గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

వృత్త పద్య రచన సాధన చేద్దామా? 3

6 comments

Wednesday, April 8, 2009 వ తేదీన వృత్త పద్య రచన సాధన చేద్దామా? 2 వ భాగంలో వృత్త పద్యమున యతి ప్రాస నియమములను తెలుసుకొంటూ ఊత్పల మాల వృత్త లక్షణాన్ని కూడా తెలుసుకున్నాం.

ఇప్పుడు ఆ ఉత్పల మాల వృత్త పద్య రచనకు సాధన చేద్దామా?
ఐతే ఈ పని మన పరస్పర సహకారం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. ఇంక మనం ఏంచెయ్యాలో ఆలోచిస్తే ఒక్కొక్క పద్యాన్ని మనం అందరం కలిసి పూరించే ప్రయత్నం చేస్తూనే దోషాలుంటే పరస్పరం తెలుపుకొంటూ సరి చేసుకోవడం ద్వారా సరిగా నేర్చుకొంటూ రచనలో పురోగమిద్దాం.

విషయానికొస్తే ఈ మధ్య అంతర్జాల భువన విజయంలో గొప్పగొప్ప కవులు అతి సునాయాసంగా చేసిన పూరణలకు సంబంధించిన సమస్యలను మనం కూడా మన తరహాలో పూరిద్దాం.
ఈ క్రమంలో నేను ముందుగా సమస్యను మీ ముందుంచుతున్నాను. మీరు మోత్తం పూరించెస్తే మహదానందం. అలా కాకుండా ఒకటి లేక రెండు పాదాలు మీరు పూరించి మిగిలిన పాదాలను పూరించే ఆసక్తి గలవారు పూరించేలా అవకాశమిద్దాం. అప్పుడు ఉత్పల మాల రచన కూడా సులభతరమౌతుంది. ఏమంటారు?

----------------" భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుడూనె గర్భమున్ "-----------------

ఇదండి సమస్య.
ఇది ఉత్పల మాల వృత్త పాదం.
ఈ పాదం ఆ వృత్తంలో ఏ పాదంలో లైనా ప్రయోగించుతూ సమస్య ను విడగొట్టి పద్య పూరణ ద్వారా మన ప్రతిభను తేర్చి దిద్దుకుందామా మరి. ఐతే మీరు మీ పూరణకు ప్రయత్నించి పంప గలందులకు నే నాశిస్తున్నాను.
మన పూరణలను సరి చూసుకొని పిమ్మట పద్యం.నెట్ లో కూడా పాఠకుల విశ్లేషణార్థం ఉంచుదాం. ఏమంటారు?
జైహింద్.

8, ఏప్రిల్ 2009, బుధవారం

వృత్త పద్య రచన సాధన చేద్దామా? 2

4 comments

sembahసాహితీ బంధువులారా! ఇంతకు ముందు మనం ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర గణములు తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు మనం తెలిసిన వైనప్పటికీ వృత్త పద్యములను గూర్చి, యతి, ప్రాస లను గూర్చి కొంచెం చెప్పుకొందాం.

వృత్తము = సున్నా.circle
పద్యములో ఒక పాదము ఆద్యంతము ఒక చక్రము వలె నడిస్తే మరల 2 వ పాదము కూడా అదే చక్రము నడక సాగిస్తుంది. అలాగే మూడు, నాలుగు పాదాలు కూడాను. ఒక క్రమంలో ఉండే గణాలు వరుసగా నాలుగు పాదాలలోనూ ఆవృత్త మౌతున్నందున దీనికి వృత్త పద్యము అనే పేరు సార్థక మౌతుంది.

ఇక వృత్త పద్యాలకు ప్రాస నియమము చెప్పఁ బడిన చోట అది నాలుగు పాదాలలోను రెండవ అక్షరం ఒకే హల్లు లేదా సంయుక్త హల్లు తప్పక రావాలి. ద్వితీయో వర్ణః ప్రాసః పాద పాదేషు.. --- ప్రాసః సర్వేషుచ ఏకయేవ స్యాత్. అని నియమము.
ఇక యతి విషయానికొస్తే యతిర్విచ్ఛేద సంజ్ఞకః అన్నారు. యతి నియమము ఏయే వృత్తాలకు ఎలాయెలా నెర్దేశింపఁ బడిందో గమనించి పాటించాలి.

