గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2022, బుధవారం

గొల్లపూడివారి మాటలు ఎంతవిలువైనవో మనం గ్రహించగలమా?

0 comments


జైశ్రీరామ్.
గొల్లపూడివారి మాటలు ఎంతవిలువైనవో మనం గ్రహించగలమా?
జైహింద్.

గయాక్షేత్ర వర్ణనలు...భక్తిసాధనము.

0 comments

జైశ్రీరామ్.
భక్తిసాధమ్.
గయాక్షేత్ర వర్ణనము.
జైహింద్.

భవిష్యత్ సూచించిస్తూ అమ్మవారు పలికించిన సమస్య, ఆలస్యముగా అర్థమయింది.

0 comments

 జై శ్రీరామ్.

జై శ్రీమన్నారాయణ.🙏

భక్తిసాధనం వారి కోరికమేరకు నేనిచ్చిన సమస్య.

👇

కర్కటరాశి వీడనని గట్టిగ పట్టును బట్టె సూర్యుడున్.

దీనికి

నా పూరణము.

👇

ఉ.  అర్కుఁ డసాదృశంబుగ మహాద్భుత యోగము కూర్ప జాతికిన్

కర్కట రాశి వీడి వెలుగన్ మకరంబున, నేను చత్తునం

చర్క సమాన తేజుఁడు మహాత్ముఁడు భీష్ముఁడు పల్క, .. బాధతో 

*కర్కటరాశి వీడనని గట్టిగ పట్టును బట్టె సూర్యుడున్.*

ఇది ☝️ఆ రోజే నేను చేసిన పూరణము..🙏

అమ్మవారు ఇటువంటి సమస్య నా చేత యిప్పించడం గురించి 

ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతోందండి.

అపరవ్యాసులయిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారు 

ఉత్తరాయణం రాక కోసం వేచి ఉన్న సంగతి అమ్మకు తెలియును. 

ఆ సూర్యభగవానుడు కూడా వీరు కాలం చేయుట యిష్టము లేక 

కర్కట రాశి నుండి మకరమునకు వెళ్ళితే ఇంతటి మహాత్ముఁడు 

లోకానికి దూరమవ డానికి కారకుఁడనవుతానని భావించి అక్కడనుండి 

కదలకూడదని మొండి చేశాఁడు. ఐనా విధికి తలవంచక తప్పని రవి

కర్కటాన్ని వదిలి మకరానికి చేరక తప్పలేదు.

అపరవ్యాసులయిన శాస్త్రిగారు తనకు అనుకూలమయిన సమయం 

వచ్చినదని పరమాత్మలో లీనమయారు.

ఇంతటి భవిష్యత్ ముందుగా మనము గ్రహించ లేకపోవచ్చును గాని 

ఆమ్మ పలికించే మాటలు అర్థవంతాలు భావి సూచికలున్నూ.

ఆ విధముగా పలికించిన అమ్మపాదస్మరణకన్న పరమార్థ 

మేముంటుందండీ.🙏

జైహింద్.

జాతస్య హి ధ్రువో మృత్యుః.. || 2 . 27 || ..//..అవ్యక్తాదీని భూతాని .. || 2 . 28 || ..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే௨ర్థే న త్వం శోచితుమర్హసి || 2 . 27 || 

కం.  పుట్టిన మరణము తప్పదు

పుట్టుట తప్పదు మరణము పొందినచో,  నే

జట్టియు మార్చగ లేడిది,

యిట్టుల దుఃఖింపతగ దిదేల నెఱుఁగవో?

భావము.

పుట్టిన వాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టుక తప్పదు. 

తప్పించరాని ఈ విషయంలో తపించనవసరం లేదు.

శ్లో.  అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |

అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. || 2 . 28 || 

కం.  పుట్టక పూర్వము తెలియదు

గిట్టిన పిదపను తెలియదు కించిత్తయినన్.

బుట్టిన జీవిని గూర్చి మ

రిట్టుల యీమద్యము కని యేలను చింతల్? 

