గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఏప్రిల్ 2021, బుధవారం

శ్రీ శంకర భగవత్పాదుల జీవిత విశేషాలు

0 comments

జైశ్రీరామ్
శ్రీ శంకర భగవత్పాదుల జీవిత విశేషాలు 
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు.
 (శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి). 


శ్రీ శంకర భగవత్పాదులు భారత దేశంలో అవతరించిన తత్త్వవేత్తలలో అగ్రగణ్యులు, దార్శనికులలో కైలాస శిఖర సన్నిభులు. భారతీయ తత్త్వ జిజ్ఞాసా పరిణతకు దర్పణం శంకరుల రచనలు.

పరమేశ్వరుడు మానవ జాతికి జ్ఞానభిక్ష పెట్టుటకై కృతయుగమున దక్షిణామూర్తి రూపమున, ద్వాపర యుగమున వేదవ్యాస రూపమున, కలియుగమున శ్రీశంకర భగవత్పాద రూపమున అవతరించెనని భారతీయుల విశ్వాసం. శంకరులు ఎనిమిదవ యేటికే వేదాధ్యయనం పూర్తి చేశారు. పదహారు సంవత్సరాలు వచ్చు నప్పటికే గొప్ప తత్త్వ వేత్తగా ఆచార్యునిగా ప్రసిద్ధి పొందారు.

ఆ నాడు దేశ ప్రజలలో అధర్మం పెరిగిపోయింది. వేదవిహిత కర్మాచరణం కనుమరగు కాజొచ్చినది. బౌద్ధుల వేదవిరుద్ధ సిద్ధాంతప్రచారము ప్రచండంగా సాగుతోంది. శాక్తేయుల వామాచారము, జంతు బలులు మితిమీరినవి.

ఐహిక సుఖములే ముఖ్యమను చార్వాకుల ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.

సౌర, అగ్ని, హిరణ్యగర్భ, వీరశైవ, శూన్యమతము వంటి 72 మతములు బయలు దేరి అవైదిక ఆచారాలను వ్యాప్తి చేస్తున్నాయి. మొత్తము మీద సంఘమంతా నీతి బాహ్యమై అల్లకల్లోలంగా ఉంది. భౌగోళికముగా కూడా దేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఛిన్నాభిన్నమయ్యే దశకు చేరుకుంటోంది. అటు రాజ్య విస్తరణ ఆధిపత్యముల కొరకు యుద్ధాలు జరుగు చున్నట్లే, మా మతము గొప్పదంటే మా మతము గొప్పదని సాత్త్విక ఆధిపత్యము కొరకు కూడా నిరంతర పోరాటం జరుగుతున్నది.

దేశ సంక్షేమ, సమైక్యతలు సాధించుటకు, ప్రజానీకమును ఏకోన్ముఖులు గావించ గల శక్తి ఒక్క అద్వైతానికే ఉన్నదని భావించారు శంకరులు, సనాతన ధర్మము సమాజమున సుప్రతిష్ఠిత మగుటయే పరమ లక్ష్యమైనది. అద్వైత ప్రచారం, ఆర్ష సంస్కృతీ పరిరక్షణ భారతీయ జీవన స్రవంతిలో కలకాలం కొనసాగాలని సంకల్పించి, నాలుగు మఠామ్నాయ పీఠాలను శృంగేరి, ద్వారక, పూరీ, బదరీ క్షేత్రాలలో స్థాపించారు. పాశ్చాత్య పాలనానంతరమే రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఐక్యత సంభవించినదనుకొనుట ఒక అపప్రద అని నిరూపించుటకా అన్నట్లు 8వ శతాబ్దముననే భారతదేశమున ధార్మిక సాంస్కృతిక ఐక్యతను పునరుద్ధరించారు.

ఉత్తరాది మహిష్మతీ నగర విద్వాంసుడగు సురేశ్వరులు దక్షిణాది శృంగేరి మఠ ఆచార్యుడైనాడు. దక్షిణాది బ్రాహ్మణోత్తముడగు తోటకాచార్యుడు ఉత్తరాది జ్యోతిర్పీఠాధిపతిగా నియుక్తుడైనాడు, కేరళ నంబూద్రి బ్రాహ్మణులు బదరిలో పూజారులుగా, కర్ణాటక దేశీయులు నేపాల్ లోనూ, మహారాష్ట్ర విప్రులు రామేశ్వరంలోను
అర్చకులుగా ఉండవలెనని నియమం చేశారు. ఇంతకన్న మహోదాత్తమైన జాతీయ సమైక్యతా సంఘటన మరొకటి కలదా అని ఆశ్చర్యం కలుగుతుంది.

వేద ధర్మం నేటికీ నిలిచి ఉన్నది అంటే దానికి కారణం శంకరుల కృషియే. ఆర్ష ధర్మాన్ని వ్యతిరేకించే శక్తులు వక్రీకరించే శక్తులు ఆనాడు కూడా ప్రబలంగా ఉన్నాయి. శ్రీ శంకరులు ఒక్క చేతి మీదుగా ఆ శక్తులను ఎదుర్కొని వేద ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని పునః ప్రతిష్ఠించారు.

