గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

మన సంఖ్యామానం ఇదే.

0 comments

జై శ్రీరామ్.
ఆర్యులారా! మన సంఖ్యామనాన్ని గుర్తించండి. గుర్తుంచుకోండి.
జైహింద్.

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

లండన్ లో దిగ్విజయంగా జరుగుచున్న నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వంగూరి రాజు గారు అందజేసిన వర్తమానం ప్రకారం
లండన్ లో దిగ్విజయంగా ముగిసిన నాలుగవ  ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు మొదటి రోజు
లండన్ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, స్థానిక యుక్త సంస్థల సంయుక్త నిర్వహణలో తొలి రోజు సమావేశం నిన్న ఉదయం 10 గంటలకి (సెప్టెంబర్ 27, 2014) ఎంతో ఉత్సాహంగా ప్రారంభించబడి, నిర్విరామంగా కొనసాగి సాయంత్రం ఐదు గంటల వరకూ దిగ్విజయంగా జరిగి. తెలుగు సాహిత్య చరిత్రలో మరొక అధ్యాయానికి తెర తీసింది. కళ్యాణి గేదెల శ్రావ్యంగా ఆలపించిన “మా తెలుగు తల్లికి” ప్రార్థనా గేయంతో ప్రారంభం అయిన ఈ మహా సభలకి  ఇంగ్లండ్, అమెరికా , ఫ్రాన్స్ , జర్మనీ దేశాలనుండి సుమారు 150 మంది సాహిత్యాభిలాషులు, కవులు, రచయితలూ పాల్గొనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారు ప్రధాన అతిథిగా విచ్చేసి తెలుగు బాషని ప్రపంచ బాషగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్  ప్రారంభోపన్యాసం, కేంద్ర సాహిత్యా ఎకాడెమీ బహుమతి గ్రహీత “పద్మశ్రీ” యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్  కీలకోపన్యాసం చేయగా సుప్రసిద్ధ కవులు “సిరివెన్నెల “ సీతారామ శాస్త్రి, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల, అశోక్ తేజ తమ అద్భుతమైన ప్రసంగాలతో ఈ సాహిత్య సభకి వన్నె తెచ్చారు. పౌరాణిక నటులు అక్కిరాజు సుందర రామకృష్ణ తన పద్యాలతో సభని రంజింప జేయగా, ఫ్రెంచ్ దేశీయుడైన డేనియల్ నేజేర్స్ తన దండక పఠనంతోనూ, సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, పత్రికా సంపాదకురాలు కేతవరపు రాజ్యశ్రీ ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. సినీ నటులు సునీల్, రాజా రవీంద్ర ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచి సముచిత ప్రసంగాలు చేశారు. ఈ మహా సభలని ఇటీవల నిర్యాణం చెందిన బాపు గారికి అంకితం ఇస్తూ జరిగిన అంకిత సభలో వంగూరి చిట్టెన్ రాజు, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల తమ అనుభవాలని పంచుకున్నారు. బాపు గారికి అంకితం ఇస్తూ ఈ మహా సభల సందర్భంగా వెలువరించిన సావనీర్, తనికెళ్ళ భరణి రచించిన “ప్యాసా” రాజ్యశ్రీ రచించిన “రెక్కల్లో గీతామృతం”, సుద్దాల అశోక్ తేజ కవితల ఆంగ్ల అనువాదాలు పుస్తకం, వడ్డేపల్లి కృష్ణ గారి గేయాల సీడీ మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు శ్రీ ఎ. చక్రపాణి గారి కుమార్తె నీరజ రేగుల రచించిన “మై డాడ్” అనే పుస్తకం ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డాయి. ఆచార్య కొలకలూరి ఇనాక్ తొలి ప్రతులని అందుకున్నారు.
స్వీయ రచనా పఠనం విభాగంలో డా. వ్యాకరణం అచ్యుత రామారావు, దివాకర్ అడ్డాల మొదలైన వారు పాల్గొనగా ఈ మొదటి రోజు సమావేశాన్ని అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి వచ్చిన వంగూరి చిట్టెన్ రాజు, యునైటెడ్ కింగ్డం వాస్తవ్యులు డా. మాదిన రామకృష్ణ, డా. వెలగపూడి బాపూజీ రావు, కృష్ణ యలమంచి వేదిక నిర్వహణ బాధ్యతలని చేపట్టారు. “యుక్త” సంస్థ అధ్యక్షులు శ్రీ జయకుమార్ గుంటుపల్లి స్వాగత వచనాలు పలికారు.  శ్రీ కిల్లి సత్య ప్రసాద్, పద్మ , నరేంద్ర మొదలైన వారు తెర వెనుక ఎంతో శ్రమ కోర్చి ఈ నాలుగవ ప్రపంచ సాహితీ సదస్సు తొలి రోజు విజయవంతంగా జరగడానికి ముఖ్య కారకులుగా అందరి ప్రశంసలనీ అందుకున్నారు.
ఈ తొలి సభా విశేషాల సుమారు వంద ఫోటోలూ ఈ క్రింద Fఅచె భూక్  లో చూడవచ్చును. కొన్ని ఇందుతో జతపరిచాం.
https://www.facebook.com/UK.TELUGU.ASSOCIATIO
సెప్టెంబర్ 28, 2014 ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 దాకా కొనసాగే రెండవ రోజు సదస్సులో అనేక సాహిత్య ప్రసంగాలూ, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి వారి “అచ్చ తెనుగు” అష్టావధానం జరుగుతాయి.
అవకాశమున్నవారు ఆ ఆనందాన్ని అందుకొనే సదవకాశం యిది.
జైహింద్.