భావము.

జీవులు పుట్టుకకు పూర్వం కాని, మరణానంతరం కాని ఏ రూపంలో 

వుంటాయో తెలియదు. మధ్యకాలంలో మాత్రమే కనబడుతాయి. 

అర్జునా !అలాంటప్పుడు విచారమెందుకు?

జైహింద్.

18, జనవరి 2022, మంగళవారం

అవ్యక్తో௨యమచింత్యో.. || 2 . 25 || ..//..అథ చైనం నిత్యజాతం నిత్యం.. || 2 . 26 || ..//..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అవ్యక్తో௨యమచింత్యో௨యమవికార్యో௨యముచ్యతే |

తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి || 25

తే.గీ.  ఇంద్రియములకగోచరమెన్ననాత్మ,

మనసుకందదదవికారి,మదిని యాత్మ

తత్వమెఱుఁగుమునీవిక మదిని గలుగు

చింత వీడుముబాధ్యతావంత కనుము.,

భావము.

ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. 

వికారాలకు గురికాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకుని నీవు విచారించడం 

మానుకొనుము.

శ్లో.  అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |

తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 26 || 

తే.గీ.  పార్థ!! దేహంబుతోఁ బాటు వరలుచున్న

యాత్మకున్ జావు పుట్టుక లలరు ననుచు

నీవు భావించుచున్నను, ధీవరేణ్య!

మదిని శోకింపఁ బనిలేదు మృదుల హృదయ!.

భావము.

అర్జునా ! శరీరంతోపాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుక

లుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించవలసిన పనిలేదు.

జైహింద్.

17, జనవరి 2022, సోమవారం

నైనం ఛిందంతి శస్త్రాణి.. || 2 . 23 || ..//..అచ్ఛేద్యో௨యమదాహ్యో.. || 2 . 24 ||..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 23 || 

తే.గీ.  అగ్ని కాల్చగ లే దాత్మ నరసి చూడ,

శస్త్రములు చీల్చలేవు ప్రశస్తమయిన

నీరు తడుపంగలే దిక ఘోరమైన

గాలి యెండగాఁ జేయలే దేలొ? కనుమ.

భావము.

ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు 

తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు.

శ్లో.  అచ్ఛేద్యో௨యమదాహ్యో௨యమక్లేద్యో௨శోష్య ఏవ చ |

నిత్యః సర్వగతః స్థాణురచలో௨యం సనాతనః || 24 || 

తే.గీ.  ఆత్మ ఖండింపఁబడని దీవరసి చూడ,

కాల దగ్నికి, తడవదు కనగ నీటి

కి నిల నెండదు, నిత్యము, వినగ శాశ్వ

తంబ దచలమునయి, సనాతనమెఱుంగ,.

భావము.

ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది 

నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం.

జైహింద్.

16, జనవరి 2022, ఆదివారం

శ్లో. వేదావినాశినం నిత్యం.. || 2 . 21|| ..//..వాసాంసి జీర్ణాని యథా విహాయ.. || 2 . 22|| ..//..సాంఖ్యయోగము

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 2 .  21|| 

తే.గీ.  చావుపుట్టుకల్ లేనిదై శాశ్వతమయి

యుండునాత్మయం చెఱిగిన నోపునెవఁడు 

చంపగను దాని దానిచేఁ జంపఁజేయ?

పార్థుఁడా! నీ వెఱుఁగవొకొ? పద్ధతినిట. 

భావము.

పార్థా ! ఆత్మ నాశనరహితమనీ, చావు పుట్టుకలు లేనిదనీ, శాశ్వత

మైనదనీ  తెలుసుకున్నవాడు  ఎవరినైనా ఎలా చంపుతాడు?

ఎలా చంపిస్తాడు?

