గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2012, గురువారం

వైద్యో నారాయణో(హరీ) హరిః .

1 comments

జైశ్రీరామ్
ఆర్యులారా! మీరు మీ ఆరోగ్య విషయంలో తీసుకొంటున్న జాగ్రత్తలలో మెలకువగా ఉండాలనుకొంటున్నారా? ఐతే  నిర్లక్ష్యం చేయక ఈ క్రింది వీడియో చూస్తూ జాగ్రత్తగా వినండి. సత్యం తెలుసుకొని, మీ ఆలోచనకు మెఱుగు పెట్టండి. హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి, జీవింప జేయండి. సత్యమేవ జయతే. ఇక చూడండి.

ఇక అనుభవజ్ఞులైన మన పెద్దలు ఎప్పుడో మనకు చెప్పిన మాటలు చూడండి.

కలి విడంబన శతకంలో ఒక శ్లోకమున్నది. అది చమత్కారమో లేక కొందరి విషయంలో నైనా యదార్థమో మీరే ఆలోచించెదరు గాక. ఇక శ్లోకమును, అనువాదమును, భావమును చూడండి.

శ్లో:-
వైద్య రాజ నమస్తుభ్యమ్. యమ రాజ సహోదరా!
యమస్తు హరతి ప్రాణాన్. వైద్యః ప్రాణాన్ ధనానిచ!!
ఆ:-
వైద్య రాజ! నీకు వందనంబులు సేతు.
యముని సోదరుండ! అందుకొనుమ!
యముడు ప్రాణముగొను. యమ సోదరుండ! మా
ధనము, ప్రాణములను గొనుదు వీవు.
భావము:-
యముని సోదరుడవైన ఓ వైద్య రాజా! నీకు నమస్కారము. ఎందుకన - యముడు ప్రాణాలనే తోడును. వైద్యుడవైన నీవు మా ప్రాణాలనీ, ధనాన్నీ కూడా హరిస్తావు కదా! కాన మా జోలికి నీవు రాకుండా ఉండడానికి నీకు నమస్కరిస్తున్నాను సుమా!
పూర్వం ప్రజానీకానికి "వైద్యో నారయణా" అని కీర్తింప బడే విధంగా వైద్యులు తమ వైద్యాన్నందించి ప్రాణాలు కాపాడేవారు. కాని నేటి పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందనిపిస్తోంది. వైద్యం కోసం రోగి వెళ్ళితే దీనినే అవకాశంగా తీసుకొని,   అత్యవసరం అని కొందరు డాక్టర్లు, అవసరమని  కొందరు డాక్టర్లు,  అనవసరంగా  కొందరు డాక్టర్లు అక్కర లేని వైద్య పరీక్షలు జరిపించుతూ  రోగి జేబు ఖాళీ చేయిస్తున్నవారు ఉండడం నేటి డాక్టర్లలో మనం చూస్తుంటాం.
మానవ జన్మ చాలా గొప్పది. అందులోనూ వైద్య శాస్త్రం అధ్యయనం చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టం. అలా వైద్యులైన వారు చాలా మంది తమ స్వార్థానికి దూరంగా ఉంటూ అత్యవసర వైద్య సేవలో తమ జన్మ ధన్యం చేసుకొనే పుణ్య మూర్తులు సాక్షాత్తు మానవాకృతిలోనుండు మహనీయ పరమాత్మలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్టి మహనీయ మనీషులే మానవాళికి ప్రథమ పూజ్యులు.
ఉ:-
వైద్యము నభ్యసించి, తన వారికి కూడ సుదూరమౌచు, " నా
బాధ్యత" వైద్య సేవ యని, భక్తిగ రోగికి సేవ చేయుచున్,
సద్యశ మందుచున్న మిము సర్వ విధంబుల దైవ మెప్పుడున్
హృద్యముగా కనుంగొనుత! సృష్టిని ముఖ్యుఁడ! వైద్య పుంగవా!
అని మహాత్ములైన భిషగ్వరులకు పాదాభి వందనం చేస్తున్నాను.
వైద్యాన్ని ఆసరాగా చేసుకొని, ధన మాన ప్రాణాలతో చెలగాటమాడే వైద్యులు మాత్రం అంతకు అంతా పరిహారం చెల్లింపక తప్పదన్న విషయం మాత్రం యదార్థం. అది దైవ శాసనం.
జైహింద్.

30, మే 2012, బుధవారం

ఆంధ్ర భాషాబిమానులారా! ఒక్క సారి ఇది తిలకించి విని మనము ఏమి చేయకలమో చెప్పండి.

0 comments

జైశ్రీరామ్
ఆంధ్ర భాషాభిమానులారా! ఒక్క సారి ఇది తిలకించి, విని, మనము ఏమి చేయకలమో చెప్పండి.

జై హింద్.

29, మే 2012, మంగళవారం

శ్రీ విశాఖ జిల్లా జుత్తాడ గ్రామ, దేవాలయాల, ప్రాశస్త్యము.

0 comments

జైశ్రీరామ్.
ప్రియ పాఠకులారా! ప్రముఖ జ్యోతిశ్శాస్త్రవేత్త, కవి అయిన మన ప్రియతమ శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి గారు తమ గ్రామ ప్రాశస్త్యాన్ని ఎంతో శ్రద్ధతో పరిశోధన చేసి వాటి వివరములను, చిత్రములను మనకు చూచుటకు వీలుగా నా కోరిక మేరకు పంపి యున్నారు.
ఆ చరిత్ర మీకూతెలియఁజేయు నిమిత్తము ఆంధ్రామృతంద్వారా మీకు అందజేస్తున్నందుకు సంతోషంగా ఉంది.
మీరు గ్రహించగలరని అశిస్తున్నాను.
జైహింద్.

వసు స్వారోచిషోపాఖ్యానము. శ్రీ క్రొత్తపల్లి సుందర రామయ్య.

0 comments

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.


