నామ వివరణ.
ముఖ కాంతి అనెడి ప్రవాహములో కదలాడుచున్న చేపల జంటతో సమానమైన కనుబొమ్మలు కలది
మీనాక్షి.
స్వయం కల్పిత చలన్మీన వృత్తము.
గణములు.. జ త త య ర వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
భవాని నీదౌ కృపా దృష్టి పరంబున్ గొల్పునమ్మరో!
కవిత్వ మీవై ప్రవాహంబుగ రమ్మా వెల్గులీనుచున్,
ప్రవేశమిమ్మింక నీ దివ్య పదమ్ముల్గాంచ, సత్యభా
స! *వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనా*!
శ్లో. నవచంపక పుష్పాభ, నాసాదండ విరాజితా,
తారా కాంతి తిరస్కారి, నాసాభరణ భాసురా. ॥ 7 ॥
19. ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః.
నామ వివరణ.
అప్పుడే వికసించినటువంటి సంపంగి పూవు వంటి నాసిక కలది దాక్షాయని.
స్వయం కల్పిత ప్రౌఢ విక్రమ వృత్తము.
గణములు .. స . స . ర . త . జ . గ. యతి .. 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*నవచంపక పుష్పాభ నాసాదండవిరాజితా*!
కవనాకృతిలో నీవు కావ్యంబై ప్రభవింపుమా,
నవ జీవన మార్గంబునన్ నీవే నడిపించుమా,
భవ బంధములన్నీవె పారంద్రోలుమ, పాహిమామ్.
20. ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః.
నామ వివరణ.
నక్షత్ర కాంతిని కూడా తిరస్కరించెడి నాసాభరణములు అలంకరించుకొనినది శ్రీమాత.
స్వయం కల్పిత నాసాభరణ వృత్తము.
గణములు..మ స ర భ జ గ. యతి 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
శ్రీ రమ్యాక్షరనామా! ప్రసిద్ధ స్మిత ముఖాంబుజా!
నీ రక్షావలయంబందు నేనుంటి నిట వెల్గుచున్
*దారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా*!
కోరన్ నే నిహ సౌఖ్యంబు, కొల్వుండు మది నిత్యమున్
శ్లో. కదంబ మంజరీక్లప్త కర్ణ పూర మనోహరా,
తాటంక యుగళీభూత తపనోడుప మండలా, ॥ 8 ॥
21. ఓం కదంబమంజరీ క్లప్త కర్ణపూర మనోహరాయై నమః.
నామ వివరణ.
కడిమి పూలతో చేయఁబడిన కర్ణాభరణములతో మనోహరమైన తల్లి.
స్వయం కల్పిత కదంబ మంజరీ వృత్తము.
గణములు..జ ర ర జ జ గ. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు..
*కదంబమంజరీక్లప్త కర్ణపూర మనోహరా*!
మదంబ వీవెగా, కావు మమ్ము నీవిక ప్రేమతో,
ముదంబుతోడ నాపూజ పూర్తిగా గ్రహియింపుమా,
హృదిన్ వసించి నీవున్న హృద్య కావ్యము వెల్వడున్.
22. ఓం తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః.
నామ వివరణ.
చెవికమ్మల జంటగా సూర్యచంద్ర మండలములు కల జనని లలితాంబ.
స్వయం కల్పిత తాటంకయుగళీవృత్తము.
గణములు..త స భ జ జ గ. యతి 9 వ అక్షరము. ... ప్రాస నియమము కలదు..
*తాటంకయుగళీభూత తపనోడుపమండలా*!
పాటింతు నినుఁ బూజించు వరణీయ విధానమున్
కోటీశ్వరుఁడ నీవున్న కొలువై మది నేనికన్,
వాటిల్లు శుభ సౌఖ్యాళి వరణీయ శుభప్రభా!
శ్లో. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోళభూః,
నవ విద్రుమ బింబ శ్రీ,న్యక్కారి రదన చ్ఛదా. ॥ 9 ॥
23. ఓం పద్మరాగశిలాదర్శపరిభావి కపోల భువేనమః.
నామ వివరణ.
పద్నరాగశిలలు అను అద్దములను మించిన నునుపైన కాంతులీనుచున్న చెక్కిళ్ళు కలది మన
అమ్మ.
స్వయం కల్పిత పద్మరాగ వృత్తము.
గణములు. ర స భ జ జ గ. యతి. 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూ*!
పద్మమై నిను సేవింతుఁ బరమార్థమదే కదా,
పద్మపత్ర విశాలాక్షి! వరభావ సుధా నిధీ!
పద్మజోద్భవు దేవేరి వరలించిన కైతవా?
24. ఓం నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదాయై నమః
నామ వివరణ.
అప్పుడే సానపట్టిన పగడముకన్నా దొండపండు కన్నా ఎరుపయిన పెదవులతో ప్రకాశించునది
జగజ్జనని.
స్వయం కల్పిత నవనీత వృత్తము.
గణములు. న స మ భ జ గ. యతి. 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా*!
కవన మధువున్ గ్రోలన్ గామేశ్వరిగ రమ్మికన్,
శ్రవణమధురంబౌ ధారాపాత కవితన్ దయన్
నవ రసములుప్పొంగన్ నా నుండి ప్రభవింపనీ.
శ్లో.. శుద్ధవిద్యాంకురాకార, ద్విజపంక్తిద్వయోజ్వలా,
కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా. ॥ 10 ॥
25. ఓం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః.
నామ వివరణ.
శుద్ధవిద్య దగ్గరనుండి అనుత్తర దీక్ష వరకు గల ముప్ఫైరెండు దీక్షలను తీసుకున్న శ్రేష్ఠుల చేత
పొందదగిన జనని.అని బాహ్యార్థముగా తోచుచున్నదియే ద్విజపంక్తి అనగా పైపన్నులుపదునారు
క్రింది పన్నులు పదునారు ఆ ముప్పదిరెండు పన్నుల ముఖద్వారము నుండి ప్రకాశవంతముగా
వెలువడు శ్రీవిద్యా స్వరూపిణి అమ్మ అని గ్రహింపవలసి యున్నది.
స్వయం కల్పిత ద్విజ పంక్తి వృత్తము.
గణములు. త త మ స ర వ. యతి. 10వ అక్షరము. ప్రాస నియమము కలదు.
శ్రీ శుద్ధ విద్యల్ సమస్తంబున్ జిర కీర్తిన్ మహోద్ధతిన్,
శ్రీశక్తివౌ నీ ప్రభావంబై చెలగున్ సత్యమిద్ది, దే
వీ! *శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలా*!
యా శుద్ధ విద్యల్ ననున్ జేర్చే యసమానాంబవీవెగా.
26. ఓం కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరాయై నమః.
నామ వివరణ.
కర్పూరము మొదలయిన సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలము వేసుకొనుటచే దిక్కుల
చివర వరకు వ్యాపించిన తాంబూల పరిమళములు కలది అమ్మ.
స్వయం కల్పిత కర్పూరవీటికా వృత్తము.
గణములు. త ర భ మ జ గ. యతి. 11వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా*!
కార్పణ్యమున్ విడన్ జేసి, ననున్ గాపాడు తల్లివే,
దర్పంబునే మదిన్ బాపు. మహోదారా! మహేశ్వరీ!
కర్పూరహారతిన్ నీకు మనోజ్ఞా సేవఁ జేయనీ.
శ్లో. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ,
మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా. ॥ 11 ॥
27. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః.
నామ వివరణ.
శ్రీమాత పలుకులు వీణానాదముకన్నా మహనీయముగా ఒప్పియున్నవి. వీణా నాదముకన్న
మధురమయిన సరససల్లాపములు గల తల్లి ఈ జగదంబ.
స్వయం కల్పిత సల్లాప వృత్తము.
గణములు. స ర భ త జ గ. యతి 10వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ*!
సుజనాత్మస్థ! నన్ బ్రోచుమ శుద్ధాత్మగ వెల్గుచున్,
బ్రజలే నీ సుతుల్ గాచుమ, భక్తిన్ నినుఁ గొల్తురే,
భజియింతున్ గృపన్ జూడుమ, పాపంబులఁ బాపుమా.
28. ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసాయై నమః.
నామ వివరణ.
తన పతియయిన కామేశ్వరుని మనసున భావించుట చేత
పరమేశ్వరానందముపొందినందునకలిగిన చిన్న చిరునవ్వుతోకూడిన అందమయిన జనని.
స్వయం కల్పిత మందస్మిత వృత్తము.
గణములు. త ర ర మ జ గ. యతి. 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా*!
సౌందర్య రాశి వీవమ్మ! సౌభాగ్యాకారివీవెగా,
కందున్ మనంబు నీ వింకఁ గాదన్నన్ నన్నుఁ గావుమా,
బంధంబులన్ విడన్ జేయభద్రాత్మా! నిన్నుఁ జేరుదున్.
శ్లో. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా.
కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరా. ॥ 12 ॥
29. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీవిరాజితాయై నమః.
నామ వివరణ.
సాటియే లేని నునుపైన అందమైన చుబుకము కల తల్లి లలితాంబ.
స్వయం కల్పిత శ్రీవిరాజిత వృత్తము.
గణములు. జ స భ య జ గ. యతి. 8 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా*!
మనంబునను నీవే మహిమతో వెల్గు శాంభవీ!
ఘనంబగునొ నీకున్ గరుణతో మమ్ము గాచుటే?
మనోజ్ఞమగు నీ నామమును మాలోన వెల్గనీ.
30. ఓం కామేశ బద్ధమాంగల్య సూత్ర శోభిత కంథరాయై నమః.
నామ వివరణ.
కామేశ్వరునిచే కట్టబడిన మంగళ సూత్రముచేతనొప్పుచున్న అందమైన కంఠముతో ప్రకాశించు
తల్లి మన లలితాంబ.
సీ. కంబు కంఠీ! జగత్ కల్యాణ రూపిణీ! * కామేశ బద్ధమాంగల్య సూత్ర
శోభిత కంధరా*! శుభ యోగదా! నిన్నుఁ బ్రార్థింతునమ్మ శుభంబులంద,
నీదు మాంగళ్యమ్ము నీ భర్త కమితమౌ శక్తి నొసంగె చిచ్ఛక్తి గొలిపి,
లోకేశుగాఁ జేసె, లోలాక్షి నీ శక్తి పద్యాళిలోఁ జెప్పు ప్రతిభ నిమ్ము,
తే.గీ. పచ్చతోరణాల్ ముంగిళ్ళ వరలనిమ్ము,
భక్తి మార్గమ్మునన్ మమ్ము బ్రతుకనిమ్ము,
పాత్రులన్ జేసి పూజలన్ బ్రబలనిమ్ము
నిత్య కల్యాణ సంధాత్రి! నీకు శుభము,
శ్లో. కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా,
రత్న గ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్వితా. ॥ 13 ॥
31. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః.
నామ వివరణ.
బంగారముతో చేయఁబడిన కేయూరములు, అంగదములు ధరించిన కమనీయ భుజములు కలది
మన జగన్మాత.
స్వయం కల్పిత కనకాంగద వృత్తము
గణములు....." స .. స .. భ .. జ .. జ .. గ " . యతి ..... 9 వ అక్షరము. ..... ప్రాస నియమము కలదు.
మనమందున నిన్ నేను మనమందును శాంభవీ!
వినుతించెద నే నిన్ను వినుతిన్ విను శాంభవీ!
కనికారము నీకున్నఁ గని నన్ గృపఁ బ్రోవుమా,
*కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా*!
32. ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః.
నామ వివరణ.
రత్నములు పొదగఁబడిన కంఠమున ధరించు చింతాకు అనే ఆభరణముతో కదలుచున్న
ముత్యాలహారముతో కూడుకొనియున్న తల్లి. ధ్యాన లక్ష్య శుద్ధిని బట్టి ధ్యానించువారికి ఆయా
ఫలములను ఇచ్చు తల్లి.
స్వయం కల్పిత ముక్తాఫల వృత్తము
గణములు. స .. మ .. య .. జ .. త .. ర " . యతి ..... 10 వ అక్షరం.. ..... ప్రాస నియమము కలదు.
కరుణాసాంద్రా! నీవు నన్నున్ గనన్ శుభంబుల్ వరించుగా,
పరమానందంబందు నేనున్ బరంబుఁ బొందన్ సుసాధ్యమౌన్,
స్థిర సౌఖ్యంబున్ బొందనౌన్ వాసిగా, కృపం గాంచు, శ్రీ శుభం
కర *రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా*!
శ్లో. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణ స్తనీ,
నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయీ. ॥ 14 ॥
33. ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః.
నామ వివరణ.
కామేశ్వరుని యొక్క ప్రేమ యనే రత్నాన్నిపొందుటకై అందుకు బదులుగా తన స్థనములనెడి
రత్నములనిచ్చు తల్లి ఈ జగన్మాత.
సీ. మాయా విమోహినై నీ యందు సద్భక్తి నిలుప లేకుంటి నే విలువ నెఱిఁగి!
మిథ్యనే బాపు, *కామేశ్వర ప్రేమర త్నమణి ప్రతిపణ స్తని*! మహితాత్మ!
ఐహికం బెవ్వరి కానందమందించు శాశ్వతంబుగనిట సన్నుతముగ?
నీ పాద పద్మముల్ నిత్యంబు సేవించి నిత్యుండనై వెల్గనిమ్ము నన్ను,
తే.గీ. నిన్నె నమ్మితినమ్మరో! నిండుమదిని
నన్నుఁ ఙ్రుణించుమమ్మ! కాకున్న నాకు
దిక్కు లేదమ్మ! నీవె నా దిక్కువమ్మ!
కొమ్మ నావందనమ్ములన్ గూర్మితోడ.
34. ఓం నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయ్యై నమః.
నామ వివరణ.
నాభి అనే పాదులో నూగారు అనే తీగకు పళ్ళువలె యొప్పుచున్న స్థనద్వయముతో ప్రకాశించు
జనని లలితాంబ.
స్వయం కల్పిత తటిల్లతా వృత్తము
గణములు. స .. ర .. య .. స .. న .. ర " . యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
భ్రమలన్ మున్గి నే సుధాపూర్ణ పరంబు నిలఁ గాంచనే
క్షమతో నీవె నన్ను రక్షించగ నుంటి విట శ్రీసతీ!
క్షమ నీరూపు, నా చెడున్, నీవె శమింపగ నొనర్చు వై
ళమె, *నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయీ*!
శ్లో. లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమా
స్తనభారదలన్మధ్య పట్టబంధ వళిత్రయా. ॥ 15 ॥
35. ఓం లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమాయై నమః
నామ వివరణ.
కనఁబడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే పందిరి వంటి సన్నని నడుము కలది జగన్మాత.
సీ. కామేశ్వరీ! *లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమ*! నుతింతు.
నామానసంబందు నీమంబుతో నుండు నిరుపమ రీతిని నిర్మలాత్మ!
క్షేమంబునే కొల్పి శ్రీమన్మహాకావ్య కర్తగా ననుఁ జేసి కావుమమ్మ!
చిత్తంబు లోపలన్ గ్రొత్త సద్భావనల్ జనియింపఁ జేయు మో ప్రణవ రూప,
తే.గీ. భావములు గొల్పి పద్యముల్ వ్రాయఁ జేసి,
సత్య సన్మార్గ సద్వృత్తి సరగున నిడు,
నీదు పాదాంబుజములనే నిత్యమెన్ని
కొలువఁ జేయుమా నాచేతఁ గూర్మితోడ.
36. ఓం స్తనభార దలన్మధ్య పట్టబంధ వళిత్రయాయై నమః.
నామ వివరణ.
వక్షోజముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టేల యొక్క బంధము వలె
కనఁబడుచున్న మూడు ముడతలతో ప్రకాశించుచున్న జనని. మణిపూరక చక్రము ఉండే నాభి వద్ద
మూడు ముడతలు ఉంటే ఊర్ధ్వ మధ్య అధో లోకాలకు కారణ సూక్ష్మ స్థూల దేహాలకు గల
సమన్వయము సుబోధకమగును.
సీ. భయ దూరమై యొప్పు నయ మార్గమున్ జూపు జయమార్గమీవేను జననిరొ! *స్తన
భార దలన్మధ్య పట్టబంధ వళిత్రయా*! నినుం గొలిచెద నహరహంబు,
నైహికంబైనట్టి, యాముష్మిక విదూర విభ్రాంతి చయము నన్ వ్రేచుచుండె,
నీవే సదా రక్ష, నీకిదియె పరీక్ష, నైచ్యంబుఁ బాపుచు నన్ను గనుమ,
తే.గీ. నీదు పద పంకజములె నన్ జేదుకొనును,
నాదు విశ్వాసమును జూచి బాధఁ బాపు,
బోధఁ గొలుపుచు దుర్గుణ వేధఁ బాపు,
నట్టి పద కంజములకు నే నంజలింతు.
శ్లో. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటీ
రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషితా. ॥ 16 ॥
37. ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తట్యై నమః
నామౌచిత్యము.
ఉదయించుచున్న సూర్యుని వలె అరుణ తేజముతో కనఁబడు వస్త్రముతో నొప్పుచున్న
కటిప్రదేశము కలది జగజ్జనని.
స్వయం కల్పిత కౌసుంభ వృత్తము
గణములు. "త .. భ .. త .. ర .. ర .. వ " . యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
భ*వ్యారుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటీ*!
సవ్యంబుగా నిను వర్ణించి చక్కగా నేను వ్రాయనా?
భవ్యాత్మవీవని నిన్గొల్చి, పాప భారంబు వీడనా,
కావ్యాళిలో నినుఁ గాంచంగఁ గమ్మగా నుండు నమ్మరో!
38. ఓం రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషితాయై నమః.
నామ వివరణ.
రత్నమయమైన చిఱుగజ్జలతో అత్యంత రమణీయంగా ఉండే ఒడ్డాణపు త్రాడు కలది జనని.
స్వయం కల్పిత రశనాదామ వృత్తము
గణములు. ర .. స .. భ .. య .. జ .. గ " . యతి ..... 9. .....వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*రత్నకింకిణి కారమ్య రశనా దామ భూషితా*!
నూత్నమౌ శుభమార్గంబును నినుం గాంచఁ గొల్పుమా,
యత్నమేనొనరింతున్ జయము నాకున్ లభించనీ
రత్నమేకద నీపాద రజ మాత్మన్ వెలుంగనీ.
శ్లో. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా,
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా. ॥ 17 ॥
39. ఓం కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః.
నామ వివరణ.
కామేశ్వరునకు మాత్రమే తెలియఁబడిన మృదువయిన ఊరుద్వయ శోభిత అమ్మ.
ఊరుద్వయమును ఉ ఊ లుగ మనం సంకేతిస్తే ఉ సౌభాగ్యాన్ని, ఊ మర్దవాన్ని సూచిస్తాయి. ఈ
మార్దవ సౌభాగ్యాల సంధాన కర్త్రి అయిన అమ్మ అయ్యవారికి మాత్రమే సమగ్రంగా తెలియఁబడును..
స్వయం కల్పిత కామేశప్రియ వృత్తము
గణములు. మ .. త .. త .. ర .. ర .. వ " . యతి ..... 10. .....వ అక్షరము. ప్రాస నియమము కలదు.
మా *కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా*!
శ్రీకారంబందున్ నినుంగాంచ చిత్త మందున్ ముదంబునే,
నాకున్ నీ కైదండయే యండ, నాకుఁ గూర్చున్ శుభంబులన్,
లోకంబందున్ వేచు నన్ బాధలున్ గృపన్ జూచి కావుమా.
40. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః.
నామ వివరణ.
మాణిక్యములతో నొప్పుమకుటాకాకారముతో ప్రకాశించు మోకాళ్ళు కలది జనని.
స్వయం కల్పిత
మాణిక్య మకుట వృత్తము
గణములు. ర .. భ .. య .. య .. న .. ర " . యతి 11. వ అక్షరము. ప్రాస నియమము కలదు.
సౌమ్య! *మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా*!
రమ్య సుజ్ఞాన శుభ తేజంబుఁ బ్రార్థించెద నొసంగుమా,
గమ్య మీవేను మది గాంచంగఁ గల్యాణ శుభ రూపిణీ!
సామ్యమే లేని వర రూపా! ప్రసాదింపుము మహోద్గతిన్.
శ్లో. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా
గూఢ గూల్ఫాకూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా. ॥ 18 ॥
41. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికాయై నమః.
నామ వివరణ.
ఆరుద్ర పురుగులచేత పొదగఁబడిన మన్మథుని అమ్ములపొది వంటి జంఘములు కలిగిన తల్లి
మన తల్లి.
స్వయం కల్పిత స్మరతూణీర వృత్తము
గణములు. స .. జ .. య .. భ .. త .. ర " . యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
మహి*తేంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘికా*!
మహిమాన్వితంబగు మంత్రాళిన్ మహిమోపేత కావవే,
యిహ సౌఖ్యమున్ బర సౌఖ్యంబున్ హృది నీ వుండి కొల్పుదే
సహియింపు నా దురితాళిన్, శ్రీసతి సద్భాగ్య దాయివై.
42. ఓం గూఢ గుల్ఫాయై నమః
నామ వివరణ.
నిగూఢముగా ఉండే చీలమండలు కలది మన అమ్మ.
శా. చిత్తంబందు వసించు నిన్నుఁ గొలుతున్ శ్రీ *గూఢగుల్ఫా*! సదా!
మత్తున్ బాపుము మానవాళినిలఁ బ్రేమన్ జూచి రక్షించుచున్,
క్షుత్తాపంబు హరింప భుక్తి నిడుచున్ గూర్మిన్ మమున్ గాంచుమా,
బత్తిన్ గొల్చెద, భక్త వత్సల! సతీ! భద్రంబునే గొల్పుమా.
43. ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః.
నామ వివరణ.
తాబేలు వీపునకు గల నునుపుఁదనమును జయించునంతటి అందమైన పాదములపైభాగము కలది
అమ్మ. సముద్రమున మునిగిపోకుండునటుల మందర పర్వతమును మోసిన కూర్మమును మించి
సంసారమనెడి మహాసముద్రమున మునిగిపోవుచున్న మందరపర్వతము వంటి భౌతిక తత్వ
జీవులను కూర్మమును మించి ఉద్ధరించి మోక్షమునిచ్చు సామర్ధ్యముగల పాదములు కలది అమ్మ.
కం. ప్రప వీవే జ్ఞానామృత
పిపాస తీర్చుటకు, *కూర్మ పృష్ఠ జయిష్ణు
ప్ర పదాన్విత*! నుతులు జనని!
యపురూపా! నీ పదముల నర్చింతు మదిన్.
శ్లో. నఖ దీధితి సంఛన్న నమజ్జన తమోగుణా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా. ॥ 19 ॥
44. ఓం నఖ దీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః.
నామ వివరణ.
తనకు నమస్కరించు జనులయొక్క అజ్ఞానమును పారద్రోలఁ గలిగిన కాలి గోరుల కాంతితో
నొప్పునది అమ్మ.
స్వయం కల్పిత తమోపహ వృత్తము.
గణములు..న జ య స న ర వ. యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
మది నిలుమమ్మ! భవానీ! సుమనోహర కవిత్వరూపిణీ!
పదిలముగా మముఁ గాపాడి భవాంబుధిని దాటఁజేయుమా,
ముదమున నిన్నునుతింతున్ సముదంచితముగా వరాంగి!, జ్ఞా
నద! *నఖ దీధితి సంఛన్న నమజ్జన తమోగుణా*! నతుల్.
45.. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః.
నామ వివరణ.
పద్మముల కాంతికి మించిన కాంతి కలిగిన పాదద్వయముతో ప్రకాశించునది జగన్మాత.
స్వయం కల్పిత పాదపంకజ వృత్తము.
గణములు జ . ర . భ . భ . జ . గ. ... యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా*!
మదంబ! నీ పదాబ్జంబు మదిన్ నిలుపనీ కృపన్,
హృదబ్జమందు నీవుండి కృతుల్ వెలయఁ జేయుమా,
ముదంబు గల్గు నిన్నెన్నఁ బునర్జనన ముండదే,
శ్లో. శింజానమణిమంజీర మండిత శ్రీ పదాంబుజా
మరాళీ మంద గమనామహా లావణ్య శేవధీ. ॥ 20 ॥
46. ఓం శింజానమణిమంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః.
నామ వివరణ.
చిఱు సవ్వడి చేసే అందమైన మణిమంజీరాలతో అలంకరింపఁబడిన పాదములు కలది మన
అమ్మ.
స్వయం కల్పిత శింజానమణిమంజీర వృత్తము.
గణములు....త . స . ర . య . జ . గ . ..... యతి . 7 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
రంజిల్లు మది నీ రమ్య పాద ధూళిన్ ధరించగన్,
సంజాత ఫలమై శాంతి నా మదిన్ నిండుచుండెడున్,
కంజాత నయనా! గర్వమున్ విడన్ జేయుమమ్మరో!
*శింజానమణిమంజీర మండిత శ్రీ పదాంబుజా*!
47. ఓం మరాళీ మంద గమనాయై నమః.
నామ వివరణ.
ఆడ హంసల నడకల వలె నుండు నిదానమైన నడక కలది అమ్మ.
కం. శ్రీమన్మంగళ గమనా!
సామాన్యులు గాంచలే రసాధారణమౌ
నీ మహిమంపు గతి, *మరా
ళీ మంద గమన*! కనఁ బడు, లీలా హేలన్
48. ఓం మహా లావణ్య శేవధయే నమః.
నామ వివరణ.
ఈ నామమున శేవధి అనే పదము పుంలింగము గాన ఓం మహా లావణ్య శేవధయే నమః అనవలెను.
అతిశయమైన అందమునకు నిధివంటిది అమ్మ..
కం. దశ నీవె, *మహా లావ
ణ్య శేవధీ*! నడువుము నను నయ మార్గమునన్
విశదమగు సత్ప్రవృత్తిని
విశేష శుభ కృత్యములను బ్రీతి నొసఁగుమా.
శ్లో. సర్వారుణా అనవద్యాంగీ, సర్వాభరణ భూషితా,
శివకామేశ్వరాంకస్థాశివాస్వాధీన వల్లభా. ॥ 21 ॥
49. ఓం సర్వారుణాయై నమః.
నామ వివరణ.
అమ్మ సర్వారుణ, అనురాగపు రాసి. చైతన్య స్వరూపము,
ఉ. కారణ మీవె సృష్టికిఁ, బ్రకాశము నీవె, జగత్ ప్రసిద్ధ! *స
ర్వారుణ*! మంగళాంగి! యనురాగము చూపెడి లోకమాత! దు
ర్వార భవత్ప్రతాప మనివార్యము, దుష్టుల పాలి మృత్యువే,
నే రచియింతుఁ బద్యములు, నీ కృప సృష్టి గ్రహింప నెంచుచున్.
50. ఓం అనవద్యాంగ్యై నమః.
నామ వివరణ.
వంకపెట్టుటకు వీలు లేని శరీర భాగములు కలది.
మ. *అనవద్యాంగి*! జయంబు నీకు జననీ! యార్యా! మహాసాధ్వి! నీ
యనవద్యాంగములే గనన్సకలమాహార్యంబహో సృష్టికిన్
గన నెచ్చోటును లేదు నిన్ విడిచి, యోగంబిట్లు నిన్ గాంచుటే
కనఁగా నన్నిట నీదు రూపె ఘనమై కన్పించు నా కంటికిన్.
ఓం సర్వాభరణ భూషితాయై నమః.
నామ వివరణ.
సస్తమైన ఆభరణముల చేతను అలంకరింపఁబడు తల్లి.
కం. అభయద! నుత *సర్వాభర
ణ భూషితా*! కనుమ నన్ జనని! మొర వినుమా,
శుభముల శోభిలు తల్లీ!
యభయము నీవేను మాకు నన్నింట నిటన్.
52. ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః.
నామ వివరణ.
శివకామేశ్వరుని అంకముపై ఉండు జనని.
ఆ.వె. కామి తార్థ ద! *శివ కామేశ్వరాంకస్థ*!
యైహికంబుఁ బరము నమరఁ జేయు
మిమ్ము గాంచ సుగతి మేలుగా లభియించు
వందనంబు గొనుమ! భర్గు రాణి!
53. ఓం శివాయై నమః.
నామ వివరణ.
శివస్వరూపిణి, శుభగుణ స్వ్రూపిణి మన అమ్మ.ముక్తిస్వరూపిణి,
పంచ చామరము.
*శివా*! శివున్ గృపాత్మవై ప్రసిద్ధుఁ జేసి తీవె, యా
భవుండు నిన్ సగంబు దాల్చి భాగ్యశాలి యయ్యెగా,
సవిస్తృతంపు సృష్టి నొప్పసాధ్యమాయె నీ కృపన్,
శివుండు నీవు నొక్కటై విశేష భక్తిఁ గొల్పుడీ!
54. ఓం స్వాధీన వల్లభాయై నమః.
నామ వివరణ.
తనకు లోఁబడియుండు భర్త కలిగినది మన అమ్మ.
తే.గీ. వల్లభుండనఁ బరమాత్మ, వరలుచున్న
జీవమాత్మయౌన్, బరమాత్మఁ జేరఁ జీవి
తపన చెందెడుఁ జేర్చుమీ తత్త్వమరసి,
నీవు *స్వాధీన వల్లభా*! నిన్నుఁ గొలుతు..
శ్లో. సుమేరు శృంగ మధ్య స్థా, శ్రీమన్నగర నాయికా,
చింతామణి గృహాంతస్థా, పంచ బ్రహ్మాసన స్థితా. ॥ 22 ॥
55. ఓం సుమేరు శృంగ మధ్య స్థాయై నమః.
నామ వివరణ.
మేరు పర్వతపు శిఖ్ర మధ్యభాగమున ఉండునది మన జనని. శ్రీచక్రమున బిం స్థానముననుండున్ది.
సహస్రారకమల మధ్యస్థానమున ఉండునది మన అమ్మ.
తే.గీ. ఆత్మలోఁ గల్గు సృష్టియం దనుపమముగ
ధ్యాన మేరువుపై వెల్గు జ్ఞాన రూప!
ధీ వరేణ్యులం గాచు సుధీ! *సుమేరు
శృంగ మధ్య స్థ*! నిలుము నా చిత్తమునను.
56. ఓం శ్రీమన్నగర నాయికాయై నమః.
నామ వివరణ.
శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్ఠాత్రి. మ్మ్.
కం. ధీ శ్రేయములను నీవే
గా *శ్రీమన్నగర నాయికా*! కృపతో నీ
యాశ్రితులకు!ం గలిగింతువు,
నీ శ్రిత వాత్సల్యమును గణింపగఁ దరమా.
57. ఓం చింతామణి గృహాంతస్థాయై నమః!
నామ వివరణ.
చింతామణులచే నిర్మింపఁబడిన గృహములో నివసించునది మ్న అమ్మ. కోరినవి యిచ్చు మణిగా
చింతామణి ప్రసిద్ధి చెందినది.నిరంతరము శక్తి కొలది పరులకు సహాయపడుచు అమ్మను
చింతించుచు ఉండే హృదయమే చింతామణి అనుకొన్నచో మ్మ ఆ హృదయమనెడి గృహమునే
ఆవాసముగాఅ చేసుకొని, మంగళప్రదగా కనికరిస్తుంది.
అష్టమూర్తి వృత్తము
గణములు. మ న త స ర భ జ య యతి.....1.....9.....17. ప్రాస నియమము కలదు.
మాతా! నిన్ దలతు *చింతామణి గృహాంతస్థ*! నిన్నే మదిని నిల్పుచు, నమ్మా
ఖ్యాతిన్ బద్యముల నల్లం గనఁగ సద్భావనల్ వొంగవె? నినున్ విరచింపన్.
చైతన్యంబును మహద్విజ్ఞతయుఁ జేకూరునమ్మా! జయ పథమ్మును గాంచన్,
నీ తత్త్వంబుఁ గననిమ్మా, నిను గ్రహింపన్, గృపన్ బెన్నిధివి, నన్ గను తల్లీ!
58. ఓం పంచ బ్రహ్మాసన స్థితాయై నమః
నామ వివరణ.
పంచబ్రహ్మవినిర్మిత ఆసనమున ఉండునది మన అమ్మ. బ్రహ్మ, విష్ణు, రుద్ర,,
ఈశ్వర, సదాశివులు పంచ బ్రహ్మలు..
కుండలినీశక్తి వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఊర్ధ్వ గతి పొందుచున్నప్పుడు మూలాధార
స్వాధిష్టానములకు సంబంధించిన బ్రహ్మగ్రంధిని, మణిపూర, అనాహతచక్రములకుయ్
సం<బంధించిన విష్ణు గ్రంధిని, విశుద్ధ ఆజ్ఞా చక్రములకు సంబంధించిన
రుద్రగ్రంధిని,లలాటమునకు శిరోమధ్యభాగమునకు సంబంధించిన ఈశ్వర స్థానమును
అధిగమించును, ఈ విధముగా పంచబ్రహ్మాసనస్థిత అయి మనలోనే ఉన్నది అమ్మ.
తే.గీ. కోణ పంచకమందునఁ గూర్మినొప్పు
బ్రహ్మపంచకమందునఁ బ్రబలుచున్న
*పంచ బ్రహ్మాసన స్థితా*! ప్రణతులమ్మ!
నిన్ను సేవింతు నా మదిన్ నిలువుమమ్మ!
శ్లో. మహా పద్మాటవీ సంస్థా కదంబ వనవాసినీ,
సుధాసాగర మధ్యస్థా కామాక్షీ, కామదాయినీ. ॥ 23 ॥
59. ఓం మహా పద్మాటవీ సంస్థాయై నమః.
నామ వివరణ.
మహిమ కల షట్చక్ర పద్మాటవి యందు ఉండునది యీ అమ్మ. మహాపద్మమయిన సహస్రారమున
నుండునది యీ జనని.
శా. భావింపంగను నా శరీరమను నీ పద్మాటవిన్ నిల్చితే,
భావాతీత విశేషపుణ్యద! *మహా పద్మాటవీ సంస్థ*! నిన్
సేవింతున్ మనసార భావ జగతిన్ శ్రీదేవి! ప్రీతిన్ సతీ!
నీవే నా కవితామృతంబువగుచున్ నిత్యంబు భాసింపుమా.
60. ఓం కదంబ వనవాసిన్యై నమః.
నామ వివరణ.
కడిమిచెట్ల వనమున నివసించునది యీ లోకమాత.
కం. సేవించెద నిను మదిలో
భావనఁ జేయుచుఁ *గదంబ వనవాసిని*! నన్
గావుము ద్వంద్వాతీతా!
నా వందన మందుమమ్మ! నను గృపఁ గనుమా.
61. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః.
నామ వివరణ.
శ్రీచక్రములోని కేంద్ర బిందువు సూచించు సహస్రార కమలము మధ్య నుండునది జగన్మాత.
కం. తరణోపాయము నీవే,
కరుణ సహస్రారమునను గలిగితివమ్మా!
వర తేజమున *సుధా సా
గర మధ్యస్థా*! కృపాబ్ధి! కావుమ నన్నున్.
62. ఓం కామాక్ష్యై నమః.
నామ వివరణ.
కమనీయమైన నేత్రములు కలది అమ్మ, కామకోటిపీఠాధిదేవత, కమనీయ రమణీయ భావపూర్ణులై
అమ్మను చూచు భక్తులననుగ్రహించు కమనీయ నేత్రశోభిత మన తల్లి కామాక్షి
శా. *కామాక్షీ*! కరుణామయీ! బుధనుతా! కల్యాణి! సౌభాగ్యదా!
శ్రీమాతా! జగదంబ! నీవు కృపతోఁ జిత్తేజమై వెల్గుచున్
మా మీదన్ దయఁ జూపుచున్ శుభములన్ మాచేతఁ జేయించుమా,
నీ మార్గంబున మమ్ము నిల్పి వరదా! నిత్యంబు కాపాడుమా.
63. ఓం కామదాయిన్యై నమః.
నామ వివరణ.
కోరినవి యిచ్చు కామదాయిని మన అమ్మ, కామేశ్వరుని మనకు అందునట్లు చేయు తల్లి
కామదాయిని మన అమ్మ.
ఉ. వెన్నెలఁ బోలు నీ నగవు, వీనుల విందొనరించు పల్కులున్,
గన్నులఁ గాంతి రేఖలును, గామితముల్ నెరవేర్చు హస్తముల్,
వెన్నను బోలు మానసము, విజ్ఞతతోఁ గనఁ గోరు చుంటి నా
గన్నులఁ బండువౌచు నికఁ కన్పడు మమ్మరొ! *కామదాయినీ*!
శ్లో. దేవర్షి గణ సంఘాత స్తూయమా నాత్మ వైభవా
భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితా. ॥ 24 ॥
64. ఓం దేవర్షి గణ సంఘాత స్తూయమా నాత్మ వైభవాయై నమః.
నామ వివరణ.
బ్రహ్మాది దేవతల యొక్క, వశిష్ఠాది ఋషుల యొక్క ఆదిత్యాది గణదేవతల యొక్క సమూహము చేత
స్తోత్రము చేయఁబడుచున్న తన యొక్క గొప్పతనము కలది మన అమ్మ. భండాసుర
నిర్మూలనార్థమై వీరందరూ అమ్మవారి ఆవిర్భావం నిమిత్తము సామూహికముగా స్తుతించిరి.
దేవగణమయిన అచ్చులతోను, ఋషిగణమయిన హల్లులతోను, సంఘాత సంకేతముగా
గ్రహింపదగు క్ష కారముతోను, అనగా ఏబది అక్షరములతో స్తుతింపఁబడునది మన అమ్మ..
స్వయం కల్పితము దేవీవైభవ వృత్తము
గణములు....." మ న మ ర ర వ " . యతి. 10 వ అక్షరము. .....ప్రాస నియమము కలదు.
శ్రీదేవీ! నినుఁ గనన్ నేరన్ జిత్తమందున్, స్మరించెదన్,
నే దీనుండను మహాకాళీ! నీవు చూడంగదే సతీ!
నీ దివ్యాంచిత మహత్కాంతిన్ నేర్పుతో నాత్మ చూడ లే
దో? *దేవర్షి గణ సంఘాత స్తూయమా నాత్మ వైభవా*!
65. ఓం భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః.
నామ వివరణ.
భండుఁడు అను రాక్షసుని వధించుటకు ప్రయత్నించు స్త్రీదేవతల సేనలతో చక్కగా
కూడియున్నది మన అమ్మ. అజ్ఞాన మద అహంకారముల స్వరూపమే భండాసురుఁడు. అట్టివానిని
నశింపఁ జేయుటకు జ్ఞానముతో కూడిన భావాలకు ప్రతీకలైన శక్తి సేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన
చైతన్య చిద్రూపిణి అమ్మ.
స్వయం కల్పిత లలితామోద వృత్తము.
గణములు. ..స .. భ . య .. జ .. త .. ర.
యతి 11 వ అక్ష్రము.....
ప్రాస నియమము కలదు.
భయమున్ బాపుమ, ప్రమోదమ్ము వర్ధిలన్ జేయుమా కృపన్,
నియతిన్ నిన్ మదిని సేవింతు నిత్యమార్గంబు నందికన్,
ప్రియ సద్భాషణము నీచేత వృద్ధియౌనమ్మరో సతీ!
జయ *భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా*!
శ్లో. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితా
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిసమావృతా॥ 25 ॥
66. ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః.
నామ వివరణ.
సంపత్కరీదేవి చేత చక్కగా అధిరోహింపఁబడిన ఏనుగుల సమూహము చేత సేవింపఁబడినది జగన్మాత..
చిత్త వృత్తులే సంపత్కరీదేవి. జ్ఞానేంద్రియములవలన చిత్తవృత్తులేర్పడును. ఈ శబ్దాదులే
ఏనుగుల సమూహము. సంపత్కరి ఈ సింధురవ్రజను అదుపులో పెట్టి మంచిపనులు చేయించును.
వటిచే సేవింపఁబడును.
స్బయం కల్పిత సింధురవ్రజ వృత్తము.
గణములు........ర ర య జ భ ర ....యతి....11వ అక్షరము.......ప్రాస నియమము కలదు.
సేవ్య! *సంపత్కరీ సమారూఢ సిందుర వ్రజ సేవితా*!
సవ్య మార్గంబునన్ బ్రయాణింపఁ జాల నన్ గరుణింపుమా
భవ్య లక్ష్యంబుతో నినున్ గాన వచ్చితిన్, గనిపింపుమా.
దివ్యమౌ నీదు తేజమే నాకు దీప్తిఁ గొల్పును భార్గవీ!
సీ. శ్రీకరీ! *సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితా*! కరుణఁ గనుము.
సత్య సంపదలను సజ్జనులకొసఁగి, ధర్మంబు నిలుపుము ధరణి పైన,
సమరస భావంబు నమలిన తత్వంబు నమరఁ జేయుము నాకు కమల నయన!
జయ మార్గమును జూపి నయ మార్గ వర్తిగా నమరఁ జేయుము తల్లి! కొమరుఁడఁ గద,
తే.గీ. నిత్య సంతోషమే మది నీవు వెలుఁగ,
సత్య సంవర్తనయె నీకు జయము వలుకు,
స్తుత్య సద్వృత్తమే నిన్ను స్తుతిని జేయ
కృత్యముల నిన్నె దలతు, సత్కృతులఁ గొలుతు.
67. ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః.
నామ వివరణ.
అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠించఁ బడిన అధిక సంఖ్యలో గల గుఱ్ఱాలచే ఆవరింపఁ
బడినది.ఇంద్రియములనదుపులోనుంచి, శాశ్వత జ్ఞాన సముపార్జనకు దారితీయించగల వాటిచే
సేవింపఁబడునది మన అమ్మ.
స్బయం కల్పిత ...సల్లాలిత వృత్తము.
గణములు. .. మ త ర జ జ గ. ...యతి...7 వ అక్షరము. ...ప్రాస నియమము కలదు.
*అశ్వారూఢాధిష్ఠి తాశ్వకోటి కోటి భిరావృతా*!
శశ్వత్ సౌఖ్యంబిమ్ము, సాధ్య మీవెయై మది వెల్గుచున్,
విశ్వంబందున్ నిన్నె వేల్పువంచు భావనఁ జేసెదన్,
విశ్వేశుం డాలింపఁ బిల్చు నిన్నె సృష్టిని జేయగన్.
శ్లో. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
గేయచక్ర రథారూఢ మంత్రిణీపరిసేవితా ॥ 26 ॥
68. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః.
నామ వివరణ.
చక్రరాజ రథమునందుంచఁబడిన ఆయుధములచే అలంకరింపఁబడినది....శ్రీచక్రములో ఆత్మజ్ఞాన
సంపత్తితో అలంకరింపఁబడినది, సూర్యుఁడినే యిరుసుగా కలిగి ఖగోళమున అలంకరింపఁబడిన
సూర్యకుటుంబమనే ఏక చక్రమును అధిరోహించినది జగజ్జనని.
స్వయం కల్పిత ... చక్రరాజ వృత్తము.
గణములు .. ర . స . ర . భ . జ . గ యతి .9 వ అక్షరము. ... ప్రాస నియమము కలదు.
*చక్రరాజ రథా రూఢ సర్వాయుధ పరిష్కృతా*!
వక్ర మార్గము నాకేల? వర్ధిల్లెదను సత్ప్రభన్,
చక్రి పూజిత శంభుండె సద్భాగ్యమగు నాకిలన్
విక్రమంబున మౌఢ్యంబు వీగంగనికఁ జేయుమా.
69. ఓం గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరి సేవితాయై నమః.
నామ వివరణ.
శ్రీచక్రములోని త్రికోణమే గేయ చక్ర రథము.త్రికోణానికి అధిష్ఠాన దేవతయైన త్రిపురాంబయే
పరమేశ్వరికి మంత్రి అయిన రాజశ్యామల. ఈమె సేవలనందుకొనునది జగన్మాత. గేయ చక్రమనగా
సూర్యమండలము. సూర్యలోకాన్ని పొందిన యోగినులు దేవిని ధ్యానించి పరలోకం చేరుదురు.
అట్టివారిచే సేవింపఁ బడునది జగన్మాత.
సీ. శ్రీచక్రమునకుపైఁ జెల్వొందుచున్నట్టి గేయ చక్రాధిష్ఠ కృపను గనెడి
శ్యామలాంబను జుట్టి చక్కగానొప్పెడి మంత్రిణి సేవలు మదిని గొనుచు
సృష్టి నేలెడి తల్లి! దృష్టిలో నను నిల్పి ప్రకటితముగఁ గావు సకల కామ్య
దా! *గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరి సేవితా*! నిన్నుఁ బ్రస్తుతింతు,
తే.గీ. కనగ శ్రీచక్రమది నేనె, ఘనముగ నట
వెలుఁగుచుంటివి, కననైతి, విశ్వ జనని,
యాత్మలో జ్ఞాన తేజము నమరఁ జేసి,
నిన్ను దర్శింపనిమ్మికన్ నేర్పుమీర.
శ్లో. చక్ర రథారూఢ దండనాథ పురస్కృతా
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగా ॥ 27 ॥
70. ఓం కిరి చక్ర రథారూఢ దండనాథా పురస్కృతాయై నమః.
నామ వివరణ.
వరాహములచే లాగఁబడు చక్రములు గల రథమునెక్కిన వారాహి యను దండనాథ చే
సేవింపఁబడునది. జ్ఞానమను వారహిచే సేవింపఁబడునది అమ్మ. ఆమె దండనాయిక.
అంతశ్శత్రువులను దండించు జనని.
స్వయం కల్పిత ... రథారూఢ వృత్తము.
గణములు.......న జ య జ త ర....యతి...౧౧వ అక్షరము.......ప్రాస నియమము కలదు.
ధర *కిరి చక్ర రథారూఢ దండనాథా పురస్కృతా*!
గురుతర శత్రుల షట్కం బగోచరంబై వహించెడున్,
సరగున నా మదిలో నుండి సంహరించంగ వేడెదన్
తెరవు నినుంగని పొంగన్ బ్రదీప్తమౌ జ్ఞానమిమ్మికన్..
71. ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగాయై నమః.
నామ వివరణ.
జ్వాలామాలిని అనే నిత్యాదేవతచే ఆవరించఁబడిన అగ్నిప్రాకారములో మధ్యగా ఉండుతల్లి
శ్రీమాత.
మనలో నేను తాను అనే పదాలతో చెప్పఁబడే ఆత్మస్థానముననుండు జనని.
ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు ఎక్కడ లీనమై ఎక్కడనుండి ప్రారంభింపఁబడునో అచ్చట ఉండునది
శ్రీలలితాంబిక. ....
స్వయం కల్పిత...జ్వాలామాలిని వృత్తము..
గణములు......మ స ర మ జ గ. యతి 9 వ అక్షరము. .... ప్రాస నియమము కలదు.
*జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగా*!
నీ లీలల్ వివరింపంగ నేనేరీతిన్ దగన్ గనన్
బాలా! నాకిల నీదండ వహ్నిప్రాకారమేకదా,
జాలిన్ జూపుమ,దేవీ ప్రశాంతిన్ నిత్యంబు గొల్పుమా.
శ్లో. భండ సైన్య వధోద్యుక్తశక్తి విక్రమ హర్షితా
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా. ॥ 28 ॥
72. ఓం భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితాయై నమః
నామ వివరణ.
భండాసురుని, అతని సైన్యమును సంహరించుట కొఱకు సంసిద్ధమై యున్న తన సైన్యవిక్రమాన్ని
చూచి ఆనందించు దేవి. మనలోని అజ్ఞానాన్ని నిర్మూలించుట కొఱకు సంసిద్ధమగు చున్న జ్ఞాన
సంపర్కమును చూచి ఆనందిచు తల్లి.
సీ. ఆత్మలో విహరించు నరిషట్కమే భండ సైన్యంబు, దానిని సమయఁ జేయ
నుద్యుక్తమగు శక్తి నుదయించు విక్రమ మును జూచి పొంగెడి పూజ్య *భండ
సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షి తా*! నీవె నాకండ, దయను గనుమ,
నిరతంబు నీ స్మృతుల్ వరలించు నా మదిన్, నా దోషముల్ వాపి యాదుకొమ్మ.
తే.గీ. జ్ఞాన తేజంబుగా నిన్నుఁ గనఁగ నిచ్చి,
యైహికాముష్మికమ్ముల నందనిమ్ము,
నిన్ను వివరించి జగతికిన్ దెలుపనిమ్ము,
జగతినంతటఁ గల నీవు జయమునిమ్ము.
73. ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణసముత్సుకాయై నమః.
నామ వివరణ.
నిత్యా దేవతల యొక్క పరాక్రమాటోపములను చూచి సంతోషము పొందు తల్లి లలితాంబ.
పరాక్రమాటోపములను ప్రదర్శించు ఆత్మ శక్తిని చూచి సంతోషించెడిది మన అమ్మ.
స్వయం కల్పిత సముత్సుక వృత్తము.
గణములు .. త .. ర .. భ .. భ .. జ .. గ. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*నిత్యా పరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా*!
సత్యంబు నిత్యమున్ నేఁ బచరించు నటులన్ గృపన్
స్తుత్యా! యొనర్పుమా నాకు శుభంబులను గొల్పుమా,
భృత్యుండ నేను నీ చెంతఁ బ్రియంబుఁ గన నుండెదన్..
శ్లో. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా ॥ 29 ॥
74. ఓం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః!
నామ వివరణ.
భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలయిన బాలాదేవి విక్రమము చూచి
సంతోషించునది అమ్మ. మనలో భ్రమలను పుట్టించి,వంచించే ఆసురీ శక్తులను నిర్మూలించి,
మనలను కాపాడే బాలాత్రిపురసుందరి విక్రమమునకు సంతసించు తల్లి.
స్వయం కల్పిత బాలావిక్రమ వృత్తము.
గణములు .. ర . స . ర . త . జ . గ. యతి .. 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*భండ పుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా*
భండపుత్రులె దుర్మార్గ భావంబుల్ నను వ్రేచెడిన్
పండువెన్నెలగానీవ భావాతీత శుభాకృతిన్
నిండుగా మదిలోనుండి నిత్యా! రక్షణ సేయుమా.
75. ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితాయై నమః.
నామ వివరణ.
మంత్రిణీదేవిచే విరచింపఁబడిన విషంగ వధకు సంతోషించునది ఈ లోకమాత.
విషంగుఁడు, విశుక్రుఁడు భండాసురుని సోదరులు.. విషంగుఁడు మనలో లంపటత్వాన్ని
రెచ్చగొట్టేవాడు.అమ్మవారి మంత్రి అయిన శ్యామలాదేవి విషంగుని వధించుట చూచి
సంతోషించునది మన అమ్మ.
స్వయం కల్పిత మంత్రిణీ వృత్తము.
గణములు .. స మ న స న ర వ. యతి .. 11వ అక్షరము. ప్రాస నియమము కలదు.
విను, *మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా*! కృపన్.
వినయంబున్ బాపున్ గుణమది విషంగుడె కనంగ, వింటివా?
కనుమమ్మా! యోచింపకుమ, తగ వీడునటుఁ జేయుమా సతీ!
ఘనమౌ నీ నామంబిల శుభ కరం బది గ్రహింపఁ జేయుమా,
శ్లో. విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్య నందితా
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా. ॥ 30 ॥
76. ఓం విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్య నందితాయై నమః.
నామ వివరణ.
విశుక్రుని ప్రాణములను హరించిన వారాహి యొక్క పరాక్రమమునకు సంతోషించునది జగన్మాత.
శుక్ర వికార ఆసురీ గుణమును యోగదండమును పట్టి యోగమార్గము ద్వారా రికట్టే దండనాథ
అయిన వారాహీదేవి పరాక్రమమున్కు సంతోషించు తల్లి.
స్వయం కల్పిత వారాహి వృత్తము.
గణములు . ర . త . న . మ . ర . వ. .. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
భావనాకాశమ్మున గల బ్రహ్మాండంబీవె పార్వతీ!
జీవితాంతంబున్ శుభగతి సేవింతున్ నిన్నుసమ్మతిన్,
నీ విధానంబున్ దెలుపుము నిన్ గొల్వన్,, దిక్కు నీవె రా
వా! *విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్య నందితా*
77. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః.!
నామ వివరణ.
కామేశ్వరుని మఖావలోకముమాత్రమున గణేశ్వరుని కల్పించిన జనని.
స్వయం కల్పిత కామేశ్వరీ వృత్తము.
గణములు . త . స . ర . స . జ . గ యతి 9 వ అక్షరము . ప్రాస నియమము కలదు.
*కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా*!
నామాళిని నినున్ గాంతు నా మది వెల్గుమీవిఁకన్,
హేమాభ తను! వీకున్నదే కనలేని దేదియున్,
శ్రీమాతవు ప్రభాపూర్ణ! చేకొని కావుమా ననున్
శ్లో. మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ॥ 31 ॥
78. ఓం మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః.
నామ వివరణ.
మహా గణేశ్వరునిచే నశింపఁ జేయఁబడిన విశుక్రుఁడు ప్రయోగించిన జయవిఘ్నయంత్రమునకు
మిక్కిలి సంతోషించినది అమ్మ.
స్వయం కల్పిత విఘ్నయంత్ర నాశిని వృత్తము.
గణములు .. న . ర . య . జ . త . ర. .. యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
లలి విశుక్రుడష్ట విఘ్నమ్ములన్ ననున్ బాధ పెట్టుచో
నిలువలేను, గావుమో యమ్మ! నీవె నా కోర్కెఁ దీర్చుమా,
కలవరంబుఁ బాపుమా నన్ను కావ, నీ రక్షణేచ్ఛ దీ
పిలు, *మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా*
79. ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః.
నామ వివరణ.
భండాసురుఁడు ప్రయోగించిన అస్త్ర శస్త్రాలకు ప్రత్యస్త్రములు వర్షించినది అమ్మ.
దుస్సంకల్పములనే అస్త్రశస్త్రాలను మూలములోనే నశింపఁ జేయునది అమ్మ.
స్వయం కల్పిత సరసీరుహ వృత్తము..
గణములు. ..స . ర . య . జ . త . ర. యతి 11 వ అక్షరము. .... ప్రాస నియమము కలదు.
వినుతింతున్ బరాత్పరీ! నిన్ను విశ్వసింతున్ మనంబునన్
గను విందై కనంబడన్ నమ్మికన్ నినున్ జేర రానొకో
కని నాలోని దుర్మతిన్ బాపి కావుమ నీవే కృపాబ్ధి,! ధ్యా
సను, *భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ*!
శ్లో. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః
మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా. ॥ 32 ॥
80. ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః
నామ వివరణ.
రెండు చేతుల వేలి గోళ్ళనుండి ఉత్పన్నమయిన నారాయణుని దశావతారములు కలది అమ్మ.
స్వయం కల్పిత కరాంగుళి వృత్తము.
గణములు న . భ . య . య . న . ర. యతి. 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
నిను వినా కనగ నేరన్, గణించన్ బరము, కావుమా
నను *కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతీ*!
మనములో నిలిచి, మన్నించుమా శాశ్వతముగా సతీ!
కనుము నన్ ఘనముగా నీవికన్, బాధలను బాపుమా.!
(ప్రణుతులమ్మ! శుభదాయీ! నివారింపుమిక బాధలన్.,)
81. ఓం మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః.
నామ వివరణ.
తాను ప్రయోగించిన మహాపాశుపతాస్త్రాగ్నిలో పూర్తిగ నిర్మూలింపఁబడిన రాక్షసులసైన్యము కలది
అమ్మ.
అజ్ఞాన ఆసురీభావాలను ఒకే ఒక అద్వితీయమైన సంకల్పశక్తితో అంతము చేయునది అమ్మ.
స్వయం కల్పిత పాశుపత వృత్తము.
గణములు. న . త . య . య . భ . ర. యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
వినుత పాదాబ్జ యుగా! నిన్నె విశ్వాసంబున నిల్పితిన్
మనమునందున్, సతమున్ గావుమా నీవే, కనఁ గోరెదన్
నిను, *మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా*!
కని మదిన్ గల్గెడి దుష్టాళిఁ కాలం జేయుమ, సత్ కృపన్.
శ్లో. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యకా
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా. ॥ 33 ॥
82. ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యకాయై నమః.
నామ వివరణ.
కామేశ్వరాస్త్ర ప్రయోగానికి భండాసురునితో పాటు పూర్తిగ దగ్ధమైపోయిన శూన్యక పట్టణము కలది
అమ్మ.
స్వచ్ఛమైన ప్రేమామృతంలో నిర్మలమైన జ్ఞానాగ్నిలో లీనమైన అహంకారాజ్ఞాన స్థావరము కలది
అమ్మ.
స్వయం కల్పిత కామేశ్వరాస్త్ర వృత్తము.
గణములు. .. స . ర . య . స . భ . ర. .. యతి 11 వ అక్షరము. .. ప్రాస నియమము కలదు.
క్షితిపైఁ బుట్టఁ జేసి, నన్నిట్లు చికాకుం బడఁ జేసితే,
మితియే లేని మాయ నన్ బట్టె, స్మృతిన్ బాపుచు నుండెనే,
బ్రతిమాలించుకొందువేలో? బరమేశానివి. కావు నన్
సతి! *కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యకా*!
83. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవాయై నమః.
నామ వివరణ.
బ్రహ్మ విష్ణువు ఇంద్రుఁడు మున్నగు దేవతల చేత స్తుతింపఁబడు వైభవము కలది అమ్మ.
ఆత్మజ్ఞానముతో స్తుతింపఁబడు వైభవము కలది అమ్మ.
స్వయం కల్పిత దేవ సంస్తుత వైభవ వృత్తము.
గణములు. .. ర . త . య . జ . భ . ర. .. యతి 11 వ అక్షరము. .. ప్రాస నియమము కలదు.
జీవ మీవే, నామదిలోనుండి సేవలందుదు వీవెగా,
భావమీవే, యన్నిట నీదైన ప్రాభవంబె కనంబడున్,
నీవె నా కీర్తిన్ భువిపైఁ బెంచు నిర్మలాత్మవు, కొల్తు నిన్
దేవి! *బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా*!
శ్లో. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః,
శ్రీమద్వాగ్భవ కూటైకస్వరూపముఖ పంకజా. ॥ 34 ॥
84. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధ్యై నమః.
నామ వివరణ.
ముక్కంటి చూపుచే పూర్తిగా దగ్ధమైన కామునికి సంజీవని అమ్మ
కామాగ్నిదగ్ధులను ప్రేమామృతంతో ప్రమోదమును కలిగించి రక్షించునది అమ్మ.
సీ. నిన్నె నమ్మితిఁ గొల్పు నీ రక్ష, సద్రక్ష - ద! *హర నేత్రాగ్ని సందగ్ధ కామ
సంజీవనౌషధీ*! సత్వరంబుగ, నీదు పదముల చెంతను ప్రబలనిమ్ము,
కామాదులన్ బాపి గౌరవంబును నిల్పి మోక్ష మార్గము సూపి ముక్తినిమ్ము,
జీవితాశయము నిన్ జేరుటే యని నీవు నన్ను గ్రహింపుమా నాదు జనని!
తే.గీ. నాదు జన్మంబు వ్యర్థమౌ శ్రీద! నేను
చేరకుండిన నిన్ను, నన్ జేదుకొనుము.
లక్ష్య సంసిద్ధి గొల్పెడి లక్ష్మివీవె,
నీకు వందనం బనుపమ! నీరజాక్షి!.
85. ఓం శ్రీమద్వాగ్భవ కూటైకస్వరూపముఖపంకజాయై నమః.
నామ వివరణ.
మంగళకరమైన వాగ్భవ కూటము ద్వారా సూచింపఁబడే ముఖపద్మము కలది అమ్మ.
స్వయంకల్పిత వాగ్భవ వృత్తము.
గణములు. .. స . త . య . ర . న . ర. యతి. 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు
కరుణాంభోధీ కన రావేలా? కళా నిలయ మీవెగా,
పరమానందంబున వర్ధిల్లన్ బ్రశాంతిగ మనంగనౌన్
వరలింపంగన్ నను నీదేగా ప్రభావ మిల లేరు నీ
సరి, *శ్రీమ ద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా*!
శ్లో. కంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణీ,
శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ. ॥ 35 ॥
86. ఓం కంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
కంఠము నుండి నడుము వరకూ ఉన్న భాగాన్ని పంచదశీ మంత్రములోని మధ్య కూట
స్వరూపముగా కలది అమ్మ.
కామేశ్వరుని స్థానమై అనురాగాలకు కేంద్రమైన హృదయ స్థానము నుండి కంఠము కటి మధ్య
ప్రదేశమునుమధ్యకూట స్వరూపముగా కలది అమ్మ.
స్వయంకల్పిత మధ్య కూట వృత్తము.
గణములు. .. స . త . య . జ . త . ర. యతి. 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు
అనురాగంబున్ గన, నిన్నున్మహార్తితోఁ గొల్చెదన్ శివా!
నను నీ భక్తున్ సుఖ మార్గంబునన్ శుభోద్దీప్తి వెల్గనీ,
కని నన్నింకన్ ధరణిన్ నిల్పగా సతం బీవు చూపు ప్రే
మను, *గంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణీ*!
87. ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః.
నామ వివరణ.
శక్తి కూటముతో సామ్యమున్న కట్యధోభాగమును ధరించినది అమ్మ.
స్వయంకల్పిత శక్తికూట వృత్తము.
