గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 90వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

90. ఓం శ్రీవత్సాంకాయ నమః

వరాంగి వృత్త గర్భ సీసము.

మహిత శుభావహా! మాకిల శోభ నీ - వే దివ్య దైవమా! వేగ రమ్ము.

కూర్మిన్ ప్రభావమున్ గొల్పెడి భాగ్యదుం - డా! మముఁ గావ రమ్మోమహాత్మ.

కూర్చి మా భావ మీడేర్చెడి మా హృదీ - శా! కృపాసాంద్ర! సత్ సౌమ్యరూప!

దివ్య శుభంబు లందించు యశోనృసిం - హా! వందనములు, నయానువర్తి!

గీ. వర వరాంగి సంశోభిత! ప్రాణనాథ! - మాకు మహిత *శ్రీవత్సాంక*! మార్గమీవె

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

90 సీస గర్భస్థ వరాంగి వృత్తము (1-2-4 పాదములు గగ,

                                          3 పాదము గగ .. యతి 8)

శుభావహా! మాకిల శోభ నీవే - ప్రభావమున్ గొల్పెడి భాగ్యదుండా!

మా భావ మీడేర్చెడి మా హృదీశా! - శుభంబు లందించు యశోనృసింహా!   

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గొప్ప శుభములకు స్థానమైనవాఁడా! ఇలపై మాకు నీవే శోభ.

దైవమా! వేగముగా నాకడకు రమ్ము. ప్రేమతో ప్రభావమును మాయందు కలుగఁ జేయు. భాగ్యదా! మమ్ము చూచుటకు

రమ్ము. మా భావములనీడేర్చెడి హృదీశా! కృపాసాంద్రా! సౌమ్య స్వరూపా! దివ్యశుభములందించు నృసింహా!

నయానువర్తీ! నీకు వందనములు.. వరాంగివృత్తస్థా! శ్రీవత్సాంకా మాకు మార్గము నీవే సుమా

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.