గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

దేవీ స్తుతి 5 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

4 comments

http://s3.hubimg.com/u/727670_f496.jpg
శ్లో:-
కంబావతీవ సవిడంబా గళేన నవ తుంబాభ వీణ సవిధా
బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే.
అంబా కురంగ మద జంబాల రోచిరిహలంబాలకా దిశతుమే
శం బాహులేయ శశి బింబాభిరామ ముఖ సంబాదిత స్తనభరా!
సీ:-
కంబు సన్నిభమైన కంఠంబు కల తల్లి;  
వీణ దాల్చిన మృదుపాణి జనని.
బింబోష్ఠయు' కదంబ విపిన సంచారియు; 
ఇంద్రాది సుర వంద్య . యీశు రాణి.
కస్తూరి ప్రభ యుక్త కాల వర్ణ శిరోజ. 
కమనీయ కాంతుల కల్పవల్లి.
శశిబింబమును బోలు షణ్ముఖపీడిత 
స్తనభరంబుననొప్పు చక్కనమ్మ.
గీ:-
మాతృ దేవత దుర్గమ్మ మహిమ గొలిపి;
శుభము లిచ్చుత. ఎనలేని సుఖము లిడుత.
శాస్త్ర సు జ్ఞాన సంపద చక్క నొసగి
కాచు గావుత నన్ను సుజ్ఞాన మాత.
భావము:-
కంఠము యొక్క ఆకారము చేత శంఖముతో మిక్కిలి పోలిక కలదీ; లేత సొరకాయను పోలిన వీణతో కూడి యున్నదీ; దొండ పండు వంటిఅధరము కలదీ; కడిమి తోటలో వినమ్రులై నమస్కరిస్తున్న వజ్రాయుధుడైన ఇంద్రాది దేవతల సమూహము కలదీ; కస్తూరి యొక్క పంకము యొక్క కాంతి గల వ్రేలాడుతున్న కురులు కలదీ; కుమార స్వామి యొక్క చంద్ర బింబము వలె మనోహరమైన ముఖముతో;పీడింప బడిన కుచ భారము కలదీ అయిన మాత్రు మూర్తి పార్వతీ దేవి నాకు శుభాన్ని; సుఖాన్ని; శాస్త్ర సంపదను; ఈ జన్మములో ప్రసాదించు గాక!
జైహింద్.

29, ఏప్రిల్ 2010, గురువారం

కవి సమ్రాట్ విశ్వ నాథ భావుకత 39.

4 comments

శా:-
నానామౌనికులంబులన్ ప్రియ సఖుల్ నానా మునీంద్రాంగనల్ 
కానల్ కోనల యందు పండుగులకున్ గైకొంచు తా రేగి డో
లానిర్వ్యాజ రసాను కూలమగు హేలన్ వల్లులన్ దూగి నా
తోనావార్తలు చెప్పు జానకియు చేతోవీధి బాధించెడిన్. ( వి. రా. క. వృ. కి. కాం. నూ. స. 1- 39 )
ఎందరో ఋషుల భార్యలు సీతకు ప్రియ సఖులు. ఆ ఋషి పత్నులు పండుగలూ పబ్బాలూ వచ్చినపుడు సీతను తమతో తీసుకొని పోయేవారు. వారందరూ యధేచ్ఛగా అడవి తీగల తూగుటుయ్యాల లూగేవారు. ఆశ్రమమునకు వచ్చి ఆయా క్రీడా విశేషాలు ఆసక్తియో నాతో చెప్పు జానకి స్మృతి నా హృదయాన్ని బాధపెట్టు చున్నది.
రామునికి అవిస్మరణీయమైన సీతా స్మృతుల్లో ఒక అందమైన జ్ఞాపకం. సీతా దేవి ఎక్కడ ఉన్నా ఋషి కాంతలతో ఇట్టే కలిసిపోయేది. ఆ ముని పత్నులూ అంతే. ధార్మిక జీవనానుబద్ధలైన ఆ ఋషి కాంతలకు భర్తృ జీవనానుగమనమే వ్రతం. ఐననూ ఏ పండుగలయందో వారి కొకింత ఆట విడుపు. ఆ సమయంలో వారు సీతను ఆత్మీయంగా తమతో తీసుకొని పోయి ఉయ్యాల లూగేవారు. మధురంగా సంభాషించేవారు. బహుశా ఆ ఋషి పత్నులు రాచరిక జీవన విధానాలకు శ్రోతలై యుండగా సీత ఋషి జీవిత సంప్రదాయాచారాలకు శ్రోత అయి ఉండ వచ్చును. సీత తిరిగి వచ్చి రామునితో ఆ విశేషాలను పూస గ్రుచ్చినట్లు చెప్పి ఆనందించును కాబోలు. అట్టి సీతా స్మృతి శ్రీరామునకు ఇప్పుడు దుఃఖ హేతువైనది.
మనకు అత్యంత ప్రియతమమైన వ్యక్తి మనకు దూరమైనాడనుకొందము. ఆ వ్యక్తి యొక్క ప్రతీ కదలిక; ప్రతీ మాటయు మనకు పదే పదే జ్ఞాపకము వచ్చును. ఈ సమయమున వాఁడిట్లుండి యుండెడివాఁడు. ఇట్లు మాటలాడేవాఁడు అని ప్రతి క్షణ భార విహ్వలము కామా? అదే ఇప్పటి శ్రీరాముని స్థితి.
మహా కవుల కల్పనమునందు ఎక్కువ భాగము వారి ప్రతిభపై ఆధార పడి యున్నది. అతఁడు పూర్వ కవులను చదివి యుండ వచ్చును. వారి ప్రభావము ఈ కవులపై తక్కువ. నిరంతర మననము చేత మహాకవి అనునట్టివాడు పూర్వ కవుల వాక్కులలోని మర్మములను తెలుసుకొని అట్టి మర్మములను తాను కూడా ప్రయోగించును. సందర్భము వేరు వేరు కావచ్చును.
కాళిదాసు ఉన్నాఁడు. ఆయన అభిజ్ఞాన శాకుంతలము ఉన్నది. శకుంతల మరియు ఆమె వెనుక వచ్చిన తాపసులు ఎంత చెప్పినను ముని శాపమువలన దుష్యంతునకు తాను శకుంతలను వివాహ మాడితినన్న విషయము స్మృతికి రాలేదు. తరువాత అంగుళీయక దర్శనము వలన శకుంతలా వృత్తాంతము సర్వము జ్ఞప్తికి రాగా రాజు ఆమె యందు సావధాన భావుకుఁడైనాఁడు. నాడు సభలో "నీవు నాభార్యవు కాదు"  అని తాను పలికినపుడు వెంట వచ్చిన కణ్వ శిష్యులు నీవు మావెంట రావలదని శకుంతలతో కటువుగా పలుకగా ఆమె భాష్ప పూరిత నేత్రములతో తనను చూసిన చూపు విషము పూసిన బాణపు ములుకు వలె బాధించు చున్నది  అని దుష్యంతుఁడు అన్నాడు.
ఇతః ప్రత్యాదేశాత్ స్వజనమనుగతుం వ్యవసితా
ముహుస్తిష్ఠేతి వదతి గురు శిష్యే గురు సమే
పునః దృష్ఠిం బాష్ప ప్రసర కలుషా మర్పితవతీ
మయీ క్రూరే యత్తత్ స విషమివ శల్యం దహతి మాం.
స్మృతి విషలిప్త శల్యము వలె బాధించు చున్నదట. అంతే కాక దహించివేయుచున్నదని కాళి దాసు దుష్యంతునిచే అనిపించినాడు.
విస్మృతియందు ఏ బాధయు లేదు. స్మృతి బాధను రెట్టింపు చేయును. ప్రతిభాశాలి కల్పన ఇట్లుండును. ఆ కల్పన భావుకుని మనస్సును వ్రక్కలించును. మనస్సు వ్రక్కలించఁ బడగా దూరాన కన్పించునది జీవ చైతన్యమే అని విశ్వనాథ తన కావ్యానందంలోఅనినాడు.
ఈ సందర్భమున వాల్మీకములో ఇట్లున్నది.
స్మిత హాస్యాన్తర యుతం గుణవన్మధురం హితం.
వైదేహ్యా వాక్యమతులం కదా శ్రోష్యామి లక్ష్మణ!
లక్ష్మణా! సీత చిఱునవ్వుతో మధ్యమధ్య వినోదం కొఱకు నవ్విస్తు మాట్లాడుతూ ఉండేది. ఆమె మాటలు గుణవంతములై మధురం గానూ హితం గానూ ఉందేవి. మళ్ళీ  ఆమె మాటల్ని ఎప్పుడు వినగలనో కదా.
మూలశ్లోకంలోని భావానికి విశ్వనాథ ఎంత కల్పనము చేసాడో. మూలమునకు అనువాదమూ అనుసరణమూ  కాని  ఒకానొక ప్రతిభావంతమైన కల్పన  ద్వారా ఎంత సౌందర్యమును జాలువార్చినాడో గమనిస్తే ఆ మహా కవి భావుకత విశదమౌతుంది మనకు.
జైశ్రీరాం.
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్ నెం. 09949175899.
చూచారుకదండీ! ఎంత శ్రమించి మన కవి వతంస బులుసు వేంకటేశ్వర్లు శ్రీ విశ్వనాథ భావుకతను వెలువరిస్తున్నారో!
మిగిలిన భాగాలు కూడా సావధనంగా తెలుసుకొందాం అంతవరకూ ఆంధ్రామృతాన్ని గ్రోలుతూ ఆనంద రస సాగరంలో మునిగి తేలుతూ ఆ పరమాత్మ దయకు పాత్రులమౌదామా!
జైహింద్.    

