గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2012, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి117.

2 comments

జై శ్రీరాం.
శ్లోll
అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్,
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
గీః-
ముదిమి మరణము లేనట్లు ప్రోగు చేయు
ధనము, విద్యయు ప్రాజ్ఞులు ధరణిపైన.
కేశమును పట్టె మృత్యువన్ ధ్యాస గలిగి
ధర్మ మాచరింపగ తగు ధన్యత గన.
భావముః-
ప్రాజ్ఞుడైనవాడు ముసలిదనమూ చావూ లేనివాడిలాగ విద్యనూ అర్థాన్నీ సాధించాలి.
అలాగే, మృత్యువు జుట్టు పట్టుకుందా అన్నట్టుగా, ధర్మాన్ని ఆచరించాలి.
జైహింద్.

24, జనవరి 2012, మంగళవారం

చెత్తకుప్పలపై దేవుళ్ళపటాలు చూసి చాలా బాధనిపిస్తోంది.

12 comments

జైశ్రీరాం.
సహృదయులారా!
నిన్నను నామనసును బాధ పెట్టిన ఒక సంఘటనను మీతో చెప్పి మిమ్మల్ని కూడా బాధపెట్టడం సరి కాదు. ఐనా పరిష్కారం సూచించడానికి మీకంటే ఎవరుంటారు చెప్పండి. అందుకే మీకా విషయ తెలియ జేయ లేకుండా ఉండలేకపోతున్నాను. తప్పైతే మన్నించండి.
నిన్నను సాయంత్రం  నడుచుకొంటూ గుడికి వెళ్ళుతున్న సమయంలో ఒక చెరువు ఒడ్డున చక్కటి దేవుళ్ళ పటాలు అద్భుతమైనవి అద్దాలతో చక్కని పటాలుగా ఉన్నవాటిని పెంట కుప్పలమీద పడేసారు. ఎవరో తెలియదు. నాకైతే చాలా బాధనిపించింది.
కడుపులో చేయిపెట్టి కెలికేసినట్టనిపించింది. మనం ఎంతో భక్తిభావంతో ఆరాధించే దేవతల ప్రతిరూపాలుగా భావించే పటాలు, ఎంతో పవిత్రంగా మనం చూసుకొనే చిత్రపటాలు దుర్గంధ భరితమైన ఒక అపవిత్ర ప్రదేశంలో అలా విసిరివేయబడ్డాయి.
ఒకటి కాదు రెండు కాదు కనీసం పదిహేనో ఇరవయ్యో అక్కడ అలా విసిరి పారవేయబడి ఉన్నాయి. అందులో రాతి బొమ్మలు కూడా ఉన్నాయి.
నాకు ఏమి చెయ్యాలో తోచలేదు. వాటిని చూస్తూ అలా వదిలేసి వెళ్ళిపోవడానికి కాళ్ళు రాలేదు. నా అర్థాంగి కూడా కన్నీళ్ళపర్యంతమయింది ఆపరిస్థితి చూసి.
తప్పో ఒప్పో నాకు తోచిన పని నేను చేయకుండా ఉండలేకపోయాను.
ఆ పటాలను ఆ ఒడ్డున ఉన్న కుళ్ళు పెంట కుప్పల మీదనుండి తీసి ఆ చెరువులోనికి పడవేసాను. పాపమో, తప్పో, ఒప్పో అనే విచారణ నేనప్పుడు చేయ దలచుకో లేదు.
ఆ పని నేను నా అర్థాంగి చేస్తూ ఉంటే బాటసారులు మమ్మల్ని వింత పసువుల్ని చూసినట్టు చూడడం కొసమెఱుపు.
విన్నారు కదా? చెప్పండి. మేమప్పుడేం చెయ్యాలి? మేము చేసినది తప్పా?
ఈ సంఘటన ద్వారా నేను సమాజానికి నామనోభావాలని వివరించి నా అభిప్రాయాన్ని సూచించ దలిచాను.