27, సెప్టెంబర్ 2014, శనివారం

దానం భోగో నాశ స్తిస్రో గతయః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. దానం భోగో నాశ స్తిస్రో గతయో భవన్తి విత్తస్య
యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి॥ 

గీ. దాన, భోగ, వినాశము ధనము గతులు. 
విత్త సముపార్జితులు దాని విలువ నెఱిఁగి 
దాన భోగాల వెచ్చించి తనియవలయు 
కానినాడది నాశమౌన్. కానరేల? 
భావము. ధనమునకు దానము, భోగము, నాశనము అను మూడే గతులు, ఒకరికీయక, తాననుభావింపక కూడబెట్టిన ధనమునకు నాశనమే కలుగును. 
జైహింద్.

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

అర్థానామార్జనే దుఃఖమ్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అర్థానామార్జనే దుఃఖ మార్జితానాం చ రక్షణే
ఆయే దుఃఖం వ్యయే దుఃఖం ధి గర్థం దుఃఖభాజనమ్॥

గీ. ధనమునార్జింపగా దుఃఖమనుభవమగు. 
దాని దాయంగ దుఃఖము ధరణి పైన. 
పెంచ, వెచ్చింప దుఃఖము, భీతిఁ గొలుపు
దుఃఖ దాయిని ధన వాంఛ దూరమగుత.
భావము. ధనము సంపాదించునప్పుడు దుఃఖం. సంపాదనను కాపాడుకొనేప్పుడు దుఖం. సంపాదించినది వృద్ధి కాలేదని దుఃఖం. ఉన్న ధనం ఖర్చయి పోతోందని దుఃఖం. కావున దుఃఖ కారకమైన ధనము నింద్యము. 
జైహింద్.

25, సెప్టెంబర్ 2014, గురువారం

అజ్ఞానాత్ యది వా మోహాత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అజ్ఞానాత్ యది వా మోహాత్ కృత్వా కర్మ విగర్హితం
తస్మాద్విముక్తి మన్విచ్ఛన్ ద్వితీయం న సమాచరేత్.  
గీ. జ్ఞాన హీనత చేతనో కామ, మోహ 
మదములను చేసి, దుష్కృత్య వ్యధను పొంది,
మదిని చింతించు వారలు మరల నటుల
చేయకుండిన సరిపోవు. శివుఁడు మెచ్చు.
భావము. అజ్ఞానంతో గానీ, మోహం వల్ల గానీ ఒక నింద్యమైన పనిని చేసి, దాని నుండి విముక్తి పొందదలచిన వారు అలాంటి పని మరొకసారి చేయకూడదు. 
జైహింద్

24, సెప్టెంబర్ 2014, బుధవారం

మృత్పిండ ఏకో బహుభాండ రూప ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. మృత్పిండ ఏకో బహుభాండ రూప
స్సువర్ణ మేకం బహుభూషణాని,
గోక్షీర మేకం బహు ధేనుజాత 
మేకః పరాత్మా బహుదేహవర్తీ॥ 