28, ఏప్రిల్ 2010, బుధవారం

కవి సమ్రాట్ విశ్వ నాథ భావుకత 38.

1 comments

http://www.museindia.com/conimg/579.jpg
సీ:-
ఇది సరస్సుకు  వర్ష  ఋతువున విమలపా
ధస్సులు తెచ్చెడు తల్లి కయ్య
కడు గ్రీష్మమునఁ దటాకమ్ము నీరమ్ముల 
చేనకార్యంబయి చెంది యుండ
నిఱుప్రక్కఁ గాంతారమెనసి కోలాంగూల 
సమితి యట్టిటు దాటు జతనమందు
అన్యోన్య హస్త పాదాలంబనంబున 
నుభయ తటీ సంగతోన్నత తరు
గీ:-
శాఖికా గ్రహణంబు సంస్పందమాన
మైన యుయ్యాల వంతెన ప్రాణ యుతము
కట్టినవసాధ్యమగు కార్య ఘటన కాగ 
వానరంబుల దగు బుద్ధి వైభవమ్ము.  ( వి. రా. క. కి. కాం. నూ. స. 1- 38 ) 
సీతను అన్వేషిస్తూ పంపా అరణ్యములో సంచరిస్తున్న శ్రీరామునకు ఒక ముచ్చట గొలుపు దృశ్యము కనబడినది. పంపా సరస్సునకు వర్ష ఋతువులో నీటిని తెచ్చు పెద్ద కయ్య అనగా ప్రకృతి సహజముగా ఏర్పడిన కాలువ యున్నది. గ్రీష్మ కాలమున కూడా పంపా సరస్సు లోని నీటి వలన ఆ కాలువకు రెండు ప్రక్కలనున్న గట్లపై వృక్షములు ఏపుగా పెరిగుచున్నవి. కోతుల గుంపు ఈ వైపు నుండి ఆ వైపునకు పోవు ప్రయత్నము చేయుచున్నవి. విశాలమైన కాలువ దాట లేవు. పైగా కౄర జల జంతువుల భయము ఉండును కదా! కనుక కోతుల గుంపు కాలువ రెండు గట్లపై పెరిగి పైన అటునిటు పెరిగిన అగ్ర భాగ శాఖలు ఒండొంటితో కలసి పోయిన వృక్షములను ఆధారముగ చేసుకొని ఒక ప్రక్కనుండి మరియొక ప్రక్కకు పోవు చున్నవి.
క్రిందనున్న కాలువలో పడకుండా ఆ కోతులు ఒక దాని చేతులు మరొకటి పట్టుకొని చెట్టు కొమ్మలపై అడ్డముగ నడుచు చున్నవి. అత్యంత జాగరూకతతో ఆ వానరములు అట్లు ప్రవాహమును తరించు చున్నవి.  శ్రీరామునకు ఆ దృశ్యము గొప్ప ముచ్చటఁ గొలిపినది. అది ప్రాణ యుతమైన ఉయ్యాల వంతెన వలె నున్నదట. అంతే కాదు. అసాధ్యమైన కార్యమును ఉపాయముతో ఊహా శక్తితో సంఘటితముగా సాధించుచున్న ఆ కోతుల బుద్ధి వైభవాన్ని  శ్రీరాముఁడు మెచ్చుకోకుండా ఉండ లేకపోయినాఁడు.
విశ్వనాథ ఈ దృశ్యము ద్వారా ఏ దుర్ఘటమైన కార్యము నైనా ఊహా వైభవముతో అన్యోన్య సహాయముతో చేయవచ్చునని సూచించుచున్నాఁడు. ఎవరికి? శ్రీరామ చంద్రునకు. భవిష్యత్ లో జరగఁ బోవు కథాంశములను పాఠకుల మనస్సులలో స్ఫురింపఁ జేయుట విశ్వనాథ ప్రదర్శన శిల్పము.
శ్రీ రాముఁడు సముద్రమునకు వారధి కట్ట వలసి వచ్చుటకు ముందు సుగ్రీవునితో నెయ్యము పొంది ఆయన అజ్ఞచే కపి వీరుల సహాయముతో సముద్రమునకు సేతువు నిర్మించుట జరుగబోవు కథాంశము. అది ఒక దుర్ఘట కార్యము. అయిననూ అన్యోన్య హస్త పాదాలంబమున అను పదము చేత శ్రీరాముడు సుగ్రీవునకుపోయిన రాజ్యమిప్పించుట సుగ్రీవుఁడు ప్రత్యుపకారముగ శ్రీరామునకు తన కపి సేనను నియోగించి సాయ పడుట మొదలగు భావి కథాంశములు స్ఫురించుచున్నవి.
ఇది మహా కవుల వాక్కులయందు స్వయం ప్రసన్నమైన శబ్ద శక్తి . "అర్థతశ్శబ్దతోవాపి మనాక్కావ్యార్థ సూచకం." అన్నారు ఆలంకారికులు. అర్థము చేత కాని; శబ్దము చేత గాని కావ్యార్థ సూచన చేయఁ దగును అని భావము. ఇక్కడ "సంస్పందమానము - ఉయ్యాల వంతెన - ప్రాణ యుత" మొదలగు పదములు ప్రయోగించి కవి శ్రీరాముఁడు భావి కాలమున నిర్మించబోవు వారధిని స్ఫురింపఁ జేసినాఁడు. వానరుల బుద్ధి వైభవాన్ని మెచ్చుకోవడం శ్రీరామునకు వానర జాతియందు ఏర్పడబోవు విశ్వాసమునకు బీజము కదా! అందు వలననే అసాధ్య కార్య ఘటన నుసాధ్యము చేయ వచ్చునను కావ్య ధ్వని పుట్టు చున్నది.
సాధారణంగా ఒక ఘట్టాన్ని వ్రాస్తూ ఉన్న కవి కావ్యంలో ఉన్న ఘట్టముల యొక్క ఏక సూత్రతను చరమ లక్ష్యమును వదల కూడదు. అక్కడక్కడ ఆయా విషయములను స్ఫురింపఁ జేస్తూనే ఉండాలి. నాటకపు ప్రదర్శనలోప్రతి రంగమునందు నాయక ప్రతినాయక నామములు ఉచ్చరింపఁ బడుతూనే ఉండాలి.
" ఉత్పాదయన్ సహృదయే రసజ్ఞానం నిరంతరం " లేకపోయినచో పాఠకునకు జరుగఁ బోవు కథపైఉత్సుకత ఉండదు. ఇది రస నిర్వహణ తెలిసిన కొద్దిమంది మహాకవులకు మాత్రమే సాధ్యమైన కళా సృష్టి.
జై శ్రీరాం. 
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్ నెం. 09949175899. 
చూచారుకదండీ! ఎంత శ్రమించి మన కవి వతంస బులుసు వేంకటేశ్వర్లు శ్రీ విశ్వనాథ భావుకతను వెలువరిస్తున్నారో!
మిగిలిన భాగాలు కూడా సావధనంగా తెలుసుకొందాం అంతవరకూ ఆంధ్రామృతాన్ని  గ్రోలుతూ ఆనంద రస సాగరంలో మునిగి తేలుతూ ఆ పరమాత్మ దయకు పాత్రులమౌదామా!
జైహింద్.    

