గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2014, బుధవారం

దుర్జన: ప్రియవాదీతి నైతద్విశ్వాసకారణం. మేలిమి బంగారం మన సంస్కృతి185

2 comments

జైశ్రీరామ్.
శ్లో. దుర్జన: ప్రియవాదీతి నైతద్విశ్వాసకారణం 
మధుతిష్ఠతి జిహ్వాగ్రే హృదయే తు హలాహలమ్.
గీ. తీపి మాటల ధూర్తుని తెలియుఁడయ్య

నమ్మి మోసపోవలదట్టి నరుని వలన.
మాటలందునె తీయన. మనసు విషము.
రామ కృష్ణుని మాటలు బ్రహ్మ వాక్కు.
భావము. తీయగా మాట్లాడు తున్నాడు కదా అని చెడ్డవాడిని ఎన్నడూ నమ్మకూడదు. వాని నాలుక చివర తేనె, మనస్సులో మాత్రం విషం ఉంటాయి.
 జైహింద్.

29, ఏప్రిల్ 2014, మంగళవారం

ఇంగితం ఉపయోగించి ఆత్మసాక్షిగా ఉత్తమ అభ్యర్థికే మీ వోటు వెయ్యండి.

0 comments

 జైశ్రీరామ్.
నా ప్రియమైన భారతీయ సహోదరీ సహోదర ఓటర మహాశయులకు హృదయ పూర్వకముగా నమస్కరించుతూ చేయుచున్న విన్నపము.
సోదరీ సోదరులారా! మన భారత దేశము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశముగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దేశము.
మన రాజ్యాంగ నిర్మాతలు అత్యంత శ్రద్ధాసక్తులతో భావి భారతప్రజానీకము యొక్క మహోజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎంతో జాగ్రత్తగా చేసిన రాజ్యాంగ నిర్మాణము ప్రపంచ విఖ్యాతినొందినది. ఐతే జరిగినదింత వరకూ ఎలాగున్నదీ అంటే శస్త్ర చికిత్స చక్కగా జరిగినది కాని రోగి మాత్రము ప్రాణములు కొల్పోయెను అన్నట్లుగా ఉంది.
మనము మనకు ప్రతినిధులుగా యోగ్యుడైన ఎమ్మెల్యే. ఎంపీ లను ఎన్నుకొనే స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారం మనకు దక్కింది.
అనేకమంది ఎవేవో వాగ్దానాలతో మన ఓటును అర్థిస్తున్నారు. చాలా మంది అమాయకులు అనేక విధాలుగా ప్రలోభ పెట్టబడుచున్నారు.
తెలివైనవారు తెలివిగా ప్రవర్తిస్తున్నారు. కాని చాలా మంది అమాయకులు వారు పెట్టే ప్రలోభాలకు లోనైపోతున్నారు.
కొందరభ్యర్థులైతే ప్రలోభాలకు గురిచేయడమే కాక దేవునిపై ప్రమాణం కూడా చేయిస్తున్నారు. హారతి కర్పూరం ఆర్పిస్తున్నారు.
ఆర్యులారా! నా మాట కొంచెం వినండి. దేవుడు మిమ్మల్ని లంచం పుచ్చుకోమంటాడా, అలా ఏదైనా ప్రళొభానికి మీరు గురైతే ఆ తప్పు మిమ్ములను ప్రలోభ[పెట్టినవారెకే కాని, మీది కాదు.
మీ హృదయంలో ఆ భగవంటుడుండి తీరుతాడు. ఆత్మ సాక్షిని కాదని మీరు ఓటు వేసినట్లైతే అది ఆ పరమాత్మ సహిస్తాడా?
మీకు ఎవ్వరెవ్వరెంతెంత ఏమేమి ఇచ్చినా  అదంతా మీ మనసులో పెట్టుకోకండి. ఏ ప్రమాణాలూ మీకు ఎటువంటి హానీ కలిగించవు.
ఈ మంచి సమయంలో మీవోటును దుర్వినియోగ పరిచారంటే ఆ పొరపాటు ఐదు సంవత్సరాలు అనుభవించ వలసి రావచ్చు.
మీ నిర్ణయం నిర్మొహమాటంగా ఈ రహస్య వోటింగ్ విధానంలోనైనా మీరు ప్రకటించుకోలేకపోతే మీరు జీవించి ఉన్నవారిగా మిమ్మల్ని మీరైనా భావించగలుగుతారా? ఆత్మ వంచన వద్దు. మీకెవరు బాగా పరిపాలన అందిస్తారని నమ్మకముంటే వారి గుర్తుపైనే ఓటు వెయ్యండి. ఎవ్వరూ నచ్చకపోయినట్లైతే నిర్మొహమాటంగా తిరస్కార వోటు వెయ్యండి.
మీ ఓటు మహనీయ మైన మన భరత మాత భవితను వ్రాస్తుంది. భావి భారత పౌరులజీవనాధారమై ఉందిఒ దయచేసి గుర్తించండి.
ఆత్మ సాక్షిగా ఓటు వెయ్యండి.ప్రలోభాల సాక్షిగా వెయ్యకండి.
శుభమస్తు.
మన భరత మాతకు మంచి భవిత కలుగు గాక. భారతీయులందరూ సుఖ సంతోషాలతో జీవింతురు గాక.
జైహింద్
జైహింద్
జైహింద్