గీ. మలయు కుండలన్నిట నుండు మట్టి యొకటె. 
స్వర్ణ భూషణంబుల నుండు స్వర్ణమొకటె. 
ధేనువులు వేరు పాలొకటేను తెలియ. 
దేహములు వేరు, మసలెడి దేహి యొకడె.
భావము. కుండలకు చాలారూపాలు. దానికి మూలప్రకృతి అయిన మట్టిముద్ద ఒక్కటే, ఒక్కటే అయిన బంగారమే నానావిధాలైన ఆభరణరూపాల్లో దర్శింపబడేది. తెల్లావు, నల్లావు, కపిలగోవు ఇలా ఎన్నివున్నా (ధయ త్యేనాం వత్సీ ఇతి ధేనుః) వీటి అమ్మతనానికి కారణమైన పాలు ఒక్కటిగానే వున్నయి. అదే విధంగా హరిహరబ్రహ్మేన్ద్రాదులు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, దత్తాది నానారూపాలల్లో వున్న దేవతల దైవత్వానికి మూలమైన ఆ పరమాత్మ ఒక్కడే. 
జైహింద్.

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

శరీరస్య గుణానాం చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. శరీరస్య గుణానాం చ, దూర మత్యంత మంతరం,
శరీరం క్షణవిధ్వంసి, కల్పాంత స్థాయినో గుణాః . 
క. గుణ దేహములకు దూరము 
కనగా యధికంబు నిజము. ఘనతర గుణముల్ 
మను శాశ్వితముగ, దేహము 
క్షణ భంగురమరసి చూడ. కానగ వలదా?
భావము. శరీరానికీ గుణాలకి మధ్య ఎంతో అంతరం(దూరం) వుంది. ఇప్పుడు పుట్టి మరుక్షణంలో నశించి పోయేది శరీరం. మరి గుణములో ఆ కల్పాంతము ఉండునవి. 
జైహింద్.

22, సెప్టెంబర్ 2014, సోమవారం

అస్థిరం జీవనం లోకే ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అస్థిరం జీవనం లోకే అస్థిరం ధనయౌవనం,
అస్థిరం దారపుత్త్రాది ధర్మః కీర్తిర్ద్వయం స్థిరమ్॥
గీ. అస్థిరంబిల జీవన మస్థిరములు 
ధనము,  యౌవనము, సుతులు, ధర్మ పత్ని, 
స్థిరము ధర్మంబు, కీర్తియు, పరమ పథము 
చేరు మార్గంబులివ్వియే ధీరులకిల.
భావము. ప్రాణము, ధనము, యౌవనము, భార్యాపుత్రాదులు సర్వము అస్తిరమైనవే, ధర్మము, కీర్తి ఈ రెండే స్థిరమైనవి
జైహింద్.

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

అపృష్టోஉపి హితం బృయాత్... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్
శ్లో. అపృష్టో పి హితం బృయాత్, యస్య నేచ్చేత్ పరాభవం,


ఏష ఏవ సతాం ధర్మో, విపరీత మతొన్యథా.
క. ఇతరుల మంచిన కోరిన,
సతతము హితమును తెలుపుచు చక్కగ నడుపున్
క్షితిపై సద్గుణ గణ్యులు. 
మతిమంతుల మార్గ మిదియె, మహితంబిదియే.
భావము. ఎవరికి పరాభవము జరగకూడదని కోరుకుంటావో, వానికి హితమును అడుగక పోయినను చెప్పాలి . ఇదియే సత్పురుషుల ధర్మం. అడుగలేదు కదాని హితమును చెప్పక ఊరకుండిన అది అధర్మము.
వివరణం: శ్రీమద్రామాయణం లో విభీషణుడు అన్నగారైన రావణునికి ఇదే విధంగా ధర్మం చెప్పాడు. వాడు మృత్యువునే ఆశ్రయించాడు. రావణుడు మృత్యువునకు యెదురువెల్తున్నట్టి వాడు, అట్టి వాడు మృత్యురూపుడే కావున వాడు విడిచిపెట్టదగినవాడు. కావున విభీషణుడు అమృత స్వరూపుడైన రాముణ్ణి ఆశ్రయించాడు. 
జైహింద్.

20, సెప్టెంబర్ 2014, శనివారం

అభివాదయేత్ వృధాంశ్చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అభివాదయేత్ వృధాంశ్చ, దద్యాచ్చైవాసనం స్వకమ్,
కృతాంజలి రుపాసీత, గచ్ఛతః పృష్ఠతోన్వియాత్.
గీ. పెద్దవారిని కనుగొన్నఁ బ్రీతితోడ 
వందనము చేసి యాసనమందు నిలిపి,
ప్రీతితోడుత పలికి విఖ్యాతి మెలఁగ 
సంతసింతురు వారు. నిన్ సన్నుతింత్రు.
భావము.  వృద్ధులకి నమస్కరిచడం, నీ ఆసనమును వారికి ఇయ్యటం, అంజలి బద్ధుడవైయుండి, వారు వెళ్ళునప్పుడు వెనుకనే కొంత దూరము సాగనంపాలి. 
జైహింద్.

