గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 50వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

50. ఓం భైరవాడంబరాయ నమః.

నదీ వృత్త గర్భ సీసము.

చలము విడి, జయముఁ గొలపరా. సత్య శుండ! శ్రీశా! నీ వశుండ నేను.

దురిత జన భయము తొలఁగినన్ భక్తిని - నిల్తు నేనే. మదిన్ నిలిపి నిన్ను.

బ్రతుకులోన నయము భయము లున్నన్ గన - నౌను నిన్నే ప్రభూ! దీన రక్ష!

కొలుతునిను, నయ సుగుణ నిధానా! కను - దేవ దేవా! మనోభావమెఱిఁగి.

గీ. ఆద్య! భైరవాడంబరా! ఆత్మవీవె! - దాసులందున వసియించు ధర్మమీవె

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

50 సీస గర్భస్థ నదీ వృత్తము. ( గగ .. యతి 8)

జయముఁ గొలపరా. సత్య వశుండ శ్రీశా!

భయము తొలఁగినన్ భక్తిని నిల్తు నేనే.

నయము భయము లున్నన్ గననౌను నిన్నే.

నయ సుగుణ నిధానా! కను దేవ దేవా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! శ్రీపతీ! నేను నీకు వశమయియున్నవాడను. నీవు

చలము విడిచి నాకు జయము కొలుపుము. .చెడ్డవారివలన కలిగుచ్చున్న భయము నాకు తొలఁగినచో నిన్ను మదిలో

నిలిపి భక్తితో నిలువఁగలను.బ్రతుకులో నీతి దానిని వ్యతిరేకించు విషయమున భయము కలిగినచో నిన్నె చూచుట

సాధ్యమగునయ్యా.  దీన రక్షకా!. నయ గుణ నిధానా! నిన్ను నేను సేవింతును.నా ఆంతర్యమెఱిఁగి నన్ను

కనుచుండుము. మూలపురుషా! భైరవాడంబరా! నా ఆత్మవు నీవే సుమా..నీ దాసులలో ఉండే ధర్మస్వరూపము నీవేకదా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.