గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2014, శనివారం

న సా సభా యత్ర న సంతి వృద్ధా. మేలిమి బంగారం మన సంస్కృతి, 212

1 comments

  జైశ్రీరామ్.
శ్లో. న సా సభా యత్ర న సంతి వృద్ధా, న తే వృద్ధా యే న వదంతి ధర్మం 
నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి , న తత్ సత్యం యత్ఛలేనాభ్యుపేతమ్. 

గీ. సభను పెద్దలు లేనిచో సభ యగునికొ?. 
సిద్ధ ధర్మంబు తెలుపమిన్ బెద్ద యగునె? 
ధర్మ మది సత్య దూరము ధర్మమగునె? 
నిత్య వంచన యుక్తము సత్యమగునె?
భావము. ఎక్కడ పెద్దలుండరో అది సభయేకాదు. ఎవరు ధర్మం చెప్పరో వారు పెద్దలే కారు. ఎక్కడ సత్యం ఉండదో అది ధర్మమే కాదు. ఏది వంచనతో కూడి ఉంటుందో అది సత్యమేకాదు.
జైహింద్.

30, మే 2014, శుక్రవారం

అహన్యస్తమయాంతాని, మేలిమి బంగారం మన సంస్కృతి, 211.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అహన్యస్తమయాంతాని, ఉదయాంతా చ శర్వరీ
సుఖస్యాంతం సదా దుఖం, దుఖస్యాంతం సదా సుఖమ్.

క. ఉదయం బస్తమయంబున 
నుదయంబున నస్తమయమునొందెడుచ్యుతి. స
న్మధుర సుఖాంతము దుఃఖము
వ్యధభరదుఃఖాంతము సుఖ మరయుఁడు నిజమున్.
భావము. పగలు– సూర్యాస్తమయంతో, రాత్రి – సూర్యోదయంతో అంతమౌతాయి. సుఖము పిదప ఎప్పుడూ దుఃఖము, దుఃఖము పిదప ఎప్పుడూ సుఖమును ప్రాప్తించుట తథ్యము.
జైహింద్.

29, మే 2014, గురువారం

శ్రీ వల్లభవఝల వారి పట్టికాబంధ గీతము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల వారి పట్టికాబంధ గీతాన్ని అవలోకించండి.
ఆర్యా! కవిగారూ! చాలా సంటోషమండి. అభినందనలు.
జైహింద్.

28, మే 2014, బుధవారం

శ్రీ వల్లభ కృత దర్పణ భంధము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి కృత దర్పణ బంధ గీతాన్ని తిలకించండి.
శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి గారికి ధన్యవాదములు.
జైహింద్.

27, మే 2014, మంగళవారం

నరత్వం దుర్లభం లోకే...మేలిమి బంగారం మన సంస్కృతి, 208.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. నరత్వం దుర్లభం లోకే , విద్యా తత్ర సుదుర్లభా 
శీలం చ దుర్లభం తత్ర వినయస్తత్ర సుదుర్లభః.

క. నర జన్మము దుర్లభమిల, 
వర విద్య సుదుర్లభంబు వర గుణ శీలం
బరయగ దుర్లభమందున
వర వినయము దుర్లభంబు వర్ధిల మనకున్.
భావము. లోకంలో మానవజన్మ లభించుటయే దుర్లభం. విద్య (జ్ఞానం) అబ్బటం మరింత దుర్లభం.మంచి నడవడిక , వినయం సిద్ధించటం ఇంకా దుర్లభం.
జైహింద్.

26, మే 2014, సోమవారం

షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా. మేలిమి బంగారం మన సంస్కృతి, 207.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా 
నిద్రా తంద్రీ భయం క్రోధమాలస్యం దీర్ఘసూత్రతా.
క. అతి నిద్రయు, అలసతయును,
చ్యుతి గొలిపెడి కోపము, భయ సోమరితనముల్,
క్షితి నాన్పుడు వీడగవలె
మతిమంతులు భూతిని గొను మతి గల్గినచో.
భావము. ఐశ్వర్యం కోరే వ్యక్తి – అతినిద్ర , అలసత, భయం, కోపం, సోమరితనం, సాగతీత ధోరణి అనే ఆరు దోషాలను వదలుకోవాలి.
జైహింద్.

25, మే 2014, ఆదివారం

వర్దిపర్తి కోనకవి రచించిన ప్రశ్నోత్తర గూఢ చిత్ర రచన.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!.వర్దిపర్తి కోనకవి రచించిన ప్రశ్నోత్తర గూఢ చిత్ర రచన తిలకించండి.
వర్దిపర్తి కొనమరాట్ కవీంద్రుఁడిది సర్వసిద్ది గ్రామం.నెల్లూరు నెరజాణల కొంటె ప్రశ్నలకు తుంటరి సమాధానం చెప్పిన ఉద్దనులు ౧౯ వ శతాబ్దంనాటి సర్వసిద్ధి వాస్తవ్యులు. కవీంద్రుని సమాధానాలకి అచ్చెరువొందిన ఆ కాన్తామనులు ఒక మెట్టు దిగి, " సర్వసిద్ధి సరసులకు నెల్లూరు నేరజాణలు దాసోహం " అనిరి. అంతటి మహాకవి అంటే కాదు మహిమాన్విత కవి కూడా. ఈ కవి వేంకటేశ్వరోపాఖ్యానం, మహాలక్ష్మీ పరిణయం, మున్నగు గ్రంధాలు రచించాడు. ఇతని పెక్కు చాటువులు ఇప్పటికీ ఆ గ్రామంలోప్రజల నాల్కలపై నాట్యమాడుచుండుట విశేషం.
ఇతడు పెక్కు రచనలు చేసియుండెను. వీరు తమ రచనలలో చిత్ర కవితలు కూడా వెలయించి యుండిరి.