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

స్వదత్తా ద్ద్విగుణం పుణ్యం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. స్వదత్తా ద్ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనమ్,
పరదత్తాపహారేణ, స్వదత్తం నిష్పలం భవేత్. 
గీ. ఇతరు లొనరించు దానమ్ము నతిశయముగ 
కాయ, ద్విగుణమౌ తన దాన కర్మ ఫలము.  
వాటి హరణంబు చేసెడివారికిలను 
పుణ్యఫలములు నశియించిపోవు. నిజము.
భావము.  ఇతరులు చేసిన దానమును పాడుచేయక దానిని సంరక్షించినట్లయితే, తాను స్వయంగా చేసిన దానముకన్నను రెండు రెట్లు అధికంగా పుణ్యము ప్రాప్తిస్తుంది. ఇతరులు చేసిన దానమును హరించుట వల్ల తాను చేసిన దానముల వల్ల సంపాదించుకున్న పుణ్యవిశేషం ఏదైనా వుంటే అది నిష్ఫలమైపోతుంది. ( జనకుడు చేసిన కన్యా దానానికి ఘాత కలుగించి, రావణుడు తన తపస్సు అంతా నష్టపోయి నశించాడు.)
గమనిక: పరోపకారం చెయ్యండి. లోకం కోసం ఇతరులు చేసిన మంచిని కాపాడడం కూడా ఉపకారమే. 
జైహింద్.

18, సెప్టెంబర్ 2014, గురువారం

దానేన భోగీ భవతి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో దానేన భోగీ భవతి, మేధావీ వృద్ధసేవయా
అహింసాయ చ దీర్ఘాయుః ఇతి ప్రాహు ర్మనీషిణః. 
గీ. దానమున భోగి యగు వసుంధరను నరుఁడు. 
పూజ్యులకు సేవ చేసిన బుద్ధి పెరుగు. 
క్షమ, యహింసల దీర్ఘాయు వమరి బ్రతుకు. 
దాన సేవ నాహింసల తనియుఁడయ్య.
భావము. మానవుడు దానం చేస్తే భోగి అవుతాడు, పెద్దలను సేవించటం వల్ల బుద్ధి కుశలత కలవాడౌతాడు, అహింస వల్ల దీర్ఘాయువౌతాడని విద్వాంసులు చెప్తారు. 
జైహింద్.

17, సెప్టెంబర్ 2014, బుధవారం

దానే తపసి శౌర్యే చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. దానే తపసి శౌర్యే చ , విజ్ఞానే వినయే నయే 
విస్మయో హి న కర్తవ్యో బహురత్నా వసుంధరా. 
గీ. దాన, తప, శౌర్య, వినయ, విజ్ఞాన, నీతి, 
శోభితులయందు గర్వమ్ము చొచ్చుకొనదు. 
మహితులిలనుంద్రు పెక్కురు మహిని. వారి 
నరసి నేర్తురు సచ్ఛీల నాదికములు.
భావము. దానము, తపస్సు, పరాక్రమము, విజ్ఞానము,వినయము, నీతి - కలిగి ఉన్నందువల్ల ఏమాత్రమూ గర్వపడకూడదు. ఈ సద్గుణాలున్నవారు ఈ లోకంలో మరెందరో ఉంటారు. 
జైహింద్.

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

ఛాయామన్యస్య కుర్వంతి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే 
ఫలాన్యాపి పరార్థాయ వృక్షా: సత్పురుషా: ఇవ . 
క. పరులకు నీడగ నిల్చుచు, 
తరువులు తామెండలోన తపియించునటుల్ 
నిరుపమ సేవను పరులకు 
కరుణాత్ములు చేసి తాము గాంతురు వెతలన్.
భావము. వృక్షాలు తమ నీడను అన్యులకు ఇస్తూ , తాము స్వయంగా ఎండలో నిలబడుతున్నాయి. సత్పురుషుల వలె తమ ఫలములను కూడా పరులకే ఇస్తున్నాయి. 
జైహింద్.

