గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2018, సోమవారం

శ్రీమన్నారాయణ శతకము. 11/20వ భాగము. 51 నుండి 55 రచన చింతా రామకృష్ణారావు

1 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
51.  శా. ఔన్నత్యంబున వెల్గు సజ్జనుల భావౌన్నత్యమే దుష్టులం
దున్నన్ మేలుగ సాగదే జగతి? భావోదారులై  శిష్టులై
పున్నామాదుల చేరకుండి. నిను సత్పూజ్యున్ మదిన్ గొల్త్రు. శ్రీ
మన్నారాయణ ! సత్ప్రవర్ధనమగున్. మంచిన్ ప్రవర్ధించుమా.
భావము.   ఓ శ్రీమన్నారాయణా! ఉన్నతముగా ప్రవర్తించు సజ్జనులలోనుండే భావౌన్నత్యమే దుష్టులయందునూ ఉండినచో ఈ లోకము మంచిగా కొనసాఢదా ఉదార భావులై మంచిగా ప్రవర్తించువారై పున్నామాది నరకమంలకు చేరక సత్పూజ్యుడవయిన నిన్ను తమ మనసులో కొలుతురు. మంచి వృద్ధియగును. అందువలన మంచిని నీవు వృద్ధి చేయుము.

52.
శా. ఎన్నాళ్ళీ కొఱగాని కర్మ ఫల దుష్కృత్యంబులం జేయు టిం
కెన్నాళ్ళీ దురపిల్లు కర్మ గతులన్ హేయంబుగానుంట? నీ
వన్నీ జూచుచు మిన్నకుండుదు విదేమైనన్ ప్రమోదంబొ? శ్రీ
మన్నారాయణ! కర్మలం గడిపి, ప్రేమన్ ముక్తి కల్పింపుమా.   
భావము శ్రీమన్నారాయణా! ఎన్నాళ్ళవరకూ వ్యర్థమైన పురాకృత కర్మఫలములుగా సంప్రాప్తించిన దుష్కృత్యములను చేయుటఇంకా ఎన్నాళ్ళు దుఃఖించు కర్మగతులలో హీనముగా జీవించుట? అన్నీ నీవు చూచుచుండియు మిన్నకుందువు. ఇదేమైనా సంతోషమా? కర్మలను పోఁ జేసి ప్రేమతో మాకు ముక్తిని ప్రసాదించుము.

53. శా. కన్నుల్కాళ్ళును , జేతులున్, దనువు, నోంకారోజ్వలచ్చిత్తమున్
మన్నైపోయెడి దేహమున్ జెవులు , సమ్మాన్యోన్మహజ్జిహ్వయున్
కన్నా ! నీ కథలాలకించు చెవులున్ , కానంగ నీచేత శ్రీ
మన్నారాయణ ! వెల్గు. నీవరిగినన్ మాయున్ గదా యిన్నియున్.
భావము.  ఓ శ్రీమన్నారాయణా! బాహ్యేంద్రియములు , జ్ఞానేంద్రియమగు చిత్తము. నీవు శరీరములో నుండుటచే ప్రకాశించును. నిత్యుడవైన ఓ హరీ ! నీవు శరీరమును వీడి పోయినచో ఇవన్నియు మాసిపోవును కదా. ప్రాణశక్తివైన నీవే నిత్యుడవు. భౌతికమైన యీదేహాదులు అనిత్యములే.

54.శా. చెన్నారన్ నను చేర్రఁదీసిన హరీ ! శ్రీనాథ ! సర్వేశ్వరా !
ఎన్నాళ్ళైనను నీ పదాబ్జములు నా హృత్పీఠిపై నిల్పెదన్.
నిన్నే నమ్మిన నన్నుబోలు జనులన్ , నిర్భాగ్యులన్ బ్రోచు శ్రీ
మన్నారాయణ ! నీ కృపన్ దెలుపగా మాకౌనె ? సంపత్ఫ్రదా !     
భావము.  ప్రేమతో నన్ను చేరదీసినవాడవైన ఓ శ్రీ నాథుడా ! ఓ సర్వేశ్వరా ! ఎంత కాలము గడచినను నేను నీ పాద పద్మములను నా హృదయమనెడి సింహాసనముపైననే నిలిపి ఉంచెదను. నిన్నుమాత్రమే  నమ్మియుండెడి నావంటి  ప్రజలను , నిర్భాగ్యులను  ప్రోచెడి ఓ శ్రీ మన్నారాయణా ! ఓ సంపత్ప్రదుడా ! నీకు గల కృపాస్వభావమును వివరిఃచుట మాకు తరమగునా ! 