వరూధినీ ప్రవరులు.
ఆః-
ఆట పట్టు సిరికి న్యాయంబునకు, నధి - ష్ఠాన మనఁగ దనరి సౌధ వినిహి
తాబ్జ రాగ కాంతి నరుణాస్పదంబనఁ - బురము దనరు లోక భూషణంబు. ౧.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
సిరికి, న్యాయమునకు, ఆటపట్టై, సౌధము లందు వినిహితమైన ( తాపఁబడిన) అబ్జ (పద్మ) రాగమణుల యొక్కకాంతిచే అరుణ కాంతికి ఆస్పదము అను విధముగా  తనరి యుండి, లోకము లన్నింటికీ భూషణమై అధిష్ఠానము అను పేరు గల పురము తనరుచుండెను. 
మను చరిత్ర పరముగా అన్వయముః-
సిరికి ఆటపట్టు. న్యాయంబునకు అధిష్ఠానము (నివాస స్థానము) అనే విధముగా నుండి సౌధములందు వినిహితమైన (తాపఁబడిన) అబ్జ(పద్మ) రాగ(మణుల) కాంతి యొక్క ప్రకాశముచే తనరి, లోక భూషణము అరుణాస్పద పురము అను విధముగా తనరు చుండెను.
చః-
పురి ద్విజ కోటి ధాత, నృప పుంగవు లర్జును, వైశ్య పాళి కి
న్నరవరు, నంఘ్రిజుల్ హలిని, నట్టువకత్తెలు రంభ, నాగముల్
తురగములున్, మహీరుహతతుల్ సుర సింధుర సైంధవాద్రులన్
నిరతముఁ గ్రిందు సేయఁ దగు నేర్పున రంజిలు మంజు వైఖరిన్. ౨.
వసు చరిత్ర మరియు మను చరిత్ర పరముగా అన్వయముః-
ఆ (అధిష్ఠాన) (అరుణాస్పద) పురము నందలి ద్విజ కోటి ధాతను, నృప పుంగవులు అర్జునుని, వైశ్య పాళి కిన్నర వరులను, అంఘ్రిజులు హలి(బలరాము)నినట్టువ కత్తెలు రంభను, నాగములు, తురగములు, మహీరుహ తతులు - సుర సింధుర(ఐరావతము), సైంధ, అద్రులను (క్రమాలంకారము)నిరతమూ క్రిందు చేయుటకు తగిన నేర్పుతో, మంజు వైఖరితో రంజిలి యుండును. 
గీః-
పచ్చడాల్ పూని సకలార్థ భవ్య సాధ - నాత్మ పౌరుష వాగ్జాల మతిశయింప,
నతి ముదంబున వీర పండితు లనంగ - వెలయు చుందురు వీఁటఁ బ్రవీణులెపుడు. ౩.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆ అధిష్ఠానము అను వీఁటను ఎప్పుడూ పచ్చలు పొదగ బడిన డాలు ధరించి సకల అర్హముల భవ్యమైన సాధన వలన కలిగిన ఆత్మ పౌరుష వాగ్జాలము అతిశయించుచుండగా,  ప్రవీణులు వీర పండితులు అని అతి ముదంబున అనంగా (పలికేవిధముగా) యుద్ధ కుశలురు వెలయుచుందురు.
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఆ అరుణాస్పదము అనే వీఁటిలో ఎప్పుడూ పచ్చ్డడము(శాలువ) లను పూని, కలా సమన్వితమై(శాస్త్ర యుక్తమై)న అర్థములే భవ్యమైన సాధనగా కల ఆత్మ పౌరుష వాక్జాలము అతిషయించగా  శాస్త్రార్థ ప్రవీణులు వీరే పండితులు అని అతి ముదంబున అనే విధము ప్గండితులు వెలయు చుందురు
ఆః-
భూమి దేవుఁడందుఁ బొల్చును ప్రవరాఖ్య - నుపరిచరుడనంగ నొప్పి వసువు
న్యాయ రీతి మిగుల నార్జించిన ఘనుండు - తేజ మొప్పఁగ ద్విజ రాజ కులము. ౪.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆ అధిష్ఠాన పట్టణ మందు ప్ర-వర- ఆఖ్యన్ (మిక్కిలి శ్రేష్ఠమైన నామముతో) ఉపరిచరుఁడు (ఆకాశ గమనము కలవాఁడు) అనంగ, ఒప్పి, వసువు ద్విజ రాజ కులము (చంద్ర వంశము) తేజ మొప్పునట్లుగా న్యాయ రీతిలో మిక్కిలి ఆర్జించిన ఘనుఁడు.భూమిపై దేవుఁడు అను విధముగా ఒప్పును.
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఆ అరుణాస్పద పురము నందు ఉపరి చరుఁడు (ఉన్నత స్థాన వర్తనుఁడు) గా ఒప్పి, ద్విజ రాజ కులము(బ్రాహ్మణ కులము) తేజము (ప్రకాశము)తో ఒప్పునట్లుగా, వసువు (ద్రవ్యము) నున్యాయ రీతితో మిగులుగా ఆర్జించిన ఘనుఁడు ప్రవరాఖ్య భూమి దేవుఁడు పొల్చు(ఒప్పు)ను.
కః-
ఆర్యావర్తన రహితుఁ, డ - శీర్యత్సుగుణ ప్రవృత్తి, చేది వినుతుఁడై
ధైర్య గుణ మొప్ప నాతని - చర్యన్ వినుతింప వశమె! శత ధృతికైనన్. ౫.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆర్యుల యెడ అవర్తన రహితుఁడు, అశీర్యత్(తక్కువ కాని) సుగుణ ప్రవృత్తి కలవాఁడును, చేది దేశమున వినుతుఁడై, ధైర్య గుణముతో ఒప్పు ఆ వసు రాజు యొక్క చర్యను శరధృతి(బ్రహ్మ)కైనను వినుతింప వసమా! 
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఆర్యావర్త దేశమునందలి నరులకు హితుఁడు, అశీర్యత్(సడలని)సుగుణ ప్రవ్రుత్తిచేత దియందు కూడా నుతుఁడై, ధైర్య గుణముతో ఒప్పెడి ఆ ప్రవరుని యొక్క చర్య(ప్రవర్తన)ను వినుతింప శరధృతి(బ్రహ్మ)కైననువశమా? 
గీః-
అనఘ వర్తనఁ బరమ వంశావతంస - మగుచు నిచ్చలుఁ దగు ప్రవరాఖ్యుఁడైన
వసు విభుం డార్య నుత శతాధ్వర గృహీత - భవ్య లక్షణుఁడగుచు శోభను వహించు. ౬.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
ప్ర వర ఆఖ్యుఁ (ప్రసిద్ధ నామము కలవా) డైన వసు విభుఁడు అనఘ (ప్ర)వర్తనచే పరమ (గొప్ప)వంశ అవతంసము(శ్రేష్టము) అగుచు నిచ్చలు(నిత్యము)నూ తగి యుండును.ఆర్యులచే పొనుతింపఁ బడిన భవ్యమైన లక్షణములు కలవాఁడగుచు, శోభను వహించును.
మను చరిత్ర పరముగా అన్వయముః-
ప్రవరాఖుఁడైన ఆ వసువుచే కలిగిన వైభవము కలవాఁడు (భాగ్యవంతుఁడు) అనఘ (ప్ర)వర్తనచే పర(బ్రహ్)మ వంశావతంసముగా అగుచు, నిచ్చలును తగునట్లు ఉండెను. ఆర్యనుతము ఐన శత(అనేక) అధ్వర (యజ్ఞములయందు) గృహీత(గ్రహింపఁబడిన) భవ్య లక్షణుఁడు అగుచు శోభ (ప్రకాశము) ను వహించును.
గీః-
అందమల పద్మ సంతతి నలవరించి - దివ్య గుణమణులందు శుక్తిమతి నాఁగఁ!
గర్మ పావన మూర్తియై ఘనత నొప్పు - నది విబుధ హర్షమై మహోన్నతిని గాంచు. ౭.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆ అధిష్ఠానపురమున్ అందు అమల పద్మ సంతతి(సముదాయము)తో అలవరించి(ఒప్పి), దివ్య (దైవ సంబంధ) గుణము గల మణులను అందు(కలుగు)శుక్తిమతి నాఁగన్(అనఁబడెడి పేరుతో), కర్మప (కర్మాధికారులను) అవన (రక్షించునట్టి) మూర్తి (ఆకృతి కలది) యై ఘనతను, ఒప్పు,  నది విబుధ హర్ష(యోగ్య)మై మహోన్నతిని గాంచును.    
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఆ ప్రవరాఖ్యుని అందము అల పద్మ (లక్ష్మి) సంతతి (యగు మన్మధు) అలవరించి (పోలి) దివ్య గుణము లనెది మణుల యందు మతి (మనస్సు) శుక్తి (ముత్యపు చిప్ప) నాఁగన్ (యనునట్లుగా) కర్మ(లచే) పావన మూర్తియై, ఘనతను ఒప్పున (ఔచిత్యము చేత) ను, దివి యందు బుధ జనులచే హర్షింప బడినవాఁడై మహోన్నతిని కాంచు చున్నాఁడు.  
గీః-
ఆత్మ భార్యానురాగుఁడై యవ్వ, సుప్ర - భుండు నాయన మిత మతిఁ బొరసి యుండ,
ఘన సమితిఁ బొంగు గాంచుచు ఘనత నెసఁగఁ - బారువాఁడెంత వాఁడైన వరలఁ గలఁడు? ౮.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆత్మభా (తన కాంతి) చేత ఆర్యులయెడ అనురాగము కలవాఁడై, ఆ వసు ప్రభుండు నాయ (నీతి చేత), నమిత (నమ్రమైన) బుద్ధిని, పొరసి (పొంది) యుండఁగా, ఘన సమితి (గొప్ప రణము) నందు పొంగుఁగాంచుచు (గర్వించుచు)ఘనతను ఎసగగా (గర్వముననొప్పఁగా) ఎంత (గొప్పబలము కల) వాఁడైనను పాఱు (పఱుగిడు) వాడు అగును.వఱలఁ (ప్రకాశించ) గలఁడా?
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఆ పాఱు వాఁ (బ్రాహ్మణుఁ) డుఆత్మ భార్య యందు అనురాగము కలవాఁడై, అవ్వ (తల్లి ) యు, సు ప్రభుండగు నాయనయు, మిత (తగిన) మతి చేత పొరసి (కూడి) యుండగా,ఘన సమితి (సభల) యందు పొంగుఁ(జయమును లేదా సంతోషమును)  గాంచుచు (పొందుచు).ఘనతతో ఎసగు చుందగా, ఎంత వాఁడైనను  అతని ముందు వఱలఁ గలఁడా?
వః-
ఆ ప్రవరాఖ్యుండగు వసురాజు. ౯.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆ ప్రసిద్ధ నామము గల వసు రాజు,
మను చరిత్ర పరముగా అన్వయముః-
ప్రవరుఁడు అను పేరు గల  ఆ ధనవంతుఁడు,
గీః-
పాడి పంటలఁ దనరు జీవనము గల్గి - యింబడర, ఘన కోలాహలంబు పెఱిగి,
పైనఁ బడి శుక్తిమతి నాగ, దాని పని మ - దిని దలఁచి సచ్చరణ భవ ఘనత నెట్టె. ౧౦.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
సమస్తమైన పంటలను ఫలింపఁ జేయుట యందు తనరుచున్నజీ(జీవనాధారమైన)వనము(నీరు)కలిగి, ఇంబు (చక్కదనముతో)అడరు (ఒప్పు) చుండగా , శుక్తిమతీ నదిని,ఘనమైన కోలాహల పర్వతము పెఱిగి, పైనఁ బడి అగన్ (ఆగిపోవు విధముగ) అడ్డగింపగా, దాని (ఆ కోలాహలుని) పనిని మదిఁదలచి, సత్ (యోగ్యమైన) చరణభవము (గోటి) యొక్క ఘనత చేత పాడియని భావించి, నెట్టెను.
మను చరిత్ర పరముగా అన్వయముః-
పాడి పంటలతో తనరుచున్న జీవనము గల్గి, తనను గూర్చి పొగడ్తలతో కూడిన ఘన కోలాహలము తన పైనఁ బడి, పెఱిగి, ఇంబు (ఇంపుతో) అడర (ఉండ) గా , దాని (దానము చేయువాని) యొక్క పనిని శుక్తి మతి నాగ (నత్తగుల్లలు కలిగిన దాని విధముగా) మది యందు తలచి, సచ్చరణ ( మంచి కులమునందు ) భవ (పుట్టుట వలన) ఘనత చేత నెట్టి వేసెను.(దానము స్వీకరింపుఁడని అర్ధించినను తిరస్కరించెడి వాఁడు).
వః-
ఆ ద్విజ రాజ వంశజుఁడు దిగంతములఁ గను కీర్తిఁ గల్గి యుండునంత. ౧౧.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆద్విజ రాజ (చంద్ర) వంశజుఁడైన వసు రాజు దిగంత వ్యాప్త కీర్తుఁడై యుండగా,
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఆబ్రాహ్మణ వంశజుఁడగు ప్రవరుఁడు దిగంత వ్యాప్త కీర్తుఁడై యుండగా,
గీః-
అమర నాథానుమతి స్వస్థలమున కొకట -వచ్చి యుండినఁ బల్వురు పాక శాస
నత్వమునఁ బవిత్రప సదనమునఁ బొగడ - నాతి మోదానఁ బతి వసు నేతఁ గనును. ౧౨.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అమర నాథానుమతిచే స్వ(ర్గ)స్థలమునకు ఒకపర్యాయము వసురాజు వచ్చి యుండగా పల్వురు పాకశాసనత్వము (ఇంద్రపదవి)కారణముగా ఇంద్ర సదనమున పొగడగా, పవి (వజ్రాయుధము) వలని త్రప (సిగ్గుచే) ఆతి మోదాన (తగ్గిన సంతోషముతో) వసునేతను  గనును.
మను చరిత్ర పరముగా అన్వయముః-
నాథానుమతి అమరి యుండగా పవిత్ర యగు ఆప్రవరుని అర్థాంగి స్వస్థలమునకు (తమయింటికి) ఒకటన్ పల్వురు వచ్చి యుండిననుపాకశాసనత్వము (వంట యేర్పాట్లు కారణము) చేత పసదనమున (ద్రవ్య రూపమున యిచ్చు దక్షిణల కారణముగా) ఆమెను పొగడు చుండగా, ఆ నాతి మోదాన, పతి వసునేత (భాగ్యశాలియైన భర్త) ను కనును.
కః-
అతఁడీ విధమున నభ్యా - గత సేవాభిరతిఁ గొంత కాలము భాగ్యో
న్నతి నుండు నంత నభ్యా- గత వేళం గౌతుకంబు గడలు కొనంగన్. ౧౩.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అతఁడు (వసురాజు) ఈ విధమున అభ్యాగత సేవాభిరతిచే కొంత కాలము భాగ్యోన్నతి నుండగా, అభ్యాగత (రాబోయే) వేళలో కౌతుకము కడలు కొనగా,
మను చరిత్ర పరముగా అన్వయముః-
ప్రవరాఖ్యుఁడగు అతఁడు ఈ విధమున అభ్యాగత సేవాభిరతిచే, కొంత కాలము భాగ్యోన్నతి నుండును. అంతట అభ్యాగత వేళలో (కుతప కాలమునందు)కౌతుకము కడలు కొనగా,
సీ:-
ఎఱ్ఱని జటలతో నెసఁగు జొంపము గల - వి లసితమగు క మండలువు తోడ,
భస్మ గర్భామోద బంధుర రుద్రాక్ష - మాలికా సత్ కదంబముల తోడఁ
దళతళ ద్యుతులతో దళమెత్తు పోల్కి నెం - తయు వన్నె గల మృదు త్వక్కు తోడ,
నందమై కొనసాగు యర్జునంబున నొప్పు - కమనీయ మౌ తిలకంబు తోడ,
గీః-
ఎంతయును జెన్ను మీఱి వసంతుఁడనఁగఁ - బరగు నౌషధ సిద్ధుండు ప్రజల కెల్ల
నయన పర్వంబుగా మహోన్నతిని గాంచి - మించి యతని కొలమున కేతెంచె నొకట. ౧౪.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
(వసంత ఋతువర్ణనము.)
ఎఱ్ఱని జట (ఊడ) లతో, ఎసగు (ఒప్పెడు) జొంపము (చివురు) గలిగిన, వి (పక్షులచే) లసిత (ప్రకాశమాన) మగు కమండలువు (జువ్విచెట్టు) తోడ, భస్మగర్భ (ఇరుగుడు చెట్టు) తోను, ఆమోద (పరిమళముతోఁగూడిన) బంధుర (మనోహర) మైన రుద్రాక్ష మాలికలతోను, సత్ కదంబ వృక్షముల తోడను, 
తళతళ ద్యుతులతోదళమెత్తు (చివురులెత్తు) టకు పోల్కిని, ఎంతయు వన్నె గలిగిన, మృదు త్వక్కు (భుజపత్రపు చెట్టు) తోడను, 
అందమై కొనసా (ఎది) గి, అర్జునంబు (ఏరు మద్ది చెట్టు) న, ఒప్పుచున్న ఎంతయు చెన్ను మీఱి, ఒకట (ఒక్క సారిగా) ప్రజలకెల్ల నయన పర్వంబుగావసంతుఁడనగఁ బరగు సమస్త అఒషద్గములను సిద్ధింపఁ జేసిన వాఁడగు వసంతుఁడుమహోన్నతిని గాంచి (అతిశయించి) మించి పోవుచు అతని (ఆ వసురాజు యొక్క) కుల (జనపద) మునకు, ఏతెంచెను.
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఎఱ్ఱని జటలతో ఎసగు (ఒప్పు) నట్టి, జొంపము (ద్రఢిమ) గల విలసితమగు కమండలువు తోడను, భస్మ (విభూతి) విలసిత గర్భము (ఉదరము) తోడను, ఆమోద (చిదానంద) ము తోడను, బంధుర మైన రుద్రాక్ష మాలికల యొక్క సద్యోగము (మంచి సముదాయము) తోడను, తళ తళ ద్యుతులతో దళమెత్తు (యుద్ధమునకు బయలు దేరు) పోల్కిని, (భయంకరముగా) ఎంతయు వన్నె (గొప్ప వన్నియలు) గల, (వన్నెల మృగము=పులి), త్వక్కు (పులి చర్మధారణ) తోడను,
అందమై కొనవలె సాగి, అర్జునంన (తెలుపుతో) నొప్పు కమనీయమైన తిలకంబుతో, 
ఎంతయు చెన్ను మీఱి, ఒకట(ఒక నాడుయ్)వసంతుఁడు అను విధముగప్రజలకెల్లరకు నయన పవముగా, మహోన్నతిని గాంచి, మించి, (ఔన్నత్యముతో), అతని కులమున (గ్రామమున) కు ఔషధసిద్ధుఁడు ఏతెంచెను.
వః-
ఇట్లుండునంత నతి బలాధికుండు. ౧౫.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఈ విధముగా వసంత ఋత్వు వచ్చి యుండగా, అతిబల(పవనుఁడు అను) అధికుఁడు,
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఇట్లుఆ ఔషధ సిద్ధుఁదు వచ్చి యుండు నంత, అతి ౯విస్తారమగు) బలాధికుఁ (రూపముచే గొప్పవాఁ) డయిన ప్రవరుఁడు,
ఆః-
అతని రాకఁ జూచి, హర్షంబుతో నెదు - రేగి, గౌరవింప నెంచి తోడి
తెచ్చి యిష్ట వస్తు దృప్తిని దేలించి - మెలఁగు నా సమీర మెలసి యంత.౧౬
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అంత అత (ఆ వసంతు) ని రాకఁ జూచి, గౌరవింప (ఋతు శోభను వృద్ధి చేయ) నెంచి, హర్షంబుతో నెదురేగి, తోడి తెచ్చి, ఇష్ట  (సుగంధాది)  వస్తు(వులచే) తృప్తినిఁ దేలించి, ఎలసి(ప్రవర్తించి) ఆ సమీర (మలయ మారుత) ము మెలఁగును. 
మను చరిత్ర పరముగా అన్వయముః-
అంత ఆ ప్రవరుఁడు అతని రాకఁ జూచి, హర్షంబుతో నెదురేగి, గౌరవింప నెంచి, తోడి తెచ్చి, ఇష్ట వస్తు(సమర్పణమున)తృప్తిని దేలించి, తన మదిలో మెలగు నాస అతిశయింపగా, మెలసి (వర్తించి)
గీః-
చెలఁగ నీ రెందుఁ బోవుచు క్షితిని నిందు - రాక యయ్యెను సిద్ధ మహా కుతుకము,
తీర్థములఁ జూచు వేడుక దీర్ఘమయ్యె. - ననఁ బసరు పూసెనంతట ఘనము గాఁగ . ౧౭.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఎందు ఐనను నీరు ఇంకి పోవుచు (ఉన్నందున), క్షితిని ఇందు(ని)రాక సిద్ధ(చేకూర్చిన)  మహా కుతుకము(గొప్ప సంతోషముకలది)అయ్యెను.(నిర్జలము వలన కలిగిన తాపమును చంద్రాగమనము తీర్చి భూమిని సంటోష పెట్టు చున్నది) తీర్థ (ఉదక) ములఁ జూచు వేడుక(కోరిక)దీర్ఘ్మయ్యెను.అంతటను ఘనము గాఁగ ననన్ (చిగురు తాకుల యొక్క) బసరు(పచ్చ దనము)  పూసెను, (పొటమరించెను.)
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఒ సిద్ధా! క్షితిని చెలగన్ ఈరు ఎందుఁ బోవుచు ఇందు(ఈ ప్రదేశమునకు)  రాక? మహా కుతుకము అయ్యెను.  తీర్థములను చూచు వేడుక నాకు దీర్ఘమయ్యెను.  అని అనన్ గా అంతట( ఆ ప్రవరునకు ఆ సిద్ధుఁడు) ఘనము గాఁగ పసరు పూసెను.
గీః-
వేఁడి వేలుపు మహిమంబు విపులమైన - హిమ నగము పాద లేపనముమిషగాఁగఁ
జేరె సంతోషమున మంచు, చేతఁ బాసి - యొండు చోటికిఁ బోలేక యుండు నచట. ౧౮.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
వేడి వేలుపు అయిన సూర్యుని యొక్క ప్రభ విస్తారము కాగా, మంచు తన చేతనమును  పాసి,ఒండు(మరియొక)  చోటికి పోలేక, పాద (ప్రత్యంత పర్వతముల యందు) లేపనముకొండకు పులుముకొని వ్యాపించుత యను మిష, కాగా కుతూహలముతో హిమ నగమును చేరెను.అచట నుండును.
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఆ ప్రవరుఁడు వేలుపును వేడి,విపులమైన మహిమంబులు గలపాద లేపనము మిష(కారణము)  కాఁగా, సంతోషమున హిమ నగము చేరెను. మంచు చేత ఆ పాదలేపనము పాసి, ఒండు చోటికి పోలేక, అవ్హట నుండెను.
మః-
పువులం బండ్లను, బల్లవంబులను నొప్పుల్ గుల్కి రంజిల్లఁగాఁ
దవు తీవల్ పొదలున్ దరుల్ బహుళమై దౌదౌల నేత్రోత్సవం
బవుచున్, దేటులుఁ జిల్కులున్ బికము లాహ్లాదంబుగా నంతటన్
రవళిన్ బల్కులఁ గూతలం జెవులకున్ రమ్యంబు గావింపఁగన్. ౧౯.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అంతటను ఆహ్లాదంబుగా తవు (ఒప్పిదమైన) తీవలు, పొదలు, తరులు, పూవుల చేతను, పండ్ల చేతను, పల్లవంబుల చేతనుఒప్పులు గులుకుచు, బహుళమై దౌదౌల(సమీపప్రదేశములలో)నేత్రోత్సవము అవుచు,రంజిల్లగా, తేటులు, చిల్కలు, పికములు, రవళులు, పల్కులు, కూతలతో, చెవులకు రమ్యము గావింపగా.....
మను చరిత్ర పరముగా అన్వయముః-
అంతటను ఆహ్లాదంబుగా తవు (ఒప్పిదమైన) తీవలు, పొదలు, తరులు, పూవుల చేతను, పండ్ల చేతను, పల్లవంబుల చేతనుఒప్పులు గులుకుచు, బహుళమై దౌదౌల(సమీపప్రదేశములలో)నేత్రోత్సవము అవుచు,రంజిల్లగా, తేటులు, చిల్కలు, పికములు, రవళులు, పల్కులు, కూతలతో, చెవులకు రమ్యము గావింపగా.....
గీః-
అటవి రక్షక చిత్తుఁడై యతఁడు తేరు - కొని కడుం ద్రిమ్మరుచుఁ జెంత గొనబు మీఱు
పాట నొప్పెడు కోనను బాఱఁ జూచి - తన ప్రధాన వర హృదయ మనుగమింప. ౨౦.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆ వసురాజు తేరు  (రథము) కొని (గ్రహించి) అటవిని రక్షించ వలెననేది చిత్తము కలవాఁడై, కడు మిక్కిలి) త్రిమ్మరు (తిరుగు) చు, ఆ చెంతనే గొనబు (సౌందర్యము) మీఱు (అతిశయించు) పాటతో నొప్పెడు కోనను బాఱఁ జూచి, తన ప్రథాన (సచివుని) వర (శ్రేష్టమైన) హృదయమును అనుగమింపగా....
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఆ ప్రవరుఁడు అట విరక్షక (రక్షకులు లేని) చిత్తుఁడై, తేరుకొని, కడు త్రిమ్మరుచు, చెంతను గొనబు మీఱు పాటతో ఒప్పెడు కోనను బాఱఁ జూచి, తన ప్రథాన వర హృదయము ననుగమింపగా.....
వః-
అంతఁ జని దానిం గనుంగొనుమన మున. ౨౧.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అంతట ఆ వసురాజు ఆ పాట యొక్క సంగతిని కనుఁగొనుము అనగానేసచివుఁడు మునుగా చని,......
మను చరిత్ర పరముగా అన్వయముః-
అపుడు ప్రవరుఁడు ఆ వనమును కనుగొన వలెనను మనమున చని.....
చః-
కనె నవరత్న భాసితముఁ, గాంచన శోభిత, మార ఘట్ల మం
డన కదళీ వనాంతము, ఘన స్వన బంభరవా సిత ప్రఫు
ల్ల నవ సుమాతిగంధి మృదులచ్ఛదరాజి లతా ప్రతాన నీ
కనదురు కాయమాన పరి కల్పిత శీత మనోజ్ఞ హర్మ్యముల్. ౨౨.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
నవరత్న భాసితము, కాంచన శోభితము, ఆరఘట్ట(ఏతము) మండన(అలంకారముగాఁగల) కదళీ వనాంతమున, ఘన స్వననమిక్కిలి రొద చేయుచున్న)   బంభర(తుమ్మెదలకు, వాసిత(నివాస యోగ్యమై యున్న)  ప్రఫుల్ల(చక్కగా వికసించిన) నవ సుమ(ములయొక్క), అతి గంధ(గొప్ప సువాసన చేత) మృదుల ఛద రాజి(లేత యాకు జొంపము చేత), లతా ప్రతాననీ(అల్లుకొనిన తీగల గుబురుల చేత), కనత్(విలసిల్లుచున్న) ఉరు(విశాలమైన) కాయమాన(పందిళ్ళచే)పరికల్పితమైనశీత మనోజ్ఞ హర్మ్యమును కనెను.   
మను చరిత్ర పరముగా అన్వయముః-
నవరత్న భాసితము, కాంచన శోభితము, ఆరఘట్ట(ఏతము)మండన(అలంకారముగాఁ గల) కదళీ వనాంతమున నున్నదియు, ఘనముగా స్వనము చేయు చున్న బంభర ములకు నివాసిత మై యున్న, ప్రఫుల్ల నవ సుమముల  అతిశయించిన సుగంధ పరీమళముల చేత, మృదులమైన ఛద (లేత యాకుల) రాజి (జొంపములచేతను) లతా ప్రతాననీ (అల్లుకొనిన తీగల గుబుల చేతను) కనత్(విలసిల్లుచూ) ఉరు(విశాలమైన) కాయమాన(పందిళ్ళచే) పరి కల్పిత(ఏర్పాటు కాబడున) శీత మనోజ్ఞ హర్మ్యమును ప్రవరుఁడు కనెను.
కః-
కనుఁగొని హర్మ్యోపాంతం - బునకుం జని లోనికేఁగఁ బొలఁతి యొకతె వీ
ణను బూని కంఠ నాదం - బును మేళము సేసి గానము సలుపఁ జూచెన్. ౨౩.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఈ విధముగ నర్మసచివుఁడు కనుఁగొని, హర్మ్యోపాంతమునకు చని, లోనికి ఏగఁగా, పొలతి యొకతె వీణను పూని, కంఠ నాదంబును వీణా నాదముతో మేళన చేసి, గానము సలుపు చుండగా చూచెను. 
మను చరిత్ర పరముగా అన్వయముః-
ఈ విధముగ ప్రవరుఁడు కనుఁగొని, హర్మ్యోపాంతమునకు చని, లోనికి ఏగఁగా, పొలతి యొకతె వీణను పూని, కంఠ నాదంబును వీణా నాదముతో మేళన చేసి, గానము సలుపు చుండగా చూచెను. 
ఆః-
అంత నాకె యంద మారసి వేవేగ - వచ్చి విభుని చాయ భావమంచు,
మెచ్చి మనుజ వర్య! మీర లేలిన నన్ను - మిన్న యంచు జనము నెన్నకుంద్రె? ౨౪.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అంతట ఆకె (ఆచిన్నదాని యొక్క) అందము ఆరసి, వేవేగ (రాజు కడకు) వచ్చి, తన భావము నందు మెచ్చి, విభుని చాయను (వసురాజు చెంగట) మనుజ వర్య! మీరలు ఈమెను పరిణయమాడి ఏలినచో ఆమెను అన్నుల మిన్న యంచు జనులెన్నకుందురా? అనెను.
మను చరిత్ర పరముగా అన్వయముః-
అంతట ఆకె(వరూధిని) ఆ ప్రవరును అందము ఆరసి, వేవేగ వచ్చి, విభుని చాయను(భర్త యనునట్లు) భావమందు మెచ్చి, మనుజ వర్య! మీరలు నన్ను ఏలినచో జనులు నన్ను అన్నుల మిన్నగా ఎన్నకుందురా? అనెను.
కః-
అనిన నేకతంబుగను వనంబున నీవు - వచ్చి యుంటివ! బల!! యిచ్చటికిని
దారిఁదప్పిపోక నేరక యుంటి, మా - ర్గమ్ముఁ జూపుమన్న నెమ్మి ద్విజుఁడు. ౨౫.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
సచివుఁడు ఆ విధముగా అనగా, ద్విజుఁడు(క్షత్రియుఁడైన వసురాజు) నీవు వనంబునందు ఏకతంబుగను,  ఇచ్చటికిని వచ్చియుంటివా! బల!(భళీ)దారి తప్పి, పోక(పోవుట)యనునది, నేరకఉంటివి.నెమ్మి మార్గమ్మును చూపుము.అని అనగా.
మను చరిత్ర పరముగా అన్వయముః-
వరూధిని ఆ విధముగ  అనిన, ద్విజుఁడైన ఆ ప్రవరుఁడు ఓ అబల!వనంబున ఇచ్చటికిని, ఏ కతంబు (కారణంబు) గను, నీవు వచ్చి యుంటివి? దారి తప్పి, పోక నేరక, ఉంటిని.నెమ్మి(తగు విధముగ)మార్గమ్మును చూపుము. అనగా.....
కః-
మును వచ్చిన దారిని - నే - వినుత చరిత! చనఁగ వచ్చు, వేఱె యొరులు దా
రిని చూప వలెనె? పోవం - గను జూపెద, నంటి వచ్చి కనుఁగొనెదు గదా! ౨౬.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
నే మును వచ్చిన దారిని చనగ వచ్చును. వినుత చరితుఁడా! వేఱె ఒరులు దారి చూప వలెనా? పోవంగను చూపెదను. అంటి వచ్చి,నీవేర కనుగొనెదు కదా!అని వసువుతో నర్మ సచివుఁడు పలికెను.
మను చరిత్ర పరముగా అన్వయముః-
వినుత చరితా! మును వచ్చిన దారినినే, చనఁగ వచ్చు. పోవంగను వేఱే ఒరులు దారిని చూప వలెనే? నీ చూపు నీ ఎదను అంటి(అనుసరించి) వచ్చి నా వంక కనుగొనెదు కదా!
గీః-
అనుచుఁ దా వరూధిని నిల్వ నతని "ననఘ! - కొంత తడవోపి యుండినఁ గుతుక మొప్ప
నశ్రమంబున నేఁగంగ నగును గాదె?" - యంచుఁ గోరఁగ బోవఁగా నెంచి యతఁడు. ౨౭.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అని పలుకుచు, ఆ నర్మ సచివుఁడు వరూధిని (సేన అంతయు) నిల్వ (ఆగిపోఁ) గా,  అతనిని (ఆ వసువును) అనఘ! కొంత తడవు ఓపి యుండిన కుతుకమొప్ప ఆశ్రమంబునకు ఏగంగనగును కదా! అంచు కోరఁగా అతఁడు(ఆ వసురాజు) పోవగా నెంచి,.....
మను చరిత్ర పరముగా అన్వయముః-
వరూధిని తాను ఆ విధముగ ననుచు,  ప్రవరుఁడు నిల్వ అతనిని అనఘ! కొంత తడవు ఓపి యుండినచో కుతుకము ఒప్పగా, ఆశ్రమంబునకు నేగంగ నగును కాదె!. అనుచు కోరఁగా, అతఁడు పోవగా నెంచి,.....
గీః-
పోవలయు వేగ, నా యింటి పువ్వుబోడిఁ - జూడవలె, నిత్య కృత్యముల్ చొప్పు దప్పి,
యుండె, నా మది దానిపై నొనర - నెపుడు  -  గాంతునని హిత! కార్య సంహటన కొఱకు. ౨౮.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఓ హిత!(స్నేహితుఁడా)! వేగన్ పో వలయు, ఆ ఇంటి పువ్వుఁ బోడిని చూడ వలెను. నా మది దానిపైన ఒనర(ఒప్పి యుండ)గా, నిత్య కృత్యములు చొప్పు(క్రమము) తప్పి,  కార్య సంఘటన కొఱకు ఎప్పుడు కాంతును? అని ఉండెను. 
మను చరిత్ర పరముగా అన్వయముః-  
వేగముగా పో వలయును. నా యింటి పువ్వుఁ బోడిని చూడ వలెను. నిత్య కృత్యములు చొప్పు తప్పి, నా మది దానిపైని ఒనరి యుండగా, హిత కార్య (అగ్నికార్యాదుల) సంఘటన (నిర్వహణ) కొఱకు  ఎపుడు కాంతు (సాధింతు) ను? అని యుండెను అని ప్రవరుఁడు పలికెను.
కః-
అన, నను గూడఁగ నీకున్ - గననగు సౌఖ్యంబటంచుఁ గైకొని యాలిం
గన మును జేయఁదగ, దనియుఁ - జను పొమ్మని గెంటని హిత సంభ్రమ మొలయన్. ౨౯.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అని వసు రాజు అనగా, (నర్మ సచివుఁడు) నను కూడఁగ(నన్ను అనుసరించి) వచ్చినచో, ఓ రాజా నీకు సౌఖ్యంబు కన నగును. అటంచు (అనుచు) కైకొని (పూని), ఆలిని(కాంతను) తగు విధముగ కనునట్లు చేయగా, తనియును.  చను(ఇది చేయనొప్పును) పొమ్మని, గెంటని(తొలగింప సాధ్యము కానిదగు) హిత  (మిత్రుని యొక్క)  సంభ్రమము ఒలయగా(ప్రకాశింపగా).......
మను చరిత్ర పరముగా అన్వయముః-  
అని ప్రవరుఁడు అనగా,ఓ ప్రవరుఁడా! నన్ను కూడఁగ (కూడినచో) నీకుసౌఖ్యంబు కన నగును. అటంచు(అని పలుకుచు) కైకొని అతనిని ఆలింగనము చేయఁగా తగదు అని పలికి, చనుము అని గెంటఁగా నిహిత (తన యందుననున్న)సంభ్రమము ఒలయ (ఒప్ప) గా.....
గీః-
పిలిచికొని పోయి చూపినఁ బ్రేమ మీఱ - నంగనను పెద్ద సేయఁగ నాత్మ - మాటు
సేసి కనుఁ బురుషవరుండు చిత్తమలరఁ - గా మముల నువిదల మించు కామ మున్నె! ౩౦.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
పిలిచి, కొనిపోయి, ఆకన్యను చూపిన, ప్రేమ మీఱ ఆత్మ యందు ఆ అంగనను పెద్ద సేయగను(గౌరవించుటకై) మాటు సేసి (చాటున ఉండి) పురుష వరుండగు  వసురాజు చిత్తము అలరునట్లు చూచును. కామము లన్నింటను ఉవిదలకు మించిన కామము ఉన్నె?
మను చరిత్ర పరముగా అన్వయముః-   
తమంతట తాము  స్త్రీలను పిలిచికొని పోయి, ప్రేమ మీఱ(హద్దులు మీరి)  చూపినచో అట్టి అంగనను పెద్ద(గౌరవము) సేయుటకు ఆత్మ మాటు వేసి(మనస్సు దాచుకొని), పురుష వరుండు కనును. చిత్తము అల్రగా మములను ఉవిదలను అతిక్ర మించు కామము ఉన్నదా?
వః-
అటులననివారిత మోహావేశముఁజూపి, తాను. ౩౧.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అటుల అనివారిత మోహావేశముఁజూపి, తాను ఆ వసు రాజు,
మను చరిత్ర పరముగా అన్వయముః- 
అటుల అనివారిత మోహావేశముఁజూపి, తాను ఆ  వరూధిని,
కః-
ఎంత తపోధనులగుచున్ - సంతతముఁ జరించినను యశం బలవడునే
కాంత ననురూప లసితం - గాంతగఁ గైకొనక దూరఁగా నెవ్వరికిన్. ౩౨.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఎంత(మిక్కిలి)తపోధనులగుచును, ఎల్లప్పుడును చరించినను, ఎవ్వరికినైనను అనురూప(తగిన రూపము కలది) లసిత(ప్రకాశించునది)యు నైన, కాంతను, గైకొనక, దూరఁగా(తిరస్కరించినచో) యశంబు అలవడునా? 
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఎంతటి తపోధనులగుచు, సంతతము చరించినను, ఎవ్వరికినీ, కాంతనైన నను రూప లసితను(సౌందర్యముచే ప్రకాశించుదానిని, కాంతగా కై కొనక, దూరఁగా(నిందించినచో) యశంబు అలవడదు కదా!
వః-
అనిన విని, ౩౩.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆ విధముగ రాజు పలుకగా విని, 
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఆ విధముగ ప్రవరుఁడు పలుకగా వరూధిని విని, 
గీః-
నేన యతి మార్గమును బూని నియత వృత్తి - నాకె యుండిన గృహమున కేకతంబు
గాఁగఁ జనియెద సంతోష గరిమ మెఱయ - ననుచు శుచి వేడి చనిన నయ్యతివ యంత. ౩౪.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
నేన యతి మార్గమును బూని, నియత వృత్తిని(దైవ వర్తనుఁడనై) ఆకె(ఆచిన్నది) ఉండిన గృహమునకు ఏకతంబు కాఁగ, సంతోష గరిమ మెఱయ, చనియెద. అనుచు శుచియైన ఆ మంత్రి రాజుగారి అనుమతి వేడి, చనగా, అయ్యతివ అంతట,
మను చరిత్ర పరముగా అన్వయముః- 
నేనే కనుక యతి మార్గమున్ పూని, నియత వృత్తి నాకే ఉండినచో, నా గృహంబునకు ఏ కతంబు గాఁగ సంతోష గరిమ మెఱయ, చనియెదను అనుచు, శుచి(అగ్ని)ని వేడి, ప్రవరుఁడు వెళ్ళిపోఁగా అంతన్ ఆ అతివ,
గీః-
ప్రియ సఖులతోడ మిక్కిలి ప్రేమ మీఱ - నతనిఁ గనుఁగొనఁ జని కనకాసన మర
గతిని గొనివెట్ట, వసియింపఁ గని ప్రియాళి - తోడ సేవింపఁ, గొనినట్టు గూడఁ జేసి. ౩౫. 
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ప్రియ సఖుల తోడ మిక్కిలి ప్రేమ మీఱగా ఆ వసురాజును కనుగొనుటకుచని, కనక ఆసనముఅరగతిని కొని పెట్ట(తెచ్చి యుంచగా)దానిపై ఆముని కూర్చుండగా,  కని, ప్రియాళి తోడ సేవింప అతడు  కొనినట్టు(స్వీకరించినట్టు కూడ(వెంటనే) జేసి(నటించి), 
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ప్రియ సఖులతో, మిక్కిలి ప్రేమ మీఱ, అతని కనుగొన జని, కన జాలక, ఆశతో ఒప్పి యుండగా, గతిని(ఆమె ప్రవర్తనను)గొని(గ్రహించి) వెట్టన్(మోహ తాపమున)వసియింప(ఉండగా) కనిపెట్టి, ప్రియాళి తోడ(వెంటనే)సేవింపం(సైత్యోపచారాది) సేవలు చేయు నిమిత్తము,  కొని(తీసుకొనివెళ్ళి) నట్టు(నివాసమును) కూడఁజేసి(ప్రవేశపెట్టి),