గణములు. .. స . య . య . జ . త . ర. యతి. 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు
ధనమేల నీవున్న నాకున్ ముదంబు నిల్చున్ మనంబునన్,
గొన మీవె నాకున్, ధనంబే యగున్ జిదానంద రూప! భా
వనమందు నీవుండి దేవీ! ప్రభావమిమ్మింక. ప్రేమతోఁ
గను *శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ*!
శ్లో. మూల మంత్రాత్మికామూలకూటత్రయకళేబరా,
కులామృతైక రసికా కుల సంకేత పాలినీ. ॥ 36 ॥
88. ఓం మూల మంత్రాత్మికాయై నమః.
నామ వివరణ.
మూల మంత్రమైన పంచ దశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపగా కలది అమ్మ.
తే. పద్య పుష్పాళి నీ పాద పద్మములను
కొలువ వెలయుచునుండెను గొనుము జనని!
జన్మరాహిత్య మర్ధించు జనులనెన్ని
*మూలమంత్రాత్మికా*! నీవ ప్రోవుమమ్మ!
89. ఓం మూలకూటత్రయకళేబరాయై నమః.
నామ వివరణ.
మూల మంత్రమైన పంచాక్షరీ మంత్రము యొక్క మూడు కూటములను సూక్ష్మ శరీరముగ కలది
అమ్మ.
తే.గీ. మూలకూటత్రయమున నిన్ బూజ్యుఁడు కను,
సృష్టి కంతటి కీవెగా పుష్టివి కన,
*మూల కూటత్రయ కళేబరా*! ల సద్భ
గవతి వని నిన్ను నర్చింతుఁ గనుము గృపను.
90. ఓం కులామృతైక రసికాయై నమః.
నామ వివరణ.
కులమునకు సంబంధించిన అమృతము నందు మిక్కిలి ఆసక్తి కలది అమ్మ.
సహస్రార పద్మములోని చంద్రమండలం స్రవించే అమృతమునందాసక్తి కలది అమ్మ.
తే.గీ. త్రిపుటి వీవేను, కులమదే, తృప్తి నచటఁ
బొందుదానవు, నాకు నానందమటులె
పొందఁ జేయుము, నీ చెంత, నుందుఁ దృప్తిఁ
గనఁ, *గులామృతైక రసికా*! కల్పవల్లి!
91. ఓం కుల సంకేత పాలిన్యై నమః.
నామ వివరణ.
కుల సంబంధమైన ఒడబాటులను, ఏర్పాటులను పాలించు తల్లి. కౌళవిద్యా రహస్యములను
కాపాడునది.
కం. లో కుల సంకేత నిధుల
శ్రీకర పరిపాలనంబుఁ జేసెడి జననీ!
లో కుల గోప్యతను వరల
నీ, *కులసంకేత పాలినీ*! వందనముల్.
శ్లో కులాంగనాకుళాంతస్స్థా కౌళినీ కులయోగినీ,
అకులాసమయాంతస్థాసమయాచార తత్పరా. ॥ 37 ॥
92. ఓం కులాంగనాయై నమః.
నామ వివరణ.
కులము వంశము శీలము మానము మర్యాద, పాతివ్రత్యము మున్నగు వాటి యందు సత్ ప్రవర్తన
స్వభావాదులు కలిగిన స్త్రీని కులాంగనగా పరిగణింతుము. అట్టి లక్షణములు కలిగియున్న అమ్మ
కులాంగన. కులాంగనల యందు గోచరమగు తల్లి.
చం. అరయఁగఁ బృథ్విపైఁ గల కులాంగనలన్ గల సత్ప్రవృత్తియే
నిరుపమ ధర్మతేజమును నిల్పుచునుండెను సత్యమిద్దియే,
మరువగ రాదు నీ మహిమ, మాన్య కులాంగన లందు నీవెగా
నిరుపమ రీతి నుందువు గణింప? *కులాంగన*! సత్ ప్రవర్ధనా!
93. ఓం కులాంతస్స్థాయై నమః
నామ వివరణ.
కులము నందు కలది, కౌల విద్యలో కలది. మూలాధార చక్రము నందు కలది అమ్మ.
శా. మోదంబొప్పగ చక్రషట్క కుల సన్మూలంబువై నిల్చి, సద్
బోధన్ గొల్పుచు నుందు వమ్మ జననీ! పుణ్యాత్ములన్ గాంచి, మో
హాదుల్ వాపగ నెంచి మానవ కులంబందున్ బ్రవర్తించు నిన్
దాదాత్మ్యంబున మేము గొల్తుము *కులాంతస్స్థా*! నమో వాకముల్.
94. ఓం కౌళిన్యై నమః.924,
నామ వివరణ.
శివ శక్తుల సామరస్యమును, సమన్వయమును తెలియఁ జేయు కుల విద్యకు అధిష్ఠాత్రి అమ్మ.
కౌలాచారులచేఁ గొలువఁబడు దేవత అమ్మ. కుల దేవతల రూపంలో ఆరాధింపఁబడునది అమ్మ.
ఆ.వె. కుళయె శక్తి, కన, నకులయా శివుండౌను,
కలసి యకుల కులయు కౌళినయితె?
గ్రామదేవతవయి కాచెడి *కౌళినీ*!
గన స . మూ . లముగను కౌళినివిగ.
(స = సహస్రారము నకు,
మూ = మూలాధారము నకు
సంకేత వర్ణములు)
95. ఓం కులయోగిన్యై నమః.
నామ వివరణ.
కుండలినీ యోగ దేవతా స్వరూపిణి అమ్మ.
చం. ప్రగణిత పంచమావరణ భాసిత సత్ *కులయోగినీ*! లస
న్నిగమ సువేద్య! వందనము, నిష్ఠగ మూల సుచక్రవాసివై,
జగతిని జూపుచుందువుగ చక్కగ మాకు సతంబు నీవు, ని
న్నగణిత భక్తిఁ గొల్చెద మనంత శుభాస్పద! స్వీకరింపుమా.
96. ఓం అకులాయై నమః.
నామ వివరణ.
తనకనుచు ప్రత్యేకమైన కులము లేని అకుల మన అమ్మ. అకారముతో ప్రారంభమగు అక్షర కుల
దేవత ఈ జనని.
మ. సకలంబున్ సతతంబు నీవయి సహస్రారంబునన్ వెల్గు దీ
*వకులా*! నీ పతి తోడ మమ్ము గన, భాగ్యంబన్న మాదే కదా,
యకులంబందు వసించు నీ యునికి మే మాత్మన్ గనన్ గల్గినన్
బ్రకటంబౌదువు నీవు మాకు జననీ! రాణింపఁ జేయన్ మమున్.
చం. వరలు సహస్రమన్నకులపద్మముపై పతితోడనొప్పు నీ
దరహసనాంకుర ప్రభ లుదార దయామతిఁ గాచు సృష్టినే.
నిరుపమ బాహ్యదూరమగు నిత్యము నెన్నుచు గాంచఁ జేయు నీ
కరుణను జూపుమో *యకుల*! కాచెడి తల్లివి నీవె శాంభవీ!
97. ఓం సమయాంతస్థాయై నమః.
నామ వివరణ.
సమయాచార అంతర్వర్తిని అమ్మ. మనలోనే యుండి పనులు చేయుటకు ప్రేరణ కలిగించునది
మన అమ్మ.
మ. దహరాకాశమునన్ బ్రపూజ్యవగుచున్ దాక్షిణ్యమున్ జూపు నిన్,
సహనంబొప్పఁగ ప్రేమఁ గొల్త్రు సమయాచారుల్, గృపన్ వారికిన్
మహిమోపేత మనోజ్ఞ సత్ ఫలములన్ మన్నించుచున్ గొల్పుదే,
దహరంబందున నిల్పి గొల్తు *సమయాంతస్థా*! ననున్, బ్రోవుమా..
98. ఓం సమయాచార తత్పరాయై నమః.
నామ వివరణ.
సమయాచారమునందు, సమయాచారుల యందు ఆసక్తి కలది అమ్మ.
సీ. నుత సమయాచార మతిమంతు లిల *సమ యాచార తత్పరా*! యనుచు మ్రొక్కి,
షడ్విధైక్య పరులై సాధింప చిచ్ఛక్తి నిన్నె నమ్మిరటంచు నీవె బ్రీతి
వర సమయాచార పరవై శుభాస్పదా! వరలింతువే భక్తినరసి మదిని.
పతిని గూడుచు నీవు నుత సహస్రారంబు పై వెల్గుచుందువే ప్రముఖముగను,
తే.గీ. యసమ సత్ సమయాచార మరయుచుండి
దీక్షఁ గొన్నట్టి మహితుల రక్షణకయి
తత్పరతఁ గల్గి నిలిచెడి తల్లి వీవు,
వందనంబులఁ జేసెద నందుకొనుము.
శ్లో. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ,
మణిపూరాంతరుదితా విష్ణు గ్రంథి విభేదినీ. ॥ 38 ॥
99. ఓం మూలాధారైక నిలయాయై నమః.
నామ వివరణ.
మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా కలది మన అమ్మ.
కం. మూలాధారోద్భాసా!
మేలుఁ గొలుప మేలుకొని, భ్రమించెడి మదినే
పాలించుము మేలు నిడుచు,
*మూలాధారైక నిలయ*! పూజలు గొనుమా!
100. ఓం బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః.
నామ వివరణ.
బ్రహ్మగ్రంథిని విడఁగొట్టునది మన అమ్మ. బ్రహ్మమునకు సంబంధించి మనలో ఉన్న సందేహపు
చిక్కు ముడులను విడదీసి నిజము తెలియఁ జేయునది
శా. బ్రహ్మంబీవె, గ్రహించి నిన్ను గొలువన్ భాసించు నీ వచ్చటన్
బ్రహ్మగ్రంథి విభేదిగా నిలువగాఁ బాయున్ గదా మాయ, సద్
బ్రహ్మానందముతోడఁ గాంచగనగున్ భక్తాళి, కామేశ్వరీ!
*బ్రహ్మగ్రంథి విభేదినీ*! జయములే భావింప నిన్ గల్గెడున్.
ఓం మణిపూరాంతరుదితాయై నమః
నామ వివరణ.
షట్ చక్రములలో మూడవది అయిన మణిపూరక చక్రము నుండి ప్రకటితమగునది
లలితాంబ.
కం. మణిపూర చక్ర నిలయా!
ప్రణవాక్షర రూప సత్య భాసుర జననీ!
గణుతింతు నిన్ను నా మది,
*మణిపూరాంతరుదితా*! నమామి భగవతీ!
102. ఓం విష్ణు గ్రంథి విభేదిన్యై నమః.
నామ వివరణ.
విష్ణు గ్రథిని విడఁగొట్టునది జగన్మాత. మాయను మటుమాయము చేయునది అమ్మ.
నిరంతరము
ఉత్సాహముగా ఉంచునది ఈ అమ్మ
కం. శ్రీదవు, విష్ణుగ్రంథి వి
భేదినివై మాయఁ బాపి పెంచుదె, నాకా
మోదమె, *విష్ణుగ్రంథి వి
భేదిని*!, తేజంబుఁ గొలిపి ప్రీతిని కనుమా.
శ్లో.. ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంధి విభేదినీ
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ. ॥ 39 ॥
103, ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః.
నామ వివరణ.
షట్ చక్రములలో ఆరవ చక్రమైన ఆజ్ఞా చక్రము యొక్క లోపల ఉండునది.
ఇంద్రవజ్ర. (త త జ గ గ...యతి.౮.)
అక్రోధ! సౌందర్య! స్మితాంబ! *యాజ్ఞా
చక్రాంతరాళస్థ*! ప్రశాంత రూపా!
వక్రప్రవృత్తుల్ విడఁ బాపుమమ్మా!
చక్రిన్ మదిన్ గాంచుచు సాగనిమ్మా.
స్రగ్ధర. .....(మ ర భ న య య య ౧ . ౮ . ౧౫.)
ఆజ్ఞాచక్రాంతరాళ స్థనగనె శుభ లక్ష్యంబులే చేరు మమ్మున్,
విజ్జానంబీవెగా దేవి యొసగుచు శుభాపేక్షఁ గల్పింతువమ్మా.
సుజ్ఞానంబే భవానీ! శుభ గతిని రహించున్ జయంబుల్ వరించున్.
మాజ్ఞానాక్షిన్ విడన్ నీమముననొనరఁ బ్రేమన్సదా చేయుమీవే.
104. ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః.
నామ వివరణ.
రుద్ర గ్రంథిని విడఁగొట్టునది అమ్మ. తెలివిని జ్ఞానముగా మార్చునదీ జనని.సంశయములు
విడఁగొట్టి మోక్షము నిచ్చుదేవి.
శా. సద్రూపాంచిత! నీ వనాహతమునన్ సత్సాధకున్ బ్రేమతో
రుద్రగ్రంథివిభేదివై నిలిచితే ప్రోవంగ ముక్తిప్రదా!
నిద్రాసక్తులలోన చేతనమునే నీ దివ్య దీక్షన్ సదా
*రుద్రగ్రంథివిభేదినీ*! సుకవి వాగ్రూపాన మేల్కొల్పుమా.
105. ఓం సహస్రారాంబుజారూఢాయైనమః.
నామ వివరణ.
సహస్రార పద్మముపై వసించు జనని. సదాశివ ప్రజ్ఞతో తన శక్తిని చేర్చు తల్లి.
మ. సతతంబున్ నిను సంస్మరించిన *సహస్రారాంబుజారూఢ*! వి
స్తృత విజ్ఞాన వివేకముల్ గలుగు, వాసిన్ గొల్పు చిత్తేజమున్,
నుత సంస్కారము నీ కృపన్ గలుగు, నేనున్ నిన్ మదిన్ నిల్పి నా
గతినే మార్చుకొనంగ నుంటి నిక వేగం బీవె నన్ గావుమా.
106. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః.
నామ వివరణ.
అమృతసారమును ధారాపాత వర్షముగా కురిపించునది లలితాంబ.
కం. ప్రసితుఁడు చేర సహస్రా
ర సరసిజము, నీవు సుధను రమణీయముగా
ప్రసరణ చేయుదువు శివా
ని! *సుధాసారాభివర్షిణీ*! కృపఁ గనుమా.
శ్లో. తటిల్లతా సమరుచిః షట్చక్రోపరి సంస్థితా
మహాసక్తిః కుండలినీ బిసతంతు తనీయసీ. ॥ 40 ॥
107. ఓం తటిల్లతా సమరుచ్యై నమః.
నామ వివరణ.
మెఱుపు తీగతో సమానమైన కాంతి కలది అమ్మ. సాధకుఁడు తన సాధనమున
కృతార్థుడైయినవానికి సహస్రారములో దర్శనమిచ్చు అమ్మ యొక్క తేజమది. అట్టి
అమ్మను ఆత్మలో దర్శింపఁ జేయునదియు అమ్మయే.
చం. సుమధుర భావనా ప్రభను శోభిలఁ గొల్పెడి యో *తటిల్లతా
సమరుచి*! వందనంబులు. ప్రశాంతిగ నిన్ గనఁ జేయఁ బూని మా
కమరిన మాయ చీకటిననంతమహాద్యుతి నొప్పి త్రుంచు నిన్
సముచిత రీతిగొల్చునటు చక్కఁగ చేయుమ నీవు సత్ కృపన్.
108. ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః
నామ వివరణ.
దేహమున ఆరు చక్రములకు పైన ఉండునది శ్రీలలితాంబ. ఆమె దర్శన భాగ్యము పొందిన
వారే నిజమయిన భాగ్యవంతులు.
కం. ప్రాపువు మాకున్ *షట్చ
క్రోపరి సంస్థిత*! శుభాళి నొప్పిదముగ నీ
వే పలు విధముల గొలుపుచు
మాపయి దయఁ జూపుదువుగ మంజుల వాణీ!
109. ఓం మహాసక్త్యై నమః
నామ వివరణ.
బ్రహ్మమునందాసక్తి కలది జగజ్జనని. సుషుమ్నానాడిచే సూచించబడు అగ్నితత్వ
సరస్వతితో విడజాలని బంధము కలదీ తల్లి.
మ. శివశక్త్యైక్య విశిష్ఠ తత్వమెద భాసింపంగ తాద్రూప్యమున్
స్తవనీయంబుగ నొందుటందున *మహాసక్తీ*! ముదంబొందెదే?
జవసత్వంబులు నీవె కాన శివునిన్ శక్తిన్ మదిన్ గల్పుమా.
శివశక్త్యైక్యము నాత్మఁ గొల్పి, సుగతిన్ సిద్ధింపగా చేయుమా.
110. ఓం కుండలిన్యై నమః.
నామ వివరణ.
పాముచుట్టలవంటి ఆకారము కలది. వాగ్భవ బీజ స్వరూపురాలుఅమ్మ.
శా. దేవీ *కుండలినీ*! కృపామృత ఝరీ! దేదీప్యమానా సతీ!
యావచ్ఛక్తికి మూలమైనదగు మూలాధార సంశోభితా!
నీవే ప్రాణము, ప్రీతినొందగ మదిన్ నిన్నే సదా! కొల్చినన్
జీవబ్రహ్మసమైక్యమబ్బును కదా, శ్రీరాజరాజేశ్వరీ!
111. ఓం బిస తంతు తనీయస్యై నమః
నామ వివరణ.
తామర దారము వలె సన్నని శరీరము కలది మన అమ్మ. బ్రహ్మ సూత్రములో సూక్ష్మముగా
ప్రతిపాదితమై యుండునది మన అమ్మ.
ఉ. భారము నీదె, యైహికమపాయము గొల్పును జీవకోటికిన్,
బ్రేరణఁ గొల్పి సద్గతినిఁ బ్రీతిగ వర్తిలునట్లు చేసి, నీ
వారిగ మమ్ము గావుమిక వారిజ లోచన! శాంభవీ! కృపన్,
దారిని చూపుమంచు *బిసతంతు తనీయసి*! నీకు మ్రొక్కెదన్.
శ్లో. భవానీ భావనా గమ్యా భవారణ్య కుఠారికా
భద్రప్రియాభద్రమూర్తిఃభక్త సౌభాగ్యదాయినీ . ॥ 41 ॥ .
112. ఓం భవాన్యై నమః.
నామ వివరణ.
భవుని అర్థాంగి భవానీమాత.
రుద్రో భవో భవః కామో, భవః సంసార సాగరః,
తత్ ప్రానాదియం దేవీ భవానీ పరికీర్తితా.
రుద్ర కామ సంసార సాగరములను జీవింపఁ జేయునది మన అమ్మ భవాని.
చం. భవుని రహింపఁ జేయుదువు వర్ధిలఁ జేయుదు వీవె చిత్తజున్,
భవము ననంత కాలము ప్రవర్తిలఁ జేసెడి తల్లి వీవెగా,
భవమగు బంధనంబులను బాపెడి తల్లివిగా *భవాని*! నిన్
బ్రవరులె చిత్స్వరూపవని ప్రార్థనఁ జేయగ నేర్తు రార్తితోన్..
113. ఓం భావనా గమ్యాయై నమః.
నామ వివరణ.
భావన చేత పొందఁ దగినది, భావన చేత పొంద తగనిది, శబ్ద అర్థ స్థూల సూక్ష్మ
కారణ భావనలచేత పొంద తగినది అమ్మ.
శా. రమ్యాకార! నిరంతరాత్మ విలసద్రాజేశ్వరీ! *భావనా
గమ్యా*! సత్య విరాజ వీవు, జగతిన్ గణ్యాత్మవౌ నిన్ను నా
సౌమ్యస్వాంతులు భావనా ప్రతిభచే సర్వత్ర భావింత్రు, నా
సౌమ్యస్వాంతపు భావనన్ వెలుఁగుమా సద్భావనా రూపవై.
114. ఓం భవారణ్య కుఠారికాయై నమః.
నామ వివరణ.
సంసారమనెడి అడవికి గండ్రగొడ్డలి వంటిది అమ్మ. జన్మ సంబంధమయిన, సంసార
సంబంధమయిన బంధనములను ఛేదించెడి జ్ఞానరూపముననుండు కుఠారమే అమ్మ.
ఉ. పుణ్యఫలంబె నీ కృపను బొందఁగఁ జేయును సజ్జనాళికిన్,
గణ్యము వారి జన్మ, కొర గాని భవంబను దుర్ వనంబునే
గణ్యముగా కుఠారివయి ఖండన చేసెడి తల్లి! యో *భవా
రణ్య కుఠారికా*! శరణు, రక్షణ నాకునొసంగి ప్రోవుమా.
115. ఓం భద్రప్రియాయై నమః.
నామ వివరణ.
శుభములు శ్రేష్ఠములు అయిన వాటియందు యిష్టము కలది అమ్మ. వీరభ్రద్ర స్థితిలోను,
భద్ర స్థితిలోను ఉండు భవుని యందు యిష్టము కలది అమ్మ.
శా. భద్రంబౌ సుఖ జీవనం బొసగు, సద్భాసాంబ! *భద్రప్రియా*!
క్షుద్రంబౌ తలపుల్ త్యజించుచు నినున్ గూర్మిన్ మదిన్ నిల్పినన్,
హృద్రాజీవముపై వెలుంగు జననీ! ప్రీతిన్ మదిన్ గొల్చెదన్,
మద్రమ్యాక్షర సత్ కవిత్వ నిలయా! మాయన్ గృపన్ బాపుమా.
116. ఓం భద్రమూర్త్యై నమః.
నామ వివరణ.
భద్రకరమైన మూర్తి కలది అమ్మ. భద్ర రూపము అయ్యవారు కాగా వ్యక్త రూపము
అమ్మవారు.
చం. బ్రతుకుల లోన మానవు లభద్రత తోడ విచార మగ్నులై
చితుకుచు నుంటఁ గాంచవొకొ? చిన్మయ రూపిణి *భద్రమూర్తి*! మా
గతులను మార్చి భద్రతను గల్గగఁ జేయున దీవె, మా మదిన్
సతతము నీదు సంస్మరణ చక్కఁగఁ జేయఁగఁ జేసి కావుమా.
117. ఓం భక్త సౌభాగ్యదాయిన్యై నమః.
నామ వివరణ.
భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది అమ్మ. భక్తులకు తన సాయుజ్యము కల్పించునది
అమ్మ.
తే.గీ. సర్వసౌభాగ్యముల నిచ్చు ప్రసన్న హృదయ!
భక్తకోటికి వలయు చిచ్ఛక్తినొసగి
ముక్తి మార్గము గలిగించు పూర్ణ తేజ!
*భక్త సౌభాగ్యదాయినీ*! వందనమ్ము.
శ్లో. భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ, ॥ 42 ॥ .
118. ఓం భక్తప్రియాయై నమః.
నామ వివరణ.
భక్తులయెడ వాత్సల్యము కలది అమ్మ. భక్తిని, భక్తిని కలిగియున్న వారిని యిష్టపడునది
జగజ్జనని.
శా. తాదాత్మ్యస్థితిఁ గొల్పు భక్తి యనినన్ దాక్షాయినీ! యిష్టమా?
తాదాత్మ్య స్థితి నొందు భక్తులను మోదంబొప్పఁగాఁ జూచు నీ
వేదారిన్ నడిపింప నెంచెదవొ నీ యిష్టంబు నన్నట్టులే
మోదంబొప్పఁ జరింపఁ జేయుమ కృపన్, బుత్రుండ, *భక్తప్రియా*!
119. ఓం భక్తిగమ్యాయై నమః.
నామ వివరణ.
భక్తికి గమ్యమైనది. భక్తికి పరమార్థము అమ్మను చేరుటయే. కావున అట్టి వారికి భక్తి గమ్య
అమ్మ.
చం. సురనుత! *భక్తిగమ్య*! వర శుద్ధ మహోత్తమ భక్తి మార్గమున్
నిరుపమ రీతి గొల్పి నను నీ పద పల్లవ సేవకుండుగా
కరుణను జేయుమమ్మ, కలకాలము నీ దరినుండఁ జేసి, నన్
బరమ పథంబు నంతమున భాసిల జేరగఁ జేయుమా శివా!.
120. ఓం భక్తివశ్యాయై నమః.
నామ వివరణ.
భక్తికి మాత్రమే స్వాధీనురాలు మన అమ్మ.
కం. పరవశమొందుచు నన్నిట
నిరుపమ దైవతము నిన్ను నిరతము గను స
ద్వరమొసఁగి కృపను గనుచును
వరలించెడి *భక్తివశ్య*! వందనమమ్మా.
121. ఓం భయాపహాయై నమః.
నామ వివరణ.
భయమును పోఁగొట్టు జనని. భయమునకు తావు లేని విధమగు పనులనే చేయించుచు
భయమును పోఁగొట్టు తల్లి.
చం. భయ మిల జీవితాంతమును, బంధములన్ విడ నేరమిన్ భువిన్
భయము మనమ్మునే తొలుచు, భక్తిగ నెప్పుడు నిన్ను నా మదిన్
నయమునఁ గొల్వనీయదుగ, నమ్మితినిన్, భయదూరుఁ జేసి, ని
ర్భయముగఁ గొల్వనిమ్ము నిను, భద్రతఁ గొల్పుచు నో *భయాపహా*!
122. ఓం శాంభవ్యై నమః.
నామ వివరణ.
శంభుని రాణి శాంభవి. శం అనగా శాంతి. మనలో శాంతి స్థితి కలిగించుచు అందు శాంతి
రూపములో ఉండునది మన లలితాంబ.
మ. వర మీవే కద సృష్టి కంతటికి నా భాగ్యంబు నీవే కదా,
కరుణా సాగర! కాంచుమమ్మ నను, నీ కారుణ్యమే భాగ్యమౌన్,
నిరవద్యంబుగఁ గొల్చి నీదు పదముల్ నేఁ బొందెదన్ *శాంభవీ*!
పరమానంద పథంబు నీ స్మరణయే, భద్రంబదే మా కిలన్.
123. ఓం శారదారాధ్యాయై నమః
నామ వివరణ.
శారదాదేవిచే ఆరాధింపఁబడునది మన అమ్మ. శ అనునది శాంతిని, రఅనునది వెలుగును
సూచించును. శాంతిగా వెలుగుతో ఒప్పారు నట్టిది మన జనని.
తే.గీ. శారదామాత రూపులే జ్ఞానపరులు,
నిన్నునారాధనము చేయుచున్నవారు,
నేను భక్తి నారాధింతు నిన్ను జనని,
*శారదారాధ్య*! లలితాంబ! శరణు శరణు.
124. ఓం శర్వాణ్యై నమః.
నామ వివరణ.
శ్రీని అన్నింటియందువ్యాపింపఁజేయువాఁడు శర్వుఁడు. శర్వుఁడు అనగా శివుఁడు. శర్వుని
అర్థాంగి శర్వాణి.
తే.గీ. పుడమిఁ బ్రాణులన్ బ్రోచెడి పూజ్యురాల!
భువి నధిష్టించు శర్వుని పూజ్య సతివి,
నిన్ను భావించు సద్భాగ్యమున్నఁ జాలు
నిలుమ నామది *శర్వాణి*! నియతిఁ గొలుతు..
125. ఓం శర్మదాయిన్యై నమః
నామ వివరణ.
శాంతిని సౌఖ్యమును ఒసంగునట్టి తల్లి. బ్రహ్మజ్ణానమునొసఁ గు జనని.
తే.గీ. ఇహ పరంబుల సుఖద వీవేను జనని!
*శర్మదాయినీ*! నిన్ను నే శరణు వేడి,
పుణ్య పాప బంధనములు పూర్తిగ విడి
నిన్ను సేవింతుఁ, గావగ నన్ను నీవు.
శ్లో. శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్ర నిభాననా
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా. ॥ 43 ॥ .
126. ఓం శాంకర్యై నమః
నామ వివరణ.
శంకరుని అర్థాంగి శాంకరి. శుభ శాంతి ప్రదుఁడయిన శంకరుని భార్య.
మ. శమమున్ గొల్పుచు శంకరుండు సుఖమున్ శాంతమ్మునుం గొల్పు, తత్
సుమబాణారికి రాణివై జగతిలో శోభిల్లు నిన్ *శాంకరీ*!
శమమున్ గోరుచు సంస్మరింతు సతమున్, శాంతిన్ గనన్ శత్రు ష
ట్కమునే గెల్వఁగ, సత్ కృపన్ గనుమిఁకన్, గల్యాణి! చిద్రూపిణీ!
127. ఓం శ్రీకర్యై నమః.
నామ వివరణ.
సమస్త సంపదలను ఐశ్వర్యమును కలిగించు తల్లి. ఇచ్ఛాశక్తి జ్ణానశక్తి క్రియాశక్తి కలిగించు
తల్లి.
మత్త కోకిల.
*శ్రీకరీ*! కృపఁ జూడ మా మది చేరి నీవు రహింతువే,
మా కరంబులు పట్టి మమ్ముల మంచిగా నడిపింతువే,
లోకముల్ రహియించు నీదు విలోకనంబున నిత్యమున్,
మాకు మంగళ కారివై కనుమా సతంబును మమ్ములన్.
128. ఓం సాధ్వ్యై నమః.
నామ వివరణ.
సాధుప్రవర్తన గల పతివ్రత.
కం. నిరుపమ దీక్షను శివునే
వరియించితివమ్మ *సాధ్వి*! పాతివ్రత్యం
బరయగ వలె నినుఁ జూచియె,
కరుణామయి! జగతిని గృపఁ గావుము జననీ!
129. ఓం శరచ్చంద్ర నిభాననాయై నమః
నామ వివరణ.
శరత్కాలచంద్రునితో సమానమయిన ముఖము కలది మన అమ్మ.దహరాకాశములో
అజ్ణానమేఘములను తొలగించ గలిగిన జ్ణానశరత్పూర్ణిమా చంద్రుని తన ముఖముగా
కలది మన అమ్మ.
ఉ. సాంద్ర కృపాబ్ధి! నీ హసన చంద్రికలే జగదేకరక్ష, ని
స్తంద్ర సుధా నిధుల్, విమల చంద్రనిభానన శోభ లెన్నగా
కేంద్రము సృష్టికింతటికి, క్షేమము మాకు నొసంగు మా *శర
చ్చంద్రనిభాననా*! సుగుణ సాంద్రులనిద్ధరనేలుచుండుమా.
130. ఓం శాతోదర్యై నమః
నామ వివరణ.
సన్నని నడుముకలది. అనేక గుహలు అను ఉదరము కల హిమవంతునికుమార్తె హైమవతి.
శా. శ్రీ శీతాద్రి సుపుత్రికామణివి, కాశీ రాజ్ఞి! నా కర్మలన్
నాశంబీవె యొనర్పఁ జాలుదు వికన్ నన్నున్ గృపన్ జూడుమా,
యీశానీ! పరదేవతా! జయకరీ! హేమాంబరాడంబరీ!
శ్రీ *శాతోదరి*! నీకు వందనము, నిన్ సేవించనీ భక్తితోన్.
131. ఓం శాంతిమత్యై నమః.
నామ వివరణ.
శాంతియుతమయిన మనసు కలది అమ్మ. భక్తులలో శాంతిని కలిగించు మనసు కలది
అమ్మ.
ఉ. *శాంతిమతీ*! నమస్కృతులు, సన్నుత దివ్య తురీయ సత్స్థితిన్
సాంతము శాంతమే గొలుపు సద్వర నామ! త్వదీయ దీప్తి వి
భ్రాంతిని బాపునమ్మ! మది రంజిలు భక్తిని, శాంతి కల్గుటన్,
కాంతిగ నిన్ మనంబున సుఖంబుగఁ గాంచెడు భాగ్యమబ్బెడున్.
132. ఓం నిరాధారాయై నమః.
నామ వివరణ.
తనకు ఆధార మనునదే లేనిది, నిరాధార పూర్ణ స్వరూపి అమ్మ.
కం. నీవే సర్వాధారవు
నీవు నిరాధారవు, కన నేరము నిన్నున్
కావు *నిరాధారా*! మము,
సేవింతుము నిన్ను సతము చిద్భాస మణీ!
133. ఓం నిరంజనాయై నమః.
నామ వివరణ.
మాయాసంబంధమయిన అజ్ణానపుపొరలులేని దృష్టి కలది అమ్మ.
శా. ఆజ్ఞా బద్ధుఁడ నమ్మ నీకు, కని నీ వాశించు సద్రూపి! స
ద్విజ్ఞానాక్షయ సత్ఫలప్రదుగ నీవే చేయుచున్ వెల్గనీ,
సుజ్ఞాన ప్రదవో *నిరంజన*! మమున్ శోభిల్లఁ జేయన్ నినున్
సుజ్ఞేయంబగు నామ మంత్రములతో శోధించి నే వ్రాసెదన్.
శ్లో. నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా
నిర్గుణా నిష్కలా శాంతా నిష్కామా నిరుపప్లవా. ॥ 44 ॥ .
134. ఓం నిర్లేపాయై నమః.
నామ వివరణ.
సంగము లేనిది అమ్మ.కర్మబంధములు అంటనిది అమ్మ.
తే.గీ. కర్మ బంధంబులంటని కమల నయన!
నిన్నుఁ గాంతు *నిర్లేపా*! ప్రసన్న వదన!
సత్స్వరూపుండనై నిన్ బ్రశాంతిఁ గనఁగ.
కర్మ బంధంబులుడుపుమా నిర్మలాత్మ!
135. ఓం నిర్మలాయై నమః.
నామ వివరణ.
నిర్మలమై ఏవిధమయినసంబంధములేనిదిఅమ్మ..
ఉ. జీవుల సృష్టి చేసితివి, జీవులు నిన్ను సమాశ్రయించగా
నీవె సమీప్సితార్థములు నేర్పునఁ దీర్చుచు వాటి దోషముల్
నీవె తొలంగఁ జేయుదువు, నీకవి యంటవు చూడ, *నిర్మలా*!
కావుము నిర్మలాత్మునిగ గౌరవ మొప్పగ నన్ను నిత్యమున్.
136. ఓం నిత్యాయై నమః.
నామ వివరణ.
అమ్మ నిత్య సత్యస్వరూపిణి అనిత్యమన్నదే లేనిది. కాలము గతించుచున్నా
కాలముతో సంబంధము లేక నిత్యమూ ఉండునదిమన అమ్మ.
శా. *నిత్యా*! నిత్య శుభంకరీ! జయకరీ! నిశ్శేష జాడ్యాపహా!
సత్యంబీవె యనంత కాల గతివై సంపూర్ణవై సర్వమై
స్తుత్యంబై జగతిన్ వెలింగెడి సతీ! శోభిల్లు నిన్ గొల్వ, నీ
నిత్యోద్భాసము గాంచగాఁ దగుదునా? నిన్ నిల్పకేన్ మన్మ తిన్.
137. ఓం నిరాకారాయై నమః.
నామ వివరణ.
అన్ని ఆకారములూ తనవే .ఒక ప్రత్యేకమయిన అకారమంటూ లేనిది అయిన నిరాకార మన
అమ్మ.
భుజంగ ప్రయాతము.
*నిరాకార*! నైర్మల్య నిత్య ప్రభాసా!
పరంజ్యోతి! నన్ గాంచు, ప్రార్థింతు నిన్నున్,
నిరాధారులన్ గావ నీవుంటివంచున్
బరంబిత్తువంచున్ భవానీ! తలంతున్.
138. ఓం నిరాకులాయై నమః.
నామ వివరణ.
భావ వికారములు లేనిది అమ్మ. ఆకులపాటు లేనిది జగజ్జనని.
చం. సతతము నిన్ స్మరించెదను సన్నుతిఁ జేయుచు నో *నిరాకులా*!
క్షితి నవరోధముల్ స్మరణఁ జేయఁగనీయవు నిన్ను భక్తిగా,
నతులిత బాధలన్ గొలిపి యాకులపాటుకు మూలమౌచు, నా
గతివిక నీవె, సత్వరమె కావుమ, యాకులపాటుఁ బాపుమా.
139. ఓం నిర్గుణాయై నమః
నామ వివరణ.
అమ్మ గుణాతీత. ఆమె నిర్గుణ. ఏగుణములూ అంటని ఆత్మ స్వరూపిణి అమ్మ.
కం. అనితర సృష్టిని జేయుచు
ఘనతరముగ వృద్ధి చేసి క్షయమొనరించే
జననీ వందన మమ్మా!
నను గాపాడుమిల *నిర్గుణా*! నిను గొలుతున్.
140. ఓం నిష్కలాయై నమః.
నామ వివరణ.
సమన్వయాత్మకమే కాని విభాగాత్మకము కాదు అమ్మ .కావుననే ఆమె
నిష్కల.
తే.గీ. ఇహమునందలి సకలంబు మహిమనొప్పు
నిన్నునందంగ సాధనలెన్ని చూడ,
నిష్కలత్వము గూర్పఁగ! నిరుపమాన
నిన్ను ధ్యానింతు *నిష్కలా*! నిండు మదిని.
141. ఓం శాంతాయై నమః.
నామ వివరణ.
ఎటువంటి ఒడిదొడుకులు లేక ప్రశాంతముగా ఉండు జనని . సాధకులకు శాంతి ప్రదాత
జగన్మాత.
తే.గీ. ఆత్మలో నీవు కొలువున్న హాయి కలుగు,
నిత్య మీ విక *శాంతా*! గణించు నన్ను,
వాసముండుము నా మదిన్ వరలఁ జేయ,
నిన్ను నమ్మిన నీ సుతున్ నిలుపు మమ్మ!
142. ఓం నిష్కామాయై నమః.
నామ వివరణ.
ఎటువంటి కోరికలు లేనిది అమ్మ. నిష్కామ స్థితికి సాధకులను చేర్చునది, ఆ విధముగా
తన సాన్నిధ్యమును కల్పించు జనని.
శా. నీ మాయన్ బ్రభవింపఁ జేసితివిగా *నిష్కామ*! కామాదులన్,
శ్రీమాతా! భవదీయ పాద యుగళిన్ జేరంగలేకుంటి నీ
కామాదుల్ ననుఁ జుట్టి వ్రేచుటను, నిన్ గాంతున్ గృపన్ నీవె యీ
కామాదుల్ నను వీడఁ జేయు మిక, నా కామ్యార్థ మీడేర్చుమా.
143. ఓం నిరుపప్లవాయై నమః.
నామ వివరణ.
హద్దులను ఉల్లంఘించుట లేనిది అమ్మ. సచ్చిద్భావముల నతిక్రమించని తల్లి.
తే.గీ. దైవికోపద్రవంబులన్ దయను బాపి,
ధరణిఁ గావుము, సతతంబు ధర్మ పథము
నందు నడిపించుమా జ్ఞాన సుందరముగ,
కనుచు *నిరుపప్లవా*! మమ్ము, వినుతిఁ గొనుచు.
శ్లో. నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా. ॥ 45 ॥ .
144. ఓం నిత్య ముక్తాయై నమః.
నామ వివరణ.
నిత్యము ఎటువంటి సంగము లేక నిత్యత్వ ముక్తిత్వ లక్షణములతో ఒప్పారునది జగన్మాత.
చం. కొలిచెద *నిత్యముక్త*! నినుఁ గూర్మిని నా మదిలోన నుండుమా,
విలువలు పెంచు వర్తనను, విజ్ఞతఁ గొల్పుము నాకు నీవు, నిన్
బలు పలు రీతులన్ దగిన వర్ణనఁ జేయుచు పద్యముల్ సదా
కలుష విదూర! వ్రాయునటు కామిత సత్ప్రద! చేయుమా సతీ!
145. ఓం నిర్వికారాయై నమః.
నామ వివరణ.
ఎటువంటి వికారములూ లేక నిర్మల చిత్స్వరూపమున నుండు తల్లి.
చం. నిరుపమ! *నిర్వికార*! కరుణింపుము, నీ ప్రియ భక్తులన్ సదా,
పరమ దయాన్వితా! మదిని భావనవై వసియింపు నిత్యమున్,
వరలెడు నీ మహత్త్వమును బద్యములందు రచింపనిమ్ము, నీ
సరిఁ గన నీవె కల్గితి వసాదృశ రూప విలాస సంపదన్.
146. ఓం నిష్ప్రపంచాయై నమః.
నామ వివరణ.
ప్రపంచముతో ముడి లేనిది. ఐహికముల కతీత మైనది అమ్మ.
తే.గీ. జగతి నీ లోననే యుండె జనని! చూడ
నీకు వేరేమి లేదుగా *నిష్ప్రపంచ*!
నాకు నీవుంటివను భావనా జగతిని
నీవు కలవమ్మ! రక్షింపు మీవె నన్ను.
147. ఓం నిరాశ్రయాయై నమః
నామ వివరణ.
ఆశ్రయము లేనిది అన్నిటికీ ఆశ్రయమయియున్న తల్లి. ఎటువంటి ఆశ్రయము అక్కర
లేని నిరాశ్రయ జగన్మాత.
కం. విను నీవే యాశ్రయమయి,
మనఁ జేయుచునుంటివమ్మ మమ్మందరినిన్
గన నాశ్రయ రహితవహో!
యనితరశక్తీ! *నిరాశ్రయా*! నినుఁ గొలుతున్.
148. ఓం నిత్య శుద్ధాయై నమః.
నామ వివరణ.
ఎల్లప్పుడూ కల్మష రహితయై యొప్పు తల్లి. ఎటువంటి కల్మషములు అంటని తల్లి ఈ
జగన్మాత. సాధకులమనసులలో ఎటువంటి కల్మషమును చేరనీక అందు వసించునది
అమ్మ.
కం. శుద్ధవు నీ వెల్లప్పుడు,
శుద్ధంబగు తత్త్వ ఖనివి, శుద్ధాత్మవు, నన్
శుద్ధిగ వెలుఁగగ నిలుపుము,
శుద్ధ ప్రతిరూప! *నిత్యశుద్ధా*! ప్రణతుల్.
149. ఓం నిత్య బుద్ధాయై నమః.
నామ వివరణ.
నిత్య జ్ణాన సుశోభిత జగన్మాత. నిత్యము నెఱిఁగినవారి బుద్ధియే జగదంబ.
తే.గీ. సత్యమీవే, కృపాంభోధి! నిత్యమీవె,
సర్వ మీవేను జీవిత సార మీవె,
సత్యమందే నడుపుమిఁక నిత్యము నను,
*నిత్య బుద్ధా*! నినున్ గొల్తు నిరత మెలమి.
150. ఓం నిరవద్యాయై నమః.
నామ వివరణ.
నిందింపఁబడుటకు అవకాశము లేనిది అమ్మ.ఎటువంటివంకలూపెట్టుటకు తావీయనిది
అమ్మ.
కం. నిరుపమ! నరక మవద్యము,
దరికిని రానీయకమ్మ! దాసుఁడ నీకున్,
గరుణను గావుమ సతతము,
*నిరవద్యా*! నిను గొలుతును నిర్మల భక్తిన్.
ఓం నిరంతరాయై నమః.
నామ వివరణ.
అంతరము లేకుండా అంతటనూ వ్యాపించినది. తాను లేని ప్రదేశము లేకుండా
నిరంతరయై యుండునది.జగన్మాత.
ఉ. అంతరమీయఁబోకుము, *నిరంతర*! జ్ఞాన సుబోధ గొల్పుటన్
సుంతయు జ్ఞానమెన్న నినుఁ జూడగఁ జేయఁగ లేదు నాకు, ర
వ్వంత యొసంగుమమ్మ! కనులారఁగ నిన్ను గనంగ శక్తి, నొ
క్కింతయు వీడనమ్మ! నిను, హే పరమేశ్వరి! పాహి మామ్, సతీ!
శ్లో. నిష్కారణా నిష్కళంకా నిరుపాధిః నిరీశ్వరా
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ. ॥ 46 ॥ .
152. ఓం నిష్కారణాయై నమః.
నామ వివరణ.
కారణమన్నది లేనిది. తాను చేయువాటికి కారణమన్నది లేనిది జగన్మాత.
ఆ.వె. కారణములకెల్ల కారణ మీవు, *ని
ష్కారణా*! సృజనను ఘనతరముగఁ
జేయు తల్లివమ్మ! చిన్మార్గమున నుంచి
నన్ను నడుపు మమ్మ! సన్నుతముగ.
153. ఓం నిష్కళంకాయై నమః.
నామ వివరణ.
ఎటువంటి కళంకమూ లేనిది. ఎటువంటి మచ్చా లేనిది. ఎటువంటి పాపమునకూ తావు
లేనిది అమ్మ.
తే.గీ. నిరత మానందమొసఁగెడి *నిష్కళంక*!
వందనము చేసెదను నీకు నందుకొనుము.
మనసు నిష్కళంకంబుగ మధుర భావ
రమ్యముగ నొప్ప నుంచుమా రాజిత పద!
154. ఓం నిరుపాధయే నమః.
ఉపాధితో నిమిత్తము లేని నిరుపాధి అమ్మ. ఏ ఉపాధితోనూ అవసరము లేనిది.
నామ వివరణ.
ఉ. దేహముపాధి దేహికి, మదిన్ సకలంబును జేరుచుండు, స
మ్మోహము, స్వార్థచింతనము, పూర్తిగ జ్ఞానవిహీనుఁ జేయు నా
దేహమె లేని చిత్ప్రభవు, దివ్యకళామయి! నీకు మ్రొక్కెదన్
పాహి, కృపాంతరంగ! *నిరుపాధి*! శుభాస్పద! పార్వతీ సతీ!
155. ఓం నిరీశ్వర్యై నమః.
నామ వివరణ.
తనపై ఆధిపత్యము నెరపు వారు లేనిది. తానే సృష్టికి అధీశ్వరి. కావున అమ్మ నిరీశ్వరి.
శా. నీవే సర్వము, నీకు నీవె సరి, లేనేలేరు నీ సాటి, నీ
భావంబందునె యీశ్వరుండమరగా వానిన్ బతిన్ జేయుచున్
గావన్ నిల్పితె విశ్వమంతటికి శ్రీ కల్యాణ సంధాయినీ!
సేవన్ నిన్ను *నిరీశ్వరీ*! తనుపనా, శ్రీ రాజరాజేశ్వరీ!
156. ఓం నీరాగాయై నమః.
నామ వివరణ.
రాగరహితమైయుండు నీరాగ అమ్మ. రాగబంధనలు ఏమాత్రమూ లేనిది అమ్మ.
శా. *నీరాగా*! మహితాత్ములుంద్రు జగతిన్ నీరాగులై నిత్యమున్,
నే రాగాంధుడనై కుటుంబ జగతిన్, నిత్యంబు నిన్ బాసి, నీ
కారుణ్యంబును గాంచకుంటిని, సతీ! కారుణ్యమున్ జూపి నన్
నీరాగాంచిత మూర్తిగా నిలుపుచున్ నిత్యత్వమున్ గొల్పుమా
157. ఓం రాగ మథన్యై నమః.
నామ వివరణ.
రాగమును పోఁగొట్టునది అమ్మ ముక్తి మార్గమున సాద్గహకుని నడుపుచు దానికి
అంతరాయము కలిగించు అనురాగాదులను దూరము చేయునది జగజ్జనని.
చం. నను విడఁ జాలకుండెఁ గరుణాలయ! యీ యనురాగ బంధముల్,
కనవొ? గతించు కాలమునఁ గాలము తీరుచునుండెనమ్మ! నే
రను నినుఁ గాంచి ముక్తిఁ గను రమ్యపథంబును, నీవె దిక్కిఁకన్,
నినుఁ గనఁ జేర *రాగ మథనీ*! యొక మార్గము చూపుమమ్మరో!
158. ఓం నిర్మదాయై నమః.
నామ వివరణ.
మదము లేనిది..
తే.గీ. మద విరహితయౌ *నిర్మదా*! మమ్ము వ్రేచు
బల ధనాదు లుప్పొంగుటన్ గలుగు మదము,
ముదము గొలుపఁగ మాలోని మదమునణచి
నిన్ను దర్శింపనిమ్మిలన్ నిత్య పూజ్య!
159. ఓం మదనాశిన్యై నమః.
నామ వివరణ.
మదమును నశింపఁజేయునది అమ్మ. తనను ఆశ్రయించి ఆరాధించువారిలో మదమును
పూర్తిగా తొలగించు దయామయ అమ్మ.
కం. *మదనాశిని*! నీ శుభకర
పదముల నే నాశ్రయింతు భద్రా! నాలో
మదమున్న సదయ నణఁచుమ,
ముదమున నినుఁ గొలువఁ జేయ ముక్తినొసగగన్.
తోటకము.
మదమాదిగ గల్గు సమస్తము ని
న్నెద నిల్పిన బాసెడు నింపలరన్,
*మద నాశిని*! నీ కృప మా పయినన్
ముదమారఁగ నుంచుము పుణ్య ఫలా!
శ్లో. నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ. ॥ 47 ॥
160. ఓం నిశ్చింతాయై నమః.
నామ వివరణ.
ఏ విధమైన చింతా లేనిది. సాధకులను నిశ్చింతగా ఉంచునది.
తే.గీ. నిత్య పూజిత! *నిశ్చింత*! నిరుపమాన!
నిత్య సంభాసివే నీవు సత్యరూప!
భృత్యుఁడను నేను గనుమ నన్ బ్రీతి తనరఁ,
జింతలను బాపి రక్షించు శీఘ్రముగను.
161. ఓం నిరహంకారయై నమః.
నామ వివరణ.
ఏ విధమైన అహంకారము లేనిది, అహంకారమునకు తావు లేనిది అమ్మ.
మ. *నిరహంకార*! జయమ్ము నీకు, పతికిన్, నిర్భాగ్యులౌ దుర్మతుల్
దురహంకార మదాంధులైరి, కను, లేదో వారికిన్ ముక్తి? స
త్తరుణోపాయము నీవె చూపి,శుభ తత్వంబున్ బ్రసాదించినన్
వరలన్ వచ్చును వారు కూడ శుభులై,భావించుమా యీశ్వరీ!
శా. కన్నున్ మిన్నును గానకుండుదు నహంకారంబు నన్ జుట్టినన్,
నన్నున్ నీవె యనుగ్రహించి యహమున్ నన్ జేరకుండన్ సదా
కన్నారన్ గని కావుమమ్మ! *నిరహంకారా*! శుభాధిక్యముల్
నిన్ను గొల్వ లభించునమ్మ! కొలుతున్ నిన్నే కృపాసాగరా!
162. ఓం నిర్మోహాయై నమః.
నామ వివరణ.
మోహమన్నదే లేనిదిజగన్మాత. అవగాహనలోపొరపాటులేనిది జగన్మాత.
కం. *నిర్మోహా*! మోహము మము
దుర్మార్గులుగా నొనర్చు దురితము గొలుపున్,
కర్మల్ గాల్చుము తల్లీ!
నిర్మోహులుగా నొనర్చి నిలుపుము మమ్మున్.
ఉ. దేహంబందున నీవు కల్గుటను నే దేదీప్యమానంబుగా
మోహాదుల్ విడినిన్ భజింపనగు *నిర్మోహా*! కృపాంభోనిథీ!
స్నేహాయత్త మనంబునన్ గను సుతున్ జీవాత్మవౌ శాంభవీ!
రాహిత్యంబును గొల్పు జన్మకుఁ గృపన్ బ్రార్థింతు నిన్ భక్తితోన్.
163. ఓం మోహనాశిన్యై నమః.
నామ వివరణ.
మోహమును నశింపఁజేయునది అమ్మను ఉపాసించువా రిలో మోహమును నశింప
చేసి కరుణించునది అమ్మ.
ఉ. మోహము క్రోధ సంభవము. మోహముచే స్మృతి విభ్రమంబగున్,
శ్రీహరి చింత మానుటగుఁ, జింత లిహంబున దుఃఖ హేతువుల్,
మోహము వాపి, సత్ పథ విమోదము గూర్చెడి మోహమున్న త
న్మోహము గూర్చుమమ్మ! పెర మోహము గోరను *మోహ నాశినీ*!
164. ఓం నిర్మమాయై నమః.
నామ వివరణ.
మమకారమన్నదే లేనిది అమ్మ.
కం. *నిర్మమ*! యహమున్ బాపుచు
ధర్మముతో మెలఁగఁ జేసి ధరణిని నన్నున్
నిర్మలముగ బ్రతుకుచు సత్
కర్మలతో నెగడ గనుము. గణుతిగ జననీ!
చం. హృదయ వచశ్శరీరముల నెన్నటికిన్ బరిపూర్ణనిర్మల
ప్రదముగ నుండునట్టులగ వర్ధిలఁ జేయుము నిర్మలప్రభన్,
సదయను నీవు నా యెడలఁ జక్కఁగ గల్గిన సాధ్యమౌనటుల్,
మదిని వసించి చేయుమటు మాత! కృపాంబుధి! నిత్య! *నిర్మమా*!
165. ఓం మమతాహంత్ర్యై నమః.
నామ వివరణ.
మమకారమును నశింపచేయునదిఅమ్మ.
మ. *మమతాహంత్రి*! భవత్ పదాబ్జ యుగళిన్మాన్యా! కృపన్ నా మదిన్
రమణీయంబుగ నిల్పుమమ్మ! జయముల్ రమ్యంబుగా గొల్పగన్,
క్షమనే కొల్పుచు నిన్ స్మరించునటులన్ గాత్యాయనీ! చేయుమా,
ప్రముదంబున్ గలిగించుమమ్మ! మదిలో భాసించుచున్ నిత్యమున్.
166. ఓం నిష్పాపాయై నమః.
నామ వివరణ.
అమ్మ పాప రహిత.మనమున తనను నమ్మి కొలుచు భక్తులకు పాపములంటనీయని జనని.
శా. పాపంబుల్ హరియించిపోవు కద, *నిష్పాపా*! నినున్ దల్చినన్,
శాపంబుల్ విడిపోవు నీ స్మరణచే శాంతంబు కల్గున్ శివా!
కోపాదుల్ భవదీయ నామ పఠనన్ గుంచించిపోవున్ కదా,
నీ పాదంబుల సంస్మరింతును సతీ! నేర్పున్ గృపన్ గొల్పుమా.
167. ఓం పాపనాశిన్యై నమః.
నామ వివరణ.
భక్తులకు తలిసీతెలియక చేయు కర్మల వలన ప్రాప్తించు పాపములను నశింప చేయు
జనని.
ఉ. దేవిరొ! నాదు చిత్తమొక దేవళమమ్మరొ! తృప్తిగానిటన్
నీవు వసింపుమమ్మ! మహనీయులనేకుల దర్శనంబుతోఁ
బావనమైతి నేను, వర భాస్కర తేజ! భజింతు నిన్నిటన్,
పావన నామ! నా కొసఁగు భద్రత నీవిక, *పాప నాశినీ*!
శ్లో. నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ. ॥ 48 ॥ .
168. ఓం నిష్క్రోధాయై నమః.
నామ వివరణ.
అమ్మ దయామయి. కోపమనునదే లేని తల్లి. అమ్మ కోపాతీత. కోప లక్షణము ఆమె
దరికయినను చేరదు.
శా. ఎన్నం జాల నినున్ బ్రసన్న వదనా! హేమాద్రి కన్యా! శివా!
క్రన్నన్ నీ శుభ నామ మెన్న శుభముల్ కల్గింతువమ్మా కృపన్,
చెన్నారంగని పాప పంకిలమునే శీఘ్రంబుగాఁ బాపుమా,
నిన్నే నమ్మితి, శాంతితోఁ గను ననున్ *నిష్క్రోధ*! శాంతి ప్రదా!
169. ఓం క్రోధశమన్యై నమః..
నామ వివరణ.
ప్రకృతి సిద్ధముగా భక్తులకు వచ్చు కోపమును శమింపఁ జేయు లోకమాత.
ఉ. చేరితి నిన్ మనంబునను, జేతనమొందుచుఁ గొల్వగా నినున్,
శ్రీరమణీయ పద్య సుమ సేవిత దివ్య పదారవింద! నే
కోరనిహంబునన్ గలుగు కోర్కెలఁ దీర్చు మటంచు దేవి! నీ
నేరుపుఁ జూపి *క్రోధశమనీ*! హరియింపుము నాదు క్రోధమున్..
170. ఓం నిర్లోభాయై నమః.
నామ వివరణ.
లోభ గుణమన్నదే లేని తల్లి లలితాంబ. భక్తులలో తానుండుటచే లోభమనే గుణమునే
దరికి చేరనీయనిది అమ్మ.
శా. లోలాక్షీ! మది నిండె లోభమున, *నిర్లోభా*! కృపన్ బాపుమా,
మాలో లోభము దుర్మదంబు గొలుపున్, మాత్సర్యమున్ గల్గెడున్,
మాలో నుండెడి నిన్ను మేము గనమే, మా లోభ దుర్బుద్ధిచే,
యే లీలన్ గరుణించి కాచుదువొ, నీదే భారమమ్మా శివా!
171. ఓం లోభ నాశిన్యై నమః.
నామ వివరణ.
లోభ గుణమును పోగొట్టునది జగన్మాత. భక్తుల హృదయములలో తా నుండి
వారిలో లోభగుణమును నశింపఁ జేయునది అమ్మ.
ఉ. లోభమదేలఁ గొల్పితివి? లోకువఁ జేయనొ? *లోభనాశినీ*!
నే భవదీయ భక్తుఁడను, నిన్నె మదిన్ గని గొల్చుచుండెదన్,
లోభము మోహమున్ గొలుపు, లోఁ దగనేర్పడు మత్సరంబు, నీ
లోభము వాపి కావు మిలలోన ననున్, గృపఁ జూపి శాంభవీ!
172. ఓం నిస్సంశయాయై నమః.
నామ వివరణ.
ఏవిధమైన సంశయమునకూ తావు లేనిది. తనను ఆరాధించు సాధకులకు
నిస్సంశయముగా రూఢియై యుండునది అమ్మ.
ఉ. సంశయ మీ జగంబు, మరి సంశయ మీ నర జన్మఁ జూడగా,
సంశయ మెన్న జీవనము, సంశయమీ స్థిర భావ సంపదల్
సంశయ మెల్ల బంధములు,, సంశయ హీన మిదొక్కటేను, *ని
స్సంశయ*! నీవు నిత్యమను సత్యము, నమ్మినఁ జాలు ముక్తియే.,
173. ఓం సంశయఘ్న్యై నమః.
నామ వివరణ.
సాధకులలోని సందేహములను నశింప జేయునది. వారి హృదయములోన
అస్తిత్వమువిషయమై సంశయములను లేకుండా చేయునది అమ్మ.
ఉ. నా మదిఁ గల్గు సంశయము నాస్తిగఁ జేసెడి *సంశయఘ్ని*! నిన్
నే మది నిల్పి కొల్చెద ననేక శుభావహ కావ్య కర్తగా
ప్రేమను జేయుమమ్మ! యలరించుము మమ్ము జయప్రదాత్రివై,
ధీమతులెన్ను సద్గుణవతీ! మది నుండుము చేతనమ్ముగా..
174. ఓం నిర్భవాయై నమః.
నామ వివరణ.
పుట్టుక అన్నదే లేని తల్లి. అమ్మ నిత్యమై శాశ్వతమైనది, ఆమెకు పుట్టుకయే లేనిది.
మ. భవమే లేని పరాత్పరా! జగతి శోభాపూర్ణమౌ రీతిలో
రవి, చంద్రాగ్నుల, పృథ్వి, వాయు, జల తారా శోభలన్ సృష్టి నీ
ఛవిచే సంభవమాయె, చిత్రమదియే, సాధ్వీమణీ! *నిర్భవా*!
భవమే లేని వరమ్మునిమ్మ, నను నీ భక్తున్ గృపం జూడుమా.
175. ఓం భవనాశిన్యై నమః.
నామ వివరణ.
పుట్టుకవలన కలిగిన సంసారబంధ క్లేశములు నశింప చేయునది అమ్మ.
ఉ. శ్రీ *భవనాశినీ*! శుభము చేకురునమ్మ! నినున్ దలంచినన్
బ్రాభవమొప్ప భక్తుల నపాయ విహీనులఁ జేయ నెంచి, నీ
వీ భవమున్ నశించునటు హేలఁగఁ జేసెడి తల్లివమ్మరో!
నే భవదీయ భక్తుఁడను, నీ పదముల్ మది నిల్పి మ్రొక్కెదన్.,
శ్లో. నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా. ॥ 49 ॥
176. ఓం నిర్వికల్పాయై నమః.
నామ వివరణ.
వికల్పము లేనిది. అమ్మ సిద్ధ సంకల్పురాలు, తనసంకల్పములు నెరవేరకపోవుట
యనునదే లేనిది.
ఉ. కల్పనఁ జేయు తల్లివి యగణ్యజగద్వరసృష్టి, *నిర్విక
ల్పా* ల్పుఁడ నైన నేను నిను వర్ణనఁ జేయగఁ జాలనమ్మ! నా
వేల్పువటంచుఁ బద్యములు వేలుగ వ్రాయఁ దలంపుఁ గల్గియున్,
నిల్పఁగఁ జేయుమమ్మ మది నీపయి నిన్ను గణించి కొల్వగన్
177. ఓం నిరాబాధాయై నమః.
నామ వివరణ.
బాధలు వేధలు లేనిది జగన్మాత. భక్తుల హృదయాలలో ఉండి వారికి బాధలు లేకుండా
చేయునది అమ్మ.
కం. వందనము *నిరాబాధా*!
కుందింపఁగఁ జేయుచుండె ఘోరపు బాధల్,
మందస్మిత! పాపుము, నా
డెందమ్మున నిలుచుచు నిపుడే, కృప తోడన్.
178. ఓం నిర్భేదాయై నమః.
నామ వివరణ.
భేదమనునదిలేనిది. తనకన్నాపరమయినదున్నచో స్వపర భేదము ఉండవచ్చును.ఇక్కడ
అమ్మ తప్ప వేరుగా అమ్మకు ఏదీ లేనందున భేదములేనిది అమ్మ.