27, ఏప్రిల్ 2010, మంగళవారం

దేవీ స్తుతి 4 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

21 comments

http://www.himalayacrafts.com/pic/Durga-DSC04698.jpg
శ్లో:-
బాలామృతాంశు నిభ ఫాలా మనా గరుణ చేలా నితంబ ఫలకే
కోలాహల క్షపిత కాలామరా కుశల కీలాల శోషణ రవిః!
స్థూలా కుచే జలద నీలా కచే కలిత లీలా కదంబ విపినే 
శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృ శైలాధిరాజ తనయా!
సీ:-
అమృతాంశుఁడగునట్టి యాబాల చంద్రుని 
సరిపోలు నుదురున్న చక్కనమ్మ.
లేయెఱ్ఱనగు చీర  లీలగా దాల్చిన 
జఘనంపు సొగసుల శంభు రాణి!
ఆపదల్ ముసరగా నార్తనాదము చేయు 
దేవతలన్ గాచు దివ్య మూర్తి.
స్తన భారమున నొప్పు చక్కని జగదంబ. 
నీలి కురులతోడ నెగడు తల్లి.
గీ:-
కడిమి తోపుల వసియించు కల్పవల్లి. 
శూలిఁ మది నిల్పి ప్రణమిల్లు శైల తనయ.
పార్వతీ దేవి నామది ప్రభను నిలిచి;  
భక్తి  మార్గముఁ జూపుత! ముక్తి నిడుత.  
భావము:-
అమృతాంశుఁడైన బాల చంద్రునితో సమానమైన నుదురు కలదీ; పిరుదుల మీద లేత ఎఱుపు రంగు చీర కలదీ; ముసిరిన ఆపదలచే చేయుచున్న కలకల ధ్వనులతో కాలం గడిపిన దేవతల కష్టాలు అనే నీళ్ళను ఇంకింప జేయడంలో సూర్యుఁడు వంటిది; స్తన భారము కలదీ; కురులలో మేఘాల నీలిమ కలదీ; కడిమి తోపులో మనోహరమైన విలాసం కలదీ; శూలం ఆయుధంగా కల శివుఁడికి నమస్కరించే స్వభావం కలదీ; అయిన పర్వత రాజ పుత్రి యైన పార్వతీ దేవి నా హృదయంలో అధివసించు గాక.
జైహింద్.

24, ఏప్రిల్ 2010, శనివారం

కవి సమ్రాట్ విశ్వ నాథ భావుకత 37.

2 comments

సీత జాడ తెలియరావడం లేదు. కాలం గడిచిపోతున్నది. శ్రీరాముఁడు కాల గమనమునందు అసహిష్ణువు అగుచున్నాఁడు. ఆ క్షణమున ఆయన భావనలిట్లున్నవి.
" ఈ సూర్యునకు ఎవరినీ సంతోష పెట్టు స్వభావం లేదు. ఉదయ సంధ్య అను కామినికీ; సాయం సంధ్య యను భామకూ; ఇరువురికీ కోపం కలిగించు చున్నాఁడు. (ఆయా సంధ్యలు సూర్య సమాగమమునందు ఎఱ్ఱ బడుచున్నవి. ఎఱుపు కోపమునకు సూచకము. ప్రియుఁడు తమ యందు ఎక్కువ కాలం గడపకపోవడం వల్ల ప్రాక్ పశ్చిమ దిగంగనలకు కోప కారకు డగుచున్నాఁడు) పోనీ జలజాప్తుఁడని పేరు పొందినందుకు ఆ పద్మినినయినా సంతోష పెడుతున్నాడా? అదీ లేదు. మిట్ట మధ్యాహ్న సమయమున ఆమె వేడి కన్నీళ్ళు విడుస్తూ దుఃఖించునట్లు చేస్తున్నాఁడు. ఈ విధంగా ముగ్గురు సతుల్నీ అలరింప లేని నిత్య తపన శీలము నిరంతర గమన శీలము గల భాస్కరునకు కలుగుచున్న సతీ విరహమునకు అంతమే లేదా? అయ్యో! దనుజ గ్రస్త అయిన సీతపైనా సూర్యునకు కనికరం లేదు. సంధ్యా సమయానికే చీకట్లు ముసురు తున్నాయి.
ఈ విధమైన విశ్వనాథ భావుకతయందు అవతరించిన పద్యమిది.
మ:-
అనయంబున్ జలజాప్తుడై ఉభయ సంధ్యా కామినీ కోప భా
జనిఁడై ఆ సతి ఉష్ణ భాష్ప సలిల వ్యాసక్త చిత్తాబ్జగాన్
దినముల్ పుచ్చెడు నీ వియోగమునకుం దీరమ్ము లేదాయె నా
దనుజ గ్రస్తకుఁ గాడు భాస్కరుఁడు సంధ్యా వేళకే యింతయున్.
(వి.రా.క.వృ.కి.కాం.నూ.స.1-37.)
కాలము పరమేస్వర స్వరూపము. భూత భవుష్యద్వర్తమానము లను పేర లిప్త లిప్తకూ పరిణామ రూపముగా కదలి పోవుచున్నది కాలము. భగవానుడు గీతలో"కాలోస్మి లోక క్షయ కృత్ ప్రవృద్ధః?" అని  నాడు. ఈ  కాలమున  కవులు మన ప్రాచీన కావ్యములలో ఋతు వర్ణలను పేర వర్ణించారు. కొందరు భౌతికముగా కాలమునందు ప్రకృతిలో కనబడు మార్పులను రమ్యంగా వర్ణించగా మరి కొందరు కథా గమనమునకు  నేపథ్యముగా, సూచ్యార్థకముగా వర్ణించారు.  కాళిదాసు ఋతు సంహారమును ఈ నాటికీ అనుసరిస్తున్న  కవులున్నారు.  విశ్వ నాథ కూడా ‘తెలుగు ఋతువులు’ పేర ఆంధ్ర దేశ గ్రామీణ ప్రకృతి సౌందర్యాలను రస భరితంగా గానం చేసినవాడే. వాల్మీకి రామాయణము నందలి ప్రకృతి వర్ణనలు సరే సరి. అత్యద్భుత వర్ణనలకు వాల్మీకము వల్మీకమే(పుట్టయే).విశ్వనాథ తన కల్ప వృక్షమున ఋతు వర్ణనలు కథా సంబంధిగా చేసినాడు. ఎక్కడా కథలో అంతర్హితము కాని కాల నిర్దేశికమైన వర్ణనలు కల్ప వృక్షములో కనబడవు. మహా కవుల వాఙ్మయ సృష్టిలో ఇది శిల్పముగా కీర్తించ బడినది.
ఈ పద్యములోని కొన్ని పద ప్రయోగాల ద్వారా అత్యద్భుతమైన వ్యంగ్యము భాసిస్తున్నది. శ్రీ రాముడు సూర్య వంశ సంజాతుఁడు. ఆయనకు సూర్యునితో అభేదము.  శ్రీ రాముఁడు రాజ్య లక్ష్మికి కోపము తెప్పించి యున్నాడు. ఎందువలన అనగా రాజ్యలక్ష్మీ ఆయన భుజముపై విశ్రాంతిపొందుదునని భావించి యున్నది. కాని పితృ వాక్య పరిపాలనచే శ్రీరాముఁడు ఆ రాజ్యలక్ష్మిని త్రోసివేసినాఁడు. ఇంక యిప్పుడు భార్యను కోల్పోయినవాఁడై (అపహృత భార్యుఁడై) యశో లక్ష్మికీ కోపం రప్పించినాడు. (దొంగిలింపఁబడిన భార్య కలవానికి అప్రతిష్టయే మిగులును కదా!) ఇంక సీతను మాత్రము తాను సుఖపెట్టినదేమున్నది? ఆమె ఈ సమయమున వేడి కన్నీళ్ళు విడుస్తూ దుఃఖ హృదయయై ఉంటుంది. (ఆనంద భాష్పాలు చల్లన; దుఃఖ భాష్పాలు వెచ్చన అని ఆర్యోక్తి.) కనీసం రాక్షస గ్రస్త ఐన సీత పైనను సూర్యునికి జాలి లేదు. ( సూర్య వంశ వధువు ఐనది సీత) సంధ్యా కాలమై పోతున్నదే! అని ఆర్తి పొందుతున్నాడు శ్రీరాముఁడు.
శబ్ద శక్తులు మూడు. అభిద - లక్షణ -  వ్యంజన. అభిద లక్షణలు తమ అర్థమును తోపింపఁ జేసి విరమించగా వ్యంజన అన్యార్థమును తోపింపఁ జేస్తుంది. ఉదాహరణకు చంద్రుఁ డుదయించాడు. సూర్యుఁ డస్తమించాడు అనే వాక్యాలు ప్రకృతంలో సంధ్యావందనాది కార్యక్రమాలను జ్ఞాపకం చేయుచుండగా అన్యార్థములో యుద్ధం ముగించవలసిన సమయం యిది, అనే అర్థాన్ని స్ఫురింపఁ జేస్తుంది. ఈ శక్తి చేత సిద్ధించెడు అర్థము వ్యంగ్యము. దీనిని బోధించే శబ్దమే వ్యంజకము. ఈ వ్యంగ్యార్థమునే ధ్వని అంటారు.
చదువుకొనే పిల్లవాడితో నాయనా! తెల్లారింది. అని చెప్పగానే ఆ విద్యార్థికి కాల బోధక జ్ఞానంతో బాటు పాఠాలు చదవాలి; బడికి వెళ్ళాలి; అనే విషయాలు స్ఫురించడం లాంటి దన్న మాట సులభంగా ధ్వని అంటే.  కావ్య వర్ణనల యందు ఈ శబ్ద శక్తి మూలకమైన ధ్వని గుర్తించడం కొంచెం కష్టమే. పాఠకుఁడు నిత్యం కావ్య పఠన యోగ్యత కోసం తపించాలి. క్రమ క్రమంగా నిరంతర కావ్య పఠనం వల్ల అర్హతలు సంపాదించుకొనడం వల్లా సహృదయుని మనస్సులో ధ్వని స్ఫురిస్తుంది. దీనికి వేరే మార్గాలు లేవు. ‘మేడీజీ’ పద్ధతులూ లేవు.
ఒకచోట విశ్వనాథవారు ఏమన్నారంటే " విషయాన్ని కవిత్వం ఒక విలక్షణంగా చెపుతున్నది. కవిత్వంలో ఎప్పుడూ ఒక ముడి ఉంటుంది. ఆ ముడి విప్పదీస్తే కాని ఆనందం కలుగదు. లోకంలో ఏదైనా ఇంతే. మనసు చొప్పించి విచారణ చేసిన చోట అధిక సుఖం. మనసుతో ఆలోచించకపోతే సుఖమూ దుఃఖమూ రెండూ లేవు అన్నారు.
ఈ పద్యానికి వ్యాఖ్యానం చేసే సమయంలో ఒక మిత్రుఁడు నాతో అయ్యా! మీరు తల్లి కడుపులో ఉన్న శిశువు యొక్క హస్త రేఖల్ని పరీక్షిస్తున్నారు. అన్నాఁడు అభిమానంతో.  నాకూ నిజమే అనిపించింది.
సీత కనబడ లేదు. సూర్యాస్తమయం అవుతున్నది. శ్రీరాముఁడు కాల గమనాన్ని సహించ లేకపోతున్నాఁడు అన్నది పద్యంలో ముడి. అది విప్పఁ బడిన తరువాత మనకు కనిపించినది భావుకతా రత్న ప్రభ అన్న మాట.
జై శ్రీరాం.
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్ నెం. 09949175899. 
చూచారుకదండీ! ఎంత శ్రమించి మన కవి వతంస బులుసు వేంకటేశ్వర్లు శ్రీ విశ్వనాథ భావుకతను వెలువరిస్తున్నారో!
మిగిలిన భాగాలు కూడా సావధనంగా తెలుసుకొందాం అంతవరకూ ఆంధ్రామృతాన్ని గ్రోలుతూ ఆనంద రస సాగరంలో మునిగి తేలుతూ ఆ పరమాత్మ దయకు పాత్రులమౌదామా!
జైహింద్.    