గీః- 
నీకు వసు విభుండొక్కడు చేకురెడి న - టంచు నన, వారు హర్షంబు నందు మునుఁగ 
గొంత తడవుండి యందొక్క యింతి మంజు - వాణి యిట్లని పల్కె సర్వంబుఁ దెలియ. ౩౬.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఓ తరుణీ! నీకు వసువిభుండొక్కఁడు(ఒక ధనవంతుడు)చేకురెడి నంచు నని దీవింపగా వారు హర్షంబునందు మునుగ కొంత తడవుండి ఒక్కింత సేపూరకుండి, అందొక్క యింతి మంజువాణి సర్వంబు తెలియ నిట్లు పలికెను.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఓ తరుణీ! నీకు వసువిభుండు(ధనవంతుఁడు)ఒక్కఁడు చేకురెడి నటంచు నన్ (ఈబీదవానితో పనియేమి అని) దీవింపగా వారు హర్షంబునందు వరూధిని మునుఁగఁ కొంత తడవుండి, ఒక్కింత సేపూరకుండి యుండ, అందొక్క యింతి మంజువాణి(మృదువాక్కు కల ఒక యింతి) సర్వంబు తెలియ నిట్లు పలికెను. 
గీః-
విమల మతి! యెందుఁ బోయెడు వేడ్క నిందు - వచ్చిరతులమతిని ప్రేమ వరలఁ జేయఁ
దగును; గాన మురువు మీఱఁ దలిరుఁబోడి - వెదక వచ్చినఁ దగు విధి కొమరుల. ౩౭.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
విమల మతిగల ఓ మునివర్యా! ఎందు బోవలయునను వేడ్కతో ఇందు వచ్చితిరి? అతుల మతిని ప్రేమ వరలఁ జేయఁ దగును. గానము, ఉరువు మీర(వృద్ధి పొంది యుండగా మా తలిరు బోడిని వెదక వచ్చిన కనఁ దగునటువంటి విధి కొమరులా(నారద మునులా) యేమి?
మను చరిత్ర పరముగా అన్వయముః- 
విమల మతివైన ఓ వరూధినీ!ఆ ప్రవరాఖ్యుఁడు ఎందు బోయెఁడును? ఇందు నీ వద్దకు తిరుగ వచ్చి, వేడ్కను రతులను మతిని ప్రేమను వరలఁ జేయుట కొఱకు అతడే తగును. కాన ఓ తలిరుబోడీ!విధి(కాలము యొక్క)కొమరుల(అందలము)చే(కాలానుకూలముచేత)మురువుమీర(కడు ఒప్పిదము)గా ఆ ప్రవరాఖ్యుని వెదక వచ్చినచో, కన దగును. 
క:- అన నను గౌతమ విఖ్యా  -  తిని బిలిచెద రేను గోపతిని గూర్చి తపిం
చిన దాననే యశము గల  -  ఘన పదముం బొందితి, నని కడు ప్రేమమునన్. ౩౮.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
మంజు వాణి ఆ విధముగా అనగా,  నను గౌతమ అను విఖ్యాతమైన పేరుతోఁ బిలిచెదరు. అటు వంటి నేను సూర్యుని (వసురాజును౦)గురించి తపించగా, దాని కారణము గానే యశము గల ఘన మగు ఈ మునీశ్వర పదము పొందితిని. కడు ప్రేమముతో -  -  -  -!
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ప్రియ సఖి ఆ విధముగా అనుగౌ(ప్రియముచే ఒప్పిదమగు)తమ యొక్క విఖ్యాతిచే పిలిచెదరు(ప్రవరాఖ్యుని వెదకుటకై ఆహ్వానించెదరు)నేను గోపతిని గూర్చితపిమ్చిన, దాని వలన ఏ యశము గల ఘన పదమును బొమ్దితిని? అని కడు ప్రేమముతో........ 
గీ:- సుఖ గతిని నాయనను గాంచి సుదతి కేళి  -  వనమునకుఁ బద్మినీ జాతి వరలఁ దేఁగ
వచ్చి, ఛద్మ ప్రవరరాగ వార్ధిఁ గాంచి,  -  చెంతకుం జేరితని యని చెలువు మీర. ౩౯.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఓ సుదతీ! సు ఖగతిని(యోగ్యుఁడయిన సూర్య భగవానుని) నాయనను౯నాకు తండ్రి వంటి వానిని)కాంచు నిమిత్తము, కేళీ వనమునకు పద్మినీ జాతిని(పద్మాది పుష్పములను) వరలు విధముగ తెచ్చుటకు వచ్చి, ఛద్మ(ఇచ్చటి నీ) ప్రవర రాగ వార్ధిని కాంచి, చెంతకు చేరితిని. అని చెలువము అతిశయించు నట్లుగా  -  -  -  -!
మను చరిత్ర పరముగా అన్వయముః- 
సుఖ గతిని ఆప్రవరుని కాంచ చూచుటకు ఆ సుదతియైన వరూధిని పద్మినీ జాతి(స్త్రీలు)వరలఁ దేఁగ (వెంట నుడుకొని రాగా)కేళి వనమునకు వచ్చి, ఛద్మ(మాయా) ప్రవరుని యందైన అనురాగ వార్ధిచే ఆ ప్రవరును కాంచి, చెంతకు చేరి, తనియని చెలువు మీరగా....... 
గీ:- అతివ పావనమౌ జన్మ మరయ, నాకు  -  నేఁడు సంతోషమయ్యెడు జాడఁ దెలియఁ
జెప్పి యొప్పింప వలెనని, చెలి మనమున  -  దలచి యడిగినఁ బలికెనంతట నెలంత. ౪౦. 
వసు చరిత్ర పరముగా అన్వయముః-
మీ అతివ యైన గిరిక యొక్క పావనమౌ జన్మము అరయ దలచి యుండగా నాకు నేడు సంతోష మయ్యెడు జాడ తెలియఁ జెప్పి ఒప్పించ(విశ్వాసము కలిగించ)వలెనని ఆ చెలి(ముని వేష ధారి) మనమున తలచి,  అడిగిన, నెలంత అంతట ఇట్లు పలికెను.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
అతివనైన నా యొక్క జన్మముపావనమైన దగును. అరయగా నాకు నేడు సంతోషమయ్యెడు. జాడ(పూర్వాపర సంబంధము)ను( ఈ విపృనకు తెలియ జెప్పి), ఒప్పించ వలెనని చెలి(వరూధిని) మనమున తలచి, రతి వాంఛచే అడుగగా అతఁడు అంతట నెలంత యగు వరూధినిని గూర్చి యిట్లు పలికెను.
గీ:-
నిత్య పూజా రతిని తగు నెలవుఁ బాసి, -  విధి సమీపించి, యంతట వెడలి శుక్తి
మతి తిరుగరాఁ బథంబున మరలుకొనగ  -  నగ వర ప్రాప్త సంగతి మగువ కలిగె.  ౪౧.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
నిత్య పూ౦జా రతిని కలదియై, తగు నెలవు(భూలోకమును)బాసి, విధిని సమీపించి, అంతట(ఆ పిమ్మట)వెడలి(బయలుదేరి) శుక్తిమతి, తిరుగ రాన్(మరలి వచ్చు చుండగా)పథంబుమధ్యమున కోలాహలుఁడు ఆమెను మరలుకొనగా(అడ్డగించగా), నగ(కోలాహల పర్వతమను వర(భర్త యొక్క)ప్రాప్తి చేత, సంగతి(సంగమము చేత) మగువ యగు ఈ గిరిక కలిగెను.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
శుక్తి వంటి నిర్మలమైన మనసున్న ఓ వరూధినీ! నిత్య పూజా రతిని తగి యున్న నెలవుఁ  బాసి, విధి వ్రాత సమీపించగాఅంతట(అప్పుడు౦వెడలి వచ్చి, మగువ(ఓ యింతీ) పథంబున మరులు కొనగా(మరలిపోవు నిమిత్తము)తిరుగ(సంచరించ)రాన్(రాగా) నగవరమైన ఈ హిమాలయముయొక్కప్రాప్తి(పొందుటయను) సంగతి(వృత్తాంతము)కలిగెను. 
క:-
గిరికాంచితమగు ఖ్యాతిన్  -  జరియించెడునన్న, సంతసంబునఁ దరుణీ!
కరమును మది నెంచితి - వసు  -  వరునొక్కని గూడ నగునువనిత" యఁటన్నన్. ౪౨.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
గిరి అనెడి అంచితమగు నామముచే ఖ్యాతిని ఈమె సంచరించును. మంజు వాణి అట్లు అన్నన్ఆ ముని సంతసంబున తరుణీ! కరమును(మిక్కిలిగా)మది నెంచితిని. ఈ వనిత వసువరునొక్కని కూడ నగును(పెండ్లియాడుట సంభవించును) అటన్నన్౯అని చెప్పగా  -  -  -  -.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఓ తరుణీ!  గిరి యొక్క , క(సుఖముచే)అంచిత(ఒప్పిద)మగుఖ్యాతి చేత చరియించెడు నన్న(నన్ను+అ)సంతసంబున కరమును(మిక్కిలిగా) మనస్సున భర్తగా ఎంచితిని. ఓ వనితా!వసువరు(భాగ్యవంతుఁడైన వాని)ని, ఒక్కనిని కూడ నగును.అటన్నన్(అని అనగా)..... 
వ:-
ఆ లతా తన్వి యిట్లనియె.౪౩.
ఆ లతాతన్వి ఇట్లనియెను. 
క:-
ఎన్నండిటకేతెంచెడి?  -  నెన్నండిట మమ్ముఁ జూచు?నెన్నడు మాతో
గ్రన్నన ఆటాడెడినో?  -  యన్నరవరుఁడనుచుఁ దలఁతు మయ్య మహాత్మా! ౪౪.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
మహాత్మా! ఆ నరవరుఁడు ఎన్నండు ఇటకు వచ్చునో? ఎన్నండు మమ్ము జూచునో? ఎన్నడు మాతో గ్రన్నన మాటాడునో? అనుచు తలతుము.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఓ మహాత్మా!ఆ నరవరుఁడగు నీవు ఎన్నండిట కేతెంచుట జరుగునో ఎన్నండిట మమ్ముఁ జూచుట జరుగునో ఎన్నడు మాతో గ్రన్నన మాటలాడుట జరుగునో, అనుచు తలంతుమయ్యా! 
గీ:-
అనినఁ గోరెదు గావున ననవరతము  -  పరులకుపకృతిఁ గావించు పట్ల నెట్టి
కార్యములనైనఁ గావింపఁగా వలెఁ గద!  -  సమయమున మానినీ! తోడ సరఁగ నిపుడు. ౪౫.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
మంజు వాణి ఈ విధముగ ననిన ఆ రాజును జూడఁ గోరెదవు గావున అనవరతము పరులకుపకృతి గావించు పట్ల ఎట్టి
కార్యములనైనా కావింపగావలెఁ గదా! మానినీ! సరియగు సమయము నందు శీఘ్రముగా ఇపుడు తోడనే  -  -  -  -.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
మంజువాణి ఈ విధముగా అనిన ఆ రాజును చూడఁ గోరెదు గావున అనవరతము పరులకుపకృతి గావించుపట్ల ఎట్టి కార్యముల నయిన గావింపగా వలెను కదా. సమయము(ఆచార విషయము)న మాని(వదలి)నీతోడసరగనిపుడే(ఇప్పుడు వెంటనే)......
గీ:-
క్షితి విభునిఁ గను కోర్కెను జెలియ! తీర్తుఁ  -  గన్నుఁ గవ మూయ నగునంతఁ గలియ వచ్చు
ననిన నయ్యెడ నతని వచనము వినుచుఁ  -  గువరుఁడంతట రాఁ దన భవనమునకు. ౪౬.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఓ చెలియా! క్షితి విభుని గనవలెననెడి కోర్కెను తీర్తును. కన్నుగవ మూయనగు నంత సేపటిలో కలియ వచ్చును అని ముని పలుకగా, అంతట అయ్యెడ అతని వచనము  (స్నేహితుని చమత్కార ప్రసంగము) వినుచు, కువరుఁడైన ఆ వసు రాజు  తన భవనమునకు రాగా - - - - -.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఓ చెలియా(వరూధినీ)క్షితిని విభునిగ నీ కోర్కెను తీర్తును. నీ తోడ నేను కలియుటకై వచ్చినంతనే కన్నుఁగవను మూయవలయును. అని అతఁడు అనగానే అయ్యెడ అతని వచనము వినుచు (సమ్మతించగా)తన భవనమునకు కుత్సితుడైన మాయా ప్ర వరుఁడు అంతట రాగా...... 
గీ:-
అతని రాకకు మెచ్చి మహాముదంబు -  గదుర రతి నుండఁగా స్వల్ప కాలముననె
యతఁడు చెలి జతనంబున హర్షమంది  -  చనగ, సఖి గాంచె సుకుమారు సార్వభౌము. ౪౭.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
అతని రాకకు మెచ్చి, మహా ముదంబు గదురగా రతిని(ఆసక్తితో)ఉండగా చెలికానియొక్క జతనంబునకు హర్షమంది, అతఁడు చనఁగ(ఒప్పి యుండగా), సుకుమారుఁడైన ఆ సార్వభౌముని స్ఖి యైన గిరిక స్వల్ప కాలముననె కాంచెను.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
అతని రాకకు మెచ్చి, మహా ముదంబు గదురగా రతిక్రియనుండగా స్వల్ప కాలముననె అతఁడు చెలి జతనమున హర్షమంది, చనగ, సఖి సుకుమారుని, సార్వభౌఁడగువానినికాంచెను. 
వ. అతఁడు స్వరోచియై వెలుగు చుండఁగా, ౪౮.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఆ బాలుడు స్వరోచి నామంబున వెలుగు చుండగా.... 
క:-
కని ముదమందఁగఁ బెంచిన  -  ఘన మతి సర్వంబెరిం(శకట రేఫ)గి, కడు పెంపడ రం
గను, నవల రే(శకట రేఫ)ని తోడం  -  గని యెరు(శకటరేఫ)క పడంగఁ గాంక్ష గారమున ననెన్. ౪౯.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
కని గిరిక ముదమందగా నవల(గిరిక చెలికత్తె యగు మంజువాణి)పెంచిన(వృద్ధి చేసికొనిన) ధనమైన మతి కలది యైసర్వంబెరిం(శకట రేఫ)గి,(వసు గిరికల చారిత్రమెరింగి)కడి పెంపు(ఉత్సాహము)అడరగా, కని, రే(శకటరేఫ)నితో  కాంక్ష ఎరు(శకటరేఫ)క పడునట్లుగా గారమున ఇట్లు అనెను.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
వరూధిని ఆ బాలుని కని ముదంబున పెంచగా ఘనమతినిస్వరోచి సర్వంబెఱింగి, కడు పెంపు(వృద్ధి)అడరంగా(పొమ్ది యుండగా) ఆవల ఒక ఎఱుక  కని ఆఱేని(స్వరోచి)తోకాంక్ష(కోరిక)పండంగ, గారముతీ ఇట్లనెను.
సీ:-
క్ష్మా తలాధిప! నేఁడుగా మా మనోభీష్ఠ  - ములు దీరఁ గల్గెనోములు ఫలించె.
గహ్వరీపతి! నేఁడుగా మా నయన పంక్తి  -  నిర్మలమయ్యెఁ బున్నెంబు సేసె.
భూమి పాలక! నేఁడుగా మా తమః పట  - లంబు విరిసెను చిత్తంబు మెర(శకట రేఫ)సెఁ
గాశ్యపీ వర! నేఁడుగా మా వనస్థలుల్  -  ధన్యంబులయ్యె, శస్తతఁ జెలంగ్గె.
గీ:-
నీ హిత క్రియ నిల నేఁడ నెగడఁ గల్గెఁ  -  గాన నేమని చెప్పుదు మానవేంద్ర!
జంతు జాలంబు లెల్ల నీ శరణమంది  -  యుండెఁ గాకున్న జీవించి యుండఁ గలవె? ౫౦.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఓ క్ష్మా తలాధిపా! నేడుగా మా మనోభీష్ఠములు తీర~ గలిగెను! మా నోములు ఫలించెను. 
ఓ గహ్వరీ(భూ)పతీ! నిన్ను చూచినందున మా నయన పంక్తి నిర్మలమయ్యెను. మా కన్నులు పున్నెము సేసెను కదా!
ఓ భూమి పాలకా! నేడుగా మా తమః పటలము౯అజ్ఞానము సమూహము) విరిసె(విడిపోయె)ను. చిత్తంబు మెర(శకటరేఫ)సెను
ఓ కాశ్యపీవర! నేడుగా మా వనస్థలులు ధన్యములయ్యెను. శస్తత(ఖ్యాతి)తో చెలంగెను.
ఇలా స్థలము నీ హిత క్రియ చేత నేఁడ నెగడఁ గల్గెను.కావున మానవేంద్రా! ఇంక ఏమని చెప్పుదును. జంతు జాలంబు లెల నీ శరణమంది ఉండెను కదా. కాకున్నచో జీవించి యుండ గలవె?
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఓ క్ష్మా తలాధిపా! నేడుగా మా మనోభీష్ఠములు తీర~ గలిగెను! మా నోములు ఫలించెను.
ఓ గహ్వరీ(భూ)పతీ! నిన్ను చూచినందున మా నయన పంక్తి నిర్మలమయ్యెను. మా కన్నులు పున్నెము సేసెను కదా!
ఓ భూమి పాలకా! నేడుగా మా తమః పటలము౯అజ్ఞానము సమూహము) విరిసె(విడిపోయె)ను. చిత్తంబు మెర(శకటరేఫ)సెను
ఓ కాశ్యపీవర! నేడుగా మా వనస్థలులు ధన్యములయ్యెను. శస్తత(ఖ్యాతి)తో చెలంగెను.
ఇలా స్థలము నీ హిత క్రియ చేత నేఁడ నెగడఁ గల్గెను. కావున మానవేంద్రా! ఇంక ఏమని చెప్పుదును. జంతు జాలంబు లెల నీ శరణమంది ఉండెను కదా. కాకున్నచో జీవించి యుండ గలవె?
గీ-
అనిన మోదంబు తోడ, హితార్హ కార్య  -   మునను జని యుండ నొక్కెడ, ముదిత యడరు 
చాయఁ  దగ వినుచును,  జేరి,  సకియ వార్తఁ  -  గనఁగ  వచ్చితి ననిన నాక్కాంత యంత. ౫౧.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
గిరిక చెలికత్తె మోదముతో ఆ విధముగా స్తుతించుచు అనిన, హితార్హ (మిత్రునియొక్క యోగ్యమైన) కార్యమునకు (క్రియ వలన) ఒక్కెడ చని యుండ (ఒక్కావకాశము ఒప్పి యుండగా) ముదిత ఐన ఓ మంజు వాణీ! అడరు చాయను(మీ సకియ)ప్రకాశించు చున్న విషయమును తగ వినుచు, మీ కడకు చేరి, సకియ యైన గిరిక వార్త గనగ వచ్చితిని. అనిన  అంత అక్కాంత - - - - .
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఆ వ్యాధుఁడట్లు అనిన స్వరోచి మోదంబు తోహితమైన అర్హమైన కార్యార్థము చేయ వెళ్ళి యుంఒక్క ఎడ(ప్రదేశమున) ఒకా నొక ముదిత యొక్క అడరు(దుఃఖము) ఆ చాయను(పార్శ్వ భూమి యందు) వినుచు, వినుచు, అచ్చటికిచేరి, ఓ సకియా! నీ దుఃఖ హేతువైన వార్తఁ గనఁగ వచ్చితిని. అని అనగా అంతన్ అక్కాంత అపుడు......  