15, సెప్టెంబర్ 2014, సోమవారం

సత్యం తపో జ్ఞానమహింసతా చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. సత్యం తపో జ్ఞానమహింసతా చ ,విద్వత్ప్రణామం చ సుశీలతా చ 
ఏతాని యో ధారయతి స విద్వాన్ , న కేవలం యః పఠతే స విద్వాన్ .
గీ. సత్య తపములు, జ్ఞానమ్ము, సత్ప్రశంస, 
వినయ విద్వాంసమన్నన విజ్ఞతయును, 
శీల సంపత్తి, గల యట్టి మేలి మగడె 
విబుధుఁడనఁ జెల్లు. నితరులు విబుధ భృవులె.
భావము. సత్యము, తపస్సు, జ్ఞానము, అహింస, విద్వాంసులకు వినయంతో నమస్కరించటం, స్వచ్ఛమైన శీలము ఎవనికి ఉంటాయో అతడే విద్వాంసుడు. కేవలం చదువుకున్నవాడు విద్వాంసుడు కాడు. 
జైహింద్.

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

సుఖస్య దుఃఖస్య న కోஉపి దాతా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. సుఖస్య దుఃఖస్య న కోపి దాతా , పరో దదాతీతి కుబుద్ధిరేషా 
అహం కరోమీతి వృథాభిమానః , స్వకర్మసూత్రే గ్రథితో హి లోకః 
గీ. ఈయరెవ్వరు సుఖ దుఃఖ శ్రేయములను. 
మనము చేయుచు గొనలేని మర్మ జనిత
కర్మ ఫలముగ మనకవి కల్గుచుండు. 
మంచి కర్మలు చేసిన మంచి కలుగు.
భావము. మనకు సుఖదుఃఖాలను ఇచ్చే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఎవరో వాటిని మనకు ఇస్తున్నారనుకోవటం అసంబద్ధం. నేనే చేస్తున్నాననుకోవటం కూడా వ్యర్థం. ఈ లోకమంతా స్వకర్మ సూత్రంతో బంధింపబడి ఉంది. 
జైహింద్.

13, సెప్టెంబర్ 2014, శనివారం

సంతస్తృణోత్సారణ ముత్తమాంగాత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. సంతస్తృణోత్సారణ ముత్తమాంగాత్ 
సువర్ణ కోట్యర్పణ మామనంతి
ప్రాణ వ్యయేనా పి కృతోపకారాః
ఖలాః పరే వైర మివోద్వహంతి. 
క. తలనున్న గడ్డి తీసిన 
తలతురు మేల్ చేసెనట్లు ధర్మాత్ములిలన్. 
వెలలేని మేలు పొందొయు 
తలపక, యపకృతిని చేయు దౌర్భాగ్యుడిలన్.
భావము. తమ తలపై నున్న గడ్డి పరకను ఎవరైనా తొలగించినంత మాత్రాన సత్పురుషులు దానిని గొప్ప సువర్ణ రాశి ఇచ్చినట్టుగా భావిస్తారు. ప్రాణాలకు తెగించి దుర్జనులకు ఉపకారం చేస్తే, వారు ఆ ఉపకారం చేసినవారి పట్ల విరోధభావం పెంచుకుంటారు. 
జైహింద్.

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

యో உ ధికాద్యోజన శతాత్పశ్యతీ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. యో  ధికాద్యోజన శతాత్పశ్యతీ హామిషం ఖగః
స ఏవ ప్రాప్తకాలస్తు పాశబంధం నపశ్యతి. 

గీ. ఎంత దవ్వునుండైనను సాంతముఁ గను 
మాంస ఖండంబులను పక్షి మహితముగను. 
అట్టి పక్షియే తన్ బట్ట పెట్టినట్టి 
వలను కానగ లేదు! తా  తొలగ లేదు.
భావము. ఏ పక్షి నూరు యోజనముల దూరమునుంచి యైనను మాంస ఖండమును చూడగలదో , ఆ పక్షియే కాలం మూడినపుడు తనను పట్టటానికి పన్నిన వలను చూడజాలదు. 
జైహింద్.