ప్రకృతిలో సృష్టింప బడిన ప్రతీ వస్తువుకీ అంతం ఉంటుంది.
మనం ప్రతీ సంవత్సరం అనేకమైన క్రొత్తక్రొత్త దేవుళ్ళ చిత్ర పటాలు, విగ్రహాలు సేకరిస్తూ ఉంటాము. వద్దన్నా మనకి అవి ప్రాప్తిస్తుంటాయి.
కొంత కాలం గడిచే సరికి అవి మాసిపోతుంటాయి, ఛిద్రమైపోతుంటాయి. అలాంటి వాటిని మనం కసవుగా భావించి నిర్లక్ష్యంగా అలా విసిరివేయడం అనేది మన నమ్మకాన్ని మనమే చెరిపేసుకున్నట్టౌతుంది.
ఈ బొమ్మలని కాబట్టి మనం అంత నిర్లక్శ్యంగా పారవేయ గలుగుతున్నాము.  అదే మన తల్లిదో, తండ్రిదో, బంధులదో ఆఖరికి మనకత్యంత ప్రీతిపాత్రమైన కుక్కదో పటమై ఉంటే అలా పారవేయగలమా చెప్పండి? దేవుళ్ళ పటాలకి ఆమాత్రం విలువ కూడా యివ్వని మనకోసం దేవుడెందుకు మన బరువు తన నెత్తిని వేసుకోవాలి?
మనం క్లిష్ట పరిస్థుల్లో ఉంటే పాపం ఆ దేవుళ్ళే మనకు సహాయపడాలి. మనకే సమస్యా లేకపోతే మాత్రం ఆ దేవుళ్ళెక్కడున్నా మనకి పట్టదు. ఇదేం న్యాయం?
అర్ధ రహితమైన పనులు చేసి అనర్ధాలను కొనితెచ్చుకోవడం ఎంతవరకూ న్యాయమంటారు?
నా హృదయం ఎంత ఆవేదనకు గురికాకపోతే నేను మీతో ఇలా విన్నవించుకుంటానో మీరూ ఆలోచించండి.
ఈ విషయంలో నేను సూచించే పరిష్కారం ఆమోదయోగ్యమో కాదో మీరు చెప్పండి.
౧) కళ తప్పిన దేవుని చిత్రపాటాలు మనకు అక్కర లేదనుకొంటే వాటిని ఆ అగ్నిహోత్రునకు సమర్పించడం ఒకపద్ధతి.
౨) ఆ పటాలను గంగా మాత ఒడిలో ఉంచడం మరొక పద్ధతి.
అంతేకాని అక్కరలేదని చెప్పి పెంట కుప్పలమీద, అపవిత్ర ప్రదేశాలలోను, పడవేయరాదు.
మనం చేసే పని మన మనస్సుకెలాగున్నా ఇతరుల మనసుకు నొప్పి కలిగించ కూడదు. ఇతరుల నమ్మకం పాడు చేయరాదు.
ఇక చెప్పండి. మీరేమంటారు?
జైహింద్.

22, జనవరి 2012, ఆదివారం

నవ విధ భక్తులు.

6 comments

జైశ్రీరాం.  
శ్లోll
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, పాద సేవనం,
అర్చనం వందనం ధ్యానం, సఖ్య మాత్మ నివేదనం.
ఆ.వెః-
విష్ణు కథలు వినుట, విష్ణుఁ గీర్తించుట,
స్మరణ, సేవ, యర్చన, రహిఁ గొల్పు
వందనంబు, ధ్యాన, సుందర స్నేహంబు
నాత్మనొసగుట, హరి నరయు గతులు.
భావముః- 
విష్ణు కథా శ్రవణము,  విష్ణు కీర్తనము,  విష్ణు స్మరణము, విష్ణు పాద సేవనము, విష్ణు అర్చనము, విష్ణువుకు వందనము, విష్ణు ధ్యానము, విష్ణ్వుతో స్నేహము, విష్ణువుకు ఆత్మ నివేదనము అను తొమ్మిదిన్నీ నవ విధ భక్తులనబడును. ఇందేది అనుసరించియైనను విష్ణు సాన్నిధ్యము పొంద సాధ్యము.

