జైశ్రీరామ్
93. ఓం జగన్మయాయ నమః.
కమలాకర వృత్తగర్భ సీసము.
కరుణాన్విత నృహరీ! కనఁబడ వేమయ! - నిన్ గనలేమా? పునీత చరిత!
నుతియింతును మహిమాన్విత! కన రావయ. - మాకొఱకింకన్ రమామనోజ్ఞ!
భువనేశ్వర! స్పృహఁ గొల్పుమ, నినుఁ గాంచఁగఁ - బ్రీతిని మాలోని చేతనమయి.
సకలార్థద! గహనంబొకొ నినుఁ గాంచుట? - గౌరవమొప్పన్ వికాసమొంద.
గీ. ప్రథిత కమలాకర సువృత్త భాస! నిన్నుఁ - గనఁగనెంతు *జగన్మయా*! కాంచనిమ్ము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
93వ సీస గర్భస్థ కమలాకరవృత్తము. (స న జ జ య .. యతి 11)
నృహరీ! కనఁబడ వేమయ! నిన్ గనలేమా?
మహిమాన్విత! కన రావయ. మాకొఱకింకన్.
స్పృహఁ గొల్పుమ నినుఁ గాంచఁగఁ బ్రీతిని మాలో.
గహనంబొకొ నినుఁ గాంచుట? గౌరవమొప్పన్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ పునీత చరితా! నీవు కనబడవేమి? మేము నిను కనలేమా?
ఓ రమా మనోజ్ఞా! నిన్ను నుతింతును. కనబడుటకు రమ్ము. ఓ భువనేశ్వరా! మాలో చేతనమయి మాకు నిన్ను చూచుట
కొఱకు స్పృహ కలిగించుము. సకలార్థదా! గౌరవముగా వికాసము పొందుట కొఱకు నిన్ను చూచుట మాకు గహనమా?
కమలాకర వృత్త పద్యస్థా! జగన్మయా! నిన్ను చూడనెంచితిని. చూడనిమ్ము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.