శ్లో.  వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ  || 2 .  22|| 

తే.గీ.  ప్రాత చిరిగిన వస్త్రము విడిచిపెట్టి

నూతనంబైన వస్త్రమును తొడుగునటు,

శిధిలదేహంబు వీడుచు జీవుం_డటులె

క్రొత్త దేహంబులో చేరి కుదురుకొనును

భావము.

మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టి క్రొత్తబట్టలు 

వేసుకున్నట్లే ఆత్మ కృశించిన  శరీరాలను వదలి కొత్త దేహాలు 

పొందుతుంది.

జైహింద్.

శతావధానం,10-01-2022, शतावधानम्, SHATAVADHANAM By Ambalam Parthasarathi |...

0 comments

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ వద్దిపర్తిపద్మాకర్ శతావధానిచేసిన శతావధానములోశ్రీ మరుమామల దత్తాత్రేయ శర్మగారు, నేను ఇచ్చిన సమస్యలకు అవధానిగారి పూరణలను, శ్రీ అంబాళం పార్థసారథి గారు వివరణాత్మకంగా చేసిన దృశ్యశ్రవణ చిత్రీకరణాద్భుతముగా ఉన్నది వారికి నా ధన్యవాదములు. 
జైహింద్.

15, జనవరి 2022, శనివారం

గీతార్ధ సారము వినుము | భగవద్గీత పాట | గీతోపదేశం 18 చరణాలలో.

0 comments

జైశ్రీరామ్.
గీతార్ధ సారము వినుము | భగవద్గీత పాట | గీతోపదేశం 18 చరణాలలో.
జైహింద్.

భగవద్గీత సారము...పాటగా..

0 comments

జైశ్రీరామ్.
భగవద్గీత సారము...పాటగా..
జైహింద్.

య ఏనం వేత్తి హంతారం.. || 2 . 19 || ..//..న జాయతే మ్రియతే వా.. || 2 . 20 || ..సాంఖ్య యోగము..

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |

ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || 19

తే.గీ.  చంపునాత్మయనుచు నాత్మ చంపఁబడున

నుచును మూర్ఖులనుచునుం ద్రనుపమముగను

చంపఁబోవదాత్మయు తాను చంపఁబడదు

తెలియవలయునిదియె నీవు తెలివిఁ గలి గి.

భావము.

ఈ ఆత్మ చంపుతుందని కాని, చంపబడుతుందని కాని భావించే 

వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేది కాని చచ్చేది కాని కాదు.

శ్లో.  న జాయతే మ్రియతే వా కదాచిత్

నాయం భూత్వా భవితా వా న భూయః |

అజో నిత్యః శాశ్వతో௨యం పురాణో

న హన్యతే హన్యమానే శరీరే || 20

తే.గీ.  జనన మరణముల్లేనిది, సతము కలది,

జన్మరాహిత్య శాశ్వత సంస్థితమది

యాత్మ, నశియింపబోవద నంతమదియు

దేహమంతమైపోయినన్ దేహి నిలుచు.

భావము.ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి, 

మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితమూ, శాశ్వతమూ, 

అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం 

చేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు.

జైహింద్.

14, జనవరి 2022, శుక్రవారం

మీకు భోగిపండుగ శుభాకాంక్షలు

0 comments

జైశ్రీరామ్...

మీకు 

భోగిపండుగ శుభాకాంక్షలు.

శ్రీమన్మంగళ భోగి మీకు శుభముల్ చేకూర్చుతన్ భోగముల్,

శ్రీమాతృకృప, చిద్వివేకము, జయశ్రీ సంపదల్, సద్ధనం

బేమాత్రంబును లోటు లేని సుఖముల్ హృద్యంపు సద్భావనల్

ధీమంతుల్ తమరందుకో వలచెదన్ దీపించుడీ సద్విధిన్

💐

జైహింద్.