This was drawn in 2004 by  as part of Sphurthi- a 2 day Summer Camp for the children of age 7-14. The children were explained each bhakti with the help of story related to the great ones, who stood as the role model, demonstrating that particular aspect of Devotion and importantly what does it means now for us to practice in day-to-day life ...
(1)శ్రవణం  --> ఆదిశేషుడు,
(2) కీర్తనం --> అన్నమాచార్యుడు, 
(3) విష్ణోః స్మరణం --> నారదుడు,
(4) పాద సేవనం --> హనుమంతుడు, 
(5) అర్చనం  --> సుదాముడు (కుచేలుడు),
(6) వందనం --> గరుత్మంతుడు, 
(7) దాస్యం  --> లక్ష్మణుడు, 
(8) సఖ్యం --> మైత్రేయుడు, 
(9) ఆత్మ నివేదనం --> గోపికలు.
జైహింద్.

21, జనవరి 2012, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 116.

4 comments

జైశ్రీరాం.
శ్లోll
జకారో జన్మ విచ్చేదః పకారో పాపనాశక:
జన్మపాప వినాశిత్వాత్ జప ఇత్యభిదీయతే
గీః-
కలుగనీయదు జన్మ జకార మరయ.
కలుగు పాపము బాపు పకార మదియు.
జన్మ పాప వినాశిని జపము కాన
జపము చేయంగ తగునయ్య సద్విధేయ.
భావముః-
జకారము జన్మను పొందకుండా చేయును. పకారముపాపమును నశింప జేయును. జన్మ పాప వినాశనములు చేయునది కావుననే జపము అనబడుచున్నది. ఇంతటి ప్రయోజన కరమైన జపమును ప్రతీ వ్యక్తియు ఆచరింప వలయును.
జైహింద్.

20, జనవరి 2012, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 115.

1 comments

జైశ్రీరాం.
శ్లోll
ధృతిః క్షమా దమోஉస్తేయం శౌచమింద్రియ నిగ్రహః
ధీర్విద్యా సత్య మక్రోధో దశకం ధర్మ లక్షణం.
గీః-
నివృత ధైర్యమోర్పును మనో నిగ్రహంబు
పరధనాశ లేకుంట, శుభ్రతయు, నింద్రి
య జయమును, బుద్ధి, విద్య, సత్య వచనమును,
కోప రాహిత్య మివి ధర్మ గుణములరయ.
భావముః-
ధైర్యము, ఓర్పు, మనో నిగ్రహము, తనది కాని వస్తువునందు ఆశ లేకుండుట, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, బుద్ధిమత్వము, విద్య, సత్య భాషణము, కోప రాహిత్యము అను ఈ పదీ ధర్మమునకు లక్షణములు.
జైహింద్.

19, జనవరి 2012, గురువారం

శ్రీ రామ కృష్ణ పరమ హంసకు స్మృత్యంజలి.