క:-
అయ్య మనోరమ సఖి నే  -  నయ్యుప వని స్వైర వృత్తి నమర, సఖులతో
నొయ్యన సుమాపదేశము  -  చయ్యనగా~ం జని ముదంబు సంధిల్లంగన్. ౫౨.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
నా అయ్య యొక్క మనోరమయైన నా తల్లి యైన శుక్తిమతి యొక్క సఖి (చెలికత్తె {కలహంసి} యు) నేను, అయ్యుప వనిని స్వైర వృత్తిని అమర, సఖులతో ఒయ్యన (చక్కగా) చయ్యన (వెంటనే) సుమాపదేశము (పుష్పముల మిష) గా ముదంబు సంధిల్లగా, చని -  -  -  -  -  .
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఓ అయ్యా! నేను మనోరమ యను స్త్రీని. ఓయ్యన(చక్కగా) సఖులతో ఆ ఉప వనియందు స్వైర(స్వేచ్ఛా)వృత్తిని(ప్రవృత్తితో)అమరి యుండగా.. సు(యోగ్యమైన)మా(ధారణ గల చిత్తమును) పా(పాలించునట్టివాఁడైన మునీశ్వరుని యొక్క)  ప్రదేశము చయ్యనఁగా(వేగముగా)జనిముదంబు సంధిల్లునట్లుగా.....
గీ:-
చిన్నతనముననుండుటఁ జేసి, చేరి  -  యుండఁ బొడమెడు మతి నా మహోత్తమ "సుమ
నో విశేషత నంతటను మునిరాగ  -  దత్త శాప క్రియను వచ్చితిత్తఱి "నని. ౫౩.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
చిన్న తనము నుండియు ఆ కలహంస నా దగ్గర ఉఓడుటా చేసి, ఆమెను చేరి యుండ(కలిసిసికొన వలెనని)మతి పొడమెను.  నాన్ (అనగా) ఆ మహోత్తమమైన కలహంసి అంతట (అప్పుడు), ఇత్తఱి  (ఈదిగో ఇప్పుడే) సుమనో విశేషతను (పూలతో) మునియొక్క అనురాగము చేతదత్తమైన శా (సామర్ధ్యముచే) ప (ప్రకాశించు) క్రియను వచ్చి యున్న దానను అని  -  -  -  .
మను చరిత్ర పరముగా అన్వయముః- 
చిన్నతనమున ఉండుట (చిన్నతనమగుట )చేసి, ఆ మునిని సమీపించి యుండగా  పొడమెడు (దుర్)మతి చేత ఆ మహోత్తమ(అట్టి మహా శ్రేష్టమగు) సుమనో(యోగ్యమగు మనస్సుయొక్క)  వి(పోగొట్టఁబడిన) శేషతన్(ప్రాధాన్యముచే)(అతని చిత్తమునకు ప్రథానమైన యోగ్యత సడలి, కోపము వచ్చి, )అంతట ముని బయల్పడగా, మునిదత్తమైన, శాప క్రియచే(శాప ఫలితముగా)ఇత్తరి వచ్చితిని అని..... 
వ:-