అవినాశి తు తద్విద్ధి యేన..//.. || 2 .17 ||..//..అంతవంత ఇమే దేహా..//.. || 2 .18 || ..//,.. సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |

వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్‌కర్తుమర్హతి || 17

తే.గీ.  ఆత్మ విశ్వంబునంతటన్ వ్యాప్తమయిన

వస్తు వని గ్రహియింపుము పార్థ! నీవు,

నాశనములేనిదయ్యది నరుఁడ! ఇఎలియ,

చేయలేరణంతమున్ దాని, చెడనిదదియె.

భావము.

ఈ విశ్వమంతటా వ్యాపించివున్న ఆత్మవస్తువు నాశనం 

లేనిది. దానినెవరూ అంతం చేయలేరు.

శ్లో.  అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |

అనాశినో௨ప్రమేయస్య తస్మాద్యుద్ధ్యస్వ భారత || 18

తే.గీ.  నాశనము లేనియాత్మకు నీశరీర

మెన్నగాశాశ్వతము కాదు, కన్నుతెరిచి

యాత్మయే నిత్యమని నమ్ముమయ్య పార్థ!

యుద్ధమునుచేయ నీవింక సిద్ధమగుము.

భావము.

నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ ఒక్కటే 

నిత్యం. కనుక ఓ భారత వీరా! యుద్ధం మొదలు పెట్టు.

జైహింద్.

13, జనవరి 2022, గురువారం

యం హి న వ్యథయన్త్యేతే..//...|| 2 . 15..//..నాసతో విద్యతే భావో..|| 2 . 16 || సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ |

సమదుఃఖసుఖం ధీరం సో௨మృతత్వాయ కల్పతే || 15

కం. పురుష శ్రేష్టుఁడ! యెవడిల

నిరుపమసుఖదుఃఖములు గణించు సమముగా

వెరపున ద్వంద్వములంటవు,

వరధీరుఁడతండమృతమువడయగనొప్పున్.

భావము.

పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి 

ద్వందాలు భాదించవో అతడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు.

శ్లో.  నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |

ఉభయోరపి దృష్టో௨న్తః త్వనయో స్తత్త్వదర్శిభిః || 16

తే.గీ.లేనిదుండ దాయున్నది లేకపోదు

భువిని తత్వజ్ణులెఱుఁగుదురవి జగాన,

నీవు తత్వజ్ణుఁడవు పార్థ!భావనమున

తెలిసికొమ్మిది, నిజమును తెలియవలయు.

భావము.

లేనిది ఎప్పటికీ వుండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి 

నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది.

జైహింద్.


12, జనవరి 2022, బుధవారం

దేహినో௨స్మిన్ యథా దేహే.. || 2..13..//.. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ. || 2..14...//..సాఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్. 

శ్లో.  దేహినో௨స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |

తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి || 13

కం. జీవుని కిల కౌమారము

యౌవనవార్ధక్యములవి యరయుచు దేహం

బే వదలి మరల పుట్టును,

జీవముదుఃఖింపదుకద క్షితి నెన్నినచో.

భావము.

జీవుడికి ఈ శరీరంలో కౌమారం, యౌవనం, వార్థక్యం వచ్చినట్లే 

మరణానంతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు 

దుఃఖించడు.

శ్లో.  మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |

ఆగమాపాయినో௨నిత్యాః తాం స్తితిక్షస్వ భారత || 14

తే.గీ.  విషయవశమైన యింద్రియా లసదృశమగు

సుఖము దుఃఖములను తేలుచున్జరింప

వే,, యశాస్వత మింద్రియ విషయముల క

లయిక,బాధలనుసహించు ప్రియ నరుండ!

భావము.

కుంతీ పుత్రా! విషయాలకు వశమైన ఇంద్రియాలవల్ల 

శీతోష్ణాది గుణాలూ,సుఖదుఃఖాలూ కలుగుతుంటాయి. కోరికలకూ, 

ఇంద్రియాలకూ కలయిక అశాశ్వతం. కనుక ఓ భరతవీరా ! 

ఆ బాధలను సహించు.

జైహింద్.


స్వామివివేకానందుని 159 వ జయంతి. ఈ సందర్భముగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.