4 comments

జైశ్రీరాం.
శ్రీ రామ కృష్ణ పరమహంస అసలు పేరు  గదాధర్ ఛటోపాధ్యాయ.తే.౧౮ - ౦౨ - ౧౮౩౬ న పశ్చిమ బెంగాల్ లో హుగ్లీ జిల్లాలో కామార్పుకూర్ గ్రామంలో చంద్రమణి దేవి, క్షుదీరాం దంపతులకు జన్మించారు. రాణీ రాషమొణి అనే ధనికురాలు దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి, గదాధరుని అన్న రామ్ కుమార్ ను పూజారిగా నియమించెను.అన్న తరువాత గదాధర్ ఆ బాధ్యతలు స్వీకరించెను.అతని ఏకాగ్రతకు మెచ్చి కాళికా మాత అతనికి ప్రత్యక్షమయింది. నాటినుండి ఆమెను ప్రత్యక్షంగా సేవించేవాఁ గదాధరుఁడు.
అతని జ్ఞానజ్యోతి ప్రపంచవ్యాప్తం కాగా మతాతీతంగా అనేకమంది అతని శిష్యులై అతడు చూపిన జ్ఞాన మర్గాన్ని అనుసరించారు.
శ్రీ స్వామీ వివేకానంద, బ్రహ్మానంద, ప్రేమానంద, శివానంద, త్రిగుణాతీతానంద, అభేదానంద, శారదానంద, అద్భుతానంద, అద్వైతానంద, సుబోధానంద, విజ్ఞానానంద, రామకృష్ణానంద, అఖండానంద, యోగానంద, నిర్గుణానంద, మున్నగు సన్యాస శిష్య్లులు, నాగమహాశయులు, మహేంద్రనాధ గుప్తా, పూర్ణూఁడు, గిరీష ఘోష్, మున్నగు గృహస్థులు వీరి శిష్యులే. రామకృష్ణ మిషన్ వీరి ద్వారానే స్తాపింప బడి విస్తరింపబడి నేటికీ ఆధ్యాత్మిక కేంద్రాలై భక్తితత్వాన్ని చాటుతున్నాయి.
సృష్టిలో ఏకత్వము, 
అన్ని జీవులలొదైవత్వము,
దేవుఁడొక్కడే, అన్ని మతముల సారము ఒక్కటే, 
కామము, స్వార్థము మానవ జీవుతంలో దాస్య కారకాలు,
ఈ రెండూ విడిచినట్లైతే భగవంతుణ్ణి పొంద వచ్చు.
ఒక గమ్యాన్ని చేరడానికి అనేక మార్గాలు ఎలాగో అలాగే భగవంతుని చేరడానికి అనేక మార్గాలు.
ఇవి రామకృష్ణుని బోధనలో ముఖ్యాంసాలు.
మానవ సేవయే మాధవ సేవగా ఇతని బోధనల వలన ప్రజలు గ్రహించిరి.
హిందూమతముపై రామ కృష్ణుని  ఆలోచనలను సహేతుకముగనున్నందున క్రిఫ్టోఫర్ ఇషర్వుడ్ మున్నగు పాశ్చాత్యులు అనేకులు మతములు మార్చుకొని, హిందూధర్మానువర్తులయ్యారు.
జైహింద్.

18, జనవరి 2012, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 114..

1 comments

జైశ్రీరాం.
శ్లోll
ధారణాద్ధర్మమిత్యాహుః. ధర్మో ధారయతి ప్రజాః!
ప్రభవార్ధాయ భూతానాం ధర్మ ప్రవచనం కృతం.
క:-
ధరియించునదియె ధర్మము.
వరలించును ప్రజల. జీవ ప్రభవ స్థితులన్
వరలింపఁ జేయ నమరెను
ధర ధర్మ ప్రవచనమది. ధర్మ విధేయా!
భావముః-
ధరించునది కావున ధర్మమమి పెద్దలు చెప్పుచున్నారు. ధర్మమే ప్రజలను నిలిపి ఉంచుతుంది.జీవుల ఉత్పత్తి స్థిత్యర్థమై ధర్మ ప్రవచనము చేయ బడినది.
జైహింద్.

16, జనవరి 2012, సోమవారం

హలో! హలో! హలో! నా సందేహం తీర్చండి.