అపాద పాదపే దేశే హ్యేరండోஉపి ద్రుమాయతే.మేలిమి బంగారం మన సంస్కృతి184

0 comments

జైశ్రీరామ్
శ్లో. యత్ర విద్వజ్జనో నాస్తిశ్లాఘ్యస్తత్రా  ల్ప ధీరపి
అపాద పాదపే దేశే హ్యేరండో
పి ద్రుమాయతే.
క. విద్వజ్జను లెచటుండరొ
విద్వద్విరహితుఁడు గౌరవింపఁబడునటన్.
పృథ్విజములు లేకుండిన 
పృథ్విని యాముదము చెట్టు పెంపు వహించున్.
భావము. ఎక్కడ విద్వాంసులుండరో అక్కడ అల్పజ్ఞుడు కూడా పొగడబడుతాడు. అసలు చెట్టే లేనిచోట ఆముదపు చెట్టే మహావృక్షమౌతుంది. 
జైహింద్

28, ఏప్రిల్ 2014, సోమవారం

దశకం ధర్మలక్షణమ్. మేలిమి బంగారం మన సంస్కృతి 183.

2 comments

జైశ్రీరామ్.
శ్లో. ధృతి,క్షమా,దమో, స్తేయం శౌచ మింద్రియనిగ్రహః
ధీ ర్విద్యా సత్యమక్రోథో దశకం ధర్మలక్షణమ్.
గీ. నిత్య ధైర్య మోర్పును నాత్మ నిగ్రహంబు,
తనది కానిది కోరని ధర్మ నిరతి,
బుద్ధి, విద్య, జితేంద్రియ పూజ్యశక్తి,
కోప రహితము, సత్య సద్గుణము, సౌచ
మనెడు పదియును ధర్మలక్షణములగును.
భావము. ధైర్యం, ఓర్పు, మనోనిగ్రహం, తనది కానిదానియందు ఆశ లేకుండుట, శుచిత్వము, ఇంద్రియనిగ్రహము, బుద్ధి,సద్విద్య, సత్యము,కోపరాహిత్యం ఈ పదీ ధర్మలక్షణాలు.     
జైహింద్.   

27, ఏప్రిల్ 2014, ఆదివారం

సుపుత్రః కులదీపకః. మేలిమి బంగారం మన సంస్కృతి 182.