నేడు 

భరతమాతముద్దుబిడ్డ,  

భారతీయతత్త్వవేత్త, 

ఆధ్యాత్మికశక్తిసంపన్నుడు,   

రామకృష్ణమిషన్ వ్యవస్థాపకుడు, 

యువతకు జాగృతి కలిగించిన 

నిరంతర ఆదర్శప్రాయుడు 

స్వామివివేకానందుని 

159 వ జయంతి.

ఈ సందర్భముగా

జాతీయ యువజన దినోత్సవ 

శుభాకాంక్షలు.వివేకానందుని జీవిత చరిత్రను ఆబాల గోపాలము 

పఠించవలెను.

ప్రపంచ దేశములలో మన భారత దేశము యొక్క గౌరవమును 

ఏ విధముగా  తనప్రవర్తనద్వారా, 

ఉపన్యాసము ద్వారా ఇనుమడింప చేసెనో గ్రహించి, భారతీయునిగా 

మన కర్తవ్యమును మనమే 

గ్రహించుకొని ఈ భూమిపై పుట్టినందులకు ఈ తల్లి ఋణమును 

తీర్చుకొనవలెనని అందరమూ 

గ్రహించుకొలవలసి యున్నది.

జైహింద్.

11, జనవరి 2022, మంగళవారం

అశోచ్యానన్వశోచస్త్వం .. || 2 . 11 || ..//..న త్వేవాహం జాతు నాసం.. || 2 . 12 || ..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీభగవానువాచ

శ్రీకృష్ణభగవానుడిట్లనుచున్నాడు.

శ్లో.  అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |

గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 11

తే.గీ.  నీవు దుఃఖించు చుంటివి నేడు పార్థ!

యవసరము లేని వారికై యనవసరము,

జ్ణాని వలె పల్కుచుంటివి చనిన, యున్న

వారికొఱకు దుఃఖింపరు ప్రతిభు లిలను.

భావము.

అర్జునా! దుఃఖించనవసరం లేనివాళ్ళకోసం దుఃఖిస్తున్నావు. పైగా 

మహావివేకిలాగా  మాట్లాడుతున్నావు. చచ్చిపోయినవాళ్ళ

 గురించికాని, బ్రతికున్నవాళ్ళ గురించి కాని వివేకులు శోకించరు.

శ్లో.  న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |

న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || 12

కం.  నీవును నేనును వీరును

భావింపగ యుందుముకద నేడును రేపున్

నీవేల తెలియకుంటివి?

నీవిది గ్రహియింప వలయు నేర్పరివగుచున్.

భావము.

నీవూ నేనూ వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్తులో 

కూడా వుంటాము.

జైహింద్.

10, జనవరి 2022, సోమవారం

ఏవముక్త్వా హృషీకేశం.. || 2 . 9 || ..//..తమువాచ హృషీకేశః.. || 2 . 10 || ..//..సాంఖ్య యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లోఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప |

యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ || 9 || 

తే.గీఇట్లు శ్రీకృష్ణునుని తోడ నెఱుకపడగ

నర్జునుఁడు తన భావన ననుపమముగఁ

దెలిపి యుద్ధము చేయక నిలిచె నకట,

మొద్దుబారిన మదితోడ భూమిపైన.

భావము.

అర్జునుడు శ్రీకృష్ణుడితో అలా చెప్పి యుద్ధం చేయనని 

ఊరకున్నాడు.

శ్లోతమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |

సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః || 10 || 

తే.గీరెండు సేనలమధ్యలో నుండి యున్న 

దుఃఖ తప్తుఁడౌ యర్జునున్ దురిత హరుఁడు

మురహరి కనుచు పరిహాసముగను బలికె

జ్ణాన సంపూర్ణ సద్భాసమాన ముఖుఁడు.

భావము.

రెండుసేనల మధ్య విషాదవశుడైవున్న అర్జునుణ్ణి చూసి 

శ్రీ కృష్ణపరమాత్ముడు పరిహాసంగా ఇలా అన్నాడు.