5 comments

జైశ్రీరాం.
ప్రియ ఆంధ్రామృత పాఠక మిత్రులారా! మకర సంక్రాంతి వేడుకలు మిమ్మల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తాయనుకొంటాను.
చాలా సంతోషం. ఆ పరమాత్మ సహృదయుల హృదయాలలోనే నివసిస్తూ, వారి యోగ క్షేమాలు చూస్తాడనడానికి మీ ఆనందానుభూతే నిదర్శనం.
ఇక
నాకో చిన్న సందేహం వచ్చింది.
మనం మనకు ఎక్కడి నుండైనా దూరవాణి వస్తే దానికి సమాధానంగా మనం హలో అని పలుకరిస్తాము.
ఈ హలో అర్థమేంటో నాకైతే అర్థం కావటంలేదు.
ఇలా పలకరించడం ఎంతవరకూ సముచితంగా ఉంది? అని నాకు నా మనసులో ఒక ప్రశ్న కలిగింది.
మీకు తెలిస్తే  దయచేసి నాకు చెప్ప కలరా?
హృదయము గొన్న మిత్రుడొ, మహిన్ విలసిల్లెడి యాత్మ బంధువో,
బుధజన వర్యుఁడో, కలిత పుణ్య మనస్కుఁడొ, యెవ్వరేనియున్
మదిపడి పిల్చుచుండ, విని, మన్ననతో నట దూరవాణిలో
మొదట "హలో"యనందగునె? ముక్తిని, భుక్తిని కొల్పునా హలో?
జై శ్రీరామని పల్కరించి, యెవరో చెప్పుండు. నే నెట్లు మీ
సుశ్రేయాళి సువృద్ధి హేతువగుదున్?  చెప్పుండనం,  గ్షేమ, మా
త్మశ్రీ శోభిలు. మైత్రి  వృద్ధి యగు. సన్మాన్యత్వ సద్వృద్ధియౌన్.
సుశ్రావ్యంబుగ పల్కుడట్లు యికపై శోభిల్ల మీరెల్లరున్.
అని నే పల్కగ సాహసింప తగునా? యాలించి నన్ దిట్టరే?
వినినన్ నవ్వరె? వెఱ్ఱి మాటలనరే? విద్వాంసుడధ్వాన్న సూ
చనలన్ జేయు టిదేమి బుద్ధి యనరే? సత్యంబు చెప్పుండు. నే
విన నేర్తున్ సుజనాళి సూచనలిలన్ విన్పింపుడీ! సత్కృపన్.
కొత్తపాళీ గారు ఇదే అంశం తీసుకొని వ్రాసిన వ్యాసం ఈ క్రింది దానిపై క్లిక్ చేస్తే వస్తుంది. చూడండి.
http://kottapali.blogspot.com/2012/01/blog-post_12.html
జైహింద్.

14, జనవరి 2012, శనివారం

ఖర మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

3 comments

సాహితీ ప్రియ పాఠకులారా!
ఈ ఖర మకర సంక్రాంతి మీ యింట ఆనందం పరవళ్ళు త్రొక్కించాలనీ, సకుటుంబంగా మీరంతా సుజ్ఞానతేజోమూర్తులై లోక కల్యాణ కారకులై ఆ పరమాత్మ కృపామృతాన్ని నిరంతరం గ్రోలుతూ మాతృ దేశ భక్తి ప్రపూర్ణులై వెలుగొందాలని మనసారా కోరుకొంటున్నాను.
ఆపరమాత్మ మిమ్ములను కటాక్షించుగాక.
జై శ్రీరాం.
జైహింద్.

12, జనవరి 2012, గురువారం

యువజన దినోత్సవము సందర్భంగా యావద్భారతీయులకూ శుభాకాంక్షలు.