తే.గీ. బ్రహ్మ మద్వితీయమ్ము, తద్బ్రహ్మమీవె,
నీవె జగతి, *నిర్భేదా*! ప్రభావమెన్న
నీదె యన్నిట, నిన్ మించి లేదు పరము
భేద భావము దొలగించి, వెలుఁగు మదిని.
179. ఓం భేద నాశిన్యై నమః.
నామ వివరణ.
భేదభావమును నశింపఁ జేయునది. అంతా తానే అను భావము కల్పించి భేదభావమును
సమూలముగానశింపజేయునది అమ్మ.
తే.గీ. *భేద నాశినీ*! నాకు నభేద తత్వ
మమరఁ జేయుమా, కృపను, సమంచితముగ
జీవజాలమునందున్న జీవివైన
నిన్నుగాంచుచున్ వర్తింతు, నిరుపమాన!
180. ఓం నిర్నాశాయై నమః.
నామ వివరణ.
నాశము లేనిది అమ్మ. తనకు పుట్టుకయే లేనిది కావున నాశనము కూడా లేనిదే అమ్మ.
కం. *నిర్నాశా*! పరమేశ్వరి!
దుర్నయ వర్తనుల నణచుదువు శుభ మొలయన్,
నిర్నాశ మోక్ష మొసగుము
దుర్నీతి విదూర! మదినిఁ దోచుము సతమున్.
181. ఓం మృత్యుమథన్యై నమః.
నామ వివరణ.
మృత్యు భావనను మృత్యువును పోగొట్టునదిఅమ్మ. మృత్యువు నుండి అమృతత్వమునకు
తీసుకుపోవునది జగజ్జనని.
కం. నిత్యము కాదీ జన్మము
మృత్యువు వెంటాడు చుండు, మేలుగ నీవే
మృత్యువిహీనపు ముక్తిని
*మృత్యుమథని*! గొల్పుమమ్మ! మృదు జలజ పదా!
182. ఓం నిష్క్రియాయై నమః.
నామ వివరణ.
ఏ క్రియలూ లేనిది. ఎటువంటిపనియు విధింపఁబడనిది జగజ్జనని.
తే.గీ. విధి నిషేధ క్రియా శూన్య! విశ్వ జనని!
*నిష్క్రియా*! నీదు తలపునన్ నిఖిల జగతి
సాగుచుండును సతతము సవ్యముగను,
కావ రావమ్మ! ముక్తిని కరుణ నిమ్మ.
183. ఓం నిష్పరిగ్రహాయై నమః.
నామ వివరణ.
స్వీకరణ, పరిజనాదులు లేనిది లోక మాత.
కం. క్షితియును సృష్టియు నీవే,
యతులితమతి! *నిష్పరిగ్రహా*! కృపఁ గనుమా,
స్మిత పూర్వ భాషి వమ్మా!
గతి నీవే నమ్మరొ! శుభ గతిని గొలుపుమా.
శ్లో. నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా. ॥ 50 ॥
184. ఓం నిస్తులాయై నమః.
నామ వివరణ.
సాటియే లేనిది జగన్మాత. ఆమెకు ఆమెయే సాటి ఇతరములు ఆమెతో పోలుటకు
మరేదియు లేదు. అట్టి నిస్తుల అమ్మ.
కం. సాక్ష్యము నీవే జగతికి,
లక్ష్యంబది నినుఁ గనెడి తలంపే కాగా
లక్ష్యముఁ జేర్చెడి జననీ!
లక్ష్యంబును గొల్పు *నిస్తులా*! నా మదిలో.
185. ఓం నీల చికురాయై నమః.
నామ వివరణ.
నల్లని ముంగురులు కలది అమ్మ, ఇది సౌభాగ్యవతి లక్షణము.
కం. మత్తును బాపుచు సతతము
నుత్తేజము గొలపి నన్ను నొప్పుగ నడుపన్
క్షుత్తాప హారి! కృపతోఁ
జిత్తంబున నిలుము, *నీలచికురా*! సతమున్.
186. ఓం నిరపాయాయై నమః.
నామ వివరణ.
అపాయమనునదే లేనిది తల్లి. తాను భక్తులహృదయాలలో నెలకొని యుండి
ఎట్టిఅపాయమునకు తావు కలుగకుండా చూచుకొనునది అమ్మ.
కం. పరికింప నపాయములే
తరచుగ నడుగడుగునందుఁ దప్ప కెదురగున్,
*నిరపాయా*! నీవే మము
కరుణను గాపాడు మమ్మ! కామిత వరదా!
187. ఓం నిరత్యయాయై నమః.
నామ వివరణ.
అతిక్రమింపవీలు లేనిది, లోకమాత. నిరంతరత్వము అనే నేపథ్యముపై ఏకాంతత్వము
అనెడి లక్షణము కలది అమ్మ.
తే.గీ. అక్షరాకృతివైన ని న్నధిగమించ
జాల దెద్దియు లోకాన చాల రెవరు
ని న్నతిక్రమించంగ మా కున్నదీవె,
యంతయున్ నీవెగ, *నిరత్యయా*! మదంబ!
188. ఓం దుర్లభాయై నమః.
నామ వివరణ.
పొందుటకు శక్యము కానిది అమ్మ. ఆమెనె సమీపింపదలచువారికినీ సమీపింప
సాధ్యముకానిది.
కం. మహిత సహస్రారంబున
విహరించుచుఁ గానరావు, వేగమె కృపతో
మహిఁ గనఁబడుమికను, తమో
పహా! శుభద వగుచు, *దుర్లభా*! నినుఁ గొలుతున్.
189. ఓం దుర్గమాయై నమః.
నామ వివరణ.
గమింప శక్యము కానిది. ఎవరికినీ అందనిది అమ్మ. దుర్గమువలె నుండి భక్తులను
కాపాడునదిఅమ్మ.
తే.గీ. దుర్గ మా యమ్మ యని నేను తోచినట్లు
చేరి నీతోడ మారాము చేసియుంటి,
కొడుకు నగుటచేఁ గనఁబోకు కోపమునను,
*దుర్గమా*! నిన్నుఁ బ్రార్థింతు భర్గు రాణి!
190. ఓం దుర్గాయై నమః.
నామ వివరణ.
దుర్గముఁడు అనే రాక్షసుని సంహరించిన దుర్గాదేవి అమ్మ. కష్టమైన పనులను కూడా
సానుకూలపడునట్లు చేయు తల్లి.
కం. దుర్గాసాధన మార్గము
దుర్గమముగ తోచుచుండె *దుర్గా*! సమ్య
ఙ్మార్గము చూపుము తల్లీ!
దుర్గమ! సుగమమగుము, కృపతో ననుఁ గనుమా.!
191. ఓం దుఃఖ హంత్ర్యై నమః.
నామ వివరణ.
దుఃఖమును తొలగించు తల్లి, తనను నమ్మిన వారికి దుఃఖమనునదే లేకుండా చేయు
జనని.
తే.గీ. *దుఃఖ హంత్రీ*! మదంబ! నా దుఃఖ హేతు
వణచి సంతోష సంపదలలరనిమ్ము,
నిన్ను సంతోష భావననెన్ననిమ్ము,
భవ్య! నిన్నెన్ని పద్యముల్ వ్రాయనిమ్ము.
తే.గీ. దుఃఖ హంత్రీ! సుఖంబీవె, త్రోవఁ జూపు
నిత్య సంతోషమార్గమౌ నిన్నుఁ గనెద,
ఘోర సంతాపముల్ నిన్ను చేరనీవు,
దుఃఖముల్ బాపి చేరనీ, దోయలింతు.
192. ఓం సుఖప్రదాయై నమః.
నామ వివరణ.
సుఖమును కలిగించు లోకమాత. భక్తులకు ఐహికాఅముష్మిక సుఖములను కలిగించు
జనని.
కం. మది సేవించెదను *సుఖ
ప్రదా*! యిహ పర సుఖదవయి వర్ధిలఁ జేయన్
బుధ నుత మార్గమునందున
ముదమున నడిపించి నాకు ముక్తిద వగుమా.
తే.గీ. కోరి సృజియించితీవె నన్, ఘోరమయిన
బాపముల్ సేయమంచును వ్రాసితేల?
చేయఁ జాలను పాపముల్ చేరెద నిను,
దారి నీవై *సుఖప్రదా*! చేరనిమ్ము.
శ్లో. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జితా
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా. ॥ 51 ॥ .
193. ఓం దుష్ట దూరాయై నమః.
నామ వివరణ.
దుష్టులకు అందనిది అమ్మ. దుష్తత్వమునకు దూరముగ నుండునది. దుష్టులకు
దూరముగా ఉంచు తల్లి.
తే.గీ. *దుష్ట దూరా*! కృపాసాంద్ర! తోయజాక్షి!
దుష్ట దూరునిగా నన్ను నిష్టతోడ
నీవు రక్షించుచుండుమా నీరజాక్షి!
నిన్ను సేవించుకోనిమ్ము నిరుపమముగ.
తే.గీ. కష్టముల్ గాంచి కరిగితే *దుష్ట దూర*!
స్పష్టమయ్యెను నీ ప్రేమ సౌమ్య భాస!
యిష్టమై తోచు సన్ ముక్తి కష్ట మమ్మ!
పొందగా నేర్వ నద్దానిఁ బొందనిమ్మ.
194. ఓం దురాచార శమన్యై నమః.
నామ వివరణ.
చెడు నడవడికను పోగొట్టునది. నమ్ముకొనితనను అర్చించే భక్తులయందలి
దురాచారములను అంతరింపఁజేయు తల్లి.
తే.గీ. కను *దురాచార*! కలుషలోకమును నీవు,
భువి దురాచార వృద్ధిచే భవిత శూన్య
మగుచు పాపమను వెఱపు మరుగు పడెను,
యీ దురాచారముల్ వాపి యాదుకొనుము..
195. ఓం దోషవర్జితాయై నమః.
నామ వివరణ.
దోషములచే విడిచిపెట్టఁబడిన జనని. తనలో దోషమనెడిదే లేని లోకేశ్వరి.
తే.గీ. దోష వర్జితవైన నీ తోడ సాటి
లేదు లేదమ్మ! జగతిలో లేదు లేదు,
*దోష వర్జితా*! నాలోని దోషములను
పరిహరించి నన్ గావుమా భక్త సులభ!
కం. *దోషవివర్జిత*! రాగము,
ద్వేషము మాకేలఁ గొలిపి వీక్షింతువొ? యీ
దోషములను విడఁ జేయుచు
భాషించుము నా మనంబు పరవశమందన్.
196. ఓం సర్వజ్ఞాయై నమః.
నామ వివరణ.
సమస్తమును తెలిసినది లలితామాత. ఆమెకు తెలియనిదేదియు లేనిది.
కం. *సర్వజ్ఞా*! యఘజాలము
సర్వము నశియించు నీదు సంస్మరణమునన్,
ఖర్వము చేయుము దుర్గతి
సర్వంబును, నిన్నె నమ్మి శరణంబంటిన్.
తే.గీ. నేను సర్వజ్ఞుఁడను కాను నిన్ను చేర
కున్న, నీ కృప సుజ్ఞాన మున్నత గతి
నొసగ, నినుఁ గాంచి ధన్యత నొనర గనుదు.
నిన్ను వేడెద *సర్వజ్ఞ*! నన్ను గనుమ.
197. ఓం సాంద్రకరుణాయై నమః.
నామ వివరణ.
గొప్ప కరుణ కలది. దట్టమయిన కరుణాస్వరూపిణి అమ్మ.
ఉ. అమ్మరొ! నీ కృపామృతమనంతము కోరకనే లభించు, నిన్
నమ్ముచునున్న. *సాంద్ర కరుణా*! మది నమ్మితి నమ్మ నిన్ను, భా
వమ్మున నిన్నుఁ జూడఁ దగు భక్తిని సార్థక నామధేయ! నా
కిమ్ము ముదమ్మునన్, వరలనిమ్ము మహిన్ మహనీయ భక్తులన్.
198. ఓం సమానాధిక వర్జితాయై నమః.
నామ వివరణ.
ఎక్కువ తక్కువ భేదములచే విడిచిపెట్టబడినది. తనకు సమానులు, తనకంటె అధికులు
లేని జనని.
కం. శ్రీ ధవళాక్షి సతి! *సమా
నాధిక వర్జిత!* గ్రహించ నధికము నీకున్
లేదెచ్చట, నీవే స
ద్బోధను కలిగింపుమమ్మ! బుధజన వినుతా!
శ్లో. సర్వశక్తిమయీ సర్వమంగలా సద్గతి ప్రదా
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణీ. ॥ 52 ॥
199. ఓం సర్వశక్తిమయ్యై నమః.
నామ వివరణ.
సర్వ శక్తిస్వరూపిణి. అన్ని విధములయిన శక్తియు స్వరూపముగా కలది అమ్మ.
కం. సముచిత చిచ్ఛక్తి నిడుచు
క్షమఁ గొలుపుచు, గాచు *సర్వశక్తిమయీ*! నా
భ్రమలను బాపుచు నిన్ మది
ప్రముదంబునఁ గొలువఁ జేసి, పాలింపుము నన్..
200. ఓం సర్వమంగలాయై నమః.
నామ వివరణ.
సర్వమంగళ స్వరూపిణి. సర్వకాల సర్వావస్థలయందును పవిత్రముగా ఉండు తల్లి.
సర్వమును పవిత్రముగా ఉంచు తల్లి.
ఉ. సర్వము నీవెయై సతము సన్నుతి వెల్గెడి *సర్వమంగలా*!
పర్వమె నిన్ భజించిన సభక్తిగ నే దినమైన నద్ది,, నీ
నిర్వహణమ్మునందు మహనీయ శుభాకరమమ్మ! చూడ నీ
యుర్విని దుర్విదగ్ధులకు నూర్జిత గర్వము ఖర్వమే సతీ!
ఓం సద్గతిప్రదాయై నమః.
నామ వివరణ.
సద్గతిని ప్రసాదించు తల్లి. బ్రహ్మలోకప్రాప్తిని ఇచ్చు తల్లి, ఇహ పర సుగతిని
యిచ్చుఅమ్మ. స్థూలము నుండి సూక్ష్మమునకు సద్ గతిని ఇచ్చు జనని.
చం. నుతమతి! నీవు సద్గతి ననూనముగాఁ గలుగంగఁ జేయుచున్
గ్షితిఁ గల నీదు భక్తులకుఁ గ్షేమము గూర్చుచునుందువమ్మ! స
న్నుత మహితాత్ములెన్నుచుఁ గనుంగొన నేర్తురు నిన్ను నాత్మలన్,
గతివయి నాకు సద్గతిని గల్గఁగఁ జాఅజేయుము *సద్గతిప్రదా*!
202. ఓం సర్వేశ్వర్యై నమః.
నామ వివరణ.
సమస్త విశ్వమునకు ప్రభ్వి అమ్మ.
కం. *సర్వేశ్వరీ*! భవానీ!
సర్వంబును నీవె కాన సత్వప్రభలన్
సర్వత్ర నింపుచును మా
గర్వంబు నణచి సుగతిని గల్పింపు మికన్.
203. ఓం సర్వమయ్యై నమః.
నామ వివరణ.
విశ్వమంసాఅతటనూ అణువణువున నిండి యుండు తల్లి.
కం. *సర్వమయీ*! జగదీశ్వరి!
పర్వంబది నిన్ భజించు పావన దినమే,
గర్వంబు విడిదిఇఇఇఇఇచి, నీవే
సర్వం బనువారిఁ గాచు శాంభవి! ప్రణతుల్.
204. ఓం సర్వ మంత్ర స్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
అన్నిమంత్రముల యొక్క స్వరూపము అమ్మయే. అక్షరాకృతిలో శబ్దాకృతిలో ఉండు
అన్నియూ అమ్మ స్వరూపమే.
తే.గీ. *సర్వ మంత్ర స్వరూపిణీ*! జయ నిధాన!
కలుగు మంత్రార్థ భావముల్ గాంచ నేర,
నీవె మంత్రంబు లగుటను నిన్నె తలచి
మంత్ర పఠనంబుఁ జేసెద మంచినెంచి.
శ్లో. సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ ।
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ॥ 53 ॥
205. ఓం సర్వ యంత్రాత్మికాయై నమః.
నామ వివరణ.
అన్ని యంత్రములకు ఆత్మ అమ్మయే.
తే.గీ. *సర్వ మంత్రాత్మికా*! లసత్ స్వర విభాస!
స్వర సమన్విత మంత్రాత్మవై వెలుంగు
నిన్ను గ్రహియింపఁ జాలను, నే మనమున
నిల్పి సాధనఁ జేసితిన్ నినుఁ గనుఁగొన.
206. ఓం సర్వ తంత్ర రూపాయై నమః.
నామ వివరణ.
అన్ని తంత్రములును తన రూపముగా కలది జగజ్జనని.
ఆ.వె. *సర్వతంత్ర రూప*! సర్వేశ్వరీ! మదిన్
గొలువు తీరుమమ్మ! కలిమిఁ జూపి,
నీకు నిలయమగుచు నీపైన భక్తితోఁ
బద్యములను వ్రాసి పరవశింతు..
ఆ.వె. *సర్వ తంత్ర రూప*! సన్నుత పార్వతీ!
తంత్ర శాస్త్రమేను తలప నేర,
కాన, నేను నిన్ను గనలేకపోయినన్ంగరుణఁ జూపి నీవె కనగ రమ్ము.
207. ఓం మనోన్మన్యై నమః.
నామ వివరణ.
మనోన్మనీ ముద్రారూపిణిఅమ్మ. మననస్థితిలోమేల్కాంచిన మననము చేయబడునట్టిది
అమ్మ.
తే.గీ. ఓ *మనోన్మనీ*! నీ యండయున్న నేను
సరస సుమనస్స్థితిన్ దాటి సత్యము గన
నున్మనస్స్థితిఁ బొందనౌ నొప్పిదముగ,
నట్టి సత్ స్థితిన్ నినుఁ గాంతు పట్టుపట్టి.
208. ఓం మహేశ్వర్యై నమః.
నామ వివరణ.
మాయాంతు ప్రకృతిం విద్యా, మాయినంతు మహేశ్వరః. అట్టి మహేశ్వర
సంబంధమయినది మహేశ్వరి.
పంచచామరము..
*మహేశ్వరీ*! వసుంధరన్ ప్రమాదముల్ జనాళికిన్
మహాపదల్ జనింపఁ జేసి మట్టిఁ గల్పుచుండగా
మహేశ్వరుండు, నీవునున్ బ్రమాదముల్ గణింపరే
మహాత్ములీరు కావకున్న మాకు దిక్కెవండికన్?
209. ఓం మహా దేవ్యై నమః.
నామ వివరణ.
మహిమాన్వితమయి ఆధిపత్యము కల దేవి మహేశ్వరి. గొప్పతనమునకు ఆధిపత్యము
వహించు లోకమాత.
కం. కరుణింపు *మహాదేవీ*!
నిరపాయపు మార్గమునను నీవె నడుపుమా.
పరమానందముతోడను
వరగుణ నీ సేవ చేసి వర్ధిలనిమ్మా.
210. ఓం మహాలక్ష్న్యై నమః.
నామ వివరణ.
గొప్పవైన విశిష్ఠమయిన లక్ష్ములు కలది. కొల్హాపుర అధిష్ఠాన దేవత.
కం. శ్రీద! *మహాలక్ష్మీ*! నిన్
మోదముతోఁ గొలువఁ జేసి, పుణ్య ఫలముచే
నీ దరిఁ జేరగనిమ్మా,
ఖేదంబును బాపు జనని! కృపఁ గనుమమ్మా.
211. ఓం మృడప్రియాయై నమః.
నామ వివరణ.
మృడ అనగా ఆనందము.. ఆనంద స్వరూపుడు శివుఁడు. ఆనందమునందు యిష్టము
కలతల్లి, ఆనందస్వరూపుఁ డయిన పరమేశ్వరుని యందు ప్రీతి కలది జగన్మాత.
కం. మృడుడానందమయుండై
యడుగడుగున సంతస మిడు, నతనికి నిఁక నీ
కెడ లేదు, మిమ్ముఁ గొలిచెద
*మృడప్రియా*! సతము నాకు మేలుఁ గొలుపుమా.
శ్లో. మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ ।
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ॥ 54 ॥
212. ఓం మహా రూపాయై నమః
నామ వివరణ.
అవ్యక్తమునుండి మహత్తత్త్వము.. తద్ద్వారా ఈ అనంత సృష్టి, యిదంతయు మహారూపమే
ఈ మహారూపము అమ్మయే. కావున అమ్మ మహారూప.
కం. శ్రీపాదా! వినుత! *మహా
రూపా*! నిను శరణు వేడ రూఢిగ జనులన్
గాపాడెడి జననివి కద,
నాపై దయఁ జూపుమమ్మ! నమ్మితి నిన్నున్.
213. ఓం మహా పూజ్యాయై నమః
నామ వివరణ.
గొప్పగా పూజింపఁబడునది, బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులచే పూజింపఁబడునది,
పూజింపఁబడు అన్ని రూపములూ ఆమెయే అయి యుండి పూజింపఁబడు తల్లి.
కం. కరుణించు *మహాపూజ్యా*!
నిరుపమముగ నిన్ను నేను నిత్యము కొలుతున్
శరణము, నిన్నే చేరెద,
తరణోపాయమును జూపి దరిఁ జేరగనీ.
214. ఓం మహా పాతక నాశిన్యై నమః.
నామ వివరణ.
సామాన్యమయిన తెలిసీ తెలియక చేసిన వాటి ఫలముగా సంభవించిన పాపములనే కాక
మహా ఘోర పంచమహా పాతకములను కూడాతనను విశ్వసించి ఆరాధించువారినుండి
నశింపచేయు తల్లి.
తే.గీ. నమ్మితిని *మహా పాతక నాశిని*! నిను,
పట్టి పీడించు నామహాపాతకముల
నాశ మొనరించి రక్షించు నన్ను నీవు,
నీవె దిక్కమ్మ! నన్ బ్రోవు మీవె కృపను.
215. ఓం మహా మాయాయై నమః.
నామ వివరణ.
బ్రహ్మాది దేవతలను కూడామాయలో కొట్టిమిట్టాడునట్లు చేయగల తల్లికావున యీమె
మహామాయ.
కం. కలిగించు *మహా మాయా*!
తుల లేని ప్రశస్త భక్తి, తోడుగ ధ్యాసన్,
తొలగించు మాయ పొరలను
కలుష గుణ విదార వగుచుఁ గావుము నన్నున్.
216. ఓం మహా సత్త్వాయై నమః.
నామ వివరణ.
గొప్పబలము గుణము కలది మహాసత్త్వ. అమ్మను మించిన బలము వేరేదియు లేదు,
అమ్మకు మించిన బలమున్నది వేరొకటి లేదు. కావుననే అమ్మ మహా సత్వ.
తే.గీ. సత్త్వ మిమ్మిక నో *మహా సత్త్వ*! నా క
విత్వమందున వెలుఁగుచు విశ్వ జనని!
సత్త్వమన్నది నీవే, ప్రశాంత రూప!
సత్కవిత్వమునను సత్త్వసరణి నీవె,
217. ఓం మహా శక్త్యై నమః
నామ వివరణ.
అనంతమైన శక్తులు కలది, అనంతమైన సమర్ధత కలది అమ్మ. సృష్టిని అనంత శక్తులను
ప్రసాదించున దమ్మయే. కావుననే ఆమె మహాశక్తి.
కం. దయఁ జూడు *మహా శక్తీ*!
ప్రియమున చిచ్ఛక్తినిమ్ము విశ్వ సువేద్యా!
క్షయ రహిత ముక్తి నొసగుము,
భయహారీ! నిన్ను గొలిచి ప్రార్థింతును నేన్.
218. ఓం మహా రత్యై నమః.
నామ వివరణ.
సమస్తమైన అనురక్తులకు మూలము అమ్మ.కావుననే అమ్మ మహారతి.
కం. తృప్తిగ నాదగు జన్మ స
మాప్తము గాఁ గోరెద, నిఁక మహిమన్ మదిలో
గుప్తంబుగఁ గల వీవే
దీప్తిని గొలుపుము, *మహా రతీ*! నిను గొలుతున్.
శ్లో. మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥
219. ఓం మహా భోగాయై నమః.
నామ వివరణ.
అష్ట భోగములకు మూలరూపమే అమ్మ. ఎవరు ఏ భోగమనుభవించుచున్నను అది అమ్మ
ప్రసాదించినదే. కావున అమ్మ మహాభోగయే.
కం. కరుణించు *మహా భోగా*!
నిరుపమ భవదీయ పాదనీరజ సేవే
వరమగు భోగము నాకున్,
కరుణను సేవించనిమ్ము, కమల దళాక్షీ!
220. ఓం మహైశ్వర్యాయై నమః.
నామ వివరణ.
అష్ట ఐశ్వర్య స్వరూపిణిఅమ్మ. అష్టైశ్వర్యములను అనుభవించువారికి ప్రసాదించుచున్నదీ
అమ్మయే. కావుననే అమ్మ మహైశ్వర్య.
కం. దయఁ జూడు *మహైశ్వర్యా*!
క్షయమెఱుఁగని జ్ఞాన మిమ్ము, కాదనకమ్మా!
ప్రియ ముక్తి మహైశ్వర్యము
జయ వర్తనఁ గొలుపు మమ్మ! సద్గుణ వరదా!
221. ఓం మహా వీర్యాయై నమః.
నామ వివరణ.
అనన్య అసాధారణమైన వీర్యము కలది అమ్మ. జగత్తును సృష్టించుటకు కారణమైన మహా
వీర్యము కల్లది అమ్మ.
తే.గీ. కావు మీవే *మహా వీర్య*! కనుచు నన్ను,
శత్రుషట్కము వేధించి జ్ఞానరత్న
మపహరింపగ చూచు ననారతమును,
నిన్ను మించిన దిక్కేది నన్నుఁ గావ.
222. ఓం మహాబలాయై నమః.
నామ వివరణ.
అమ్మకున్న బలమునకు మించిన బలము ఎక్కడనూ ఉండదు. కావుననే అమ్మ మహాబల.
భండాసురునితో యుద్ధసమయంలో మహాసైనికబలము కలది అమ్మ.
తే.గీ. నీదు బలము *మహాబలా*! నేను చెప్ప
సాధ్యమెట్లగు? సృష్టిలో సకల బలము
నీవె యన్నది నిజమమ్మ! నీవె నాకు
చెప్ప లేనంత బలమమ్మ! చిత్ప్రభాస!
223. ఓం మహాబుద్ధ్యై నమః.
నామ వివరణ.
గొప్పబుద్ధి కలది అమ్మ. అన్ని జీవుల యొక్క సమిష్టి బుద్ధి తానై ఒప్పునది మహాబుద్ధి మన
అమ్మ.
కం. కరుణించు *మహా బుద్ధీ*!
నిరుపమ కవితానురక్తి నిండుగనిమ్మా,
పరహిత బుద్ధి నొసంగుమ,
సురుచిరముగ నా కవితను శోభిలనిమ్మా.
224. ఓం మహా సిద్ధ్యై నమః.
నామ వివరణ.
అష్ట సిద్ధులూ తానే అయి యొప్పు అమ్మ మహాసిద్ధి. ఇహ పరములకు సంబంధించిన
సిద్ధులు అమ్మ రూపమే కాన అమ్మమహాసిద్ధి.
కం. కరుణించు *మహాసిద్ధీ*!
పరమును సిద్ధింపఁ జేయ భవ్యాత్మ! నినున్
నిరుపమ రీతినిఁ గొలిచెద,
కరుణాలయ! నీవె దిక్కు, కాదనకమ్మా!
225. ఓం మహా యోగీశ్వర్యై నమః.
నామ వివరణ.
మహాయోగీశ్వరులకే అమ్మఈశ్వరి కాన మహాయోగీశ్వరేశ్వరి అమ్మ.
కం. క్షమఁ గలిగి నినుఁ గొలుచువా
రె *మహా యోగీశ్వరీ*! సు కృతు లిలఁ దలపన్ ,
క్షమ లేని జన్మ వ్యర్థము
క్షమ నొసఁగుము, క్షేమ మిడుము, కరుణాపూర్ణా!
శ్లో. మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥
226. ఓం మహాతంత్రాయై నమః.
నామ వివరణ.
గొప్పవైన కులార్ణవ జ్ణానార్ణవాది తంత్రములయియున్న తల్లి అమ్మ. శ్రీవిద్య
నిరూపింపబడినది తంత్రము తంత్రస్వరూపిణి జగన్మాత.ఇహపరసాధక తంత్రస్వరూపిణి
అమ్మ.
కం. కరుణించు *మహా తంత్రా*!
పరమేశ్వరి! యెఱుఁగ నమ్మ! పర తంత్రములన్,
సురుచిర సుందర భావన
కిరవయి మది నిలు, సతీ! యహీన కృపాబ్ధీ!
227. ఓం మహామంత్రాయై నమః.
నామ వివరణ.
బాలా, బగళా మున్నగు మంత్రస్వరూపిణి అమ్మ. బీజాక్షరములు
అమ్మయే. మంత్రములందు గల వర్ణ సమూహము అమ్మయే.
కం. హేలగ కావుము జగతిని,
బాలాబగళాది మంత్ర భాసిత జననీ!
నీ లీల *మహామంత్రా*!
నాలో కవితామృతమ్ము, నయ జయ శుభ దా!
228. ఓం మహా యంత్రాయై నమః.
నామ వివరణ.
పూజా చక్ర, పద్మచక్ర, అమృతఘట, మేరులింగాది మహాయంత్రముల రూపమున గల తల్లి.
గొప్పదయిన సిద్ధవజ్ర యంత్రము అమ్మయే.
కం. శ్రీచక్ర *మహా యంత్రా*!
నీచే వర్ధిల్లు జగతి! నీ యంత్ర ధృతిన్,
నాచేఁ జెప్పించుము, తగు
సూచనల నొసంగుచుండి, శోభిలు మదిలోన్.
229. ఓం మహాసనాయై నమః.
నామ వివరణ.
మహా యంత్రాలు నివాస స్థానముగా కలది కావున అమ్మ మహాయంత్రస్వరూపిణి.
తే.గీ. సర్వ తత్వాశ్రయవు నీవు శంభురాణి !
జగతియే యాసనమ్ముగఁ జక్కనొప్పెఁ
గద *మహాసనా*! నీకు, నీ కడ వసింతు
తృప్తిగా మోక్ష మదియె సంప్రాప్తమగుత.
230. ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః.
నామ వివరణ.
బ్రాహ్మీ మొదలగు అరువదినాలుగు యోగినీ పూజలతో కూడినటువంటి
పూర్ణఫలములనిచ్చు యాగ స్వరూపిణిఅమ్మ.
సీ. యాగ సద్విజ్ఞాన మరయంగఁ జేసెడి ధీనిధివైన విజ్ఞాన రత్న
మా! *మహాయాగక్రమారాధ్య*! జీవన గమనంబె యాగము కనుచు నీవు
సక్రమ మార్గాన సన్నుత వర్తనన్ మసలగ మము సేసి మహితమైన
జ్ఞాన యజ్ఞంబులన్, గౌరవంబుగ మమ్ము నడుపుచు నిన్ జూడ నడవ నిమ్ము,
తే.గీ. సన్మహా యాగ పథమున సక్రమముగ
నడుపు మమ్మ! బోధను గొల్పి నమ్మకముగ
నిన్ను నమ్మిన వారికి నిరత మీవు
యజ్ఞ ఫలముల నిమ్ము, మహత్వ మిమ్ము.
231. ఓం మహా భైరవ పూజితాయై నమః.
నామ వివరణ.
సపత్నీకులైన అష్టభైరవుల మహారూపమే మహాభైరవుఁడు, అట్టి మహాభైరవుని
పూజలందుకొను తల్లి శ్రీలలితామాత.
కం. శోభిలఁ జేయగ జగతి, *మ
హా భైరవ పూజితా*! సహాయము కమ్మా.
ఓ భగవతి నీ కృపచే
లోభాదులు వీడి జగతిలో వెలిఁగెద నేన్.
శ్లో. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥
232. ఓం మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణ్యై నమః!
నామ వివరణ.
సృష్టిని లయము చేయు వేళలో శివుఁడుమహాతాండవము చేయుసమయమున సృష్టిలో
అమ్మ తప్ప మరెవ్వరూ లేని సమయములో ఆ తల్లియే ఆనాట్యమునకు సాక్షిగా
ఉన్నందున మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షి..
స్వయం కల్పిత
తాండవ సాక్షి వృత్తము.
గణములు.. జ స భ త జ గ. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణీ* !
యిహంబునను నీవే మహిమొప్పన్ ననుఁ గావుమా.
మహిన్ శుభములన్ గొల్ప మనోజ్ఞంబుగఁ గొల్తు నిన్
మహేశ్వరునితోనుండు మదిన్, జేసెద సేవలన్.
233. ఓం మహా కామేశ మహిష్యై నమః.
నామ వివరణ.
అమ్మ మహాకామేశ్వరునిపట్టపురాణి. ఈశ్వరుఁడు యావత్సృష్టికీ
మహాకామేశ్వరుఁడు. అట్టి పరమేశ్వరునికి పట్టమహిషి మన అమ్మ
కం. శ్రీకామేశు హృదయమ! *మ
హా కామేశ మహిషీ* ! జయమ్మగు నీకున్.
నా కామితార్థ ముక్తిని.
కం. శ్రీకామేశు హృదయమ! *మ
హా కామేశ మహిషీ* ! జయమ్మగు నీకున్.
నా కామితార్థ ముక్తిని
శ్రీకరముగ కొలుపు తల్లి! చేకొనుము నతుల్.
234. ఓం మహా త్రిపుర సుందర్యై నమః.
నామ వివరణ.
త్రిపుట నగరాలతో తాదాత్మ్యత పొందిన సౌందర్యరూపిణి అమ్మ.
ఆ.వె. లోనఁ గలుగు త్రిపుటి లోపల గల మహా
త్రిపురము లట కొలువు తీరితీవు.
చిద్విరాజమాన చిన్మూర్తి! శ్రీ *మహా
త్రిపుర సుందరీ*! నుతింతు నిన్ను.
శ్లో. చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥
235. ఓం చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః.
నామ వివరణ.
అరువదినాలుగు ఉపచారములచే సేవింపఁబడు శ్రేష్ఠమైన దేవత. అరువది నాలుగు
విధములైన మనో గమన ఉపచారములతో న్జక్తుఁడు ఆరాధించే ఆత్మ అనెడి దేవత.
కం. ఆఢ్యా! నను మది కృపఁ గని
తోఢ్యాణ విభూషితా! *చతుష్షష్ట్యుపచా
రాఢ్యా*! దేవ వినుత! గం
ధాఢ్యా! వందనము లందుమా, దయఁ గనుమా.
236. ఓం చతుష్షష్టి కలా మయ్యై నమః.
నామ వివరణ.
అరువదినాలుగు కళలూ అమ్మయే. అన్ని కళలూ ఆమెనుండి సంభవించినందున అమ్మ
చతుష్షష్టికళామయి.
తే.గీ. ప్రేమఁ గను *చతు ష్షష్టిక లామయి*! నిను
నియమముగ గొల్తు, మదిలోన నిలువుమమ్మ!
ముక్తి నొసగెడి సత్కళల్ పూర్తిగనిడి
నన్ను కాపాడుమమ్మరో! సన్నుతింతు.
237. ఓం మహాచతుష్షష్టికోటి యోగినీ గణ సేవితాయై నమః.
నామ వివరణ.
ఒక్కొక్క ఆవరణలో అరువదినాలుగుకోట్ల చొప్పున తొమ్మిది ఆవరణములలోను
యోగినులచే పూజింపబడు తల్లి లలితాంబ.
స్వయం కల్పిత
యోగినీగణ వృత్తము.
గణములు.. ర య జ ర స వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
ఓ *మహాచతుష్షష్టికోటి యోగినీ గణ సేవితా*!
నీ మనోజ్ఞ రూపంబు చూచి నేను పొంగెద నీశ్వరీ!
ధీమణుల్ నినుం గాంచుచుంద్రు, తృప్తితో మది నిన్ గొల్తురే,
నీమమొప్ప నేనున్ నినున్ గణించుచున్ మది పొంగనీ.
శ్లో. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥
238. ఓం మను విద్యాయై నమః.
నామ వివరణ.
మనువు ఉపదేశించిన మంత్రము యొక్క స్వరూపము అమ్మ మన్నువిద్య.
కం. *మను విద్యా*! మహిమాన్విత!
కనవేల భవాని నన్నుఁ గరుణను? జననీ!
మనమందు నిలిచి యుండియు
కనరావుగ, చిత్ర మిదియె, కామిత వరదా!
239. ఓం చంద్ర విద్యాయై నమః.
నామ వివరణ.
ఆమె చంద్రమండలమును ఆధారముగా గొని పూజింపఁబడుచున్నది. కావున అమ్మచంద్రవిద్య.
తే.గీ. *చంద్ర విద్యా*! శశాంకుఁడే సన్నుతముగ
నిన్నుపాసించ తద్విధి నున్న నీవు
చంద్ర విద్యగ భక్తులన్ జక్కగఁ గని
యేలుచుంటివి, నన్నునీ వేలుమమ్మ!
240. ఓం చంద్రమండల మధ్యగాయై నమః.
నామ వివరణ.
చంద్రమండలము యొక్క మధ్య భాగమున ఉండునది అమ్మ. శ్రీచక్రమే
చంద్రమండలము. అక్కడ ఉండునదే అమ్మ.
తే.గీ. *చంద్రమండల మధ్యగా*! సరసిజాక్షి!
నీదు క్రీగంటి చూపుకే నిఖిల జగతి
మంగళంబుల నెలవయి మనుచునుండు,
నీదు కృపఁ గని బ్రతుకుదు మోదమునను.
241. ఓం చారు రూపాయై నమః.
నామ వివరణ.
మనోజ్ణమైన రూపము కలది అమ్మ. ప్రతీ అణువునందూ తానే ఉన్నందున అందమైన
వస్తువులు అమ్మ యొక్క మనోజ్ణతను సంతరించుకొనుటచే ఆదరణీయమగుచున్నవి.
అంమనగా అమ్మయే.
తే.గీ. *చారు రూపా*! ప్రసన్నాక్షి! జయ నిధాన!
లేరు నినుఁ బోలి మేల్చేయు వారు జగతిఁ
గలిగి యుంటివి నీవేను జ్ఞాన తేజ!
వందనము లందుకొమ్మ, సద్వందిత పద!
242. ఓం చారు హాసాయై నమః.
నామ వివరణ.
అందమయిన నవ్వుతో ప్రకాశించునది అమ్మ. ఆనందపారవశ్యముననే చారుహాసము
సంభవించును. నిరంత రానంద స్వరూపిణి అయిన అమ్మ అపరిమిత చారుహాస.
తే.గీ. *చారు హాసా*! కృపోద్భాస! సత్ ప్రకాశ!
నీదు చిరుహాసమున సృష్టి నిలుచునమ్మ!
పండు వెన్నెలల్ కురిపించి పద్య కృతులు
వెలయగాఁ జేయ నీ కృపన్ నిలుమ మదిని.
243. ఓం చారు చంద్ర కలాధరాయై నమః.
నామ వివరణ.
అందమైన చంద్రుని కళను ధరించునది మన అమ్మ.
తే.గీ. *చారు చంద్ర కలాధరా*! సత్వ రూప!
సంస్తుతింపగ నిన్ను నే చాలనమ్మ!
చలువ చిందెడి నీ చూపు చాలునమ్మ
లోకములకెల్ల శుభములే, ప్రాకటముగ.
శ్లో. చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥
244. ఓం చరాచర జగన్నాథాయై నమః.
నామ వివరణ.
ఈ చరాచర జగత్తునకు ప్రభ్వి అమ్మ. కదలని వస్తువులో కదలని లక్షణాన్ని,కదిలే
వస్తువులోకదిలే లక్షణాన్ని కలిగినది అమ్మ.
కం. మోదంబున ననుఁ గావగ
రాదా? సురనుత *చరాచర జగన్నాథా*!
నీ దయయే లేకుండిన
నేదారియు లేదు నా యనిష్ట విదూరా!
245. ఓం చక్రరాజ నికేతనాయై నమః.
నామ వివరణ.
అతిముఖ్యమైన చక్రమునిలయముగా కలది అమ్మ. జగచ్చక్రకేంద్రమే నిలయముగా కలది
అమ్మ.షట్ చక్రములలో అతి ముఖ్యమైన మసహస్రారము నిలయముగాకలది అమ్మ.
తే.గీ, *చక్రరాజ నికేతనా*! సన్నుతముగ
శాంతి గొల్పుము నాలో, ప్రశాంతి కలుగ
నిన్ను మదిలోన తృప్తిగా మన్ననమునఁ
గొలిచి పద్యంబులను వ్రాసుకొనుదునమ్మ.
246. ఓం పార్వత్యై నమః.
నామ వివరణ.
పర్వత రాజయిన హిమవంతుని పుత్రిక పార్వతి మన అమ్మయే.
తే.గీ. *పార్వతీ*! పర దేవతా! పరమశివునిఁ
బొంద భక్తిని గొలిచితి వందు వలనఁ
బొందగలిగితి వట్టు లేన్ బొంద ముక్తి
మార్గమును గొల్పి చూపుమా మహిమ, జనని!
247. ఓం పద్మనయనాయై నమః.
నామ వివరణ.
పద్మములవంటి నయనములు కలది జగన్మాత.
తే.గీ. *పద్మ నయనా*! పరాత్పరా! భక్తులపయిఁ
బడిన చాలును నీ దృష్టి వరలఁ గలరు,
నిన్ను సతతంబు కొలిచెడి నీ సుతుండ,
చూడుమా నను కృపతోడ, శుభ సుచరిత!
248. ఓం పద్మరాగ సమప్రభాయై నమః.
నామ వివరణ.
పద్మరాగమాణిక్యకాంతితో సమానమైన శరీర కాంతితో ప్రకాశించుతల్లి లలితాంబ.
తే.గీ. *పద్మరాగ సమప్రభా*! ప్రకృతిలోని
జీవకళ నీదు ప్రభయే, ప్రసిద్ధమిదియు,
నాదు జీవంబు నీ ప్రభ, నీదు కృపకుఁ
బాత్రుఁడనయి ముక్తిని గని పరవశింతు.
శ్లో. పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥
249. ఓం పంచ ప్రేతాసనాసీనాయై నమః.
నామ వివరణ.
బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను ఆసనముగా కలిగి కూర్చొని యున్న తల్లి
లలితాంబ. పంచ భూతాత్మక దేహ పీఠముపై అధివసించు జనని.
స్వయం కల్పిత
సుఖాసీన వృత్తము.
గణములు.. మ ర ర జ జ గ.. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*పంచ ప్రేతాసనాసీన! పార్వతీ పరమేశ్వరీ*!
కాంచన్ నిన్నున్ మనంబందు గౌరవంబు రహించునే,
పంచత్వంబున్ గనన్ నేను, భారమీవు వహించుటన్,
మంచిన్ నీవే మదిన్ బెంచు, మాన్యతన్ మహనీయతన్.
250. ఓం పంచ బ్రహ్మ స్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
ఈ అమ్మ యొక్క లీలలు పంచపురుషులైనారు. వారు ఈ అమ్మయే పంచ బ్రహ్మల
స్వరూపమైనది అమ్మ. పరిపూర్ణ జ్ణాన స్వరూపము అమ్మయే.
తే.గీ. *పంచ బ్రహ్మ స్వరూపిణీ*! సంచితమగు
కర్మ ఫలములఁ బాపుచు ధర్మ మార్గ
వర్తిగాఁ జేసి నిన్ గను భాగ్యమిమ్ము,
ముక్తి మార్గంబునన్ నిల్పు పూజనీయ!
ఓం చిన్మయ్యై నమః.
నామ వివరణ.
చిత్ అభేదాత్ చిన్మయీ, చిత్తుకంటే వేరు కానిది చిన్మయి, అమ్మయే చిత్ కావున అమ్మ
చిన్మయి.
తే.గీ. *చిన్మయీ*! నాదు మదిలోనఁ జేరి నిలిచి,
చిన్మయానందమును గొల్పు శ్రీకరముగ,
చేయనీయకు దురితముల్ జీవితమున,
నిన్నె నమ్మితి నా తల్లి! నీరజాక్షి!
252. ఓం పరమానందాయై నమః.
నామ వివరణ.
ఉత్కృష్టమయిన ఆనందము ఎక్కడ కలదో అది పరమానందము. అట్టి పరమానందము
అమ్మయే.
కం. *పరమానందా*! ముక్తిని
వరముగ దయ నిమ్ము జనని! భక్తిని గొలుతున్,
భరమా ముక్తినొసంగుట?
నిరుపమ వర దాత్రివనుచు నిన్నడిగితి నేన్.
253. ఓం విజ్ఞాన ఘన రూపిణ్యై నమః.
నామ వివరణ.
చైతన్యము యొక్క అఖండ స్వరూపమే విజ్ణానము. అట్టి చైతన్యమునకు మూలమయిన
అమ్మ విజ్ణాన ఘనరూపిణి.
కం. నా వేల్పీవే శర్వా
ణీ! *విజ్ఞాన ఘన రూపిణీ*! వందనముల్.
శ్రీవిద్య నాకదేలో
నీవే మది నిండియుండ, నిరుపమ జననీ!
శ్లో. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥
254. ఓం ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయై నమః.
నామ వివరణ.
ఉపాసన క్రియ, ఉపాసకుఁడు, ఉపాస్య దేవత, ఈ మూడు రూపములూ అమ్మయే.
కం. విద్యా ఫలమీవే, *ధ్యా
న ధ్యాతృ ధ్యేయ రూప*! నా జనయిత్రీ!
సద్యోగము నినుఁ గనుటే,
నా ధ్యేయంబదియె, తీర్చు నన్ గృపఁ గనుచున్.
255. ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః.
నామ వివరణ.
సగుణారాధకులకే ధర్మాధర్మములుండును. అమ్మ నిర్గుణ స్వరూపిణి కావున
ధర్మాధర్మములు ఉండనందున అమ్మ ధర్మాధర్మవివర్జితయే.
కం. *ధర్మాధర్మ వివర్జిత*!
ధర్మాధర్మములు తెలిపి తల్లీ నీవే
ధర్మంబున నడిపింపుము
దుర్మార్గము వీడఁ జేసి, దుర్గామాతా!
256. ఓం విశ్వ రూపాయై నమః.
నామ వివరణ.
విశ్వము యొక్క రూపముగా ఉన్న తల్లి. కనిపించెడి, కనిపించని సమస్త విశ్వమూ అమ్మ
యొక్క రూపమే.
తే.గీ. *విశ్వ రూపా*! జగన్మాత! విశ్వమందు
నీవు లేనిది లేదమ్మ! భావమీవె
జీవనంబును నీవే, ప్రసిద్ధమిదియె,
నిన్ను నమ్మితి కావుమా నన్ను సతము.,
257. ఓం జాగరిణ్యై నమః.
నామ వివరణ.
జాగ్రదవస్థను సూచించు జననిజాగరిణి మన అమ్మ.
ఉ. జాగ్రదవస్థలో నిలుపు *జాగరిణీ*! నను నిత్యమున్ గృపన్,
నిగ్రహ శక్తినిమ్ము, గణనీయ మహోన్నత భక్తినిమ్ము, స
మ్య గ్రమణీయ సాధనను మాన్య! నినున్ భజియించు తత్వమి
మ్ముగ్రత వీడి ప్రేమగ మహోత్తమ సత్ఫలమిమ్ము నాకిఁకన్.
258. ఓం స్వపంత్యై నమః.
నామ వివరణ.
స్వప్నావస్థను సూచించు జనని.
కం. కన స్వప్నములకు సాక్షివి
మనమునఁ గల మంచి చెడుల మర్మజ్ఞవు, ని
న్ననయము కొలుతు *స్వపంతీ*!
కనఁబడు స్వప్నముననైన కాదనకమ్మా!
259. ఓం తైజసాత్మికాయై నమః.
నామ వివరణ.
తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి జగజ్జనని.
తే.గీ. తైజసుని యాత్మఁ గలిగిన *తైజసాత్మి
కా*! మదాత్మను నిత్యంబు కలిగి, స్వప్న
సాక్షిగా నున్న తల్లివి, సత్య సూక్ష్మ
లోకమందుఁ జరింపనీ, లోక మాత!
శ్లో. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥
260. ఓం సుప్తాయై నమః.
నామ వివరణ.
నిద్రావస్థగా ఉన్న తల్లి.
కం. సుప్తావస్థను సుఖమును
*సుప్తా*! నీవనుభవించి శుభదగ నాలో
గుప్తంబుగ నిలిచిన ని
న్నాప్తిగఁ గొలిచెదను జనని! హరనుత వదనా!
261. ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః.
నామ వివరణ.
సుషుప్త స్థితిలోని జ్ణానకారణస్థితిని సూచించుప్రజ్ణాత్మిక మన అమ్మ.
కం. ప్రాజ్ఞునిగ నన్ను దిద్దిన
*ప్రాజ్ఞాత్మిక*! నీదు ప్రజ్ఞ వర్ణన జేయన్
విజ్ఞానము సరిపోవునె?
విజ్ఞతతో వ్రాయఁ జేయు వేల్పువు నీవే.
262. ఓం తుర్యాయై నమః.
నామ వివరణ.
తుర్యావస్థను సూచించునది మనామ్మ.
తే.గీ. ఘన తురీయ స్థితిని గొల్పు ప్రనుత *తుర్య*!
జీవపరమాత్మలొకటైనఁ జేరు నిన్ను,
కనఁ దురీయ స్థితియె నినుఁ గనఁగఁ జేయు,
నాకుఁ గొలుపుమా తత్ స్థితి, నాదు జనని!
263. ఓం సర్వావస్థా వివర్జితాయై నమః.
నామ వివరణ.
అన్ని అవస్థలనూ విడిచి అతీతముగా ఉండు జనని.
కం. భవహర! *సర్వావస్థా
వివర్జితా*! ప్రణతులమ్మ! ప్రీతినవస్థల్
శివనుత! పాపుము, నీపై
కవితల నల్లంగఁ జేసి కరుణించుమిఁకన్.
264. ఓం సృష్టి కర్త్ర్యై నమః.
నామ వివరణ.
సృష్టిని చేయు అమ్మ. కృత్తికతో ప్రారంభమగు సృష్టిప్రణాళిక కలది అమ్మ.
తే.గీ. *సృష్టికర్త్రీ*! ననున్ నీవు సృష్టి చేసి,
నిన్నుఁ జేరెడి మార్గంబు నేర్పవేని
యైహికంబులలో మున్గి యహరహంబు
పాపినగుదును, దప్పించి పరము చేర్పు.
265. ఓం బ్రహ్మ రూపాయై నమః.
నామ వివరణ.
బృహ్మణ లక్షణము గల అనగా విచ్చుకొను లక్షణము గల రూపముగలది అమ్మ.
తే.గీ. *బ్రహ్మ రూప*! నీ వీ సృష్టి వరలఁ జేసి,
మర్మమొకదాని మాలో నమరగఁ జేయఁ
బాపములు కాక పుణ్యముల్ వచ్చు నెట్లు?
నీవె కాపాడుమా మమ్ము నీరజ ముఖి!
266. ఓం గోప్త్ర్యై నమః.
నామ వివరణ.
గోపన లక్షణము గల అనగా సంరక్షణ లక్షణము గల తల్లి. శ్రీవిద్యను గోపనము
చేయునది ఈ తల్లి. చరాచరములందు గుప్తముగా ఉండు లక్షణము కలది జనని.
తే.గీ. నీవు కల్పించుకొనినట్టి నీదు మాయ
గుప్తముగ నుంచె నమ్మరో *గోప్త్రి*! నిన్ను,
నన్ను గ్రమ్మె నా మాయయే, నిన్ను నేను
తెలియుటెట్లగుఁ? దెలియుదుఁ దొలఁగ మాయ.
267. ఓం గోవింద రూపిణ్యై నమః.
నామ వివరణ.
విష్ణు మూర్తితో రూప సమన్వయము కల జనని.కిరణములద్వారా పొందునట్టి రూపము
కలది.
తే.గీ. వినుత *గోవింద రూపిణీ*! వినుము మొరను,
సత్వ సంపన్నవైన నిన్ సన్నుతింతు,
మదికి నానందమును గూర్ప మదిని నిలుము,
నిన్నుఁ బ్రార్థింపనిమ్ము పునీత చరిత!
శ్లో. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥
268. ఓం సంహారిణ్యై నమః.
నామ వివరణ.
ప్రళయ కాలమునజీవులను చక్కగా తనలో కలుపుకొనునట్టి తల్లి.
తే.గీ. జగతి నణుమాత్రముగఁ జేసి సంహరించు
జనని! *సంహారిణీ*! నీకు జయము జయము,
దుష్టులైనట్టి షడ్రిపుల్ దూరిరి మది,
సంహరింపుము వారిని సరసిజాక్షి!.
269. ఓం రుద్ర రూపాయై నమః.
నామ వివరణ.
రుద్రుని యొక్క రూపము దాల్చినది అమ్మ. రుద్రుని స్వరూపము అమ్మయే.
కం. దురితఘ్న రుద్ర రూపవు!
పరమ శివుని హృదయమందు పరవశమున సు
స్థిరముగ వెలిగెడి జననివి,
కరుణించుచు *రుద్ర రూప*! కావుము నన్నున్..
270. ఓం తిరోధానకర్యై నమః.
నామ వివరణ.
మరుగుపరచుటను చేయునది ఈ తల్లి.కారణమయ శరీరములను మరుగుపరచునది
అమ్మ.
కం. అకళంకవగు *తిరోధా
నకరీ*! లయకారిణివి, ప్రణామము గొనుమా,
సుకరముగఁ గొలువనీ నిను
ప్రకటితమగు భక్తితోడఁ, బద్యమ్ములలోన్..
271. ఓం ఈశ్వర్యై నమః.
నామ వివరణ.
ఈశ్వరునకు శక్తి రూపములో ఉండునది. ఈశ్వరుని రూపంలో సృష్టి సమస్తమును
నిర్వహించునది కావున ఈశ్వరి, మన అమ్మ.
మత్తకోకిల.
*ఈశ్వరీ*! దయఁ జూడుమా! పరమేశ్వరీ నినుఁ గొల్వనీ,
శాశ్వతంబగు ముక్తి మార్గము చక్కగా గనఁ గొల్తు నిన్,
విశ్వమున్ గనునట్లు చేసెడి వెల్గు నీవె మహేశ్వరీ!
శశ్వదాశ్రయ మిమ్ము నీకడ శాంతిగా నివసించెదన్..
272. ఓం సదాశివాయై నమః.
నామ వివరణ.
సదాశివునితో అభేదము కల తల్లి సదాశివస్వరూపిణి మన అమ్మ.
పంచచామరము..
*సదాశివా*! నమోస్తుతే, ప్రశాంతినిమ్ము నాకిఁకన్,
ముదంబుతోడ నిన్నుఁ గొల్తు పూజ్య! భక్త వత్సలా!
సుధాసుధార సత్ కవిత్వ శోభ లీవె శాంభవీ!
మదిన్ వసించు మమ్మ! సత్యమార్గమందు నిల్ప నన్.
273. ఓం అనుగ్రహదాయై నమః.
నామ వివరణ.
అనుగ్రహమును ప్రసాదించునది లోకమాత.
కం. సృష్టిని లయమొనరుచునటు
సృష్టించుట యందు నీదు కృప ఘనమమ్మా!
కష్టంబె *యనుగ్రహదా*!
దుష్టులఁ బరిమార్చకున్న, తోపదొ నీకున్?
274. ఓం పంచకృత్య పరాయణాయై నమః.
నామ వివరణ.
సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అను ఐదు పనులయందు ఆసక్తి కలది అమ్మ.
తే.గీ. *పంచకృత్య పరాయణా*! భవ్యమయిన
సృష్టి నిర్వహణంబునన్ జిత్త ముంచి
యిష్టముగఁ జేయు నిన్ను నా కష్టములను
దీర్చి ముక్తినిమ్మనుచుంటి దీనముగను..
శ్లో. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥
275. ఓం భానుమండల మధ్యస్థాయై నమః.
నామ వివరణ.
సూర్యమండలమునందు కేంద్రము వద్ద ఉండునది అమ్మ.
తే.గీ. *భానుమండల మధ్యస్థ*! పాప హారి!
జ్ఞాన సూర్యుని మధ్యను ఘనతరముగ
నిలిచి వెలుగులన్ బ్రసరించి, నిలుపుచు మము
సత్యపథమందు నడుపు నిన్ సంస్మరింతు.!
276. ఓం భైరవ్యై నమః.
నామ వివరణ.
భైరవి అనే పేరుతో పిలువబడే వెలుగుల కేంద్రము అమ్మ.
తే.గీ. *భైరవీ*! సుర సేవితా! భక్తి తోడ
నిన్ను సేవించుటను ముక్తి నేర్పునఁ గొని
తృప్తిగా నేను నీ దరి తేరుకొనుదు,
వందనములందుకొనుమమ్మ! భక్త సులభ!
277. ఓం భగమాలిన్యై నమః.
నామ వివరణ.
ఆకాశంలో వెలుగుతూ భ్రమించే తారకాదులను మాలగా కలిగిన తల్లి.
తే.గీ. షడ్గుణైశ్వర్య మాలతో శాశ్వతముగ
వెలుఁగు *భగమాలినీ*! నిన్ను వేడుకొందు,
సత్య ధర్మంబులను గాచి సజ్జనులకు
నండగా నుండి సతత మీ వాదుకొనుము.
278. ఓం పద్మాసనాయై నమః.
నామ వివరణ.
మూలాధార సహస్రాది పద్మములయందు నివసించు తల్లి. సహస్రశతపత్ర నిలయంలో
ఆసీనురాలైన జనని.
తే.గీ. వినుత *పద్మాసనా*! నీవు విశ్వసించు
నా యెడద పద్మమే, నీ వనంత! సంత
సమును పొందుమీ యిట నుండి, సముచితమగు
సేవలందింతు, నీకు నీ చిత్త మలర,
279. ఓం భగవత్యై నమః.
నామ వివరణ.
భగశబ్ద స్వరూపిణి, చైతన్య స్వరూపిణి అమ్మ.
తే.గీ. ఆత్మశాంతియె కల్గు నీ వలర మదిని,
*భగవతీ*! నిలు మమ్మ! నా భావమందు
శుద్ధ చిత్తంబుతో నిన్నుఁ జూడనిమ్ము,
భక్త జనులను గాచెడి భర్గురాణి!
280. ఓం శ్రీ పద్మనాభ సహోదర్యై నమః.
నామ వివరణ.
పద్మనాభుఁడయిన విష్ణుమూర్తికి సహోదరి మన లోకమాత.
మత్తకోకిల.
పద్మనేత్రవు భక్తపాళికి, భవ్యభాగ్యవు నీవు. శ్రీ
*పద్మనాభ సహోదరీ*! నిను భక్తిఁ గొల్చెదఁ గొల్వనీ,
పద్మగంధివి నిన్ భజింతురు పద్మగంధులు భక్తితోన్,
సద్మమే కన నా మనోబ్జము సన్నుతంబుగ నీకిటన్,
శ్లో. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥
281. ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః.
నామ వివరణ.
కనురెప్ప తెరవబడుటతోను, మూయబడుటతోను ఉత్పన్నమైలీనమైన భువనములు కల
తల్లి, తన కనురెప్పపాటు కాలములోనే సృష్టి మొత్తమును సృష్టి స్థితి లయలు చేయుజనని.
స్వయం కల్పిత
భువనావళి వృత్తము.
గణములు.. మ న త జ స వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
మాయా మోహములవేలా? రమణీయ శుభ నామ! దే
వీ! *యున్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళీ*!
శ్రేయస్కారివిగ, నన్నారసి, ముక్తి కలిగించుమా,
నీ యాజ్ఞన్ భువిని నేనుంటిని, కావుమిక శాంభవీ!
282. ఓం సహస్ర శీర్ష వదనాయై నమః.
నామ వివరణ.
సహస్రశీర్షములతోనొప్పు ముఖములు గల తల్లి ఈ లోకమాత.
ఆ.వె. జగతి వెల్గు దీవె, చక్కగాను *సహస్ర
శీర్ష వదన*! వెలుఁగు చిత్తమునను,
నీవె వెల్గుచుండ, నేనన్నదుండదు
నీవె నే నగుదును, నేను నీవ.
283. ఓం సహస్రాక్ష్యై నమః.
నామ వివరణ.
వేయి కనులతో ఒప్పు తల్లి, సృష్టి మొత్తమునుచూచుచున్న అనంతనేత్ర మన జనని.
తే.గీ. జీవమును గల్గఁ జూచును జీవుడిలను
జీవమన్నది నీవే, ప్రసిద్ధమైన
చూచుశక్తియు నీదౌను, చూచు కనులు
నీవెయౌను *సహస్రాక్షి*! నిర్మలాత్మ!
284. ఓం సహస్ర పదే నమః.
నామ వివరణ.
సహస్ర పాదములు కల జనని.
తే.గీ. నిను *సహస్ర పదా*! మదిన్ నేను నిలిపి
పద సహస్రంబుతో మంచి పద్యములను
వ్రాయ మనసగుఁ గాని నే వ్రాయఁజాల
నీదు శక్తిని పొందక, నిరుపమాన!
శ్లో. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥
285. ఓం ఆబ్రహ్మ కీట జనన్యై నమః.
నామ వివరణ.
పిపీలికాది బ్రహ్మపర్యంతమునకు తల్లి మన అమ్మ.
కం. *ఆబ్రహ్మ కీట జననీ*!