జైహింద్.

9, జనవరి 2022, ఆదివారం

కార్పణ్యదోషోపహతస్వభావః.. || 2. 7 ||..//.. న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్..|| 2. 8 ||..//..సాంఖ్య యోగము

0 comments

  జైశ్రీరామ్.

శ్లో.  కార్పణ్యదోషోపహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |

యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే௨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || 7

కం. గురువులు బంధువులనుచును

దరగని మమకారమునను తరిగెను జ్ణానం

బరయుచు మార్గము చూపుము

గురువుగ నీ శిష్యునకునుగోవింద! కృపన్.

భావము.

గురువులూ బంధువులూ అనే మమకార దోషంవల్ల నాబుద్ధి 

నశించింది. మంచి ఏదో చెడు ఏదో తెలియడం లేదు. 

శిష్యుడిగా నిన్ను ఆశ్రయించిన నాకు 

ఏది శ్రేయోమార్గమో దాన్ని ఆదేశించు.

శ్లో.  న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్

యచ్ఛోక ముచ్ఛోషణమింద్రియాణామ్ |

అవాప్య భూమావసపత్నమృద్ధం

రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ || 8

తే.గీ.  ఆధిపత్యంబు భువిని నాకమరవచ్చు

అట్లె స్వర్గాధిపత్యమే యమరవచ్చు

నైనగానిస చ్ఛాంతి నాకమరఁబోవ

దలముకొనియున్న దుఃఖంబు తొలఁగిపోదు.

భావము.

భూలోకాధిపత్యం లభించినా, స్వర్గాధిపత్యం సిద్ధించినా 

నా శోకం తగ్గుతుందనుకోను.

జైహింద్.

8, జనవరి 2022, శనివారం

గురూనహత్వాహి.. || 2 . 5 || ..//..న చైతద్విద్మః కతరన్నో.. || 2 . 6 || ..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  గురూనహత్వాహి మహానుభావాన్

శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |

హత్వార్థకామాంస్తు గురూనిహైవ

భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 5

తే.గీ.  మహితులైనట్టి గురువులన్ మడియఁ జేసి,

రక్తసిక్తంపురాజ్య సంప్రాప్తమవగ

పాలనము సేసి బ్రతుకుట పాడియగునె,

దీనికన్నను భిక్షాన్నమే నయమిల.

తే.గీ.  మహిత గురువులన్  వధియించి మనుట శ్రేయ

మవదుగ, కన రక్త కలిత మయిన రాజ్య

భోగముల కంటె బ్రతుకఁగ ముష్టి మేలు.

పాపమును తిని బ్రతుకుట పాడి యగునె?

భావము.

మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం 

కాదు. వారిని సంహరించి రక్తసిక్తాలైన 

రాజ్యభోగాలు అనుభవించడం కంటే బిచ్చ

మెత్తుకోవడం మేలు.

శ్లో.  న చైతద్విద్మః కతరన్నో గరీయో

యద్వా జయేమ యది వా నో జయేయుః |

యానేవ హత్వా న జిజీవిషామః

తే௨వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః || 6

తే.గీ.  యుద్ధమును చేయుటొప్పౌనొ? యొప్పు కాదొ?

యెఱుఁగ లేకుంటి,విజయంబదెవరికగునొ

తెలియ దెవరిని చంపినతృప్తిఁ గనుదొ

వారె యెదురుగనుండిరి నీరజాక్ష!

తే.గీ. రణ ఫలంబది గ్రహియింప రాదు నాకు,

జయమొ, యోటమియో చెప్పఁ జాలముకద,

యెవరినివధించిన విరక్తి నెరయును మది

నదిగొ ధార్తరాష్ట్రులిచటనెదుట కలరు.

భావము.

యుద్ధం చేయడం మంచిదో కాదో తెలియడం 

లేదు. మనం జయిస్తామో, వారు జయిస్తారో

చెప్పలేము. ఎవరిని చంపితే మనకు జీవితం 

మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్ట్రాదులే

ఎదురుగా ఉన్నారు. 

