గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 70వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్

70. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః.

అంబురుహ వృత్త గర్భ సీసము.

శ్రీ నరసింహ! వసించు మనంబున - శ్రీరమా సతితోడుగా రమేశ!

ప్రాణము కన్నను భక్తియె మేలని - రాజితానన! నేర్పరా మహాత్మ!

జ్ఞానముఁ గొల్పుచుఁ గాంచఁగ నిమ్మిఁక - కామితార్థద! నిన్నిఁకన్ బ్రకాశ!

నేననినీవనినేఁ గన నేరను - నిర్మలాత్ముఁడఁ! గొల్వనీ నృసింహ!.

గీ. అంబురుహనేత్ర! కన్పించుమద్భుతముగ. - *సర్వసిద్ధిప్రదాయకా*! శక్తినిమ్ము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

70 సీస గర్భస్థ అంబురుహ వృత్తము. (       .. యతి 13)

శ్రీ నరసింహ వసించు మనంబున శ్రీరమా సతితోడుగా!

ప్రాణము కన్నను భక్తియె మేలని రాజితానన నేర్పరా!

జ్ఞానముఁ గొల్పుచుఁ గాంచఁగ నిమ్మిఁక కామితార్థద నిన్నిఁకన్.

నేననినీవనినేఁ గన నేరను నిర్మలాత్ముఁడఁ! గొల్వనీ.  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! రమేశా! రమా సతితో కలిసి నా మనసులో నివసింపుము.

ప్రాణముకన్నా భక్తియే గొప్పదని నేర్పుము. మాకు జ్ఞానము ప్రసాదించి నిన్ను చూడఁ జేయుము. తరతమభేదములతో

చూడను నేను అట్టి నన్ను గ్రహించుము. అంబురుహ నేత్రా! కనిపించుము. సర్వ శక్తిప్రదాయకా! నాకు శక్తినిమ్ము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.