3 comments

జైశ్రీరామ్.
శ్లో. ప్రదోషే దీపకశ్చంద్రః ,ప్రభాతే దీపకో రవిః
త్రైలోక్యే దీపకో ధర్మః ,  సుపుత్రః కులదీపకః.
గీ. రాత్రి వేళను దీప్తి రేరాజొసంగు.
పగలు వెల్గునొసంగును భాస్కరుండు.
ధర్మ దీప్తి ముల్లోకాలఁ దనరఁ జేయు.
కులమునకు దీప్తిసత్పుత్రకుఁడు నిజంబు. 
భావము. చీకటి వేళ చంద్రుడు దీప్తినిస్తాడు. ఉదయాన్ని సూర్యుడు ప్రకాశవంతం చేస్తాడు. మూడు లోకాలనూ ధర్మమే ప్రకాశింపజేస్తుంది. కులాన్ని సుపుత్రుడు ప్రకాశింపజేస్తాడు.
జైహింద్.


26, ఏప్రిల్ 2014, శనివారం

జిహ్వాగ్రే మరణం ధృవమ్ మేలిమి బంగారం మన సంస్కృతి.181.

3 comments

జైశ్రీరామ్.
శ్లో. జిగ్వాగ్రే వర్తతే లక్ష్మీ ,జిహ్వాగ్రే మిత్ర బాంధవాః
జిహ్వాగ్రే బంధనప్రాప్తిః ,జిహ్వాగ్రే మరణం ధృవమ్.
గీ. మంచి మాటను లక్ష్మి సంప్రాప్తమగును.
మంచి మాటాడ బంధువుల్ మనను విడరు.
మాట బాగోనిచో కల్గు బంధనంబు.
మాట బాగోనిచో మృతియు మనకు కలుగు.
భావము. నాలుక చివరనే సంపదలు, మిత్రులు, బంధువులు, బంధనం ,చివరకు మరణం కూడా ఉంటాయి. (అందువల్ల నాలుకనుఅదుపులో ఉంచుకొని మాట్లాడాలి.)
జైహింద్.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః మేలిమి బంగారం మన సంస్కృతి180.

1 comments

జైశ్రీరామ్.
శ్లో.జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్జితం 
మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః
గీ. ధర్మ హీనుడు బ్రతికియు ధరణి మృతుఁడు.
ధర్మ బద్ధుఁడు మృతుఁడయ్య ధరణి జీవి.
ధర్మమును వీడ బోక యీ ధరణి పై
కీర్తి ప్రదముగ బ్రతుకుడు స్ఫూర్తి తోడ.
భావము. ధర్మాన్ని త్యజించిన వ్యక్తి జీవించి ఉన్నా , మృతునిగా పరిగణింపబడుతాడు. ధర్మాన్ని పాటించిన వాడు మృతుడైనా చిరంజీవి అనటంలో సందేహంలేదు.
జైహింద్. 

24, ఏప్రిల్ 2014, గురువారం

గుణాః గుణజ్ఞేషు గుణీ భవంతి,మేలిమి బంగారం మన సంస్కృతి 179.

5 comments

జైశ్రీరామ్.
శ్లో. గుణాః గుణజ్ఞేషు గుణీ భవంతి, తే నిర్గుణం ప్రాప్య భవంతి దోషాః
సుస్వాదు తోయాః ప్రవహంతి నద్యః, సముద్రమాసాద్య భవత్యపేయాః.
క. గుణములు గుణవంతుని కడ
ఘనముగ భాసించు నవియె ఖలుఁ దరి నున్నన్
ఘన దోషములగును. జలము
లు నదిని తీయన. జలధిఁ గలుషితములునగున్
భావము. గుణవంతులతో కలిస్తే , గుణాలు సద్గుణాలుగానే ఉంటాయి. నిర్గుణులను చేరి తే అవే దోషాలౌతాయి. నదులలో తీయగా ఉండే నీళ్ళు , సముద్రాన్ని చేరి , త్రాగేందుకు పనికి రానివౌతున్నాయి కదా.
 జైహింద్

23, ఏప్రిల్ 2014, బుధవారం

అమిత్రస్య కుతస్సుఖమ్ ? మేలిమి బంగారం మన సంస్కృతి. 178.