జైహింద్.

క్లైబ్యం మా స్మ గమః పార్థ || 2 - ౩ ll.//..కథం భీష్మమహం సంఖ్యే.. || 2 - 4 ll../..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |

క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప || 3

తే.గీ.  పొందకధైర్య మిటను నపుంసకునటు,

తగదు నీకిది, వీడుట తగు నధౌర్య

మునిక, హృదయపు దౌర్భల్యమును త్యజించు,

యుద్ధమునుచేయ నీవింక సిద్ధమగుము.

భావము.

నపుంసకుడిలాగ అధైర్యం పొందకు. ఇది నీకు పనికిరాదు, 

మనోదౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. నీవు శత్రుమర్దనుడవు 

కదా! యుద్ధం ప్రారంభించు.

అర్జున ఉవాచ:

అర్జునుఁడు ఇట్లు పలికెను.

శ్లో.  కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |

ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన || 4

తే.గీ. మహిత మధుసూదనా!నేను మహితులయిన

ద్రోణ భీష్మాది యోధులతోరణమున

యుద్ధమెట్టులచేయుదు నుజ్జగించి

పెద్దలయెడగౌరవమును? వద్దువద్దు.

భావము.

అర్జునుడు : మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను 

బాణాలతో నేనెలా కొట్టగలను? 

జైహింద్.

తం తథా కృపయావిష్ట..2 - 1..//..కుతస్త్వాకశ్మలమిదం..2 - 2..//..సాంఖ్యయోగము.

0 comments

 జైశ్రీరామ్. 

ఓం నమో భగవతే వాసుదేవాయ.

శ్రీమద్భగవద్గీత

రెండవ అధ్యాయం సాంఖ్యయోగం

సంజయ ఉవాచ:

సంజయుడుఅనుచున్నాడు.

శ్లో. తం తథా కృపయావిష్ట మశ్రుపూ ర్ణాకులేక్షణమ్ |

విషీదం త మిదం వాక్య మువాచ మధుసూదనః || 1

తే.గీ.  కలతఁ జెందుచు కన్నీరు కార్చుచున్న

యర్జునుని జూచి శ్రీకృష్ణుఁడనియెనిట్లు. 

మానవాళికి మార్గంబు మహిత గతిని

జీవనము సాగ గీతను చెప్పఁ బూని.

భావము.

దయామయుడైన అర్జునుడు కన్నీరు కారుస్తుండగా 

శ్రీ కృష్ణపరమాత్మ ఇలా అన్నాడు.

శ్రీ భగవానువాచ:

శ్రీకృష్ణుఁడనుచుండెను.

శ్లో. కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |

అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున || 2 

తే.గీ.  ఆర్యధర్మ విరుద్ధంబు, ననుచితమగు

ఘోరమైనట్టి యపకీర్తి కోరుకొనుచు

నరక దుష్ప్రాప్తిహేతువౌ దురిత బుద్ధి

పొడమె నీకెటు లర్జునా? మూర్ఖుఁడవొకొ? 

భావము.

అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధమూ, అపకీర్తి 

దాయకమూ, నరకప్రాప్తి హేతువూ అయిన ఈ పాడుబుద్ధి నీ కెందుకు పుట్టింది? 

జైహింద్.

యది మామప్రతీకార.. ||1-46||..//..ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే.. ||1-47||..//. అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్. 

శ్లో.  యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |

ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||1-46||

తే.గీ.  కన  ప్రతీకార బాహ్యునై కౌరవులను

చంపనెంచక శస్త్రముల్ చయ్యనవిడి

యుండ  నన్ గౌరవుంల్ సంపిన నది

మేలె నాకెంచగాఁ దలుప, నీల దేహ!

భావము.

ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి 

కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు 

మేలే  జరుగుతుంది.