11, సెప్టెంబర్ 2014, గురువారం

సుహృదాం హిత కామానాం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. సుహృదాం హిత కామానాం యశ్శ్రుణోతి న భాషణం
విపత్సన్నిహితా తస్య స నరశ్శత్రు నందనః. 
గీ. బంధు మిత్రుల సద్బోధ వరలనీక 
దుష్ట వర్తన మెలిగిన భ్రష్టుఁడగును. 
శతృకోటికి యానంద పాత్రుఁడగును. 
మంచి చెప్పిన వినవలె మహితులార!
.భావము  ఎవడు - సజ్జనులు, తన మేలుకోరేవారు చెప్పే హితభాషణలు వినడో , వాడు ఆపదలను పొంది తన శత్రువులకు ఆనందం కలిగించేవాడౌతాడు. 
జైహింద్.

10, సెప్టెంబర్ 2014, బుధవారం

ప్రియః ప్రజానాం దాతైవ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో.ప్రియః ప్రజానాం దాతైవ న పునర్ద్రవిణేశ్వరః
అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో న తు వారిధిః. 
క. ప్రజలకు దాతయె ప్రియమిల, 
నిజధన సంవర్ధి కాడు. నేర్పున కురిసే 
సుజలములు కలుగు మేఘమె 
ప్రజలకు హితమౌను, జలధిఁ వలవరు ప్రీతిన్.
భావము. ప్రజలకు ధనవంతునికంటే దాతయే ప్రియమైనవాడు. ఈ లోకంలో అందరూ నీటినిచ్చే మేఘాన్నే కోరుకుంటారు గానీ నీటికి నిధియైన సముద్రుని కాదు. 
జైహింద్.

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

యోஉన్య ముఖే పరివాదః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. యోన్య ముఖే పరివాదః ,స ప్రియ ముఖే పరిహాసః
ఇతరేంధనజో ధూమః , సోగరు జాతో భవేద్దూపః.
క. ఇతరులు పల్కిన దూషణ,
యతులితమగు హాస్య మదియె ఆప్తులు పలుకన్. 
క్షితి పొగయగు కట్టెల పొగ
యతులిత ధూపమగు చందనాదుల పొలియన్.
భావము. ఇతరుల నోటినుంచి వస్తే దూషణం అనిపిస్తుంది. అదే మాట తనకు ఇష్టమైన వాని నోటినుంచి వస్తే , హాస్యం అనిపిస్తుంది. ఇతరములైన కట్టెల నుండి వచ్చినది ధూమమౌతుంది. చందనపు చెక్కనుంచి వస్తే ధూపమౌతుంది! 
జైహింద్.

8, సెప్టెంబర్ 2014, సోమవారం

సమస్య: తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!ఈ క్రింది సమస్యను డా.గరికిపాటివారు పూరించారు. చూడండి. అదే సమస్యను నేను పూరించాను అదికూడా చూడండి.
సమస్య:
తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!
డాక్టర్ గరికిపాటి నరసింహారావుగారి పూరణ:
గుండ్రాతింబలె చూచుచుందురుగదా! గొడ్రాలినీ లోకమం
దాండ్రుంగూడ దయావిహీనమతులై; యాసాధ్వినే గొడ్డుమో
తండ్రీ పుత్రులచేత, సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!
గాండ్రింపుల్ మఱి చెల్లబోవుగద! మొగ్గల్ సిగ్గులా యింటిలో!
నా పూరణ: 
పండ్రెండేండ్ల వివాహజీవనమునన్ ప్రాప్తింపమిన్ సంతతిన్
తండ్రీ ఈశ్వర! తత్ సుపుత్ర వరదాతా!విఘ్నరాజా! కృపన్
గుండ్రాయట్టులనున్నమాకు నిడుడీ కూర్మిన్నన్న వారీయ నా
తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!
చూచారు కదా! మరి మీరైతేఏ విధంగా పూరించడానికి ఉత్సహిస్తారో మీ పూరణ ద్వారా చేసి చూపండి.
నమస్తే.
జైహింద్.

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

అసంపన్నః కథం బంధుః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అసంపన్నః కథం బంధుః ? అసహిష్ణుః కథం ప్రభుః ?
అనాత్మవిత్ కథం విద్వాన్ ? అసంతుష్టః కథం సుఖీ ? 
గీ. పేద యింటికి బంధువుల్ పోదురొక్కొ? 
ఓర్పు లేకున్న రాజెట్టులుర్వినేలు? 
కనక పండితుల్ దైవమున్ ఘనులగుదురె? 
తుష్టి లేకున్నసుఖములు తోడ నున్నె?
భావము. సంపన్నుడు కాకపోతే బంధువెలా అగును ?(సంపన్నులకందరూ బంధువులమని చెప్పుకుంటారు ) ఓర్పు లేనివాడు రాజెట్లగును? పరమాత్మ స్వరూపం తెలియనివాడు విద్వాంసుడెట్లగును? సంతృప్తి లేనివాడు ఎలా సుఖముకలవాడగును? 
జైహింద్.