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మనం కూడా సమస్యా పూరణము చేద్దామా ?

13 comments

http://www.indiavilas.com/wldofind/images/Saraswati/saraswati1.jpg
ప్రియ సాహితీ బంధువులారా!
వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం
విద్యాధనం సర్వ ధన ప్రథానమ్. అని ఆర్యోక్తి.  మనం నిత్యమూ సాహితీ చర్చాపరులమైనప్పుడే అది తేజో విరాజితమౌతుంది మనలో. కానినాడు మరపు పెరిగి క్రమంగా మరుగై పోతుంది.
దాని అవసరం మనకేంటని మీరనరులెండి. ఎందుచేతనంటే సాహిత్యమంటేనే సహితయోః భావః అని మీకు తెలియనిది కాదు కదా! అందుకని.
కావున నిత్యం సామాజిక హితాన్నే కోరేటువంటి సాహితీ చర్చాపరులమగుట మనకూ సమాజానికీ కూడా ఇది మేలే కదా!
మనలో ఎవరు కవిత్వం చెప్పే ప్రయత్నం చేసినా అది తప్పక పదిమందీ మెచ్చే భావ పూర్ణమైనదే కాని అన్యము కాకుండుటయే నా మాటలకు ప్రమాణము.
ఇక మనం మనలో నిబిడీ కృతమై యున్న సాహితీ పిపాసను పెంచడం కొఱకు; కవితా ప్రవాహాన్ని వెలువరించి మంచి పద్య రచన ధారాశుద్ధి పొందడం కొఱకు ఉపయోగ పడే సమస్యా పూరణ చేద్దామా?
ఇదివరలో ఇచ్చిన సమస్యాపూరణ విషయంలో చాలా తక్కువమందే స్పందించారు.
చాలా ఎక్కువ మంది రచయితలున్నా ఉత్సాహం కొరవడిందని నేననలేను కాని; కారణం మాత్రం ఏదైనా స్పందన తక్కువగా ఉందని మాత్రమే చెప్ప గలను.
ఆ సమస్య ఏమిటంటే
"రమణి యాతడు గావున రక్ష సేయు"
(సమస్యా పూరణ చేద్దామా శీర్షికతో 13 - 4 - 2010.వ తేదీన ఆంధ్రామృతం చూడండి)
మీరీ సమస్యపై ఇదివరకు స్పందించి ఉన్నా లేకున్నా తప్పక మళ్ళీ చక్కని పూరణ చేయడంతో పాటు  ఈ రోజు ఇస్తున్న సమస్యను కూడా పూరించి పంపుదురని ఆశిస్తున్నాను.
సందేహాలుంటే నిరభ్యంతరంగా అడగండి. సందేహ నివృత్తి చేసుకొని పూరణకుపక్రమించండి. అభినందనలు.
ఈరోజు పూరణకై ఇస్తున్న సమస్య తిలకించండి.
"క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్."
చూచారు కదా! మరెందుకాలస్యం? మెదడుకు పదును పెట్టండి. సమస్యా పూరణ చేయండి. పంపండి.
అభినందన మందార మాల మీకోసం సిద్ధమౌతుంది మిమ్మల్నలంకరించడానికి. అందుకొనే ప్రయత్నం చేయండి..
జైహింద్.