55. శా. నిన్నే నమ్ముచు మన్ననమ్మున మనన్ నే భావనన్ జేతు,
న్నెన్నో వేదనలంటి చిత్తమున నిన్నేకాగ్రతన్ గొల్వనీ
వెన్నాళ్ళీవిధినుంచనెంచితివి? రావేలన్ ననున్ గావ? శ్రీ
మన్నారాయణ! వేదనల్ సమయ నీమంబొప్ప నిన్ గొల్వనా?   

భావము.  ఓ శ్రీమన్నారాయణా! నేను నిన్నే నమ్ముకొని గౌరవముగా జీవించవలెనని భావించుదును.కాని ఎన్నో విధముల బాధలు నా మనసును చుట్టిముట్టి నిన్ను తదేక దీక్షతో కొలవనీయకున్నవి. ఎన్నాళ్ళీవిధముగా నన్ను నీవు ఉంచవలెననుకొనుచుంటివి? ఈ వేదనలను బాపి నన్ను కాపాడుటకు రావేమి? నా బాధలు సమసిపోయినచో ఏకాగ్రతతో నిన్ను నేని సేవించుదును కదా! 
జైహింద్.

29, ఏప్రిల్ 2018, ఆదివారం

శ్రీమన్నారాయణ శతకము. 10/20వ భాగము. 46 నుండి 50 రచన చింతా రామకృష్ణారావు

1 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
46. శా. నన్నున్ గావగ రమ్ము నీవనినచో నా స్వార్థమే యౌను. నీ
వున్నావందరికోసమంచు కని , దీనోద్ధారకా ! స్వార్థమున్
మున్నే వీడి , నమస్కరించుట తగున్ , పూజ్యుండ ! నీపైన శ్రీ
మన్నారాయణ !  భారముంచ , కృపతో మన్నించి రక్షింపవో
భావము.  దీనోద్ధారకుడవైన ఓ శ్రీమన్నారాయణా ! నన్ను కాపాడుట కొఱకు నిన్ను రమ్మనినచో అది నా స్వార్థమే అగును కదా. ఆ విధముగా కాక , నీవున్నది ఆందరికోసమూనని భావించి , స్వార్థమును వీడి , నీకు నమస్కరించి , నీపై భారము వేసినచో కృపతో నీవే మమ్ము రక్షింపకుండా ఉండ గలవా?

47. శా. పిన్నల్ పెద్దలు మంచి చెడ్డలనుచున్ పేర్కొంచు సిద్ధాంతముల్
నిన్నున్ నమ్మిన వారినెన్ని పలుకన్  నీవారు సందేహులై
యూన్నావంచును లేవటంచు మదినెన్నో భావముల్పొంద, శ్రీ
మన్నారాయణ ! సత్యమున్ దెలుపుచున్ మాన్పింతువే శంకలన్. 
భావము.  ఓ శ్రీమన్నారాయణా ! చిన్నవారూ , పెద్దవారూ కూడా నిన్ను నమ్మియున్న భక్తుల వద్ద ఇది మంచి , ఇది చెడ్డ అనుచూ ఏవేవో సిద్ధాంతీకరించి చెప్పుచుండుట చేత నీ భక్తులు సందేహములో పడినవారై నీవు ఉన్నావని , లేవని , మనసులో అనేక భావములను పొందుచుండ, నీవు సత్యమును తెలియ జేయుచు సందేహములను పారద్రోలుదువు కదా.