2 comments

జైశ్రీరామ్.
శ్లో.  అలసస్య కుతో విద్యా ? అవిద్యస్య కుతో ధనం ?
అధనస్య కుతో మిత్రం ? అమిత్రస్య కుతస్సుఖమ్ ?
గీ. బద్ధకిష్టులు విద్యలఁ బడయునెట్లు?
విద్యలేకున్న ధనలక్ష్మి వెలయునెట్లు?
ధనము లేకున్నమిత్రాళి దరియునెట్లు?
మిత్రహీనుండు సుఖముగ మెలగునెట్లు?
భావము. బద్ధకము కలవానికి విద్య ఎక్కడిది ? విద్య లేని వానికి ధనం ఎక్కడిది ? ధనం లేని వానికి మిత్రుడెక్కడ ? మిత్రుడు లేని వానికిసుఖమెక్కడ ?
జైహింద్

22, ఏప్రిల్ 2014, మంగళవారం

కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః మేలిమి బంగారం మన సంస్కృతి 177.

4 comments

జైశ్రీరామ్.
శ్లో. కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః
తరుః సృజతి పుష్పాణి , మరుద్వహతి సౌరభమ్.
క. కవి కావ్యము రచియింపగ
కవి హృదయము రసములెఱుగు ఘన పండితు డీ
భువి విరులను పూయ తరువు
సవిధంబుగ గాలి మోయు సౌరభమెల్లన్.
భావము. కవి కావ్యాలు వ్రాస్తే , పండితుడు రసాన్ని గ్రహిస్తాడు. వృక్షాలు పూలను సృజిస్తే, వాయువు సువాసనను వహిస్తుంది.
జైహింద్ 

21, ఏప్రిల్ 2014, సోమవారం

త్రీణి త్యక్త్వా సుఖీభవ. మేలిమి బంగారం మన సంస్కృతి 176.

2 comments

జైశ్రీరామ్.
శ్లో. లోభమూలాని పాపాని రసమూలాశ్చ వ్యాధయః
ఇష్టమూలాని శోకాని , త్రీణి త్యక్త్వా సుఖీభవ 
గీ. పాప మూలంబు లోభంబు, వలదు, విడుము.
రసన వాంఛనె వ్యాధులరయగ విడువు
మిష్ట మూలంబు శోకం బదేల? విడుము.
మూడిటిని వీడి సుఖములు పొందుమయ్య.
భావము. పాపాలకు లోభమువ్యాధులకు రసప్రీతి (జిహ్వా చాపల్యం),శోకాలకు ఇష్టవస్తువులు మూలాలు. ఈ మూడింటిని వదలిపెట్టి సుఖివై జీవించు.
జైహింద్.

19, ఏప్రిల్ 2014, శనివారం

సుఖార్థినః కుతో విద్యా ? మేలిమి బంగారం మన సంస్కృతి 175.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. సుఖార్థీ చే త్త్త్యజేద్విద్యాం విద్యార్థీ చ త్యజేత్సుఖం
సుఖార్థినః కుతో విద్యా కుతో విద్యార్థినస్సుఖమ్ ?
గీ. విడువ వలయు సుఖార్థి తా విద్యనపుడు.
విద్య నేర్వగ సుఖములు వీడ వలయు.
సుఖము కోరిన విద్యకు చోటులేదు
విద్య కోరిన సుఖములు వీలుపడవు.
భావము. సుఖాన్ని కాంక్షించేవాడైతే విద్యను వదలిపెట్టుకోవాలి. విద్య కావాలనుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖం కోరేవాడికి విద్య ఎక్కడ విద్యకావాలనుకుంటే సుఖం ఎక్కడ 
జైహింద్.

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఆయే దుఃఖం , వ్యయే దుఖం. మేలిమి బంగారం మన సంస్కృతి 174

1 comments

జైశ్రీరామ్.
శ్లో.  అర్థానా మార్జనే దుఖం, ఆర్జితానాం చ రక్షణే 
ఆయే దుఃఖం , వ్యయే దుఖం ధిర్థాః కష్టసంశ్రయాః.
క. ధన సంపాదన దుఃఖము.
ధన రక్షణ దుఃఖమయము ధన మొచ్చు నెడన్,
ధనమది ఖర్చగు వేళను
మనకౌనది దుఃఖ ప్రదము. మది గనుడయ్యా.
భావము. ధనాన్ని సంపాదించటంలో దుఃఖం , సంపాదించిన దానిని రక్షించటంలో దుఃఖం .ఆదాయంలో దుఃఖం , వ్యయంలో దుఖం. అయ్యో సంపదలు ఎన్నో కష్టాలను ఆశ్రయించుకొని ఉంటాయి కదా!