22, ఏప్రిల్ 2010, గురువారం

దేవీ స్తుతి 3 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

4 comments

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhrgh1D0XrvxWupsCHFjKmwHhvX-8UQACXHaaLTgqylrOFlW6zi4udKAwITdfXPChM-CA7sKetVNBCUqBoXZ4HYFgPeqFXamArdUmJf79BXzQ3N__juGbLhqVTurJmudiTPoDyOjteOi4Q/s400/Goddess_Durga_Vijaya_Dasami.jpg
శ్లో:-
యాzళీభిరాత్మ తనుతాలీzన కృత్ ప్రియక పాళీషు ఖేలతి భవ
వ్యాళీన కుల్యసిత చూళీ భరా చరణ ధూళీ లసన్ ముని గణా!
యాzళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాzళీక శోభి తిలకా!
సాzళీ కరోతు మమ కాళీ! మనస్స్వపద నాళీక సేవన పదౌ!
సీ:-
చెలులతో నే కాళి శ్రీ కడిమి వనిలో  
నీప్సితంబుగ క్రీడ నెలమి యాడు;
సంసార సర్పంబు సమసింప నేకాళి 
యాడు ముంగిసయయి యలరు నెపుడు;
నీలి ముంగురులతో నిత్యంబు నేకాళి 
భక్తుల మదిలోన ప్రబలి యుండు;
పాద రేణువులచే ప్రబలంగ నేకాళి 
ముని సమూహముఁ జేసి; పూజ్య మయెనొ;
గీ:-
నిండు హృది తోడ చెవ్వాకు నిల్పె నెవతె; 
వెలుగు తిలకంపు నుదుటితో చెలగు నెవతె;
అట్టి యమ యసిత కలువ లభయ పాద 
భృంగముగ నన్ను జేయుత యింగితమిడి. 
భావము:-
ఏ కాళికా దేవి తనయొక్క చెలికత్తెలతో సుకుమారంగా కలసి మెలసినదై కడిమి చెట్ల యొక్క తోపులలో క్రీడిస్తున్నదో; సంసారమనే త్రాచుపాముకు ఆడ ముంగిస వంటిదో;  నల్లటి కేశ పాశం కలదో; పాద రేణువుల చేత ప్రకాశిస్తున్న ముని సమూహము కలదో; ఏ కాళికా దేవి నిండైన శుద్ధాంతరంగంతో చెవికి చెవ్వాకును ధరించిందో; ఏ కాళికా దేవి నుదుటి మీద ప్రకాశిస్తున్న బొట్టును కలిగి యున్నదో; ఆ కాళీకా దేవి తన పాదాలు అనే నల్ల కలువలను సేవించడంలో నా మనస్సును తుమ్మెదనుగ చేయును గాక!
జైహింద్.

21, ఏప్రిల్ 2010, బుధవారం

దేవీ స్తుతి 2 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

9 comments

http://www.dattapeetham.com/india/tours/2003/vijayawada_devi_temple/feb6/devi1.jpg
శ్లో:-ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా!
పాపాపహ స్వమను జాపాను లీల జనతాపాపనోద నిపుణా!
నీ పాలయా; సురభి ధూపాలకా దురిత కూపా దుదంచయతు మాం!
రూపాధికా శిఖరి భూపాల వంశ మణి దీపాయితా భగవతీ!
సీ:-
వ్యాసాదులైన శాపాయుధులకు స్వర్గ 
పథ పాద ధూళిచే ప్రబలు తల్లి;
పాపాపహరమంత్ర పఠన పరవశుల 
తాపత్రయము బాపు తల్లి దుర్గ. 
కడిమి వనమునందు కారుణ్య వల్లియై 
కలయ వసించు మాకన్న తల్లి; 
ముర సుగంధము శిరమున ధూపముగ పొంది;
వెలయు శిరోజాల విశ్వ జనని; 
గీ:-
సుందరీ మణి. హిమశైల నందన మణి.
భగవతీ మాత పదముల భక్తిఁ గొలుతు
దురిత కూపమ్ము నుండి నన్ దరికి చేర్చి;
ఉద్ధరించుత దయను తా నొప్పిదముగ. 
భావము:-
శాపాయుధులైన వ్యాసాది మహర్షులకు స్వర్గానికి నిచ్చెనలైన పవిత్ర పాద ధీళి కలదీ; పాపాపహరణ చేయు తన మంత్రమును జపించడంలో తన్మయులైన భక్తుల యొక్క తాపత్రయమును తొలగించు నిపుణత కలదియు; కడిమి వనంలో నివసించునదియు; మురయను సుగంధద్రవ్య ధూపము వేయఁ బడిన శిరోజములు కలదియు; మిక్కిలి సుందరమైనదీ; పర్వత రాజైన హిమవంతుని వంశమున మణి దీప మయినటువంటిదియు; అయిన భగవతి నన్ను దురిత కూపమునుండి ఉద్ధరించును గాక!
జైహింద్.

20, ఏప్రిల్ 2010, మంగళవారం

కవి సమ్రాట్ విశ్వనాథ భావుకత 36.

2 comments

భ్రాంతి పొందిన నా హృదయం బ్రద్దలైపోయినదయ్యా! అని శ్రీరాముఁడు వసంత కాలపు పరమ సౌందర్యాన్ని ప్రకటించే సాయం సంధ్యలు తనను ఏ విధంగా హింసిస్తున్నాయో చెప్తున్నాఁడు.
ఇదిగో దైత్యుఁడు చాచి బాహువులు తా నేతెంచు నేత్రంబులి
ర్వదిగాఁ గన్బడు వీని చంపుట కహా! రక్షస్సు కాడాయెఁ తా
నిదియుం బూరుగు చెట్టు మిణ్గురుల కట్టీ దీర్ఘ చైత్రక్షపా
మదలిప్తల్పరిలుప్త ధైర్యుఁడననున్మల్లాకృతుల్ తూల్చెడున్. 
(వి.రా.క.వృ.కి.కాం.నూ.స.36.)
అడ్డముగా చేతులు చాచినట్లు కొమ్మలు కల బూరుగు చెట్టు ఇరవై చేతులు చాచి నిల్చిన రావణుని వలె భ్రాంతి కల్గించు చున్నది రామునకు. ఆ కొమ్మపైన వెల్గి ఆరుతున్న మిణుగురు పురుగులు రావణుని 20 కన్నుల వలె తోపగా శ్రీ రాముఁడు రావణుఁడు ఎదురుగా నిల్చినాఁడో యని భ్రమించుట;  కాదని తెలియగానే అయ్యో ఈ దీర్ఘ చైత్ర మాసపు మదనోద్దీపకమైన లక్షణములు నన్ను ఎంత బాధిస్తున్నవో! అని
వాపోవుట ఇందలి భావము.
ఇది ఉన్మాద భావమే. కాని దీనిని ఉగ్రత అని లాక్షణికులు నిర్వచించారు. చేతనా చేతనముల యందు విచక్షణ కోల్పోవుట ఉన్మాదము. కాగా అట్టి భ్రాంతికి ఆటంకము కలిగించినచో వచ్చు సంఘర్షణ ఔగ్ర్యము అన వచ్చును. ఇతరుల వలన తనకు జరిగిన కీడు వలన ఏర్పడిన చండత్వమే ఔగ్ర్యమనెడు సంచారి భావము. ( సంచారి భావమనగా సముద్రమున ఏర్పడు నీటి బుడగల వంటివి. ఇవి పుట్టుచు అంతర్హితమౌతూ ఉంటాయి.)
సంధ్యా కాలమైనది. ఎదురుగా ఉన్న బూరుగు చెట్టు చేతులను చాచి నిలచిన రావణుని వలె నున్నది. వాని నేత్రముల వలె మిణుగురులు ఆ చెట్టు కొమ్మల నాశ్రయించి వెలుగుచున్నవి. భ్రాంతి దశలో నున్న శ్రీరామునకు ఆ క్షణమున రావణుఁడే ఎదుట నిల్చినట్లనిపించి; వానినప్పుడే చంపుదమనుకొని పరుగెత్తినాఁడు. కాని అది రావణ రూపము కాదు. ఒట్టి బూరుగు చెట్టు. అయ్యో! ఈ వసంత సంధ్యా సమయం నన్ను ఎంత బాధిస్తున్నదో అని రాముఁడు దుఃఖించును.
"నా సకలోహ వైభవ సనాథము"అని రామాయణ కల్ప వృక్షమును విశ్వనాథ పేర్కొన్నాఁడు. ఆయన జీవితంలో ఆయన సృష్టించినన్ని కథలూ; పాత్రలూ; సన్నివేశాలు; మరొక కవి సృష్టించ లేదు. తెలుగు సంస్కృత ఆంగ్ల భాషలయందు నిరంతర పఠనాసక్తి చేత తనదైన భావ తీవ్రత చేత ప్రాచీన కావ్య వర్ణనలను ఆకళింపు చేసుకొని ఒకానొక నూతనత్వమును తన వాకునందు ఆవిష్కరించుకొనిన రస సిద్ధుఁడు విశ్వనాథ సత్య నారాయణ.
దొరికినంత వరకు పద్యాలకు లక్షణ గ్రంథాలనుండి లక్షణములను చూపి లక్ష్య సమన్వయము చేయ వచ్చును. అది కష్టం కాదు. కవి మహా భావుకుడై  "ఆత్మన్యాత్మనమేవ" అన్నట్ట్లువర్ణించుకొంటూ పోతే ఇందులో ఈ అలంకారం ఉంది. అంటూ ఏదో ఒక పరిధి లోనికి ఆ భావాన్ని నిబద్ధం చేసి తృప్తి పడడం అల్ప గుణంగా భావిస్తుంది. (నామటుక్కు)
రస సాధన చేసే కవి అంటే బ్రహ్మకు వాక్కుకు అభిన్నతను పొందే అవస్థను అనుభవిస్తున్న యోగి వంటి వాఁడు.
"బ్రహ్మ బదులుగ వాక్ స్వరూపమ్ము నెంచి;
బ్రహ్మకు; వాక్కునకు అబిన్న భావ మెంచి;
భ్రష్ట యోగిని కవిజన్మఁ బడసినాడ" అని చెప్పుకొనెను. విశ్వనాథ
కవిత్వం యొక్క సంపూర్ణ స్వరూపం రసమని; అది ఆకాశం లోనుండి ఊడి పడదని; దానికి లక్ష ప్రయత్నాలు చేయాలని; అది ఒక పెద్ద సాధనని భావించిన రస యోగి విశ్వనాథ.
మనం ఆ యెత్తున నిలిచి ఆయన కవిత్వాన్ని అనుభవించాలి. అప్పుడే మనకు రసానందం.
జై శ్రీరాం.
ఇదండీ మన కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఉపన్యాసంలోని 36వ భాగ సారాంశము.
తదుపరి భాగాలకోసం మనం కొంచెం ఎదురు చూడక తప్పదు.
జైహింద్.