ఇతడు రచించిన ప్రశ్నోత్తర గూఢ చిత్ర రచనకు ఉదాహరణముగా ఇతడు రచించిన శ్రీ మహాలక్ష్మీ పరిణయం కావ్యం లోంచి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొందాం.
క్షీర సముద్రుడు తన కుమార్తె వివాహానికి రమ్మని తనకు కాబోయే అల్లుడయిన
శ్రీమహావిష్ణువుకి ఆహ్వానం పంపుతూ శుభలేఖలో ఇలా వ్రాస్తాడు.
సీ:-
త్స్య స్వరూపక! నుజ కంఠీరవ! పురుషోత్తమ! త్రిశూల ధర ధనుర్వి
భంగ! కాకాసుర భంజన! విశ్వాత్మ! వామన! రి! మురవైరి! రక
శిక్ష! కుచేల సమ్రక్షక! ర్వజ్ఞ ! రిహయనుత! క్ర హస్త! ఘుకు
లాధిప! ర్వంసహాధీశ! మేఘ సన్నిభ గాత్ర! పనాబ్జ నేత్ర! మునిజ
గీ:-నాభి వందిత! గాధేయ యజ్ఞ పాల! రావణాంతక! శ్రీ యాది దేవ! యనుచు
బ్రతి పద ప్రథమాక్షర పంక్తి సంజ్ఞ తెలియగా వ్రాసె.శుభ లేఖ జలధి విభుడు.
తాత్పర్యం సుబోధకమేగదా!
మమ పుత్రికా వివాహమునకు సహచర సమేతముగా రా ! శ్రీ యాది దేవ!  "
ఎంత చమత్కారంగా శుభలేఖ వ్రాయించాడో కవి చూచారా! ఇతని కావ్యాలన్నీకూడా చమత్కారాల సమాహారంగా చెప్పవచ్చు. సమయం చిక్కినప్పుడు మరో పద్యం గ్రహిచుదాం.
నమస్తే.
జైహింద్.

24, మే 2014, శనివారం

అకాలే కృత్యమారబ్ధం కర్తుర్నార్థాయ కల్ప్యతే. మేలిమి బంగారం మన సంస్కృతి, 206.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అకాలే కృత్యమారబ్ధం కర్తుర్నార్థాయ కల్ప్యతే 
తదేవ కాల ఆరబ్ధం మహతేర్థాయ కల్ప్యతే.

క. సమయము గని పనులు మనము
సముచితముగ సలుప సుఫల చయము కన నగున్
సమయము విడి సలుపు పనులు
సముచిత ఫలమొసగవు కద! సమయము కననౌన్.
భావము. సమయంకాని సమయంలో ప్రారంభించిన పని కర్తకు ప్రయోజనాన్ని కల్పించదు. అదే పనిని సరియైన కాలంలో ప్రారంభిస్తే అతనికి గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
జైహింద్.

విద్యాతపోభ్యామాత్మాచ బుద్ధిః ఙ్ఞానేన శుద్ధ్యంతి. మేలిమి బంగారం మన సంస్కృతి, 205.

0 comments

జైశ్రీరామ్.
శ్లో|| అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి మనస్సత్వేన శుద్ధ్యతి|
విద్యాతపోభ్యామాత్మాచ బుద్ధిః ఙ్ఞానేన శుద్ధ్యంతి|| 
గీ. నీటి చేతను దేహము, నెమ్మి మనసు
సత్వ గుణమున శుద్ధి యౌన్ సత్యమిదియె.
తపము, విద్యల నాత్మయు, తనరు బుద్ధి
జ్ఞానమున శుద్ధి పొందును సరసులార!
భావము. నీటిచేత అంగములు, శరీరము శుద్ధినొందును. సత్వగుణముతో మనస్సు శుద్ధిని పొందును.  విద్యచేత, తపస్సు చేత ఆత్మ శుద్ధి కలుగును. ఙ్ఞానముచేత బుద్ధి శుద్ధిని పొందును. 
జైహింద్.

23, మే 2014, శుక్రవారం

పాత్యతే తు క్షణేనాధస్తథాత్మా గుణదోషయోః.మేలిమి బంగారం మన సంస్కృతి, 204.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతా యథా 
పాత్యతే తు క్షణేనాధస్తథాత్మా గుణదోషయోః.
గీ. కొండ పైనుండి పడిపోవు బండ త్రోయ, 
కొండపైకది చేర్చుట కుదురు నెటుల? 
మంచి మాయును క్షణములో మలిన గతిని. 
మంచి గడియ్తింప కష్టము. మంచి కనుఁడు.
భావము. ఒక పెద్ద శిలను పర్వతాగ్రం మీదికి చేర్చటానికి ఎంతో గొప్ప ప్రయత్నం చేయాలి. దానినే నేలమీదికి జార్చటానికి ఒక్క తోపు తోస్తే , క్షణం చాలు. అలాగే సద్గుణాలు సాధించటానికి ఎంతో సాధన కావాలి. పతితుడు కావటానికి ఏ శ్రమా అవసరంలేదు !
జైహింద్.