నే బ్రహ్మజ్ఞాన మంద నిపుణత నీవే
నా బ్రహ్మవగుచుఁ గొల్పుము,
నే బ్రహ్మమునగుచు నెఱుఁగ నిన్ను మనమునన్!
286. ఓం వర్ణాశ్రమ విధాయిన్యై నమః.
నామ వివరణ.
వర్ణములను ఆశ్రమములను విధించు జనని మన అమ్మ.
కం. మధురాక్షర! *వర్ణాశ్రమ
విధాయినీ*! కొలిపి తీవు వేదాదులనే
వ్యధలను బాపుచు నాకిల
బుధజన సంసర్గ మిమ్మ! పూజ్య భవానీ!
287. ఓం నిజాజ్ఞా రూప నిగమాయై నమః.
నామ వివరణ.
తన ఆజ్ణా రూపములే నిగమములుగా కలది మన జనని.
కం. అమల! *నిజాజ్ఞా రూప ని
గమా*! నను న్నడుపుమమ్మ! ఘన మార్గములో
నమరిన మదితో నిలుపుచు
సుమతీ నిను కొలుతు నఖిల శుభకరి వనుచున్,
288. ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః.
నామ వివరణ.
జీవులు చేయు పుణ్యపాపములకు తగిన విధమగు ఫలమునిచ్చు తల్లి మన అమ్మ.
కం. *పుణ్యాపుణ్య ఫలప్రద*!
గణ్యంబుగ నిన్నుఁ జేర్చఁ గలిగెడి ఫలమౌ
పుణ్యమొ పాపమొ యెఱుఁగను,
గణ్యా కలిగించు నాకు గౌరవమొప్పన్.
శ్లో. శ్రుతి సీమంత సిందూరీకృత పాదాబ్జధూళికా ।
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా ॥ 68 ॥
289. ఓం శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికాయై నమః.
నామ వివరణ.
వేదములనెడి స్త్రీలయొక్క పాపిటలను సిందూరముగా ధరించునట్లు చేయబడిన పాద
పరాగము కలది అమ్మ.
స్వయం కల్పిత
పాదాబ్జ ధూళిక వృత్తము.
గణములు.. భ త మ స ర వ. యతి 9 వ అక్షరము ప్రాస నియమము కలదు.
శ్రీ *శ్రుతి సీమంత సిందూరీ కృత పాదాబ్జ ధూళికా*!
ఆశ్రిత మందార సందేహంబుగ కన్పించు నింతయున్,
విశ్రమమేలా నిజంబున్ వేల్పుగ కన్పింపఁ జేయగన్?
నీ శ్రమ ముక్తి ప్రదంబై, నిల్పుత నన్నింక నీశ్వరీ!
290 ఓం సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికాయై నమః.
నామ వివరణ.
సమస్త ఆగమశాస్త్రములనెడి ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచఁబడిన ముత్యము
అమ్మ.
స్వయం కల్పిత శ్రీమౌక్తిక వృత్తము.
గణములు.. న భ త ర స వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
భసిత దేహునితోఁ గూడి భావనన్ విహరించుమా
యసమ భక్తిని నాలోన హాయిగాఁ గలిగించుమా,
రససమంచిత పద్యాళి ప్రార్థనన్ విని యాలకిం
చు, *సకలాగమ సందోహ శుక్తి సంపుటమౌక్తికా*!
శ్లో. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥
291. ఓం పురుషార్థప్రదాయై నమః.
నామ వివరణ.
నరులకు పురుషార్థములను యిచ్చు తల్లి. పురుషుఁడు అనగా జీవశక్తి లేక జీవము,
నరజన్మమెత్తినందులకు సాధించవలసిన పురుషార్థములను దయతో సానుకూలపరచు
తల్లి.
కం. సతి! *పురుషార్థప్రద*! ని
న్నతులిత ఘన భక్తితోడ నరయగఁ జేయన్
గతి నీవె యగుచు నేర్పుమ,
క్షితిపై నీ సాటి లేరు కీర్తిఁ గొలుపుటన్.
292. ఓం పూర్ణాయై నమః.
నామ వివరణ.
సృష్టిలో అమ్మ తప్ప అన్నియు అసంపూర్ణమయినవే. అమ్మ ఒక్కతయే పూర్ణురాలు.
కం. *పూర్ణా*! నీదగు నామము
కర్ణంబులఁ బడినఁ జాలు ఘనతను గొలుపున్,,
పూర్ణత్వమబ్బు నీచే,
స్వర్ణాక్షర! నీ తలపు ప్రశాంతతఁ గొలుపున్.
293. ఓం భోగిన్యై నమః.
నామ వివరణ.
సాధకులకు భోగమును ఇచ్చునది. భోగిగా మనలను చేయునది అమ్మ. కుండలినీ
రూపమున ఉన్న తల్లి.
తే.గీ. *భోగినీ*! భోగభాగ్యముల్ పూజ్యవయిన
నిన్నుఁ జేరుట నబ్బును కన్నతల్లి!
ఐహికంబగు భోగంబులరయ మాయ,
శాంతియేకద భోగంబు, సదయనిమ్ము.
294. ఓం భువనేశ్వర్యై నమః.
నామ వివరణ.
సృష్టికి అధినేత్రి అమ్మ. చతుర్దశభువనేశ్వరి మన అమ్మ.సృష్టికి ప్రభ్వి అమ్మ.
కం. *భువనేశ్వరీ*! శరీరమె
భువనత్రయమమ్మ! నీవు పూర్తిగ నాలో
భవ బంధంబులు వాపగ
నివసింపుము, మ్రొక్కుచుంటి నిన్ను భవానీ!
295. ఓం అంబికాయై నమః.
నామ వివరణ.
సృష్టిని చేసిన తల్లి, సృష్టికే అంబిక జగన్మాత.
తే.గీ. *అంబికా*! విను, గొల్తు నిన్ సంబరముగ,
నిన్ను గూర్చిన భావనల్ నన్ను విడక
మెదలుచుండుట వలనను మేల్తరముగ,
నింత భాగ్యంబు గల్గె, నీ చెంత నుందు.
296. ఓం అనాది నిధనాయై నమః.
నామ వివరణ.
ఆది అంతమూ లేని తల్లి లలితాపరాభట్టారిక.
కం. మాతా! *యనాది నిధనా*!
ఖ్యాతిగ నినుఁ జేరనిమ్ము, ఘనతర ముక్తిన్
బ్రీతిని బొందగఁ జేయుమ,
నా తప్పులు కాచి భక్తి నాకు నొసగుమా.
297. ఓం హరిబ్రహ్మేంద్ర సేవితాయై నమః.
నామ వివరణ.
హరి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే సేవింపబడు తల్లి.
కం. మహిమాన్విత! వర! సుగుణ ను
త! *హరిబ్రహ్మేంద్ర సేవితా*! సేవింతున్
సహియించుము నా తప్పుల
నహరహము స్మరింతు నిన్ను ననితర భక్తిన్.
శ్లో. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥
298. ఓం నారాయణ్యై నమః.
నామ వివరణ.
నారాయణత్వ లక్షణము కల తల్లి నారాయణి. సర్వాంతర్యామిగా ఉన్నట్లు తెలియఁబడు
ప్రజ్ణానమే అమ్మ.
కం. *నారాయణీ*! నినున్ నే
నేరీతి గ్రహింపనగు? గణించి సుగుణముల్
నీ రీతి నెఱుఁగఁ జేయుము,
ధారగ పద్యములు వ్రాయఁ దలచితి నీపై,
299. ఓం నాద రూపాయై నమః.
నామ వివరణ.
నాద స్వరూపిఅమ్మ అవ్యక్తమధురమయిన నామములతో నొప్పుతల్లి నాదరూపములో
వ్యక్తమధురనామముగా కలది అమ్మయే.
తే.గీ. *నాద రూపా*! ప్రపూతాత్మ! వేదవేద్య!
ప్రణవ నాదంబు నీవెగా భావగమ్య!
నా మదిన్ నిండి ప్రణవమై నన్ను బ్రోవు
మమ్మ! దుర్గమ్మ! నీవెనాకమ్మవమ్మ!
300. ఓం నామ రూప వివర్జితాయై నమః.
నామ వివరణ.
పేరు ఆకారము లేని తల్లి ఈ లోకమాత. నామ రూపములచే వివర్జితమయినది అమ్మ.
తే.గీ. *నామ రూప వివర్జితా*! శ్రీ మదంబ!
నీకు సంతోషమును గొల్ప నేర్పు తోడ
పద్యములు వ్రాసి మురిపించి వరలనిమ్ము,
నన్నుఁ గృపఁ జూడు భార్గవీ! సన్నుతాత్మ!
ఓం హ్రీంకార్యై నమః.
నామ వివరణ.
పంచప్రణవములలో హ్రీమ్ అనే ప్రణవస్వరూపిణి అమ్మ. వ్యక్త శక్తి బీజ రూపిణి అమ్మ.
కం. వందన మో *హ్రీంకారీ*!
సుందర సద్భావ రమ్య! శుభదా! కన నీ
వందరిలో కలవమ్మా!
మందస్మిత భాసుర ముఖి! మాతా! ప్రణతుల్.
302. ఓం హ్రీమత్యై నమః.
నామ వివరణ.
లజ్జాసూచిత బీజాక్షర రూపిణి అమ్మ. మనలో లజ్జా రూపంలో ఉండే తల్లి.
కం. *హ్రీమతి*! నిను భజియించిన
క్షేమము మా కొదవునమ్మ! శ్రీఫలదా! నీ
నామ జపము కన్నను వే
రేమియు నినుఁ గోర నోమహేశ్వరి! ప్రణతుల్.
303. ఓం హృద్యాయై నమః.
నామ వివరణ.
హృదయమునకు ఆనందకరముగా ఉండు తల్లి.హృదయముల కలుగు తీపి అనుభూతికి
స్పందించు జనని.
కం. నిన్నే కొలిచెద *హృద్యా*!
నన్నున్ దయఁ జూడు మమ్మ! నా తల్లీ! న
న్నెన్నకు దురితాత్మునిగా,
నిన్నే భజియింప జయము నిశ్చయమమ్మా!.
304. ఓం హేయోపాధేయ వర్జితాయై నమః.
నామ వివరణ.
విడువ దగినది, గ్రహింప దగినదియు విడిచిపెట్టునది అమ్మ అట్టివేమియు లేని తల్లి యీ
లోకమాత.
కం. భవ నుత! * హేయోపాధే
య వర్జితా*! కొలి చెదను భయాపహ! నిన్నున్,
నవనీత హృదయ! నీపై
కవితలనే వ్రాయనిమ్ము, గౌరవమొప్పన్.
శ్లో. రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా |
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా || 71 ॥
305. ఓం రాజరాజార్చితాయై నమః.
నామ వివరణ.
రాజులకే రాజులయినవారిచే అర్చింపబడు తల్లి.
తే.గీ. *రాజరాజార్చితా*! లసద్రమ్య తేజ
జన్మ రాహిత్యమున్ నాకు సదయనిమ్మ,
నిన్నె నిత్యంబు పూజించు నన్ను గనుమ,
నీవె రక్షించుమా కృపన్ నిర్వికల్ప!
306. ఓం రాజ్ఞై నమః.
నామ వివరణ.
సృష్టి రాజ్యములకు అధినేత్రి అయిన తల్లియే రాజ్ణి
కం. భువనాళి నేలు *రాజ్ఞీ*!
నవనీత సమాన హృదయ! నను కృపఁ గనుమా,
ప్రవిమల భక్తి సమన్విత
కవితామృత ధారఁ గొలిపి, కరుణించు, సతీ!.
307. ఓం రమ్యాయై నమః.
నామ వివరణ.
ఆహ్లాదకరముగా ఉండు తల్లి. అమ్మను హృదయపీఠముపైచూచు సాధకులకు
నిరంతరాహ్లాదకారిణియై మిక్కిలి రమ్యముగా తోచుతల్లి.
కం. సౌమ్యోదంచిత గుణగణ!
*రమ్యా*! శ్రీ మాత! నిన్నుఁ బ్రార్థించెద నేన్
రమ్యానందావధి నిడ
రమ్యంబగు భావనలు నిరంతరమిమ్మా.
308. ఓం రాజీవలోచనాయై నమః.
నామ వివరణ.
పద్మములవంటి అందమయిన కన్నులు కలతల్లి.
కం. *రాజీవలోచనా*! భువి
నా జీవన గమనమున ననంత నిరాశే
సాజముగా వరలెఁ గనగ
నీ జీవిత మేల? నీవి దేలను గనవో?
309. ఓం రంజన్యై నమః.
నామ వివరణ.
జీవులను రంజింపఁజేయు తల్లి, జీవులలో రంజన రూపమున అలరారు లోకమాత అమ్మ.
కం. సన్నామ! పద్మపాదా!
నిన్నే స్మరియింతు *రంజనీ*! వివశుఁడనై.
కన్నట్టి నీదు ఋణ మే
నెన్నటి కిఁక తీర్చగల నహీన దయాబ్ధీ!
310. ఓం రమణ్యై నమః.
నామ వివరణ.
రమింపఁజేయు తల్లి. ఆత్మను తనపై రమింపఁ జేయునది.
కం. రమణీయాద్భుత సుగుణము
*రమణీ*! నా కొసగుమమ్మ! ప్రార్థించెద నిన్
సుమ సుకుమార హృదయమును
కమనీయ కవిత్వ ఝరిని కలిగింపు కృపన్.
311. ఓం రస్యాయై నమః.
నామ వివరణ.
అన్నిటియందూ సారభూతమయిన స్వరూపము రసము. అన్నిటి యందూ సారభూతముగా
ఉండునది అమ్మయే కావున అమ్మ ర స్వరూపిణి.
కం. జీవంబీవే, సుమధుర
భావంబీవే కదమ్మ, ప్రఖ్యాతముగా
నీవే నాలో సతతము
ప్రోవగ నిలువుము, రస స్వరూపిణి! *రస్యా*!
312. ఓం రణత్ కింకిణి మేఖలాయై నమః.
నామ వివరణ.
మ్రోగుచుండు చిఱు గజ్జెలుతో కూడిన వడ్డాణముకలది అమ్మ.
కం. అంకితమిది నీకు *రణత్
కింకిణి మేఖల*! సహస్ర కిరణా! శుభనా
మాంకిత సహస్రదళ కృతి
పంకజమిది స్వీకరించు పద్మ సునయనా!
శ్లో. రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా |
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా || 72 ||
313. ఓం రమాయై నమః.
నామ వివరణ.
అమ్మ లక్ష్మీదేవియే. లక్ష్నీ కళ ఉట్టిపడుచుండు తల్లి అమ్మ.
పంచ చామరము.
*రమా*! విరామమేలనమ్మ! రమ్య నామ నిన్ను నే
ప్రమోదమొందుచున్ స్మరింప? భవ్యమౌ సహస్రనా
మముల్ గ్రహించి పద్యముల్ సమంచిత ప్రభన్ రచిం
ప? మాతృమూర్తి! నిన్ స్మరించి వందనంబు చేసెదన్.
314. ఓం రాకేందు వదనాయై నమః.
నామ వివరణ.
పూర్ణ చంద్రుని పోలు ముఖము కల తల్లి లలితామాత.
తే.గీ. రమ్య* రాకేందు వదనా*! వరాల తల్లి
వీవు, వర్ణించ నిన్ను సద్ భావుకతను
గొల్పి యక్షర రూపివై కూర్మితోడఁ
బద్యపాళిగ వెలయుమా ప్రభలు గొలుప.
315. ఓం రతి రూపాయై నమః.
నామ వివరణ.
ఆనందాసక్తి రూపము అమ్మయే.జీవాత్మపరమాత్మలో తాదాత్మ్యస్థితిలోఒప్పు ఆనంద రూపిణి అమ్మ.
కం. *రతి రూపా*! నీదయతో
క్షితి నీ నామములు వేయిఁ జే కొని పద్యా
కృతిలోఁ జెప్పుట కుదిరెను
మతిమంతులు మెచ్చునటుల మా జనయిత్రీ!
316. ఓం రతి ప్రియాయై నమః.
నామ వివరణ.
జీవబ్రహ్మైక్యమునందు ప్రియము కలదిఅమ్మ.రతీదేవియందు ప్రీతి కలది అమ్మ.
పంచచామరము.
*రతి ప్రియా*! శుభంకరీ! వరంబు నిన్ స్మరించుటే,
నుతించుచున్ నినున్ సదా వినూత్నపద్య సంహతిన్
క్షితిన్ రచించుచుండినన్ విశేష భక్తి నొప్పుచున్
నితాంతముక్తి మార్గమిచ్చి నీవె ప్రోతువమ్మరో!
317. ఓం రక్షాకర్యై నమః.
నామ వివరణ.
రక్షించునది జగజ్జనని. రక్షణ రూపమే అమ్మ.
తే.గీ. వినుత! *రక్షాకరీ*! విను విన్నపంబు,
నక్షర చ్యుతినెడఁ బాపి రక్షణ నిడి
పద్యములు వ్రాయఁ జేయుమా! ప్రతిభనొప్ప
నన్ను రక్షించి జనయిత్రి! నిన్నుఁ గొలుతు.
318. ఓం రాక్షసఘ్న్యై నమః.
నామ వివరణ.
రాక్షసులను సంహరించునది అమ్మ. మనలోని రాక్షస స్వభావమును నశింపజేయు తల్లిలలితాంబ.
తే.గీ. *రాక్షసఘ్నీ*! మదిన్ దోచు రాక్షసులను
నీవె సంహారమొనరించి నిన్ను నేను
గొలువగాఁ జేసి మదిలోనఁ గొలువుఁ దీరి
నిత్య సంతోషమున్ గొల్పు స్తుత్యముగను.
319. ఓం రామాయై నమః.
నామ వివరణ.
కలుషరహిత సల్లక్షణ సమన్విత అమ్మ.
కం. *రామా*! సన్నుత నామా!
నా మానసమందు నిలుమ, నన్ గృపఁ గనుమా,
నే మన నీమమునఁ గనుమ,
నే మరువను నిన్ను మది గణింతును జననీ!
320. ఓం రమణ లంపటాయై నమః.
నామ వివరణ.
రమణునితోఅత్యంత సాన్నిహిత్యము కల తల్లి.
తే.గీ. *రమణ లంపటా*! మది భాసురమణి వీవ,
జనని! నా దోషముల్ సైచి, సదయఁ గనుమ
నిన్ను సేవించి రహియింతు మన్ననమున,
రమణి! రమణునితోఁ గూడి రక్షఁ గొలుపు.
శ్లో. కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా |
కళ్యాణీ జగతీకందా కరుణారససాగరా || 73 ||
321. ఓం కామ్యాయై నమః.
నామ వివరణ.
కోరదగినటువంటిది శ్రీ లలితామాత. ఐహికస్వర్గప్రాప్తికైవాంఛాదికములు వ్యర్థమైన కోరికలు
నిరంతానంద పునర్జన్మరహిత ముక్తి ప్రదాయిని అయిన అమ్మ మాత్రమే కోరదగినది. కావుననే అమ్మ
కామ్య.
తే.గీ. కామితార్థప్రదా! కొల్తు *కామ్య*! నిన్ను
క్షేమ సద్భాగ్య సత్ప్రదా! చిత్ర కవిగ
పేరు నీ కృపచేఁ గల్గె విశ్వమాత!
నీదు పాదాబ్జముల్ గొల్తు నిత్య మెలమి.
322. ఓం కామ కలా రూపాయై నమః.
నామ వివరణ.
కామేశ్వరుని కళ యొక్క రూపము అమ్మ. కామ కళాబీజ రూపిణి అమ్మ.
తే.గీ. మహిత *కామ కలా రూప*! మమ్ముఁ బ్రోవు
జనని! నీపాద సంసేవ సలుపఁ జేసి,
సంతసముతోడ నిన్ను ప్రశాంత మతిని
గొలువనిమ్మమ్మ! మదులందు నిలిచి నీవు.
323. ఓం కదంబ కుసుమప్రియాయై నమః.
నామ వివరణ.
కదంబవృక్షముల పూవులపై యిష్టము కలది మన జనని.
కం. ధార్మిక సన్నుత లక్షణ
మర్మిలి నా కొసగుమమ్మ! హాయిగ జగతిన్
ధర్మము తప్పక మసలగ,
కూర్మిని గాంచుమ *కదంబ కుసుమప్రియ*! నన్.
324. ఓం కల్యాణ్యై నమః.
నామ వివరణ.
శుభ లక్షణములు కలది అమ్మ. అమ్మ శుభ స్వరూపిణి. బ్రహ్మైక్యమును ప్రాప్తింపఁజేయు
శుభస్వరూపిణి అమ్మ.
కం. కల్యాణ కారిణీ,! కృతి
కల్యాణకరముగ సాగి కరుణామయి! నీ
కల్యాణ గుణము చాటుత,
*కల్యాణీ*! కావుము నను ఘనముగ నెపుడున్..
325. ఓం జగతీకందాయై నమః.
నామ వివరణ.
సృష్టికి మూలకందము మన తల్లియే అమ్మలేనిదే ఈసృష్టియే లేదు. కావున అమ్మయే
మూలకందము.
కం. *జగతీకందా*! కృపతో
సుగతిని, సుమనోజ్ఞమైన శోభన గతియున్,
ప్రగతిని గొలుపుము జననీ!
జగదీశ్వరి! నిన్ను నేను సంసేవింతున్.
326. ఓం కరుణారస సాగరాయై నమః.
నామ వివరణ.
అమ్మ దయా సముద్రమే. అమ్మకు ఉన్న అపారమయిన దయా స్వభావము
వేరెవ్వరియందునూఉండనేరదు.
కం. సురనుత! * కరుణారస సా
గరా*! నిను మదిని నిలిపితిఁ గద నీ కృపచేఁ,
బరమార్థము నిన్ గొలుచుటె,
నిరవధికమ్ముగనిటులనె నీకృపఁ గననీ..
శ్లో. కళావతీ కళాలాపా కాంతా కాదంబరీప్రియా |
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా || 74 ||
327. ఓం కలావత్యై నమః.
నామ వివరణ.
సకల కళా స్వరూపిణి అమ్మ. అమ్మ లేని కళయే ఉండదు అన్ని కళలూ అమ్మ రూపములే. కావున
అమ్మకళావతి.
తే.గీ. నుత *కలావతీ*! కళలు సన్నుత సుగతిని
గళలనారాధనము చేయు ఘనుల కొదవఁ
జేయు మమ్మరో! వారిని జేరి నిలిచి
నీవె కళవౌచు మురిపించు నిరత మెలమి.
328. ఓం కలాలాపాయై నమః.
నామ వివరణ.
కళలను ఆలాపనా స్వరూపముగా కలది అమ్మ.
కం.. ఆలాపన రూప కలా!
నీ లీలలె సకలము భువిని, *గలాలాపా*!
యేలీలఁ గాతువో ననుఁ
గాలీ! కరుణార్ద్ర హృదయ! కంజ దళాక్షీ!
329. ఓం కాంతాయై నమః.
నామ వివరణ.
కామింపఁబడునటువంటిది అమ్మ.జగన్మూలమయిన కామేశ్వరునిచే కామింపఁబడునట్టి తల్లి.
తే.గీ. కామితార్థప్రదా! *కాంత*! కావుమమ్మ!
సకల జగతిని, దుర్జనుల్ శాంతిమతులఁ
బ్రతుకులన్ బాడు చేయుచు రగులు చుండి
రట్టివారిని దండించి మట్టు పెట్టు.
330. ఓం కాదంబరీ ప్రియాయై నమః.
నామ వివరణ.
పరవశించుటను యిష్టముగా కలది జగన్మాత.
కం. *కాదంబరీ ప్రియా*! నినుఁ
గాదను వారలు జగాన గల్గిరె యెందున్?
నీ దయఁ గాదని మనుదురె?
నీ దరి నే నుంటి నమ్మ! నీవే కనుమా.
331. ఓం వరదాయై నమః.
నామ వివరణ.
వరములను ఇచ్చు తల్లి ఈ జగన్మాత. తనను కొలుచు ముక్తికాముకులకు వారుకోరెడి ముక్తిని తప్పక
ఇచ్చు దయాస్వరూపిణి మన అమ్మ.
తే.గీ. సౌమ్య! *వరదా*! నినున్ నేను శక్తి కొలది
పద్యముల్ వ్రాసి జగతియే పరవశింపఁ
బాడుకొనఁ జేయుచుఁ గనిపింపఁగను జేసి
ముక్తిమార్గంబుఁ జూపుదుఁ బూజ్యులకును.
332. ఓం వామ నయనాయై నమః.
నామ వివరణ.
అందమయిన నేత్రములు కలది మన అమ్మ. వాత్సల్యము మమతలతో నిండిన కంటి చూపును
ప్రసరించునది మన అమ్మ.
కం. వర వాత్సల్యము, మమతయుఁ
గరుణయు, నీ నయనములను గనిపించుటచే
వరలితివొ *వామ నయనా*!
ధర వామనయనగ నీవు, తల్లివి కనుకన్.
333. ఓం వారుణీ మద విహ్వలాయై నమః.
నామ వివరణ.
వరుణ సంబంధమయిన పరవశత్వము చెందినమనో లక్షణము కలది జగన్మాత. మోక్షానంద
పరవశత్వము కలది జగజ్జనని.
మత్తకోకిల.
*వారుణీ మద విహ్వలా*! కనవా మదిన్ ననుఁ, దల్లివే,
చేరి కొల్చెడి పుత్రునిన్ నను శీఘ్రమే కరుణింపుమా,
ధారలౌ కవితామృతమ్మున దర్శనంబిడు తల్లివే,
కోరి చేరిన నన్ను గాంచవొ? కూర్మితో మదినొప్పవో?
శ్లో. విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ |
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ || 75 ||
334. ఓం విశ్వాధికాయై నమః.
నామ వివరణ.
సృష్టికి మించిన అధికురాలు అమ్మ.
కం. *విశ్వాధికా*! శుభములన్
శాశ్వతముగఁ గలుగఁ జేసి సంతోషంబున్,
విశ్వాసంబును బెంచుమ
విశ్వేశ్వరుతోడ మదిని వెలుగుమ జననీ!
335. ఓం వేదవేద్యాయై నమః.
నామ వివరణ.
వేదములచే తెలియఁ దగినది లోకమాత.
ఆ.వె. *వేదవేద్య*! నిన్ను వేదంబులే చెప్ప
లేకపోవుచుండె, నాకు నీవు
తెలిసి యున్నఁగాని తెలియఁ జెప్పుటదెట్లు
చేయఁగలను తల్లి? చెప్పుమీవె.
336. ఓం వింధ్యాచల నివాసిన్యై నమః.
నామ వివరణ.
వింధ్యపర్వతము వాసముగా కలది జగజ్జనని. మణిపూర చక్రమునందు నివాసము కలది అమ్మ.
కం. భవ హారివి *వింధ్యాచల
నివాసినీ*! కనుము నన్ను. నిత్యము స్మృతిలోఁ
గవితగ వెలయుచు నుండుము,
కవితయ శోభించు నిన్ను గణుతించినచో.
337. ఓం విధాత్ర్యై నమః.
నామ వివరణ.
విధానమును చేయు తల్లి. విశేషమయిన రీతిలో విశ్వముయొక్క బరువు బాధ్యతలను మోయు తల్లి.
కం. విధులను గొలిపి *విధాత్రీ*!
విధులొనరుచు మహితులకు సువేద్య వగుదువే,
విధి మరచెడి దుర్విధి నిఁక
సదయను దరి చేరనీకు సన్నుత మతివై.
338. ఓం వేద జనన్యై నమః.
నామ వివరణ.
వేదములకు తల్లి మన అమ్మ.
కం. వివరించు *వేద జననీ*!
భవహర నిను గనుటదెట్లు? భావమునందే
నివసించుచుందువో మా
యవసరముల కాదుకొనుచు? హాయినొసఁగుచున్.?
339. ఓం విష్ణు మాయాయై నమః.
నామ వివరణ.
విష్ణుమూర్తియొక్క మాయాస్వరూపిణి అమ్మ.
తే.గీ. విష్ణు మాయకు మూలమౌ *విష్ణు మాయ*!
జిష్ణునిగఁ జేయ నన్ను నీ విష్ణుమాయఁ
దొలఁగునట్టులఁ జేయుము, వెలుఁగునిమ్ము,
మాయలోపడ నిన్ను నే మరతునమ్మ!
340. ఓం విలాసిన్యై నమః.
నామ వివరణ.
వినోదాత్మకలక్షణములు కలతల్లి లలితాంబ.
కం. విలసిత సృష్టినిఁ జేసెడి
*విలాసినీ*! నీ స్మరణమె విజ్ఞానమనన్,
సులలిత భావనఁ గొలుపుము
లలితలలిత పదముల నిను శ్లాఘించుటకై.
శ్లో. క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ |
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా || 76 ||
341. ఓం క్షేత్ర స్వరూపాయై నమః.
నామ వివరణ.
నామ రూపాత్మక స్థూల ప్రపంచ రూపిణి అమ్మ. క్షేత్ర పదముచే సంకేతింపఁబడేటువంటి వాటి
స్వరూపముగా కలది అమ్మ.
కం. *క్షేత్ర స్వరూప*! సతి! నా
నేత్రంబుల మెలగుమమ్మ! నిత్యము, నీవే
క్షేత్రస్వరూప వగుటను,
స్తోత్రంబును జేయనిమ్ము శుభ సంకేతా!
342. ఓం క్షేత్రేశ్యై నమః.
నామ వివరణ.
క్షేత్రమునకు అధికారిణిఅమ్మ. జీవి శరీరమును నడిపే చైతన్య శక్తి అమ్మ.
కం. *క్షేత్రేశీ*! నీవున్నన్
క్షేత్రము దేహంబు, నీవె జీవ మగుటచే,
క్షేత్రజ్ఞుఁడ నగునట్లుగ
నాత్రంబునఁ జేయుమమ్మ హాయిగ కొలుతున్.
343. ఓం క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిన్యై నమః.
నామ వివరణ.
స్థూల భాగమయిన దేహమును,సూక్ష్మ భాగమయిన దేహిని నడుపు శక్తి అమ్మ.
కం. క్షేత్రము దేహము, దేహియె
క్షేత్రజ్ణుఁడు, రెంటినేలు గీర్వాణివి,, నన్
క్షేత్రేశీ! కను కరుణన్
*గ్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ*! వందనముల్.
తే.గీ. క్షేత్ర మీ దేహమమ్మ! నీ క్షేత్రమిదియె,
వినగ క్షేత్రజ్ఞులకు నీవె వేల్పువమ్మ
*క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ*! కేలు పట్టి
నన్ను నడిపింపుమో యమ్మ సన్నుతముగ.
344. ఓం క్షయ వృద్ధి వినిర్ముక్తాయై నమః.
నామ వివరణ.
తరుగుట పెరుగుట లేని తల్లి. ఎప్పుడునూ ఒకే విధముగా క్షయవృద్ధులు లేకుండా ఉండునది
అమ్మ.
కం. *క్షయ వృద్ధి వినిర్ముక్తా*!
క్షయమెఱుగని భక్తినిచ్చి కరుణించుము, నిన్
బ్రియముగఁ బూజించుటకై
క్షయవృద్ధులఁ బాప నిన్ను ఘనముగఁ గొలుతున్.
345. ఓం క్షేత్రపాల సమర్చితాయై నమః.
నామ వివరణ.
దేహమే క్షేత్రము. సకల భూతములకు అధిపతి శివుఁడు. అట్టి అధిపతి అయిన శివునిచే
సమర్చించబడు తల్లి ప్రతీ క్షేత్రమునకు పాలకుడుండును. వానిచే సమర్చించబడునది అమ్మ.
తే.గీ. *క్షేత్రపాల సమర్చితా*! నేత్ర యుగళి
చాలదోయమ్మ నిన్ గాంచ బేలతనమె
నిన్నుగాంచగాఁ దలచుట, మన్ననమున
నాత్మలో నిన్ను గాంచుచు నలరవచ్చు.
శ్లో. విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా |
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ || 77 ||
346. ఓం విజయాయై నమః.
నామ వివరణ.
ఎప్పుడూ ఎక్కడాఅపజయము లేని తల్లి. సాధకులలో నున్న తల్లి ఎప్పుడూ ఎక్కడాఅపజయము
లేకుండా రక్షించు తల్లి.
తే.గీ. విజయమే రూపుగాఁ గల్గు *విజయ*! నిన్ను
నమ్ముకొన్నను విజయమే నమ్మ! సతము,
నమ్మితిని నిన్ను, విజయమ్ము నిమ్ము నాకు,
కమ్మగానిన్ను వర్ణింతుఁ గవితలందు.
347. ఓం విమలాయై నమః.
నామ వివరణ.
ఏ విధమయిన మలినములు అంటని జనని. సాధకులకు ఏ విధమయిన మలిన
భావములుఅంటనివ్వని తల్లి.
తే.గీ. మలిన మంటని నిత్య విమలవు, *విమల*!
మలిన మంటనీయకుమమ్మ! మాకుఁ గూడ,,
విమల చిత్తుల్ నినున్ గాంత్రు ప్రీతితోడ
విమలునిగ నన్ను కావుమో విమల! జనని!
348. ఓం వంద్యాయై నమః.
నామ వివరణ.
నమస్కరింప తగిన తల్లి. నిజమయిన సాధకులలో ఉండి నమస్కరింపబడు తల్లి.
తే.గీ. విజయ విమలత్వములతోడ వెలయు నీవు
వంద్య వోయమ్మ! మాయమ్మ! *వంద్య*! నిన్ను
సేవలను దేల్చు వానికి సిద్ధి కలుగు
విజయ విమలత్వములనిమ్ము విశ్వ జనని!
349. ఓం వందారు జన వత్సలాయై నమః.
నామ వివరణ.
నమస్కరించు శీలము గల జనులయందు వాత్సల్యము కల అమ్మ.
కం. భవహర! సతి!! *వందారు జ
న వత్సలా*! నా మనము ననంత శుభదవై
నివసింపుము పరమేశ్వరి!
నవనవ కవితామృతంబు నాకునొసఁగుమా.
350. ఓం వాగ్వాదిన్యై నమః
నామ వివరణ.
వాక్కులను చక్కగా వ్యక్తపరచుటకు ప్రేరణనిచ్చు పరాదేవత అమ్మ.
తే.గీ. మహిత *వాగ్వాదినీ*! నీదు మహిమఁ జూపి
వాక్కువౌచుఁ బరా శక్తి! వరలఁ జేయ
నన్ను, వరలుచుండుము లోన, సన్నుతముగ,
నాదు వాక్కునన్ జూపుమా నీదు మహిమ.
ఓం వామకేశ్యై నమః.
నామ వివరణ.
వామకేశ్వరుని భార్య వామకేశి మన అమ్మయే. అందమైన కేశ సంపద కల తల్లి మన అమ్మ.
తే.గీ. వామకేశుని సతివైన *వామకేశి*!
వామ కేశప్రశంసిత వామకేశి!
నీదు పదములు నా మదిన్ నిలుపుమమ్మ!
చేదుకొమ్మమ్మ, నీవె నన్నాదుకొమ్మ.
352. ఓం వహ్నిమండల వాసిన్యై నమః.
నామ వివరణ.
వహ్నిమండలమున వసించు తల్లి. అమ్మ వహ్ని రూపంలో అక్కడ నివసించుచూ తనలో లీనమగు
భక్తులకు అనన్య వహ్నిరూపమున తనలో కలుపుకొనుతల్లి.
తే.గీ. *వహ్నిమండల వాసినీ*! భవ్యుఁడాయె
నగ్ని నీవటనుండుటన్ హాయిఁ దనర,
వినుత! జ్ఞానాగ్ని నాలోన వెలుగులీన
నీవె వసియించుమిటఁ గూడ, నిరుపమ గతి.
శ్లో. భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచినీ |
సంహృతాశేషపాషండా సదాచారప్రవర్తికా || 78 ||
353. ఓం భక్తిమత్ కల్ప లతికాయై నమః.
నామ వివరణ.
తన భక్తుల విషయమున అమ్మ కల్పలతయే. ఎట్టి కోరిక అయిననూ నెరవేర్చెడి కల్పవల్లి అమ్మ.
తే.గీ. *భక్తిమత్ కల్ప లతికా*! స్వభావ సిద్ధ
కల్పలతవీవె మాకు, సంకల్పసిద్ధి
నిన్ను స్మరియించ నగునమ్మ! సన్నుత గుణ!
వందనంబులు నీకు నీవందుకొమ్ము.
354. ఓం! పశు పాశవిమోచన్యై నమః.
నామ వివరణ.
పశుప్రవృత్తి యనెడి పాశమునుండి విముక్తి కలిగించి జ్ణానమును ప్రసాదించి ముక్తిమార్గమువైపు
నడుపు తల్లి మన అమ్మ.
తే.గీ. నిస్తుల! *పశు పాశవిమోచనీ*! భవాని!
వివిధ పాశముల్ బంధించి వేపఁ దొడగె
నమ్మనన్నిట, రక్షించుమమ్మ నీవు,
ప్రోవఁ బాశముల్ తొలగించి, ముక్తినిమ్ము.
355. ఓం సంహృతాశేష పాషండాయై నమః.
నామ వివరణ.
సంహరింపఁబడిన సకలమైన పాషండులను కల తల్లి. అధర్మప్రవర్తకులు, వేదనిందితులు,
విధ్యుక్త ధర్మము నిర్వహించనివారు, పాషండులు, అట్టి పాషండులనందరినీ సంహరించు తల్లి
మన అమ్మ.
తే.గీ. *సంహృతాశేష పాషండ*! సత్ స్వరూప!
వేద బాహ్యుల నణచెడి వేదరూప!
నీదు నామమే మంత్రమై యాదుకొనును
నన్ను, నిరతంబు మదిలోన నిన్ను నిలిపి.
356. ఓం సదాచార ప్రవర్తికాయై నమః.
నామ వివరణ.
తననాశ్రయించిన వారిని సదాచార ప్రవర్తకులుగా చేయు తల్లి.
కం. భవ వినుత! *సదాచార
ప్రవర్తికా*! వందనములు, భద్రత నిమ్మా.
కవిగా నే రచియించెడి
కవితలలో దోషములను గాల్పుము జననీ!
శ్లో. తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా |
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోఽపహా || 79 ||
357. ఓం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః.
నామ వివరణ.
ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపములనెడి ఆగ్నిచేత తపింపబడువారలకు
తాపముపశమించునట్లు చేయుచు మిక్కిలి సంతోషమును కలుగచేయు వెన్నెల మన అమ్మ.
దారేషణ పుత్రేషణ ధనేషణ లతో తపించు భక్తుల తాపమును చల్లార్చుచు సంతోషమును
కలుగజేయు వెన్నెలయే మన అమ్మ.
స్వయం కల్పిత
హ్లాదచంద్రిక వృత్తము. గణములు.. త ర భ త జ గ.
యతి 8 వ అక్షరము. ప్రాస నియమము కలదు
*తాపత్రయాగ్ని సంత ప్త సమాహ్లాదన చంద్రికా*!
నీ పాద పద్మ పూజన్ నిరతంబే నిలఁ జేసెదన్,
శ్రీ పార్వతీ! మదంబా! స్థిర చిత్తంబును గొల్పుమా,
నీపైన భారముండెన్ నిరవద్యంబుగఁ జేయుమా.
358. ఓం తరుణ్యై నమః.
నామ వివరణ.
ఎల్లప్పుడూ యుక్తవయసుతోనే ప్రకాశించు తల్లియే మన అమ్మ.
తే.గీ. *తరుణి*! నీ సుతుండను తల్లి, ధర్మమరసి
నేను వర్తించునటు చేసి నీతినొప్పు
మార్గమందున నడుపుమా, మార్గదర్శి!
నీకు మ్రొక్కుదు భక్తితో, స్వీకరించు.
359. ఓం తాపసారాధ్యాయై నమః.
నామ వివరణ.
తపస్సు చేయువారిచే నిత్యమూ ఆరాధింపఁబడునది మన అమ్మ.
తే.గీ. *తాపసారాధ్య*! నా మనస్తాపమునకు
హేతు వీ జన్మబంధమే, నీతితోడ
బ్రతుక లేకుంటి, మోక్షంబు ప్రతిగ నిచ్చి
తీసుకొనుమమ్మ నా జన్మ, దేవదేవి!
360. ఓం తనుమధ్యాయై నమః.
నామ వివరణ.
సన్నని నడుము కలది మన అమ్మ. శరీరము మధ్యలో నుండు హృదయాంతర్వర్తి. వెన్నెముకలో
సుషుమ్నగా ఉండునది మన అమ్మ.
కం. *తనుమధ్యా*! విను, చెప్పెద,
ఘనముగ నీ సృష్టిఁ జేసి గౌరవముగ నీ
వనితరమని బిరుదొందితి
వనయము నను కావ లేవొ? హాయిగనుంచన్.
361. ఓం తమోపహాయై నమః.
నామ వివరణ.
తమస్సును అపహరించుతల్లి. అజ్ఞానాంధకారమును పోగొట్టెడి జనని. చైతన్య రహిత
జడత్వముగానున్నభక్తులలోని జడత్వమను చీకటిని పారద్రోలు అమ్మ.
కం. తమమున నజ్ఞాన మలమె,
*తమోపహా*! తమము వాపి తత్వజ్ఞునిగాఁ
బ్రముదంబునఁ జేయుము నను
క్రమముగ నినుఁ జేరగ నగుఁ గనుటకు ముక్తిన్.
శ్లో. చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణీ |
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః || 80 ||
362. ఓం చిత్యై నమః.
నామ వివరణ.
చిత్ అనగా జ్ఞానము. జ్ఞానమును కేంద్రీకృతము చేసి పెంచెడి అమ్మ.
తే.గీ. *చితి*! జగత్సిద్ధిహేతువై జీవతతిని
బ్రోచుచుంటివి నన్నునున్ బ్రోవు మీవు
ముక్తి కారణ మగు మమ్మ పూజితముగ,
వందనంబులు చేసెదన్ భక్తితోడ.
363. ఓం తత్ పద లక్ష్యార్థాయై నమః.
నామ వివరణ.
తత్ పద లక్ష్యమునకు ప్రయోజనమయినది అమ్మ. తత్ పద లక్ష్యంలోని అర్థభాగమయిన ఈశుని
తన లక్ష్యార్థంగా ఉన్న జనని.
కం. *తత్ పద లక్ష్యార్థా*! కన
తత్ పద లక్ష్యార్థ మీవె, తత్వమ్మదియే,
తత్ పదమది నే నయినన్
త్వత్ పద సేవలను జేసి తరియింతు మదిన్.
364. ఓం చిదేక రస రూపిణ్యై నమః.
నామ వివరణ.
జ్ఞానచైతన్యమే ఒకే సర్వసారముగా రూపముగా ఉన్న తల్లి. సారభూతమయిన చైతన్యమే తన
రూపముగా కల తల్లి.
కం. సుజనులు నిన్ దలవనిచో
కుజనులుగా మారుదురని కూర్మిని నీవే
సుజనుల మనసులు వీడవు
నిజము *చిదేక రస రూపిణీ*! ప్రియ జననీ!
365. ఓం స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానందసంతత్యై నమః.
నామ వివరణ.
తన ఆనందములో లవలేశమాత్రమే అయిన బ్రహ్మాద్యానంద సమూహము కల
జనని.బ్రహ్మానందము అనేటువంటివి ఈ తల్లి ఆనందములో అణుమాత్రమే. అట్టి ఆనందముల
సమూహము కల తల్లి.
స్వయం కల్పిత
ఆనందవల్లి వృత్తము.
గణములు.. మ స ర మ జ గ.
యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు
*స్వాత్మానంద లవీ భూత బ్రహ్మా ద్యానంద సంతతీ*!
ఆత్మజ్ఞానము లేదమ్మ! హాయిన్ బొందంగ సాధ్యమా?
స్వాత్మన్నీవె వసింపంగ సాంతంబీవేగ చూడనౌ
నాత్మ జ్ఞానము నాకి మ్మహమ్మే పాయన్, శుభాస్పదా!
శ్లో. పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా |
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా || 81 ||
366. ఓం పరాయై నమః.
నామ వివరణ.
పరా స్థితిలోని వాగ్రూపమే అమ్మ. వాక్కుగా వ్యక్తము కాబోయే శబ్దతత్వ అక్షర బ్రహ్మస్థితిలో నున్న
పరావాక్కు అమ్మయే.
కం. వాక్కుగఁ బరిణతిఁ జెందెడి
యక్కరపుం బ్రహ్మమీవె యాత్మస్థ* పరా*!
నిక్కము, నీవే తగుదువు
చక్కగ వర ముక్తి నీయ, సద్గుణ వరదా!
367. ఓం ప్రత్యక్ చితీ రూపాయై నమః.
నామ వివరణ.
స్వస్వరూపముయొక్క జ్ఞానమే స్వరూపముగా కల తల్లి. అమ్మ పరా వాక్ స్వరూపిణి.
తే.గీ. ప్రోవు స్వ స్వరూప జ్ఞాన రూప వీవు
కనగ, *ప్రత్యక్ చితీ రూప*! కల్పవల్లి!!
నన్ను గూర్చిన జ్ఞానంబు నాకొసంగి,
నీవె కాపాడు నన్నికన్ నిరుపమాన!
368. ఓం పశ్యంత్యై నమః.
నామ వివరణ.
రెండవ స్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు. హృదయ కమలములో ప్రవేశించిన పరావాక్కు యొక్క సూక్ష్మ
రూపమయిన రెండవ స్థితిలో వాక్కు అమ్మ.
కం. *పశ్యంతీ*! మా కంటికి
దృశ్యంబగునవి సకల మదృశ్యంబగునే,
వశ్యాత్ములు నినుగాంతుర
వశ్యము, వర ముక్తినొంది వర్ధిల్లుదురే.
369. ఓం పర దేవతాయై నమః.
నామ వివరణ.
పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మ రూపము అమ్మ.
కం. *పర దేవతా*! జగంబున
వరమీవె, లభించునాకుఁ, బ్రాణంబై న
న్నిరవుగఁ జేసుకొనుమ, భవ
హరవై నను నిలుపుమిల సుహాసిని! ప్రణతుల్.
370. ఓం మధ్యమాయై నమః.
నామ వివరణ.
పశ్యంతీ వైఖరీల మధ్య ఉండు స్థితికి సంబంధించిన వాక్కు అమ్మ.
కం. పశ్యంతీ వైఖరులకు,
దృశ్యంబగు దీవు మధ్య, దీపించుచు నీ
దృశ్యంబె *మధ్యమ*! కను ద
వశ్యము పద సేవఁ జేయ, భాగ్యంబదియే.
371. ఓం వైఖరీ రూపాయై నమః.
నామ వివరణ.
స్పష్టముగా వ్యక్తమయిన వాక్కు రూపమే అమ్మ.
తే.గీ. మహిత! *వైఖరీ రూపా*! నమామి, జనని!
సత్య వాగ్వైఖరిన్ నీవె స్పష్టమగుచు
తోచుచుండుట భాగ్యమే, తోచుమటులె,
నిత్యమున్ నీవె తలపులన్ నిలువుమటులె,
372. ఓం భక్త మానస హంసికాయై నమః.
నామ వివరణ.
భక్తుల మనసులందు సంచరించు ఆడు హంస మన జనని. భక్తుల మానస సరోవరమున
విహరించు జ్ఞానస్స్వరూపమున ఉండు హంసయే అమ్మ.
తే.గీ. * భక్త మానస హంసికా*! భ్రమలఁ బాపి
రక్తితో నిన్ను ధ్యానించు శక్తినిమ్ము,
ధ్యానమగ్న మనస్కుఁడ, దయను జూపి
చిత్సరోవర హంసివై చెలగుమమ్మ!
శ్లో. కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా |
శృంగారరససంపూర్ణా జయా జాలంధరస్థితా || 82 ||.
373. ఓం కామేశ్వర ప్రాణ నాడ్యై నమః.
నామ వివరణ.
కామేశ్వరుని ప్రాణ నాడీ స్వరూపిణి అమ్మ. కామేశ్వరుని ప్రణాళికకు ప్రాణ నాడి అమ్మ.
శా. కారు ణ్యాంబుధి వమ్మ! నీవు జననీ! *కామేశ్వర ప్రాణ నా
డీ*! రక్షా కవచంబు భక్తులకుఁ బాటించంగ నీ దీక్షయే,
లేరెవ్వారలు నిన్నుఁ బోలి మము పాలించం గలా రిద్ధరన్,
నే రక్షార్థిని, నన్నుఁ గాచి సుగతిన్ నిత్యత్వమున్ గొల్పుమా.
374. ఓం కృతజ్ఞాయై నమః.
నామ వివరణ.
చేయఁబడే పనులన్నీ తెలియు తల్లి అమ్మ.
కం. నీ సరి లేరు *కృతజ్ఞా*!
చేసిన పను లెంచి నాదు చిత్తమునందున్
భాసిలి, నన్నిల శోభిల
చేసెడివా రీధరిత్రిఁ, జిద్వర తేజా!
375. ఓం కామ పూజితాయై నమః.
నామ వివరణ.
కామునిచే పూజింపఁబడునది అమ్మ. శివునిచే పూజింపఁ బడునది మన అమ్మ. కోరికలు కలవానిచే
పూజింప బడునది అమ్మ.
తే.గీ. *కామ పూజితా*! నన్నింత కనికరించు,
క్షేమమున్ గూర్చు సత్కామమే మనమునఁ
గలుగునట్టులఁ జేయుచుఁ గావుమమ్మ!
నా మనంబున నీవుండి నడుపుమమ్మ!
376. ఓం శృంగార రస సంపూర్ణాయై నమః..
నామ వివరణ.
కోణ, దళ నవావరణ .రసదేవతా సమన్వితమైన శ్రీచక్ర సంపూర్ణ స్వరూపిణి అమ్మ.
బ్రహ్మానందముతో నిండి ఉండునది అమ్మ.
అష్టమూర్తి వృత్తము,
గణములు. మ న త స ర భ జ య.. యతి. 1 - 8 - 16... ప్రాస నియమము కలదు.
కామాక్షీ! కనుమ, *శృంగార రస సంపూర్ణ*! నన్ గౌరవముతో నిరతంబున్
నీమంబొప్పఁగ నినున్ నే నిరుపమానంద సందీప్తిని భజింతును దల్లీ!
యేమాత్రంబునిక నిన్నేమరవనమ్మా! సదా! యీశ్వరి! ననున్ గనుమమ్మా!
శ్రీమాతా! కరుణతో సేవలను జేయింపనీ! చిత్తమున శ్రీకర! నీవే.
377. ఓం జయాయై నమః.
నామ వివరణ.
జయ స్వరూపిణి అమ్మ, అపజయము లేనిది అమ్మ. నిరంతరము భక్తులకు జయమును కలిగించు
తల్లి మన అమ్మ.
కం. జయ సంకేతము నీవే
జయమే కద నిన్ దలంచ, సన్నుత చరితా!
భయభక్తులతోఁ గొలిచెద
*జయా*! నిను మదిని నిలిపితి, జయములనిమ్మా.
378. ఓం జాలంధర స్థితాయై నమః.
నామ వివరణ.
జలంధర సూచిత స్థానమునందుండు జనని. మనలో అనాహత చక్ర స్థానంలో జలంధరపీఠమనే
సంకేతం ఉంది. అందు నివసించు తల్లి మన అమ్మ..
జయ అనే పేరుతో జాలంధర పీఠము అని చెప్పబడే ఆజ్ఞాచక్రములో ఉండునది. విష్ణుముఖి.
తే.గీ. వినుత జాలంధరాఖ్య సత్ పీఠిపైన
విష్ణుముఖి! నీవు నెలకొని ప్రీతితోడ
నన్నుఁ గాపాడుచుంటివో, కన్నతల్లి!,
జయము, *జాలంధర స్థితా*! జయము నీకు.
శ్లో. ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ |
రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా || 83 ||
379. ఓం ఓడ్యాణ పీఠ నిలయాయై నమః.
నామ వివరణ.
ఓడ్యాణ పీఠమున ఉండు జనని. శ్రీ చక్రములోని కేంద్రము వద్దగల త్రిభుజాన్ని ఓడ్యాణ
పీఠము అందురు.ఇది మనలోఆజ్ట్ణాచక్రములోనుండును. అందు వసించు జనని.
కం. నెప మీ వెన్నకు *మోడ్యా
ణ పీఠ నిలయా*! కృపఁ గని ననుఁ బ్రోచునెడన్,
కుపితవు కాకుము, నాకిల
నుపకారము చేయునపు డనూన సుచరితా!
380. ఓం బిందు మండల వాసిన్యై నమః.
నామ వివరణ.
బిందువును పరివేష్టించియుండు స్థానమున ఉండు తల్లి.
తే.గీ. నిత్య! *బిందు మండల వాసినీ*! కనంగ
మూల బిందు మండలమునఁ బ్రోవ నన్ను
నిలిచి యున్నట్టి నిన్నుననితరరీతి
వర్ణనము చేసి పలుకుదున్, పలుకులిమ్ము
381. ఓం రహోయాగక్రమారాధ్యాయై నమః.
నామ వివరణ...
ఒంటరిగా చేయు యాగపద్ధతిలోక్రమముగా ఆరాధింపఁబడు తల్లి అనన్యభావంతో క్రమమైన
పద్ధతిలో ఆరాధింపంబడు తల్లి.
సీ. అంతః స్థితా! *రహోయాగక్రమారాధ్య*! జ్ఞానాగ్నివోయమ్మ! కనగ నీవు,
బోధను పొంది నా పుణ్యపాప ఫలంబు లగ్నిదగ్ధము చేసి యలరనిమ్ము,
శివ శక్తి తేజంబు నవనవోన్మేష సద్భావంబునే గొల్ప పద్యలహరి
పరుగిడి వచ్చి నిన్ బరవశింపగఁ జేయ వర్ణించి వ్రాయనీ వనజ నయన!
తే.గీ. కుండలిని మేలుకొలిపి యకుంఠితముగ
నట చిదగ్నిని పాపాదులంతరింప
కాల్తు నిక రహోయాగానఁ, గ్మల నయన!
నీదు సత్ కృప కల్గినన్ నిరుపమాన!
382. ఓం రహస్తర్పణ తర్పితాయై నమః.
నామ వివరణ.
రహస్యముగా చేయు తర్పణముచే తృప్తి చెందు తల్లి. రహోయాగ తర్పణముచే తృప్తి చెందు
జనని.
కం. వరము రహోయాగ ధనము
పరమేశ్వరి! నీదు కృపను వర్ధిలనగు న
మ్మ! *రహస్తర్పణ తర్పిత*!
వర తర్పణమగు స్మరణమె, భార్గవి! కనుమా.
శ్లో. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా |
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా || 84 ||
383. ఓం సద్యఃప్రసాదిన్యై నమః.
నామ వివరణ.
ఆక్షణములోనే అనుగ్రహించుఅమ్మ. భక్తులను వెన్వెంటనే అనుగ్రహించు జనని.
తే.గీ. నిన్ను *సద్యః ప్రసాదినీ*! నేను కొలువ
నాకు సద్యః ఫలంబిచ్చి నన్ను నిలను
వ్యక్తిగా నీవె నిలిపితే, భక్త సులభ!
నిన్ను వర్ణించు పద్ధతిన్ నేర్పుమమ్మ!
384. ఓం విశ్వ సాక్షిణ్యై నమః.
నామ వివరణ.
లోకమునకు సాక్షీభూతమైనతల్లి. ప్రపంచమున జరుగు ప్రతీ విషయమునకూ సాక్షిగాఉండు తల్లి.
తే.గీ. విశ్వమును సృష్టి చేసిన వేద రూప!
*విశ్వ సాక్షిణీ*! నీదరి శాశ్వతముగ
నుండుటేగద సన్ముక్తి, నిండుమదిని
యుండనిమ్ము భవాని! నన్నొప్పిదముగ.
385. ఓం సాక్షివర్జితాయై నమః.
నామ వివరణ.
సాక్షి లేని తల్లి. తల్లిఅనాదిగా గలది కావున అమ్మకు సాక్ష్యము ఉండదు.
కం. *సాక్షి వివర్జిత*! నినుఁ బ్ర
త్యక్షంబుగఁ గనగ లేనొ? యభిమానముతో
మోక్షప్రద కనఁబడుమా,
రక్షణ నీవే కదమ్మ! ప్రార్థించెదనిన్.
386. ఓం షడంగ దేవతా యుక్తాయై నమః.
నామ వివరణ.
శిక్షా, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పముఅనుఆరును వేదాంగములు.ఇవియే
షడంగములుఈ షడంగ దేవతలతో కూడియున్నతల్లి.
కం. మదిలో వసియించు *షడం
గ దేవతా యుక్త*! జనని! ఘనతరముగ నిన్
బుధజనులు మెచ్చునట్టుల
సదయను నా కవితనుండు, సత్వగుణాఢ్యా!
387. ఓం షాడ్గుణ్య పరిపూరితాయై నమః.
నామ వివరణ.
ఆరు గుణాలచే పుష్కలముగా నిండి యున్న తల్లి. ఐశ్వర్యము వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము,
వైరాగ్యముఅనుఆరుగుణములతో నిండియున్న తల్లి.
కం. కృపఁ గను నను! *షాడ్గుణ్య ప
రిపూరితా*! నిను మదిని స్మరింపగనిమ్మా!
యపవాద రహిత సుకవిత
లపరిమితముగ నిను గూర్చి యల్లగ నిమ్మా.
శ్లో. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ |
నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ || 85 ||
388. ఓం నిత్యక్లిన్నాయై నమః.
నామ వివరణ.
ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడియుండు తల్లి.
కం. *నిత్యక్లిన్నా*! నాపై
నిత్యంబున్ బ్రేమ తోడ నీవుండన్ నే
సత్యాత్మన్ లోఁ గాంతున్,
నిత్యంబున్ నిన్నుఁ జూతు, నిన్ బ్రార్థింతున్.
389. ఓం నిరుపమాయై నమః.
నామ వివరణ.
తనను పోల్చి చెప్పుటకు అసలుఏవస్తువాలేని జనని.
తే.గీ. *నిరుపమా*! నిన్ను మదిలోన నిలిపినంత
నిరుపమానంద సామ్రాజ్య నేతనగుదు,
కరుణతోనొప్పు నిన్ను నే కనిన చాలు
సిరులపంటలు పండును, దొరలు కవిత.
390. ఓం నిర్వాణ సుఖదాయిన్యై నమః.
నామ వివరణ.
మోక్షసంబంధమైన ఆనందమును యిచ్చు తల్లి.
తే.గీ. నీకు *నిర్వాణ సుఖదాయినీ*! ప్రణతులు,
నాకు నిర్వాణ సుఖము ననంతముగను
ప్రీతికరముగ నొసగుమా, వేచి యుంటి,
యీ కొలంది నొసంగుమా శ్రీకరముగ.
391. ఓం నిత్యాషోడశికా రూపాయై నమః.
నామ వివరణ.
పదునారు నిత్యా దేవతలను తన స్వరూపముగా ఉన్న తల్లి.
కం. కోరుదు *నిత్యా షోడశి
కారూపా*! నినుఁ, బ్రశాంతిగా నాలోనన్
జేరి వసించుము తృప్తిగ,
స్మేరముఖీ! వందనములు చేసెద నీకున్!
392. ఓం శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః.
నామ వివరణ.
శివుని సఖము శరీరమై యొప్పియున్న తల్లి.
వాక్కు అర్థము తన శరీరముగా ఉన్న జనని.
కం. *శ్రీకంఠార్ధ శరీరిణి!*
నీ కల్యాణగుణ చయము నే వివరింపం
గా కుదురునెటుల? నీవే
శ్రీకరముగ నింక వ్రాయఁ జేయుము కృపతోన్.
శ్లో. ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ |
మూలప్రకృతి-రవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ || 86 ||
393. ఓం ప్రభావత్యై నమః.
నామ వివరణ.
వెలుఁగు విరఁజిమ్ము రూపము కలది అమ్మ.
ప్రకాశ ప్రజ్ఞాన స్వరూపిణి అమ్మ.
కం. శ్రీవిద్యా ప్రభ నొప్పెడి
దేవీ! కామేశ్వరీ! సుధీవర పాళిన్
నీవే రక్షింపు జనని!
భావింతు నిను మది నో *ప్రభావతి*! సతమున్..
394. ఓం ప్రభా రూపాయై నమః.
నామ వివరణ.
వెలుఁగు యొక్క రూపమే అమ్మ.
తే.గీ. నిరుపమాన *ప్రభా రూప*! నీదు ప్రభలు
లోకమంతకు వెలుఁగులు, శ్రీకరములు,
నేను నిరతంబు నీ ప్రభల్ మానితముగ
హృదయమందున నిల్పుదు, సదయఁ గనుమ.
395. ఓం ప్రసిద్ధాయై నమః.
నామ వివరణ.
ప్రకృష్టముగా సిద్ధముగా ఉన్న జనని.
కం. సంచిత పుణ్యులె నీ కృప
నంచితముగ పొందఁ గల రహంబును విడుచున్,
వంచకుల కసాధ్యమె, యో
చించగ, నను కృపను గను *ప్రసిద్ధ*! భవానీ!
396. ఓం పరమేశ్వర్యై నమః.
నామ వివరణ.
పరమునకు అధికారిణి అమ్మ.
కం. *పరమేశ్వరీ*! శుభాస్పద!
పరహిత! నినుఁ దలప కవిత పరుగున వచ్చున్,
నిరుపమ భక్త శుభంకరి!
కరుణను ననుఁ గావుమమ్మ! కల్మష హారీ!