17, ఏప్రిల్ 2010, శనివారం

దేవీ స్తుతి 1 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

10 comments

http://www.himalayacrafts.com/pic/Durga-DSC04698.jpg
శ్లో:-
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ వన వాటీషు!  నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా!
పాటీర గంధి కుచ శాటీ! కవిత్వ పరిపాటీ మగాధిప సుతా!
ఘోటీ ఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్.
సీ:-
కడిమి చెట్టులు గల కమనీయ వని లోన 
దేవకాంతల్ స్నేహ దీక్ష నిల్వ; 
స్వర్గ వాసుల విలసత్కిరీటమణుల 
కాంతి వ్యాపించిన కమల పదము;
లందగించెడి హరిచందనాంకిత కుచ
వల్కలమ్ముల నొప్పు వనజ నయన!
పార్వతీ సతి తన ప్రభఁ గొల్పు తాంబూల 
రసమున నా కిడు; రమ్యమైన
గీ:-
ఆడు గుఱ్ఱాల గిట్టల నలరు వడికి
మించు వేగము; మధురము; మేల్మిఁ; గొల్పి
రచన చేసెడి శక్తిని! రాజిలంగ.
భాగ్య సంధాత; దుర్గా భవాని మాత!
భావము:-
కడిమి చెట్ల యొక్క ఉద్యాన వనములలో చెలికత్తెలుగా చేయఁ బడిన దేవ కాంతలు కలదీ; స్వర్గ నివాసులైన దేవతల సమూహము యొక్క కిరీటములకు సంబంధించిన మిక్కిలి మనోజ్ఞమైన శిఖరాగ్ర భాగములందలి మణుల యొక్క కిరణ సమూహము వ్యాపించిన పాదములు కలదీ; చందనపు గంధము కల స్తన వల్కలము కలదీ అయిన పార్వతీ మాత అధిక మహిమాన్వితమైన నోటి యందలి తాంబూల రసముతో ఆడ గుఱ్ఱముల యొక్క గిట్టలకున్న వేగము కంటే అధిక వేగము గల కవితా రీతిని వృద్ధి చేయుఁ గాక!
జైహింద్. 

16, ఏప్రిల్ 2010, శుక్రవారం

కవి వతంసను సత్కరిస్తున్న కళాతపస్వి విశ్వనాథ.

2 comments

3=4x6-2c.jpg
ఆంధ్రామృతాస్వాదనా లోలులారా! శ్రీ విశ్వనాథ సత్యనారాయన రామాయన కల్ప వృక్షము న గల భావుకతను తన ఉపన్యాసముల ద్వారా సాహితీ పిపాసులకందించుచున్న మన ప్రియ మిత్రులు కవివతంస బిరుదాంకితులగు; శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ప్రతిభను విన్న  సినీ దర్శకులు కళా తపస్వి బిరుదాంకితులు అగు శ్రీ విశ్వనాథ దంపతులు  రామాయణ కల్ప వృక్షమునందలి భావికతను ప్రత్యేకించి చెప్పించుకొని విని మహదానంద భరితులై  తమ యానందమును ఆ కవివతంసులికి తాము చేయు సత్కృతి ద్వారా వ్యక్తము చేసినారు. 
ఈ సన్నివేస్శమును చూచిన నా మనసు ఆనంద పారవశ్యము పొందగా పొంగివచ్చిన కంద గీత గర్భ చంపకమాలను రసజ్ఞుల హృదయాహ్లాదకరమని భావించి; ఇందుంచినాడను. विद्वानॆव विजानाति विद्वज्जन परिश्रमम् అన్నారు మహానుభావులు. అట్టి మీకు ఇందలి స్వారశ్యమును చెప్పంబనిలేదు. గ్రహింపఁ గలరని నా విశ్వాసము.
చ:- అవనతుఁడయ్యె గా! వినయ హారతి నిచ్చుచు విశ్వనాథ! రా
జ వదనుడై! సఖీ సహిత సన్మన గౌరవ సత్కృతంబుతో!
కవి నుతుడంచు; నీ కవికి గణ్యతఁ నారసి; గారవించె. జ్ఞా
న వివశుడై! భువిన్  బులుసు నైపుణి వాగ్ఝరి పూజ లందెగా!
క:- నతుఁడయ్యె గా! వినయ హా
రతి నిచ్చుచువిశ్వనాథ; రాజ వదనుడై!
నుతుడంచు; నీ కవికి గ
ణ్యతఁ నారసి; గారవించె జ్ఞాన వివశుడై!
తే.గీ:- వినయ హారతి నిచ్చుచువిశ్వనాథ
సహిత సన్మన గౌరవ సత్కృతంబు
కవికి గణ్యతఁ నారసి;గారవించె!
బులుసు నైపుణి; వాగ్ఝరి; పూజ లందె!

ప్రతిభా పాండిత్యములు దశ దిశలా వెన్నెల; చల్లదనము లవలె వ్యాపించగా సుప్రసిద్ధమైన  కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి; దేశ విదేశాలలో కీర్తి కాంతులతో ప్రసిద్ధులైన ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకులు శ్రీ విశ్వనాథ దంపతులను ఆంధ్రామృతం తరపున; పాఠకుల తరపునా అభినంది స్తున్నాను. 
జైహింద్

13, ఏప్రిల్ 2010, మంగళవారం

సమస్యా పూరణ చేద్దామా?