22, మే 2014, గురువారం

కురు పుణ్యమహోరాత్రం, మేలిమి బంగారం మన సంస్కృతి 203.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. త్యజ దుర్జన సంసర్గం,భజ సాధు సమాగమం
కురు పుణ్యమహోరాత్రం, స్మరనిత్యమనిత్యతామ్.
క. వీడుము దుష్టుల సంగతి.
వేడుము సజ్జనుల తోడు.వివిధ సుకర్మల్ 
వీడక చేయుము సతతము.
నీడగ మృతి కలదటంచు నిరతము కనుమా!
భావము. చెడ్డవారితో సాంగత్యం వదలాలి.సజ్జనులతో స్నేహాన్ని కాంక్షించాలి. రాత్రింబవళ్ళు పుణ్యకార్యాలు చేయాలి. అనునిత్యమూ అనిత్యతను గుర్తు చేసుకోవాలి.
జైహింద్.

21, మే 2014, బుధవారం

సర్వేంద్రియోపశాంత్యా చ , తుష్యత్యాశు జనార్దనఃమేలిమి బంగారం మన సంస్కృతి, 202.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. దయయా సర్వభూతేషు , సంతుష్ట్యా యేనకేన వా 
సర్వేంద్రియోపశాంత్యా చ , తుష్యత్యాశు జనార్దనః

గీ. సకలజీవులఁ దయఁజూచి సంతసముగ 
తా జితేంద్రియుండై యుండి దర్పము విడి
జీవనము సేయు నెవ్వండు వానితోడ
దైవముండును నిరతము.దేవుఁడతఁడు.
భావము.అన్ని జీవులయందు దయ కలిగి ఉండటం, ఉన్న దానితో సంతృప్తి చెందటం, ఇంద్రియ నిగ్రహం అనే సుగుణాలు కలవారికి దైవం వెంటనే ప్రసన్నుడౌతాడు.
జైహింద్.

20, మే 2014, మంగళవారం

రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో! మేలిమి బంగారం మన సంస్కృతి, 201.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద?
రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో!
ఆ. సాధ్యమవని దానిసాధించెదవు నీవు.
సాధ్యమవనిదేది సరస! నీకు.
రామ దూత! కృపను రాజిల్లుదువునీవు.
నాకు జయము కొలిపి నన్నుఁ గనుమ.
భావము. అసాధ్యాన్ని సుసాధ్యం చేయ సమర్థుఁడవైన ఓ శ్రీమ దూతవైన ఓ హనుమంతుఁడా! నీకు అసాధ్యమేమున్నది చెప్పుము. నీవు కృపా సముద్రుఁడవు. నా పనులన్నిటినీ నాకు సుసాధ్యము చేయుమని ప్రార్థించుచున్నాను.
జైహింద్.

19, మే 2014, సోమవారం

వసంత కాలే సంప్రాప్తే , కాకః కాకః, పికః పికః మేలిమి బంగారం మన సంస్కృతి 200.

3 comments

జైశ్రీరామ్.
శ్లో.కాకః కృష్ణః , పికః కృష్ణః కో భేదః పిక కాకయోః ?
వసంత కాలే సంప్రాప్తే , కాకః కాకః, పికః పికః 

గీ. కాక పికములు నల్లగా కానిపించు. 
తరుణ వాసంత మున భేదమరయ వచ్చు. 
మౌన ముద్రలో నందరూ జ్ఞాన ఖనులె. 
వినుత వాగ్ఝరిఁ చూపించు ఘనుడెవండొ. 
భావము. కాకీ నల్లగా ఉంటుంది, కోకిలా నల్లగా ఉంటుంది. వాటికి రంగులో భేదం ఏముంది ? వసంత ఋతువు వస్తే మాత్రం కాకి కాకియే, కోకిల కోకిలయే.
జైహింద్

18, మే 2014, ఆదివారం

యో న్యాయమన్యథా బ్రూతే , స యాతి నరకం నరః.మేలిమి బంగారం మన సంస్కృతి 199.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. మానాద్వా యది వా లోభాత్ క్రోధాద్వా యది వా భయాత్ 
యో న్యాయమన్యథా బ్రూతే , స యాతి నరకం నరః. 

గీ. హేతు వేదైన కావచ్చు ఖ్యాతమైన
న్యాయమును వీడి తీర్పరి నడచెనేని
రౌరవాది నరకములఁ జేరునతఁడు.
జన్మజన్మలకీ పాప చయము విడదు.
భావము. దురభిమానం వల్లగానీ , లోభం వల్లగానీ , కోపంతోనో, భయంతోనో గానీ న్యాయాన్ని దాచిపెట్టి మరో విధంగా తీర్పుచెప్పిన మనిషి నరకానికి పోతాడు.
జైహింద్.

17, మే 2014, శనివారం

యావత్ తెలంగాణ, సీమాంధ్ర ప్రజానీకానికి, ప్రజా ప్రతినిథులకు నా అభినందనలు.