397. ఓం మూలప్రకృత్యై నమః.
నామ వివరణ.
అన్ని ప్రకృతులకు మూలమైనది అమ్మ.
తే.గీ. *మూలప్రకృతీ*! జగత్ సృష్టి మూలమీవె,
పొంగి పొరలు నా కవితకు మూలమీవె,
పూజ్య గురువుల కృపకును మూలమీవె,
భోగభాగ్యంబులకుఁ గాంచ మూలమీవె.
398. ఓం అవ్యక్తాయై నమః.
నామ వివరణ.
అస్సలు వ్యక్తము కానిది జనని.
కం. *అవ్యక్తా*! నీ కృపయే
భవ్యంబగు నాకుఁ, గానఁ బ్రార్థించెదనిన్
సువ్యక్తంబయి మదిలో
నవ్యక్తానందమయిగ నలరుము తల్లీ!
399. ఓం వ్యక్తావ్యక్త స్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
వ్యక్తమగు అవ్యక్తమగు అన్ని రూపముల స్వరూపిణి అమ్మ.
కం. నిరుపమ! *వ్యక్తావ్యక్త
స్వరూపిణీ*! నీవె దిక్కు, వరలుము నాలో,
కరుణామయి వగు నిన్నే
నిరతము సేవించుకొనగ నిమ్ము మదంబా!
శ్లో. వ్యాపినీ వివిధాకారా విద్యాఽవిద్యాస్వరూపిణీ |
మహాకామేశనయన కుముదాహ్లాదకౌముదీ || 87 ||
400. ఓం వ్యాపిన్యై నమః.
నామ వివరణ.
వ్యాపనత్వ లక్షణము కలది అమ్మ.
తే.గీ. విశ్వమంతటన్ వ్యాపించి వెలుఁగుచున్న
*వ్యాపినీ*! సృష్టి నీదమ్మ! వాస్తవమిది,
నీవు లేనట్టి చోటేది? నీరజాక్షి!
నిండియుంటివి నాలోన నిండు మదిని.
ఓం వివిధాకారాయై నమః.
నామ వివరణ.
వివిధములైన ఆకారములతో వ్యక్తమగునట్టి తల్లి.
కం. పలుపలు రూపములందున
నిలపై కనిపించు నిన్ను నెటుల గ్రహింతున్?
సులలిత *వివిధాకారా*!
నిలువుము నా కనులలోన నిత్యము కృపతోన్.
402. ఓం విద్యాఽవిద్యా స్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
విద్య అవిద్యలతో కూడిన జ్ఞానమును రూపముగా కలిగిన తల్లి.
కం. వర నుత *విద్యావిద్యా
స్వరూపిణీ*! వందనములు భగవతి! యెఱుఁగన్
నిరుపమ విద్యావిద్యల్,
కరుణించుము నీవ నన్ను ఘన ముక్తిదవై.
403. ఓం మహా కామేశ నయన కుముదాహ్లాద కౌముద్యై నమః.
నామ వివరణ.
మహా కామేశ్వరుని కన్నులనెడి కలువలకు ఆనంద వికాసములు కలిగించు వెన్నెలవెల్లువ అమ్మ.
స్వయం కల్పిత
ఆహ్లాదకౌముది, వృత్తము.
గణములు.. స త న స ర వ.
యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
సుమతీ! మాపై కృపను వసుధపై నుండరాదొ నీ
కు, *మహా కామేశ నయన కుముదాహ్లాద కౌముదీ*!
సుమతుల్ నీ వాగ్భవమగు సుధలన్ గ్రోల నుండిరే,
నిమిషంబైనన్ నిను గనని భవంబెన్న వ్యర్థమే.
శ్లో. భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః |
శివదూతీ శివారాధ్యా శివమూర్తి-శ్శివంకరీ || 88 ||
404. ఓం భక్త హార్ద తమో భేదభానుమద్భాను సంతత్యై నమః.
నామ వివరణ.
భక్తుల హృదయగతమయిన అజ్ఞానమనెడి అంధకారమునురూపు మాపునట్టి కాంతితో కూడిన
సూర్యకిరణముల సమూహము అమ్మ.
స్వయం కల్పిత
తమోభేదము వృత్తము.
గణములు.. ర స ర య జ గ.
యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
*భక్త హార్ద తమో భేద భానుమద్భాను సంతతీ*!
శక్తినిచ్చు మదంబా! ప్రశాంత చిత్తంబు నిమ్మికన్,
భక్తి తత్పరతన్ నిన్ను వర్ణనంబేను చేసెదన్,
యుక్తితో తమమున్భేదమొప్పుగా నీవె పాపుమా.
405. ఓం శివదూత్యై నమః.
నామ వివరణ.
శివ పర భక్తిని చూపించు అమ్మవారి రూపము.
కం. షోడశ నిత్యల లోపల
నేడవ నిత్యవు కదమ్మహే *శివదూతీ*!
తోడగు శివుఁడే దూతగ
నీడగనిన్ననుసరించు నిత్యము, లలితా!
తే.గీ. శివుఁడె దూతగామారె నీ చిత్త మలర,
దివ్య *శివదూతి*! నీ కృప దేవతలును
చేరుటన్నది కష్టమే, చేరుటెట్లు
నేను నీ దరి? కరుణించు, నీవె నన్ను.
406. ఓం శివారాధ్యాయై నమః.
నామ వివరణ.
శివునిచే ఆరాధింపఁబడు తల్లి. ఇడానాడీ సమన్వయ స్వరూపిణి మన అమ్మ.
కం. ధ్యానింతు *శివారాధ్యా*!
నీ నామ స్మరణ చేత నిటలాక్షుండే
మానవ కాంక్షలు తీర్చుచు,
దీనుల రక్షించుచుండు దీప్తివి నీవే.
407. ఓం శివమూర్త్యై నమః.
నామ వివరణ.
సర్వమంగళత్వము మూర్తీభవించిన తల్లి. అవ్యక్త శివుని వ్యక్త రూపము అమ్మ.
కం. మంగళ దేవతవమ్మా!
పొంగుచు శివునందున సగముగ కలిసితివే,
యింగితమిడు *శివమూర్తీ*!
జంగమదేవరయె మెచ్చ, సన్నుత కీర్తీ!
408. ఓం శివంకర్యై నమః.
నామ వివరణ.
సర్వ శుభములను చేకూర్చు తల్లి. సుషుమ్నాడీ సమన్వయ స్వరూపిణి ఈ జగన్మాత.
కం. చిత్తును సత్తును నీవే,
బత్తిని నిను కొలుచు జనులు భవ్యులు జగతిన్,
మత్తును *శివంకరీ*! నీ
చిత్తము పొంగగను బాపి చేకొనుమమ్మా.
శ్లో. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా |
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా || 89 ||.
409. ఓం శివ ప్రియాయై నమః.
నామ వివరణ.
శివునిపై ప్రీతికలది, శివునకు ప్రీతికరమైనది అమ్మ. మంగళకరమైనవాటియందు ప్రీతి కలది ఈ
జగన్మాత.
కం. నీ యిల్లు నా హృదబ్జము,.
శ్రేయస్కరివగుచు నాదు చిత్తమునందున్
మాయను జయింపఁ జేయుచు
హాయిగ వెలిఁగెడి *శివప్రియా*! శ్రీమాతా!
410. ఓం శివపరాయై నమః.
నామ వివరణ.
శివినే పరమావధిగా ఉన్న తల్లి.
తే.గీ. చేరుటను నీవు చిచ్ఛక్తి శివుని కొదవె
నమ్మ! నిజమిది, *శివపరా*! నమ్మి నిన్ను
కొలుచు భక్తుల కోర్కెలు కూర్మితోడ
నీవు నెరవేర్తువమ్మరో, నిరతమిలను.
411. ఓం శిష్టేష్టాయై నమః.
నామ వివరణ.
శిష్టులయెడ యిష్టము కల తల్లి మన అమ్మ. శిష్టుల యెడ యిష్టుల(తయాగముల) రూపంలో
ఆరాధింపబడుచు ఉన్న తల్లి మన అమ్మ.
కం. దయఁ గాచెడి *శిష్టేష్టా*!
ప్రియముగ సద్యాగములఁ జరించుచునుందున్, ,
నయ వర్తన నీ సత్ కృప,
భయహారీ! శిష్టునిగ నభయద! కను ననున్.
412. ఓం శిష్ట పూజితాయై నమః.
నామ వివరణ.
శిష్ట జనులచే పూజింపబడు తల్లి.
తే.గీ. *శిష్ట పూజితా*! నాకు విశిష్ట గుణము
నీదు కృప చేతఁగ, నిన్నుఁ దలచి
పూజ భక్తిగ నిత్యంబు ముందు చేసి
పిదప దినచర్యఁ జేయుదు, వినుము జనని!
413. ఓం అప్రమేయాయై నమః
నామ వివరణ.
ప్రమేయము లేనిది సరిపోల్చుటకు వీలగు ప్రమాణము లేని తల్లి,
తే.గీ. సృష్టి నీ దివ్య దృష్టిచేఁ జేయఁబడెను,
నిన్ను నెన్న నసాధ్యంబు నేర్పు మీర
ననుపమానవు చూడ నీ *వప్రమేయ*!
వందనమ్ములు గొనుమమ్మ! భవ్య తేజ!.
414. ఓం స్వప్రకాశాయై నమః.
నామ వివరణ.
తనంతట తానుగా ప్రకాశించు తల్లి. ప్రకాశమే తానయి యున్న తల్లి, సాధకులలో స్వయముగా
ప్రకాశించు తల్లి మన అమ్మ.
తే.గీ. స్వప్రకాశంబె నీకుండె *స్వప్రకాశ*!
జీవులన్నిటన్ జెలఁగెడు జీవమీవె,
యగ్ని సూర్యాదులకుఁదేజ మమరఁ జేసి
ప్రబలుచున్నట్టి నీకు నా వందనములు.
415. ఓం మనోవాచామగోచరాయై నమః.
నామ వివరణ.
మనసు చేత కాని మాట చేత కాని గోచరించుటకు సాధ్యము కాని తల్లి. మనసుకు మాటలకు
అందనంతటి గొప్ప జనని.
కం ప్రముదముతోడఁ గనెదను ప
ర!. *మనోవాచామగోచరా*! కనఁబడుమా,
రమణీయ భావనన్ గని
సుమధుర పద్యముల నిన్నుఁ జూపఁగనిమ్మా.
శ్లో. చిచ్ఛక్తి-శ్చేతనారూపా జడశక్తి-ర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతి-స్సంధ్యా ద్విజబృందనిషేవితా || 90 ||.
416. ఓం చిచ్ఛక్త్యై నమః.
నామ వివరణ.
పరమాణువునుండి పరమాత్మ వరకు ఉండు చైతన్య రూపమే అమ్మ. అన్నిటను చైతన్య
రూపమున ఉండు చిచ్ఛక్తి అమ్మయే.
తే.గీ. మమ్ము నడిపించు *చిచ్ఛక్తి*! మధుర భావ
బంధురంబగు వృత్తముల్ పలుకనిమ్ము
శుభద! చిచ్ఛక్తి రూపమున్ జూడనిమ్ము,.
భక్తి తోడుత వర్ణించి వ్రాయనిమ్ము.
417. ఓం చేతనారూపాయై నమః.
నామ వివరణ.
ప్రాణికోటిలో చేతన రూపంలో ఉండు శక్తి అమ్మయే.
తే.గీ. *చేతనారూప*! నీ దివ్య చేతనమున
నిత్య చైతన్యమున సృష్టి నిరవధిగనె
సాగు చుండెను, నాలోన సదయ నీవు
చేతనము గొల్పి నిన్ గృపన్ జేరనిమ్ము.
418. ఓం జడశక్త్యై నమః.
నామ వివరణ.
జడస్థితిలో ఉండు జనని లలితాంబ.
కం. *జడశక్తీ*! మది జడమయె,
నడిపించుము చేతన మిడి నా జనయిత్రీ!
జడమజడమె నీ దయచేఁ
దడబాటును వీడి నిన్ను దర్శింతు మదిన్.
419.. ఓం జడాత్మికాయై నమః.
నామ వివరణ.
జడస్థితిలో ఉండు ఆత్మ స్వరూపము అమ్మ.
తే.గీ. ఓ *జడాత్మికా*! జగతిలోనున్న జడమె
నీదు చైతన్యమున్ బొంది నిలువఁ గలిగె,
జడ మనంబులున్ నీ కృపన్ సత్యమటులె
రూపతేజంబులన్ మనున్ గోపదూర!
420. ఓం గాయత్ర్యై నమః.
నామ వివరణ.
తనను గానము చేయు సాధకులను రక్షించు జనని లలితాంబ.
కం. *గాయత్రీ*! పరదేవత!
మాయను బోకార్పి సుకవి మాన్యులు మెచ్చన్
ధీయుక్త సత్ కవిత్వము
వ్రాయగ ననుఁ జేయుమమ్మ! రమ్య గుణాఢ్యా!.
421. ఓం వ్యాహృత్యై నమః.
నామ వివరణ.
ఉచ్చరింపఁబడి వ్యాప్తి చెందునది అమ్మ. అమ్మవారి నిశ్వాసనుండి వేదములుద్భవించినవి.
ఆవిధముగా ఉచ్చరించుటకు విడిచెడు గాలిద్వారా సముత్పన్నమగు శబ్దము ఉచ్చారణ. తద్వారా
వ్యాప్తమగు తల్లి లలితాంబిక.
తే.గీ. ఉచ్చరించుటన్ వ్యాప్తిననూన రీతి
పొందు *వ్యాహృతీ*! నీకు నా వందనములు.
వేదరూపిణివగు నీవు విదితమగుమ,
మదిని వెలుఁగుమా, నీ మేలు మరువనమ్మ!
422. ఓం సంధ్యాయై నమః.
నామ వివరణ.
చక్కగా ధ్యానము చేయఁబడు తల్లి. సంయక్ ధ్యానము సంధ్య. పగటికి రాత్రికి మధ్యసమయము
సంధ్యగా వ్యవహరింపబడును. అట్టి సమయమే లలితాంబ. అజ్ఞానమునకు, జ్ఞానమునకు
మధ్య మనసున కలిగెడి సందేహమే సంధ్య. అట్టి సంధ్య అమ్మయే. తనవైపు నడుపుటకు సంధ్యా
రూపమున గల తల్లి అమ్మ.
తే.గీ. ఇళకు పింగళకున్ మధ్య వెలుగుచుండి
భృకుటి నొప్పెడి *సంధ్యా*! నవీన తేజ
మంద నీ నుండి, కొలిచెద నమ్మ! నిన్ను,
నాత్మలో, నాకుఁ గన్బడు మమ్మ కృపను.
423. ఓం ద్విజ బృంద నిషేవితాయై నమః.
నామ వివరణ.
ద్విజులచే నిశ్శేషముగా సేవింపఁబడు తల్లి.
కం. భావోద్భవ! *ద్విజ బృంద ని
షేవిత*! నన్ ద్విజుని జేసి, సేవలు గొనుమా
నీవే బ్రహ్మము గామది
జీవాత్మను వెలుఁగుదువుగ, చిద్వర భాసా!
శ్లో. తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా |
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ || 91 ||
424. ఓం తత్త్వాసనాయై నమః.
నామ వివరణ.
తత్ సంబంధమయిన భావమే ఆసనముగా కల తల్లి మన అమ్మ.
తే.గీ. ప్రముఖ *తత్త్వాసనా*! నీదు ప్రతిభ ఘనము,
తత్వ భావ నిమగ్నవు తలప నేనె
యాసనము నీకు, నాలోన నమరియున్న
నిన్నె సేవింతునమ్మరో! నిజము నెఱిఁగి.
425. ఓం (తత్)తస్మై నమః
నామ వివరణ.
నిర్గుణ తత్వమేదియో అది అమ్మయే..
కం. హే *తత్*! పరదేవత! నిను
శ్రీతత్వముగా గ్రహింతుఁ, జిద్వర భాసా!,
శ్రీ తత్వజ్ఞుఁడ నగుటకు
నీ తత్వమె ముఖ్యమమ్మ! నిర్భర తేజా!
426. ఓం (త్వమ్) తుభ్యం నమః.
నామ వివరణ.
సగుణ తత్వమేదియో అది అమ్మయే.
కం. నిను సేవించెద హే *త్వమ్*!
కనుమఱుఁగయి గుండెలోనఁ గనఁబడు జననీ!
వినుతించెద నిను, నీ కృప
కనఁబడునటు పద్యములను గనఁబడుమమ్మా!
427. ఓం (అయీ) అయ్యై నమః.
నామ వివరణ.
అమ్మవారితో మానసికముగా యుండు సాన్నిహిత్యము వలన ఓయి తల్లీ అని పిలిచే సంబోధన
పదముగా గల తల్లి అమ్మ.
పంచచామరము.
*అయీ*! సుపూజ్య భక్తవత్సలా! నినుం గనుంగొనన్
నయప్రవృత్తి వృద్ధియౌను నాకు శాంభవీ! సదా
జయంబు నాకుఁ గల్గఁ జేయు, సత్యమిద్దియే కదా!
భయంబు వీడి సంచరించి భక్తితోడఁ గొల్చెదన్.
428. ఓం పంచ కోశాంతర స్థితాయై నమః.
నామ వివరణ.
అన్నమయ ప్రాణమయ,, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. అను పంచ కోశముల మధ్య
ఉండునది అమ్మ.
తే.గీ. *పంచ కోశాంతర స్థితా*! పరవశింతు
సంచితంబగు కర్మలే సమసిపోవ,
మంచి మార్గముఁ జూపుమా, మాతృదేవి!
దేహమందున వసియించు దేవి! కనుమ,
429. ఓం నిస్సీమమహిమ్నే నమః.
నామ వివరణ.
హద్దులే లేని, అంతే లేని మహిమ కలది అమ్మ.
తే.గీ. కనుమ *నిస్సీమమహిమ*! నన్ గరుణతోడ,
హద్దులే లేని మహిమతో నలరు నిన్ను
వర్ణనము చేయ సాధ్యమా? భర్గురాణి!
నీవె కవితవై పొంగుమా నీరజాక్షి!
430. ఓం నిత్య యౌవనాయై నమః.
నామ వివరణ.
సర్వకాలములయందును యౌవనదశలోనే యుండు తల్లి లలితాంబ.
తే.గీ. నిత్య! *యౌవనా*! నీ శక్తి నిత్యమమ్మ!
సత్యమార్గాన నడుపు నన్ సద్విభాస!
మృత్యు వెదురైనఁ గాని నీ స్మృతిని వీడ
కుండ కావుమా ముక్తిద! నిండు మదిని.
431. ఓం మదశాలిన్యై నమః.
నామ వివరణ.
ఏ యితర భావావేశము చేతను కలవని బ్రహ్మానందమును పొందుచు అట్టి బ్రహ్మానందము అనే
మదమును గలిగిన తల్లి లలితాంబ.
తే.గీ. వినుమ, *మదశాలినీ*! నాదు విన్నపమును,
వ్యర్థమైనట్టి మదము నన్ బట్టె నమ్మ!
స్వార్థమున్ బాపి మదమునే పారద్రోలి,
స్వార్థముననొప్పు నిను చేరు వరము నిమ్ము.
శ్లో. మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః |
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా || 92 ||
432. ఓం మద ఘూర్ణిత రక్తాక్ష్యై నమః.
నామ వివరణ.
మదము చేత తిరుగుచున్న ఎర్రని కన్నులు గల తల్లి. అలౌకిక పరమానందముచే ఎర్రబారిన
కన్నులు గల తల్లి. జపాకుసుమ సంకాశ మదఘూర్ణిత లోచన మన అమ్మ.
కం. *మద ఘూర్ణిత రక్తాక్షీ*!
సదయన్ ననుఁ గనినఁ జాలు సంబరపడుదున్,
దుదకేను ముక్తి నొందుదుఁ
గద నీవటు కనుట వలనఁ, గాదనకమ్మా!
433. ఓం మద పాటల గండభువే నమః.
నామ వివరణ.
అందము చేత పాటల వర్ణముతోనొప్పుచున్న చెక్కిళ్ళు గలది మన అమ్మ.
కం. శుభదా! *మద పాటల గం
డభూ*! కృపామృతమునీ కడఁ గలదిమ్మా.
శుభకర సత్కవితామృత
మభిమానముతోనొసంగి యలరించుమిఁకన్.
434. ఓం చందన ద్రవ దిగ్ధాంగ్యై నమః
నామ వివరణ.
ద్రవీభూత శ్రీచందనము పూయఁబడిన అంగములతో ప్రకాశించు జనని.
తే.గీ *చందన ద్రవ దిగ్ధాంగి*! మంద గమన!
చల్లనైనట్టి నీ చూపు చక్కగాను
మల్లియంబలె మనసును జల్లఁబరచుఁ
గాచి రక్షించు మా తల్లి! కల్ప వల్లి!
435. ఓం చాంపేయ కుసుమప్రియాయై నమః
నామ వివరణ.
సంపంగి పూవులన్న ప్రీతి గల తల్లి లలితామాత.
తే.గీ. అమ్మ! *చాంపేయ కుసుమప్రియా*! నినుఁ గని
మహిత చంపక భారతిన్ మాన్యు లలర
నొక్క దినమున రచియించి తొప్పిదముగ.
నీదు సత్కృపాఫలమిది, నిజము జనని!
శ్లో. కుశలా కోమలాకారా కురుకుళ్లా కుళేశ్వరీ |
కుళకుండాలయా కౌళమార్గతత్పరసేవితా || 93 ||
436. ఓం కుశలాయై నమః
నామ వివరణ.
సృష్టి నిర్మాణాది కార్యములందు నైపుణ్యముగలజనని మన అమ్మ. పంచ కృత్యములందు సర్వ
విజ్ఞానమునందు, చతుష్షష్టి కళలందు నైపుణ్యము కలది జగన్మాత.
కం. *కుశలా*! నా దేహమునన్
నశియించుచునుండె శక్తి, నాగతి నీవే
నిశితముగఁ గాంచి శుభకర
ప్రశాంతిని గృప నొసగుమిఁక రాజిత వదనా!
437. ఓం కోమలాకారాయై నమః.
నామ వివరణ.
సుకుమారమైన ఆకారము కల తల్లి యీ లోక మాత.
తే.గీ. *కోమలాకార*! నామది కోమలముగ
నుండునట్టులఁ జేయుమా నిండు మదిని,
పండువెన్నెల నీచూపు పరచుమమ్మ
కృపను నాపైన, వనజాక్షి! తృప్తిఁ గనుదు
438. ఓం కురుకుల్లాయై నమః.
నామ వివరణ.
శ్రీపురము లోని అహంకార చిత్తమయ ప్రాకారాల మధ్య విమర్శమయమైన బావియందుఉండు
శ్యామయే కురుకుళ్ళ మన అమ్మ..
కం. చూడుము *కురుకుల్లా*! నన్
నీడగ నిలుమమ్మ! నాకు నీవే తల్లీ!
వాడని భక్తికుసుమమును
వేడెద నాకొసఁగు మమ్మ! ప్రీతిని గొలుతున్.
439. ఓం కులేశ్వర్యై నమః
నామ వివరణ.
కులమునకు ఈశ్వరి మన అమ్మ, నాడీమండలమే కులము అనుకొనినచో అందు ఉండు
కురుకుళ్ళయే మన జనని కులేశ్వరి.
కం. ఓ కనకాంగీ! పార్వతి!
శ్రీకరి! శాంభవి! *కులేశ్వరీ*! నినుఁ గొలుతున్,
నాకిక నీవే దిక్కని
ప్రాకటముగఁ జెప్పి నిన్నుఁ బ్రార్థించితినే.
440. ఓం కులకుండాలయాయై నమః
నామ వివరణ.
మూలాధార చక్రములో కర్ణిక మధ్యన సూక్ష్మముగా ఉండు బిందువే కులకుండము. దానినే
స్థావరముగా గలిగిన తల్లి జగదంబ.
కం. *కులకుండాలయ*! నిరతముఁ
జలియించుచు లోన నీవు శక్తి నొసఁగుచున్,
నిలుపగ నీపై మనసును
భళిభళి యన చేసితివిగ పరవశమొందన్.
441. ఓం కౌళ మార్గ తత్పర సేవితాయై నమః.
నామ వివరణ.
కౌల మార్గమును అనుసరించు వారలచే సేవింపఁబడు జనని లలితాంబ. కౌలాచారంలో
మూలాధారం వద్ద ఉండే కులకుండలానికి ప్రాధాన్యత యిచ్చుచు అదియే అమ్మవారి ఆలయంగా
భావించి సేవించు కౌలాచారులచే సేవింపఁబడు తల్లి మన అమ్మ.
తే.గీ. కౌలమార్గానువర్తులు ఘన తరముగఁ
జేయు సేవలు గొన వలచెదవు, *కౌళ
మార్గ తత్పర సేవితా*! మనమునందు
నన్ను గణియించి ప్రోవు ప్రసన్న వదన!
శ్లో. కుమారగణనాథాంబా తుష్టిః పుష్టి-ర్మతి-ర్ధృతిః |
శాంతిః స్వస్తిమతీ కాంతి-ర్నందినీ విఘ్ననాశినీ || 94 ||
442. ఓం కుమార గణనాథాంబాయై నమః.
నామ వివరణ.
కుమార స్వామికి గణనాథునికి తల్లి మన అమ్మ.
కం. అంబా! *కుమార గణనా
థాంబా*! సర్వంబు నీవె, యనుపమ సుఖదా!
సాంబుని యర్ధాంగీ! జగ
దంబా! ననుఁ గావుమిల, ననంత శుభకరీ!
443. ఓం తుష్ట్యై నమః.
నామ వివరణ.
అన్ని జీవులయందు సంతుష్టి రూపములో ఉండు జనని. అన్ని జీవులకు సంతుష్టి
కలిగించు జనని మన లలితాంబ.
తే.గీ. తుష్టి నినుఁ గొల్చుటన్ గల్గు పుష్టిగాను,
నట్టి తుష్టిని *తుష్టీ*! యహంబుఁ బాపి
యిమ్ము నాకీవు, నాదు మనమ్ము పొంగ,
నిన్ను నమ్మి నే నుంటి నో నీరజాక్షి!
444. ఓం పుష్ట్యై నమః
నామ వివరణ.
దేవదారు వనమందు ఉండే దేవి పుష్టి. అన్ని జీవులయందు పుష్టి రూపములో ఉండు తల్లి మన
లలితాంబ.
తే.గీ. తిండి కలిగినఁ బుష్టిగా నుండవచ్చు
పుష్టిగానుండ నిను మదిన్ బూజ చేయ
వలను పడునమ్మ! *పుష్టీ*! భవాని! నీవ
పుష్టిఁ గొలుపుము నాకిఁకన్, బుణ్యముండు.
445. ఓం మత్యై నమః.
నామ వివరణ.
సర్వ జీవులయందు బుద్ధి రూపములో ఉండు జనని లలితాంబ.
కం. మతివై నాలో నిలిచిన
స్తుత *మతి*! నీ ప్రేరణమున శోభిలు చుంటిన్
గతి నీవె నాకరయ, మతి!
నుతియించెదఁ గావుమమ్మ! నుతగుణ! ప్రణతుల్.
446. ఓం ధృత్యై నమః.
నామ వివరణ.
ధృతి అనగా ధైర్యము. అన్ని జీవులయందు ధైర్యము రూపములో ఉండు జనని.
కం. నాలో ధృతివైన *ధృతీ*!
నీలీల లనన్య మమ్మ! నిత్యము నీవే
లోలోపలఁ బ్రేరణ నిడి
నీలోఁ గల శక్తి నిచ్చి నిలుపుదువమ్మా!
447. ఓం శాంత్యై నమః
నామ వివరణ.
జీవులలో శాంతి రూపములో ఉండు తల్లి లలితామాత.
కం. శాంతియె మూలము జీవికి,
శాంతియె సన్మార్గమమ్మ! చక్కఁగ నిన్నున్
భ్రాంతులు వీడుచుఁ గొలువగ
*శాంతీ*! కృపఁ జూడు,, నాకు శాంతి నొసఁగుమా.
448. ఓం స్వస్తిమత్యై నమః.
నామ వివరణ.
ఉండవలసిన విధముగా ఉండు మనో లక్షణము కలది. శుభప్రదమయిన మనోలక్షణములు ఉన్న
జనని లలితా మాత.
తే.గీ. శుభములన్ గూర్చు తల్లివి, శోభనాంగి!
*స్వస్తి మతి*! నిన్ స్మరించినన్ సకల శుభము
లద్భుతంబుగఁ గలుగునో యంబుజాక్షి!
నీవు మదిలో వసించుమా, జీవమగుచు,
449. ఓం కాంత్యై నమః
నామ వివరణ.
ప్రకాశ రూపిణి అమ్మ. అసాధారణ నిత్యజాజ్వల్యమాన దివ్య రూపిణి మన అమ్మ.
తే.గీ. శాంతి వీవమ్మ!, నాలోని కాంతివీవె
సకల, కాంతియు నీవేను! సత్యమిదియె,
*కాంతి*! సద్గుణ భక్తులన్ గావుమమ్మ!
సాంతమున్ నీవె కనుచు నా చింతఁ బాపు
450. ఓం నందిన్యై నమః.
నామ వివరణ.
అనన్దమును కలిగించు తల్లి. ఆనందమే రూపముగా ఉన్న జనని.
తే.గీ. *నందినీ*! కనగ, జగదానన్ద మీవె,
యరయ నానన్దమే బ్రహ్మ మనగ నీవె
బ్రహ్మము, నినుఁ గనిన, ముక్తి వచ్చు నిజము,
దర్శనమ్మిచ్చి ముక్తికి దారిఁ జూపు.
ఓం విఘ్న నాశిన్యై నమః.
నామ వివరణ.
సమస్త విఘ్నములను నశింపఁ జేయు లోకమాత.
తే.గీ. *విఘ్న నాశినీ*! నేను నిర్విఘ్నముగను
సేవలను దేల్పనిమ్ము నిన్ సిద్దిఁ బొందఁ
గార్య కారణములు నీవె కాన, జనని!
విఘ్న నాశినివై నీవు వెలుఁగు మమ్మ!
శ్లో. తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ |
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ || 95 ||
452. ఓం తేజోవత్యై నమః.
నామ వివరణ.
తేజస్సుతో భక్తులకు ఆత్మానందము కలిగించు తల్లి. మిక్కిలి ప్రకాశవంతమయిన తల్లి.
కం. *తేజోవతీ*! జగతిలోఁ
దేజంబుండిన యనంత దీప్తీ నీదే,
రాజిల్లఁ జేయ జగతిని
తేజంబై వరలు దీవె తృప్తిగ జననీ!
453. ఓం త్రినయనాయై నమః.
నామ వివరణ.
మూడు కన్నులు కల అమ్మ. సూర్యాగ్నిచంద్రులను మూడు కన్నుల యందు
కలిగిన జ్ఞానప్రద తల్లి. త్రికాల జ్ఞాన నేత్ర మన జనని.
తే.గీ. సూర్య చంద్రాగ్ని నేత్రా! త్రిశూల పాణి!
*త్రినయనా*! జ్ఞాన నేత్రంబుఁ బ్రీతినిమ్ము,
కాంచగానౌను నిన్ను నేన్ గమల నయన!
మాయపొర లింక విడఁ జేసి శ్రేయ మిమ్ము.
తే.గీ. జ్ఞాన నేత్రా! *త్రినయనా*! భజామ్యహమ్మ
నుచు మదిన్ గొల్తు భువిని నిను శుభ నామ!
మూడు కాలములందునన్ బ్రోచు జనని!
నిన్ను దర్శింప నెంచుచునున్నవాఁడ.
454. ఓం లోలాక్షీ కామరూపిణ్యై నమః .(797. ఓం కామరూపిణ్యై నమః )
నామ వివరణ.
చంచల నేత్రములు కలిగిన మోహాకారి జగజ్జనని. ఈ లోలాక్షి పరమేశ్వరుని మోహపరవశుని చేసిన
జగన్మాత.
కం. నిరుపమ *లోలాక్షీ* *కా*
*మ రూపిణీ*! నీదు దృష్టి మాపైఁ బడినన్
ధర మా భాగ్యమె భాగ్యము.
కరుణను వర్షింపుమమ్మ! కల్మషహారీ!
455. ఓం మాలిన్యై నమః.
నామ వివరణ.
అక్షరమాలికా రూపము ఉన్న అమ్మ. సమస్త జంతుజాలముతో మాలికవలెనొప్పుచున్న రూపము
గల లోకమాత.
కం. అక్షర మాలా! మాకిల
రక్షణవగు *మాలినీ!* నిరంతర భక్తిన్
మోక్షము కోరుచుఁ గొలిచెద
నే క్షణముననైనగాని హృది నినుఁ దలతున్.
456. ఓం హంసిన్యై నమః.
నామ వివరణ.
ఆడహంసతో పోల్చతగిన తల్లి. ఆత్మ రూపమున ఉండు ఆడ హంసగఅమ్మయే.
కం. సోహమ్మను భావంబీ
వో*హంసిని*! కొలుపు మిఁక మహోన్నతముగ సు
స్నేహంబున వెలుఁగుచు నే
మోహాదుల వీడఁ జేయు పూజ్యా! వినుతుల్.
457. ఓం మాత్రే నమః.
నామ వివరణ.
దృశ్యమాన ప్రపంచమునకు తల్లి. తల్లిగా కనిపించువారిలో ఉండు తల్లి. అక్షర మాతృకాస్వరూపిణి
అమ్మ.
కం. అక్షర మాతృకవీవే,
రక్షించెడి మాతవీవె, ప్రకృతిని మాకై
నిక్షిప్తము చేసితివిట
నక్షయముగ నుండ నీవె యసదృశ! *మాతా*!
458. ఓం మలయాచల వాసిన్యై నమః.
నామ వివరణ.
మలయ పర్వతమున వసించు జనని.
కం. *మలయాచల వాసిని*! మా
తలఁపుల్ నిను నిత్యమందుత శుభములు గొనన్,
కల నిన్ గలనైనను హే
లగ నేఁ గనఁగల్గుదొ, కనులకుఁ గనఁబడుమా.
శ్లో. సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా |
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ || 96 ||
459. ఓం సుముఖ్యై నమః.
నామ వివరణ.
మంగళకరమైన ముఖము కల అమ్మ.
కం. సుజనులఁ బ్రోచెడి *సుముఖీ*!
నిజభక్తిని గొలిపి నన్ను నీ దాసునిగాఁ
బ్రజలెల్ల మెచ్చునటులుగ
భజియింపగఁ జేయుమమ్మ! భవహర గిరిజా!
460. ఓం నళిన్యై నమః.
నామ వివరణ.
పద్మము వంటిది అమ్మ. పద్మినీ జాతిస్త్రీకి ప్రతిరూపమయిన జనని
కం. *నళినీ*! నిను గొలిచెద నేఁ
దళతళ మెఱయుచును నాదు తలపుల నిలుమా.
ప్రళయంబె వచ్చు నైనను
ప్రళయాంతక! నీవె మదిని వరలుము జననీ!
461. ఓం సుభ్రువే నమః.
నామ వివరణ.
శుభప్రదమయిన కనుబొమలు కల తల్లి.భ్రుకుటియందు ఉండు ఆజ్ఞాచక్రమునశోభనప్రదముగా
ఉండు తల్లి.
కం. *సుభ్రూ*! నిను గని శివుఁడే
విభ్రమమును బొంది, నిన్ను వినుతించెనుగా,
నా భ్రమ జగతియె నిజమని
యీభ్రమఁ బోకార్పి, ముక్తి నిమ్ము భవానీ!
462. ఓం శోభనాయై నమః.
నామ వివరణ.
మంగళకర సౌందర్య శోభతో విరాజిల్లు తల్లి.
ఆ.వె. శోభనాంగి! నిన్నుఁ జూడనీ *శోభనా*!
శోభనాళిఁ గాంతుఁ జూడ నిన్ను,
మనసుతీరఁ జూచి మహనీయతను గాంచి
పద్యములను వ్రాసి పరవశింతు..
463 ఓం సురనాయికాయై నమః.
నామ వివరణ.
సకల దేవతలకు ముందుండి నడిపించు నాయకురాలు
చం. వర *సురనాయికా*! మధుర భావసమన్విత సత్ ప్రవర్తనన్,
నిరుపమ సద్గుణోత్సుకత, నిర్మల వాగ్ఝరి, నిర్భయత్వమున్,
కరుణను, సత్యసంధతయుఁ గాదనకిమ్ము శుభాస్పదంబుగా,
స్థిరవరసద్గుణప్రద సుశీలవు, నీకు నమస్కరించెదన్.
కం. ఘనమగు తేజము తోడన్
మనముననుప్పొంగ నేను మహిమాన్వితవై
వినుతులు చేసెడి వేళను
గనిపించెదవు *సురనాయికా! * దయతోడన్.
464. ఓం కాలకంఠ్యై నమః.
నామ వివరణ.
నల్లని కంఠము కలతల్లి, కాలమును తన కంఠమున గల తల్లి.
కం. కోకిల గాత్రము కన్నను
శ్రీకరమగు గాత్రశోభఁ జెలగెడు జననీ!
నాకిట రక్షణ నీవే,
కాక మరెవ రిలను? *గాల కంఠీ*! కనుమా.
465. ఓం కాంతిమత్యై నమః.
నామ వివరణ.
ప్రకాశవంతమయిన జనని. తేజోపూర్ణమయిన మతి కల తల్లి లలితాంబ.
కం. *కాంతిమతీ*! జగతిని గల
కాంతి కిరవు నీవె, జనని! కను మిల నను నా
ద్యంతము, కనులకు నీ వా
శాంతంబును గనఁబడుదువహర్నిశలందున్
466. ఓం క్షోభిణ్యై నమః.
నామ వివరణ.
పరమేశ్వరుని ప్రశాంత చిత్తమును మథించి, సృష్టికి ఉన్ముఖునిగా చేయు జనని.
తే.గీ. సృష్టి మూలమౌ *క్షోభిణీ*! దృష్టి నిలిపి
నిన్ను ధ్యానించు భాగ్యంబు మిన్నగాను
కలుగఁ జేయుము నాకింకఁ గమల నయన!
వందనములను జేసెద నందుకొనుము.
తే.గీ. క్షోభలను బాపు *క్షోభిణీ*!‘ కూర్మితోడ
జగములను సృష్టి చేయించి ప్రగణితముగ
పరమ పావనీ! పతితోడ బరగు నీవె
యాత్మలో నాదు భక్తిచే నలరుమమ్మ!
467. ఓమ్ సూక్ష్మరూపిణ్యై నమః.
నామ వివరణ.
సూక్ష్మమైన వాటిలో సూక్ష్మతరమయిన రూపము కల జనని. స్థూల శరీరమున సూక్ష్మరూపమున
వెలుఁగు తల్లి.
శా. శ్రీమద్భాసుర *సూక్ష్మరూపిణి*! శివా! చింతింతు నిన్ నా మదిన్,
ప్రేమన్ నీ మహనీయ నామ జపమున్ విఖ్యాతిగాఁ జేయని
మ్మో మందస్మిత పూర్ణచంద్రముఖి! నన్నుప్పొంగనీ కాంచి నిన్,.
శ్రీ మందార వనాంతర స్థిత లసచ్ఛ్రీచక్ర సంచారిణీ!
కం. జ్ఞానమును సూక్ష్మ గతినే
మౌనంబుగ నాకుఁ గొలిపి మాన్యునిగా నన్
మీనాక్షీ! నిలిపిన నిను
నే నేమర *సూక్ష్మరూపిణీ*! వందన ముల్
శ్లో. వజ్రేశ్వరీ వామదేవీ వయోఽవస్థావివర్జితా |
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ || 97 ||
468. ఓమ్ వజ్రేశ్వర్యై నమః.
నామ వివరణ.
శ్రీచక్ర కేంద్ర బిందువునకు దగ్గరగా ఉండే త్రిభుజావరణమునకు సంబంధించిన ముగ్గురు
దేవతలలో ఒక దేవతా రూపముగా ఉన్న తల్లి.
శా. భక్తాభీష్ట వరప్రదా భగవతీ *వజ్రేశ్వరీ*! సన్నుతుల్,
ముక్తిన్ బొందెడి కోర్కెఁ గల్గిన ఘనుల్ పూజింత్రు నీ పాదముల్
శక్తిన్ యుక్తిని కల్గఁ జేయు సతి సత్ సౌఖ్యప్రదా! నన్ను నీ
భక్తున్ జేకొనుమమ్మ నీవు కృపతో భాసించుమా నా యెదన్.
కం. నా తనువునందు నిరతము
ప్రీతిగ వసియించుచుండి విజ్ఞతనిడు స
చ్చైతన్య రూపవని నిను
బ్రీతిగ మదిలో *వజ్రేశ్వరీ*! నే గొలుతున్.
469. ఓం వామదేవ్యై నమః.
నామ వివరణ.
అందముగా ఉండు దేవత అమ్మ. శివుని శరీరమున ఎడమభాగమున ఉండు జనని లలితాంబ. వామ
దేవుని భార్య మన అమ్మ.
కం. శ్రీద! యనాహత సంస్థిత!
నీ దయతో *వామదేవి*! నిశ్చల భక్తిన్
సాధుస్వాంతము నిమ్మా.
మోదముతో శక్తికొలఁదిఁ బూజింప నినున్.
470. ఓం వయోఽవస్థా వివర్జితాయై నమః.
నామ వివరణ.
వయస్సు యొక్క ప్రభావం కాని, ఆ అవస్థా ప్రభావం కాని లేని తల్లి లలితాంబ.
కం. భవహరవని నిను వేడెద,
నవనీత కవిత్వమటు లనారతమీవీ
కవి హృదయమున నిలుము, విను
త వయోఽవస్థా వివర్జితా! శ్రీమాతా!
471. ఓం సిద్ధేశ్వర్యై నమః.
నామ వివరణ.
సిద్ధులకు అధికారిణి అమ్మ. సిద్ధులకు ప్రభ్వి. మన అమ్మ.
అశ్వధాటి.
*సిద్ధేశ్వరీ*! మదిని సిద్ధిన్ సదా కొలిపి, సిద్ధిప్రదా! నిలుపు నన్,
శ్రద్ధన్ మదిన్ గొలిపి సద్ధర్మమున్ నిలుపు సద్దీప్తి గొల్పుము కృపన్
సద్ధారగా కవిత సద్ధర్మయుక్తముగ శ్రద్ధన్ రచించునటు,శ్రీ
మద్ధీర! మజ్జనని! మద్ధర్మ రక్షణకు మద్ధాత్రి వెల్గుము సతీ!
472. ఓమ్ సిద్ధ విద్యాయై నమః.
నామ వివరణ.
సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి అమ్మ. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత మన అమ్మ.
శా. జ్ఞానానందము గొల్పునట్టి జననీ సామ్రాజ్ఞి! శ్రీ *సిద్ధవి
ద్యా*! నీ పాదయుగంబుపై మనసు నే ధ్యాసన్ సదా నిల్పుచున్,
జ్ఞానోద్భాసిత పండితాళి కడనే కల్యాణ సద్వృత్తితో
నేనున్ నిల్చుచు నిన్ స్మరించునటులన్ నీవే కృపన్ జేయుమా.
473. ఓం సిద్ధమాతాయై నమః.
నామ వివరణ.
సిద్ధులకు తల్లి మన అమ్మ.
శా. శ్రీమన్మంగళ భావనాంచితులకున్, జిన్మార్గ సంకల్పముల్
ప్రేమన్ సిద్ధిని గొల్పు తల్లివి, కదా శ్రీ *సిద్ధి మాతా*! భువిన్
మేమున్ గల్గితి మమ్మరో జగతికిన్ మేల్గూర్చు సంకల్పముల్,
నీ మాతృత్వము మాకు సిద్ధినిడ నిన్నే కొల్తుమమ్మా సదా. ౩౧ . ౮ . ౨౦౨౦
474 ఓం యశస్విన్యై నమః.
నామ వివరణ.
యశస్సు కల తల్లి అన్నిటినీ ప్రసాదించు తల్లి కావుననే ఆమె యశస్విని అయినది.
రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసే వెలుగుల తల్లి. పరమేశ్వరుని కీర్తి రూపము
జగజ్జనని.
ఉ. శ్రీమదనంత విశ్వమునఁ జిద్వరతేజ మహేశ్వరాకృతిన్
భామగ వామభాగమున భాసిలుచుండి యశమ్ము గొల్పుచున్
క్షేమము సృష్టికిన్ గొలుపు శ్రీకరమైన *యశస్వినీ*! నినున్
మేము భజింతుమమ్మ. వరమే గద నీ కృప మాకు నెప్పుడున్.
శ్లో. విశుద్ధిచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా |
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా || 98 ||
475. ఓం విశుద్ధ చక్ర నిలయాయై నమః. ౨ . ౯ . ౨౦౨౦
నామ వివరణ.
కంఠస్థానమునకు దిగువ గల షోడశ దళ పద్మమే విశుద్ధ చక్రము. అచ్చట ఉండెడి తల్లి మన అమ్మ.
చం. అసమ *విశుద్ధ చక్ర నిలయా*! ప్రణతుల్, మదినందుకొమ్మ, స
ద్రసమయ సత్ కవిత్వమును దన్మయతన్ పఠియింపనిమ్మ, నీ
దెస మది నిల్పి, భక్తిని సుధీవరపాళి ప్రశంస సేయగా
నసదృశ రీతి నీ మహిమ నందముగా వచియింపఁ జేయుమా.
476. ఓం ఆరక్త వర్ణాయై నమః.
నామ వివరణ.
పాటలవర్ణమున ప్రకాశించు తల్లి మన అమ్మ.
మ. కనుచుందున్ నిను వీడ నేర్వని మదిన్ గాకున్న వేరెచ్చటో
మననేలో? సతి! నీ పదంబులనుబ్రేమన్ గొల్తు చిత్తంబునన్,
మనుమా నా మది లోన నీవు సతమున్ మాతా! ప్రభాపూర్ణ! నా
యనుమానంబును బాప కంటఁ బడుమో *యారక్తవర్ణా*! సతీ!
477. ఓం త్రిలోచనాయై నమః. .
నామ వివరణ.
మూడు కనులు గల తల్లి.
ఉత్సాహ.
అమ్మరో! *త్రిలోచనా*! వరాగ్ని సూర్య చంద్రులే
నమ్మ! నీ త్రినేత్రపాళియై రహించుచుండెనే,
యిమ్మ నాకు జ్ఞాననేత్ర మిత్తరిన్ నినుం గనన్
గమ్మగా రచింతు నిన్ను గాంచి మంచి పద్యముల్.
478. ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః.
నామ వివరణ.
ఖట్వాంగము మొదలగు ఆయుధములు కల తల్లి లలితాంబ.
కం. మహితా! *ఖట్వాంగాది
ప్రహరణ*! నా లోని యహము వరగుణ! నీవే,
యహరహమును నీ తలపుల
విహరించెడి మదికి నీవె వేల్పువు తల్లీ!
479. ఓం వదనైక సమన్వితాయై నమః.
నామ వివరణ.
ఒక్క శిరస్సుతో కూడుకొన్నది అమ్మ.
కం. పదునాల్గు భువనముల నో
*వదనైకసమన్వితా*! ప్రవర్ధనఁ జేయన్
గుదిరిన నీకున్ గుదరదొ?
పదిలంబుగ నన్నుఁ గావ? భావోద్భాసా!
శ్లో. పాయసాన్నప్రియా త్వక్స్థా పశులోకభయంకరీ |
అమృతాదిమహాశక్తిసంవృతా ఢాకినీశ్వరీ || 99 ||
480. ఓం పాయసాన్న ప్రియాయై నమః.
నామ వివరణ.
పాయసాన్నమనిన యిష్టము ఉన్న తల్లి లలితాంబ.
తే.గీ. *పాయసాన్నప్రియా*! జ్ఞాన పాయసమిడి
యుక్త మార్గంబునన్ నిల్చు శక్తినిమ్ము,
నీదు భక్తుఁడ, సుతుఁడ, నన్నాదుకొనుము.
లేదు మార్గంబు నీకన్న వాదమేల!
481. ఓం త్వక్ స్థాయై నమః.
నామ వివరణ.
చర్మమునందు ఉండు జనని లలితాంబ.
కం. నను నిలిపెడి దేవీ! పా
వని! నాలో నుంటివమ్మ ప్రణవాకృతివై,
దినమొక యుగముగ *త్వక్ స్థా*!
కనుటకు నినుఁ గడుపుచుంటిఁ గనఁబడుమమ్మా!
482. ఓం పశులోక భయంకర్యై నమః.
నామ వివరణ.
పశుప్రవృత్తులకు భయము కలిగించు తల్లి
కం. *పశులోక భయంకరి*! నిన్
విశదంబుగఁ జెప్ప నగునె? పెరిగెడి యీ నా
పశుతత్వము నెడఁ బాపుమ,
శశిశేఖరు పత్ని! నీకుఁ జల్పుదును నుతుల్.
483. ఓం అమృతాదిమహాశక్తి సంవృతాయై నమః.
నామ వివరణ.
అమృత మున్నగు మహాశక్తులచే చుట్టబడి యుండునది. జగజ్జనని.
కం. నీదరి మది నిలిపిన యమృ
తాదిమహాశక్తులబ్బునమ్మా! నీవున్
నాదరి నిలు, విడువక! *యమృ
తాదిమహాశక్తి సంవృతా*! నినుఁ గొలుతున్..
484. ఓం డాకినీశ్వర్యై నమః.
నామ వివరణ.
వజ్రేశ్వరీ మంత్రానికి బీజము., శక్తి, కీలకము, అన్నీ కూడా దకార సంకేతంగా ఉండును కావున
డాకినీ అని అనం_బడెడి తల్లి మన లలితాంబ.
తే.గీ. *డాకినీశ్వరీ*! పాపుమాటంకములను
నిన్నుఁ గొలిచెడి సమయాన నియతితోడ,
నీదు పదపంకజములను నేను సతము
చిత్తమందున నిలుపుచు సేవఁ జేయ.
శ్లో. అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాదిధరా రుధిరసంస్థితా || 100 ||
485. ఓం అనాహతాబ్జనిలయాయై నమః.
నామ వివరణ.
అనాహత చక్రమునే నిలయముగా కల అమ్మ.
చం. అనుపమ! దేహమందున ననాహత చక్రమహాబ్జ వాసివై
మనుజులమైన మాకిలను మంచిని గూర్చెదవో *యనాహతా!
బ్జ నిలయ*! నీకు మ్రొక్కెదము భక్తిని గొల్చెడి నీదు భక్తులన్
ఘనముగ నిల్పుమమ్మ భువి కాదనఁబోకుమ మమ్ము గావుమా.
486. ఓం శ్యామాభాయై నమః.
నామ వివరణ.
నల్లగా ప్రకాశించు తల్లి.
శా. శ్రీమద్గౌరి! యనాహతాబ్జనిలయా! శ్రీభాగ్యదా! సంస్తుతుల్,
*శ్యామాభా*! మదినాక్రమించు ఘనమౌ నజ్ఞానమన్ జీకటిన్
క్షేమంబున్ గలిగింపఁ బాపుచుఁ గృపన్, జిచ్ఛక్తినే కొల్పు ని
న్నేమాత్రంబును గొల్వ నేర, మది నిన్నే నిల్ప యత్నించెదన్.
487. ఓం వదనద్వయాయై నమః
నామ వివరణ.
రెండు ముఖములు కలిగి యున్న తల్లి.
ఉ. నా మది వెల్గు నా శివుని నాకు కనంబడఁ జేయ నెంచి నీ
వే ముఖపద్మమై వెలుఁగు వెల్లువ గొల్పుచు నాత్మనుంటివే,
ప్రేమగ బాహ్యమున్ నడుప వెల్గెడి బాహ్యముఖంబునుంటివే,
నా మదినున్న దీవె *వదనద్వయ*! నీకు నమస్కరించెదన్.
488. ఓం దంష్ట్రోజ్వలాయై నమః.
నామ వివరణ.
దంత కాంతితో ప్రకాశించు తల్లి.
శా. ఆరాధించెదమో యనాహత సుచక్రాధిష్ట! *దంష్ట్రోజ్వలా*!
నీ రూపంబు ముఖద్వయాంచితము కాన్, నీ దంష్ట్రలెన్నన్ బ్రభా
పూరంబుల్, దురహంకృతాత్ముల మదంబున్ బాపనొప్పున్ గదా.
లేరెవ్వారలు మమ్ము గావగ భువిన్, క్లేశాపహా! కావుమా.
489. ఓం అక్షమాలాదిధరాయై నమః
నామ వివరణ.
అక్షరాక్షమాల మున్నగువాటిని ధరించిన అమ్మ.
ఉ. మేదిని నక్షరప్రభ లమేయ శుభాస్పదమై వెలింగెడున్
నీ దరహాస చంద్రికలు నిత్య శుభంబులు గొల్పు నక్షమా
లాదిగఁ గల్గు హస్తము ల నాదిగ శోభిలఁ జేయ *నక్షమా
లాది ధరా*! కృపామృతము లానగనిమ్మిల మాకు నెమ్మితోన్.
490. ఓం రుధిర సంస్థితాయై నమః.
నామ వివరణ.
రక్తమునందు ఉండు జనని లలితాంబ.
చం. నిరుపమ సత్ కృపా నిలయ! నిత్య శుభంకరివైన శంభు రా
ణి! *రుధిర సంస్థితా*! జయము. నీవిల వర్ధిలఁ జేయ మమ్ము సు
స్థిరముగ రక్త ధాతువునఁ దేజముతో వెలుఁగొందుచుండి, నీ,
స్మరణము చేయువారికిఁ బ్రశాంతిని, జీవనభాగ్యమిత్తువే.
శ్లో. కాలరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్రవరదా రాకిన్యంబాస్వరూపిణీ || 101 ||
491. ఓం కాలరాత్ర్యాది శక్త్యౌఘవృతాయై నమః.
నామ వివరణ.
కాళరాత్రి మున్నగు శక్తులు చుట్టూ పరివేష్టించి ఉండగా మధ్యనుండువామదేవి మన అమ్మ.
అనాహత పద్మమున పన్నెండు దళములచే పరివేష్టింపఁబడి మధ్యలో ఉన్న వామదేవి మన అమ్మ.
సీ. శ్రీయనాహతమున శ్రీ *కాలరాత్ర్యాది - శక్త్యౌఘవృత*! నీవె శక్తి మాకు.
కామాది రాక్షసుల్ గబళింప మానుండి జ్ఞాన సన్మణి నిటఁ గాచిరమ్మ.
నీ నామ జప శక్తి, నీకున్న ఘన యుక్తి, నీపైనఁ గల భక్తి నిలువరించు,
మా నోట పలికుంచు నీ నామమంత్రమ్ము, కామాదులన్ బాపి కావు మమ్ము,
తే.గీ. కాళరాత్ర్యాది శక్త్యౌఘ ఘన పరివృత
వైన నీవుండుటన్ లోన జ్ఞాన మణిని
యపహరించగనెట్టులౌ నపజయంబె
కనఁగఁ గామాదులకు దక్కుఁ గాదె జనని!
492. ఓం స్నిగ్ధౌదన ప్రియాయై నమః.
నామ వివరణ.
నేతితో తడుపబడిన అన్నమునందు ఇష్టము కలది మన అమ్మ.
తే.గీ. లలిత! *స్నిగ్ధౌదనప్రియా*! నిలుమ మదిని.
జ్ఞాన ఘృత మహత్ స్నిగ్ధాన్నమౌను మనము
భక్తి నిడుచుంటి నమ్మరో రక్తిఁ గొనుమ.
నీకు సంసేవలం జేయనీ, భవాని!
493. ఓం మహావీరేంద్రవరదాయై నమః
నామ వివరణ.
మహావీరేంద్రులుగా ప్రసిద్ధమయిన వారికి వరములనిచ్చు అమ్మ మన
లలితాంబ.
కం. మదిని *మహావీరేంద్ర వ
రద*! నీభక్తులఁ గనుచు వరములనొసగుదే,
ముదమున వీరేంద్రులనుచు
మదిఁగనుభక్తుఁడనగునను, మాతా! కృపతోన్.,
494. ఓం రాకిన్యంబాస్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
అనాహతచక్రమున ఉండెడి వానదేవి యొక్క మంత్రములో శక్తిబీజము., కీలకము, అన్నిరకముల
సంకేతములయి రాకిన్యంబా స్వరూపిణిగా విరాజిల్లు తల్లి మన అమ్మ.
కం. వరలెద వనాహతమునన్
గరుణను వీరేంద్ర వంద్య! కావగ మమ్మున్,
నిరుపమ *రాకిన్యంబా
స్వరూపిణీ*! కొలుతుము నిను భక్తిగ సతమున్.
శ్లో. మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా |
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా || 102 ||
495. ఓం మణిపూరాబ్జనిలయాయై నమః.
నామ వివరణ.
నాభిస్థానముననుండెడి మణిపూరక చక్రమునే స్థానముగా కలిగిన తల్లి మన అమ్మ.
కం. మణిపూరాబ్జ నివాసిని!
గణుతిగ సద్గుణము లొసగి కాచెడి జననీ!
ప్రణవస్వరూపిణి! కనుమ.
*మణిపూరాబ్జనిలయా*! నమస్తే జననీ!
496. ఓం వదనత్రయ సంయుతాయై నమః.
నామ వివరణ.
మూడు ముఖములు గల తల్లి.
ఉ. సవ్యముగా జగత్సృజన సత్ స్థితి సల్లయమున్ సతం బహో
భవ్యముగా నొనర్చెదవు భాసుర సద్వదనత్రయాఢ్యవై,
దివ్యము చక్రషట్కమున దీపితవై వసియించుటీ వికన్
నవ్య సుచేతనమ్ము! *వదనత్రయ సంయుత*! కొల్పుమాత్మలోన్..
497. ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః.
నామ వివరణ.
వజ్రాయుధము మున్నగు ఆయుధములతో కూడుకొని యున్న తల్లి.
కం. నిను సేవింపగనిమ్మా.
ఘన హస్త చతుష్టయమునఁ గలిగితివిగ ప్రే
మను వజ్రాదు లరయ నీ
యునికిని, *వజ్రాదికాయుధోపేత*! నతుల్.
498. ఓం డామర్యాదిభిరావృతాయై నమః.
నామ వివరణ.
వయోవస్తావివర్జిత అయిన అమ్మ డామరి మున్నగు పదిశక్తులచే పరివేష్టింపబడి ఉండు తల్లి.
శా. మా మాతా! మణిపూర పద్మమున డామర్యాది శక్తుల్ నినున్
బ్రేమన్ గొల్చుచునుండగా శుభగతిన్ వీక్షించి మమ్మేలుదే,
క్షేమంబబ్బును నిన్నుగాంచుచు మదిన్ సేవించినన్ నిత్యమున్,
*డామర్యాదిభిరావృతా*! జనని! వీడన్ నీ పదాబ్జంబులన్.
శ్లో. రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా |
సమస్తభక్తసుఖదా లాకిన్యంబాస్వరూపిణీ || 103 ||
499. ఓం రక్తవర్ణాయై నమః.
నామ వివరణ.
రక్తము వలె ఎఱ్ఱని రంగు గల తల్లి.
శా. దేవీ! శ్రీమణిపూర చక్ర నిలయా! దేదీప్యమానోజ్వలా!
శ్రీవిద్యా పరులన్ గృపం గనుదువే శ్రీ *రక్తవర్ణా*! మదిన్
నీవీరీతిగ నిత్యమున్ వెలుఁగుమా. నీ రూప తేజంబులన్
నీవే నా మది నిల్పుమా కరుణతో, నిత్యంబు నేఁ గాంచగన్.
500. ఓం మాంస నిష్ఠాయై నమః.
నామ వివరణ.
ఈ దేవతకు మాంసమనే ధాతువునందు ప్రీతి ఎక్కువ. కావున మన అమ్మ మాంసనిష్ఠ.
శా. క్షేమంబున్ సతతంబు జీవతతికిన్ జేకూర్చ జీవాళిలో
నీమంబొప్పగ మాంసధాతుగతవై నీవుండుటన్ జేసి, నీ
వే మా భౌతిక భవ్య తేజమగుచున్ వెల్గొందగా నుంటివే
శ్రీమన్మంగళ దేవతా! భగవతీ! శ్రీ! *మాంసనిష్ఠా*! నతుల్.
ఓం గుడాన్నప్రీత మానసాయై నమః
నామ వివరణ.
బెల్లము కలిపిన అన్నమునందు ఇష్టముతో కూడిన మనసు కలది అమ్మ.
కం. అగణిత మణిపూర నిలయ!
జగతిని నడిపించు నట్టి జననివి తల్లీ!
నిగమాంత వేద్య! గుణభా
స! *గుడాన్న ప్రీత మానస*! దయను గనుమా!
502. ఓం సమస్త భక్తసుఖదాయై నమః.
నామ వివరణ.
సమస్తమయిన భక్తులకు సుఖము నొసఁగు తల్లి. భక్తి కలిగి సేవించు వారికి అమ్మ
సుఖము ననుగ్రహించును. అంతటి దయామయ అమ్మ.
చం. తలతు *సమస్త భక్త సుఖ దా*! నిను భక్తిగ, సౌఖ్యకాంక్షచేఁ
దలఁచగ సౌఖ్యమేది? వర ధర్మ నిబద్ధత జ్ఞాన భాగ్యమున్
గొలుచుచు నిన్నుఁ బొందుదును, కోరుదు రిద్దియె నిన్ను భక్తులున్,
మెలకువ గొల్పునట్టి గుణమేకద సౌఖ్యము? నీవె కొల్పుమా.
