జైశ్రీరామ్
69. ఓం సర్వజ్ఞాయ నమః
ఇందువదన వృత్త గర్భ సీసము.
పూజ్యుఁడా! వర దైవముఁగ నిన్ గొలుచు దాసుఁ - డనయా! దయాపర మనమున నిలు.
పూజ్యతన్ వర భావమున నిన్ నిలిపి భక్తిఁ - గొలుతున్., పరాత్పర! కూర్మిఁ గనుమ..
నిగమవేద్యా! దేవుఁడుగ భక్తులకు దీప్తి - నిడుచున్, బ్రభన్ జూపు దీవె దేవ!
లక్ష్యంబుతో జీవులను కావుమయ చిత్త - విభవా! మహాదేవ! విశ్వనాథ!
గీ. ఇందువదన! నీ భక్తుల ముందు నిలుము. - జాలమేలయ *సర్వజ్ఞ*! మేలుఁ గొలుప.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
69వ సీస గర్భస్థ ఇందువదన వృత్తము. (భ జ స న గ .. యతి 9)
దైవముఁగ నిన్ గొలుచు దాసుఁడనయా.
భావమున నిన్ నిలిపి భక్తిఁ గొలుతున్,
దేవుఁడుగ భక్తులకు దీప్తినిడుచున్,
జీవులను కావుమయ చిత్త విభవా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ పూజ్యుఁడా! నిన్ను శ్రేష్టమయిన దైవముగా కొలిచు
దాసుఁడను నేను. ఓ దయాపరా! నా మనసులో నిలుము. నా భావములో నిన్ను పూజ్యముగా నిలిపి, భక్తితోఁ గొలుతును.
నన్ను ప్రేమతో చూడుము. ఓ నిగమవేద్యా! దైవముగా నీవు భక్తులకు ప్రకాశము కొలుపుచు, నీ ప్రభను చాటుకొందువు.
జీవులను లక్ష్యముతో కాపాడుము. ఓ సర్వజ్ఞా! . నీవు నీ భక్తులముందు నిలుము. మేలు కలిగించుటకాలస్యమెందులకు?
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.