గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 91వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

91. ఓం శ్రీనివాసాయ నమః.

వసంతమంజరి వృత్త గర్భ సీసము. 

నినుఁ గనన్ నరసింహ! నిరతము నేనిటన్ - భజియింతు నిన్ మహద్భక్తితోడ.

కనులకున్ గనిపించు ఘనతను గానఁగన్ - కరుణాలయావచ్చి కావుమయ్య.

మునులకున్ గనిపించు ఘనుఁడవుముందు  - న్బడు నాకికన్నీవు పద్మనాభ!

నిను విడన్. గమనించు నను నిల నీ పదాం - బుజ సేవకున్మహత్పూర్వ దేవ!

గీ. వినుత సువసంత మంజరీ వృత్త గర్భ - సీస సంభాస! జయము శ్రీ *శ్రీనివాస*.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

91 సీస గర్భస్థ వసంత మంజరి వృత్తము. (       .. యతి 13)

నినుఁ గనన్ నరసింహ నిరతము నేనిటన్ భజియింతు నిన్.

కనులకున్ గనిపించు ఘనతను గానఁగన్ కరుణాలయా

మునులకున్ గనిపించు ఘనుఁడవుముందు కన్బడు నాకికన్

నిను విడన్ గమనించు నను నిల నీ పదాంబుజ సేవకున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నరసింహా! నిన్ను చూచుటకు నేను గొప్ప భక్తితో

భజించుచుంటిని. కరుణాంతరంగా! నీ ఘనత మేము చూచునట్లుగా మా కనులకు కనిపించుము. వచ్చి మమ్ము

కాపాడుము.. మునులకు కనిపించువాడవు కదా నీవు వచ్చి వేగముగా నాకు కనబడుము. . మహిమాన్విత దైవమా!  నిన్ను

నేను వీడను. నీ పాద సేవకుఁడను.. నన్ను చూడుము. వసంతమంజరీవృత్తగర్భసీసపద్యమున ప్రకాశించు శ్రీనివాసా! నీకు

జయము పలుకుదును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.