కం. ప్రముదముతోడ భజించెద
క్షమనేకాగ్రతనొసంగి కావుము నన్నున్,
నిమిషంబైనను జాలును,
*సమస్త భక్తసుఖదా*! ప్రశాంతినొసఁగుమా.
503. ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః.
నామౌచిత్యము.
మణిపూరాధిష్ఠా దేవత యొక్క బీజము, శక్తి, కీలకము, అన్నియు లకారసంకేతముగా ఉన్న మన
లాకిన్యంబ,
కం. నిరుపమ మణిపూరాశ్రయ!
కరుణను గాపాడు నట్టి కల్పకమీవే.
ధరణిని *లాకిన్యంబా
స్వరూపిణీ*! ప్రణతులమ్మ, భక్తినొసఁగుమా.
శ్లో. స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా |
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాఽతిగర్వితా || 104 ||
504. ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః.
నామ వివరణ.
స్వాధిష్ఠానచక్రమునగల దశదళపద్మాధిష్ఠాన దేవత సిద్ధేశ్వరి ఈ లోకమాత.
కం. *స్వాధిష్ఠానాంబుజగత*!
బాధలనెడఁ బాపి మమ్ము పాలించుటకై
స్వాధిష్ఠానాధిష్టవు
మేధా సంపత్తిని మ్మమేయ శుభకరీ!
505. ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః.
నామ వివరణ.
నాలుగు ముఖములు కలిగి మనోహరముగానుండు దేవత మన అమ్మ.
కం. పరవు, *చతుర్వక్త్ర మనో
హర*! సద్గుణ నిధుల కిల స్పృహను గొలిపెడి ని
న్నరయగ స్వాధిష్ఠానా
క్షరవు జనని., నిను నుతింతుఁ గావుము జగతిన్.
506. ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః.
నామ వివరణ.
నాలుగు చేతులయందూ శూలము మున్నగు ఆయుధ సంపద కల తల్లి
లలితాంబ.
కం. మాయకులఁ ద్రుంచ శూలా
ద్యాయుధములఁ దాల్చినట్టి తల్లివి, మాలో
మాయను బాపుము *శూలా
ద్యాయుధ సంపన్న*! నిన్ను ధ్యానింతు మదిన్.
507. ఓం పీతవర్ణాయై నమః.
నామ వివరణ.
పసుపుపచ్చని శరీర వర్ణము కలిగిన తల్లి మన అమ్మ.
శా. దీనాళిన్ గను *పీత వర్ణ*! కను, స్వాధిష్ఠాన చక్రప్రభా!
నీ నామ స్మరణంబు పుణ్య ఫలమే, నిత్యత్వమున్ గొల్పు, నా
లోనన్ నీవు సముజ్జ్వలించు, కరుణాలోకా! ప్రభన్ గొల్ప,, నన్
దీనున్ గావుమ, జ్ఞాన తేజమిడుచున్, తేజోమయీ! కూర్మితోన్.,
508. ఓం అతిగర్వితాయై నమః.
నామ వివరణ.
అసాధారణమయిన సౌందర్యము, సంపదలతో మిక్కిలి గర్వించు జనని లలితామాత.
కం. స్వాధిష్ఠానాధిష్టా!
మేధా! నా గర్వ మణచి మేల్గూర్చెడి నీ
బోధను *నతిగర్విత*! నే
సాధించెద నీదు కృపను సత్కవనముతోన్.
శ్లో. మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా |
దధ్యన్నాసక్తహృదయా కాకినీరూపధారిణీ || 105 ||
509. ఓం మేదోనిష్ఠాయై నమః.
నామ వివరణ.
మెదడులో ఉండు మేదస్సున నిష్ఠతో ఉండెడి తల్లి మన అమ్మ.
శా. మేదో ధాతువునాశ్రయించి కృపతో మేలున్సదా కూర్చు మా
*మేదోనిష్ఠ*! నమస్కరింతుఁ గొనుమా! మేలైన భావంబులున్,
వేదోద్భాసుని దివ్య సంస్మరణమున్ విజ్ఞాన తేజంబు స
మ్మోదం బొప్పగఁ గూర్చుమమ్మ కృపతోఁ, బూజింతు నిన్ భక్తితోన్
510. ఓం మధుప్రీతాయై నమః.
నామ వివరణ.
తేనెయనిన యిష్టము కలిగినసిద్ధేశ్వరె మన అమ్మ.
శా. శ్రీమన్మంగళ భావనాంచిత *మధుప్రీతా*! శుభానీకముల్
ప్రేమన్ గొల్పుచు పుట్టుకన్ మధుమయంబే చేయ మాకుంటివే,
నీమంబొప్పగ నీదు నామ మధువున్నే గ్రోలునట్లీవు నన్
శ్రీమాతా! కృపఁ జూడుమమ్మ. నిను నే సేవింతు నెల్లప్పుడున్.
511. ఓం బందిన్యాదిసమన్వితాయై నమః.
నామ వివరణ.
పద్మస్థయై యున్న ఈ జనని బందిని మున్నగు వారితో కూడుకొని యున్న తల్లి.
శా. దిందిం నాదము నీదు నామముగ స్వాధిష్ఠాన సంవాసినీ!
విందున్ నీవు రహించుచుండుట నటన్, విజ్ఞాన తేజఃఖనీ!
*బందిన్యాది సమన్వితా*! శుభ గతిన్ వర్ధిల్లగాఁ జేసి మా
యందున్నీవె సతంబు నిల్వుమ, మనో హర్మ్యంబునన్ వెల్గుచున్.
512. ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః.
నామ వివరణ.
పెరుగన్నమనిన మనసున యిష్టము ఉన్న జనని.
కం. మిథ్యా జగతిని బ్రతుకులు
మధ్యన్ బడి నలుఁగుట గనుమా, జనయిత్రీ!
మధ్యే మార్గము నీవే,
*దధ్యన్నాసక్తహృదయ*! దయఁ గనుమమ్మా!
513. ఓం కాకినీ రూపధారిణ్యై నమః!
నామ వివరణ.
స్వాధిష్ఠాన చక్రమునకు అధిదేవత.అయిన సిద్ధేశ్వరీదేవి యొక్క బీజము, శక్తి, కీలకము, అన్నీ కకార
సంకేతములుగానే యున్న కాకినీ రూపధారిణి మన అమ్మ.
తే.గీ. దివ్యమయిన స్వాధిష్ఠాన దేవతవుగ,
*కాకినీ రూప ధారిణీ*! కరుణఁ గనుమ.
శుద్ధ విజ్ఞాన పూర్ణ సత్ శోభఁ గొలిపి
నిన్ను సేవింపనిమ్ము, రాణింపనిమ్ము.
శ్లో. మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాఽస్థిసంస్థితా |
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా || 106 ||
514. ఓం మూలాధారాంబుజారూఢాయై నమః
నామ వివరణ.
మూలాధారచక్రమునగల పద్మము నధిరోహించి యుండు మాత లలితాంబిక.
శాలిని.
సన్ *మూలాధారాంబుజారూఢ*! మాతా!
సన్మాన్యుల్ నిన్నే ప్రశంసింతురమ్మా!
యున్మాదంబున్ బాపుమో శంభు రాణీ!
సన్మాన్యా! నిన్ నేను జ్ఞానాక్షిఁ గాంతున్.
515. ఓం పంచవక్త్రాయై నమః.
నామ వివరణ.
మూలాధారచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధవిద్యాదేవికి సద్యోజాతము, వామదేవము, అఘోరము,
తత్పురుష, ఈశానము అను ఐదు ముఖములుండుతల్లి, ఆమెయే మన అమ్మ.
శా. మూలాధార నిధానమై వెలుఁగు సత్పూజ్యా! సతీ *పంచవ
క్త్రా*! లక్ష్యంబుగ నీవె నిల్చి మదిలో రాణింపగాఁ జేయుమా.
శ్రీలక్ష్యార్థము నీ కృపామృతమదే ప్రీతిన్ బ్రసాదించి, నీ
మ్రోలన్ సాగిలి మ్రొక్కనీ కరుణతో, ముక్తిప్రదా! నిత్యమున్.
516. ఓం అస్థి సంస్థితాయై నమః
నామ వివరణ.
అస్థి ధాతువునందుండు తల్లి మన సిద్ధవిద్యాదేవి.
తే.గీ. దేహమున నస్థిగా వెల్గుదేవి! నీవె
శక్తి వమ్మరొ నడయాడ, ముక్తి గాంచ,
*నస్థి సంస్థితా*! నీదు మహత్వముననె
లోకమున నిల్చి యుంటిని లోకమాత!
కం. గణ్యంబుగ నీ పదములు
పుణ్యాత్ములె గాంచి వారు పూజింతురుగా,
గణ్యంబుగ నిన్ గొలిచెది
ధన్యుఁడ నే *నస్థి సంస్థితా*! నీ కృపచే.
517. ఓం అంకుశాది ప్రహరణాయై నమః.
నామ వివరణ.
సిద్ధవిద్యాదేవి తన నాలుగు చేతులయందు అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర
కలిగియున్న తల్లి మన అమ్మ.
తే.గీ. *అంకుశాది ప్రహరణ*! మోహాది రిపుల
నంతమొందించి మము గావుమమ్మ నీవు
కర్మ బంధంబులవి రిపుల్ కలతఁ గొలిపి
రోతఁ గొల్పెడు, కని నీవె ప్రోవుమమ్మ.
518. ఓం వరదాదినిషేవితాయై నమః.
నామ వివరణ.
మూలాధార చక్రమునందుండు సిద్ధవిద్యాదేవి వరదా, శ్రీ, , షండా, సరస్వతీ అను వారిచే
పరివేష్టింపఁబడి యుండును. అట్టి విధముగా ప్రకాశించునది మన అమ్మ.
కం. కరుణను నా సేవలు గొని
పరమార్థము తెలిపి నన్ను వరలం గనుమా.
పరిపరి నిను స్మరియించెద,
*వరదాదినిషేవితా*! భవానీ మాతా!
శ్లో. ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ |
ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా || 107 ||
519. ఓం ముద్గౌదనాసక్త చిత్తాయై నమః
నామ వివరణ.
పెసరపప్పు కలిపి వండిన అన్నమనిన ప్రీతికలిగినది మన జనని.
శా. పులగంబున్ గొనుమమ్మ తృప్తిగను శ్రీ *ముద్గౌదనాసక్త చి
త్త*! లలిన్ నా మది భక్తి నింపుమిక, మోదంబున్ గనన్ జేయుమా,
పుడమిన్ లక్ష్యము గమ్యమున్ ముదమునన్ బోధించితీవే కదా,
నిలుపన్ నిన్ మననమ్మునన్ మనమునన్ నెమ్మిన్ మనన్ మానినీ!
520. ఓం సాకిన్యంబా స్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
మూలాధారాధిష్ఠాన దేవతయగు సిద్ధవిద్యాదేవికి సకార సంకేతమగు బీజము, శక్తి, కీలకము,
అన్నియు అయియుండుటచే సాకిన్యంబాస్వరూపిణి మన జనని.
కం. నిరుపమ! *సాకిన్యంబా
స్వరూపిణీ*! వందనములు, వర మార్గములోఁ
గరుణించుచు నడుపుము నను,
పరమోదారా! యిహంబు, పరమును గొలుపన్.
521. ఓం ఆజ్ఞాచక్రాబ్జ నిలయాయై నమః.
నామ వివరణ.
ఆజ్ఞాచక్రమునకు సంబంధించిన పద్మమును నివాసముగా కలిగియున్న తల్లి మన జగదంబ.
భ్రూమధ్య భాగమున ద్విదళపద్మస్థానము.ఇది కూటత్రయ, ఖండత్రయ, మండలత్రయ
సమాప్తిస్థానము.ఈ ప్రదేశమునుండియే ఆజ్ఞలు జారీచేయబడుచుండగా మనము ఆ
ఆజ్ఞానుసారముగా ప్రవర్తించుట జరుగుచున్నది. ఇదంతయూ ఈ ఆజ్ఞాచక్రాబ్జనిలయ అయిన
అమ్మయే చేయుచున్నది. ఆ విధముగా మనకు నిత్యప్రేరకురాలీ తల్లి.
కం. అజ్ఞానాంధము వాపఁగ,
సుజ్ఞాన జ్యోతివగుచు శోభిలుదీవే!
*యాజ్ఞాచక్రాబ్జనిలయ*!
విజ్ఞతతో నినుఁ గనెడి వివేకమునిమ్మా.
522. ఓం శుక్లవర్ణాయై నమః.
నామ వివరణ.
సిద్ధమాత అను ఈ తల్లిస్వచ్ఛమయిన తెల్లని దేహచ్ఛాయ కలిగినది. శ్వేత వర్ణము ధర్మమునకు,
స్వచ్ఛతకు నిర్మలత్వమునకు ప్రతీక. ఈ లక్షణములు ఉన్నవన్నచో అది తల్లియొక్క స్వరూపమే.
అట్టి శ్వేతస్వరూపములో నిత్యమూ మనకు దర్శనము నిచ్చు జగదంబ మన తల్లి.
కం. ఆజ్ఞాచక్రాధిష్ఠా!
సుజ్ఞానద! *శుక్లవర్ణ*! శుభ చేతన సత్
ప్రజ్ఞాపాటవములలో
సుజ్ఞేయము నీ మహిమయె, సుందర వదనా!
523. ఓం షడాననాయై నమః.
నామ వివరణ.
సిద్ధమాతకు ఆరు ముఖములు బహుముఖ ప్రజ్ఞాన్విత అయిన అమ్మ షడానన.
మ. నిరతంబున్ నిను నో *షడానన*! మదిన్ నేఁ గొల్తు భక్తిన్ సతీ!
కరుణన్ గావుము నా మదిన్ సతత మాజ్ఞా చక్ర సంవాసినీ!
పరమార్థంబగు నిత్య మార్గమును నన్ భాసింపగా జేసి, నీ
స్మరణంబున్ విడకుండఁ గావుమ కృపన్ సన్మార్గ సంశోభితా!
శ్లో. మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తిసమన్వితా |
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ || 108 ||
524. ఓం మజ్జా సంస్థాయై నమః.
నామ వివరణ.
ఈ తల్లి ప్రాణుల శరీరములో మజ్జ యందుండును.ఓం మజ్జా సంస్థితాయైనమః అని అమ్మను
పూజించినచో మజ్జ లోపించియున్నవారికి మజ్జ కలుగును.
శా. జీవమ్మీవెగ, నీదు దేహమిది భాసింపంగ సంతోషివై
నీవిచ్చోట, ప్రశస్త దేవళమిదే నీకున్, ననున్ నిల్పగా
నీవే మజ్జ, వసించి శక్తినిడుదే నీ సేవకై నీకు నా
జ్ఞా వశ్యాత్ముఁడనమ్మ నేను, వర *మజ్జా సంస్థ*! నిన్ మ్రొక్కెదన్.
525. ఓం హంసవతీ ముఖ్య శక్తి సమన్వితాయై నమః.
నామ వివరణ.
ఆజ్ఞాచక్ర కర్ణికలో ఉండు సిద్ధమాత రెండుదళాలలోఉండుహంసవతీ క్షమావతీ అను రెండు
శక్తులతో కూడుకొని యుండు జనని.
సీ. ఆజ్ఞా సుచక్రస్థ! *హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా*! శరణు శరణు,
ఉచ్ఛ్వాస నిశ్వాసమొప్పుగా జరిపించు తల్లివమ్మా నీవు తలఁచి చూడ,
నీ పాదయుగళంబు నే నెరనమ్మిన చక్కగాఁ గాచెడి సన్నుతాత్మ!
యిహపరంబుల సౌఖ్యమింపుగాఁ గొలిపెడి కన్న తల్లివి నీవు కమల నయన!
తే.గీ. తల్లి గర్భాననుండగా దయను గాచు
పుట్టినప్పటి నుండియు గిట్టు వఱకు
నీదు సంరక్షణయ నన్ను నిలుపునమ్మ,
పాదముల్ పట్టి సేవింతు పలుకుమమ్మ!
526. ఓం హరిద్రాన్నైక రసికాయై నమః.
నామ వివరణ.
హరిద్రాన్నమునందు ప్రీతి కలది మన అమ్మ.
కం. క్రన్ననఁ గొనుమిఁకను హరి
ద్రాన్నము నర్పింతు నీకు ననుపమరీతిన్,
మన్నింపుమమ్మరొ! *హరి
ద్రాన్నైక రసిక*! మము గనుమా, నీవింకన్.
527. ఓం హాకినీ రూప ధారిణ్యై నమః
నామ వివరణ.
హకార సంకేతముగా గల శక్తి, బీజము కీలకము, ఆజ్ఞా చక్రాధిష్ఠానదేవతయగు సిద్ధమాతయొక్క
మంత్రమున ఉన్నందున ఈ మె హాకినీరూపధారిణి. మన అమ్మ.
మ. గుణ సమ్మాన్యులకిత్తు వీవెగ వెలుంగున్ *హాకినీ రూప ధా
రిణి*! సంస్తుత్య! జయంబు నీకు సతమున్, బ్రీతిన్ శుభాళిన్, లస
ద్గుణమున్, సత్య పథ ప్రవర్తనను, నిన్ గొల్వంగ సచ్చిత్తమున్,
గణుతిన్ గొల్పగ నిమ్ము మాకు జననీ! కారుణ్య పూర్ణా! నతుల్.
శ్లో. సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా |
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ || 109 ||
528. ఓం సహస్ర దళ పద్మస్థాయై నమః.
నామ వివరణ.
సహస్రారమున ఉండు సహస్ర దళపద్మమున స్థిరముగా ఉండు జనని మన అమ్మ.
కం. వినుత సహస్రార కమల
ముననుండు యశస్వినీ! మము గృపం గనుమా,
వినుతించెదఁ, గని మా యా
తనలను బాపుమ, *సహస్ర దళ పద్మస్థా*!
529. ఓం సర్వ వర్ణోపశోభితాయై నమః.
నామ వివరణ.
సహస్రారమున గల అమ్మ సమస్తమైన రంగులతోను, అకారాది క్షకార వర్ణములతోను మిక్కిలి
ప్రకాశించు తల్లి.
తే.గీ. వర్ణముల్ లేవు నిన్నెన్ని పలుకరాని
వరయ నన్నింట నీవుంటకిరవగుటను,
వర్ణనము చేయఁ జేయు మపర్ణ నిన్ను,
*సర్వవర్ణోపశోభితా*! శరణు శరణు.
530. ఓం సర్వాయుధ ధరాయై నమః.
నామ వివరణ.
సహస్రారమున సమస్తమయిన ఆయుధములను కలిగి ఉండు తల్లి మన లలితామాత.
కం. *సర్వాయుధ ధర*! ప్రణతులు,
సర్వేశ్వరు రాణి! నీవె సకల జగతిలో
దుర్వర్తనలను ద్రుంచుము,
నిర్వాణము గొలుపు మాకు నిరుపమ తేజా!
531. ఓం శుక్ల సంస్థితాయై నమః.
నామ వివరణ.
ప్రాణులలో సర్వ ధాతు సారమయిన శుక్లము నందు ఉండెడి జనని మన అమ్మ.
తే.గీ. శుక్లమందున నుండెడి శోభనాంగి!
*శుక్ల సంస్థితా*! సర్వమున్ శుక్లముననె
నీవు కల్గుటన్ గలిగెను నీరజాక్షి!
సృష్టి కొనసాగు దీనిచేఁ జిత్ప్రభాస!
తే.గీ. శుక్లమందున నుండెడి శోభనాంగి!
*శుక్ల సంస్థితా*! నీదు వచోవిలాస
మమరఁ జేయుమ కవులకు సమధికముగ
నిన్ను వర్ణించ జగతి గణింప నెంచి.
532. ఓం సర్వతోముఖ్యై నమః.
నామ వివరణ.
విశ్వవ్యాప్తముగా అన్నిదిక్కులనూ ముఖములు కలది ఈ జగజ్జనని.
చం. కనుఁగొన సర్వతో ముఖివి! కన్నుల పండువుగా వెలుంగు నిన్
గనులు కనంగ లే వరయ, జ్ఞాన సునేత్రులు చూతురంతటన్,
గనెదను *సర్వతోముఖి*! ప్రకాశముగాఁ గల నిన్ను నంతటన్,
వినయముతోడ మ్రొక్కెదను బ్రీతిని, జ్ఞానము నిమ్ము నాకికన్.
శ్లో. సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ |
స్వాహా స్వధాఽమతి-ర్మేధా శ్రుతిః స్మృతి-రనుత్తమా || 110 ||
533. ఓం సర్వౌదన ప్రీత చిత్తాయై నమః.
నామ వివరణ.
అన్ని రకముల ఆహారములయందు ప్రీతి కలిగిన తల్లి లలితామాత.
తే.గీ. నీకు నోదన మేదైన శ్రీకరముగ
నారగింపంగఁ బెట్టినన్ గోరి నీవు
స్వీకరింతువు భక్తులన్ బ్రీతిఁ గాంచి,
శ్రీద! *సర్వౌదన ప్రీత చిత్త*! శరణు.
534. ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
యకార సంకేతముగా కలిగిన శక్తి, బీజ, కీలక ములు కలిగిన యశస్విని మన జగన్మాత.
కం. నిరుపమ *యాకిన్యంబా
స్వరూపిణీ*! నిలుము మదిని సద్గుణ మీయన్,
వరలు సహస్రార నిలయ!
పరమేశ్వరు నెఱుకపరచి భద్రత నిడుమా.
535. ఓం స్వాహాయై నమః.
నామ వివరణ.
దేవతలకు యజ్ఞముల ద్వారా సమర్పించు హవిస్సులను స్వాహాదేవి ద్వారా ఆయా దేవతలకు
అందును, ఈ స్వాహా దేవి అగ్నిదేవునకు కుడిప్రక్కనుండును. ఆ విధముగా మనకు సహకరించు
స్వాహా దేవి మన అమ్మయే.
కం. ప్రణతులు *స్వాహా*! దివిజుల
ఋణమోచనఁ గొలిపి నాకు తృప్తి నొసఁగుమా,
క్షణమయినను విడువకు నను,
మణిమందిరమమ్మ! నాదు మనసే నీకున్.
536. ఓం స్వధాయై నమః.
నామ వివరణ.
పితృదేవతలకు అర్పించు తర్పణములు, అగ్నికి ఎడమ ప్రక్క నుండు స్వధాదేవి ద్వారా చేరును.
అట్టి స్వధాదేవి మన అమ్మ స్వరూపమే.
తే.గీ. దివ్య పితృయజ్ఞముల *స్వధా*! దేవతవయి
జరుపు పితృకార్యములు నీవు జరుఁగఁ జేసి,
పితరులకు శాంతి కలిగింతు వతులితముగ
నిహపరంబుల సుఖద వీవే మదంబ..
537. ఓం అమత్యై నమః.
నామ వివరణ.
మొట్టమొదటిగా సృష్టి అవ్యక్త స్వరూపము. అదియే అజ్ఞానము, సృష్టి మూలము. అదియు మన
అమ్మయే. అందు మూలముననే అమతిగా అమ్మ ప్రసిద్ధమయినది.
ఆ.వె. సుమతియందు నీవు శోభిల్లుచుందువే,
*యమతి*! నే నుతింతు ననుపమ గతి,
గతివి నీవె నాదు మతియు నీవేనుగా,
కుమతిఁ బాపి శుభము గూర్చుమమ్మ.
538. ఓం మేధాయై నమః.
నామ వివరణ.
మేధ అనగా జ్ఞానము, బుద్ధి, జీవులలో మేధారూపమున ఉండు జనని మన లలితామాత.
కం. శ్రీ *మేధా*! మహిమాన్విత!
క్షేమంబే నిన్ స్మరింప, సిద్ధియుఁ గలుగున్,
నే మానను నిన్ గొలుచుట,
నీమంబున నన్ను గావు నిను విడువ సుధీ!
539. ఓం శ్రుత్యై నమః.
నామ వివరణ.
జగన్మాత ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలే వేదాలు. అవి శ్రుతులుగా పిలువఁ బడుచున్నవి. ఆ శ్రుతి
స్వరూపిణి మన వేదమాత అయిన లలితాంబ.
మ. పరికింపన్ శ్రుతులందు వెల్గెదవు, నా భారంబు నీదే *శ్రుతీ*!
ధరపైనన్ శ్రుతి కర్ణపేయము, మహోదారంబుగా నీ వటన్
స్థిరమై శోభిలుచుందువమ్మ కృపతో సేవించు భక్తాళిలో
వరమై నిల్తువు, వారె నీవనునటుల్, భాగ్యప్రదా! పార్వతీ!
540. ఓం స్మృత్యై నమః.
నామ వివరణ.
సులభగ్రహణము కొఱకు వేద సారమును మనువు, పరాశరుఁడు, యాజ్ఞవల్క్యుఁడు మొదలగువారు
స్మృతులుగా వెలయించియుండిరి. అట్టి స్మృతి రూపిణి మన అమ్మ.
కం. తలఁపగ శ్రుతులందీవే,
కల వట శ్రుతి సంజనితపు కమ్మని స్మృతులన్,
తొలగింపు మపస్మృతులను,
కలిగించుము నీ స్మృతులను ఘనముగను *స్మృతీ*!
541. ఓం అనుత్తమాయై నమః
నామ వివరణ.
తనకన్నా ఉత్తమము లేని మన అమ్మ అనుత్తమ.
కం. ఉత్తమమౌ పథమందు *న
నుత్తమ*! నడిపించు మమ్మ! యొప్పుగ జగతిన్,
మత్తును బాపుచు నను స
ర్వోత్తమ సద్ భక్తునిగ మహోద్గతి నిమ్మా.
శ్లో. పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా |
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా || 111 ||
542. ఓం పుణ్యకీర్త్యై నమః.
నామ వివరణ.
పుణ్యభాగ్యముచే సంపాదింపఁబడిన కీర్తికి మూలమైనది మన అమ్మ.
చం నిరుపమ! *పుణ్యకీర్తి*! మహనీయ నిరామయ కీర్తిచంద్రికల్
వరలుటదెట్లు సాధ్యమగు? భవ్య మనోహర నీ కృపామృతం
బరయని జన్మకున్, జనని! యందగఁ జేయుమ నీదు సత్ కృపన్,
వరగుణ! పుణ్య కీర్తిని సభక్తిగ నిన్ గని పొంగనా శివా!
543. ఓం పుణ్య లభ్యాయై నమః.
నామ వివరణ.
పుణ్యఫలము చేత మాత్రముననే లభించు జనని లలితామాత.
చం. తరగని భక్తిఁ గల్గి, భవ తాప నివారిణి! నీ పదాబ్జముల్
నిరుపమ రీతిఁ గొల్వఁ గరుణింపక యుందువె? *పుణ్య లభ్య*! నీ
కరుణను బొందఁ జేయుటకుఁ గాంచుము నన్ను, విశేష భక్తిత
త్పరత నొసంగుమమ్మ! పరివర్ధనఁ జేయుము నీవె ముక్తిదా!.
544. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః.
నామ వివరణ.
పుణ్యప్రదమయిన విహిత కర్మలను వినుట, పొగడుట కల తల్లి లలితా మాత. పుణ్యప్రదము,
శుభప్రదము అయిన విషయములను శ్రవణము చేయుట యందు కాని, కీర్తనలు వినుటయందు
కాని ఆసక్తి కలది మన అమ్మ.
తే.గీ. పుణ్యమును గొల్పు చరితలు ముక్తి నొసగు,
నేను వినెదను, బాడెద నీదు చరిత,
కరుణతో నీవు కాపాడఁ గంటివేని
నన్ను, *బుణ్యశ్రవణ కీర్తనా*! కృపాబ్ధి!
545. ఓం పులోమజార్చితాయై నమః.
నామ వివరణ.
పులోముని కుమార్తె అయిన శచీదేవిచే పూజింపఁబడిన జనని మన అమ్మ.
కం. నిలుపగ నిను మనమందున
నిలువగఁ బనులందు నీవు నిత్యము నాతోఁ
బలుపలు రీతులఁ గొలుచుచుఁ
దలచెదను *బులోమజార్చితా*! నిను మదిలోన్.
546. ఓం బంధ మోచిన్యై నమః.
నామ వివరణ.
ఐహికమయిన మాయా బంధములనుండి విమోచనము కలిగించు తల్లి మన అమ్మ.
ఉ. సుందరమైన జీవితము, చూచుచు నిన్ మదిఁ గొల్చుచున్న నా
నందము గొల్పుచున్ దొరుకు, నా యను స్వార్థము ముట్టడించ, నా
నందము మాయఁ జేయుచుననంతపు పాశములల్లి, జీవినే
మందునిగా నొనర్చు,, కని, మమ్ములఁ గావుము *బంధమోచనీ*!
547. ఓం బంధురాలకాయై నమః
నామ వివరణ.
ఒప్పిదమయిన ముంగురులు కల తల్లి లలితాదేవి.
కం. నిరుపమ నిర్మల తేజా!!
పరమాద్భుత భక్తినిచ్చి పద్యామృతమున్
గురియఁగఁ జేయుమ నీపైఁ
గరుణామయి! *బంధురాలకా*! వందనముల్.
శ్లో. విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః |
సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ || 112 ||
548. ఓం విమర్శ రూపిణ్యై నమః.
నామ వివరణ.
సదసద్వివేచన చేయుట విమర్శ. అట్టి విమర్శ అనునది అమ్మ రూపమే.
చం. మనుజుని సద్విమర్శ గుణమాన్యుని చేయును నీదు సత్ కృపన్
మను మహనీయులొప్పగు విమర్శలు చేయ మహానుభావులే
ఘనముగ స్వీకరింతురు ప్రకాశము పొందుదురాత్మవిజ్ఞులై
నినుఁ గన సద్విమర్శ కరుణించుము నాకు, *విమర్శ రూపిణీ*!
549. ఓం విద్యాయై నమః.
నామ వివరణ.
పరా విద్య, అపరావిద్య, ఈ విధముగా విద్యారూపమున ఉన్నది అమ్మయే కాన విద్య అమ్మయే.
కం. *విద్యా*! జ్ఞానము జ్ఞేయము
సద్యోగము చూడ నీవె, సర్వేశ్వరి! శ్రీ
విద్యా సముపార్జనమది
యాద్యంతము నీదు కృపయె యనుపమ తేజా!
550. ఓం వియదాది జగత్ప్రసువే నమః.
నామ వివరణ.
ఆకాశము మున్నగు జగత్తులను ప్రసవించిన తల్లి లలితాంబ.
చం. మనఁగ నసాధ్యమీ ధరను మంచిగ నుండి క్షణమ్ము కూడ, నీ
ఘనమగు పంచ భూతముల కల్పనఁ జేసిన తల్లి వీవెగా,
కనికరమింత చూపి, ననుఁ గావుము మాయను బాపి శాంభవీ!
యనుపమ! దివ్య తేజ! *వియదాది జగత్ప్రసు*! నీకు మ్రొక్కెదన్.
551. ఓం సర్వ వ్యాధి ప్రశమన్యై నమః.
నామ వివరణ.
మానసిక, శారీరక వ్యాధులను ఉపశమింపఁ జేయు తల్లి లలితామాత.
కం. *సర్వ వ్యాధిప్రశమని*!
గర్వంబును గలుగనీక కాపాడుము నన్,
దుర్వహ మాధివ్యాధులు,
శర్వాణీ! బాపుమమ్మ! సన్నుత జననీ!.
552. ఓం సర్వ మృత్యు నివారిణ్యై నమః.
నామ వివరణ.
సమస్తమయిన మృత్యువులను తననుపాసించువారికి నివారించుచు అమృతత్వమును
ప్రసాదించు తల్లి.
తే.గీ. సర్వ విధముల మృత్యు సంసర్గమునను
తూలిపోవుచునుంటిని, జాలి లేదొ?
కావ రావేల నాపైనఁ గరుణఁ జూప?
*సర్వ మృత్యు నివారిణీ*! శాంతి నిమ్ము.
శ్లో. అగ్రగణ్యాఽచింత్యరూపా కలికల్మషనాశినీ |
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా || 113 ||
553. ఓం అగ్రగణ్యాయై నమః.
నామ వివరణ.
మొట్టమొదట గణింపఁబడు నది మన అమ్మ.
తే.గీ. ఉగ్ర రూపంబు నీకేల? *యగ్రగణ్య*!
సృష్టియంతయు నీదగు దృష్టి ఫలము,
మూలమీ వగ్రగణ్యవు పూర్ణ మీవె,
భుక్తి ముక్తులు నీకృపన్ బుడమినొదవు.
554. ఓం అచింత్య రూపాయై నమః.
నామ వివరణ.
చింతింపనలవి కానందున అచింత్యరూపిణి మన
అమ్మ.
శా. శ్రీమత్ సృష్టివి నీవె కాఁగ జననీ! చిత్తంబునన్ నిన్ను, నీ
శ్రీమంతంబగు దివ్య తేజమును నీ చిద్రూపమున్ గాంచఁగా
నేమాత్రంబును సాధ్యమౌనె జననీ! హే శంభురాణీ! సతీ!
క్షేమంబీవె *యచింత్య రూప*! కలుగన్ జిత్తంబునన్ నీవటన్,
555. ఓం కలికల్మష నాశిన్యై నమః.
నామ వివరణ.
మాయాప్రభావముచే అలముకొనిన కల్మషమును నశింపజేయునది అమ్మ. కలి కారణముగా
మనలో ప్రవేశించు కల్మషమును నాశనము చేయు ప్రేమ మూర్తి మన అమ్మ.
చం. వినుత మహా స్వరూప! కలి పీడితులన్ గల కల్మషంబులన్
గని విడఁ జేయు దీవు, శుభ కర్మల సత్ఫలదాయివమ్మ! నన్
గని పరమాత్మ తత్వమును గానఁగఁ జేయుమ! కన్న తల్లివే,
కనికరముంచుమమ్మ *కలి కల్మష నాశిని*! కావ రమ్మిఁకన్.
556. ఓం కాత్యాయన్యై నమః.
నామ వివరణ.
కతుఁడు అనే మహర్షి కుమార్తె కాత్యాయని. కతులు అనఁబడే బ్రహ్మవేత్తలయందు నెలకొని యున్న
జనని కాత్యాయని. నిరంతరము కన్యాత్వమునే కోరి, పరాధీనతలేనటువంటి తల్లి కాత్యాయని మన
అమ్మ.
తే.గీ. కతు వరాశ్రమ వర్ధిని, యతులిత ఘన
శక్తి యుత! దేవతాళి సచ్ఛక్తి సహిత!
వినుత *కాత్యాయనీ*! నీకుఁ బ్రణతులమ్మ!
నాదు దుర్గతులన్ బాపి యాదుకొమ్మ.
557. ఓం కాలహంత్ర్యై నమః.
నామ వివరణ.
మృత్యువును సంహరించు తల్లి.కాలహంత్రి మన అమ్మ.
తే.గీ. కాలుఁడైనను నీ ముందు కాలు పెట్టఁ
జాలఁడోయమ్మ! నిజమిది, *కాలహంత్రి*!
కాలమైనను నిను మీరి కదలదమ్మ!
మ్రోల నిలిచిన ననుఁ గని ముక్తినిమ్మ
558. ఓం కమలాక్షనిషేవితాయై నమః.
నామ వివరణ.
కమలాక్షుఁడయిన విష్ణువుచే ప్రసిద్ధముగా సేవింపఁబడు జనని లలితామాత.
కం. నుతమతి! *కమలాక్ష నిషే
వితా*! నిను మదిని నిలుపుదు విశ్వాసముతో,
క్షితిఁ గల బాధలు పాయన్
గతివగు నినుఁ గొలువనిమ్ము, కరుణార్ణవమా!
శ్లో. తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా |
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ || 114 ||
559. ఓం తాంబూల పూరిత ముఖ్యై నమః.
నామ వివరణ.
తాంబూలముచే నిండిన ముఖము గల జనని. తాంబూలచర్వణమునందు ప్రీతిగల తల్లి.
కం. ప్రియముగ సత్ కవితా సుధ
జయశీలము, నొసఁగి నన్ను జక్కఁగఁ గను నిన్
బ్రియముగ నారాధించెద,
దయఁ గను, *తాంబూలపూరిత ముఖీ*! ప్రణతుల్.
560. ఓం దాడిమీ కుసుమ ప్రభాయై నమః.
నామ వివరణ.
అమ్మ దానిమ్మపూలకాంతితో విరాజిల్లుచున్నందున దాడిమీకుసుమప్రభ మన అమ్మ.
తే.గీ. కోమలారుణ సుకుమారి! కూర్మిఁ గనెడి
భవ్య *దాడిమీ కుసుమప్రభా*! మదంబ!
నీ మనోజ్ఞానురాగారుణిమను బొగడ
నా తరంబా, దయాపూర్ణ! నన్నుఁ గనుమ.
561. ఓం మృగాక్ష్యై నమః.
నామ వివరణ.
జింక కన్నులవంటి అందమయిన కన్నులు గల తల్లి మన అమ్మ.
శా. శ్రీమన్మంగళ! విశ్వనాథుని సతీ! శ్రీ కాంతులన్ జిందు నీ
ప్రేమోద్దీపిత నేత్ర శోభ జగతిన్ విజ్ఞానమున్ నింపుచున్,
గ్షేమంబున్ గలిగించుచుండును, *మృగాక్షీ*! నీవె మాకండ, నిన్
నే మౌనంబుగ నాత్మలోఁ గొలిచెదన్ నిత్యంబు నన్ బ్రోవుమా.
562. ఓం మోహిన్యై నమః.
నామ వివరణ.
లోకమంతయు అమ్మ కారణముగనే మోహింపఁబడుచున్నందున అమ్మ మోహిని.
ఉ. మోహము గొల్పి సృష్టిని బ్రమోదముతో నడిపించుచున్న యో
*మోహిని*! వందనంబులు, ప్రమోదము నీకిది, కాని మాకు సం
దేహమె సర్వమున్, విగత దేహుల మోహము లేమి యౌను? నా
మోహము నీవు ముక్తిపయిఁ బూర్తిగ నుండఁగఁ జేసి కావుమా.
563. ఓం ముఖ్యాయై నమః.
నామ వివరణ.
అన్నింటికన్నను సృష్టిలో అత్యంత ముఖ్యమయినది అమ్మ. కావున అమ్మ ముఖ్యగా
సుప్రసిద్ధనామమును పొందియున్నది.
కం. *ముఖ్యా*! నీ నామమిలను
బ్రఖ్యాతము, జగతి కీవె రక్షణ, ప్రజలన్
సఖ్యతతో నడయాడఁగ
ముఖ్యులుగాఁ దనరఁ జేసి, ప్రోవుము తల్లీ!
564. ఓం మృడాన్యై నమః.
నామ వివరణ.
మృడము అనగా సుఖము. సుఖమును కలిగించు దైవము మృడుఁడు. అతడే శివుఁడు. అట్టి
మృడుని యిల్లాలు మృడాని. సాధకులకు పతిదేవునితో కూడి సుఖప్రదయగునది మృడాని.
శా. సేవింపన్ మహనీయుఁడైన మృడునిన్ జిత్తంబునన్ నిల్పుచున్,
నీవే సంతసమందుచుందువు, * మృడానీ*! మాకు భాగ్యమ్మదే,
నీవున్ నీ పతి మంచిఁ జేయు జనులన్ నిత్యంబు కాపాడుచున్,
భావాతీత శుభాళితోఁ దనుపుడీ, ప్రార్థింతు నన్ బ్రోవుడీ!
565. ఓం మిత్రరూపిణ్యై నమః.
నామ వివరణ.
మిత్రుల రూపమున మనతో సంచరించు జనని. సూర్యుని రూపములో నిరంతరము సృష్టిని
నడుపు తల్లి మిత్రరూపిణి అమ్మ.
చం. సుజనుల రూపునన్ సతము శోభిలుచున్ వర మైత్రినొప్పి, నన్
గుజనులనుండి కాచెదవు, కోమల సన్నుత *మిత్ర రూపిణీ*!
నిజమగు మైత్రితో మదిని నీవె వసించుచు నాదు భారమున్
భుజమున వేసికొందువు, సుపూజ్య! ప్రణామములమ్మ! పార్వతీ!
చం. ఆకసమంచు నా మదిని హాయిగ మిత్రునిగాఁ జరించుచున్
శ్రీకరమైన లోజగతిఁ జీకటిఁ బాపుచు *మిత్రరూపిణీ*!
నాకు నిజప్రబోధము ననంత సుతేజముఁ గొల్పితే సతీ!
నీకు నమస్కృతుల్ జనని, నీవు సతంబు వసింపు నా యెదన్.
శ్లో. నిత్యతృప్తా భక్తనిధి-ర్నియంత్రీ నిఖిలేశ్వరీ |
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ || 115 ||
566. ఓం నిత్య తృప్తాయై నమః.
నామ వివరణ.
నిత్యమూ తృప్తిగా ఉండు తల్లి. నిత్యమయిన సర్వరూపానందమందు తృప్తి కల తల్లి. నిత్యమూ
ఆత్మజ్ఞానానందము ఉన్న జనని.
ఉ. నీ పద పంకజమ్ములను నే మదిఁ గాంచ స్మరించినంతనే
నీ పతితోడఁ గన్పడుచు నిత్యము తృప్తిని గొల్పుదీవు, నా
పాపములన్ హరించి, గుణవర్ధనుగానొనరించి, *నిత్య తృ
ప్తా*! పరమార్థ సాధనకు దారిని జూపిన నీకు సంస్తుతుల్.
567. ఓం భక్త నిధయే నమః.
నామ వివరణ.
భక్తులకు నిధి అమ్మ. సాధకులకు సాధనాసంపత్తిని నిరంతరమూ ప్రసాదించుచు, నిధిగా ఉండెడి
జనని మన అమ్మ.
చం. నిరుపమ ముక్తి దాతవని నిర్మల చిత్తము నందు నిన్ను నే
నిరతము నిల్పి కొల్చెద ననింద్య శుభావహ జీవితమ్ము నా
పరముగఁ జేయుమమ్మ! నినుఁ బ్రార్థనఁ జేయుచు ముక్తి నొందెదన్,
బరమ వివేక మిమ్మిఁకను *భక్త నిధీ*! కరుణాంబుధీ! సతీ!
568. ఓం నియంత్ర్యై నమః.
నామ వివరణ.
లోకములను నియంత్రించుచు చక్కగా సృష్టి నడుపు తల్లి నియంత్రి, మన అమ్మ.
కం. నీ పద సన్నిధిఁ జిత్తము
నే పగిదిని నిలుపనగుఁ, గుదించెడి చింతల్
వ్యాపింప? నియంత్రించుము,
నీపయి మది నిలువనిమ్ము నీవె *నియంత్రీ*!
569. ఓం నిఖిలేశ్వర్యై నమః.
నామ వివరణ.
సకల సృష్టికీ ఈశ్వరి మన అమ్మ. సాధకులకు సంబంధించిన నిఖిల సాధనా సామగ్రి అమ్మయే
కావున అమ్మ నిఖిలేశ్వరి.
కం. ఏ జన్మ పుణ్య ఫలమో
యీజన్మను నిన్నుఁ గొలుచు టీవిధి నబ్బెన్,
బూజించెద *నిఖిలేశ్వరి*!
యీ జన్మమునందె ముక్తి నిమ్మా, కృపతోన్...
570. ఓం మైత్ర్యాది వాసనా లభ్యాయై నమః.
నామ వివరణ.
మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అను చతుత్విధ వాసనలచే లభ్యమగు తల్లి మైత్ర్యాదివాసనా
లభ్య, మన అమ్మయే.
తే.గీ. లలిత! *మైత్ర్యాది వాసనా లభ్య*! నాకుఁ
గరుణ మైత్ర్యాది వాసనల్ కలుగఁ జేసి,
లభ్యమగుమమ్మ! నీ పైన లక్ష్యముంచి
కొలుచునట్లుగఁ దగు భక్తిఁ గూర్చుమమ్మ!
571. ఓం మహాప్రళయసాక్షిణ్యై నమః.
నామ వివరణ.
కల్పాంత ప్రళయమునకు సాక్షి ఆయుధ ధారిణి అయిన మన అమ్మ.
ఆ.వె. కావు మమ్ము కృపను, కల్పాంతమున్ *మహా
ప్రళయ సాక్షిణి*! నను, భక్త సులభ!
జన్మలేల మరల సదయ నన్ నీ పాద
సేవకునిగ గొనుమ శ్రీకరముగ.
శ్లో. పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ |
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ || 116 ||
572. ఓం పరాశక్త్యై నమః.
నామ వివరణ.
ప్రపంచమునందలి పదార్థము పరమేశ్వరుఁడు కాగా అందలి శక్తి పరమేశ్వరి. అట్టి పరాశక్తి మన
అమ్మయే.
కం. కరుణించు *పరాశక్తీ*!
నిరుపమ ముక్తి ప్రదాత్రి! నిను గొలిచెద నేన్,
సురుచిరమగు నీ నామము
శరణము నాకిహము పరము చక్కఁగ నిడగన్.
573. ఓం పరానిష్ఠాయై నమః.
నామ వివరణ.
పరమయి యొప్పుచు అందే నిష్ఠ కలతల్లి పరానిష్ఠ.
మ. పర తత్వంబును జీవు లన్నిటను నే భక్తిన్ *పరానిష్ఠ*! గాం
తు, రహించంగల వీవె యం చచట, చేతోరూప! నిన్నెన్నుచున్,,
బరికింపన్ స్వపరంబు లేను జగతిన్ భాసింతువీవే యటం
చు రహస్యమ్ముగ లోన్ వసించు జననీ! శోభిల్లు నీకున్ నతుల్.
574. ఓం ప్రజ్ఞాన ఘన రూపిణ్యై నమః.
నామ వివరణ.
గొప్ప జ్ఞానమనెడి రూపముతోనొప్పు ప్రజ్ఞాన ఘనరూపిణి మన అమ్మ.
తే.గీ. నిలుము *ప్రజ్ఞాన ఘన రూపిణీ*! మనమున,
నీవె సదయను, బ్రజ్ఞాన నేత్ర మమరఁ
జేయు మమ్మరో! ధర్మమమేయ సుగతి
నిమ్ము సేవించు కొనఁగ నిన్ నిత్యముగను.
575. ఓం మాధ్వీ పానాలసాయై నమః
నామ వివరణ.
బ్రహ్మానందమనే మధువు సేవించు కారణమున అలసతకలది,. మన అమ్మ.
కం. అసమా! *మాధ్వీపానా
లస*! మధు సన్నిభ కవిత లలయక కొనుమిదే,
యిసుమంత దోషమున్నను
వసుధ నపప్రథ, కనుమిది, పాపుము దొసఁగుల్.
576. ఓం మత్తాయై నమః.
నామ వివరణ.
బ్రహ్మానందమనే మధుపానముచే మత్తుతోనుండునది అమ్మ.
కం *మత్తా*! నీవే దయతో
మత్తును వర భక్తిఁ గొలుపు మహిమాన్విత నా
కి త్తనువశాశ్వతము, నే
నెత్తరినైనను నిను గన నిమ్మిపుడె సతీ!
577. ఓం మాతృకా వర్ణరూపిణ్యై నమః.
నామ వివరణ.
అకారాదిగాగల మాతృకావర్ణములస్వరూపిణియే అమ్మ.
తే.గీ. కని నిను మహితాక్షర మాతృకవని మదిని,
నిలిపి పద్యసుమంబులు నేర్పు మీర
నక్షరంబగు సౌరభమలఁది నీకు
*మాతృకా వర్ణ రూపిణీ*! మహి నొసఁగుదు.
శ్లో. మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా |
మహనీయా దయామూర్తి-ర్మహాసామ్రాజ్యశాలినీ || 117 ||
578. ఓం మహా కైలాస నిలయాయై నమః
నామ వివరణ.
మహాశివునితో కైలాసమును నిలయముగా కలిగి యుండు మహా కైలాస నిలయ మన అమ్మ.
కం. శ్రీకరపు సహస్రారమె
నీకు నిలయమమ్మ గాంతు నిన్నట నదియే
నీ కైలాసము, నాకు *మ
హా కైలాస నిలయా*! జయమునిమ్ము సతీ!
579. ఓం మృణాలమృదు దోర్లతాయై నమః.
నామ వివరణ.
తామర కాడలవనె సుకుమారమయిన తీగలవంటి చేతులు కల తల్లి మన అమ్మ.
కం. నుతమతి *మృణాల మృదు దో
ర్లతా*! కృపను జేరఁదీసి, లక్ష్యము నీపై
సతతము నిలుపుచు భక్తిని
క్షితి నొప్పఁగఁ జేయుము నను శీఘ్రమె జననీ!
580. ఓం మహనీయాయై నమః.
నామ వివరణ.
అందరిచే పూజింపఁబడు మహనీయమయిన తల్లి మన అమ్మ.
కం. *మహనీయా*! నినుఁ గొలిచెద
స్పృహలో నను నిలిపి నిన్ను సేవించునటుల్
మహిమము చూపుచుఁ జేయుము,
రహియింపఁగఁ జేయు మెలమిఁ బ్రఖ్యాతముగా.
581. ఓం దయామూర్త్యై నమః.
నామ వివరణ.
దయయే పరిపూర్ణ స్వరూపముగా కలిగియున్న తల్లి మన అమ్మ.
కం. కరుణించు *దయామూర్తీ*!
నిరుపమమగు నీదు చరణ నిర్మల తేజం
బరయఁగ శక్తి నొసంగుమ,
పరమానందమ్ముతోడ వరలఁగ నిమ్మా.
582. ఓం మహా సామ్రాజ్యశాలిన్యై నమః.
నామ వివరణ.
కైలాసమే మహా సామ్రాజ్యము. అట్టి మహా సామ్రాజ్యమున ప్రకాశించు జనని మన అమ్మ.
కం. యశమును గొలిపెడి తల్లీ!
ప్రశమన మొనరింపుమీ యరాచకము లసా
దృశ! పాపు *మహా సామ్రా
జ్యశాలినీ*! యఘ చయము ననంత శుభదవై.
శ్లో. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా |
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా || 118 ||
583. ఓం ఆత్మవిద్యాయై నమః.
నామ వివరణ.
శ్రీవిద్య అనునదియే ఆత్మ విద్య. ఆత్మ జ్ఞాన రూపమునగలతల్లి. అది సాక్షాత్ అమ్మయే. కావుననే
అమ్మయే ఆత్మవిద్య.
తే.గీ. *ఆత్మవిద్యా*! ప్రసాదింపు మాత్మవిద్య,
నిత్యమును గొల్పు శ్రీవిద్య సత్యవిద్య,
కడమవిద్యలవేలను, కలుగు ముక్తి
యాత్మవిద్యను మాత్రమే యరసి చూడ.
584. ఓం మహా విద్యాయై నమః.
నామ వివరణ.
ఆత్మవిద్యయే మహా విద్య. అదియే బ్రహ్మవిద్య. అట్టి మహావిద్య అమ్మయే.
తే.గీ. వేల్పు వీవమ్మ, శ్రీ *మహా విద్య*! నాకు,
లౌకికముతోడ గొప్పయలౌకికమగు
జ్ఞాన సంపత్తిఁ గొలిపెడి జననివమ్మ,
నీదు పాదంబులను బట్టి నేను గొలుతు.
కం. సద్యోగము, సంస్కారము,
విద్యామూలమునఁ గల్గు విశ్వ జనులకున్,
సద్యోగద! కొలుతు, *మహా
విద్యా*! సద్విద్య నొసగి విజ్ఞత నిడుమా.
585. ఓం శ్రీవిద్యాయై నమః.
నామ వివరణ.
శ్రీమాత నారాధించు విధానమును తెలుపు విద్య శ్రీవిద్య. అట్టి విద్య మన అమ్మయే.
శా. *శ్రీవిద్యా*! మహిమాన్వితా! శుభకరీ! శ్రీ జ్ఞాన సంపత్కరీ!
ధీవర్యుల్ నిను నిత్యమున్ గొలుచుచున్ దేదీప్యమానంబుగా
శ్రీవిద్యాన్విత దివ్యమూర్తులగుచున్ జీవింతురెల్లప్పుడున్
నీవే మూలము వారి యున్నతికి, నన్ నీవే కృపన్ గావుమా.
586. ఓం కామసేవితాయై నమః.
నామ వివరణ.
సృష్టి ప్రారంభమునకు ముందు కామేశ్వరునిచే సేవింపబడిన తల్లి మన అమ్మ.
తే.గీ. కామసేవిత వీవమ్మ కమల నయన!
*కామ సేవితా*! శత్రువౌ కామము నిఁక
తొలఁగఁ జేయుమ మానుండి, వెలుఁగఁ జేయ
నిన్ను నేకాగ్రతను గొల్వ నన్నుఁ జేయ.
587. ఓం శ్రీ షోడశాక్షరీ విద్యాయై నమః.
నామ వివరణ.
షోడశాక్షరీ మంత్ర రూపిణి అమ్మ. కావుననే అమ్మ షోడశాక్షరీ విద్య.
కం. *శ్రీ షోడశాక్షరీ వి
ద్యా*! షణ్ముఖ జనని! మమ్ము దయతోఁ గనుమా!,
శ్రీ షోడశాక్షరీ వి
ద్యా సాధనము నిఁక నేర్పు మమ్మా! నాకున్
588. ఓం త్రికూటాయై నమః.
నామ వివరణ.
వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తికూటము, అను త్రికూటముల స్వరూపమమ్మయే కావున
అమ్మత్రికూట.
కం. కూటత్రయ రూపా! ని
న్నేటికి నే నడుగవలె? మహేశ్వరి! నాలో
కోటీర కాంతి నొప్పు *త్రి
కూటా*! నీ వెఱుఁగవొ సమకూర్చగ ముక్తిన్?
589. ఓం కామకోటికాయై నమః
నామ వివరణ.
శివుఁడు యేకదేశముగా కలది అమ్మ.
కం. శివ శక్తివి నీవే కద,
కవి సన్నుత! *కామకోటికా *! నా మదిలో
నివసించుచు శుభ గుణముల
నవలీలగ నిన్నుఁ గొలుచు టరయఁగ నిమ్మా!
శ్లో. కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా |
శిరస్స్థితా చంద్రనిభా ఫాలస్థేంద్రధనుఃప్రభా || 119 ||
590. ఓం కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితాయై నమః
నామ వివరణ.
పరమేశ్వరీ కటాక్షవీక్షణములెవరి యందుండునో అట్టివారిని కోటి మండి లక్ష్ములు
సేవించుచుందురు, ఆవిధముగా లక్శ్ములచే సేవిండు కటాక్షములు కలది అమ్మ.
స్వయం కల్పిత కమలసేవిత వృత్తము.
గణములు. జ .. ర .. భ .. య . జ . గ., యతి 9వ అక్షరము.
ప్రాస నియమము కలదు.
*కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితా *!
జటాధరుండు నీతోడ సదయన్ వెల్గుతన్ మదిన్,
కుటుంబ రక్షకుల్ మీరు, కొలువుండన్ శుభంబ, నీ
కటాక్షముల్ కృపన్ నాకు గనుచు న్నీవె యిమ్మికన్,
591. ఓం శిరః స్థితాయై నమః
నామ వివరణ.
శ్రీచక్రములోని బిందువే ఉపాసకుల బ్రహ్మరంధ్రము. శిరస్సులో ఆ బ్రహ్మరంధ్రమున ఉండు తల్లి
మన అమ్మ.
పంచ.చా.
*శిరః స్థితా *! నమోస్తుతే, వశించు నా మదిన్ సదా,
వరంబదే కదా కనన్, భవాని! నీవె నిత్యవై
నిరంతరంబు సంచరింప నీ ప్రభావమంది నేన్
ధరా తలంబు నందు మంచి ధర్మవృత్తి నొప్పెదన్.
592. ఓం చంద్ర నిభాయై నమః
నామ వివరణ.
శిరోభాగమున సహస్రారమున గల చంద్ర మండలములో నిత్యపూర్ణ చంద్రుఁడు
ఉండును. ఆ చంద్రునితో సమానమయిన జనని మన అమ్మ.
కం. *చంద్ర నిభా *! విలసద్గుణ
సాంద్రా! పరమేశుఁడె నిను సన్నుతిగ సిగన్
చంద్రునిగా ధరియించెనొ?
చంద్రుఁడె నినుఁ బోలెనొ? గనఁ జాలఁడు విధియున్.
తోటక వృత్తము.
గణములు. స స స స . యతి 9వ అక్షరము.
క్షయ హీనత నొప్పెడి *చంద్ర నిభా*!
నయమార్గమునన్ గను నన్ జననీ,
జయముల్ కరుణించుము సన్నుతిగా
భయదూరునిగా నను వర్ధిలనీ.
593. ఓం ఫాలస్థాయై నమః.
నామ వివరణ.
ఫాలభాగమున హ్రీంకార రూపమున ఉండు దేవి మన అమ్మ.
కం. *ఫాలస్థా *! నా నుదుటను
హేలగ నివసించు తల్లి! యిందు నిభాస్యా!
శ్రీ లలితా సన్నామమె
చాలును, బలుకంగఁ జేసి చక్కఁగఁ గనుమా.
కం. *ఫాలస్థా*! నా నుదుటను
మేలుఁ గొలుపు వ్రాత వ్రాసి మిథ్యా జగతిన్
బేలగ నిలువక నీ దరి
హేలగ నేఁ జేరఁ జేసి కృపఁ జూపు సతీ!
594. ఓం ఇంద్ర ధనుః ప్రభాయై నమః
నామ వివరణ.
సాధకునికి ఫాలభాగమున సప్తజిహ్వుని తేజస్సుతో ఇంద్రధనుస్సు వలె ప్రకాశించు తల్లి మన
అమ్మ.
తే.గీ. కనుమ *యింద్రధనుః ప్రభా *! కల్పవల్లి!
నీ ప్రభల్ మాకు రక్షణ, నిశ్చయముగ
నిన్ను సేవించు భాగ్యమ్ము నిత్యమిమ్ము,
భుక్తినొసగెడి నీవె సన్ముక్తి నిమ్ము
కం. *ఇంద్ర ధనుఃప్రభ *! నాకున
తీంద్రియ వరశక్తి వీవె, హృదయాంతస్థా!
సాంద్ర కృపా నిధి! వరగుణ
సాంద్రా! నీకంజలింతు సంస్తుత జననీ!
శ్లో. హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా |
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ || 120 ||
595. ఓం హృదయస్థాయై నమః
నామ వివరణ.
సాధకుని హృదయమున నిరంతరమూ ఉండు తల్లి మన అమ్మ.
కం. సతి! *హృదయస్థా*! ధన్యుఁడ,
నుతులందుచు నా యెదను మనుచు నీవుంటన్,
క్షితి నా కబ్బిన భాగ్యమ!
యతులిత! నీ పదముల కడ నాశ్రయమిమ్మా!
కం. *హృదయస్థా*! నా యెడలన్
సదయన్ రహియింపుమమ్మ! సాదరముగ నే
మది నిన్ గొలిచెదనమ్మా!
పదిలంబుగ నిలిపి నన్ను వరలఁగఁ జేయన్.
596. ఓం రవి ప్రఖ్యాయై నమః
నామ వివరణ.
సాధకుని హృదయ స్థానమున ఉండు సూర్యమండలమున సూర్యునివలె ప్రకాశించుచు ఉండుతల్లి
మన అమ్మ.
తే.గీ. భా! *రవిప్రఖ్య*! నీ నుండి భానుఁడొందె
సత్ ప్రకాశంబు, నా లోని సత్య తేజ
మీవె, భాసిల్లఁ జేయుదు వీవె నన్ను,
లోకములనేలు జనయిత్రి! నీకు నతులు.
597. ఓం త్రికోణాంతర దీపికాయై నమః.
నామ వివరణ.
సాధకునికి మాలాధార చక్రమున గల త్రికోణమున ఉన్న అగ్ని మండలమున ప్రకాశించు జనని
మన అమ్మ.
కం. జ్ఞానాగ్నీ! మూలాధా
రానందాత్మ స్వరూప! హైమవతీ నిన్
నే నిట నిరతము గొలుతు, *త్రి
కోణాంతర దీపికా*! యకుంఠిత భక్తిన్.
కం. ప్రాణమె నీవయియుండగ
క్షోణిని నాకేల చింత,కూర్మిని నన్నున్
రాణింపఁ జేయునట్టి త్రి
కోణాంతర దీపికా! సుగుణదా! కనుమా..
598. ఓం దాక్షాయణ్యై నమః.
నామ వివరణ.
దక్షప్రజాపతి కుమార్తె మన అమ్మ దాక్షాయణి.
కం. *దాక్షాయణి*! నీకృపయే
రక్షగ నిలుచున్ దలంప రమ్యాత్ములకున్,
శిక్షింపుము దుర్జనులను,
రక్షింపుము సుజనులనిలఁ, బ్రార్థించెద నిన్.
599. ఓం దైత్య హంత్ర్యై నమః.
నామ వివరణ.
భండాసురాది దైత్యసంహారిణి మన అమ్మ.
కం. దుర్గుణములనెడి దైత్యులు
భార్గవి! నినుఁ దలఁపనీరు ప్రార్థించెద, దుర్
వర్గమది, *దైత్య హంత్రీ*!
మార్గము నాకొదవఁ జంపుమా దైత్యాళిన్.
600. ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః.
నామ వివరణ.
దక్షయజ్ఞమును ధ్వంసము చేసిన తల్లి మన అమ్మ.
కం. ఈశాని! *దక్షయజ్ఞవి
నాశిని*! ధర్మాగ్రహా! మనంబున నిలు, దు
ర్నాశ నిపుణ! నా దురిత వి
నాశంబొనరించుమిఁక, ప్రణామమొనర్తున్.