0 comments

జైశ్రీరామ్.
యావత్ తెలంగాణ, సీమాంధ్ర ప్రజలారా! మీకు నా అభినందనలు.
మీరు ఓటు ద్వారా మీ మీ తరపున ప్రభుత్వము నడిపించ వలసిన ప్రజా ప్రతినిథుల నెన్నుకొనుటలో మీరంతా కృతకృత్యులయ్యారు. అందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు.
మనం ఎన్నుకొన్న ప్రతినిథులు స్వార్థ రహితంగా ఉంటూ, తమ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తించాలని, మన జీవితాలు సుఖమయం కావాలని మనసారా కోరుకొంటున్నాను.
తెలంగాణా ప్రాంతంలో ఎన్నికయిన టీఆరెస్ ప్రజాప్రతినిథులైనా, సీమాంధ్రలో ఎన్నికైన తే.దే.పా. ప్రతినిథులైనా  క్రమశిక్షణతో , నిబద్ధతతో, నిస్వార్థంతో, నిరుపమానమైన దీక్షా బద్ధులై ప్రజాసేవకు పరిపూర్ణంగా అంకితమౌతూ, మన తెలుగు గడ్డపై అవినీతికి నిలువనీడ లేకుండా చేస్తూ, మనకు కనీస జీవనానందాన్నందించాలని మనసారా కోరుకొంటున్నాను.
తెలంగాణాలో ఎంపికైన టీఆరెస్స్ రథ సారథి శ్రీ కేసీఆర్ గారికి, వారి సహచరులైన ప్రజా ప్రతినిథులకు,సీమాంధ్రలో పరిపాలనా పగ్గాలు చేబట్టబోతున్న తె.దే.పా. ప్రతినిథియైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి సహచరులైన ప్రజా ప్రతినిథులకు నా హృదయ పూర్వకమైన అభినందనలు తెలియజేసుకొంటున్నాను.
అయ్యలారా! దయచేసి మీరు మిమ్ములనెన్నుకొనిన ప్రజల ఓటు విలువను తగ్గించకండి. మీపై కొండంత ఆశపెంచుకొని మీకు ఓటు వేసిన పెఅజానీకంయొక్క ఆశలు తీర్చడానికి మనసారా ప్రయత్నించండి.
మీరంతా పరిపూర్ణమైన అత్యద్భుతమైన సంసేవనా దృక్పథంతో, ప్రజల జయజయ ధ్వానాలను మీరెక్కడికి వెళ్ళినా అందుకోవాలని, ఎన్ని పర్యాయములైనా తమిళనాడులో శ్రీమతి జయలలిత వలె మీరు కూడా ఎప్పుడూ ప్రజలు మిమ్ములనే ఎన్నుకొనే విధంగా వారి మనౌలను మీరు దోచుకోవాలని కోరుకొంటున్నాను. శుభమస్తు
మీ సహచరుడైన తెలుగు బిడ్డ
చింతా రామ కృష్ణా రావు.
జై భారత్.

16 వ లోక్ సభ ఏర్పడుతున్న సందర్భముగా యావత్ భారత జాతికీ అభినందనలు.

0 comments

జైశ్రీరామ్.
మన భారత దేశమున16 వ లోక్ సభ ఏర్పడుతున్న సందర్భముగా  యావత్ భారత జాతికీ అభినందనలు.
పరమ శాంత స్వభావులైన మన భారతీయులు ముప్పదేండ్లుగా తమ తల వ్రాతలు మార్చి తమకు కనీస జీవన సౌందర్యాన్నందించగల ప్రతినిధులుగా భావించి తమ ప్రతినిధులను ఎంపిక చేసి పంపి, చివరకు  తమ ఆశలు నిరాశే కావడంతో తమ భవిత బాగుండడం కొఱకు పునరాలోచించుకొని మార్పు చేసి తమ తీర్పునిచ్చారు.
మన భారత జాతి ఇప్పుడు భారత జాతిని పూల బాటలో నడిపించ వలసిన బృహత్తర బాధ్యతను భారతీయ జనతా పార్టీ తలపై పెట్టింది.
నాకు నమ్మకముంది. శ్రీమాన్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడబోతున్న పదునారవ లోక్ సభ తప్పక ఈ పంచవర్ష ప్రళాళికలో  భారతీయుల ఆశలను నెరవేరుస్తుంది.
ఎంతో సంయమనం పాటించుతూ,  సమయం వచ్చినప్పుడు నేర్పుగా సత్తా చాటుతూ, తాము వేస్తున్న ఓటులో తమ కలలను నిక్షిప్తం చేస్తూ పాలకులను నిర్దేశిస్తుంది.
ఇప్పుడు మాత్రం ఓటరు సామాన్యుడు కాడు మహా మేధావి అని తమ ఓటు ద్వారా నిరూపిస్తాడని నిరూపితమైంది.
ఈ నూతన ప్రభుత్వాన్ని భరత మాత సేవకై నిర్దేశించిన మన జాతి యావత్తుకు నేను హృదయ పూర్వకముగా అభినందన పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
శ్రీమాన్ నరేంద్ర మోడీ అతి సామాన్య కుటుంబీకుఁడు, తనకష్టంతో, మేధా సంపత్తితో, నిస్వార్థంతో, అంచలంచలుగా ఎదిగి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండి, భారత జాతి అభ్యున్నతి సాధన కొఱకు తన సమయాన్ని, మేధా సంపత్తిని వెచ్చించడానికి సంసిద్ధుడైనందుననే జాతి యావత్తు వారికి పట్టం కట్టింది.
ఈ మహనీయునికి అనుచరులైన ప్రజాప్రతినిధులు తమ పరిపూర్ణమైన హృదయ పూర్వకమైన సహకారం అందిస్తూ,  మోడీ శరీర భాగాలవలె ఉండి, భరతమాత కడగండ్లు తీర్చడంలో తమ వంతు కృషిని తాము చేస్తారని కొండంత ఆశతో జాతి ఎదురు చూస్తోంది.
ఎన్నికయిన ప్రజా ప్రతినిథులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.
ప్రజా ప్రతినిధులారా! మీ మేధస్సు నుపయోగించకపోయినా పరవాలేదు. మన మోడీగారి అడుగుజాడలలో మీరు నడవ గలిగితే చాలు. ఈ పేద ప్రజా ప్రతినిధియైన మన నరేంద్ర మోడీ ప్రజల ఆశలను నెరవేర్చ గలడు. కాన మీరు వారికి సహకరించడం ద్వారా మీకు ప్రజలు అందచేసిన విజయాన్ని సార్థకం చేసుకోండి.
దయ చేసి ఎటువంటి స్వార్థానికి లోను కావద్దు.
అందరికీ నా అభినందన పూర్వక నమస్సులు.
ఇట్లు
మీ తోటి భారతీయుఁడు.
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.