మఱియు, ౫౪.
మరియు...
గీ:-
అందు - చే; నను నీ యవ నిం దగఁ గూనఁ  -  గర్చురాకార! సంబాధ్య కలన వేగఁ
బుచ్చ వచ్చితి, రా! జన్య యిచ్చ దీర్పు  -  మనుచు శాస్ర హృదయ మీయ ననఘ బుద్ధి. ౫౫.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
చేయి అందుము. నను నీ అవ్(అవ్వ=జనని)నిన్ను చేరతీసు కొనను కర్చుర (బంగారు) ఆకారము గల ఓ గిరికా!  సంబాధ్య (బంధుత్వ) కలనను (కారణమున) వేగముగా పుచ్చన్ (పంపిన) వచ్చితిని. రా! జన్య (తల్లి యొక్క) ఇచ్ఛను తీర్పుము. అనుచు, శాస్త్ర (ఆజ్ఞా యుక్తమగు) హృదయమీయ (అభిప్రాయమును దెల్పఁగా), అనఘ బుద్ధి యైన ఆ గిరిక - - - . 
మను చరిత్ర పరముగా అన్వయముః- 
అందుచే(ఆ శాప కారణమున) నన్ను ఈ అవనిని తగఁగొనన్ (తనకు తగినట్లు పట్టుకొనగా) క ర్చుర(రాక్షస)ఆకారము గలవాని చేతనైన సంబాధ్య కలనను(బాధ పొందుట నుండి)వేగముగా పుచ్చన్(బాధను తొలగించుటకు) వచ్చితిని. రాజన్యా! 
ఇచ్చఁ(కోరిక)దీర్పమనుచు శా(సామర్ధ్యముకలిగిన) అస్త్ర హృదయము అను విద్య నీయగా  అనఘ బుద్ధి యగు స్వరోచి....  
గీ:-
అంత సమ్ముఖ మతిఁ గౌతుకాభిలాష  -  నట్టు చెంతకుఁ జనిరస ముట్టిపడఁగ
మొనయ నాతఁడు ఖ చరుఁడైనను హితుండు  -  హయము నెక్కించి చనిన నయ్యబల వెనుక. ౫౬.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
అంతట తల్లి సమ్ముఖమునకు పోవు మతితో కౌతుకాభిలాష(వివాహమందైన ఇచ్ఛ)తో సృంగార రస ముట్టిపడునట్లుగానట్టు(తల్లి)చెంతకుఁ జని, మొనయన్(ఉత్సహించి యుండగా)ఆ వసురాజు ఖ(పట్టణమును గూర్చి) చరించు చున్నవాఁడైయుండి నను, స్నేహితుఁడు హయము నెక్కించి, చనినంత నయ్యబల  -  -  -  -  -.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
అంతట సమ్ముఖ(యోగ్యమగు ఉపాయము కల)మతితో కౌతుక(మంగళమగు విజయము నందు)అభిలాష కలవాఁడై, అట్టుల చెంతకుఁ జని రసముట్టిపడంగ(విషము గ్రక్కుచున్న వాని వలె)మొనయ(రణోద్యోగము చేయగా)అతఁడు(ఆ రాక్షసుఁడు) ఖచరుఁడైనను(ఆకాశ గమనము కలవాఁడు కాఁగా) మనోరమకు హితుఁడగు (హితమును గూర్చిన) స్వరోచి, ఆ అబల యగు స్వరోచిని హయము నెక్కించుకొని చనగా ఆ వెనుక(పిమ్మట)....... 
క:-
ఆ పెను వగతో నుద్యా  -  నోప శమముఁ బొంద డిగ్గ నొప్పున నంతన్
భూపుఁ గనను, పరిచర, మతి  -  యేపునఁ జనుదెంచి వృత్త మెఱిఁగింప వెసన్. ౫౭.
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఆ పెను వగతో ఉద్యానమునందు ఉపశమనము పొందుటకు వసు భూపు గనను, ఒప్పున అంతన్ డిగ్గి(ప్రవేశించగా) పరిచరయైన మంజువాణి యొక్క బుద్ధి యేపు(వికాసము)న ఆ గిరిక యున్న ఉద్యాన వనమునకు చనుదెంచి  వృత్త మెఱిగింపగా, వెంటనే  -  - .
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఆపె(ఆమె)ను వగ(విలాసము)తో ఉద్యాన(ప్రయాణ సంబంధమగు)ఉపశమనమును పొందుటకు అశ్వము డిగ్గఁ(దిగ)గా, ఒప్పున నంత౯సరిగా అప్పుడు భూపుఁడగు స్వరోచిను గను వేడుకతో ఉపరి(ఆకాశమున)చర(సంచరించ వలెనను)మతి(మనసు)గలవాఁడగు గంధర్వుఁడు ఏపునఁ(విజృంభణముతో) జనుదెంచి(వచ్చి)వృత్తమెఱిఁగింప వెసన్(తన శాప కారణమంతయుఁ జెప్పిన తోడనే.....  
క:-
కొనిపోయి భవనమునకుం  -  దన యంగనఁ బెండ్లి సేయఁ దత్పర మతియై
చని మంజువాణి తోడనె  -  వినయంబున భూమి భృత్సవిధ దేశమునన్. ౫౮. 