జైహింద్

17, ఏప్రిల్ 2014, గురువారం

శ్రీ వల్లభవఝల వారి రత్న కిరీట బంధ శార్దూలము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝలవారిరత్న కిరీట బంధ శార్దూలము వీక్షించండి.
జైహింద్.

16, ఏప్రిల్ 2014, బుధవారం

శ్రీ వల్లభ వఝల వారి హృదంతర సులోచన బంధ సుగంధి.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝలవారి హృదంతర సులోచన బంధ సుగంధిని వీక్షించండి.
జైహింద్

15, ఏప్రిల్ 2014, మంగళవారం

గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. - మేలిమి బంగారం మన సంస్కృతి 173.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
గీ. మరణమన్నది లేనట్టి మహితునివలె
ప్రాజ్ఞుఁడాస్తిని విద్యను పడయవలయు
మృత్యు వొందుట ముందున్న సత్యమనుచు
ధర్మ మొనరించగావలె మర్మము విడి.
భావము. ప్రాజ్ఞుడు తనకు ముసలితనముమరణము లేవనే భావనతోవిద్యనుధనాన్ని సంపాదించాలి. మృత్యువు తన జుట్టుపట్టుకొని తీసుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉందనే భావనతో ధర్మాన్ని ఆచరించాలి.
జైహింద్

14, ఏప్రిల్ 2014, సోమవారం

23-4-2014న శ్రీ గుత్తి నారాయణ రెడ్డిసాహితీ పీఠ పురస్కార ప్రదానోత్సవ సభ

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ గుత్తి నారాయణ రెడ్డిగారి స్మారక పురస్కార ప్రదానోత్సవ సభజోళదరాశి గ్రామంలో జరుగుతోంది. అవకాశమున్నవారు వెళ్ళే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశ్యంతో మీ ముందు ఈ ఆహ్వాన పత్రాన్ని ఉంచుతున్నాను.
జైహింద్.

1.చంపక – 2.మధ్యాక్కర – 3.నర్కుట - 4.కోకిలక – 5.మణి భూషణ – 6.ద్రుతవిలంబిత –7.కంద – 8.గీతద్వయ – 9.ఆటవెలది గర్భ సీసము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేను రచించిన 1.చంపక – 2.మధ్యాక్కర – 3.నర్కుట - 4.కోకిలక – 5.మణి భూషణ – 6.ద్రుతవిలంబిత –7.కంద – 8.గీతద్వయ – 9.ఆటవెలది గర్భ సీసము తిలకించండి.
జైహింద్.

13, ఏప్రిల్ 2014, ఆదివారం

వేదమూల మిదంజ్ఞానం. - మేలిమి బంగారం మన సంస్కృతి 172.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. వేదమూల మిదంజ్ఞానం ,భార్యామూల మిదం గృహం
కృషిమూల మిదం ధాన్యం ధనమూల మిదం జగత్.
గీ. వేదమూలమ్ము జ్ఞానమ్ము విజ్ఞులార.
గృహిణి మూలమ్ము గృహమౌను మహితులార!
కృషియె మూల మీదినుసుకుగణ్యులార!
ధనమె మూల మీజగతికి మనుజులార!
భావము. జ్ఞానానికి వేదమే మూలం.ఇంటికి ఇల్లాలే మూలం.ధాన్యానికి వ్యవసాయమే మూలం.ఈ జగత్తుకు ధనమే మూలం.
జైహింద్.

12, ఏప్రిల్ 2014, శనివారం

శ్రీ వల్లభవఝల కవి కృత పద్మ కోశ బంధము

1 comments

జైశ్రీరామ్. 
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి కృత పద్మ కోశ బంధము తిలకించండి.
జైహింద్.