వాసః ప్రధానం ఖలు యోగ్యతాయాః. మేలిమి బంగారం మన సంస్కృతి198.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. కిం వాససైవం న విచారణీయం , 
వాసః ప్రధానం ఖలు యోగ్యతాయాః
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం , 
దిగంబరం వీక్ష్య విషం సముద్రః ! 
గీ. వలువయే పెంచు మనిషికి విలువనిలను. 
పీత వస్త్రున కిచ్చె విఖ్యాత రమను, 
సాంబునకునిచ్చె విషము దిగంబరుఁడని
రత్న గర్భుఁడు. తెలియుడీ క్రమము మీరు.
భావము. వస్త్రధారణలో ఏముందిలే - అని తేలికగా అనుకోకూడదు. అదియే యోగ్యతకు ప్రధానం. సముద్రుడు - పీతాంబరం కట్టుకొన్న విష్ణువుకు తన కుమార్తెను ఇచ్చాడు! దిగంబరుడైన శివునికి విషం ఇచ్చాడు ! (కొందరు ఆడంబరానికే ప్రాధాన్యం ఇస్తారని చమత్కారం)
జైహింద్.

16, మే 2014, శుక్రవారం

న హి పూరయితుం శక్యః లోభః మేలిమి బంగారం మన సంస్కృతి.197.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. న హి పూరయితుం శక్యః లోభః ప్రీత్యా కథంచన 
నిత్యగంభీర తోయాభిరాపగాభిరివాంబుధిః.

గీ. వెలయు  నదులెల్ల సతతము  కలియుచుండు
జలధి నైనను సంతృప్తి కలుగనేర
దున్న దంతయు లోభికి నొసగి చూడు
తృప్తి చెందడా యధముఁడు తెలియుఁడయ్య.
భావము. నిరంతరంగా నదుల జలాలు తనలోనికే ప్రవహిస్తున్నా , సముద్రానికి తృప్తి కలుగనట్లే , ఇష్టమైన దానినిచ్చి లోభిని సంతృప్తి పరచటం ఎవరికీ సాధ్యం కాదు. 
జైహింద్

15, మే 2014, గురువారం

ఫలం భాగ్యానుసారతః. మేలిమి బంగారం మన సంస్కృతి196.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. మహతామాశ్రయః పుంసాం , ఫలం భాగ్యానుసారతః
ఈశస్య కంఠ లగ్నో పి వాసుకిః వాయుభక్షకః.
గీ. ఘనుల యాశ్రయమున్నను కలుగ బోదు
లేని యోగము. మనకున్నదేను కలుగు.
శివుని కంఠంబు నుండియు చిత్రముగను
గాలినే తిను వాసుకి. కలిగె నదియె.
భావము. ఎంత గొప్పవారిని ఆశ్రయించుకొని ఉన్నా, ఫలితం మాత్రం అదృష్టానుసారమే దక్కుతుంది. ఐశ్వర్యకారకుడైన శివుని కంఠాన్ని కౌగిలించుకొని ఉన్నా వాసుకి కేవలం గాలినే భక్షిస్తున్నాడు కదా.
జైహింద్.