వసు చరిత్ర పరముగా అన్వయముః-
గిరిక యుండు భవనమునకు గొనిపోయి, తన అంగన యగు గిరికను, పెండ్లి సేయవలెనని తత్పరమతియై మంజువాణి, తోడనె, చని,వినయంబున భూమిభృత్తగు వసురాజు యొక్క సవిధ(సమీప)దేశమున  -  -  -  .
మను చరిత్ర పరముగా అన్వయముః- 
భవనమునకుఁ(స్వరోచి తన కూతురగు మనోరమను) గొనిపోయి, తనయను కనగా(చూడఁగా) పెండ్లి సేయఁగా, తత్(ఆ భార్య యొక్క) పర(ఇతరమైన)మతియై(మనసు కలవాఁడై) మంజు(మనోహరమైన)వాణి(వాక్యములచే నొప్పు మనోరమ)తోడ(తోడు కాగా) వినయంబున(మిక్కిలి యుక్త మార్గము కలవాఁరై) చని, భూమి భృత్(పర్వతము యొక్క)సవిధ౯సమీప)దేశమున ....... 
గీ:-
నిలిచి వృత్తాంత మంతయుఁ దెలుప సుదతి  -  కన్య కల నిచ్చమైఁ దోఁపఁగా ముదానఁ
బొంగి తన నియని ప్రేమఁదానుంగరంబు  -  నొసఁగఁ గొని సుఖమునఁ బోవ నున్న నచట. ౫౯.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
వసురాజు సమీపమున నిలిచి, గిరికా వృత్తాంతమంతయు తెలుపఁగా, ఓసుదతీ(మంజువాణీ)కన్య(గిరిక)కలన్ (చిత్తరువు నందు) ఇచ్ఛమై తోపగా ముదాన పొంగితిని. అని యని, తాను ప్రేమను ఉంగరంబునొసగ, కొని, సుఖమునఁ బోవ నున్నన్ అచట -  -  -  -.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
నిలిచి(ఆ పర్వత సమీపమున నివసించి)సుదతి యగు మనోరమ తన చెలికత్తెల వృత్తాంతమ్ంతయుఁ దెలుప ఇచ్చ(వలపు)కన్య కలయందు మైన్ దోపగా(ముఖాది శరీరావయవము లందు వ్యక్తము కాగా) ముదాన పొంగి, ఆ కన్యకలు కరంబు౯పాణి) నొసగఁగా తాను(ఆ స్వరోచి౦తనియనటువంటి ప్రేమతో  చేకొని, సుఖముగా పోవ నున్నన్నంతట అచట౯త్రోవలో౦.....  
గీ:-
చెంత వారాశయముఁ గాంచ జేరి యలస  -  గమన వచియించు పలుకుల గారవమున
విని విడువ లేని కూర్మిఁ దా వెలఁదులనొఁగి  -  గూడి యుంగరమును బూని, కుతుకమునను. ౬౦.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
గిరిక చెంత నున్న వారు ఆశయము గాంచగా(మంజు వాణి వెళ్ళిన సంగతి ఏమైనదో యను విషయము తెలుసుకొను అభిలాషతో నుండగా)వచ్చి, అలస గమన యగు మంజువాణి వచియించు పలుకులను గారవమున విని, ఆమెను విడువ లేని కూర్మిని, తాను(గిరిక)వెలదుల నొగి గూడి, ఉంగరమును బూని, కుతుకమునను - - - -.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
చెంతన్ వాః ఆశయము(నీటి కొలనును)గాంచగా, అచ్చటికి చేరి, అలస గమన(ఒక హంస౦వచియించు పలుకులను గారవమున విని, తాను(ఆస్వరోచి)మువ్వురు వెలదులను  ఒగి గూడియు, కరమును(మిక్కిలిగా) విడువ లేని కూర్మిని, పూని, కుతుకముతో....
వ:-
ఇట్లుండునంత, ౬౧.
ఈ విధముగా ఉండునంతలో......
గీ:-
ఒక్క తఱిఁ జారు లోచన యొప్పు మీర    రా నగుడు, సముచిత వాక్య రత్నములను
గారవించియు గురు మోహ కారణమున  -  మెలఁగ తెఱ గంటిదొర కొమరుల నొగి గని. ౬౨.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
చారు లోచన ఐన గిరిక ఒప్పు మీరుచూ ఓక్క తఱి(సమయము)ని, అగుఁడు(తండ్రియగు కోలాహల పర్వతము) రాన్ సముచిత వాక్య రత్నముల గారవించియు, గురు(తండ్రిపై)మోహ కారణమున ప్రేమతో మెలగు చుండగా కొమరులనొగి(ఆ చిన్నదాని యంద చందములఁగనుఁగొనినవాఁడై0 తెఱగంటి దొరయైన ఆ ఇంద్రుఁడు  -  -  -.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఒక్క  తఱి(సమయము)న చారు లోచనయైన కురంగము ఒప్పు మీరగా రాన్(వచ్చుట)అగుఁడు(తటస్థింపగా)ఆ లేడి పలికెడె సముచితమైన వాక్య రత్నములను గఒరవించియు, గురు(దుర్భరమైన)భార్యల యందైన మోహ కారణమున తెఱగు (గృహస్థ విధానమును) అంటి(అనుసరించి)స్వరోచి మెలగగా, దొర(ఆ ప్రభువు)మువ్వురు భార్యల యందు ముగ్గురు కొమరులను ఒగిఁ గని....  