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

శ్రీ వల్లభవఝల కవి కృత దర్వీబంధ గీతము

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి కృత దర్వీబంధ గీతము తిలకించండి.
జైహింద్.

10, ఏప్రిల్ 2014, గురువారం

శ్రీవల్లభవఝలవారి గ్రహ చక్ర బంధ గీత మాల

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభ వజల వారి గ్రహ చక్ర బంధ గీత మాలికను పరిశీలించండి.
జైహింద్.

శ్రీ వల్లభవఝలవారు రచించిన నావబంధము

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝలవారు రచించిన నావబంధము తిలకించండి.
జైహింద్.

9, ఏప్రిల్ 2014, బుధవారం

శ్రీ వల్లభవఝలవారి వీవన బంధము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తిగారు రచించిన వీవనబంధాన్ని చూడండి.
జైహింద్.

8, ఏప్రిల్ 2014, మంగళవారం

శ్రీరామ నవమి సందర్భముగా ఆంధ్రామృతపాఠకాళికి శుభాకాంక్షలు.

2 comments

జైశ్రీరామ్.
ఆపదామపహర్తారం, దాతారం సర్వ సంపదామ్.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.
ఆపదలుహరించి,సుసంపదాళినొసగు
సకల లోకాభిరాముండు, సాధ్వి సీత
నుత్సుకంబున పెండ్లాడియొప్ఇదముగ
సకల జనులను కాచుత సరస మతిని.
ఆర్యులారా!
జగజ్జననీ జనకులైన ఆ సీతారాములు భక్తుల కను వేడుకగా వివాహము చేసుకొనుచున్న ఈ శుభ సందర్భములో ఆ ఆనంద పారవశ్యులై ఉన్నవారు యావదాంధ్ర జనావళికి, యావజ్జీవకోటికి మంచిని ప్రసాదింతురు గాక.
రామ.....రామ......రామ....అని మూడుమారులుచ్చరించినచో అది వేయిమారులు రామనామోచ్చారణ చేసినట్లేననీ, తత్ ఫలితం లభిస్తుందనీ ఒకశ్లోకముంది చూద్దామా? 

శ్లోకము:-
శ్రీ రామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం
రామ నామ వరాననే. 


ఐతే ఏవిధంగా ముమ్మారు రామనామోచ్చారణ చేస్తే వేయిమారులు చేసినట్లవుతుంది? అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆలోచించగా నాకొక లాజిక్కు దీనిలో వున్నట్టుగా శ్రీ భాష్యం అప్పలాచార్యులవారు సెలవిచ్చిన విషయం గుర్తుకొచ్చి అది మీముందుచకుండా వుండలేకపోతున్నాను. మీకూ తెలిసే ఉండవచ్చు. ఐనా చూడగలరు. 

రామ అనే అక్షరాల్లో
రా లొని రకారం అంతస్థములలో రెండవాక్షరం. దానిని రెండు సంఖ్యగా గ్రహించాలి.
రామ లో మ అనే అక్షరం పంచమవర్గమయిన పవర్గ పంచమాక్షరం. దీనిని ఐదు సంఖ్యగా గ్రహించాలి.
రామ = 2 * 5 = 10. ఎలాగౌతుందంటారా? చూడండి.
యే = 2 .
బీ = 5 అయిన
యేబీ = ఎంత? అనగానే యే * బీ > 2 * 5 = 10 . అని మనం లెక్క చెప్పగలుగుతున్నాం కదా. అలాగే
రా = 2 . మ = 5 . > రామ = 2 * 5 = 10 . అవుతుంది కదా!
రామ,రామ,రామ అని ముమ్మారు పలికితే రామ * రామ * రామ > 10 * 10 * 10 = 1000. అవుతోంది
ఎంత అద్భుతంగా వుంది ఆలోచన? వివరంగా అర్థమయేవిధంగా చెప్పగలిగాననుకొంటాను.
జైహింద్.

