గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 82వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్.

82. ఓం శరణాగత వత్సలాయ నమః.

నాందీముఖి వృత్త గర్భ సీసము.

ఘన శుభకర విజయననుఁ గావన్ విశ్వ - విఖ్యాత! రారా! సువేదివగుచు,

ప్రముదితులగు ప్రజల మదులందున్ శ్రద్ధ - వీవే సుధీరాప్రవృద్ధి నిమ్ము.

నయ నిధానమ! సుజన హృదయాబ్జా! శుద్ధ - వాగ్రూప! రారా! కృపాపయోధి.  

అమర వినుత విజయ పథ భాసావిశ్వ - నేతా! నృసింహాఖ్య! నీవె దిక్కు.

గీ. విమల నాందీముఖీ శుభ వృత్త భాస! - అనుపమ *శరణాగత వత్సలా*! నరహరి!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

82 సీస గర్భస్థ నాందీముఖి వృత్తము. (    గగ .. యతి 8)

విజయననుఁ గావన్ విశ్వవిఖ్యాత! రారా!

ప్రజల మదులందున్ శ్రద్ధ వీవే సుధీరా

సుజన హృదయాబ్జాశుద్ధ వాగ్రూపరారా!

విజయ పథ భాసావిశ్వనేతా నృసింహా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గొప్ప శుభములు కలిగించు విజయుఁడా!

విశ్వమున ప్రఖ్యాతిగా వ్యక్తమగువాడా! నన్ను కాపాడ రమ్ము. నిరంత రానంద కలితులందు శ్రద్ధవు నీవే సుమా.

అభివృద్ధిని ప్రసాదించుము. నయ నిధానమా! కృపాపయోధీ! సుజన హృదయా! శుద్ధ వాగ్రూపా! రమ్ము. దేవతా

వినుత విజయపథ భాసా! విశ్వ నేతా! నాందీముఖీవృత్త భాసా! అనుపమ శరణాగత వత్సలా! నీవే నాకు దిక్కు.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.