14, మే 2014, బుధవారం

మాఘుని (శిశుపాల వధలోని) షడర చక్ర బంధము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఏడవ శతాబ్దమునందే మాఘ కవి తన శిశుపాల వధ కావ్యములో అనేక చిత్ర, గర్భ బంధ కవితలలో తనకు గల కవితా సామర్ధ్యమును కనబరిచాడు.అందు ౧౯ వ సర్గలో ౧౨౦వ శ్లోకంలో శార్దూలమును ఒక షడర చక్ర బంధంలో వ్రాశాడు. ఆ చక్ర బంధంలో మూడవ వలయంలో మాఘ కావ్య మిదమ్, అని కవి నామము, ఆరవ వలయంలో శిశుపాల వధః అని కావ్య నామము నామ గోపన చిత్రంగా వ్రాయబడ్డాయి.
నిర్మాణ క్రమము. ఒకదానిలో ఒకటి చొప్పున పది ఏక కేంద్ర గత వృత్తములను గీచి, ఆరు రేకులను సమాన రేఖలుగా గీచి, ఒక్కొక్క రేకులో నాభి స్థానంతో పాటు ౧౯ గడులేర్పడును కదా. శార్దూల వృత్తమును రేకుకొక్క పాదం చొప్పున ప్రదక్షిణ రీతిలో మూడు పాదాలు వ్రాసి, చక్ర నేమిగా ఉన్న వెలుపలి వృత్తంలో ౪వ పాదంవ్రాయాలి.
ప్రయత్నించండి. సాధించండి. అసాధ్యం కాదని నిరూపించండి.
జైహింద్.

13, మే 2014, మంగళవారం

మందోஉప్యమందతామేతి సంసర్గేణ విపశ్చితః. మేలిమి బంగారం మన సంస్కృతి195.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. మందోప్యమందతామేతి సంసర్గేణ విపశ్చితః 
పంకచ్ఛిదః ఫలస్యేవ నికషేణావిలం పయః .

గీ. అల్పుడధికునితో గూడ నధికుఁడగును.
ఘనుల సంసర్గమునకల్గు ఘన ఫలంబు.
మలిన జలబిందువైనను మంచిముత్య
మట్లు మెఱయును పద్మపత్రాంబువయిన.
భావము. అల్పుడైనా విద్వాంసులతో కలిసి ఉండటంతో అనల్పుడౌతాడు. కలుషిత జలబిందువైనా తామరాకుమీద పడిన కారణంగా ఒక మంచి ముత్యంలా తళతళలాడిపోతుందికదా!
జైహింద్.

12, మే 2014, సోమవారం

శ్రీవల్లభవఝల వారి ఉండేలు బంధ ఉత్పల మాల.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల వారి ఉండేలు బంధ ఉత్పల మాల వృత్తాన్ని తిలకించండి.
జైహింద్.

ఉండ విల్లు బంధ ఉత్పలమాల. రచన శ్రీవల్లభ.

0 comments


జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కృత ఉండవిల్లు బంధ ఉత్పలమాల తిలకించండి.
జైహింద్.

11, మే 2014, ఆదివారం

మమేతి బద్ధ్యతే జంతుః , న మమేతి విముచ్యతే.మేలిమి బంగారం మన సంస్కృతి194.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ద్వే పదే మోక్ష బంధస్య , మమేతి , న మమేతి చ
మమేతి బద్ధ్యతే జంతుః , న మమేతి విముచ్యతే.
                                        క. నాదిగ తలచిన బంధము. 
కాదిదినాదియనుకొనిన కలుగును మోక్షం
బేదిశుభం బనుకొందువొ
యాదారినినడువుమయ్య, యమలిన చరితా!  
భావము. ముక్తికి గానీ, బంధానికి గానీ రెండు పదాలు కారణమౌతున్నాయి. “మమ” (ఇది నాది) అనుకుంటే అది బంధం. “న మమ ” ( ఇది నాది కాదు) అనుకుంటే మోక్షం. 
జైహింద్.                                                    

అనులోమ విలోమ శరబంధ కందము. రచన. శ్రీవల్లభ

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కృత అనులోమ శరబంధ కందమును తిలకించండి.
జైహింద్.

10, మే 2014, శనివారం

ఆత్మానం నైవ జానంతి. మేలిమి బంగారం మన సంస్కృతి. 193.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. పఠంతి చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్యనేకశః
ఆత్మానం నైవ జానంతి దర్వీ పాక రసం యథా
.                                                          
గీ. వేదములు నేర్చి ధ్ర్మార్థ వేత్తయయ్యు
ఆత్మ సుజ్ఞాన హీనుడు వ్యర్థ జీవి.
వంట రుచి నెన్నగల్గునే వంట గరిటె?
ఆత్మ సుజ్ఞానపూర్ణులై యలర వలయు.
భావము. చతుర్వేదాలుఅనేక ధర్మశాస్త్రాలు చదివినా ఆత్మజ్ఞానం తెలియనివాడు - రుచిగల  వంటల్లోని గరిటె వంటివాడు.  (రుచిని , సారాన్ని గరిటె ఆస్వాదించలేదు కదా )
జైహింద్.

9, మే 2014, శుక్రవారం

దుర్లభం త్రయ మేతత్ దైవానుగ్రహ హేతుకమ్. మేలిమి బంగారం మన సంస్కృతి 192.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. దుర్లభం త్రయ మేతత్ దైవానుగ్రహ హేతుకమ్ 
మనుష్యత్వం , ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయః. 

క. దుర్లభమిల నరజన్మము.
దుర్లభమిల మోక్ష కాంక్ష. దొరకిన ఘనమే.
దుర్లభము సుజన సంగతి.
దుర్లభములు దైవగతిని దొరకును మనకున్.
భావము. మనుష్యజన్మ , మోక్షకాంక్ష , మహాత్ముల ఆశ్రయం అనే మూడూ దుర్లభమైనవి . అవి దైవానుగ్రహం వల్లనే లభిస్తాయి.
జైహింద్.