శ్రీ వఝలవారి జయ వత్సర శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మన మిత్రులు శ్రీ వల్లభవఝలవారు ఆంధ్రామృత ప్రేక్షకులకు జయ విజయపరంపరతో మనకు కొనసాగాలని శుభాకాంక్షలను తెలియ జేశారు చూడండి.
ఆర్యులు శ్రీ అప్పల నరసింహం గారికి కూడా జయ పరంపరలతో ఈ జయ వత్సరమంతా సాగాలని మనసారా కోరుకొంటూ అభినందనలు, ధన్యవాదములు తెలియ జేస్తున్నాను.
జైహింద్.

6, ఏప్రిల్ 2014, ఆదివారం

లక్ష పద్యార్చన అవధాని డా.రాళ్ళబండి కవిథ ఫ్రసాద్ - డిజిటల్ అవధనం 1 & 2

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
http://andhraamrutham.blogspot.in/2014/03/blog-post_1.html
ఆంధ్ర కవితా రతనాల బండి మన రాళ్ళబండి కవితాప్రసాద్ గారు నిరాఘాటంగా కొనసాగింప తలపెట్టిన లక్ష పద్యార్చనను
సుందర భావోత్ప్రేరక
మందస్మిత వదనులగుచు మనకందరకున్
విందులు చేయుచునుండిరి
కందాది సుపూరణలను కమనీయముగా.కంద-గీత-గర్భ చంపకమాల.
వర సువిధేయుఁడై తనుపు పార్థివుఁడీ కవితాప్రసాదు ధీ 
వరుఁడెపుడున్. లసత్ కవన వాఙ్మధు ధారల జ్ఞానసింధుగా
సరస వినోద వాగ్ రసిక సత్కవితాజవరాళ్ళబండిగా 
నరయతగున్! మహానగరినందరికిన్ రతనాలబండిగా !

చంపక గర్భ కందము.
సువిధేయుఁడై తనుపు పా
ర్థివుఁడీ కవితాప్రసాదు ధీ వరుఁడెపుడున్. 
స వినోద వాగ్ రసిక స
త్కవితాజవరాళ్ళబండిగా నరయతగున్! 

చంపక గర్భ గీతము.
తనుపు పార్థివుఁడీ కవితాప్రసాదు 
కవన వాఙ్మధు ధారల జ్ఞానసింధు
రసిక సత్కవి తాజవరాళ్ళబండి
నగరినందరికిన్ రతనాలబండి !

రాళ్ళ బండి మనకు రతనాలబండియే!
లక్ష పద్య రచన నక్షయమగు
నాంధ్రమాత కంఠహారమై చెలువొంద
చేయ బూనె గర్భ చిత్ర గతుల.

చింతా రామ కృష్ణా రావు.
జైహింద్

న తస్య లోకే భయమస్తి కించన. - మేలిమి బంగారం మన సంస్కృతి 171.

1 comments

జైశ్రీరాం
శ్లో. యో ధర్మశీలో, జితమాన రోషో
విద్యావినీతో , న పరోపతాపీ                                               
స్వదార తుష్టః, పరదార వర్జీ
న తస్య లోకే భయమస్తి కించన.  
గీ. ధర్మశీలుడు దుర్మానధన విహీన
రోష దూరుడు, వినయ విద్యా సరసుఁడు,
పరుల చెరుపక, తన సతిన్ వలచి, పరుల
కాంతలను కోరని ఘనుడు కాంచు సుఖము.                                  
భావము. ఎవడు ధర్మశీలుడో, ఎవడు దురభిమానాన్నీ, రోషాన్నీ జయిస్తాడో, ఎవడు విద్యా వినయాలు కలిగి ఉంటాడో, ఎవడు పరులకు బాధ కలిగించడో, ఎవడు తన భార్యయందు సంతుష్టుడై పరభార్యా కాంక్ష వదలివేస్తాడో వానికి లోకంలో ఏమాత్రమూ భయం ఉండదు.

జైహింద్

5, ఏప్రిల్ 2014, శనివారం

బలీయసీ కేవలమీశ్వరేచ్ఛా - మేలిమి బంగారం మన సంస్కృతి 170.