7 comments

http://sanskrit.inria.fr/IMAGES/sarasvati.jpg
సాహితీ ప్రియులారా!  ఒక సమస్యను పూరణార్థం మీ ముందుంచుతున్నాను.అదేమిటో మీరే చూడండి.
"రమణి యాతడు గావున రక్ష సేయు"
చూచారుకదా! సమస్యని. 
అబ్బో పూరణచేసేయడానికి మీ మనసు ఉవ్విళ్ళూరుతున్నట్లుందే? 
ఏ ఛందస్సులో పూరుంచెద్దామనుకొంటున్నారు? 
ఓస్ అదీ తెలియదా? తేట గీతిలో పూరిస్తాం అని అనబోతున్నారా? 
ఓహో అలాగైతే ఇది సమస్య అని ఎలానిపించుకొంటుంది? 
మీ ఉత్సాహాన్ని నేను కాదనను.
తప్పక తేటగీతిలో పూరించండి. 
ఐతే 
దానితో పాటు కందంలో కూడా పూరించాలని నా కోరిక.
ఓస్ ఇంతేనా అనబోతున్నారా? 
అబ్బే.అంతే  కదండోయ్! 
ఉత్పలమాలలో కూడా పూరించాలి
ఇహ సరిపోతుందా? ఇంకా చాలదా అనబోతున్నారా? 
నిజమే! చాలదండి. 
చంపక మాలలో కూడా పూరించాలి అని నాకోరిక. 
సరిపోతుందా బాబూ? మీ ఆశకు అంతు లేదా? అని మీరంటా రేమో! 
నిజమే నా శకు అంతు లేదు.
మీ సామర్థ్యాన్ని మొత్తం లోకానికి తెలియ జేయాలని; 
మీలో ఉన్న కవితా పాటవాన్ని బహిర్గతమయ్యేలా చేయాలని నా ప్రగాఢ ఆకాంక్ష. 
అందుకే చివరిగా  ఒక్క చిన్న కోరిక. 
మరి చెప్పుతున్నాను నన్ను తిట్టకండేం. 
చెప్పమన్నారా? 
ఐతే వినండి.
ఈ సమస్యను చంపక మాలలో;ఉత్పలమాలలో;  కందంలో; తేట గీతిలో; లేదా చంపక లేక ఉత్పలమాలలోనే కందం; గీతం; గర్భితమయ్యేలాగ మీరు పూరించి నా ఆకాంక్ష తీర్చండి. 
ఆ శారదా మాత మీకు తోడుగా ఉండి తప్పక ఒప్పిదమయేలాగ నడిపిస్తుంది. మీకు కల ప్రగాఢమైన భక్తి; విశ్వాసం మీచేత వ్రాయిస్తుంది. 
వాంఛితార్థ ఫల సిద్ధిరస్తు.
జైహింద్.

12, ఏప్రిల్ 2010, సోమవారం

సర్వ లఘు సీస రచనలు. ఆధునిక కవుల స్పందనతో రచనలు.

3 comments


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhCqyFM6gXZqK89lWT1LqGJIBiwxwKc-m9W_6U_1vl1qchl9cFpL_oecjBFbXmwzYSY-BV61Ds94MHOSn0ac1tjEfMB5N-48UkU7QoTGeTy-D9Ezr80HH7erNSHe4tQCdy1tamkc8mRHpE/s200/22wd11.JPG
పలికెడిది భాగవతమట; 
పలికించు విభుండు రామ భద్రుండట; నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలికగనేలా! అనిన
పోతన మహాకవి భాగవతమున గల వెలిగందల నారాయణ కృత  సర్వ లఘు సీసము ఉదాహరణమున కొక పద్యము మనము గమనిద్దాం.
ఇందు ఇంద్ర గణముగా నల లేదా నగ కాక నలల అనే ప్రత్యేక గణమును విధిగా వాడడం అప్పకవి మతము. ప్రతీ పాదమునా  విధిగా 36 లఘువులు  ఉండాలి. రచయితలి ఈ నియమమును గమనించ మనవి.
(అప్ప కవీయము 4 వ ఆశ్వాసము న 531 వ పద్యము చూడఁ దగును)
నవ వికచ సరసిరుహ నయనయుగ !  నిజ చరణ గగన చర నది! నిఖిల నిగమ వినుత!
జలధి సుత కుచ కలశ లలిత మృగమద రుచిర పరిమళిత నిజ హృదయ! ధరణి భరణ!
ద్రుహిణ ముఖ సుర నికర విహిత మతి కలిత గుణ! కటి ఘటిత రుచిరతర కనక వసన!
భుజగ రిపు వరగమన ! రజత గిరిపతి వినుత! సతత వృత జప నియమ సరణి చరిత!
తిమి! కమఠ! కిటి! నృహరి! ముదిత బలినిహి
త పద! పరశు ధర! దశ వదన విదళన!
ముర మథన! కలుష సుముదపహరణ 
కరివరద! ముని నరసుర గరుడ వినుత! 
(శ్రీ మహా భాగవతము ఏకాదశ స్కంధము చతుర్థాధ్యాయము. 72 వ పద్యము.)
ఇదే విధంగా ఒక సర్వ లఘు సీసమును పట్టణమున వసించుచున్న శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు అష్టావధాని గారీమధ్యనే విరచించిన శ్రీమదధ్యాత్మ రామాయణము అను బృహత్తర గ్రంథమున షష్ట్యంతములలో శ్రీరాముని వర్ణిస్తూ  వ్రాసి యుండిరి. ఇది వినుటకు చమత్కారముగ నుండి హృదయానంద హేతు వగుచున్నందున మీ ముందుంచుచుంటిని. ఇక చూడుడు.
సీ:-
జలజ హిత కుల కలశ జలధి హిమ కిరణునకు - దశరథుని తనయునకు నశికి హరికి;
జనక సుత హృదయమున తనరు ప్రియ సదనునకు - జన హృదయ నిలయునకు సహృదయునకు;
దివిజ గణ వినుతునకు; దితిజ గణ శమనునకు - జగదవన నిరతునకు జన హితునకు;
భవ భయములను దొలచి; పరమ సుఖములనొసగు - పరమ పురుషునకు పురహర సఖునకు
తే.గీ. 
వనజ దళ నయనునకు శుభ చరితునకు; 
సవన ఫలదునకు నిగమ చయ నుతునకు;
దశ వదన ముఖ సురరిపు తపనజునకు;
కలిత భుజునకు విభునకు కపి హితునకు!
ఈ పద్యము నాదర్శముగ తీసుకొని ఉత్తేజితులైన మన యువ కవులు కొందరు అత్యద్భుతముగ సర్వలఘు కంద; గీత; సీస; ఉత్సాహ; ఆటవెలది; మున్నగు పద్యములు వ్రాసి ఆంధ్రామృతముగా పాఠకులకందించిరని తెలియ జేయుట కానందంగా ఉంది.  
ఆ పద్యాల్ని కూడా చూద్దాం.
సీ:-
నిరతము భగవతి కరుణను రసనము సరసకవితలకు సదనమవద?
తిరముగ కృపనిడి గురువులు నడుపగ కవితలు పొరలవె? కలము కదుప
రసమయజగమున మసలుచు మురిసెడి శుకపికములవలె సుమధురముగ
తెలుగున పదములు వెలువడు బుధజనవినుతికి సరిపడు విధముగ సుధి!
ఆ:-
వెదురునుసురు పడయు! విదురవినుతుఁ చెయి
తగిలి మురళియగును, తపము ముగిసి
నుడివెనటులనిపుడె జడమతియు కవిత,
తమరి కరుణ కలిగి సుమతి! వినుమ  (రచన సందీప్)
క:-
సందీపూ! నీ వ్రాతన్
సౌందర్యోపేతమంచు; సర్వుల్ పొంగన్
డెందంబందెన్హాయిన్.
సందున్నన్పద్యమల్ల సౌమ్యుల్ మెచ్చున్. (నేను)
క:-
మీ భాషాఙానంబున్
మా బాగాచూపినారు, మాబోటుల్ మి
మ్మున్ భూషించన్ శక్యం
బే? భాషాభానుమూర్తి! విఙశ్రేష్ఠా! (సందీప్ సమాధానం)
క:-
పదముల యమరిక నెఱిగిరి.
పదునగు పదములను కలిపి విలువలు పెరుగన్
యెదలను కదుపుట నెఱిగిరి.
సదయులగుచు నను మదినిడి సఖులయితిరిగా! (నేను సందీప్ నుద్దేశించి.)

