జైశ్రీరామ్.
87. ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః.
వనమంజరి వృత్త గర్భ సీసము.
అగణితమైన మహాద్భుత శక్తిని - హాయినిచ్చు దయామయా! ముకుంద!
ప్రగణిత సుందర! భక్త హృదీశ! శు - భంకరా! మహితప్రభా! మహాత్మ!
ద్విగుణిత శక్తిని దివ్యుఁడ! నాకిడి - తేజమున్ నెలకొల్పు దేవదేవ!
నిగమ సువేద్యుఁడ! నిన్ను గ్రహింతును - నిత్యమున్ నినుఁ గొల్తు నేర్పుమీర.
గీ. ప్రథితమౌ వనమంజరీ పద్య రూప! - శరణు *వేదత్రయ ప్రపూజ్యా*! మహాత్మ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
87వ సీస గర్భస్థ వనమంజరి వృత్తము. (న జ జ జ జ భ ర .. యతి 14)
అగణితమైన మహాద్భుత శక్తిని హాయినిచ్చు దయామయా!
ప్రగణిత సుందర! భక్త హృదీశ! శుభంకరా! మహితప్రభా!
ద్విగుణిత శక్తిని దివ్యుఁడ! నాకిడి తేజమున్ నెలకొల్పుదే!
నిగమ సువేద్యుఁడ! నిన్ను గ్రహింతును నిత్యమున్ నినుఁ గొల్తునే.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! అగణిత శక్తిని, సుఖమును ఇచ్చు ఓ దయామయా! ఓ
ముకుందా! ప్రశంసింపబడు మనోహరాకారా! భక్తుల హృదయేశ్వరా! శుభంకరా! మహితప్రభాన్వితా! మహాత్మా! ఓ
దివ్యుఁడా! ద్విగుణితమైన శక్తిని నాకొసఁగి తేజమును నాకు కల్పించు దేవదేవా! వేదవేద్యా! నిన్ను నిత్యమూ గ్రహింతును,
నేర్పుతో నిన్ను సేవింతును. .వనమంజరీ పద్యరూపుఁడా! వేదత్రయీప్రపూజ్య! శరణు.!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.