జైశ్రీరామ్.
61. ఓం భవ్యాయ నమః.
గీతాలంబన వృత్త గర్భ సీసము.
రాజిత పాద! నీరేజదళేక్షణ! - నీ కృపచేఁ జిక్కు నిర్మల గతి.
రాజీవముగను చేరన్ నిను మాకగు - చిన్మయుఁడా! మదిన్ చేర్చుకొమ్ము.
చిత్త విభాస! ధీరోత్తమ! నీ దరి - తేజము తోడుతన్ ధ్యేయమలర
రాగిల్లు మదిని చేరంగనె పోవును - చింతలిలన్. గొప్ప శాంతి కలుగు..
గీ. సత్యమైనది నీ *భవ్య* సన్నిధి కద! - దానిఁ జూపక నీవుంట తప్పు కాద?
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
61వ సీస గర్భస్థ గీతాలంబన వృత్తము. (త జ జ వ .. యతి 8)
నీరేజదళేక్షణ! నీ కృపచే
చేరన్ నిను మాకగు చిన్మయుఁడా!
ధీరోత్తమ! నీ దరి తేజముతో
చేరంగనె పోవును చింతలిలన్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ప్రకాశవంతమైన పాదపద్మములు కలవాఁడా! తామర
రేకులవంటి కన్నులు కలవాఁడా! నీ కృప చేతనే నిర్మలమైన గతి మాకు లభించును. ఓ చిన్మయుఁడా! ప్రకాశవంతముగా
నిన్ను చేరుట మాకు సాధ్యమగును. మమ్ము నీ హృదయమున చేర్చుకొనుము. హృదయమున ప్రకాశించువాఁడా! ఓ
ధీరోత్తముఁడా! అనురాగ పూర్ణమైన మనసుతో మంచిధ్యేయము కలిగి నీ సమీపమునకు చేరినచో వెంటనే భువిపై మా
చింతలన్నియు తొలగును. గొప్ప శాంతి కలుగును. నీ
సన్నిధియే సత్యము.ఆ సన్నిధిని నీవు మాకు చూపకుండుట తప్పే
కదా..!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.