గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 65వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

65. ఓం నఖాస్త్రాయ నమః.

చౌపద గర్భ సీసము.

శ్రీనరసింహుఁడ! చేకొను శ్రితుని నన్ - జిత్తంబులో నిల్చి చేరువగుము.

జ్ఞానము నీయఁగఁ గనఁబడు కలను. శ్రీ - కరుఁడ! నా తోడయి వరములిమ్ము.

మౌనము వీడుము మహిఁ గనుమ నను సన్ - మాన్యునిగా నిల మలచుమయ్య.

శ్రీనుత శ్రీహరి! చేకొను క్షితిని నన్ - మా ప్రియ దైవమా! మహిమఁ జూపు.

గీ. చౌపదాన్విత సీస సంచార దేవ! - పూజిత *నఖాస్త్ర* ! యాదాద్రి పూజ్య నృహరి.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

65 సీస గర్భస్థ చౌపద. (4మాత్రాగణములు3, నగణం, అంత్యప్రాస .. యతి 

                              3వగణాద్యక్షరము. జగణమురాదు)

శ్రీనరసింహుఁడ! చేకొను శ్రితుని. - జ్ఞానము నీయఁగ కనఁబడు కలను.

మౌనము వీడుము మహిఁ గనుమ నను - శ్రీనుత శ్రీహరి! చేకొను క్షితిని.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పూజ్య నఖాయుధుఁడా! నేను నిన్ను

ఆశ్రయించినవాఁడను. నా మనసులో నిలిచి నాకు దగ్గర అగుము.. నాకు జ్ఞానమునిచ్చుటకైనను నా కలలోనైనను

కనఁబడుము. నాకు తోడుగా ఉండి వరములు దయతో ఇమ్ము. నీ మౌనము విడిచినన్ను మహిమతో చూడుము. నన్ను

గొప్పవానిగా మలచుము. లక్ష్మీదేవిచే ప్రశంసింపబడువాడా! నాకిష్టమైన దేవా! నన్ను మహిమతో చూడుము

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.