6, సెప్టెంబర్ 2014, శనివారం

కాష్ఠభారసహస్రేణ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో  కాష్ఠభారసహస్రేణ ఘృతకుంభశతేన చ 
అతిథిర్యస్య భగ్నాశస్తస్య హోమో నిరర్థకః. 
గీ. ధనము వెచ్చించి కట్టెలు, తగిన నేయి,
అమరికను చేసి క్రతువులనరసి చేసి, 
ఒక్క యతిథియే యగు ప్రీతి నందకున్న, 
వ్యర్థమా క్రతువంతయునరయుఁడయ్య.
భావము. ఎన్నో కట్టెలను , వందలకొలది నేతి కుండలను వినియోగించి యజ్ఞం చేసినా, ఒక్క అతిథి నిరాశ చెందితే ఆ యజ్ఞం నిరర్థక మౌతుంది. 
జైహింద్.

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

సద్గురుదేవులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు ఉపాధ్యాయదినోత్సవము. ఈ సందర్భంగా తమను నమ్ముకొని విద్యనభ్యసింప వచ్చిన శిష్య కోటిపై నిర్వ్యాజానురాగం చూపుచు, వారి శ్రేయస్సు కొఱకు తాము క్రొవ్వొత్తివలె కరిగిపోతున్న మహనీయులైన ఉపాధ్యాయులున్నట్లైతే వారికందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఆ పరమాత్మకే ప్రతినిధులైన ఆ మహనీయుల ఋణమును ఎంతటి హృదయ పూర్వకముగా తీర్చుకొన దలచిననూ అసాధ్యమే. అంతటి మహనీయులు ఆ గురుదేవులు.
ఈ సందర్భముగా మా గురుదేవులను మనసారా ధ్యానించి నమస్కరిస్తున్నాను.
జైహింద్.

అగ్నిహోత్రం గృహం క్షేత్రం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అగ్నిహోత్రం గృహం క్షేత్రం , గర్భిణీం వృద్ధబాలకౌ ,
రిక్తహస్తేన నోపేయాత్ , రాజానాం దైవతం గురుమ్ . మనుస్మృతి. 
గీ. వట్టి చేతుల పోరాదు వసుధపైన 
అగ్నికార్యంబు, స్వగృహంబు, నఖిల క్షేత్ర 
ములు, గురున్, గర్భిణిన్, వృద్ధు, భూపు, దైవ,
బాల దర్శనార్థము పోవుచో. భవ్యులార!
భావము. అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవము, గురుడు - వీరివద్దకు బోవునప్పుడు వట్టిచేతులతోపోరాదు. ఏదో పండునైన, పూవునైన తీసుకొనిపోయి,  సమర్పించ వలెను. 
జైహింద్.

ప్రసాదో యస్య వదనే ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ప్రసాదో యస్య వదనే కృపా యస్యావలోకనే 
వచనే యస్య మాధుర్యం స సాక్షాత్పురుషోత్తమః. 
గీ. సుప్రసన్న ముఖాబ్జపు శోభ తోడ,
జాలు వారెడు చూపుల జాలి తోడ, 
తీయనైనట్టి మాటల తీరు తోడ 
నొప్పునాతడె శ్రీహరి. గొప్ప వాఁడు. 
భావము. ఎవని ముఖంలో ప్రసన్నత గోచరిస్తుందో, ఎవని చూపులలో దయ జాలువారుతూ ఉంటుందో, ఎవని మాటలలో తీయదనం ఉంటుందో అతడు సాక్షాత్తు పురుష శ్రేష్ఠుడే. (విష్ణువే). 
జైహింద్.

4, సెప్టెంబర్ 2014, గురువారం

ధర్మార్థం క్షీణ కోశస్య ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ధర్మార్థం క్షీణ కోశస్య కృశత్వమపి శోభతే
సురైః పీతావశేషస్య శరద్ధిమ రుచేరివ. 
గీ. దేవతలు త్రాగ మ్గిలిన దివ్య జ్యోత్స్న 
తేజరిలె శరచ్చంద్రికై దివ్యముగను. 
దాన ధర్మాదులన్నిధుల్ తరిగి కూడ 
శోభిలాగారముల్ దాన ప్రాభవమున.
భావము. దేవతలు త్రాగగా మిగిలిన సన్నని శరత్కాలపు వెన్నెల కాంతిలా, ధర్మాచరణలో ఒకని ధనాగారం క్షీణించిపోయినా , ఆ సన్నగిల్లటం కూడా శోభిస్తుంది. 
జైహింద్.