48. శా. భిన్నత్వంబుననేకతన్ గలిగి నీవే మాకునన్నింటిలో
నున్నావంచు నెఱుంగఁ జేయు మతితో నొప్పారితో ? కానిచో
కన్నుల్ ముందట నుండి యుందువు కదా కన్పించుచున్ మాకు. శ్రీ
మన్నారాయణ ! మా ముదంబు కొఱకై మా ముందె నీవుండుమా !     
భావము. ఓ శ్రీ మన్నారాయణా!  అన్నింటిలోను మాకు నీవు ఉన్నావనుచు తెలుపుట కొఱకు మా ముందే భిన్నత్వములో ఏకతను కలిగి  యుంటివా? అటుల కానిచో మా కన్నుల ముందరే మాకు కన్పించుచు ఎదురుగా ఉండెడివాడవు కదా.  మా సంతోషము కొఱకై మాకు ఎదురుగా ఉండుము.

49. శా. కన్నుల్ మూసిన నీ పదాబ్జములనే కాంచన్ మదిన్ గోరుదున్.
కన్నుల్ చూచిన నీ స్వరూపమొకటే కాంక్షింతు చూడంగ. నీ
సాన్నిధ్యంబునె కోరుదున్నిరతమున్ సాయుజ్యముం గోరి. శ్రీ
మన్నారాయణ ! మార్గమీవె కద సన్మార్గంబు నే చేరగన్.
భావము.  ఓ శ్రీమన్నారాయణా ! నా కన్నులు మూసియున్నప్పుడు నీ పాదపద్మములనే చూడ గోరుదును.  నా కన్నులు చూచుచుండు సమయమున నీస్వరూపమును మాత్రమే చూడ గోరుదును. నీ సాయుజ్యము చేరుటకు ఎల్లప్పుడు నీ సాన్నీధ్యమునే కోరుదును. నేను సన్మార్గమును జేరుటకు మార్గము నీవే కదా!

50. 
శా. నిన్నే సూర్యునిగా తలంచితినిపో నీవుండవే రాత్రులన్.
నిన్నే చంద్రుడవంచు నెంచ గనినన్ నీవుండలేవే పవల్.
నిన్నున్ వాయువనంగ న్యాయమగునీ నిశ్వాస, యుచ్ఛ్వాస, శ్రీ
మన్నారాయణ ! నీవె రాత్రి, పవలున్మా ప్రాణశక్తి ప్రదా !    

భావము. మాప్రాణశక్తినొసగువాడా ! శ్రీమన్నారాయణా ! నిన్నే నేను సూర్యునిగా భావించినచో నీవు రాత్రులందు కానరావు కదా. పోనీ చంద్రునిగా తలంచుదమన్న నీవు పగలు కానరావు. నిన్ను వాయువుగా భావించుటయే న్యాయము.  ప్రాణికోటికి ఎల్ల వేళల ఈ ఉచ్ఛ్వాస , నిశ్వాస నీవేకదా.  
జైహింద్.

28, ఏప్రిల్ 2018, శనివారం

శ్రీమన్నారాయణ శతకము. 9/20వ భాగము. 41 నుండి 45 రచన చింతా రామకృష్ణారావు

1 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
41. శా.  సున్నా పూర్ణము. సృష్టి మూలము. సుధీశుల్ నిన్ను పూర్ణంబుగా
నెన్నున్ గావున నీవు పూర్ణమగుదో? యెన్నన్ మహత్ పూర్ణుగా
కన్నుల్ గానఁ లేని రూపమున నాకాశంబునన్ నిండి, శ్రీ
మన్నారాయణ! మొత్తమీవె యగుదో? మన్నించి నన్ దెల్పుమా
భావము.  సున్నాయే పూర్ణమని, సృష్టికి మూలమని జ్ఞానులు నిన్ను పూర్ణ స్వరూపుఁడవని, భావింతురు. కావున నీవు పూర్ణ స్వరూపుఁడవా? పరిశీలించి చూచినచో మహత్తరమైన పూర్ణ స్వరూపుడుగా కన్నులు చూడలేని సుస్వరూపమున ఆకాశమంతయు నిండియుండి మొత్తమంతా నీవే నిండి యున్నావా? నన్ను మన్నించి నాకు తెలియఁ జేయుము.

