గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 108వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్.

108. ఓం ప్రహ్లాదపాలకాయ నమః.  

గాథా ఛందోద్భాసిత మంగళ గీతిక గర్బ సీసము.

నారసింహునకు ననఘ నాయక మణి దే - మణికి మది వెల్గు రమణునకును  

వీర వర సుధీ రవికిని విజయ మంగ ళంబులు శుభమంగళంబులగుత!  

సారసాక్షునకు నసమ సత్య విభవ సం - స్తుతునకు యాదాద్రిపతికి హరికి 

స్మర జనక వివేక మణికి జయ సుమంగ - ళంబులు శుభమంగళంబులగుత!

వినుత యాదగిరి నివేశ విశ్వపతి నృ - సింహవిభుని శుభ సంహతియగు 

పూజ్య పాద జలజములకు భువిని మంగ - ళంబులు లక్ష్మీ విలాస భాస!             

గీ. మంగళములు గాథాభాస! మంగళములు - మహిత *ప్రహ్లాదపాలకా*! మంగళములు.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

108 సీస గర్భస్థ గాథా ఛందోద్భాసిత మంగళ గీతిక.

(విలక్షణ గురులఘు క్రమముతో ఎక్కువ తక్కువలు లేకుండా ఒక్కొక మారు మూడు లేక ఒక్కొక మారు ఆరు చరణములు

కలిగి పాడుకొనుటకు వీలు కలిగినది గాథా అను ఛందస్సుగా ప్రసిద్ధికెక్కినది.

गाथास्त्रिभिः षड्भिश्चरणैश्चोपलक्षिताः!! .१८ !! (केदार भट्टस्य  वृत्तरत्नाकरः)

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి - వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.  

సారసాక్షునకు నసమ సత్య విభవ సంస్తుతునకు - స్మార జనక దైవ మణికి జయ సుమంగళమ్.

వినుత యాదగిరి నివేశ విశ్వపతి నృసింహవిభుని - పూజ్య పాద జలజములకు భువిని మంగళమ్.

గానానుకూల మంగళహారతి (పాట).

1. నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి   

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

లక్ష్మీ

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి 

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

2. సారసాక్షునకు నసమ సత్య విభవ సంస్తుతునకు,

సారసాక్షునకు నసమ సత్య విభవ సంస్తుతునకు

స్మర జనక వివేక మణికి జయ సుమంగళమ్.

స్మర జనక దైవ మణికి జయ సుమంగళమ్.

లక్ష్మీ

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి 

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

3. వినుత యాదగిరి నివేశ విశ్వపతి నృసింహవిభుని

వినుత యాదగిరి నివేశ విశ్వపతి నృసింహవిభుని

పూజ్య పాద జలజములకు భువిని మంగళమ్

పూజ్య పాద జలజములకు భువిని మంగళమ్.

లక్ష్మీ

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి 

నారసింహునకు ననఘ నాయక మణి దేవ మణికి 

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

వీర వర సుధీ రవికిని విజయ మంగళమ్.

విజయ మంగళమ్విజయ మంగళమ్

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! లక్ష్మీ విలాసభాసా!  అఘరహితుఁడయిన నాయకమణియు,

దేవమణియు అయిన నా మదిలో వెలుగు రమణుఁడయిన నారసింహునకు వీరవరుడైనవానికి సుధీరవికి మంగళమగుగాక.

పద్మనేత్రునకు, అసమ సత్యవిభవములచేత స్తుతింపబడుయాదారీశునకు, స్మరజనకునకు, వివేకమణికి,  

జయమగుగాక. యాదాద్రి నివాసముగా కల విశ్వపతికి, శుభసంహతి యగు పూజ్య పాదజలజునకు భువిని

మంగళములు.,గాథావృత్తమున భాసించువాడా! నీకు మంగళములు. మహితుఁడవయిన ప్రహ్లాదపాలకా! నీకు

మంగళములు.  

కాణ్వశాఖీయ కౌశికస గోత్రోద్భవ చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల

జ్యేష్ట  పుత్రుఁడును, పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూపులు కల్వపూడి వేంకట వీర రాఘవాచార్య ప్రియ శిష్యుఁడును

అగు,చింతా రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే రచింపంబడిన యాదాద్రి శ్రీనృసింహ శతకము సంపూర్ణము.  స్వస్తి.                                                                                                                                                                                                                            

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.