3, సెప్టెంబర్ 2014, బుధవారం

సమస్య: "ఒకరా?యిద్దర?ముగ్గురా?నలుగురా?ఊహింపగానెందరో?"

4 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
ఒక భువనవిజయసభలో తెనాలిరామకృష్ణపండితునిపాత్రలో పండితకవి, శతావధాని కీ.శే.గాడేపల్లి కుక్కుటేశ్వరరావుగారు చేసిన పద్యపూరణ చూడండి.
సమస్య: "ఒకరా?యిద్దర?ముగ్గురా?నలుగురా?ఊహింపగానెందరో?"
పూరణ:
ఒకతాతంగని "ఊతునా?"యనుచు పైనుమ్మేసితిన్, ప్రగ్గరా
ట్సుకవీంద్రున్ "విరసా,తుసా,బుస"యటంచుం దిట్టితిన్, "దోమకు
త్తుకలో నెక్కడజొచ్చె తొత్తుకొడకా! దుర్దాంతమౌ కుంజర
ప్రకరం"బంచొక పండితుం దెగడితిన్, అంతంబుదీపింప పి
ల్లికి పాల్వోయక, నేనెద్రావి "యిసి! పాలేయొల్లదీ పిల్లికూ
న కటా!" యంచును దానిమాడ్చితిని, నానాబ్రాహ్మణవ్రాతమిం
టికిరాన్ మజ్జనయిత్రి జచ్చునెడ "తండ్రీ! వాతరో, వాతలం"
చు కనుల్ మూసినదంచు వీపుపయి పెచ్చుల్ లేవ నంటించితిన్, 
ఒకయుద్దండునిబట్టి "యర్థమదియేదో తేల్చుమీ" యంచు "మే
కకుతోకా,తొకతోకమేక,తొకతోకా"యంచు వల్లించి, గ్రు
డ్లకు నీర్దిర్గనొనర్చితిన్, వికటలీలన్ మత్పరాభూతులి

ట్లొకరా? యిద్దర? ముగ్గురా? నలుగురా?ఊహింపగానెందరో? 

చూచారు కదా! మరి మీరైతే ఏ పాత్రలో ఉంటే  ఏవిధంగా పూరిస్తారో పూరించి చూపగలరని ఆశిస్తున్నాను.
జైహింద్.

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

సా విద్యా యా మదం హంతి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. సా విద్యా యా మదం హంతి , సా శ్రీ ర్యర్థిషు వర్షతి
ధర్మానుసారిణో యా చ సా బుద్ధిరభిదీయతే.

గీ. మదము నణచునదే విద్య మహిని కనగ. 
అర్హులకునీయఁబడునెద్ది అదియె ధనము.
ధర్మవర్తనగలబుద్ధి ధరణి బుద్ధి. 
సుజనులందుననివి యుండి శోభ కూర్చు.
భావము. ఏది గర్వాన్ని అణచివేస్తుందో,అదే నిజమైన విద్య. అర్థుల కోసం ఏది ధారాళంగా వర్షింప బడుతుందో అదే నిజమైన సంపద. ఏది ధర్మాన్ని అనుసరిస్తుందో అదే నిజమైన బుద్ధి. 
జైహింద్.

1, సెప్టెంబర్ 2014, సోమవారం

ఈశ్వరే నిశ్చలా బుద్ధిః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ఈశ్వరే నిశ్చలా బుద్ధిః , దేశార్థం జీవనస్థితిః
పృథివ్యాం బంధువద్వృత్తిః ఇతి కర్తవ్యతా సతామ్. 
గీ. నిరతమగు దైవ భక్తిని నిశ్చలముగ 
కలిగి, దేశంబుకై తాను మెలగుచుండు, 
లోకులెల్లరు తన బంధు లోకమనుచు 
సజ్జనుండెదతలచును సహజముగనె.
భావము. పరమేశ్వరునియందు నిశ్చలమైన బుద్ధి కలిగి ఉండటం , దేశముకోసమే తన జీవితమని భావించటం, లోకులందరియందు బంధుభావన కలిగి ఉండటం సజ్జనుల కర్తవ్యం. 
జైహింద్.