సఞ్జయ ఉవాచ |

సంజయుఁడు ఇట్లు పలికెను.

శ్లో.  ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే రథోపస్థ ఉపావిశత్ |

విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||1-47||

కందపద్య గర్భ తేటగీతి. 

అని పలికి యర్జునుండట మనమున విల

పించుచు ఖిల మానసుడయి, భీతిని హరి

నుడువులు రథమును విన కను దిగి

యమ్ములు నిక విల్లు విడిచె, హా యనుచును.

తేటగీతిలో ఉన్న కందపద్యము.. 

అని పలికి యర్జునుం డట 

మనమున విలపించుచు ఖిల మానసుడయి, భీ

తిని హరి నుడువులు రథమును 

వినకను దిగి, యమ్ములు నిక విల్లు విడిచె, హా!

భావము. 

సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో 

నిండి యున్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా

ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు..

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

అర్జునవిషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః ||1|

జైహింద్ 

ఉత్సన్నకులధర్మాణాం.. ||1-44||..//..అహో బత మహత్పాపం.. ||1-45||..//..అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |

నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||1-44||

కం.  కులధర్మమువీడిన లో

కులు నరకము పొంది మిగుల కుములుదురటగా

కలకాలము,, వింటినటుల,

జలజాతేక్షణ! ముకుంద! సజ్జన పూజ్యా!

భావము.

జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం 

నరక వాసులౌతారని విన్నాము. 

శ్లో.  అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |

యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||1-45||

ఆ.వె.  అకట! రాజ్య సుఖమునాశించి యిప్పుడు

స్వజనులను వధింప నిజముగానె

సిద్ధపడితిమికద, ఛీయెంత పాపంబు

చేయఁ బూనితిమిగ, శ్రీముకుంద!

భావము.

అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడానికి సిద్ధమైన 

మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము.

జైహింద్ 


సఙ్కరో నరకాయైవ.. ||1-42||..//..,దోషైరేతైః కులఘ్నానాం.. ||1-43||..//..అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య |

పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః ||1-42||

తే.గీ. వర్ణ సాంకర్యమగుటచే వర్ణమునకు,

కులవినాశన మూలమౌ కారకులకును

నరకమే గతి, పితరులి నరకమొందు

దురుగపిండోదకవిహీనులౌదురు కన.

భావము.

సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి.

వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.

శ్లో.  దోషైరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః |

ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||1-43||

తే.గీ. వర్ణ సంకర హేతువౌవారిదోష

మునను శాశ్వత కుల ధర్మ ములు నశించు,

జాతి ధర్మంబులు నశించు, ఖ్యాతి చెడును,

దుస్స్థితుల నుండి కాపాడు తోయజాక్ష!

భావము.

వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల దోషాల వలన 

శాశ్వతమైన  జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి. 

జైహింద్ 

4, జనవరి 2022, మంగళవారం

కులక్షయే ప్రణశ్యన్తి.. ||1-40||...//..అధర్మాభిభవాత్కృష్ణ.. ||1-41||..//. అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |

ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోऽభిభవత్యుత ||1-40||

తే.గీ.  కుల వినాశనము వలనకూలిపోవు

మన సనాతన ధర్మము,మహినధర్మ

మున నడుతురుగ పాపులై మన కులజులు

చింతఁ జేయుము నీవును శ్రీకరుండ!

భావము.                                                                                                 

కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది

ధర్మం నశించినపుడు యావత్కులంఅధర్మం వైపు తిరుగుతుంది.

శ్లో.  అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః |

స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసఙ్కరః ||1-41||

తే.గీ.  వ్యాప్తమగు నధర్మముననే యాడువారు

చెడుదు రద్దానిచేతను చెడును కులము.

వర్ణ సంకరమేర్పడు, వసుధపైన

నీవు చింతింపుమో కృష్ణ! ధీవరేణ్య!,

భావము. 

కృష్ణాఅధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు

కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది.

జైహింద్