42. శా. అన్నంబెవ్వనిచే సృజింపఁబడునయ్యాద్యుండు రైతన్నయే.
మన్నింపంబడునెల్ల వేళలను, సమ్మాన్యుండ నీచేతనే.
ఎన్నాళ్ళైనను మారనట్టి బ్రతుకై యిబ్బందులన్ బొందు. శ్రీ
మన్నారాయణ!  హాలికున్ గనుమ ! సమ్మాన్యున్ గృపన్ బ్రోవుమా.  
భావము. శ్రీమన్నారాయణా! మేము తినెడి ఆహారమైన అన్నము ఎవనిచే సృజింపఁబడుచున్నది? ఆది పూజ్యుఁడు వ్యవసాయము చేయు రైతన్నయే కదా. సన్మానింపఁబడువాడా ! ఆతఁడు ఎల్ల సమయములందు నీచేతనే మన్నింపఁబడు చుండును కదా. అట్టి రైతన్న బ్రతుకు ఎన్నాళ్ళైనను మారక ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉండెను కదా! అట్టి హాలికుని నీవు కరుణతో చూడుము. సన్మాన్యుఁడైన అతనిని ఎల్లప్పుడు నీవు కాపాడుచుండుము.

43. శా. ఖిన్నుండై తపియించు హాలికుననకున్ కేలిచ్చి కాపాడి నీ
వున్నావన్న నిజంబు నెన్నునటు నీవున్నన్ నిరూపించు. భా
వౌన్నత్యుండగు హాలికున్ కనుము స్నేహార్ద్రాంతరంగుండ! శ్రీ
మన్నారాయాణ! పోతనన్ గనితివే! మా రైతులన్ గానవో?     
భావము.  శ్రీమన్నారాయణావ్యవసాయము చేయు హాలికుడు కష్టములవలన శోకించుచు మిక్కిలి తపించుచుండెను అట్టి రైతునకు నీచేతిని అందించి సహాయపడి నీవు ఉన్నావన్న సత్యమును గుర్తించునట్లు నీవు న్నటులైన నిరూపించుముస్నేహముతో ఆర్ద్రమగు మనస్సు కలవాడా! ఉన్నత భావములు కలిగియున్న రైతును చూడుము. పోతన్నను చూచితివికదా, మాకు ఆహారము పండించు రైతులను కాపాడకుందువా?

44. శా. కన్నా! నీ పద సేవకై విరులు వేగంబే విడున్ బ్రొద్దుటే.
వన్నెల్ చిన్నెలు నీ పదాంకితముగా భావించి పొంగున్ మదిన్,
మున్నేపున్నెము చేసెనో కనగ నీ పూవుల్ నినున్ జేర. శ్రీ
మన్నారాయణ! నా హృదబ్జమును ప్రేమన్ నిన్నికన్ జేరనీ.  
భావము.   కన్నా! పూవులు నీ పాద సేవకొఱకు ప్రొద్దున్ననే వేగముగా వికసించును. తమ వన్నెలు, చిన్నలు నీపాదములకంకితమగునని మనసులో భావించుకొనుచు పొంగిపోవుచుండును. నీపాదములను చేరుటకు పూవును పూర్వము ఎటువంటి పుణ్యమును చేసియుండెనోకదా! శ్రీమన్నారాయణా! నా హృదయ పద్మమును కూడా ఇంక ప్రేమతో నిన్ను చేరనిమ్ము.

45. శా.  పున్నెంబో, మరి పాపమో యెఱుగ నేన్. పుష్పంబులన్ గోయుచున్
నిన్నున్ పూజలొనర్చుచుంట. జగతిం ధీశాలి పాపయ్య తా 
నెన్నెన్ పుష్ప విలాపమున్ తెలుసుగా.  హృద్యంబుగానుండు. శ్రీ
మన్నారాయణ ! పుష్పముల్ తునుముటన్ మాకబ్బవా పాపముల్

భావము.   శ్రీమన్నారాయణా! పుష్పములను తునిమి నీకు పూజలు చేయుచుండుట అను పని పుణ్యమో లేక పాపమో నేను ఎఱుఁగను. లోకమున ధీశాలియైన జంధ్యాల పాపయ్యశాస్త్రి పుష్ప విలాపమును గుర్తించి ఖండికగా వ్రాసెను. విషయము నీకు తెలుసును కదా. అది మిక్కిలి హృద్యమైన ఖండిక. విధముగ పుష్పములు తునుముట వలన మాకు పాపములు కలుగునా
జైహింద్.