గీ:-
వారిఁ దగు రీతిఁ జూడంగ వసుమతీత  -  లంబునుం గూర్చి వచ్చి, వనంబుఁ జొచ్చి,
యతఁడు గిరి భర్త నొప్పింప నాత్మఁ దలఁచి  -  యుండగాఁ జారు లోచన మెండుగఁ గని. ౬౩.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
వారిని(ఆ వసు గిరికలను)తగు రీతిని చూడన్(చుచుటకు)వసుమతీ తలంబునుం గూర్చి, ఇంద్రుఁడు వచ్చి,గిరిక యున్న వనంబు జొచ్చి, అతఁడు గిరి భర్త యగు కోలాహలుని ఒప్పింపజేయుటకు ఆత్మ దలచి యుండఁగా చారు లోచనయైన ఆ గిరిక మెండుగఁ గని  -  -  -  .
మను చరిత్ర పరముగా అన్వయముః- 
వారిని, తగు రీతిని చూడంగ(చూచుటకు)వసుమతీ తలంబునుం సమకూర్చి, మరలి వచ్చి, వనంబుఁ జొచ్చి, అతఁడు(ఆ స్వరోచి)కిరిభర్తను(సూకర పతిని) నొప్పింప(నొచ్చుకొనునట్లు కట్ట వలెనని)ఆత్మలో తలఁచి, యుండగా, ఆ చారులోచనయైన లేడి, స్వరోచిని మెండుగఁ గని......  