శ్లో. దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి-ర్గుణనిధి-ర్గోమాతా గుహజన్మభూః || 121 ||
601. ఓం దరాందోళిత దీర్ఘాక్ష్యై నమః.
నామ వివరణ.
చంచలించు ఆకార్ణాంత విశాల నేత్రములు ఉన్న మన అమ్మ దరాందోళిత దీర్ఘాక్షియే.
కం. నీలాలక! కనుమ, *దరాం
దోళిత దీర్ఘాక్షి*! కరుణతోడను మమ్మున్,
పాలించెడి జననీ! మొర
లాలింపుము ముక్తిని మ్మహమ్ము నశించన్.
కం. నుత సౌందర్య *దరాందో
ళిత దీర్ఘాక్షీ*! శుభావళికిరవు నీవే,
స్తుతమతిరో! నీ చూపును
నుతముగ నాపై బరుపుమనూనముగ నిఁకన్.
కం. సుక్షేమము నీ చూపులు
రక్షణ మా కవియె, చూడు రమ్యంబుగ, సద్
రక్ష! *దరాందోళిత దీ
ర్ఘాక్షీ*! వర ముక్తి నిమ్మ, బ్రార్థించెదనిన్,
602. ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః.
నామ వివరణ.
చిరునవ్వుతో ప్రకాశించు ఆనందమయమయిన ముఖము గలతల్లి మన అమ్మ.
కం. శ్రీదవు! రమణీయ వరాం
గీ! *దరహాసోజ్వలన్ముఖీ*! వందనముల్,
నీ దయ కలిగిన శుభములె
మోదమున వరించు నమ్మ పూర్తిగ జననీ!
603. ఓం గురుమూర్తయే నమః.
నామ వివరణ.
శ్రీవిద్యాసంప్రదాయమును వెలుగులోనికి తెచ్చిన గురుమూర్తి మన అమ్మ.
కం. కనుమిట *గురుమూర్తీ*! నన్
మనమున నిలు శాశ్వతముగ మద్గురువీవై,
జనహితముగ నీ నామము
లను వ్రాసెద పద్యములను లక్ష్యము తోడన్.
604. ఓం గుణనిధయే నమః.
నామ వివరణ.
సత్వ రజ స్తమో గుణములకు నిధి మన అమ్మ.
ఉ. దీవన లిమ్మిఁకన్ *గుణనిధీ*! దయఁ జూపుము నా పయిన్ సతీ!
భావనలందు నీ ప్రభలె వర్ధిలగాఁ గృపఁ జూడుమమ్మ! నీ
సేవయె మాకు భాగ్యము,ప్రసిద్ధము నీ కృప లోకపావనీ!
నీవె విముక్తిఁ గొల్పుమిక, నీ వరమే మహితంబు మాకిలన్.
కం. వరలింపు శాంతి నాకిటఁ,
బరమేశ్వరి! రక్ష నీవె, పరిపరి గతులన్
దిరిగెడు నా మదిని నిలిచి
వరభావనలిచ్చి కావు వరల *గుణనిధీ*!
605. ఓం గోమాత్రే నమః.
నామ వివరణ.
గో శబ్దముచే ప్రతిపాదింపబడు స్వర్గాదులకు తల్లి మన అమ్మ.
కం. *గోమాతా*! సేవింతున్
నీమంబున సృష్టి నిల్చె నీయందేగా?
నీ మార్గంబే మాకున్
క్షేమంబమ్మా! గ్రహించు, చిత్తోద్భాసా!
606. ఓం గుహజన్మభువే నమః.
నామ వివరణ.
కుమారస్వామికి జనని మన అమ్మ.
కం. జీవాత్మ వీవె జననీ!
భావించగ సృష్టి వీవె, వరగుహ జననీ!
శ్రీ వాఙ్మయి! కాఁపాడుము,
నీవే *గుహజన్మభూ*! గణించుచు నన్నున్.
శ్లో. దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ |
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా || 122 ||
607. ఓం దేవేశ్యై నమః.
నామ వివరణ.
బ్రహ్మాది దేవతలకు ఈశ్వరి మన అమ్మ.
కం. *దేవేశీ*! నిన్నున్ నే
భావించెదనాత్మలోన, భక్త సులభ! స
ద్భావం బిమ్మోయమ్మా!
నీవే కాపాడ వలయు నిరుపమ! సతమున్.
608. ఓం దండ నీతిస్థాయై నమః.
నామ వివరణ.
అర్థశాస్త్రమునందుండెడి తల్లి, నీతి శాస్త్రములో చెప్పబడెడిది ఈ తల్లియే.
తే.గీ. ధర్మ సంరక్షణార్థమై దండనీతి
కలిగి యుండెడి చోటులన్ గలవు నీవు,
*దండ నీతిస్థ*! నీకు నా దండము లిల
నన్ను కాఁపాడుచుండుమా నాదు జనని!
609. ఓం దహరాకాశరూపిణ్యై నమః.
నామ వివరణ.
హృదయాకాశ రూపము మన అమ్మయే.
కం. మోదముతో ననుఁ గనుమా,
సాదరముగఁ గావుమమ్మ! జయ వర్ధనివై
ఖేదము బాపెడి యలివే
ణీ! *దహరాకాశ రూపిణీ*! దయఁ గనుమా
కం. ఘనతర దహరాకాశవు,
వినుత స్మిత భక్త జన సువేద్య! వినుము, నా
మనమున ఘనముగ నుంచెద
నిను, *దహరాకాశ రూపిణీ*! దయఁ గనుమా.
610. ఓం ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితాయై నమః.
నామ వివరణ.
పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఉన్న తిథులయందు పూజింపబడు తల్లి.
స్వయం కల్పిత
షోడశ కళాపూర్ణ వృత్తము.
గణములు. భ త త స స వ. యతి 10వ అక్షరము. ప్రాస నియమము కలదు.
సుప్రతిభా! జీవనామోద శుభ వర్ధన శాంభవీ!
సప్రముదాంబాంజలుల్ షోడశకళాత్మ! గ్రహింపుమా,
యప్రతిమానా! సతీ నా జయము వెన్కను శక్తి నీ
దే! *ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితా*!
శ్లో. కలాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా || 123 ||
611. ఓం కలాత్మికాయై నమః
నామ వివరణ.
కళలకు ఆత్మ మన అమ్మ.
కం సలలిత సన్నుత లలితా!
కలిగిన కళలను *కలాత్మికా*! వెలుఁగుదువే,
వెలుఁగుము నాలోఁ గవితా
కళవై, వర ముక్తిఁ గొలుపఁ, గారుణ్య నిధీ!
612. ఓం కలానాథాయై నమః
నామ వివరణ.
కళలన్నిటికీ అధిపతి అమ్మయే.
కం. కనుదు *కలానాథా*! స
ద్వినుతిగ నాలోన నిన్ను విశ్వాత్మా! నీ
వనితర సాధ్యవు, భక్తిగ
నినుఁ గొలిచిన గనుదువమ్మ! నేఁ గొలిచెద నిన్.
613. ఓం కావ్యాలాప వినోదిన్యై నమః.
నామ వివరణ.
వశిన్యాది వాగ్దేవతలు చేసెడి వేదాంత విచారము, రహస్య నామాలాపము, సంగీతాలాపనము
వినుచూ వినోదించు తల్లి మన అమ్మ.
శా. *కావ్యాలాప వినోదినీ*! ప్రవిలస త్కావ్యస్వరూపంబవై
సవ్యంబౌ కమనీయ కల్పనమునన్ సద్భావనోద్భాసివై
నవ్యాంధ్రామృత రూపునన్ వెలుఁగు నిన్ నా చిత్తమందుంచుచున్
భవ్యంబౌ మహనీయ కావ్యమున నిన్ వర్ణించనీ సత్కృపన్.
614. ఓం సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవితాయై నమః.
నామ వివరణ.
కుడియెడమల లక్ష్మీ సరస్వతులచే వింజామర సేవలందుకొను శక్తి మన అమ్మ.
స్వయం కల్పిత మహాసేవిత వృత్తము.
(గణములు. జ స మ జ జ గ. యతి 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.)
*సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవితా*!
సుచేతనము నీవేగా, శుద్ధ సద్గుణ రూపిణీ!
యచేతనమె యీ దేహంబమ్మ! నీవిట లేనిచో,
ప్రచోదనము నీవేగా భక్త బంధ విమోచనీ!
శ్లో. ఆదిశక్తి-రమేయాఽఽత్మా పరమా పావనాకృతిః |
అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా || 124 ||
615. ఓం ఆదిశక్త్యై నమః.
నామ వివరణ.
అమ్మ ఆదిశక్తి. అమ్మ కంటే ముందు మరేశక్తియు లేదు.
కం. ఘనమగు ననాది శక్తివి,
కని జగతికి నాదిశక్తిగా నిను దలతున్,
వినుతింతు *నాదిశక్తీ*!
ఘనముగ జనహితము గోరి కరుణింపు సతీ!
616. ఓం అమేయాయై నమః.య
నామ వివరణ.
అంతు అనేదే లేని తల్లి మన అమ్మ.
తే.గీ. నిన్ను నెన్నఁగఁ, గొలువఁగ నిటలనేత్రు
నకె సుసాధ్యమౌనమ్మరో! నామనంబు
నిన్ను నూహింపనైనను నేరదమ్మ!
నిజమిది *యమేయ*! నిన్ గొల్తు నేర్పు మీర.
617. ఓం ఆత్మనే నమః.
నామ వివరణ.
ఆత్మ అనే పదార్థమేదయితే ఉన్నదో అది మన అమ్మయే.
కం. కొలిచెద *నాత్మా*! నిను నే
వెలయించుము నీదు రూపు ప్రీతిగ మదిలో,
కలతలు పాయఁగఁ జేయుము,
సలలిత కవితాసుధార చక్కగనిమ్మా.
ఓం అమేయాత్మనే నమః.
నామ వివరణ.
అంతు లేని ఆత్మ అనే పదార్థము ఏదయితే కలదో అది మన అమ్మయే అదే అంతులేని
పరబ్రహ్మము..
తే.గీ. జీవులందున చెలగెడి జీవమీవె
అంతు చిక్కనిదౌ యమేయాత్మ,వీవె,
ఓ *యమేయాత్మ*! నీ సేవ చేయనిమ్ము,
జీవునిన్ బ్రహ్మమందునన్ జేరనిమ్ము.
618. ఓం పరమాయై నమః.
నామ వివరణ.
ఈ జగత్తును అందముగా ప్రకాశింపఁ జేసే తత్వమే పరమ. అది మన అమ్మయే.
కం. హే *పరమా*! నినుఁ గొలిచెద,
శ్రీ పరమును గొలుపుమమ్మ! సేవింతు నినున్,
దీపించుత సజ్ఞానము
నీపయి సత్ కవనమల్లనిమ్మా, కృపతోన్.
619. ఓం పావనాకృతయే నమః.
నామ వివరణ.
పావనమయిన ఆకృతి కలిగిన తల్లి మన అమ్మ.
కం. నీ వనుపమ పావన గతి
భావించెడివారి కొసఁగి, వర్ధిలఁ గనెదే,
నీవే దిక్కని నమ్మితి,
దీవింపుము *పావనాకృతీ*! నను దయతోన్.
620. ఓం అనేకకోటిబ్రహ్మాండజనన్యై నమః.
నామ వివరణ.
లెక్కింపనలవి కానన్ని బ్రహ్మాండములను సృష్టించి అన్నిటికీ అమ్మ అయిన శక్తి మన అమ్మయే.
ఆ.వె. తల్లివమ్మ నీవు, తలఁచెద నిన్ను నే
నాత్మ శక్తి నాకు నమరఁ గొలుప
వా? *యనేక కోటి బ్రహ్మాండ జననీ*! మ
హేశ్వరీ! నిలు మది, హృద్యముగను.
621. ఓం దివ్య విగ్రహాయై నమః.
నామ వివరణ.
దివ్యమైన రమణీయ దేహము కలది మన అమ్మ.
తే.గీ. *దివ్య విగ్రహా*! కొలుతు నిన్ భవ్యమతిని,
నవ్య నవనీత కవనమై నా కలమున
నిలిచి ప్రభవింపుమమ్మరో! నేర్పుఁ గొలుపు
నిన్ను వర్ణింపఁ జేయుమా నీరజాక్షి!
కం. దెసలను తాకెడి కీరితి
నసమానవు దివ్యవిగ్రహా! నినుఁ గొలుతున్,
వసుధను శుభములఁ దేల్చుచు
రసరమ్యగ నాదు మదిని రాజిలుమమ్మా!
శ్లో. క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ |
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి-స్త్రిదశేశ్వరీ || 125 ||
622. ఓం క్లీంకార్యై నమః.
నామ వివరణ.
క్లీం అనునది కామరాజ బీజము. క్లీం శివకాముఁడు అతని అర్థాంగి శివకామేశ్వరి. క్లీంకార
స్వరూపురాలు మన అమ్మ.
కం. ఐమ్ కారీ యని తొలుతను,
హ్రీమ్ కారీ యనుచుఁ బిదప, హితముగ నిన్నున్
శ్రీమ్ కారీ యని పిలిచెద
*క్లీమ్ కారీ*! కనఁబడుమిక, క్లేశ విదూరా!
623. ఓం కేవలాయై నమః.925.
నామ వివరణ.
అన్ని రకముల ధర్మములను వదలివేయుట వలన ఒంటరిగా ఉండునది కావున మన అమ్మ
కేవలా.
కం. అక్షయ సద్యః స్ఫూర్తిని,
కుక్షికిఁ దగు భుక్తి, మహిత కోవిదుల కడన్
లక్షణ వాగ్ఝరి సచ్ఛుభ
లక్షణములు గొలుపు, *కేవలా*! నినుఁ గొలుతున్.
624. ఓం గుహ్యాయై నమః.
నామ వివరణ.
మిక్కిలి రహస్యమైనది మన అమ్మ.
కం. *గుహ్యా*! మదిలో వెలుఁగుచు
సహ్యంబులె కనఁగఁ జేసి, సత్యప్రభతో
గుహ్యంబగునవి యెఱుఁగ, న
సహ్యంబులు వీడి మనఁగఁ జక్కఁగఁ గనుమా.
625. ఓం *కైవల్యపదదాయిన్యై* నమః
నామ వివరణ.
తనను ఆరాధించుచు సాధన చేయు భక్తులకు కైవల్యమును ప్రసాదించుతల్లి మన అమ్మ.
తే.గీ. నీవె కైవల్య పద దాయినీ! ననుఁ గని
ముక్తి సామ్రాజ్య మొసఁగుమా, భక్తిగ నిను
నిత్యమర్చించు భాగ్యమున్ నిపుణతయును
గొలిపి కృపఁ జూడుమా! సతీ! కోరితి నిను.
626. ఓం త్రిపురాయై నమః.
నామ వివరణ.
ఇళ పింగళ,సుషుమ్న అను మూడు నాడులు త్రిపురములు కాగా ఈ నాడులుగా ఉండు తల్లి మన
అమ్మ.
కం. త్రిపురంబిదె నా దేహము,
విపులాత్మవు నీకు నెలవు, విరితల్ప మిదే,
*త్రిపురా*! సన్మార్గంబున
నపవర్గము జేర్చ నడుపు మనుపమ రీతిన్.
627. ఓం త్రి జగద్వంద్యాయై నమః.
నామ వివరణ.
ముల్లోకములచేత నమస్కరింపబడు తల్లి మన అమ్మ.
కం. *త్రిజగద్వంద్యా*! కొలిచెద,
సుజనుల నిల కావుమమ్మ! శోభిలఁ గనుచున్,
విజయ పథంబున నన్నున్
బ్రజ లెల్లరు మెచ్చ నడుపు ప్రాభవ మలరన్.
628. ఓం త్రిమూర్త్యై నమః.
నామ వివరణ.
మూడు సంవత్సరములు గల బాల, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు, వామ, జ్యేష్ఠ, రౌద్ర, ఇచ్ఛ జ్ఞాన
క్రియా శక్తులు, ఈ విధముగా ఉన్న త్రిమూర్త్యాత్మక స్వరూపిణి మన అమ్మ.
కం. పరమేశ్వరి! నీ పదములె
పరమావధి నాకుఁ జేరఁ బరమగు నిన్నున్,
నిరుపమ శుభదా! నన్నున్
గరుణామృతము నొలికించి కనుము, *త్రిమూర్తీ*!
629. ఓం త్రిదశేశ్వర్యై నమః.
నామ వివరణ.
దేవతలకు ఈశ్వరి, మూడు అవస్థలకు ఈశ్వరి మన అమ్మ.
కం. *త్రిదశేశ్వరి*! నా త్రిదశలు
మది నుండి రహింపఁ జేయు మాన్యవు జననీ!
సదసద్వివేక శూన్యుఁడ,
ముదమున కని జ్ఞానమిమ్ము, పూజింతు నినున్.
శ్లో. త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా |
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా || 126 ||
630. ఓం త్ర్యక్షర్యై నమః.
నామ వివరణ.
వాగ్బీజము, కామ బీజము, శక్తి బీజము, ఈ మూడింటి సమూహము త్ర్యక్షరీ. ఇదెయే మన అమ్మ.
కం. *త్ర్యక్షరి*! సన్నుత వర బీ
జాక్షరముల శక్తిఁ జూడ నమ్మా! నీదౌ
నక్షయ శక్తిత్రయమే,
రక్షింపగ నుంటివిట్లు ప్రాణాధారా!
631. ఓం దివ్య గంధాఢ్యాయై నమః.
నామ వివరణ.
అష్టవిధ దివ్య గంధములచే అలంకరింపఁబడిన అమ్మ మన లలితాంబ.
కం. మందుఁడ, నిను సేవించెద,
గంధాష్టక భాస! *దివ్యగంధాఢ్యా*! స్వ
ర్గంధాష్టకమున దివ్యులు
బంధుర గతి కొలుతురు నిను భాతిగ జననీ!.
632. ఓం సిందూర తిలకాంచితాయై నమః.
నామ వివరణ.
పాపట సిందూరముతో ఒప్పియున్న తల్లి మన అమ్మ.
తే.గీ. తలఁతు సిందూర తిలకాంచితా! మది నిను,
నిత్య సౌభాగ్య దాయినీ! నిన్ స్మరింప
దివ్య సద్భోగ భాగ్యముల్ తీరునమరు,
నిను సువాసినుల్ కొలుతురు కనుము కృపను.
633. ఓం ఉమాయై నమః.
నామ వివరణ.
ఉమాపరమేశ్వరుల సమైక్య స్వరూపము మన అమ్మ.
తే.గీ. ఉక్తికందని శివునికే శక్తివైన
నిన్ను నా మది భావించి యెన్నఁ గలన?
నిన్నుఁ బ్రార్థింతునో *యుమా*! నిరుపమమగు
భక్తి నీపైనఁ గొలుపుమా పరవశింప.
634. ఓం శైలేంద్ర తనయాయై నమః.
నామ వివరణ.
కొండలకు రాజయిన హిమవంతుని కుమార్తె మన లలితాంబ.
కం. ఈశుని బతిగాఁ బడసిన
కాశీపుర వాసివమ్మ! కను నను, దహరా
కాశ నివేశిని! కృపతో
శ్రీ *శైలేంద్ర తనయా*! వసించుము నాలో.
635. ఓం గౌర్యై నమః.
నామ వివరణ.
గౌరవర్ణముతో భాసిల్లు జనని గౌరి మన అమ్మ.
కం. *గౌరీ*! నీవే నాలో
గౌరవమును గొలుపు గుణము, కరుణను, సతమున్
పౌరుషముతోడఁ బద్యము,
లౌరా! యన వ్రాయు శక్తి ననుపమ! యిడితే?
636. ఓం గంధర్వ సేవితాయై నమః.
నామ వివరణ.
గంధర్వులచే సేవింపఁబడు తల్లి లలితామాత.
కం. కల వంటి జన్మమిది యని
కలకాలము కావుమనుచుఁ గాంక్షించుచు నేఁ
గలలోనైనను నిన్నే
తలతున్ *గంధర్వ సేవితా*! గుణ వినుతా!
శ్లో. విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ |
ధ్యానగమ్యాఽపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా || 127 ||
637. ఓం విశ్వ గర్భాయై నమః.
నామ వివరణ.
గర్భమున యావత్ సృష్టిని కలిగియున్న జనని లలితామాత.
కం. విలువలు పెంచగ నాకున్
గలమున వసియించియుండి కవితామృతమున్
జిలికెడు నా జనయిత్రీ!
కలకాలము కాచు *విశ్వగర్భా*! ప్రణతుల్.
638. ఓం స్వర్ణ గర్భాయై నమః.
నామ వివరణ.
హిరణ్యమును గర్భమునందు కల తల్లి హిరణ్యగర్భ మన అమ్మ.
కం. స్వర్ణాంధ్ర పద్య మధురిమ
కర్ణంబులఁ బడినఁ జాలు కనిపింతువు, నీ
పూర్ణాకృతిగ కృతుల నా
కర్ణించుచునుందు, *స్వర్ణ గర్భా*! ప్రణతుల్.
639. ఓం అవరదాయై నమః.
నామ వివరణ.
అనార్యులయిన అసురులను ఖండించుజనని. మెరయుచున్న దంతములు కల తల్లి
కం. దయతో వరమై చేరిన
ప్రియమగు నా తల్లివమ్మ! శ్రీకరివగు నిన్
భయభక్తులతోఁ గొలిచెద,
ప్రియమది, మరి వరము లేల? వినుమ *యవరదా*!
640. ఓం వాగధీశ్వర్యై నమః.
నామ వివరణ.
వాక్కుకు ముఖ్య దేవత మన అమ్మ.
కం. మాతా! నిరతము నాలో
ఖ్యాతిగ వాగ్విభవమగుచు ఘన సత్కృతులన్
భాతిని రచింపఁ జేయుచుఁ
బ్రీతిని గను *వాగధీశ్వరీ*! నినుఁ గొలుతున్.
641. ఓం ధ్యాన గమ్యాయై నమః.
నామ వివరణ.
నిశ్చలమయిన, ఏకాగ్రతతో కూడిన ధ్యానము చేత తెలియబడునది మన అమ్మ.
తే.గీ. *ధ్యాన గమ్యా*! సతతము నిన్ దలఁతునమ్మ!
న్యాయ మార్గంబులో నను నడుపుమమ్మ!
భావతేజంబువై కృతిన్ వరలుమమ్మ!
ముక్తిమార్గంబు చూపుమో పూజ్య జనని!
642. ఓం అపరిచ్ఛేద్యాయై నమః.
నామ వివరణ.
అమ్మ ఇటువంటిది, అమ్మ ఇంతటిది అని చెప్ప నలవి కానిది మన అమ్మ.
కం. ఆద్యంత రహితవమ్మా!
హృద్యంబుగ నిర్వచింపనెట్లగు నిన్నున్?
విద్యా వినయము *లపరి*
*చ్ఛేద్యా!* నాకొసఁగుమెలమి, శ్రీమన్మాతా!
643. ఓం జ్ఞానదాయై నమః.
నామ వివరణ.
ముక్తిప్రదమయిన మహత్తరమయిన జ్ఞానమును సాధకులకు ప్రసాదించు తల్లి మన అమ్మ.
తే.గీ. *జ్ఞానదా*! నిన్ను కొలిచి, యజ్ఞాన తిమిర
ములను బాయుదు కృపఁ జూపు పూజ్యపాద!
ప్రాణమే నీవు, నాకుండు జ్ఞాన మీవ
చింతలను బాపు, నిన్ను నిశ్చింతఁ గొలుతు.
644. ఓం జ్ఞాన విగ్రహాయై నమః.
నామ వివరణ.
జ్ఞానమే శరీరముగా ప్రభాసించు జనని మన అమ్మ.
తే.గీ. *జ్ఞాన విగ్రహా*! జగతి విజ్ఞాన మయము,
నిన్ను మది నిల్పు విజ్ఞానమున్నఁ జాలు,
ముక్తి సామ్రాజ్యమొందుట పొసఁగునమ్మ!
నాకు సుజ్ఞానదవయిన నీకు నతులు.
కం. అజ్ఞాన తిమిర వర్తిని,
యజ్ఞానము *జ్ఞాన విగ్రహా* పాపుసతీ!
అజ్ఞానంబును బాపిన,
సు,జ్ఞానద! నిన్ భజింతు.శోభిలనిమ్మా.
శ్లో. సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ |
లోపాముద్రార్చితా లీలాక్లప్తబ్రహ్మాండమండలా || 128 ||
645. ఓం సర్వ వేదాంత సంవేద్యాయై నమః.
నామ వివరణ.
వేదాంత స్వరూపములయిన ఉపనిషత్తులలో తెలియఁబడునది మన అమ్మ.
తే.గీ. *సర్వ వేదాంత సంవేద్య*! గర్వహారి!
సర్వ వేదాశ్రయవు, నిన్ను నిర్విరామ
ముగ భజించు సద్భాగ్యంబు నగణిత గుణ!
కలుగఁ జేయుము మది నిల్చి, కమల నయన!
646. ఓం సత్యానందస్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
నిత్య సత్యమే, ఆనందమే స్వరూపముగా కల తల్లి మన అమ్మ.
కం. నిరుపమ *సత్యానంద
స్వరూపిణీ*! నీ పదయుగ సంస్మరణమదే
తరగని నిత్యానందము
వరముగ నా కమరఁ జేయు పరమును గొలుపున్.
647. ఓం లోపాముద్రార్చితాయై నమః.
నామ వివరణ.
శ్రీవిద్యోపాసకాగ్రేసరులయిన పన్నెండు మందిలో ఒకరయిన లోపాముద్రచే అర్చించఁబడిన తల్లి
మన అమ్మ.
కం. శ్రీ పాదపద్మ జననీ!
కోపాదులఁ బాపి సుగుణకోవిదునిగ నన్
నాపై దయతోఁ జేయుము,
*లోపాముద్రార్చితా*! కొలుతు మది నిన్నున్.
648. ఓం లీలాక్లుప్త బ్రహ్మాండమండలాయై నమః.
నామ వివరణ.
ఎట్టిశ్రమయూ అవసరము లేక లీలావిలాసముగా ఈ బ్రహ్మాండాన్ని ఏర్పరచు తల్లి మన అమ్మ.
కం. బ్రాహ్మీ! నినుఁ గను త్రోవల్
జిహ్మాత్ము లెఱుంగలేరు *లీలాక్లుప్త
బ్రహ్మాండమండలా*! యీ
బ్రహ్మము నీవే, మదిన్ బ్రవర్ధిలు సతమున్.
శ్లో. అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా |
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా || 129 ||
649. ఓం అదృశ్యాయై నమః.
నామ వివరణ.
చూడనలవి కానిది జనని మన అమ్మ.
తే.గీ. దృశ్యమానవు కావో *యదృశ్య*! నీవు?
జ్ఞాన నేత్రంబునొసఁగు మజ్ఞాన తిమిర
హారిణీ! నిను గనుశక్తి నమరనిమ్ము.
యిమ్ముగా నాకుఁ గనిపింపుమమ్మ! నీవు.
650. ఓం దృశ్య రహితాయై నమః.
నామ వివరణ.
దృశ్యమే లేని జనమి మన అమ్మ.
తే.గీ. *దృశ్య రహితా*! కనఁగ నీ వదృశ్య శక్తి
వమ్మ! నీ శక్తి నే గాంతునమ్మ! జ్ఞాన
దృష్టి నీ విమ్ము కృప తోడఁ దుష్టిఁ గొలుపు
మమ్మ! నా వందనములు చేకొమ్మ జనని!
651. ఓం విజ్ఞాత్ర్యై నమః.
నామ వివరణ.
విశేషముగా తెలియఁబడు తల్లి మన అమ్మ.
కం. *విజ్ఞాత్రీ*! నీ నామం
బజ్ఞానము పాపు నిల, మహత్వము గల నీ
సుజ్ఞాన రూప దర్శన
విజ్ఞానము గొలుపు మీవె ప్రీతిని నాకున్.
652. ఓం వేద్య వర్జితాయై నమః.
నామ వివరణ.
తెలుసుకొన వలసినది అంటూ లేని తల్లి మన అమ్మ.
తే.గీ, నీవు సర్వజ్ఞవమ్మరో!, నిరుపమాన
*వేద్య వర్జితా*! నిన్ను నే విపుల జగతిఁ
గనుచు నుంటిని కనిపించు గగనమందు,
నాత్మలో వెల్గు నాయంతరాత్మయందు.
653. ఓం యోగిన్యై నమః.
నామ వివరణ.
ఐక్యభావము ఉన్న తల్లి. ఐక్య రూపమును ఇచ్చే తల్లి మన అమ్మ.
కం. జ్ఞాతయు జ్ఞాన జ్ఞేయము
లే తప్పకొకటి యగుటదియే యోగమగున్,
నా తపన మదియె *యోగిని*!
భాతిగ తద్యోగ మమరఁ బరచుము నాకున్.
654. ఓం యోగదాయై నమః.
సాధకులకు లేనిదానిని సంభవింపఁ జేయు యోగమును ఇచ్చు తల్లి మన అమ్మ.
నామ వివరణ.
చం. హృదయములందు నిల్చి బలహీనతలన్ దొలగించు *యోగదా*!
సదయను భక్తి భావమును సన్నత రీతి నొసంగు మమ్మ, నీ
పదముల నెన్నుచున్ సతము భక్తిని మానస పూజ చేసినన్
బదిలము ముక్తి మార్గమని పావను లెన్నుచు నిన్ భజింతురే.
655. ఓం యోగ్యాయై నమః.
నామ వివరణ.
సాధకునిలో ఫలితమును అనుభవించుటకు ఉన్న అర్హత రూపమున ఉన్న తల్లి. యోగ్య మన
అమ్మ.
శా. ఆనందప్రద యోగ కల్పనమునే యాహా యనన్ గొల్పి, నా
కానందామృతమందఁ జేయు జననీ! యల్పుండ, నేన్, యోగ్య! నీ
వే నన్నున్ గృపఁ జూడగా వలయు, నన్ సృష్టించి తీవే కదా,
నీ నామస్మరణైక పుణ్య ఫలమే నిత్యంబు కల్పింపుమా.
తే.గీ. *యోగ్య*! శాశ్వత సుఖద సద్యోగ మరసి
భక్తులకు నిచ్చు తల్లివి, భద్రమదియే,
శాశ్వ తానంద యోగము సరగున నిడి
ముక్తి గొల్పుమా నాకు సన్ముక్తిద వయి.
656 ఓం యోగానందాయై నమః.
నామ వివరణ.
జీవాత్మ పరమాత్మలో ఐక్యమగునట్లు చేయు యోగమునందమున ఉన్న ఆనంద స్వరూపిణి మన అమ్మ.
శా. ఆనందామృతరూపిణీ! భగవతీ యానందదా! దివ్య *యో
గానందా*! శుభదా! మహత్తర సతీ! యార్యా! పరా! పాహిమామ్.
నీ నామస్మరణంబె మంగళములన్ నిత్యంబు కల్గించు నే
నీ నామంబు మనంబునన్ బలికెదన్, నిత్యంబు నన్ గావుమా.
తే.గీ. మహిత సద్యోగ దాయినీ మాకు నీవు
శాశ్వతానంద యోగము చక్కగ నిడి
యోగ వయిన *యోగానంద*! యోగ ఫలము
గా మహానందరూపిగా కలిగి తీవె..
657. ఓం యుగంధరాయై నమః ౬౫౭వ నామము.
నామ వివరణ.
యుగములకు మూలమయిన కాలచక్రమును ధరించు తల్లి యుగంధర మన అమ్మ.
ఉ. చిత్తమునందునున్న వర చిన్మయ రూపిణి శ్రీ *యుగంధరా*!
మత్త గజంబు మానసము మత్తిలి స్వేచ్ఛఁ జరించుచుండె నా
మత్తును బాపుమమ్మరొ కుమారుని నన్నిక చేరఁదీసి యీ
తత్తరపాటుఁ బాపి నిను దర్పము వీడి భజింపనిమ్మిలన్.
శ్లో. ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ |
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ || 130 ||
658. ఓం ఇచ్ఛాశ్డక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాయై నమః.
నామ వివరణ.
గుణత్రయ స్వరూపిణి మన అమ్మ.
స్వయం కల్పిత శక్తి ప్రభ వృత్తము.
గణములు ...మ మ య య ర ర గ...యతి 10వ అక్షరము.ప్రాస నియమము కలదు,
శ్రీ *యిచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపా*! నమస్తే.
నీ యీ శక్తుల్ గాంచంగ నెట్లేని యత్నించంగనిమ్మా భవానీ!
మాయామోహాదుల్ నన్నుఁ జేరన్ మహిన్ నీవే కృపన్ బాపుమమ్మా.
నీయాజ్ఞా వర్తిన్ గాన నీశాని! నన్నున్ గావు మీవే సతంబున్
659. ఓం సర్వాధారాయై నమః.
నామ వివరణ.
సమస్త సృష్టికీ ఆధారమయినది మన జగన్మాత.
కం. శర్వుని సృష్టిని సర్వము
నిర్వక్రముగా సతంబు నిర్వహణకునై
సర్వాధారంబయితివి,
*సర్వాధారా*! నమామి సన్నుత జననీ!
660. ఓం సుప్రతిష్ఠాయై నమః.
నామ వివరణ.
సాధకులయొక్క గొప్ప ప్రతిష్ట యనునది అమ్మయే.
తే.గీ. *సుప్రతిష్ఠా*! జగద్వంద్య! శుభము లొసఁగు
జనని వీవమ్మ! నీ కృపన్ జయ పథమున
సత్ ప్రతిష్ఠను సాధింప సాధ్యమగును.
దయను గనుమమ్మ మ్రొక్కెదన్, భయవిదూర!
661. ఓం సదసద్రూప ధారిణ్యై నమః.
నామ వివరణ.
సత్తయిన బ్రహ్మమును, అసత్తయిన జగత్తు అన్నిటి యొక్క రూపమును ధరించిన జనని మన అమ్మ.
తే.గీ. కనఁగ సదసద్ స్వరూపముల్ కలిగి యుండి
ధర్మ సన్మార్గ గాములఁ దలచి శుభము
గొలుప దుర్గతి నణతువు కూర్మినద్రి
జ! *సదసద్రూపధారిణీ*! జయము నీకు.
శ్లో. అష్టమూర్తి-రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ |
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా || 131 ||
662. ఓం అష్ట మూర్తయే నమః.
నామ వివరణ.
పంచ భూతములు, సూర్యచంద్రులు, యజ్ఞ దీక్షితుడు అను అష్టమూర్తులు మన లలితా మాతయే.
తే.గీ. *అష్ట మూర్తీ*! స్మరింప నిన్ కష్టచయము
లంతరించును, నాలోన సాంత మీవె
దృష్టి పెట్టుచు వసియింప నష్టమేమి?
అష్టకష్టముల్ దూరమై యలరఁ గలను.
663. ఓం అజాజైత్ర్యై నమః.
నామ వివరణ.
పుట్టుకయే లేనిది. అష్టమూర్తులూ ఈ తల్లియే అయియున్నను జీవులకుండు షడ్భావ వికారాలు
లేని తల్లి కావున అమ్మ అజా అని ప్రసిద్ధి పొందినది.
కం. జితమాయ వజాజైత్రీ!
క్షితియే యొక మాయ నిట వసించుచు మాయన్
మతిఁ గలిగియు గెలుచుటగునె?
మితి మీరిన బరువు, తలచి మేలుఁ గొలుపుమా.
ఓం అజాయై నమః. 866.
నామ వివరణ.
పుట్టుకయే లేనిది. అష్టమూర్తులూ ఈ తల్లియే అయియున్నను జీవులకుండు షడ్భావ వికారాలు
లేని అవిద్యను అజ్ఞానమును జయించిన తల్లి కావున అమ్మ అజాజైత్ర్య అని ప్రసిద్ధి పొందినది.
కం. పుట్టుట లేని *యజా*! మన
సెట్టుల నీపైన నిలిపి యిహపరములకై
పట్టుగఁ బ్రార్థింపనగున్?
గుట్టుగనాలోనె నీవుకొలువుండు సతీ!
ఓం జైత్ర్యై నమః. 664,
నామ వివరణ.
అవిద్యను అజ్ఞానమును జయించినది మన అమ్మ.
కం. *జైత్రీ*! నీ నామమె తా
పత్రయ విముఖునిగఁ జేసి భక్తినొసఁగి, నీ
పుత్రుని యవిద్యఁ బాపును,
క్షేత్రజ్ఞునిగనొనరించు క్షేమము గొలుపున్.
664, ఓం లోకయాత్రావిధాయిన్యై నమః.
నామ వివరణ.
పదునాలుగు లోకములను సృష్టి స్థితి లయ లనబడే యాత్రను చేసే స్వభావము ఉన్న జనని మన
అమ్మ.
తే.గీ. *లోకయాత్రావిధాయినీ*! లోకమునకు
సృష్టియున్, స్థితి లయములన్ జేయు యాత్ర
లక్ష్యముగఁ గల్గి నడిపించు శ్లాఘనీయ!
వందనంబులు చేసెద నందుకొనుము.
665. ఓం ఏకాకిన్యై నమః.
నామ వివరణ.
తనకు ఎవరూ లేని ఏకాకి మన అమ్మ.సృష్టి మొత్తమంతయూ మన అమ్మయే తప్ప వేరెవరూ లేని
జనని.
తే.గీ. నీదు సృష్టి *యేకాకినీ*! నిఖిల జగతి,
కలవు నీవే మరేదియుఁ గలుగ దరయ,
ముక్తి మార్గంబు నీవే, విముక్తి నాకుఁ
గలుగఁ జేయుమా కృపఁ జూపి కనక దుర్గ!
666. ఓం భూమ రూపాయై నమః.
నామ వివరణ.
భూమము అనగా పరబ్రహ్మము. సర్వాధార రూపము. అది మన అమ్మయే.
తే.గీ. *భూమరూపా*! నినున్ నమ్మి, పూజఁ జేసి,
నిరుపమానందమును బొంద నేర్పు మీర
బ్రహ్మమున జీవమున్ జేర్చి వరలఁ గనుదు,
నాదు కోరిక నెరవేర్చు నీదు కృపను.
667. ఓం నిర్ద్వైతాయై నమః.
నామ వివరణ.
ద్వైత భావమనునది లేని నిర్ద్వైత మన అమ్మ.
తే.గీ. సాటియే లేని *నిర్ద్వైత!* సత్ప్రభాస!
నీదు పాదంబులకు మ్రొక్కనీ మదంబ!
భక్తి భావంబు నాలోనఁ బ్రబలఁ జేసి,
శక్తి కొలది నీ సేవను సలుపనిమ్ము.
668. ఓం ద్వైత వర్జితాయై నమః
నామ వివరణ.
జీవాత్మ పరమాత్మ అను ద్వైత భావమును విడిచిపెట్టిన ద్వైత వివర్జిత మన అమ్మ.
ఉ. ఆ వర జీవ శక్తి, పరమాత్మ మహద్వర శక్తి వేరుగా
భావన చేయుచుండుదు రవారితరీతిని కొంద రిద్ధరన్,
నీవెగ రెండునున్, గృపను నిల్చి మమున్ గను *ద్వైత వర్జితా*!
ప్రోవుచు వెల్గుమా మదుల బుద్ధిని గొల్పుమ నీ పయిన్ సదా.
శ్లో. అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ |
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా || 132 ||
669. ఓం అన్నదాయై నమః. 670.
నామ వివరణ.
జనులకు జీవులకు అన్నమును దయచేయు తల్లి మన అమ్మ.
మత్త కోకిల.
*అన్నదా*! మము గన్న తల్లివి హాయిగా బ్రతుకంగ మా
కన్నమున్ లభియింపఁ జేయుచు నన్నదాతగ నిల్చితే,
నిన్ను మానసమందు నిల్పి గణింప నేర్వని మా పయిన్
మన్నననంబున బ్రేమఁ జూపుచు మాకునన్నద వైతివే.
670. ఓం వసుదాయై నమః..
నామ వివరణ.
వసువు అనగా ధనము. ధనమును ధరించియుండు తల్లి. సమస్థ ధనములు అమ్మయే. కావున
వసుధా మన అమ్మయే..
శా. నిత్యానిత్య ప్రశస్త దివ్య *వసుదా*! నిత్యప్రశాంతిప్రదా!
నిత్యంబీవె యనిత్యమౌ జగతిలో నీరేజ పత్రేక్షణా!
సత్యంబీవె కనంగఁ జేయుము గృపన్, సచ్ఛీలదా! నిత్య మౌ
న్నత్యంబున్ వర భావనన్ గొలిపి సన్మార్గంబునన్ నిల్పుమా.
671. ఓం వృద్ధాయై నమః.
నామ వివరణ.
వృద్ధి చెందినది, అందరికన్నా పెద్దది, వృద్ధికి కారణభూతురాలు మన అమ్మ.
ఉ. సృష్టికిఁ బూర్వమే కలవు, వృద్ధవు నీవు జగత్ప్రసిద్ధవున్,
స్పష్టము, సర్వ సృష్టియును సాధ్యము నీదు దృగంచలప్రభన్,
దృష్టిని బెట్టి చూచినను దేజము నీవయితోచుచుందువే.
దృష్టిని నీపయిన్ నిలిపి తీరుదునమ్మరొ! *వృద్ధ*! భక్తితోన్.
672. ఓం బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః
నామ వివరణ.
జీవబ్రహ్మైక్య స్వరూపము మన అమ్మయే.
కం. నిరుపమ *బ్రహ్మాత్మైక్య
స్వరూపిణీ*! వందనములు వరలుము మదిలో
నరయగ బ్రహ్మము నాత్మయు
వరలగవలె నొకటి యగుచు వరలింపు మదిన్.
673. ఓం బృహత్యై నమః.
నామ వివరణ.
మిక్కిలి గొప్పది, ఇంతకన్నా యేదియు గొప్పగా లేనంతగా తానే గొప్పగా వరలుచున్న తల్లి మన
అమ్మ.
మ. *బృహతీ*! సృష్టి ననన్యవీవె కనఁగాఁ, బ్రీతిన్ బృహద్రూపమం
దిహమున్ సత్ పరభాగ్యదానగుణమందీర్ష్యాదులం ద్రుంచుటం
దహమున్ బాపుటయందు నీకు సరిలే రమ్మా! కృపాంభోనిధీ!
మహిమన్ జూపి దురాత్ములన్ దునిమి క్షేమంబిమ్ముభూ మాతకున్.
674. ఓం బ్రాహ్మణ్యై నమః
నామ వివరణ.
శ్రీచక్రార్చనలో అర్చింపఁబడు సుమంగళి బ్రాహ్మణి, మన అమ్మయే.
ఉ. బ్రాహ్మణధర్మ పూర్ణుఁడగు భక్త శుభంకరు శంభురాణి! స
*ద్బ్రాహ్మణి*! నీ పదద్వయము భక్తులపాలిటి కల్పవల్లి, యా
బ్రహ్మయు నీ కృపన్ జగతి వర్ధిల సృష్టిని జేయఁ గల్గు, నన్
బ్రాహ్మణ ధర్మ బద్ధునిగ వర్ధిలఁ జేయ నమస్కరించెదన్.
675. ఓం బ్రాహ్మ్యై నమః.
నామ వివరణ.
సత్యము, నిత్యము అయి ఈ జగత్తును నడుపుచున్న బ్రాహ్మి మన అమ్మ.
శా. శ్రీమంతంబుగ బ్రహ్మ నీ కరుణచే సృక్కార్యమున్ దీక్షతో
నీమంబొప్పఁగఁ జేయుచుండును సదా! నీ శక్తి మూలంబుగా
క్షేమంబొప్పఁగఁ బార్వతీపతియు నా శ్రీవల్లభుండున్ విధుల్
శ్రీమద్ *బ్రాహ్మి*! యొనర్చుచుందురు. మహచ్ఛ్రీబ్రహ్మమీవే కనన్.
676. ఓం బ్రహ్మానందాయై నమః.
నామ వివరణ.
సాధకులు సాధించు సాధనా ఫలమగు బ్రహ్మానందమే మన అమ్మ.
తే.గీ. అనుపమానందమయ కోశమందు వెలుఁగు
పూర్ణ తేజ! *బ్రహ్మానంద*! పూజలంది
సంతతానందమును గూర్చి శాంతినిమ్ము
మాయఁ దొలగించి నన్ గావుమా! ప్రపూజ్య!
677. ఓం బలిప్రియాయై నమః.
నామ వివరణ.
ఆత్మజ్ఞాన సాధనలో అజ్ఞానమును అరిషడ్వర్గమును బలిగా యిచ్చినవారియెడ ప్రీతి కలది మన
అమ్మ
చం. జయములు గూర్చి భక్తులను జక్కగఁ బ్రోచెడి సత్ స్వరూపిణీ!
నయ శుభ దివ్య వర్తను లనారతమున్ బలియిత్తు రీకు దు
ర్నయ దురహంకృతంబు లను నాథహరి వ్రజమో *బలిప్రియా*!
ప్రియముగ నిన్నుఁ గొల్చెదము విశ్వ శుభంకరి! మమ్ము బ్రోవుమా.
శ్లో. భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా |
సుఖారాధ్యా శుభకరీ శోభనాసులభాగతిః || 133 ||
678. ఓం భాషారూపాయై నమః.
నామ వివరణ.
భావనాప్రకటనము చేయు భాష యేదయితే ఉన్నదో ఆ భాష మన అమ్మ.
శా. శ్రీరమ్యాక్షర భావ రూప జననీ! జీవాళి భావప్రభల్
నీ రమ్యాకృతియే కదా, కనుగొనన్ నీవే కదా భాషలన్,
గారుణ్యాలయ నిండి యుందువు మమున్ గావంగ నో రమ్య *భా
షారూపా*! నినుఁ గొల్తుమమ్మ మదిలో సద్భాషణోద్భాసితా!.
679. ఓం బృహత్సేనాయై నమః.
నామ వివరణ.
అపారమయిన సేనా సమూహము కలది మన అమ్మ.
శా. శ్రీమన్మంజుల వేద శాస్త్రములునా చిద్బోధనా గ్రంథముల్,
నీమంబొప్పగ నీకు సేన, మదిలోనే నిల్చునీ దుష్టులౌ
కామాది ప్రతి వీర శత్రుగణమున్ ఖండింప నీవుంటివే,
శ్రీమన్మంగళ కార్య శోభిత *బృహత్ సేనా*! నమో వాకముల్.
680. ఓం భావాభావవివర్జితాయై నమః.
నామ వివరణ.
భావములకు అభావములకు అతీతముగా ఉండు తల్లి మన అమ్మ.
శా. భావంబుల్ ధర సత్యముల్ భువి నభావంబుల్ గనన్ మృగ్యముల్,
భావాభావ విదూరవమ్మ జననీ! భావింపగా నీవిలన్,
నీవే నిత్యము సత్యమున్ జగతిలో, నీవే స్థిరం బెన్నగా,
*భావాభావవివర్జితా*! ప్రణతులంబా! నీకు, నన్ బ్రోవుమా.
681. ఓం సుఖారాధ్యాయై నమః.
నామ వివరణ.
భక్తులచే సుఖముగా కష్ట రహితముగా ఆరాధింపఁబడు తల్లి మన అమ్మ.
శా. శ్రీవిద్యాపరతంత్ర చిత్త నిలయా! శ్రీమన్మనో యజ్ఞమున్,
సేవల్ మానసమందుఁ జేయఁ గృపతోఁ జిత్తంబులో నిల్చి మా
భావంబందు రహింతు వీవు సతము.న్ బ్రఖ్యాతిగా శాంభవీ!
రావమ్మా! కృపతోడ నుండగ. *సుఖారాధ్యా*! మనోబ్జంబునన్.
682. ఓం శుభకర్యై నమః.
నామ వివరణ.
సాధకులకు నిరంతరమూ శుభములు కలిగించునది మన అమ్మ.సశ్రీచక్రోపాసనలో నిరంతరమూ
సాధకులకు శుభ ఫలితములనే చేకూర్చుచు మంగళప్రదగా ఉండు జనని లలితాంబ.
చం. నయగుణ వర్తనంబులననారతమున్ జరియింత్రు సజ్జనుల్
ప్రియముగ నిన్నుఁ గొల్చుచు చరించుచునుండుటఁ జేసి ధాత్రి, ని
ర్భయము, సుశీలమున్, జయము, భాగ్యము గల్గును, నేను నమ్ముచున్,
బ్రియమునఁ గొల్తు నిన్ *శుభకరీ*! శుభవర్తిగ నన్ను నిల్పుమా.
683. ఓం శోభనాసులభాగత్యై నమః.
నామ వివరణ.
మన తల్లి శుభములనిచ్చెడి తల్లి, భక్తులచే సులభముగా పొందఁబడు జనని.
మ,కో. శ్రీపరా! మదిఁ జేరఁగా నిను చేయు భక్తుఁడు సాధనన్
బ్రాపితంబగు నీ కృపన్ గన భవ్యమౌ పురుషార్థముల్.
నీ పదాంబుజ సేవయే వరణీయ శోభను గొల్పెడున్,
చూపుమా కృప నా పయి న్వర శోభనా *సులభాగతీ*!
శ్లో. రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |
రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా || 134 ||
684. ఓం రాజరాజేశ్వర్యై నమః..
నామ వివరణ.
రాజులు, మహారాజులు, చక్రవర్తులు, యక్షకిన్నర గంధర్వకింపురుషాదులకు
దేవతలకూ ఈశ్వరి మన అమ్మ.
శా. శ్రీవారాణసి విశ్వనాథు సతివౌ శ్రీమద్విశాలాక్షిగా
నీ వారిన్ బతితోడఁ గాచెదవుగా నిష్ఠన్ సదా ప్రేమతో,
నీవే మాకిల దిక్కు నమ్మితిమి నిన్నే మమ్ము కాపాడుమా.
జీవన్ముక్తికి మార్గమీవె జననీ శ్రీ *రాజ రాజేశ్వరీ*!
685. ఓం రాజ్యదాయిన్యై నమః.
నామ వివరణ.
రాజ్యమును ప్రసాదించునదియు, స్వర్గ సామ్రాజ్యదాయినియును మన అమ్మ.
కం. నా కానందపు సామ్రా
జ్యాకాంక్షను తీర్చుమ, పరమానందముతో
నే కవితామృత ధారగ
నీ కరుణన్ *రాజ్యదాయినీ*! రచియింతున్.
686. ఓం రాజ్యవల్లభాయై నమః.
నామ వివరణ.
సమస్త రాజ్యములకూ ప్రభ్వి మన అమ్మ.
చం. జగతి కనంత శక్తి యుత సన్నుత ప్రభ్వివి *రాజ్య వల్లభా*!
ప్రగణిత సత్యపాలన నిరంతర ధర్మము తోడ నొప్పగా,
నగణిత దుష్ట నాశినివనంత! రహింపుము దేహమందు, నిన్
దగిన విధంబుగా నుడువ నాకు వశంబొకొ? అంజలించెదన్.
687. ఓం రాజత్కృపాయై నమః.
నామ వివరణ.
ప్రకాశించు దయ గల తల్లి మన లలితామాత.
మ. శివ సాన్నిధ్యమునన్ ప్రభాకలిత సచ్ఛిద్రూపివై వెల్గుచున్
భవ బంధంబులు వీడఁ జేయు జననీ! ప్రార్థింతు *రాజత్కృపా*!
భువిపై జీవుల నెల్లవేళలఁ గృపన్ బోషించుచున్, గాచుచున్
స్తవనీయంబుగ శోభఁ గూర్చుదువుగా సద్రూపిణీ! శాంభవీ!
688. ఓం రాజపీఠ నివేశిత నిజాశ్రితాయై నమః. 689.
నామ వివరణ.
రాజులు కూర్చొనెడి సీంహాసనమున తననాశ్రయించినవారిని ఉంచు తల్లి మన
అమ్మ.
సీ. ప్రఖ్యాతవైనట్టి *రాజపీఠ నివేశిత నిజాశ్రితా*! నిలు మనసు నందుఁ,
ద్రికరణశుద్ధిగాఁ బ్రకటించగలయట్టి భక్తిప్రపత్తులఁ బ్రబలనిచ్చి,
యకళంకమైనట్టి యనుపమ భక్తిసా మ్రాజ్యాధినేతగా మలచు నన్ను,
నీవె నేనను గణనీయ సద్భక్తియే ప్రబలమై నాలోన వరలనిమ్ము.
తే.గీ. వ్యర్థ భాషణా దూరులై వరలఁ జేసి
సార్థకత జన్మకబ్బగాసౌమ్య గతిని
బోధ కల్పించి జనులెల్ల శోధనమున
నిన్ను గనునట్లు చేయుమా మన్ననముగ.
శ్లో. రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ |
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా || 135 ||
689. ఓం రాజ్యలక్ష్మ్యై నమః. 690.
నామ వివరణ.
రాజ్య స్వరూపమున ఉండు తల్లి మన అమ్మయే కావున అమ్మ రాజ్యలక్ష్మి.
శా. యావత్ సృష్టికి మూలమీవెగ, యమేయానంద సామ్రాజ్య ల
క్ష్మీ! వర్ధిల్లగ చేయు తల్లివి కదా, శ్రీ *రాజ్యలక్ష్మీ*! మమున్
నీ వాత్సల్యమె మాకుఁ బ్రాణము, భవానీ! యాత్మలో జ్యోతివై
భావాతీత మనోజ్ఞ సంతసముతో వర్ధిల్లఁగాఁ జేయుమా.
690. ఓం కోశనాథాయై నమః. 691.
నామ వివరణ.
సృష్టిలోనున్న కోశాగారములకధిపతి మన అమ్మ. కోశనాథాస్వరూపిణి మన అమ్మయే.
చ. అనుపమ! *కోశనాథ*! నిగమాంత సువేద్యవు, నీవె కల్గుదే
యనితర రీతినన్నిటఁ బ్రియంబున మమ్ము రహింపఁజేయు ని
న్ననయము చిత్తమందు పరమార్థమునెంచి భజింతుమమ్మ, వం
దనములు స్వీకరింపుమ, ముదంబున మా మదులందు వెల్గుమా.
691. ఓం చతురంగబలేశ్వర్యై నమః.. 692.
నామ వివరణ.
రథ, గజ, తురగ, పదాతిదళములు చతురంగబలములు. ఈ అన్నింటికీ అధిపతి మన అమ్మయే.
చం. మనుటయె కష్టమాయెనిట మానవ కోటికి దుర్జనాళిచేఁ,
గన బ్రతుకాయె దుర్భరము, కష్టములన్ భరియింప లేక, నే
నిను మది నిల్పి కోరెదను నీ పరిరక్షణఁ, గావుమీవె, యో
యనుపమ లోకమాత! *చతురంగబలేశ్వరి*! పాపు దుష్టులన్.
692. ఓం సామ్రాజ్యదాయిన్యై నమః. 693.
నామ వివరణ.
రాజాధిరాజులకు సామ్రాజ్యమునొసగు తల్లి. భక్తిసామ్రాజ్యమును సాధకచక్రవర్తులకు
దయచేయు తల్లి మన అమ్మ.
కం. అరయగ నాత్మజ్ఞానము
సరగున సద్యోగ మోక్ష సామ్రాజ్యంబుల్
కరుణను భక్తుల కొసఁగెడి
నిరుపమ! *సామ్రాజ్యదాయినీ*! వందనముల్.
693. ఓం సత్య సంధాయిన్యై నమః. 694.
నామ వివరణ.
సత్యమును అతిక్రమింపని ప్రతిజ్ఞ కలది అమ్మ.
శా. చిత్తంబందున సత్యమున్ నిలుపుమా, శ్రీ *సత్యసంధాయినీ*!
మత్తున్ గొల్పెడివాని కన్నిటికిఁ బ్రేమన్ నన్ నిరోధింపుమా.
చిత్తంబందున సత్య రూపమున భాసింపంగ నిన్ గోరెదన్,
సత్తేజంబును గొల్పి భక్తులను ధీశాలీ! కృపన్ బ్రోవుమా.
694. ఓం సాగరమేఖలాయై నమః. 695.
నామ వివరణ.
సర్వ వ్యాపియైసాగరములను మొలత్రాడుగా కల తల్లి మన అమ్మ.
ఉ. యోగము నిన్ గనుంగొను మహోత్తమ భాగ్యము భక్త కోటికిన్,
రాగ విదూరులెల్లఁ దనరారుదు రమ్మరొ! నిన్నుఁ గాంచుచున్,
మా గమనంబు నెల్లెడ సమంచిత రీతిని సాగనిచ్చుచున్,
*సాగర మేఖలా*! నుత ప్రశాంతిని మాకు ననుగ్రహింపుమా.
శ్లో. దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ |
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ || 136 ||
695. ఓం దీక్షితాయై నమః. 696.
నామ వివరణ.
సాధకులకు దీక్షనొసంగి దీక్షితులకు గురువుగా ఉండు తల్లి మన అమ్మ.
శా. ఆనందామృత మీయ భక్తులకు బ్రహ్మజ్ఞానమున్ గొల్పగా,
జ్ఞానాంభోనిధి! *దీక్షితా*! మనమునన్ గాంక్షించి దీక్షించితే,
నేనున్ నీ పద సేవకుండ, కనుమా, నీవే ననున్ బ్రోవుమా,
నీ నామ స్మరణంబె జ్ఞానము నిడున్, నిత్యంబు చేయించుమా.
696. ఓం దైత్య శమన్యై నమః. 697.
నామ వివరణ.
దైత్యులను నశింపఁజేయు తల్లి మన అమ్మ.
చం. కరుణను సద్గుణంబులను గావుము నా యెడనుండి నీవు, నా
పరువును దీయు దుర్గుణ మవారిత రీతి నశింపఁ జేయుమా.
సురుచిర భావ సంపదను శోభిలునట్టుల నన్ను జేయుమా,,
నిరుపమవైన *దైత్య శమనీ*! నినుఁ గొల్చెద నమ్మ, భక్తితోన్.
697. ఓం సర్వలోకవశంకర్యై నమః. 698.
నామ వివరణ.
సర్వ లోకములను వశము చేసుకొనిన తల్లి మన అమ్మ.
తే.గీ. అమ్మ! నీ పాద సంసేవనమ్ము సేయ
నాత్మ నీవశమై యుండునమ్మ సతము,
ధర్మ సమ్మత జీవనంబర్మిలినిడు
*సర్వ లోక వశంకరీ*! శరణు శరణు.
698. ఓం సర్వార్థదాత్ర్యై నమః. 699.
నామ వివరణ.
సమస్తమయిన అర్థములను ప్రసాదించు తల్లి మన అమ్మ.
మ. నిను సేవించగ ధర్మమార్గము గనన్ నీవే కృపన్ గొల్పుదే,
కన నిన్నున్ మది దివ్య భక్తియుతమౌ జ్ఞానంబునే గొల్పెదే,
ఘన ముక్తిప్రద కామమున్, మహిత మోక్షంబున్ బ్రసాదింతువే,
క్షణ కాలమ్ము కనంగ నిమ్ము నినునో *సర్వార్థధాత్రీ*! నతుల్.
699. ఓం సావిత్ర్యై నమః700.
నామ వివరణ.
సవితృని అనగా సూర్యుని ప్రకాశింపఁ జేయునది సావిత్రి.
శా. *సావిత్రీ*! పరదేవతా! బుధ నుతా! శాంత స్వరూపా! నతుల్,
నీవే తేజ మొసంగుచుంటివి భవానీ! సూర్యుఁ డుప్పొంగగా
నీవే శక్తివి దేవతాళికి, శుభానీకంబులన్ సత్ కృపన్
నీవే కొల్పుచు నన్ను బ్రోతువు కదా, నిన్ గొల్చెదన్ భక్తితోన్.
700. ఓం సచ్చిదానంద రూపిణ్యై నమః. 701.
నామ వివరణ.
సత్తూ, చిత్తూ తానయి ఆనందరూపమున ఉన్న తల్లి మన అమ్మ.
తే.గీ. సత్య సన్మార్గములను బ్రశాంతినొసఁగి,
దివ్య చిన్మార్గమును జూపు దేవివీవు,
నిరుపమానందదాయినీ! నీకు నతులు,
*సచ్చిదానంద రూపిణీ*! శంభురాణి!
శ్లో. దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ |
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ || 137 ||
701. ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః. 702.
నామ వివరణ.
దేశము చేత కాని కాలము చేత కాని కొలవబడనిది, ఎల్లలు లేనిది, కాలము లేనిది తల్లి మన అమ్మ.
తే.గీ. దేశ పరిధియే లేనట్టి దేవి వీవె,
కనఁగ నాద్యంతములు లేని కాలమీవె,
శాశ్వతంబైన సత్య మో జనని! నీవె,
*దేశకాలాపరిచ్ఛిన్న*! యీశు పత్ని!
702. ఓం సర్వగాయై నమః. 703.
నామ వివరణ.
హద్దులు లేని సర్వాంతర్యామి మన అమ్మ.
తే.గీ. దేశ కాలాపరిచ్ఛిన్న దేవివీవ
సర్వగవు, నిన్నుఁ గొలిచెద గర్వముగను,
నీదు భక్తుఁడనగుటను నిరుపమాక్షి!
*సర్వగా*! నన్నుఁ గాచెడి సౌమ్య రూప!
703. ఓం సర్వ మోహిన్యై నమః. 704.
నామ వివరణ.
అందరినీ మోహింపఁ జేయునది మన తల్లి.