ఉదాహరణకు మనం ఉత్పల మాల వృత్తాన్ని తీసుకున్నట్లయితే,
ఉత్పలములు = తామర పూవులు.
ఉత్పల మాల = తామర పూల దండ.
ఉత్పల మాల వృత్త లక్షణములు:-
ఇందు ప్రతీ పాదమున " - - - - - - ." అనే గణాలే రావాలి.
ప్రాస నియమం ఉంది.
ప్రాస యతి మాత్రము చెల్లదు.
యతి స్థానం పదవ అక్షరం.
ఉ:- పాఠక / మిత్రుడా / భరన / భారల / గంబులు / ఉత్పలం / బగున్.
పైన భ - ర - న - భ - భ - ర - వ. అనే గణాలు వచ్చాయి కదా!
అలాగే మొదటి అక్షరమే పదవ అక్షరంగా కూడా వచ్చి యతి నియమం పాటింపఁబడిందికదా!
ప్రాస నియమన్ని పాటిస్తూ అదే నియమాలతో మిగిలిన 2, 3, 4, పాదాలు కూడా పూర్తిగా వ్రాసినట్లయితే అది పూర్తి ఉత్పలమాల పద్యం ఔతుంది.

నాలుగు పాదాలు కాక అంతకన్నా ఎక్కువ పాదాలు గల దానిని మాలిక అంటారు. అది ఉత్పలమాలైతే ఉత్పల మాలిక అని అంటారు.

నా మనవి:-
ఉ:-
వృత్తము లక్షణంబులను విస్తృత రీతిని తెల్పినాడ. గ
మ్మత్తుగ మీరలింక తమ మత్తును వీడి రచింప సాధనన్
క్రొత్తగ చేయ బూనుడయ! కోరిక తీర్చెడి దైవ భక్తితో.
నుత్తమ మైన పద్యమని, ఉత్తములంత గణించునట్లుగాన్.

మరి వ్రాస్తారు కదూ! ఉత్పలమాల వ్రాయండి.
జైహింద్

7, ఏప్రిల్ 2009, మంగళవారం

వృత్త పద్య రచన సాధన చేద్దామా? 1

4 comments

ఆంధ్రామృత పానోన్ముఖులారా! సాహితీ బంధువులారా!
నిరంతర సాహితీ చర్చ మాత్రమే మన సాహితీ జ్ఞానానికి పదును పెట్ట గలదు. మనం సాహితీ పరంగా ఆలోచనలు, పరిశోధనలు సాగించ గలిగిననాడే మన విజ్ఞానం పక్వత పొందుతుంది. నిశ్శబ్దంలో మనం మిగిలిపోరాదు. అందుకే నిరంతరం సాధన చేద్దాం.
ప్రస్తుతం మనం ఆట వెలది, తేటగీతి, కందము, ఛందములను మాత్రమే వ్రాయడంలో సాధన చేస్తున్నాం. ఇంక మనం వృత్త పద్యాలు కూడా వ్రాసే ప్రయత్నం చేసి సఫలీకృతులమవదామా?
ఐతే ముందుగా ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర గణాలను తెలుసుకొందాం.

ముందుగా
ఏకాక్షరగణములు:-{ ఒకే అక్షరముల గణములు. }
ఒక గురువు గ.:- U
ఒక లఘువు ల :- I

ద్వ్యక్షత గణములు:- { రెండక్షరముల గణములు. }
రెండు గురువులు గగ :- UU
రెండు లఘువులు లల లేదా లా.:- I I
ఒక గురువు ఒక లఘువు గల లేదా హ.:- UI
ఒక లఘువు ఒక గురువు లగ లేదా వ.:-IU

త్ర్యక్షర గణములు:- { మూడక్షతముల గణములు }
మూడు గురువులు మ గణము :- UUU
మొదటి గురువు భ గణము:- UI I
మధ్య గురువు జ గణము:- IUI
చివరి గురువు స గణము:- I IU

మూడు లఘువులు న గణము:- I I I
మొదటి లఘువు య గణము:- IUU
మధ్య లఘువు ర గణము:- UIU
అంత్య లఘువు త గణము:- UUI
ఈ గణములు మనకు వచ్చినట్లయితే మనకు వృత్త పద్యములు వ్రాయడం సులభతరమౌతుంది కదా? కావున మనం వీటిని మూందుగా గుర్తుపెట్టకుందామా?
వృత్త ఛందమునకు సంబంధించిన మరొక అంశం తరువాత తెలుసుకొందాం.
జైహంద్.

5, ఏప్రిల్ 2009, ఆదివారం

గరిక{పాటి} పై {బులుసువారి} మంచుముత్యం.

3 comments

మీ "శ్రీ విరోధికి స్వాగతం పలికిన మీలో ఒక కవి కవిత..." పోస్ట్‌పై vookadampudu క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి నా నమస్కారములు తెలుపగలరు. వారిని గూర్చి గరికపాటి వారు తరతరాల తెలుగు పద్యం లో మెచ్చుకోలుగా చెప్పినారు..
... చలకాలం మీద వారి పద్యం కూడా చెప్పినారు..
కడుపులో ఉన్న బిడ్డ తప్ప అందరూ వణుకు తున్నారని.. ..
ఒక్క మంటనుతప్పితే మిగతా అన్నిమంటలనూ మెచ్చుకుంటున్నారని...