గీ:-
తలఁచి "నా వసువును గొనఁ దగునయ" యని  -  "నాదు చిత్తముఁ దీర్చుట న్యాయ" మనుచు
వేడ్క హృదయస్థ భావము వెల్లడింప  - నల్లు హాళినిఁ గోర్కెఁ దా నంటి యుండ. ౬౪.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఇంద్రుఁడు  తలఁచి,నా9స్నేహితుఁడైన)వసువును(అల్లునిగా నీవు) గొన తగునయా. అని పలికి, నాదు చిత్తముఁ(కోరిక)దీర్చుట న్యాయమనుచు, వేడ్కతో హౄదయస్థ భావము వెల్లడింపగా, అల్లు(డగునను)హాళిని(సంతోషముతో) కోర్కెతో తాను(ఆ కోలాహలుఁడు)అంటి(కలిసి) యుండగా -- - - - - .
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ఆ సూకరము యొక్క అసువులను గొనుటకు తలచినావు. ఇది నీకు తగునయ? అని, నాదు చిత్తముఁ దీర్చుట(పాయఁ జేయుట, హృదయమును ఛేదించుట) న్యాయమనుచు వేడ్కతో హృదయస్థ భావము వెల్లడింపగా అతఁడు అల్లు(పెనగొను)హాళిని(సంతోషముతో) కోర్కెచేత తానా స్వరోచి,అంటి యుండన్(ఆ లేడిని ముట్టుకొనగా)....   

గీ:-
ముదిత వన లక్ష్మి యై యుండ సదమల మతి  -  నాత్ధుఁడయ్యింతి సంగతి సమయమునఁ గని
కాంచ స్వారోచిషు నతఁడు కమ్ర భక్తిఁ  -  గొల్వ ముదమందై వసు భర్త కోర్కెఁ దీర్చి. ౬౫.

వసు చరిత్ర పరముగా అన్వయముః-
ముదిత ఐన గిరిక వనలక్ష్మి యైనట్లు ఒప్పి యుండగా సదమల మతితో నాధుఁడు, ఇంద్రుఁడు అయ్యింతి సంగతి నయమున గని, స్వ ఆరోచిషు(ధనముచే అంతటను నిండిన కాంతి గలవా)డైన ఆ వసు రాజునువెల్లి, కాంచగా అతఁడు కమ్ర(సుందరియందనురాగముఁ గల)భక్తి చేత, ఆ వచ్చిన ఇంద్రుని కొల్వగా, ముదమందీఅ ఇంద్రుఁడు వసుభర్త కోర్కె తీర్చి, (పెండ్లి చేసి),  -  -  - .
మను చరిత్ర పరముగా అన్వయముః- 
ముదితయైన వన లక్ష్మియై ఎదురుగ నిలిచి యుండగా, సత్ అమల మతితో, నాథుఁడైన స్వరోచి, అయ్యింతియైన వన లక్ష్మి సంగతి(సంగమము)ని నయముగా పొంది, స్వరోచిషుని గాంచ(కన)గా అతఁడు(ఆ స్వరోచిషుఁడు) కమ్రమైన భక్తి చేత కొల్వగా, వసు భర్త(శ్రీమహావిష్ణు దేవుఁడు) ముదమంది, కోర్కెఁ దీర్చినవాడై....
క:- 
రెండవ మనువనఁగా భూ  -  మండలి రక్షింప వలయు మనుజుల కోర్కెల్
పండఁగఁ జేయుచు నిరతం  -  బుండు మనుచుఁ జనియె, శుభము లొదవె, ప్రజకిఁ కన్. ౬౬.  
వసు చరిత్ర పరముగా అన్వయముః-
ఇతఁడు రెండవ మనువు అనగా కీర్తి గాంచి ఈ భూమండలి రక్షింపవలయును. మనుజుల కోర్కెలు పండునట్లుగా చేయవలెను. నిరంతరము జీవించి యుండుము.అని ఇంద్రుఁడు అనుచు చనియెను.ప్రజకిక శుభములొదవెను.
మను చరిత్ర పరముగా అన్వయముః- 
స్వారోచిషా!  నీవు రెండవ మనువుగా అయి, ఈ భూ మండలమును రక్షిమ్ప వలయును. మనుజుల కోర్కెలు పండు నట్లుగా చేయుచు, నిరతంబూ వర్ధిల్లుచూ ఉండుము. అనుచు పలికి అతఁడు చనియెను. శుభములు ఒదవినవి.ప్రజలకు ఇఅపైన గూడా ..... 
భరత వాక్యము:- 
ఉ:-
పాయమునందు మిత్తి. చలపాది గొనంబున సత్తి,తొచ్చెమౌ
రో యెలనాగబత్తి, చెడు త్రోవను చేరిన బుత్తి, లేక - దీ
ర్ఘాయు రనంత ధీ ప్రియ హితాఖిల మార్గగ భుక్తులేర్పడన్
బాయని కౌతుకంబును శుభంబును గల్గుత యెల్ల వేళలన్. ౬౭.
పాయమునందు మిత్తి(చిన్నప్పుడే మృత్యువు) చలపాది గొనంబుల సత్తి(మాత్సర్యాదిదుర్గుణ ప్రదర్శనయెడల శక్తి)తొచ్చెమౌ(తుచ్ఛమైన) రో యెలనాగ(ధన నిమిత్తమై యుండు వేశ్యల యెడల) బత్తి(విడరాని ఆసక్తి) చెడు త్రోవను, చేరిన(సంప్రాప్తించిన)బుత్తి(భుక్తి)అనునవి లేకుండా క్రమముగా దీర్ఘాయువు, అనంత ధీ, ప్రియము, హితాఖిల మార్గగ(మేలు చేయు ఎల్ల దారుల వలన లభింప గల)భుక్తులు, ఏర్పడ(గా)న్,పాయని కౌతుకంబును శుభంబును ఎల్ల వేళలను కల్గుత!
క:-
కుజన త్రిజగద్విలయా - సుజన మనో నిలయ! తాప శోషణ మలయా!
వృజిన విపిన దహనా!వి - శ్వ జనీన ప్రకట కార్య వహన! సుసహనా!  ౬౮.
కుజనులు గల త్రిజగములకు విలయమైనవాఁడు! సుజన మనో నిలయా! తాపశోషణమున మలయమా! వృజిన(పాపములనెడి) విపిన దహనుఁడా! విశ్వ జనీనులకు ప్రకట(యోగ్యమైన)కార్య(కృతులను)వహనుఁడా!సుసహనుఁడా!
చిత్రపద వృత్తము:-
భక్తి జనావన దక్షా! - ప్రాక్తన శాసన పక్షా!
యుక్త విచారణ దీక్షా! - సక్త మహేశ్వర రక్షా! ౬౯.
భక్త రక్షణ సమర్థుడా! ప్రాక్తన శాసనములైన వేదపక్షపాతీ! యుక్తాయుక్త విచారణ దీక్షా తత్పరా! సక్త(పొందబడిన) మహేశ్వరుడు కలవారికి రక్షకుఁడా!   
సమాప్తము
జైహింద్.