సీ.
జయము హరునకు, త్రిజగముల ధవునకు, 
గజగరసు ధరుడు, గజముఖు పిత,
వెలికరువ విడిది, వెనదగు పెనుపరి
అనవరత స్మరిత హసిత ముఖుడు,
మదనదహనుడు, అమరనదవహి, ధరఁ
మసనములఁ దిరుగు అసుర నుతుడు 
శిఖిరథి సవితుడు, మఖహతకుడు, హిమ
గిరిసుత పెనిమిటిఁ, దిరిపెమునకు,
తే.గీ.
ఎలమి నలు దిసలనుఁ దన వలువలుగఁ దొ
డగిన అహిధరుడు,బుడబుడకల పతికి,
కమలభవు శిరము చెలగి కసిమసగిన
తరుణ శశిధర శశిముఖ పరమ శివుఁకు.  (రచన రవి)
క:-
రవి కృత కవనము చదివితి.
సువిదిత మగుటను మనమది సుఖమును గనె. భా
రవి కననివియును కనుగొనె!
రవికిని రవి సరిసముఁడగు రచనలు సలుపన్.  (నేను)
క:-
గురువులు తమరును మాకును
అరయముగ నిటుల కవితను ఆలాపింపన్
విరివిగ వ్రాయగ లేమొ? త
మరి ఆశీర్వచనములను మాకందింపన్.  (రచన రవి)
క:-
వ్రాయన్; వ్రాయించన్ నే
మీ యందీ ప్రశ్ననుంచి మేలౌనట్లున్
ధ్యేయంబున్ గల్గంగా
వ్రాయంగా లేని దేది? భవ్యాత్ముండా!  (నేను రవినుద్దేశించి)
ఆ.వె:-
విరిసి కురుల విరులు మరులుగొనమదియె 
నిదుర చెదరి, పడకనొదుగజతగ 
సతి కదలి యొరిగెను పతిదెసకు, కనియె 
శశి నిలచె కదలక సరసుడగుట. (రచన ఊకదంపుడు)
క:-
దోషం బెన్నన్ గానన్.
ధ్యాసన్ వ్రాయన్ సఖుండ! తప్పేలుండున్?
మీ సత్వంబే గంటిన్.
భాషా సంస్కారముండె. బాగుండెన్గా!  (నేను ఊకదంపుడు నుద్దేశించి)
కం.
హరిణపు తతి పగిది పరుగు,
సురవన సుమసరము వలెను సొబగుల నెలవై
సరి లఘువుల నడకల సిరి
సరసపు హృదయపు బహుమతి సభికులకిదిగో!
సీ.
ముదమున నెగసెను పులకరమున యెద - తమ తమ కవితల సుమధురిమల రుచి
పలు దినముల పిదప దెలియగ మదికి - కలమది నుఱుకుల గదలగ రసమయ 
పదములు పొదిగియు హృదయములలరగ - పదునగు లఘువులు పలుకుల నమరగ
రచనము విరిసెను రయమున గదులుచు - ఒడుపది తమరిదె, కడు కడు నెనరులు!
ఆ.వె. 
నిలువని గమనమున పలు తళుకుల సిరి
కుదురుగ లఘువులవి కొలువవగను
రసికులు, గురువుల వరములకు బదులుగ
మిలమిల నిగనిగలు మెఱిసెనిచట
తే.గీ.
సభను కవులు గలిసిచట నిభసమముగ
కలముల లఘువున నడుపగ వెలసెనివె
కవితలు, కొలనిని కలువల వలె విరిసె,
విని విరిసిన మనసులవి వెలుగులిడగ
ఉత్సాహ.
పదుల లఘువులొకటి యవగ పలుకు మధురమయెనుగా
నదిని అలల పగిది గలసి నడచి సొగసునలరగా
ఎదను సుధలు పదముల డిగి* యెదుట పడిన క్షణములో
వెదుకదలచు నిధియె దొఱికి విరిసె మనసు రతనమై
కం.
ఒడిదుడుకుల నడకల వడి
తడబడినది యచటనచట తలవని తలపై,
కడకెటులనొ సరి యడుగుల
బడి పరుగిడెననుకొని వదరితి నిచటన్  ( రచన .C)
క:-
భ్రాతా! నీ పద్యంబుల్
నే తీరిగ్గా పఠించఁ నీమాలెల్లన్
తోతెంచెన్, సీసంబం
దున్ తప్పేనే? గణించు, దోషంబెంచన్  ( .C నుద్దేశించి సందీప్ రచన)
క:-
తమదగు యతనము ఘనమది.
సుమధుర మనఁ దగదు. కనగ సురుచిరమగు సీ
సము తుదఁ గల రవి గణములు
సమముగ యొనరగ యతనము సలిపిన కుదురున్. ( .C ని అభినందిస్తూ నేను వ్రాసినది)
కం.*
Impatience is culprit
Compensation hitherto coughed up promptly!
Some patience I need - More
important is remembering this mistake!
కం.
రామా! కృష్ణా!** చెప్పా
రేమా తప్పేంటనంచు నిట్లా జూస్తే...
ఏమంటా, నేనైనా?
ధీమాగా తప్పు జేస్తి, తేలిందద్దే!
కం.
ఏమో, ఏం చేస్తాంలే!
ధీమాతో చూడలేదు - This is so true!
నీమాలేం గుర్తే లేవ్!
ఆ మాటే ఒప్పుకుందు నంతే, సత్యం!
క.
సీసాల్లో సూర్యుండా?
ఓసోసంతే గదాని ఓ లుక్కేస్తే
చూసానింకంతే shock!
ఓసారీ లేడినుండు యింద్రుల్ నిండన్!
సీ.
"రవి" యగుపడనటుల మొయిలొకటి యట "సురపతి" నిలిపెను, సొగసు చెడెను
రవిని గనని కవిని విడువదె నిశియు! మరులు గొలిపెను అమరుల ప్రభువు
తిమిరమది మది నతిగ బరచుకొనెను, కనుకనె గనకనె మునిగితినిట
సురల విధములవి పరిపరి యగునట, తెలియని మరుడను, వలను పడితి!
తే.గీ.
అకట, తికమకలగు యమరికల నడుమ
తడబడెను పదము తుదకునడుసున వడి!
తెలిపిన గురువులకు నెనరులివె గొనుడు .
చివరను దెలుపుటది పొగరవదు, నిజము! 
(అది చివర బలుక పొగర ననుకొనకుడు) ( నేను వ్రాసిన దానికి .C సమాధానం)
ఆ.వె:-
అదరగొడితిరిచట మధుర కవనములు
ఒకరి మిగిలి యొకరు ఉరికి యురికి
లఘువు బలిమి తెలుపు రచనలు సలిపిరి
గురువు దెసనె గనక గురువు లయిరి
ఆ.వె:-
గురువులిట బరువట, కుదరవట అకట!
లఘువు లిముడ వలెను లలితముగను 
గురువు లగుట వలన కుదురును తమరికి
లఘువు కిటుల తెలిసె రచన కిటుకు  (రచన  చదువరి)
క:-
కలికిరొ! చిలుకల పలుకులఁ 
సలలితముగ సరస మృదుల చవులు కనబడన్;
బలుకుచు; పలుపలు విధముల
మెలకువలను గొలుపుదువుగ మిగులుగ! మృదులా! 
(దైవ దత్త సహోదరీ శ్రీమతి నేదునూరి రాజేశ్వరి నుద్దేశించి నేను)
అత్యద్భుతముగా స్పందించి చక్కని రచనలు చేసి పంపినవారినందరినీ అభినందిస్తూ; ధన్యవాదములు తెలుపుకొను చున్నాను.
జైహింద్.