8, మే 2014, గురువారం

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి. మేలిమి బంగారం మన సంస్కృతి191.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం
ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివాంభో లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రమ్!
క. పులి వలె వృద్ధత పయిఁబడు
పలు రోగములావహించు. పగిలిన కుండన్
నిలువని నీరటులాయువు
తొలగును. మరి దుష్ట బుద్ధి తొలగదదేలో?
భావము. ముసలితనం ఆడపులిలా చూపుడు వ్రేలితో బెదిరిస్తోంది.శత్రువుల్లా రోగాలు దేహాన్ని  దెబ్బ తీస్తున్నాయిపగిలినకుండలోని నీళ్ళలా ఆయుర్దాయం తరిగిపోతోంది.ఐనప్పటికీ లోకం అహితకార్యాలు చేస్తూ ఉండటమే ఆశ్చర్యం!
జైహింద్.

7, మే 2014, బుధవారం

జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః మేలిమి బంగారం మన సంస్కృతి190.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః
 హేతుః సర్వ విద్యానాం ధర్మస్య  ధనస్య 
.
క. ఒక్కొక్క నీటి బిందువు
చక్కగ పడినంత కుండ చక్కగ నిండున్.
ఒక్కొక్క విషయమెఱిగిన
నిక్కమువిద్యాధనాళినిండునుమదిలో.
భావము. ఒక్కొక్క నీటిబొట్టు పడటం వల్ల క్రమంగా కుండ నిండుతుంది.అలాగే అన్ని విద్యలు ,  ధర్మము ,   ధనము కొద్దికొద్దిగా ఆర్జన చేస్తేసంపూర్ణమౌతాయి.
జైహింద్.

6, మే 2014, మంగళవారం

బకవత్ ధ్యాన మాచరేత్. మేలిమి బంగారం మన సంస్కృతి189.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. శుకవత్ భాషణం కుర్యాత్,బకవత్ ధ్యాన మాచరేత్
అజవత్ భోజనం కుర్యాత్గజవత్ స్నాన మాచరేత్.

క. చిలుక వలె పలుకు ముద్దుగ. 
నిలకడగా కొంగవోలె నిలుపుము ధ్యానం
బల మేక వలె భుజింపుము.
సలుపుము గజమట్లు నీట స్నానము హితమౌన్.
భావము. చిలుకలా మధురంగా మాట్లాడాలి. కొంగలా నిశ్చలంగా ధ్యానం చేయాలి,ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మనకు లభించిన సాత్విక ఆహారాన్ని మేకలా భోజనం చేయాలి. ఏనుగులా ఆనందంగా ఎక్కువసేపు స్నానం చేయాలి.
జైహింద్.

5, మే 2014, సోమవారం

చక్ర బంధ శార్దూలము. శ్రీ కొక్కొండ వేంకట రత్నం కవికృతము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 

                                          శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులు (1842-1915) గారు                                 తన బిల్వేశ్వరీయము కావ్యములో అనేక చిత్ర బంధ గర్భ కవితా వైదుష్యం ప్రదర్శించారు                  అందులో గల ఒక చక్ర బంధం మీరు చూస్తారని మీ ముందుంచుతున్నాను.                     

ఇందులో కేంద్రమునుండి మూడవ వలయములో (గులాబి రంగు) కవిరత్నకృతి అనియుకేంద్రమునుండి ఆరవ వలయములో (కాషాయపు రంగు) బిల్వేశ్వరీయము అనే కావ్యనామమును గమనించవచ్చును. 
జైహింద్

4, మే 2014, ఆదివారం

ధేనుర్నో జననీ ప్రియా. మేలిమి బంగారం మన సంస్కృతి188.

1 comments

జైశ్రీరామ్.
శ్ల్లో. తృణాం ఖాదతి కేదారే , జలం పిబతి పల్వలే 
దుగ్ధం యచ్ఛతి లోకేభ్యో ధేనుర్నో జననీ ప్రియా.

క. పొలమున మేతను మేయుచు
చలములజలములను త్రావి, చక్కగ  క్షీరం
బిలజనులకిచ్చు ధేనువు
తలచగమన తల్లి నిజము దయఁ గాచుడయా!
భావము. పొలాలలో గడ్డి తింటూ ,గుంటలలో నీళ్ళు త్రాగుతూ లోకులకు పాలనిచ్చే ఆవు - మనకు కన్న తల్లి వంటిదే కదా.
జైహింద్.

3, మే 2014, శనివారం

ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్.మేలిమిబంగారం మన సంస్కృతి187.

4 comments

జైశ్రీరామ్
శ్లో. అయం నిజ: పరో వేతి గణనా లఘుచేతసాం
ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్.
గీ. అతఁడు నావ్యక్తి. నావ్యక్తి యితడు కాడ
నుచు పలుకుదురజ్ఞానులనుపమ గతిని.
విశ్వవిజ్ఞాతలందరున్ విశ్వజనుల
నెల్లరిని తన వారిగా నెన్నుదురయ.
భావము. వీడు నావాడువీడు పరుడు అనే పరిగణన అల్పమనస్కులకు ఉంటుంది. ఉదార ప్రవర్తనగలవారికి మాత్రం ఈ ప్రపంచమే ఒక కుటుంబం.
జైహింద్.