1 comments

జైశ్రీరాం.
శ్లో. స్వయం మహేశః , శ్వశురో నగేశః , సఖా ధనేశశ్చ , సుతో గణేశః 
తథాపి భిక్షాటనమేవ శంభోః, బలీయసీ కేవలమీశ్వరేచ్ఛా !
. తానీశుఁడు, మామగపతి
మానిత ధనపతి హితుడగు. మాన్య గణేశుం
డానిటలలోచను సుతుం
డైనను భిక్షాటనంబె. యిది విధి బలమే.
భావము. తాను స్వయంగా మహేశ్వరుడు! మామగారా - పర్వతాధీశ్వరుడు! స్నేహితుడా - ధనాధిపతియైన కుబేరుడు!కుమారుడా -గణేశ్వరుడు! అయినా శివునకు భిక్షాటనం తప్పలేదంటే ,కేవలం ఈశ్వర సంకల్పమే. ఇది ఎంత బలీయమైనది! 

జైహింద్

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

దేవో దుర్బల ఘాతకః.- మేలిమి బంగారం మన సంస్కృతి 169.

1 comments

జైశ్రీరాం
శ్లో. అశ్వం నైవ , గజం నైవ , వ్యాఘ్రం నైవ చ నైవ చ
అజాపుత్రం బలిం దద్యాద్దేవో దుర్బలఘాతక: !
క. బలియివ్వరు అశ్వంబును 
బలియివ్వరు గజము వ్యాళ వ్యాఘ్రంబులిలన్
బలియిత్తురజంబు నహో!
బలహీనునె బలి యొనరుచు పరమాత్ముండున్
భావము. లోకంలో ఎంతో బలం ఉన్న గుఱ్ఱాన్నికాదు, ఏనుగును కాదు, పులిని కానేకాదు , కేవలం బలం లేని ఒక మేకపిల్లను బలి ఇస్తారు. దైవం కూడా దుర్బలురనే హింసిస్తాడు కాబోలు !
జైహింద్. 

3, ఏప్రిల్ 2014, గురువారం

వల్మీక తాడనాదేవ మృతః కుత్ర మహోరగః ?- మేలిమి బంగారం మన సంస్కృతి 168.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. దేహదండనమాత్రేణ కా ముక్తిరవివేకినాం -  వల్మీక తాడనాదేవ మృతః కుత్ర మహోరగః ?
గీ. పుట్టపై కొట్టినంతలో పుట్టలోని
పాముమరణించబోదుగా! పాంసనుండు
మనసులోనుండు మలినము బాప కుండ
దేహదండన ఫలమీదు. తెలియుఁడయ్య..
భావము. (మనస్సులోని మాలిన్యాన్ని తొలగించుకోకుండా)శరీరాన్ని (ఉపవాసాదులతో) దండింపజేసుకొన్నంత మాత్రాన అవివేకులకు ముక్తి ఎక్కడిది ? పుట్టను ధ్వంసం చేసినంత మాత్రాన దానిలోని మహాసర్పం మరణిస్తుందా ! 
జైహింద్

2, ఏప్రిల్ 2014, బుధవారం

శిరాకదంబం లో అంతర్జాల శ్రవ్య కవిసమ్మేళనం అత్యద్భుతం

3 comments

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీ జయ నామ సంవత్సరంలో భారతదేశంతో పాటు లోకమంతా సంతోషంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
శ్రీ యస్సెస్ రావుగారు నిర్వహిస్తున్న అంతర్జాల మాస పత్రిక శిరాకదంబంలో  అంతర్జాల శ్రవ్య కవిసమ్మేళనం  నిర్వహించి ప్రకటించారు.
అందు గానం చేసిన కవి కోకిలలు
మీరూ వినే విధంగా ఇందు పొందుపరచి యున్నాను.
శిరాకదంబం https://sites.google.com/site/siraakadambam/home/03015ugadipratyekaanubandham
ఇటువంటి చక్కని కార్యక్రమములను సిరాకదంబంద్వారా పాఠకులకు ఉత్సాహం కలిగిస్తున్న శ్రీ రావు గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
జైహింద్.