మ. అనయంబున్ వసియింతు వీవచట మూలాధార త్రైలోక్య మో
హన చక్రంబున సర్వ మోహినిగఁ బ్రాపై ప్రోవగా *సర్వ మో
హిని*! నీ సంస్మరణంబునన్ దొలఁగు భావింపంగ మోహంబదే,
ఘన సంస్కారము దివ్య ముక్తినిడుమా కల్యాణ సంపత్కరీ!
704. ఓం సరస్వత్యై నమః. 705.
నామ వివరణ.
జ్ఞానాధిష్ఠానదేవి, జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతి మన తల్లి అయిన సావిత్రీమాతయే.
సావిత్రీమాత
పంచ చామరము.
*సరస్వతీ*! నమోస్తు తే, ప్రశాంత చిత్ స్వరూపిణీ!
నిరంతరంబు సత్ స్పృహన్ గణించి మాకుఁ గొల్పుదే
పరంబిహంబు మాకుఁ గొల్పు వర్ధిలన్ శుభప్రదా!
కరావలంబమిచ్చుదీవె కావ మమ్ము సత్ కృపన్.
705. ఓం శాస్త్రమయ్యైనమః. 706.
నామ వివరణ.
అన్నిశాస్త్రముల యందూ నిండియున్న తల్లి మన అమ్మయే.
చం. అనుపమ! సర్వశాస్త్రము లనంతవు నీవె సృజింపఁ జేయ, నిన్
ఘనముగ జూపునన్నియును గౌరవమొప్పఁగ నెన్ని యన్నిటన్,
వినయముతోడ మ్రొక్కెదను వేల్పువటంచును నిన్నె కావ నన్,
మనుటకు నీ కృపామృతము మాకిడు *శాస్త్రమయీ*! నమోస్తుతే.
706. ఓం గుహాంబాయై నమః. 707.
నామ వివరణ.
మన హృదయమనెడి గుహలో ఛాయారూపమున ఉన తల్లి మన అమ్మయే.
కం. నా హృదయ స్థానంబున
నాహా యన నీ వట దహరాకాశ గుహన్
సౌహార్దముతో నొప్పెడి
మోహన గుణగణ *గుహాంబ*! పూజింతును నిన్.
707. ఓం గుహ్యరూపిణ్యై నమః. 708.
నామ వివరణ.
రహస్యమయిన, జ్ఞాన స్వరూప అయిన తల్లి మన అమ్మయే.,
చం. జయకరి *గుహ్య రూపిణి*! లసన్మహనీయ మనోజ్ఞ రూపవై
ప్రియముగ జ్ఞాన నేత్రముల వీక్షణకే కనిపింతు వీవు, నీ
నయ శుభ గుహ్య రూపము ఘనంబుగ భక్తులె చూతురమ్మ, వి
స్మయమును బాపి, కన్బడుము, సాధకు లందరికిన్ మహేశ్వరీ!
శ్లో. సర్వోపాధివినిర్ముక్తా సదాశివపతివ్రతా |
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ || 138 ॥
708. ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః709.
నామ వివరణ.
ఏ విధమయిన ఉపాధులూ లేని తల్లి ఈ జగజ్జనని.
కం. నీ పాద రజస్పర్శమె
మాపైఁ గృపఁ జూపి ముక్తి మార్గము నిడు, *స
ర్వోపాధి వినిర్ముక్త*! స
దా పాలించు చిహమునిక దాటించు కృపన్.
709. ఓం సదాశివ పతివ్రతాయై నమః. 710.
నామ వివరణ.
ఎల్ల కాలములయందు సదాశివుని అర్థాంగియైన పతివ్రత మన అమ్మ.
తే.గీ. వినుత గుణ! సహస్రార సంవేద్య! జనని!
నుతిగ శివశక్తివై సదా పతిని గూడి
చెలఁగు చుందువు శివునితోఁ జెలిమి మీర,,
దయఁ గను, *సదాశివ పతివ్రతా*! నమామి.
710. ఓం సంప్రదాయేశ్వర్యై నమః. 711.
నామ వివరణ.
సంప్రదాయబద్ధముగా వ్యాప్తిని పొందు తల్లి, మన అమ్మ
శా. శ్రీవిద్యా వర సంప్రదాయ వరదా! శ్రీ *సంప్రదాయేశ్వరీ*!
భావాతీత పరంపరాగతముగా వర్ధిల్లుచుండెన్ భవ
చ్ఛ్రీ వాత్సల్యమె తోడు కాగ శుభముల్ శ్రేయంబులున్ సద్గతిన్,
సేవాదృక్పథ సంప్రదాయములనే చిద్రూపి! సాగింపుమా!
711. ఓం సాధునే నమః. 712. ....128
నామ వివరణ.
సాధు స్వభావము కలిగి, పరమపాతివ్రత్యమును కలిగి భర్తతో అవినాభావ సంబంధము కలిగిన సాధ్వి
సధతిని ప్రసాదించు తల్లి సాధ్వి మన జగన్మాత.
ఆ.వె. *సాధ్వి*! సుస్వరూప! సరస సద్వరభావ
సద్గుణంబు లొసఁగి సాఁకు నన్ను!
నిరుపమాన! నేను నిన్నున్ స్మరింతును
నీదు దయయె నన్ను నాదుకొనును.
712. ఓం (ఈ)యై నమః.
నామ వివరణ.
ఈ తురీయస్వరూప మేకాక్షరము, కామ కలా సంజ్ఞికమయిన నామమిది.
సాధ సాధ్వీ నామం మరొకచోట సాధ్వీ సద్గతిదాయినీ అనేచోట యున్నందున.
పునరుక్తి వారించుటకు ఇక్కడ సాధు, ఈ అని రెండు నామాలుగ చేయబడినవి.
సాధు , సాధునే నమః ,
ఈ అను నామము గౌరీ-ఈకారాంత శబ్దంవలె గౌర్యై అయినట్లు యై అయినది( యై నమః)
తురీయస్వరూపురాలు .అ=విష్ణువు అస్య=విష్ణవుయొక్క అస్య భగినీ అనే అర్థంలో కూడా (జ్ఈష్
ప్రత్యయం వచ్చును.)ఈ అనే రూపం ఉండును (జయంతుని సోదరి జయంతీ వలె).కావున అమ్మ
విష్ణు రూపురాలు ఆయన సోదరరూపురాలు. ఒకే బ్రహ్మ ధర్మము ధర్మి ధర్మము పురుష స్త్రీరూపమున
రెండు విధములు. పురుషుడు విష్ణువు, జగదుపాదాన కారణం. స్త్రీ పరమశివ మహిషి. ఇట్లు పురుష
స్త్రీ వాటిధర్మాలు నాల్గింటిలో తురీయము అమమ్మ
(ఈకారాద్విశ్వకర్త్రీయం మాయా తుర్యాత్మికా ప్రియా)
ఉ. *ఈ*! లలితాంబికా! శరణు. హేయ నిరర్థక జీవితంబు నా
కేల? శుభాస్పదంబగు మహేశ్వరి! నీ పద పంకజంబు నా
కేల లభింపకుండెఁ? బరమేశ్వరి! నే విడ నీ పదాబ్జముల్,
జాలము సేయకమ్మ, నను చక్కగ నిన్ గని పొంగఁ జేయుమా.
713. ఓం గురుమండల రూపిణ్యై నమః.
నామ వివరణ.
శ్రీచక్రమున అష్టకోణము మీద అమ్మవారు పూజలందుకొనుదురు. కావున గురుమండలరూపిణి మన
అమ్మ.
చం. గురువుల రూపులందు వెలుగుం గన నీవె జగద్వరేణ్య! నీ
నిరుపమ తేజమౌను మహనీయ మహోత్తమ విద్యలెల్ల, నిన్
గురువుల తేజమందుఁ గని, కోరి భజింతును, బోధఁ గొల్పుచున్
మరుపును బాపుమమ్మ! *గురుమండల రూపిణి*! దేవతా మణీ!
శ్లో. కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ |
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా || 139 ||
714. ఓం కులోత్తీర్ణాయై నమః.
నామ వివరణ.
కులము అనగా యింద్రియముల సమూహము, ఈ సమూహమును అధిగమించు గొప్ప కులోత్తీర్ణ
మన జగన్మాత.
తే.గీ. నను గులోత్తీర్ణుఁ జేసిన జనని వగుచు,
నిరుపమానందమందించి, వరలఁ జేసి
నిండు మనమున కాఁపాడుచుండు, నీకు
జయము దుర్గా! *కులోత్తీర్ణ*! జయము జయము.
715. ఓం భగారాధ్యాయై నమః.
నామ వివరణ.
భ గ ము అనగా కాంతిరూపమై గమించు సూర్యమండలము. ఆ సూర్యమండలము మన అమ్మయే,
భగమండలముననుండి ఆరాధింపఁబడు జనని మన అమ్మ.
మ. దహరాకాశ విరాజమాన రవి మోదంబొప్పగాఁ గొల్వఁగా
మహిమోపేతముగా చెలంగుదువు సమ్మాన్యా! *భగారాధ్య*! నీ
విహమున్ సత్ పర సౌఖ్యమున్ గొలుపుదే, యీ భక్తునిన్ నిత్యమున్
స్పృహలోనుంచి త్వదీయ పాద యుగళిన్ సేవింపఁగాఁ జేయుమా.
716. ఓం మాయాయై నమః.
నామ వివరణ.
పరబ్రహ్మమును ప్రకటించుటకు అనుకూలమయినది మాయ. అది మన అమ్మ లలితాంబయే.
శా. శ్రీ మాయా! మహిమాన్వితా! జగతియే, చిద్రూపి! నీ మాయచే
శ్రీమంతంబుగఁ గాంచఁ జాలదు నినున్, చిత్తేజమౌ నిన్ను నే
నేమాత్రంబు నెఱుంగఁ జాలను, భవానీ! మాయనుం బాపి, నీ
ప్రేమోద్భాసిత రూపమున్ గనునటుల్ ప్రీతిన్ సదా! చేయుమా.
717. ఓం మధుమత్యై నమః.
నామ వివరణ.
సూర్యుఁడు దేవతలకు తృప్తి కలిగించువాడై మధువు వంటివాఁడు. సవితృదేవతా శక్తి సావిత్రి
కావున మధుమతి మన జగన్మాత.
తే.గీ. మధుమతిన్ గృపఁ గూర్చుమా, సుధలు చిందు
పద్యపద్మముల్ నీ పాదపద్మములకు
నర్పణము సేయ వ్రాసెద, నాంధ్రమాత
పొంగునటుల నో *మధుమతీ*! ముక్తిఁ గనగ.
718. ఓం మహ్యై నమః.
నామ వివరణ.
అమ్మ భూమివలె ప్రకటితమై అన్నింటా వ్యాపించియున్న తల్లి మహి. మన్బ అమ్మయే మహి.
కం. మహిమోపేత! *మహీ*! నన్
మహిపైఁ గాఁపాడెడి నిను మరువను జననీ!
దహరాకాశ సువర్తీ!
యిహమట్టులె పరము గొలుపు మీశ్వరి! కృపతోన్..
719. ఓం గణాంబాయై నమః.
నామ వివరణ.
అన్ని గణములకూ తల్లి మన అమ్మయే, గణాంబ మన అమ్మ.
ఉ. జీవగణాంబవీవె, వరసిద్ధిని గొల్పెడి తల్లి వీవె, నిన్
భావనఁ జేసినంతనె స్వభావమె మంచిగ మారునమ్మ,రా
జీవ ముఖాంబుజా! శరణు, సేవలు నీకు నొనర్చు భాగ్యమున్
నీవె యొసంగుమమ్మ, మది నీవె వసించి *గణాంబ*! సత్కృపన్.
720. ఓం గుహ్యకారాధ్యాయై నమః.
నామ వివరణ.
దేవతలలో వివిధ విభాగములకు చెందినవారు గుహ్యకులు. వారిచే ఆరాధింపఁబడు తల్లి మన
అమ్మ.
తే.గీ. భక్తినారాధనను జేయ ముక్తినొసఁగు
తల్లివీవమ్మ! కరుణించు చల్లనమ్మ!
జన్మ రాహిత్యమును గొల్పి శాంతినిచ్చు
*గుహ్యకారాధ్య*! నిన్ను నేఁ గొలుతునమ్మ!
721. ఓం కోమలాంగ్యై నమః.
నామ వివరణ.
వేద స్వరూపిణి అమ్మ, కోమలవేదాంగి మన అమ్మయే.
కం. ధర నిహ పరములనిడ, నీ
దరిఁ జ్చగ మార్గ మీవె దయచేయఁ గదే,
భరియింపఁ జాల బాధలు,
కరుణింపుము *కోమలాంగి*! కలుష విదారీ!
722. ఓం గురుప్రియాయై నమః.
నామ వివరణ.
జగద్గురువు ఆది శంకరుఁడు. వారియందు ప్రీతి కలిగి యున్న మన అమ్మ గురుప్రియ.
కం. జగదీశుండగు శివునకు
నిగమాంత సువేద్య! ప్రియవు నీవే కద? యీ
జగముల నేలెడి జననీ!
యగణిత శుభదా! *గురుప్రియా*! వందనముల్.
శ్లో. స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ |
సనకాదిసమారాధ్యా శివజ్ఞానప్రదాయినీ || 140 ||
723. ఓం స్వతంత్రాయై నమః.
నామ వివరణ.
సృష్టి మొత్తమును నడిపే స్వతంత్ర మన అమ్మ.
శా. సౌమ్యోద్భాస ముఖారవింద! గుణ పోషా! సత్య సద్రూప! నా
గమ్యంబున్ గన నేర, నీవె కరుణన్ గమ్యంబు నన్ జేర్చుమా.
సామ్యం బెన్నగ లేని నిన్ను గనెదన్స్వాతంత్ర్యమే యున్నచోన్,
రమ్యా! నీవిడు నిన్ గనంగను *స్వతంత్రా*! నాకు స్వాతంత్ర్యమున్.
724. ఓం సర్వతంత్రేశ్యై నమః.
నామ వివరణ.
అరువదినాలుగు తంత్రములకూ ఈశ్వరి మన అమ్మ.
కం. పలుపలు రీతులఁ బొగడుచుఁ
దలచెద నిను నేను *సర్వ తంత్రేశీ*! ని
స్తుల భక్తియు, నేకాగ్రత,
సలలిత పద పద్య రచన చక్కగనిమ్మా.
725. ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః.
నామ వివరణ.
సగుణ నిర్గుణ స్వరూపిణి యైన దక్షిణా మూర్తి రూపిణి మన అమ్మయే.
తే.గీ. జ్ఞాన శూన్యుండ, నెఱుఁగ నిన్, మౌనముగనె
సన్మహా జ్ఞాన దాతవై సత్ సుదర్శ
నమ్ము నిమ్ము, నా మది నిలు నమ్మకముగ,
*దక్షిణామూర్తి రూపిణీ*! దయను కనుమ.
726. ఓం సనకాది సమారాధ్యాయై నమః
నామ వివరణ.
సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులచే సమారాధింపఁబడు జనని మన అమ్మ.
కం. *సనకాది సమారాధ్యా*!
కన నేర్పుము నీదు చరణ కమల యుగంబున్,
వినుతిగ మదిఁ గనిపించెడి
నిను నే మదిలోనె నిలిపి నిత్యము గొలుతున్.
727. ఓం శివ జ్ఞాన ప్రదాయిన్యై నమః.
నామ వివరణ.
శివ సంబంధమయిన జ్ఞానమును ప్రసాదించునది మన అమ్మ.
కం. ఎద నున్న *శివ జ్ఞాన
ప్రదాయినీ*! జయము నీకు. పావన చరితా!
సదయను దర్శనమిమ్మను
హృదీశుని, శివుని నిరుపమ! హృదయము పొంగన్.
శ్లో. చిత్కళాఽఽనందకలికా ప్రేమరూపా ప్రియంకరీ |
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ || 141 ||
728. ఓం చిత్కలాయై నమః.
నామ వివరణ.
జీవులందరి చిత్తముల యందు కలిగిన బ్రహ్మ రూపమయిన కళ మన అమ్మ.
ఉ. ఏల యుపేక్ష చేసెద వనేక విధంబుల నిన్ను వేడు నా
కేలనొ చిత్కలా ప్రతిభ నిప్పటికైనను నీయకుంటి వీ
వేల ననున్ భవత్సుతుని నేలక చూచుట? మాత! *చిత్కలా*!
చాలిక నీ యుపేక్ష, మరు జన్మము లేని విధంబుఁ గూర్చుమా.
729. ఓం ఆనంద కలికాయై నమః.
నామ వివరణ.
మనలో ఆనంద రూపమున ఉండు మహిమాన్విత ఆనందకలిక మన అమ్మయే.
కం. నిరతము కృపఁ గను జననీ!
పర తత్వముఁ దెలిపి బ్రహ్మ భావన నిడుచున్,
బరమానందముఁ గొలుపుము,
మొర విను *మానంద కలిక*! ముక్తిద! కృపతో.
730. ఓం ప్రేమ రూపాయై నమః.
నామ వివరణ.
ప్రేమ స్నేహము భక్తి యొక్క రూపమే ప్రేమరూప మన అమ్మ.
తే.గీ. ముక్తి రూపిణీ! క్షమియించు, ముక్తి నొసఁగు
శక్తి వీవని, మాలోని భక్తివనియు,
మత్తు లోఁబడి గమనింప మరచినాడ,
వెలుఁగుమా లోనఁ, బ్రీతితోఁ *బ్రేమరూప*!
731. ఓం ప్రియంకర్యై నమః.
నామ వివరణ.
సాధకులకు ఇష్టమయినది చేకూర్చు తల్లి మన జగన్మాత.
ఉ. సాధు జనాళి కోరుకొను సన్నుత లోకహితార్థ వాంఛలన్
మోదము గూర్పఁ దీర్చుచుఁ బ్రబోధను గొల్పెద వో *ప్రియంకరీ*!
నీ దరి నుండి నేను గణనీయ కవిత్వము నిన్ను గూర్చి స
మ్మోదమునొంద వ్రాసెదను, పూర్తిగ నాకుఁ బ్రియంబు గూర్చుమా.
732. ఓం నామపారాయణ ప్రీతాయై నమః.
నామ వివరణ.
నామ సాహస్రాదికమును పారాయణము చేసినచో ప్రీతి చెందు తల్లి మన జనని.
తే.గీ. నామ పారాయణన్ మాకు జ్ఞాన మమరు
క్షేమ కారణమౌను నీ నామ వితతి,
యట్టి నీ నామముల్ మదిన్ బట్టనిమ్ము,
*నామపారాయణ ప్రీత*! జ్ఞాన తేజ!
733. ఓం నంది విద్యాయై నమః.
నామ వివరణ.
నందికేశ్వరునిచే ఉపాసింపఁబడిన విద్యా స్వరూపిణి మన అమ్మ.
చం. అల నటరాజ బోధిత మహాద్భుత విద్యయె నందివిద్య, ని
స్తుల గతి నంది పొందె నట శోభిలు తేజము నీవె యెంచగా,
కలుష విదూర! నా మదిని గాంతిని నింపుము నంది విద్యచే
నిలువుము *నందివిద్య*! మది నిత్య శుభంకరివౌచు పార్వతీ!
734. ఓం నటేశ్వర్యై నమః.
నామ వివరణ.
నాట్యశివునిలోని శక్తి మన అమ్మ.
తే.గీ. నన్నుఁ గావు *నటేశ్వరీ*! సన్నుతాత్మ!
యీ జగన్నాటకంబున నింత వరకుఁ
బాత్రలో మున్గి నిన్ను నే వదలి యుంటి
నాడలేనింక రక్షించు తోడనుండి.
శ్లో. మిథ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ |
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా || 142 ||
735. ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః.
నామ వివరణ.
ఈ సృష్టి అంతయూ మిథ్యయే. అట్టి మిథ్యా జగత్తుకు అధిష్ఠాన దేవత మన తల్లి.
అష్టమూర్తి వృత్తము
గణములు మ న త స ర భ జ య
యతి. ౧ – ౯ – ౧౮.
సన్మాన్యా! జగతి భావించగను మిథ్యాస్వరూపంబు జగదీశ్వరివీవే,
నన్ *మిథ్యాజగదధిష్ఠాన*నడిపించన్ గ నీవే కనవలెన్, మహిమాఢ్యా!
సన్మార్గంబు పరమోత్కృష్ట పరమార్థంబు, నీవే నిజము, చేరెద నిన్నున్,
సన్ముక్తిన్వరముగా గాంచ జగదీశాని! నాకిమ్ము సదయన్ నుతియింతున్.
స్వయం కల్పిత మిథ్యా జగతి వృత్తము.
గణములు . త . స . భ . భ . ర . వ
యతి .. 10 . ప్రాస నియమము కలదు.
*మిథ్యాజగదధిష్ఠాన* ! సమృద్ధిగ నిన్ను గొల్వనీ!
మధ్యాహ్నమిటనీ జీవికి, మాపు సమీపమాయెగా,
బోధ్య మ్మెఱుఁగనైతిన్, సతి! బోధనఁ జేయుమీవిఁకన్,
సాధ్యంబగును నీకే ననుఁ జక్కగ తీర్చి ప్రోవగన్.
736. ఓం ముక్తిదాయై నమః.
నామ వివరణ.
ఇఐహిక బంధములనుండి విముక్తి కలిగించి ముక్తిని ప్రసాదించు ముక్తిద మన అమ్మ.
కం. ఎత్తితినెన్నో జన్మలు,
చిత్తంబున నిన్ను నిల్పి చింతించను నేన్,
సత్తును జిత్తును దెలుపుచు
బత్తిని *ముక్తిద*! యొసగెడి బాధ్యత నీదే.
737. ఓం ముక్తి రూపిణ్యై నమః.
నామ వివరణ.
మనము పొంద దలచిన ముక్తిరూపము మన అమ్మయే.
ఉ. జీవము నీవె, నీ కృపనె జీవుని జీవము ముక్తినొందు, సం
జీవిని నీవు, ముక్తి యన జీవము నిన్ గని యైక్యమొందుటే,
భావమెఱింగి నీవు నను బావనమౌ వర ముక్తినొంద నీ
త్రోవఁ జరింపనిమ్మిఁక సరోజ వరానన! *ముక్తి రూపిణీ*!
738. ఓం లాస్యప్రియాయై నమః
నామ వివరణ.
నాట్యమునందు ప్రీతికలది జగన్మాత. లాస్యస్వరూపము మన అమ్మ.
మ. వర లాస్యంబున రాజశేఖరు సతీ! భాసింతు వీవెప్పుడున్,
పరమేశుండును తాండవంబునను దా భాసించు నీయట్లె, నన్
గరుణించంగను మిమ్ము గోరుదు కృపన్ గారుణ్యమున్ జూపి, యా
పరమున్ గొల్పుడు, లాస్యతాండవములన్ వర్ణింతు, *లాస్యప్రియా*!
739. ఓం లయకర్యై నమః.
నామ వివరణ.
సాధకుని అనుగ్రహించి వారి మనసును పరమాత్మపై లీనమగునట్లు అనుగ్రహించు జనని మన
అమ్మ.
మ. దురితాళిన్ గడదేర్చుమో *లయకరీ*! దుర్బుద్ధులన్ బాపుచున్,
నిరపాయంబుగ గావుచుండుము సదా! నీ భక్తులన్ శ్రీకరీ!
తరణోపాయము నీవె జన్మజలధిన్ దాటంగ ముక్తిప్రదా!
కరుణాసాంద్ర! శుభాంతరంగ! కృపతో గమ్యంబునే చేర్చుమా..
740. ఓం లజ్జాయై నమః.
నామ వివరణ.
ప్రాణులలో నమ్రతగచే లజ్జారూపమున ఉండు తల్లి మన అమ్మ. స్త్రీలలో ఈ లజ్జయే వారి
సంస్కారమును చాటును. అట్టి సంస్కారము లజ్జా రూపములో వెలువడునది అమ్మయే.
ఉ. నీ కృప సత్ కవిత్వమును నిత్యము నేనయి వ్రాయుచుండగా,
లోకము నన్ గవీశుఁగ విలోకనఁ జేయుచునుండ లజ్జతో
లోకులఁ గాంచ లేక, మదిలో నినునెన్ని నమస్కరింతు, *ల
జ్జా*! కని నీవెనేనగు లసన్నుత జీవన భాగ్యమబ్బనీ..
741. ఓం రంభాదివందితాయై నమః.
నామ వివరణ.
రంభా మున్నగు అప్సరాంగనలచే నమస్కరించఁబడు తల్లి మన అమ్మ.
కం. కరుణను వనితలఁ గనుమా,
శరణమొసఁగి గురుతరముగ, స్వయముగ నీవే
నిరతము నిరుపమ రక్షణ
ధరణికి *రంభాదివందితా*! మరువకుమా.
శ్లో. భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా |
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా || 143 ||
742. ఓం భవ దావ సుధావృష్ట్యై నమః.
నామ వివరణ.
సంసారమనెడి దవానమునార్పు అమృతవృష్టి మన అమ్మయే.
కం. *భవ దావ సుధా వృష్టీ*!
భవదావానలము చేత భయపడుచుంటిన్,
నవనీత హృదయ వీవే
భువి నను గాపాడి ముక్తిఁ బొందగనిమ్మా.,
కం. అసలగు జ్ఞాన జ్యోతిగ
వసుధంగల జనులలోన వరలుదువీవే,
కొసరుచు కోరుదు *భవదా
వ సుధావృష్టీ*! విముక్తి, వారిజ నయనా!
743. ఓం పాపారణ్య దవానలాయై నమః.
నామ వివరణ.
పాపములు అనే కీకారణ్యములను కాల్చి బూడిద చేయు దావానలము మన అమ్మయే.
శా. నా పాపంబులనంత మెన్న జననీ! నా భాగ్య మీపాటిదే,
నీ పాదాబ్జములెన్న నేరమిని నే నిత్యంబు దుర్వర్తినై
పాపారణ్యమునందు జిక్కితిని నా పాపంబులన్ గాల్చు మో
*పాపారణ్య దవానలా*! శరణ మీ పాపాత్ము రక్షింపుమా.
744. ఓం దౌర్భాగ్య తూల వాతూలాయై నమః
నామ వివరణ.
దౌర్భాగ్యమనెడి గడ్డిని దూరముగా ఎగురఁగొట్టివేయు వాయువు మన అమ్మ.
కం. క్షితి నాదౌర్భాగ్యమ్ముల
నతులితగతి తూలఁజేయుమమ్మా! నినునే
మతినిల్పి గొల్తు, *దౌర్భా
గ్యతూలవాతూల*! నన్నుఁ గావుము తల్లీ!
745. ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః.
నామ వివరణ.
ముసలితనము అనెడి చీకటిని నశింపఁ జేయుసూర్యప్రభ మన అమ్మ.
ఉ. సాంతము నీవె నాకనుచు, సత్యము నీవె యటంచు నా మదిన్,
కాంతును నిన్ను నేను మమకారము నీ పయిఁ గల్గితిన్, జరా
ధ్వాంతము నా మదిన్ మరుపు వర్ధిలఁ జేయుచు నుండె, నో *జరా
ధ్వాంత రవి ప్రభా*! కనుము, వాపి జరన్ నినుఁ గొల్వఁ జేయుమా.
శ్లో. భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా |
రోగపర్వతదంభోళి-ర్మృత్యుదారుకుఠారికా || 144 ||
746. ఓం భాగ్యాబ్ధిచంద్రికాయై నమః.
నామ వివరణ.
భాగ్యము అనెడి సముద్రమునకు వెన్నెల మన అమ్మ.
ఆ.వె. వరలుచుండ నీవు *భాగ్యాబ్ధి చంద్రికా*!
నేను సాగరమునె, నిత్య శుభము
లందుచుందునమ్మ, సుందరమ్ముగ నీవు
చలువనిచ్చి కావు చక్కగాను.
747. ఓం భక్త చిత్త కేకిఘనాఘనాయై నమః.
నామ వివరణ.
భక్తుల మనసులనెడి నెమళ్ళకు సంతోషము కలిగించెడి చక్కని మేఘము మన్ అమ్మ.
ఆ.వె. చిత్స్వరూప! *భక్త చిత్త కేకి ఘనాఘ
నా*! మదిన్ దలంతు నాదు జనని!
నా మనసను కేకి నర్తించు నినుఁ జూచి,
మేఘము వలె నీవు మేలు కొలుప.
748. ఓం రోగపర్వత దంభోళ్యై నమః.
నామ వివరణ.
రోగములు అనెడి పర్వతములను నాశనము చేయు వజ్రాయుధము మన అమ్మ.
తే.గీ. *రోగ పర్వత దంభోళి*! ప్రోవుము నను,
వేగఁ జాలను దుర్యోగ రోగములకు,
సాగఁ జేయుము దుర్యోగ రోగ రహిత
జీవనము నాకు, వర్ధిల్ల జేయుము నను..
749. ఓం మృత్యుదారు కుఠారికాయై నమః.
నామ వివరణ.
మృత్యువు అనెడి కర్రను నరికివేయు గొడ్డలివంటిది మన అమ్మ.
మత్తకోకిల.
మేలుగా నమృతత్వమిచ్చెడి *మృత్యుదారు కుఠారికా*!
కాలగర్భమునందుఁ గల్పక కాపు కాచుచు నిత్యమున్
హేలగా నప మృత్యుహీనుగ నీశ్వరీ యొనరింతువే,
జాలితో ననుఁ గాచు తల్లివి, సన్నుతింతు నినున్ సదా!
శ్లో. మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా |
అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ || 145 ||
750. ఓం మహేశ్వర్యై నమః.
నామ వివరణ.
అమ్మ గొప్పదయిన సకలమునకు బ్రహ్మ పదార్థముగా ఉన్న ఈశ్వరి.
ఉ. ఈ జగతిన్ సృజించితె? *మహేశ్వరి*! నీ కరుణా కటాక్షమే
బీజము వేయు సద్గతికి, వేల్పుగ నిన్ మది నిల్పి నిత్యమున్
బూజలు చేయఁ జేయు నిను, పుణ్య ఫలంబుగ పొందనౌనుగా,
రాజిత నేత్రయుగ్మ! కన రమ్ము, నినున్ గననిమ్ము నమ్మికన్.
751. ఓం మహాకాల్యై నమః.
నామ వివరణ.
రుద్రుని శక్తి స్వరూపిణి అయిన గొప్పదయిన కాళీమాత మన లలితాంబయే.
కం. కాలము నీవమ్మ! *మహా
కాలీ*! బ్రహ్మమును నీవె, కరుణామయి! న
న్నేలెడి తల్లివి నీవే,
యేల కనన్రావు, శాంభవీ! కృపఁ గనుమా.
ఉ. నా మది స్వార్థ లోభము లనల్పములౌ మధు కైటభుల్, కృపన్
క్షేమము గొల్ప నాకు నణగింపుము వీటిని రుద్రశక్తి! ని
న్నే మది నిల్పి యుంతు, మహనీయ గుణావళి! కాళి! భూమిపై
ధీమహితాత్ములందరికి దిక్కయి నిల్చెడి నిన్నె కొల్చెదన్.
752. ఓం మహాగ్రాసాయై నమః.
నామ వివరణ.
జీవకోటికి గొప్ప ఆహార స్వరూపము మన తల్లియే.
కం. గ్రాసము మూలము ప్రాణికి
నీ సంకల్పముననె గణనీయమ్ముగ నీ
గ్రాసము లభియించు *మహా
గ్రాసా*! జీవులకు నీవె ప్రాపువు భువిపై.
753. ఓం మహాశనాయై నమః.
నామ వివరణ.
విశ్వానికి ప్రతీక అయిన వైశ్వానరునకు ఈ సృష్టియే ఆహారము. ఆ మహాశనము మన అమ్మయే.
తే.గీ. సృష్టినన్నియునశనమై చెందు నీకు,
సృష్టి నడుపగ నశనంబు నిష్టముగ, ఘ
నముగఁ గూర్చుదీవె. *మహాశనా*! భవాని!
నిన్ను మనసార పూజింతు నన్ను గనుము.
754. ఓం అపర్ణాయై నమః.
నామ వివరణ.
హైమవతిగా శివునికై కఠోర తపస్సు చేయుచున్నప్పుడు కనీసము పర్ణములనైనను ఆహారముగా
స్వీకరించక అపర్ణగా ప్రసిద్ధిపొందిన జగన్మాత మన అమ్మయే.
కం. దీక్షన్ గొని నినుఁ జూచుచు
మోక్షము వడయంగ నాకు పూర్తిగ శక్తిన్
దక్షతతోఁ గల్పించుచు
రక్షింపు *మపర్ణ*! నీవె రక్షణ నాకున్.
755. ఓం చండికాయై నమః.
నామ వివరణ.
భయంకరమయిన కోపముతో దుష్టులయెడ ఉండు తల్లి మన అమ్మ.
కం. ఖండించుము దుర్జనులను,
పండిత పామరుల మంచివారి గృహములన్
బండించుము శుభ సంహతి
మెండుగఁ, *జండిక*! సతంబు మేలు నొసఁగుమా.
756. ఓం చండముండాసుర నిషూదిన్యై నమః.
నామ వివరణ.
చండముండాసురాది రాక్షససంహారము చేసిన చండీ మన లలితామాత.
ఆ.వె. పూజ్య పాద! *చండ ముండాసుర నిషూది
నీ*! నమస్కరింతు, నిరుపమముగ
మంచివారినెల్ల మన్నించి కాఁపాడు
కనకదుర్గ! నన్నుఁ గకరుణఁ గనుమ.
శ్లో. క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ |
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా || 146 ||
757. ఓం క్షరాక్షరాత్మికాయై నమః.
నామ వివరణ.
క్షర మగు సృష్టికీ, అక్షరస్వరూపమగు వర్ణములకు ఆత్మస్వరూపముగా ఉన్న తల్లి మన అమ్మ.
పంచచామరము.
క్షరాళి నక్షరాళి నీవె కల్గి యాత్మవై తగన్
నిరంతరంబు వెల్గుచుండు నిర్మలస్వరూపమా!
నిరంతరాయ భక్తి నిమ్ము నీకు సేవ చేయగన్,
*క్షరాక్షరాత్మికా*! సతీ! యశాంతి బాపుమా! నతుల్.
758. ఓం సర్వలోకేశ్యై నమః.
నామ వివరణ.
అన్ని లోకములకును ప్రభ్వి మన జగదంబ.
కం. ధ్యానింతు *సర్వలోకే
శీ*!. నిను నా మదిని నిలిపి, శీఘ్రమె నాకున్
జ్ఞానమును గొలుపుమా నినుఁ
గానఁగ నగు నపుడె, నిజము, కారుణ్య నిధీ!
759. ఓం విశ్వధారిణ్యై నమః.
నామ వివరణ.
సృష్టి మొత్తమును ధరించిన తల్లి లలితా మాత.
కం. ఈ విశ్వము లయమగునపు
డీవే నీ లోన దాచు చీవే మఱలన్
భావించి సృష్టి చేసెద
వీవేకద, *విశ్వ ధారిణీ*! మూలమిటన్.
760. ఓం త్రివర్గ దాత్ర్యై నమః.
నామ వివరణ.
ధర్మార్థకామములను త్రివర్గములను యిచ్చు తల్లి మన అమ్మ.
కం. అక్షయ శుభదా! గౌరీ!
దక్షుడనయి ధరణిపైన ధర్మార్థములన్
రక్షించు గుణము నొసఁగుము
దాక్షిణ్యముతోఁ *ద్రివర్గ దాత్రీ*! నాకున్.
761. ఓం సుభగాయై నమః.
నామ వివరణ.
గొప్ప తేజస్సుకలిగిన తల్లి సౌభాగ్య రాశి, గొప్పభాగ్యస్వరూపిణి మన అమ్మ.
ఆ.వె. సుగుణ, భక్తి, గణ్యసూనృత వాగ్ఝరుల్
*సుభగ*! నీదు మహిమ, సుజనులందు
ప్రభవ మగును నిజము, ప్రఖ్యాతిగా నాకుఁ
గొలుపుమమ్మ! కృపను, గొలుతు నిన్ను.
762. ఓం త్ర్యంబకాయై నమః.
నామ వివరణ.
సూర్యచంద్రాగ్నులను మూడు నేత్రములుగా కలిగిన అమ్మ లలితాంబ.
తే.గీ. సోమసూర్యాగ్ని నేత్రవు, శుభద వీవు,
*త్ర్యంబకా*! నీవు సృష్టికే తల్లివమ్మ!
నీదు తనయుఁడ నేను నన్ నీ దరి నిక
సంతసంబుగ నిలుపుమా, శంభు రాణి!
763. ఓం త్రిగుణాత్మికాయై నమః.
నామ వివరణ.
సృష్టిస్థితిలయలకు మూలమయిన సత్వము,రజస్సు, తమము అను త్రిగుణములు ఆత్మగా కల
తల్లి.
తే.గీ. దివ్య! *త్రిగుణాత్మికా*! సతీ! భవ్య! నీవు
సత్వమై వెల్గు నాలోన సన్నుతముగ,
పుట్టినందున మహిపైన పుణ్య కార్య
కలన సంతృప్తి కలిగించు ఘనతరముగ.
శ్లో. స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః |
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా || 147 ||
764. ఓం స్వర్గాపవర్గదాయై నమః.
నామ వివరణ.
నిత్య సుఖము, మోక్షము ప్రసాదించు జనని మన అమ్మ.
తే.గీ. జనని! *స్వర్గాపవర్గదా*! జయము నీకు,
కలుగు స్వర్గాపవర్గముల్, కరుణ తోడ
నీవు నాయందు నిలిచి, సద్భావనలను
సత్య సద్వృత్తిఁ గలిగింప, సత్య భాస!
765 ఓం శుద్ధాయై నమః.
నామ వివరణ.
అవిద్యా సంబంధమయిన మాలిన్యము లేని శుద్ధ చైతన్య స్వరూపిణి మన అమ్మ.
కం. *శుద్ధా*! శూన్యావిద్యా!
బుద్ధిన్, విజ్ఞానదీప్తి, మోక్షార్థంబై
బద్ధకము వాపి గొలుపుము,
శ్రద్ధను సేవించనిమ్ము శర్వాణి! నినున్.
766. ఓం జపాపుష్పనిభాకృత్యై నమః.
నామ వివరణ.
దాసాని పుష్పముతో సమానమయిన ఆకారము కలిగిన తల్లి జగన్మాత.
కం. సుతుఁడ, *జపాపుష్పనిభా
కృతీ*! య కుంఠిత జపా! ప్రకృతి సద్రూపా!
క్షితి నన్ నిలుపుము శుభాళిగ
మతి నరుణప్రభ! వెలుంగు మహనీయముగా.
ఉ. పుష్ప పరాగమే కనగ పుణ్యద! నీ వర పాద ధూళి, వా
చస్పతియున్ నుతింప నిను చక్కని వర్ణములే కనండు, శ్రీ
పుష్ప సుపూజితా! కవన పుష్పములన్ నిను గొల్తు నో *జపా
పుష్ప నిభాకృతీ*! సకల పుణ్యఫల ప్రద! ముక్తిదా!, సతీ!
767. ఓం ఓజోవత్యై నమః.
నామ వివరణ.
తేజస్సుతో, బలముతో నొప్పారు జనని మన అమ్మ.
కం. *ఓజోవతీ*! కొలువ నిను
నోజస్సు లభించు నాకు నొప్పుగ, నిది నీ
నైజము, భక్తుల మదిలో
సాజంబుగ వెలుఁగుచుంట, సరసిజ నయనా!
768. ఓం ద్యుతి ధరాయై నమః.
నామ వివరణ.
కాంతిని ధరించిన జనని. కాంతియే స్వరూపముగా నొప్పారు తల్లి లలితామాత.
కం. మహిమాన్విత లలితాంబా!
గ్రహియించితి నీవె నాకుఁ గలిగిన ద్యుతిగా,
దహరాకాశమునందున
రహియించెద వీవె *ద్యుతిధరా*! వందనముల్.
769. ఓం యజ్ఞరూపాయై నమః.
నామ వివరణ.
మహావిష్ణువు కంటే వేరు కానటువంటి యజ్ఞ రూప మన అమ్మ.
తే.గీ. నిత్య యజ్ఞంబుగా మదిన్ నిలువుమమ్మ!
*యజ్ఞ రూపా*! మహద్జ్ఞేయమై వెలింగి
మాయ చీకట్లు పాపుమా మహిమఁ జూపి,
వందనంబులు చేసెద ప్రణవ తేజ!
కం. నీవే సర్వము మాకిల
ప్రోవుచు నడిపించు *యజ్ఞ రూపా*! ప్రణతుల్,
నీవే జ్ఞానము నొసగుచు,
బ్రోవుము మము జనని! యజ్ఞముగ నీవగుచున్ .
770. ఓం ప్రియవ్రతాయై నమః.
నామ వివరణ.
సకల దేవతా వ్రతములయెడ ప్రియము ఉన్న తల్లి మన అమ్మ.
పం.చామ. మహత్వ మీవు చూపి సత్య మార్గమందు నిల్పి నన్
సహించి నాదు దోషముల్, ప్రశస్తిఁ గొల్పుచున్ సదా
మహోన్నతంబుగా గణించి మంచి మార్గమిచ్చితే?
యహంబు బాపి కాచు శ్రీ *ప్రియవ్రతా*! నమోస్తుతే
శ్లో. దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా |
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా || 148 ||
771. ఓం దురారాధ్యాయై నమః.
నామ వివరణ.
ఆరాధించుటకు అత్యంత కష్టతరమయిన జనని. నిశ్చలచిత్తులకే ఆరాధింపసాధ్యమయిన జనని.
తే.గీ. మనము చంచలమైనది, కనఁగ లేను
నిను, దురారాధ్యవగుటచే, నేను కాన
చిత్త చాంచల్యమును బాపి బత్తినిచ్చి,
కనగ నిమ్ము *దురారాధ్య*! కరుణను నిను.
772. ఓం దురాధర్షాయై నమః.
నామ వివరణ.
చపల చిత్తులచే అర్చింపఁబడనటువంటి తల్లి మన అమ్మ.
తే.గీ. కనఁగ నర్చింపబడవమ్మ కంబు కంఠి!
నుత దురాధర్షవగుటచే క్షితిని నీచ
చంచలాత్ములచేఁ, గను సతిరొ! నిన్ను
గూర్మితోడ *దురాధర్ష*! కొలువనిమ్ము.
773. ఓం పాటలీ కుసుమప్రియాయై నమః.
నామ వివరణ.
పాటలీ కుసుమములయెడ ప్రీతి కల తల్లి మన అమ్మ.
తే.గీ. *పాటలీ కుసుమప్రియా*! పరవశమున
చిత్తమునఁ బ్రీతి వెల్గుమహోత్తమముగ,
పాటలీ కుసుమంబె నా సాటి లేని
భక్తినొప్పెడి చిత్తము, భద్రకాళి!
774. ఓం మహత్యై నమః.
నామ వివరణ.
మహత్తరమయిన తల్లి మన అమ్మ.
కం. *మహతీ*! నీ కొనరిన యీ
మహిమ మసాధ్యము పరులకు, మదిఁ దోచఁగనే
మహనీయ సృష్టిఁ గొలిపెడి
మహిమను కలదానివమ్మ! మంజులవాణీ!
775. ఓం మేరు నిలయాయై నమః.
నామ వివరణ.
మేరుపర్వతము నివాసముగా కలజనని. శ్రీచక్రములోని తొమ్మిదవ ఆవరణ
మేరువు. అట్టి మేరువును నివాసముగా కలిగి మన అమ్మ మనలో ఉండును.
కం. మేరువిదియె నా దేహము
నీ రాకను గోరె, *మేరు నిలయా*! రమ్మా!
కారణ మీవే కర్తవు
ప్రేరకమును నీవె కాన వెలయింతుఁ గృతుల్.
776. ఓం మందార కుసుమ ప్రియాయై నమః.
నామ వివరణ.
దేవతావృక్షమయిన మందార పుష్పములయెడ ప్రీతి కలిగిన జనని మన అమ్మ.
కం. సుమ కోమల! *మందార కు
సుమ ప్రియా*! కొలిచెదనిను, శోభిలు మదిలో,
ప్రముదము గొలుపుము జయమును
శ్రమగా భావించకొసఁగు సన్నుత చరితా!
శ్లో. వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ |
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ || 149 ||
777. ఓం వీరారాధ్యాయై నమః.
నామ వివరణ.
వీరులచే ఆరాధింపఁబడు తల్లి మన అమ్మ.
కం. అద్వైతాశ్రయ మహితులు
సద్వరులే వీరులు కన సన్నుత చరితుల్,
సద్వర! *వీరారాధ్యా*!
సద్వర పూజిత! బుధులను సదయఁ గనుమిలన్.
778. ఓం విరాడ్రూపాయై నమః
నామ వివరణ.
విరాట్ స్వరూపమయిన విశ్వమే రూపముగా కల తల్లి.
కం. జయము *విరాడ్రూపా*! సత్
ప్రియమున నీ దర్శనంబు వేగమె యిమ్మా!
క్షయమవ దుర్గుణములు, నే
నయముగ నిను గొలుతునమ్మ!, నన్ గృపఁ గనుమా.
779. ఓం విరజాయై నమః.
నామ వివరణ.
విగతమయిన పాపము కల తల్లి. పాపరహిత జనని మన అమ్మ.
మ. *విరజా*! దోష విదూర భక్తతతి నిన్ వేవేల చందంబులన్
పరమానందముతోడఁ గొల్తురుగ నీ ప్రాశస్త్యమున్ గాంచుచున్,
వరమై మాకు లభించి పద్యములలో భవ్యంబుగా వెల్గుమా.
780. ఓం విశ్వతోముఖ్యై నమః
నామ వివరణ.
విశ్వవ్యాప్త ముఖము కలిగిన తల్లి మన జనని.
తే.గీ. *విశ్వతో ముఖీ*! మది నిలు శాశ్వతముగ
నీవు నిలిచి, నీ తలపులన్ నిలుపు మదిని.
జన్మ ధన్యమౌ నమ్మరో జయవిభాస!
వందనములమ్మ! శతకోటి భానుతేజ!,
తే.గీ. *విశ్వతోముఖీ*! జయము, భావించి చూడ
సృష్టి మొత్తము నీవేను, కష్టములవి
మాకు కల్గుచుండుట వింత, మాత వీవె
రక్షగానుండుటన్ జేసి, రమ్య నామ!
781. ఓం ప్రత్యగ్రూపాయై నమః.
నామ వివరణ.
ప్రతికూలమయిన గతి కల తల్లి మన అమ్మ.
కం. *ప్రత్యగ్రూపా*! ప్రణతులు,
నిత్యంబంతర్ముఖుండె నినుఁ గొల్వ నగున్,
ప్రత్యయము చేసి చెప్పెద
సత్యముగా నిన్నుఁ గొలుతు సద్వినయముతో..
782. ఓం పరాకాశాయై నమః.
నామ వివరణ.
ఉత్కృష్టమయిన తపస్సు చేత మాత్రమే పొందదగినది పరాకాశము. అట్టి పరాకాశము మన
అమ్మయే.
కం. పరికింపఁ *బరాకాశా*!
నిరుపమ మహనీయ రూప! నీవాకసమై
చరియింతువు మా మనముల
హరియించుము పాతకములనంబుజముఖిరో!
783. ఓం ప్రాణదాయై నమః.
నామ వివరణ.
ప్రాణమే బ్రహ్మము, ఆట్టి ప్రాణమయిన బ్రహ్మమును ప్రసాదించు జనని మన అమ్మ.
కం. సంచిత కర్మఫలంబున
పంచేంద్రియ దేహమమరఁ బరగును బ్రాణం
బంచితముగనందున నీ
వుంచెదవే, *ప్రాణదా*! యనూనకృపాబ్ధీ!
784. ఓం ప్రాణ రూపిణ్యై నమః.
నామ వివరణ.
ప్రాణముగా ఉండు తల్లి మన అమ్మ. ఆమెయే ప్రాణ రూపము.
తే.గీ. *ప్రాణ రూపిణీ*! నీవె మా భాగ్యమమ్మ!
పరగ సత్ కర్మల నొనర్చి భవ్యవైన
నిన్నుఁ జేరెడి భాగ్యంబు నియతి నమరు.
వందనంబులు నీకు, నీ వందుకొమ్ము.
శ్లో. మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః |
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా || 150 ||
785. ఓం మార్తాండ భైరవారాధ్యాయై నమః.
నామ వివరణ.
అష్ట భైరవులలో మార్తాండ భైరవుఁడొకఁడు. అట్టి సూర్యమండలాంతర్వర్తియగు మార్తాండభైరవునిచే
ఆరాధింపఁబడు తల్లి మన అమ్మ.
కం. వినుత శుభాస్పదవమ్మా!
యనుపమ! *మార్తాండభైరవారాధ్యా*! నే
ఘనతరముగ భావించుచు
నిను నా మదిలోన నిలిపి నిత్యము కొలుతున్.
786. ఓం మంత్రిణీ న్యస్త రాజ్య ధురే నమః.
నామ వివరణ.
శ్యామలాదేవియందుంచఁబడిన రాజ్యభారము కలది మన అమ్మ.
సీ. నిన్ గొల్తు శ్రీ *మంత్రిణీ న్యస్త రాజ్య ధురీ*! నమస్తే, శంకరీ! శరణము,
నీ పాద పద్మమ్ములే పాప నాశన మొనరింపఁ దగినవి యూహ సేయ,
భూమిపై పాపముల్, పుణ్యముల్ మాచేతఁ జేయింప నీకేల చిద్విభాస!
మాకున్న నిన్ గొల్చి శ్రీకరంబగు ముక్తిఁ జేకొనం జేయుమా చిత్స్వరూప!
తే.గీ. నీదు కరుణా స్వరూపమున్ నేను గనుదు,
నాదు భక్తిని మన్నించుమో దయాబ్ధి!
నేను నీలోన లీనమై నిత్యుఁడనయి
శాశ్వతమ్ముగ వెల్గనీ సన్నుతాత్మ!
787. ఓం త్రిపురేశ్యై నమః.
నామ వివరణ.
శ్రీచక్రములో రెండవ ఆవరణము షోడశ దళపద్మమున చంద్రకళా స్వరూపము. అధిదేవత
త్రిపురేశీ. అది మన అమ్మయే.
కం. త్రిపురము లీ నా దేహమె
ప్రపంచము కనుఁగొన, దీని ప్రభ్వివి నీవే,
*త్రిపురేశీ*! కొలిచెద నిను,
నపాయములఁ బాపి కావుమమ్మా! నన్నున్.
788. ఓం జయత్సేనాయై నమః.
నామ వివరణ.
రాక్షసులను సంహరించు సేనా సమూహము కలది మన అమ్మ.
తే.గీ. శత్రువర్గంబునణచెడి శంభురాణి!
నిను *జయత్సేన*! కొలిచెద, నీవె దిక్కు,
నీవు కొలువున్న నా లోననే దురంత
శత్రువర్గము దాగెను జంపుమమ్మ!
789. ఓం నిస్త్రైగుణ్యాయై నమః.
నామ వివరణ.
అమ్మ త్రిగుణాతీత. నిర్గత త్రిగుణ మన అమ్మ.
కం. *నిస్త్రైగుణ్యా*! రిపులను
శస్త్రంబులఁ దునిమి, నన్ను జక్కఁగఁ గని, నా
నిస్త్రాణమున్ దరిమి, నిన్
విస్తృతముగ కొలుచుటకయి విజ్ఞత నిమ్మా.
790. ఓం పరాపరాయై నమః.
నామ వివరణ.
పరా, అపరా స్వరూపములు కలది మన అమ్మ.
కం. పర మపరము నిరుపమ గతిఁ
గరుణ నొసఁగు జననివి కన, కామిత వరదా!
వరలగ వరమునొసఁగుమిఁక
*పరాపరా*! వందనములు, భవ్య గుణాఢ్యా!
శ్లో. సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణా |
కపర్దినీ కళామాలా కామధు-క్కామరూపిణీ || 151 ||
791 ఓం సత్య జ్ఞానానంద రూపాయై నమః.
నామ వివరణ.
సత్యము, జ్ఞానము, ఆనందము స్వరూపముగా కలది మన అమ్మ.
కం. సుజ్ఞానామృతదా! *స
త్యజ్ఞానానంద రూప*! ధర సత్యమునే
విజ్ఞులు మెచ్చెడి విధముగ
నజ్ఞానము వాప నిలుపుమమ్మా! కృపతోన్.
792. ఓం సామరస్యపరాయణాయై నమః.
నామ వివరణ.
శివశక్తుల ఏకీభావమే సామరస్యము. అట్టి సామరస్యమే పర స్థానముగ కలది మన అమ్మ.
మ.కో. సామరస్యము తోడ మెల్గగ *సామరస్య పరాయణా*!
ప్రేమఁ జూడుము మమ్ము నీవిక వేడుచుంటిని భక్తితోన్
శ్రీ మనోజ్ఞ గుణాలవాలవు చేరనీ నను నీ దరిన్,
ప్రేమ సద్వరభావమందగ విశ్వతేజ! గ్రహింపుమా.
793. ఓం కపర్దిన్యై నమః.
నామ వివరణ.
కపర్ది యను పేరుగల శివుని అర్థాంగి మన అమ్మ.
పం.చా. *కపర్దినీ*! కరంబొసంగి కావు భక్తులన్ సదా,
ప్రపూజ్య నిన్ను నమ్మిరమ్మ భక్తులందరున్ భువిన్,
ప్రపంచమందు బాధలెల్ల వారలన్ గలంచుటన్
కపర్ది తోడఁ గావుమమ్మ! కష్టపాళిఁ బాపుచున్.
794. ఓం కలామాలాయై నమః.
నామ వివరణ.
అరువదినాలుగు కళలమాల మన అమ్మ.
కం. ధ్యానింతు *కలామాలా*!
నీ నామస్మరణ చేసి నిరుపమ కళలన్
నీ నుండి పొంది, నీ ప్రభ
నేనిట విరచించి చూప నేర్పుగ, కృతులన్.
కం. ధ్యానింతు *కలామాలా*!
నీ నామస్మరణఁ జేసి నిన్నున్, గళలన్
నీ నుండి పొంది, నీ ప్రభ
నేనిట విరచించి చూప, నిరుపమ! కృపతోన్
795. ఓం కామదుఘే నమః.
నామ వివరణ.
కోరికలను పూరించు కామ ధేనువు మన అమ్మ.
కం. హే *కామదుఘా*! సుజనుల
కే కామము కలదొ తెలిసి హృదయము పొంగన్
న్నాకామము తీర్చుమికను
శ్రీ కామిత దాయి! నీకుఁ జేసెద ప్రణతుల్.
796. ఓం కామ రూపిణ్యై నమః.
నామ వివరణ.
కామేశ్వర రూపమే మన అమ్మ
తే.గీ. *కామ రూపిణీ*! ధర్మార్థకామములను
నడుపుమా నను మోక్షము పద్రోవఁ దప్పి,
వ్యర్థ జీవిగ మిగులుదుఁ, బరువు వోవు.
శ్లో. కలానిధిః కావ్యకలా రసజ్ఞా రసశేవధిః |
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా || 152 ||
797. ఓం కలానిధయే నమః
నామ వివరణ.
కళనన్నిటికీ నిధి మన అమ్మ.
తే.గీ. శ్రీ *కలానిధీ*! నీ సృష్టి చిత్రమమ్మ!
యెచట నీవుందువో కళలచటనుండు,
లేవు నిను వీడి కళలెన్న, నీవె కళవు,
నీదు సత్ కళన్ నాలోన నింపుమమ్మ!
798. ఓం కావ్య కలాయై నమః.
నామ వివరణ.
కావ్యములో ప్రకాశించు కలా స్వరూపము మన అమ్మయే.
కం. కావ్యాత్మవీవె తల్లీ!
సవ్యంబగు చిత్ర గర్భ సద్బంధములన్
*కావ్యకలా*! నినుఁ గొల్తును
భవ్యంబుగ సాగనిమ్ము వరదా! కృపతోన్.
తే.గీ. కొలుతు *కావ్యకలా*! నిన్ను, కొలువు తీరి
యుండుమమ్మరో! నా యెదన్ నిండు మదిని,
నిన్ను వర్ణించు భాగ్యంబునెమ్మినిమ్ము,
కావ్యముల్ వ్రాసి నీ కళల్ కనఁగఁ జేయ.
799. ఓం రసజ్ఞాయై నమః.
నామ వివరణ.
నవరసములూ ఎఱిగిన తల్లి. శృంగారాది రసజ్ఞానముచే తెలియబడునది మన
అమ్మ.
తే.గీ. నవ విధములగు భక్తులే నవ రసములు,
భక్తియన్ రస పుష్టిచే భవ్య గతిని
నిన్నుఁ జేరి *రసజ్ఞా*! పునీతమగుట
సాధ్యపడునమ్మ, జన్మము సఫలమగును.
తే.గీ. ఓ *రసజ్ఞా*! నవరసము లారసిననె
తెలియనగు నిన్ను, నానంద మొలయు నపుడె,
దివ్య రసపుష్టి కలిగెడి భవ్య కవన
మొలయఁ జేయుము నా నుండి వెలయు మచట.
800. ఓం రస శేవధయే నమః
నామ వివరణ.
ఎంత అనుభవించినను తరగని బ్రహ్మానంద స్వరూపిణి మన అమ్మ.
తే.గీ. వినుత *రసశేవధీ*! రసంబనగ నీవె,
రసమె బ్రహ్మము, ప్రాణము, రస విహీను
లరయ నేర్వరు నిను, సత్య మరయ నీవె
సకల రస శేవధివి, కను సన్నుతాత్మ!
801. ఓం పుష్టాయై నమః.
నామ వివరణ.
పరమేశ్వరాది క్షితి పర్యంతము ముప్పదియారు తత్వములతో పుష్టా మన అమ్మ.
కం. *పుష్టా*! నిను నే సతతము
తుష్టిగ సేవింపఁ గోరుదున్ జనయిత్రీ!
యిష్టముతో నే ననుపమ
దృష్టిని నీపైన నిలుపు ధృతి నొసగుమిలన్..
802. ఓం పురాతనాయై నమః.
నామ వివరణ.
అన్నింటికీ మొదలుగా గల తల్లి, అతి పురాతన మన అమ్మ.
తే.గీ. సతి! *పురాతనా*! జ్ఞానభాస్వన్మణివిగ,
అతి పురాతనవైన నిన్నరయనీయు
మరసి కావ్యంబులోన నిన్ నిరుపమగతి
వర్ణనము చేసి పొంగనీ భవ్యతేజ!
803. ఓం పూజ్యాయై నమః.
నామ వివరణ.
అందరిచేతను పూజింపఁబడు తల్లి, మన అమ్మ పరమ పూజ్య.
కం. *పూజ్యా*! యంతర్యామీ!
రాజ్యంబులు ధనము లేల? రాణించుటకై
పూజ్యవు నీ మది యను సా
మ్రాజ్యములోనుండు తరిని మనుజుల కెఱుఁగన్.
804. ఓం పుష్కరాయై నమః.
నామ వివరణ.
సర్వత్రా వ్యపించునది మన అమ్మయే. విశాఖ యందు సూర్యుఁడు, కృత్తిక యందు చంద్రుఁడు
ఉండే అత్యంత పవిత్రమయిన కాలము పుష్కరము. అట్టి పుష్కరము మన అమ్మయే.
కం. *పుష్కర*! సర్వ వ్యాపిని!
నిష్కారణ మీ విధముగ నిలిపితి విట నన్,
శుష్కించిపోదు మదిలో,
దుష్కర్మలు పాపి, మదిని తోచుము నాకున్.
805. ఓం పుష్కరేక్షణాయై నమః.
నామ వివరణ.
కలువపూవులవంటి కన్నులు కలది మన అమ్మ.
తే.గీ. *పుష్కరేక్షణా*! కనుము నన్ బూజ్యురాల!
శుష్క సంభాషణలు పాపి శోభఁ గొలిపి,
నీదు సన్నిధిన్ నిలుపు నన్ నీరజాక్షి!
ముక్తి మార్గంబు నీవెగా శక్తి రూప!
శ్లో. పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా |
పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేదినీ || 153 ||
806. ఓం పరంజ్యోతిషే నమః.
నామ వివరణ.
అన్నింటి కన్న గొప్ప వెలుగుగా ఉన్న తల్లి. కొన్ని వేలకోట్ల సూర్యచంద్రాగ్నులతో నున్న ఈ తల్లి
నుండి అగ్ని 108, సూర్యుఁడు 116, చంద్రుఁడు 136 కిరణాలను మాత్రమే గ్రహించ గలిగి
వెలుగుచుండిరి. అంతటి పరంజ్యోతి మన అమ్మ.
తే.గీ. ఓ *పరంజ్యోతి*! యొసగు సద్యుక్త యుక్తి,
నీ పవిత్ర సత్ పాదముల్ నేను గొలుతు,
పరము బ్రాప్తింపఁ జేయుమా భర్గురాణి!
నిన్నె నమ్మితి, నన్ గావు మెన్ని నీవు.
807. ఓం పరంధామ్నే నమః.
నామ వివరణ.
పరమయిన అత్యంత ప్రకాశము అమ్మయే.
తే.గీ. ఓ *పరంధామ*! నిన్ బోలరొక్కరయిన
నిత్య సంవర్ధ విశ్వంబు నీవె కనఁగ,
నిన్ను మించెడి యన్యంబునెన్నఁ జాల,
ముక్తి కల్పించుమా నాకు భువన తేజ!
808. ఓం పరమాణవే నమః.
నామ వివరణ.
పరమ సూక్ష్మాతిసూక్ష్మమయిన అణు శక్తి అమ్మయే.
కం. *పరమాణూ*! నినుఁ గాంచెడి
వర