2, మే 2014, శుక్రవారం

న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః.మేలిమి బంగారం మన సంస్కృతి. 186.

2 comments

జైశ్రీరామ్ 
శ్లో. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః                                                                                         న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః.                                                                                    
కం.కోరి నంతనె కోర్కెలు తీరఁ బోవు.
కోరి యత్నించ సిద్ధించు కోర్కెతీర్చు.
సుప్త సింహంబు నోటను చొచ్చునొక్కొ
మృగము లేవైన? కష్టించ మిగులు ఫలము.
భావము. ప్రయత్నంతోనే పనులు సిద్ధిస్తాయి  కాని , కేవలం కోరికలతో కాదు. నిద్రిస్తున్న సింహం నోటిలోనికి మృగాలు తమంతట తాము  ప్రవేశించవు  కదా.(సింహం వేటాడకుండా ఆహారం లభించదుకదా)
జైహింద్.

1, మే 2014, గురువారం

పారిజాతాపహరణ కావ్యంలోని అనులోమ విలోమ కందము

2 comments

జైశ్రీరామ్.
ఆర్య్తులారా! నంది తిమ్మన పారిజాతాపహరణ కావ్యంలో పంచమాశ్వాసంలో అనులోమ విలోమ కందం రచించి తనకు గల చిత్ర కవితా నైపుణ్యాన్ని కనబరిచాడు. చూడండి.
కం. నాయశరగసారవిరయ – తాయనజయసారసుభగధరధీనియమా                                                         మాయనిధీరథగభసుర – సాయజనయతాయరవిరసాగరశయనా                                                                     ఈ పద్యం మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం వలన దీనకి అనులోమవిలోమమని పేరు. అందులో ఉన్న అర్థాన్ని పరిశీలిద్దాం.                   సార అంటే బలమైన, శ్రేష్ఠమైన అని శబ్దరత్నాకరము. గ శబ్దం   గమనానికి సూచన. వి అంటే విశేషమైన. రయమంటే వేగం. నాయ శబ్దానికి పద్ధతి, దిశ, నీతి అని నిఘంటువు. తాయన అంటే బాగుగా సాగుచున్న అని నిఘంటువు. కాబట్టి నాయ–శరగ–సార–విరయ–తాయన–జయసార అనే మొదటి విశేషణాన్ని నాయ–వి–రయ–గ–సార–శర–తాయన–జయ–సార గా అన్వయించుకోవచ్చు. పద్ధతిగా విశేషమైన వేగంతో ప్రయాణించే శ్రేష్ఠమైన బాణాలవలన కలిగిన చక్కటి జయించే చేవ ఉన్నవాడు అని అర్థం.   సుభగుడు అంటే మనోహరమైనవాడు, భాగ్యవంతుడు.ధీ అంటే బుద్ధి. ధర అంటే భూమి అనీ కొండ అనీ అర్థాలు (ధర ధరించేది). నియమ శబ్దం మొక్కవోని వ్రతాన్ని సూచిస్తుంది. కాబట్టి ధీ నియమం అంటే బుద్ధికి సంబంధించిన వ్రతం. ఎలాంటి వ్రతం? భూమిలాంటి (లేదా కొండవంటి). ఏమిటి దీని అర్థం? నిశ్చలమైన అని తీసుకుంటే భూమికైనా కొండకైనా సరిపోతుంది. కాబట్టి నిశ్చలమైన (మార్చరాని) బుద్ధినియమం కలవాడు. మాయనిధీ వేరు మాయానిధీ వేరు. మాయానిధీ అంటే మాయకు నిలయమని. ఇక్కడ మాయనిధీ అంటున్నాడు కాబట్టి మా అయ నిధీ అని చెప్పుకోవాలి. అయమంటే మేలు కలుగజేసే వస్తువు/దైవము అని శబ్దరత్నాకరము. మా అంటే లక్ష్మి. కాబట్టి మాయనిధీ అంటే లక్ష్మికీ మేలుకీ నిలయమైనవాడు.  రథమంటే తేరు, శరీరము అని శబ్దరత్నాకరము. భ శబ్దం కాంతికి సూచిక. గ శబ్దం ధరించడాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి భ–సుర–రథ–గ అంటే కాంతివంతులైన దేవతలను శరీరమునందు ధరించినవాడు. అంటేసర్వదేవస్వరూపుడు. సాయమంటే బాణము. నయమంటే న్యాయము. కాబట్టి సాయ–జ–నయ అంటే బాణము(ల) ద్వారా పుట్టిన న్యాయం కలవాడు.    తాయ్ ధాతువు విస్తరించడం అనే అర్థంలో వాడుతారు అని నిఘంటువు. ర అంటే కాంతి, గమనం, అగ్ని, కామం, ధారణ… అని నిఘంటువు. కాబట్టి తాయరవిర అంటే రవి–ర–తాయ రవికోటితేజుడు అని. సాగర శయనా అంటే సముద్రమే పాన్పుగా కలవాడు. ఈ పద్యంలో గమ్మత్తు మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం. దీనకి అనులోమవిలోమమని పేరథ వివరణలో పెద్దల బుద్ధి కుశలత శ్లాఘనీయమైనది.
జైహింద్.