అపుడు మొదట తెలిసినది, ఇపుడు మరలా పచ్చ సంతకం చూస్తున్నాను

అని మన వూకదంపుడు మిత్రులు వ్రాశారు.
దానిని పురస్కరించుకొని, ఆ సందర్భాన్ని వివరిస్తున్నాను.

ఆ:-
గరికిపాటి మెచ్చె కవివతంసునికృతుల్.
మువ్వ గ్రంథమందు బులుసు రచన
మహిమ తెలియఁజేసి మహనీయకవియనె.
చలిని గూర్చి చదివె బులుసు రచన.

చలిని గూర్చి బులుసు వేంకటేశ్వర్లు ఈవిధంగా అన్నారని గరికిపాటివారు తరతరాల తెలుగు పద్యంలో చెప్పుతూ బులుసువారు ప్రాసంగికంగా వారితో చెప్పిన పద్యాన్ని చదివారు.

ఆపద్యం చూడండి.
ఆ:-
చలికి వణుకుచుండె సర్వ మానవ జాతి,
తల్లి కడుపు లోని పిల్ల తప్ప.
మంటలెల్ల వారి మన్ననల్ గొనుచుండె.
మసన మందు వెలుగు మంట తప్ప.{ మసనము = స్మశానము }

చూచార ఎంత సునాయాసంగా భావ పరి పుష్టితో ఒప్పిదమౌనట్లు చెప్పారో!
బులుసు వారి గడుసతనం రచనలో ఎలా ప్రస్ఫుటమౌతుందో సందర్భం వచ్చినప్పుడు తెలుసుకొందాము.
జైహింద్.
2, ఏప్రిల్ 2009, గురువారం

శ్రీ రామనవమి సందర్భంగా అందరికీ అభినందనలు

8 comments

శ్రీ రామనవమి సందర్భంగా సుగుణ సంపన్నులైన మీ అందరికీ అభినందనలు. ఆ సీతా రాముల దివ్య తేజస్సు మీలో ప్రసరింపఁ జేసి ఆదర్శప్రాయంగా మీరు లోకంలో జీవించేలా చేసి అందరికీ మీరు ఆదర్శంగా నిలిచేలా చేయాలని, ఆ పురాణ దంపతులను ప్రార్థించుచున్నాను.

ఉ:-
శ్రీ రఘు రామ పాదములు చింతనఁ జేయుచు నుండు వారికిన్
గౌరవ భావమున్ గొలిపి, కష్టములన్నెడబాపి నిత్యమున్
చేరువ నుండి, రక్షణము సేయుచు దీవన లిచ్చు నాతడున్.
మీరలు రామ భక్తులయి మేలును గాంచగ వాంఛఁ జేయుదున్.

శా:-
సీతా రామ వివాహ వేళ. మదిలో చింతించి యా వేళలో
సీతన్ కూతుగ చేసికొంచు జరుపున్ శ్రీరాముతో పెండ్లి. వి
ఖ్యాతంబియ్యది లోకమందు. తమరున్ గావింపగా రాదొకో
సీతా సాధ్వియు, రామ చంద్రుడును మీ చెంతన్ బ్రవర్తింపగాన్?

ఉ:-
ఎంతటి పుణ్య కర్ములకు నిట్టి మహాద్భుత భాగ్య మబ్బు! మీ
కింతటి భాగ్యమబ్బునిల. నీశ్వరు సత్కృప మీకుఁ గల్గు. మీ
చింతలు బాయు. మోదమున చిత్తము తేలి సుఖించు నిత్యమున్.
భ్రాంతిని వీడి మీరలిక భక్తిని పెండ్లిని చేయఁ బూనుడీ.

క:-
సీతా రాముల పెండ్లిని
ఖ్యాతిగ యొనరించు నెవడు ఘనతరముగ. నా
రాతిని నాతిగ చేసిన
సీతా రామయ్య యతనిఁ జేకొని కాచున్.

క:-
యుగమున కలియౌ. త్రేతా
యుగమిది నిజమయ్య. పరమ యోగ్యులు మీరల్
యుగ ధర్మము మార్చిరి. కృత
యుగముగ మార్చెదరు. కర్మ యోగులగుటచే.

శ్రీ సీతా రామ కల్యాణం చేయించుకోండి. కన్యాదాన సత్ఫలం పొందండి. శుభమస్తు.
జైహింద్.