జైశ్రీరామ్.
92. ఓం జగద్వ్యాపినే నమః.
కమలవిలసిత వృత్త గర్భ సీసము.
మనుజుల మదులను మలినము బాపన్గ - భక్తితత్పరతను వరలఁ జేసి,
ఘనతను గొలపను కరుణను బ్రోవన్గ - భక్త రక్షణ పూర్ణ భావనమున
మనముల నిలిచిన మహితుఁడ వీవేర! - మముఁ బ్రోచు యాదాద్రి మాన్యదేవ!
కనుమయ కృప మము ఘన నరసింహాఖ్య! - వర దైవమా! నీవె వరము మాకు.
గీ. కమల విలసిత శ్రీశుఁడా! ప్రముద మొసగి - పాఠకాళిన్ *జగద్వ్యాపి*! వరలఁ గనుమ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
92వ సీస గర్భస్థ కమలవిలసిత వృత్తము. (న న న న గగ .. యతి 9)
మనుజుల మదులను మలినము బాపన్
ఘనతను గొలపను కరుణను బ్రోవన్
మనముల నిలిచిన మహితుఁడ వీవే
కనుమయ కృప మము ఘననరసింహా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా!పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మమ్ములను కాపాడు యాదాద్రివాసా! మానవులలో
మలినము పోగొట్టుట కొఱకు భక్తిని కల్పించి, ఘనత కొలుపుటకని,కరుణతో కాపాడుటకని, భక్తరక్షణ భావముతో
మనస్సులలో నిలిచిన ఘనుడవీవే.. నీవే మాకు వరము.. కృపతో మమ్ము కనుము. కమలవిలసితవృత్తస్థశ్రీశా! ఓ
జగద్వ్యాపీ! పాఠకాళికి ప్రముద మొసగి వరలఁజేయుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.