దీనికి వారుపయోగించిన సాధనం కేవలం జ్ఞానమార్గమే! అంతకు పూర్వం రామకృష్ణాది అవతారములలో ధర్మానికి భౌతిక అవరోధములే ఎక్కువగా ఉన్నందున క్షాత్రధర్మమే పనికి వచ్చింది.

కాని కలియుగంలో ధర్మచ్యుతి మానసికమైన, ఆంతరంగికమైన అవరోధాల వల్ల యేర్పడింది. అందువల్ల వీటి నిర్మూలనకు జ్ఞాన ఖడ్గాన్ని ఉపయోగించాల్సి వచ్చింది.

తదనుగుణంగానే వేదవేదాంగ వేత్తలైన సద్బ్రాహ్మణ వంశంలో జన్మించడం సంభవించింది. మతసహనం మృగ్యమై, వేద ధర్మాన్ని భ్రష్టు పట్టించి, కులమత వ్యాప్తికి దోహదం చేసిన దురాక్రమణలను ఎదిరించి నిలచి, ఈనాటి స్థితిలో ఆర్ష ధర్మం విలసిల్లుతోందంటే - అది శంకరుల భిక్షయే అని చెప్పవచ్చును.

ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో శంకరుల ధార్మిక విజయాలు అత్యంత విలక్షణమైనవి. భారతదేశమంతటా విజయయాత్రలు సలిపి, వైదిక ధర్మాన్ని, అద్వైత సిద్ధాంత వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటారు. దండి, భట్టభాస్కరుడు, అభినవగుప్తుడు, మురారి, ఉదయనాచార్యుడు, కుమారిలభట్టు, మండనమిశ్రుడు వంటి ఉద్ధండ పండితులను తన వాదపటిమతో ఎదుర్కొని, అద్వైత మార్గాన్ని అనుసరింపచేశారు శంకరులు.

బ్రహ్మసూత్రములకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు అసదృశమైన వ్యాఖ్యానాలు రచించారు. తర్క వేదాంతాలలో జ్ఞానానికి శంకరుల భాష్యాలు, భక్తిప్రపత్తులు, ఆచరణ జ్ఞానము పెంపొందించుకోవటానికి వివేకచూడామణి, ఆత్మ బోధ, అపరోక్షానుభూతి, ఆత్మానాత్మ వివేకం, ఉపదేశసాహస్రి వంటి శంకరుల ప్రకరణ గ్రంథాలు అధ్యయనం చెయ్యాలని అంటారు. తాను నమ్మిన అద్వైత సిద్ధాంతం పట్ల సమగ్ర అవగాహన మాత్రమే కాదు, సంపూర్ణముగా అనుభూతి చెందిన పరిణతి శంకరులది. అందుచేతనే శంకరుల రచనలలో ఎక్కడా వైరుధ్యం గానీ అసహజత గానీ, అస్పష్టత గానీ గోచరించదు.

అల్పాక్షర మసందిగ్ధం సారవద్విశ్వతోముఖం
అస్తోభ మనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః

అన్న శ్లోకానికి భాష్యం అనదగ్గవి శ్రీ శంకరుల రచనలు.

32 సంవత్సరాలు మాత్రమే జీవించిన అల్పాయుష్కులు శ్రీ శంకరులు. అయితేనేం శతాయుష్కులు అనేక మంది చేయదగు మహత్కార్యాలు చేసి మార్గ దర్శనం చేసిన మహనీయులు. సర్వ జనులకు ఉపయోగ పడునట్లు వారి వారి యోగ్యతానుసారము ఆచరింప వీలగు సర్వ సాధనా మార్గములను వివిధ గ్రంథముల ద్వారా విశదపరిచారు.

అత్యల్ప జీవిత కాలంలో వారు 24 భాష్య గ్రంథాలు, 85 ప్రకరణ గ్రంథాలు, 91 స్తోత్ర గ్రంథాలు రచించారు. ఈ బృహత్ గ్రంథరాశికి తోడు శిష్యులకు శిక్షణ, అన్యమత, అన్య సిద్ధాంత కర్తలతో శాస్త్ర వాదములు, చతురామ్నాయ మఠ స్థాపనం వంటి బృహత్కార్య భారాన్ని నిర్వహించిన ప్రజ్ఞాధురీణులు శంకరులు.

"ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అని నమ్మిన ఆచార్యులు ప్రధానంగా ప్రజలలో మత ఐక్యతకు, ధర్మాచరణకు పాటుపడ్డారు గాని ఒకే మతం ఉండాలని అనలేదు.

అందు వల్లనే పంచాయతన పూజాది ఆరాధనా విధానములను ప్రవేశపెట్టారు. సర్వ దేవతారాధనలను సవరించి, సమన్వయ పరచి షణ్మత స్థాపనాచార్యులుగా ప్రసిద్ధి చెందారు. పాదచారులై భారతావనినంతనూ ముమ్మారు సంచరించి - పరివ్రాజకులై, ప్రవక్తలై, సంఘ సంస్కర్తలై, కవీశ్వరులై ఆర్షధర్మ వైభవానికి పునర్జన్మ నిచ్చిన కారణ జన్ములు. వారి కృషి, వారి ఉపదేశాలు, ప్రతి క్షణం ప్రతిదినం స్మరించదగినవి.  శ్ఆశ్టీ

జైహింద్.