6 comments

స్వామీ వివేకానందుని నూట యేభయ్యవ జన్మ దినం సందర్భంగా యావద్భారతీయులకూ, 
ఉత్తేజం ఉరకలు వేసే యువతకు యువజన దినోత్సం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకొంటున్నాను.
అలరె నొకండె తా పరమ హంసకు శిష్యుఁడుగా రహించి. భూ
వలయమునందు భారతికి ప్రస్ఫుట కీర్తిని గొల్పెనొక్కడే.
వెలయగ చేసె దైవపర విజ్ఞత యుక్త వయస్కులందు. ధీ
కలిత రవీంద్రుఁడాతనికి గౌరవమొప్పగనంజలించెదన్.
యువజనులార! మీకుఁ గల యుక్తి విశిష్టతఁ గాంచరేల? మీ
భవిత మహోజ్వలంబుగ ప్రపంచమునన్ వెలుగొందునట్లుగా
ప్రవర గుణ ప్రపూజ్యమగు వర్తనచే వరలింప జేయుడీ!
ప్రవర నరేంద్ర భావనలు వర్ధిలు గావుత మీ ప్రవర్తనన్.
మీకు శుభంబులౌత! కను మేలు మిముం గని భారతాంబయున్.
శ్రీకర భావ భాగ్యములు, క్షేమము మీకు లభించు గావుతన్.
లోకమునందు మీ చరితలున్ తలమానికలై వెలుగొందు గావుతన్.
మీ కమనీయ భావనలు మేలగు నాంధ్ర సుధాబ్ధి గావుతన్.
జైశ్రీరాం.
జైహింద్.

11, జనవరి 2012, బుధవారం

ఎవరీసుందరి? ( నామ గోపన చిత్రము )

3 comments

భ్యత పొడ చూపు సద్వేష ధారణ - సధ్బావ మొలికించు సౌమ్యతయును,
చిన్‌ని నగవు మోము వన్నెలు పెంచగా - గంభీరమును చాటు కనుల కాంతి. 
టెంకి యెద్దియొ? పుత్తడిని పోలి కనిపించు -  దివ్య విగ్రహ తేజ మవ్యయమది.
డుల్‌లు నాత్మ స్థైర్య మెల్లయు చూచిన. - కల కాదు నిజమిది కలయ జూడ.
కర్‌కమును గాంచి బ్రహ్మయు గాంచు మరల 
నుత్పలాక్షి మహర్దశ నొనరు కీర్తి
చూచి సృష్టియే వెరఁగన్దె.చూచి చెప్పు
డు.వనిత యెవరు? పాఠకా! భవుని సతియ?
జైశ్రీరాం.
జైహింద్.

10, జనవరి 2012, మంగళవారం

వైరస్సాసురుఁడు నా కంప్యూటర్నావహించి చాలా యిబ్బంది పెట్టాఁడు

5 comments

వైరస్సాసురుఁడెట్లు వచ్చి పడెనో!  వర్ధిల్లగా చొచ్చి,  శ్రీ
గౌరీపుత్ర సమాన ధీరుఁడగు నా కంప్యూటరు న్బట్టె. నే
చేరం జేరిన గాని దుఃఖ మతియై చీకాకు పెట్టేటటుల్
మారామున్ పొనరింప చేసె. సుకవుల్ మన్నింపుడీ సత్కృపన్.
మీ ముందుకు రానందుల
కేమని భావించిరొ నను నీ దురవస్తన్
బ్రేమగ నాప్రియ శిష్యుఁడు
నీమంబుగ తొలగఁ జేసె నేర్పున దీనిన్.
నేటికి పది దినములు. గ్రహ
పాటున మిము కలువనైతి. పాఠకులారా!
దీటైన కవితలున్నను
చాటుగ, నవి వెలికి తీసి చదివింతునికన్. 
జైశ్రీరాం.
జైహింద్.

1, జనవరి 2012, ఆదివారం

క్రీ.శ.2012 ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.

7 comments

Happy-New-Year-2012-Greeting-Cards.jpg (500×483)
శ్రీ జ్ఞాన సంపన్నులైన, సచ్చిదానంద మూర్తులైన ఆంధ్రామృత పాఠకాళికీ, సాహితీ ప్రియ మిత్రులకూ
క్రీ.శ.2012 ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.
కాల గమనంలో ఆంగ్ల వత్సరం ఒక కొలమానంగా కలిగి ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న మనం శుభాలనాకాంక్షీంచడం అసందర్భం కాదని భావిస్తున్నాను.
శుభమస్తు.