గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 54వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

54. ఓం అధోక్షజాయ నమః.

మందారదామ వృత్త గర్భ సీసము.

దేవాదిదేవా! ప్రదీప్త ప్రభావా! - మస్తే! నమస్తే, నమామి శ్రీశ!

భావింప నిన్నున్ శుభంబుల్ వరించున్. శు - భాకార! నిరతంబుఁ బ్రబలు మదిని.

నీవుండి మాలోన నేర్పించుమెల్లన్ బు - నీత్వత్వముం గొల్పు నీరజాక్ష!

నీవారలం గాచు నీకున్ శుభంబుల్ - దా మంగళంబులుదారచరిత!

గీ. నన్నుఁ గాంచి *యధోక్షజా*! నయము నిమ్ము, - మహిత మందారదామస్థ మంగళాంగ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

54 సీస గర్భస్థ మందారధామ వృత్తము. ( గగ .. యతి 7)

దేవాదిదేవా! ప్రదీప్త ప్రభావా! - భావింప నిన్నున్ శుభంబుల్ వరించున్.

నీవుండి మాలోన నేర్పించుమెల్లన్, - నీవారలం గాచు నీకున్ శుభంబుల్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దేవాది దేవా! ప్రదీప్త ప్రభావా! శ్రీశా! నీకు

నమస్కారము.నిన్ను మా మనసులందు భావించినంతనే మమ్ము శుభములు వరించును. శుభాకారా! మా మదులందు

నీవు ప్రబలుము.పవిత్రతను గొలిపెడి నీరజాక్షా! నీవు మాలో ఉండి అన్నియు నేర్పించుము. ఉదార చరితా! నీవారైన

భక్తులను కాపాడెడి నీకెల్లప్పుడూ మంగళములు కలుగుగాక. మహనీయ మందార దామవృత్తపద్యమునగల

మంగళాంగా! అధోక్షజా! నన్ను నీవు చూచి నయమును ప్రసాదించుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.